రోజుకో పద్యం.
కోపమునను ఘనత కొంచమైపోవును
గోపమునను మిగుల గోడుగలుగు
గోపమడచెనేని గోరిక లీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ.
మనిషి గొప్పతనం కోపంతో తగ్గిపోతుంది. దానితో బాధలు కలుగుతాయి.కోపాన్ని వదిలేస్తే కోరికలు తీరుతాయి అన్నారు వేమన తాత..
కోపం అందరికి వస్తుంది,’పేదవానికోపము పెదవికి చేటు’ నానుడి. పెద్దవారికోపమే కోపం మరి. పేదలది ధర్మాగ్రహం. కోపం వస్తే దాన్ని ’ఒంటికాలి మీద లేవడం’ అంటారు.జంతువులు పుట్టిన కొన్నిగంటలకే నిలబడి తల్లి దగ్గర పాలు తాగుతాయి, నడుస్తాయి కూడా. మానవుడో, నడవడం దేవుడెరుగు లేవలేడు, ఎవరో లేవదియ్యాలి, తల్లి పాలు తాగడం నేర్పాలి, కూచోడం, నుంచోడం,నడవడం నేర్పాలి. అసలు రెండు కాళ్ళ మీద నిలబడిందే ”రామా పితికస్” కాలం నుంచా? నిలబడటమే చేతకాని మానవుడు ఒంటికాలిమీద లేస్తే, అంటే మరో కాలితో తన్నాలని, ఎదుటివారిని. పాపం ఒంటి కాలి మీద లేస్తే రెండో కాలు భూమి మీద లేక సరిగా నిలబడలేక బోర్లా పడతారు. అందుచేత కోపం తెచ్చుకుని ఒంటికాలి మీద లేస్తే ఏమవుతుంది, బోర్లా పడటం తప్పించి. కోపమొస్తే ఫలితంగా పడితే పళ్ళు రాలిపోతాయి కదా! అందుచేత కోపం తెచ్చుకుంటే ఏడుపు మిగిలింది కదా! కోపం తెచ్చుకోని ఎదుటివాడు చేతకాని వాడనుకుంటే పొరబాటు. ధర్మాగ్రహం కాల్చేస్తుంది.కోపం, పులిమీద స్వారీ చేయడం లాటిది. పులి మీద ఎక్కడం తేలిక,దిగడమే కష్టం. దిగితే పులేతినేస్తుంది, ఎంతకాలం స్వారీ చేయగలరు, ఎప్పుడో ఒకప్పుడు దిగకా తప్పదు, చావకా తప్పదు :) రాముని రాయబారం వినిపించిన హనుమపై కినిసి రావణుడు హనుమను చంపేయమంటే, దూతను చంపకూడదు శిక్షించు, అని విభీషణుడు చెబితే కోపంలో ఒళ్ళు తెలియక హనుమ తోకకి నిప్పు పెట్టమన్నాడు,రావణుడు . తరవాతేం జరిగింది? లంక కాలిపోయింది. రావణుని కోపం లంకను కాల్చింది.
'తనకోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష
దయ చుట్టంబౌ'
అదండి సంగతి.
అందుచేత కోపం తెచ్చుకోకుండా బుద్ధితో యోచనచేస్తే తన పనులు సవ్యంగా నెరవేరుతాయని తాత మాట. ఆ( గాడిదగిడ్డు పాత చింతకాయ కబుర్లు. అవును పథ్యానికి పాత చింతకాయ పచ్చడే కావాలి, లేక మరేమైనా తింటే రోగం తిరగబెడుతుంది :)