Monday 31 August 2020

పిలవని పేరంటం



అవి ఒక పట్నంలో ఉండి పల్లెల ఉద్యోగం చేస్తున్న రోజులు. ఏరోజూ ఖాళీ ఉండేది కాదు.  టవున్ లో పని చేస్తున్నతను  ఔట్డోర్ పరిచయం తక్కువున్నవాడు. టవున్ కి కేబుల్ ప్లాన్ వేయాల్సివచ్చి వేసి పంపితే రెండు సార్లు తిరిగొచ్చిందని, సాయం చేయమని కోరేడు, టవున్ జె.యి. ఉండడం టవున్ లోనే ఉన్నా గాని పూర్తిగా టవున్ చూడలేదు. టవున్ ఒక సారి కాలి నడకనే తిరగాలి అని బయలుదేరి మూడు రోజులు సందులు గొందులు తిరిగేసేం. మూడో రోజు నడుస్తుండగా ఒక ఇంటి ముందు నా సహచరుడు నన్ను ఆపి నేం బోర్డ్ చూపించాడు. నా ఇంటి పేరు కనపడింది, చుట్టాలా? ప్రశ్నించాడు. ఒకే ఇంటి పేరు అనేకమందిలో ఉంటుందనీ, ఒకే ఇంటి పేరున్నవాళ్ళంతా చుట్టాలు కారని చెప్పి ముందుకు అడుగేయబోయా. మిత్రుడు మాత్రం వీళ్ళు మీ వాళ్ళే, ఈయన ఊళ్ళో కొంచం పెద్దవాడు కూడా. కలిసొద్దాం అని లోపలికి అడిగేశాడు. నేను అడుగు కలపక తప్పలేదు.

ఆయన హాల్ లోనే ఉన్నాడు, పెద్దవాడని బీరువాలూ పుస్తకాలూ వగైరా చెప్పకనే చెబుతున్నాయి. మా మిత్రుడు తనను తను పరిచయం చేసుకుని, నన్నూ వీరు ఫలానా, పల్లెటూళ్ళు చూస్తారు, మీ ఇంటి పేరువారే అని పరిచయం చేశాడు, తను ఆయన ముందున్న కుర్చీ లాక్కుని కూచుంటూ. ఆయన కనీసం కూచోమని కూడా అనలా.  కుర్చి లో కూచున్న ఆయన కొద్దిగా ముందుకు కూడా వంగలేదు, అంటే కనీసం కుతూహలం కూడా చూపించలేదు. మాటా లేదు, చూస్తూ ఉండిపోయాడు, కనీసం మంచి నీళ్ళు తీసుకుంటారా అని కూడా అడగలేదు.. నాకైతే ఏం మాటాడాలో కూడా తోచలేదు, నోరు పెగుల్చుకుని, నాపేరు చెప్పుకుని ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నా, టెలిఫోన్ జ్.యి గా,  మా ఇంటి పేరు కూడా మీ ఇంటి పేరే! మిత్రుడు చెబితే పెద్దవారిని కలుద్దామని వచ్చాము, వేరే ఏమీ పని లేదని, చూచి పోదామని వచ్చామని చెప్పేను. ఆయన చూడడం అయిందిగా ఇక దయచెయ్యమన్నట్టు ముఖం పెడితే చాలా ఇబ్బంది పడ్డాను, నన్ను చూసి మిత్రుడు ఇబ్బంది పడిపోయాడు, కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. నేను లేచి నమస్కారం, వస్తాం అని చెప్పి వెను తిరిగి చూడక వచ్చి బయటికి వచ్చేశాను. మిత్రునితో కూడా మాటాడాలనిపించలేదు. నన్ను చూసి మిత్రుడూ పలకరించలేదు. ఇంటి కొచ్చేశాం. 


ఇంటికొచ్చిన తరవాత ఇల్లాలికి విషయం చెప్పాను.ఇల్లాలు ''పిలవని పేరంటానికి వెళ్ళ కూడదు, జరిగిందేదో జరిగింది, మరచిపొండి'' అంది. నేను సద్దుకో లేకపోయా! అవమానంగానే తోచింది. మర్నాడు మిత్రుడు వచ్చి కలిసి, " సారీ! మిత్రమా, నిన్న సాయంత్రం నేను చేసినది తప్పు,మన్నించు" అన్నాడు. ఇల్లాలు నాకు చెప్పినమాట మిత్రునికి చెప్పాల్సివచ్చింది.

చుట్టాలకి దూరంగా నీటికి దగ్గరగా ఉండాలని సామెత. 

Sunday 30 August 2020

చిత్రం

 ఒక చిన్నారి, అభిమాని, పాతికేళ్ళ వయసుకే జీవిత సమస్యల సుడిలో చిక్కుకుంది.ఒడ్డు చేరుతున్నాననగా ఐదు నెలలకితం అనారోగ్యం, ప్రకృతి చికిత్సతో నిలదొక్కుకుని జీవితంలోకి మళ్ళీ దూకుతూ నాకో మెయిలిచ్చింది, నన్ను గుర్తుచేసుకుంటూ. ఈ కింది ఫోటో గురించిన కథ చెప్పమని. నాకైతే కథ తెలియదుగాని వివరం చెబుతానని ఇలా చెప్పా.. 




ఇక చిత్రం గురించి. ఈ చిత్రంలో చిత్రకారుడు ఇది చెప్పదలుచుకున్నాడు.

కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, మనసు. మనసు ఇంద్రియాలను శాసిస్తుంది కాని ఇంద్రియ సుఖాలకు లోబడిపోతుంది. మనసుకి మరొక ఆరుగురు మిత్రులలాటివారున్నారు. తెలిసినవారు వారిని అంతశ్శత్రువులు అంటారు. ఈ ఆరుగురు మనసును స్వాధీన పరచుకుంటూ ఉంటారు. వారే కామ,క్రోధ,మోహ,లోభ,మద, మాత్సర్యాలు. ఈ ఆరిటిని చిత్రంలో చూపించాడు. 

కామం:- నీరు, అంతులేని సముద్రంలాటిది, కోరికల అలలు పుడుతూనే ఉంటాయి. 
క్రోధం:- ఇది మనిషిని ఆవహించినపుడు మృగంలా మారతాడు. ఉచ్చనీచాలు,మంచిచెడ్డలు,పెద్ద చిన్న, పాపం పుణ్యం, ఇలా ఏవీ కనపడవు. దానిని సింహంలా చూపాడు. 
మోహం:-కనపడదుగాని మొసలిలా పట్టుకుంటుంది, మనసును. ఒక వస్తువు మీదనో,మనిషి, లేదా ప్రాంతం ఇలా ఒకదానిమీద మనసు నిలిచిపోయి ఉంటుంది, మోహం కమ్ముతుంది. దీనిని మొసలి రూపంలో చూపాడు.
లోభం:- సగంపైగా కొట్టి వేయబడ్డ చెట్టును చూపాడు. అది ఏక్షణంలో నైనా నీటిలో పడచ్చు, మరణం సంభవించవచ్చు. కాని దాని చిగురున ఉన్న పండుకోసం ఎక్కడమే లోభం. ఇది జీవితంలో కూడా చూస్తుంటాం. ప్రమాదమని తెలిసి కూడా తొందరపాటు పనులు చేస్తుంటాం.
మదం:- మదం నాకేంటి అనే ధోరణి. తెలివైనవారం,అందమైనవారం, బలమైనవారం, అధికారమున్నవారం అన్న మదం బుసలు కొడుతూ ఉంటుంది.అది ఎంతదాకా అన్నది మరచిపోతుంటారు. దీనిని పాములా చూపాడు. 
మాత్సర్యం:- విరిగిపోతున్న కొమ్మలాటిది. దీని మూలంగా తను నాశనమవుతున్నా వదలిపెట్టలేనిది. ఎదుటివారి గొప్పతనాన్ని మంచిని గుర్తించలేనిది. ఏం తెలివిలే,అబ్బో పెద్ద అందం, ఆ డిగ్రీలన్నీ బూటకంట. ఇలా రకరకాల చిత్ర చిత్ర భావనలతో తనను తాను దిగజార్చుకుంటూ పోయేది ఈ మత్సరం అనే అసూయ. 

ఈ ఆరుగురు శత్రువులను గెలవగలమా? అసాధ్యం.అంతశ్శత్రువులను గెలిచానన్నవారిని నమ్మను. అందరూ అంతో, ఇంతో, కొంతో వీటి బారిన పడేవారే. వాటిబారిన పడి ములిగిపోక బయటపడేవారే విజ్ఞులు.

Wednesday 26 August 2020

కర్ణుడు - భారతయుద్ధ మొదటి పదిరోజుల సేనా నాయకత్వం.

కర్ణుడు - భారతయుద్ధ మొదటి పదిరోజుల సేనా నాయకత్వం.

కురు సభ జరుగుతున్న సమయంలో దుర్యోధనుడు భీష్ముని చేరి తాతా! యుద్ధం రాబోతోంది. అటువైపు ఎవరెంతవారో చెప్పు, మా నాన్నకి పాండవులంటే భయం, అన్నాడు. విన్న భీష్ముడు పాండవ పక్షం వారి గురించి చెప్పాడు. మరి మా వైపు వారి గురించీ చెప్పూ అనగా, భీష్ముడు, నువ్వు అడుగుతావు నేను ఉన్నది ఉన్నట్లు చెబుతాను, అది నీకు, నీ స్నేహితులకి నచ్చదు, నాకెందుకొచ్చిన తలనొప్పి చెప్పు, మధ్యన, అన్నాడు. విన్న దుర్యోధనుడు చెప్పు తాతా అని బ్రతిమలాడేడు. భీష్ముడు, కౌరవుల గురించి ఎవరెంతవారో చెబుతూ, కర్ణుడు అర్ధ రధుడు అని చెప్పేరు. విన్న కర్ణుడు, ముసలితనంతో నీ మతిపోయి మాటాడుతున్నావని భీష్ముని పలురకాలుగా నిందించి, నువ్వు యుద్ధ రంగంలో నిలబడినంతకాలం నేను ఆయుధం పట్టి యుద్ధం చేయనని ప్రతిన చేసి సభ విడిచిపోయాడు. షరా మామూలుగానే దుర్యోధనుడు కర్ణుని అలక తీర్చడానికి వెనకపోయాడు.

ఈ సంఘటన జరిగేనాటికి భీష్ముడు సర్వసైన్యాధిపతీ కాదు, కర్ణుడు అక్షౌహిణి సైన్యాధిపతీ కాదు. ఆ తరవాత కాలంలోనే ముందు భీష్ముని సర్వసైన్యాధిపతిని చేసి ఆతరవాతే మిగిలిన సేనాపతులను దుర్యోధనుడు నియమించాడు, అందులో కర్ణుడొకడు. ఆ నియామకాలకి ఆక్షేపణ ఎవరినుంచీ లేదు. అంటే యుద్ధం చేయడం వేరు సైన్యాధిపత్యం వహించడం వేరు అని తెలుస్తోంది కదా! యుద్ధం చేయటం లేదు నేను సైన్యాధిపత్యం వహించడం ఏంటని కర్ణుడు అడగలేదు, యుద్ధం చెయ్యనివాడు సేనాధిపతా అని భీష్ముడు ఆక్షేపించలేదు. అన్నీ తెలిసిన దుర్యోధనుడు కర్ణునికి సేనాధిపత్యం ఇచ్చాడంటే, యుద్ధం చేయడం వేరు, సైన్యాధిపత్యం వహించడం వేరని తెలుస్తోంది కదా!

అంటే  భారత యుద్ధం మొదటి పదిరోజులు కర్ణుని అక్షౌహిణి సేనను కర్ణుడే నడిపాడు, యుద్ధం చేయలేదంతే!  


విన్నకోటవారి ,
భారతం మీద మరో ప్రశ్నకు చాలా కాలంగా జవాబీయలేదు. అది "అంపశయ్య మీద చేరేనాటికి భీష్ముని వయసెంత?"  ప్రశ్న మొత్తం భారతం తిరగెయ్యాలి, పెద్ద జవాబు అందుకే చెయ్యి చేసుకో లేదు.

Monday 24 August 2020

మంగళం జయ మంగళం.

మంగళం జయ మంగళం.
======================

మంగళం జయామంగళం
మా వియ్యపురాలి నడతలకి జయా మంగళం.

చింతమాను చిగురే చూడు,
వియ్యపురాలి మోము చూడు,
కనులు తిప్పుతు మాటచూడు,
వయ్యారంపు నడక చూడు...........Iమంగళం I

ప్రేమతోటి వియ్యపురాలికి
అరటిపండు చేతికిస్తే
తినుట ఎరుగని వియ్యపురాలు
తొక్కమింగి కక్కుకొనియె..........Iమంగళం I

పల్లెటూరి వియ్యపురాలు
పట్నవాసం పక్కకొస్తే
కారు చూచి హడలిపోయె
అన్నవచ్చి గుండె రాసే...............Iమంగళం I

భక్తి కొద్దీ వియ్యపురాలు
తులసిపూజకు తాను వెళితే
గాలి వీచి పైట ఒదిగే
అన్నవచ్చి సద్ది వెళ్ళె..........Iమంగళం I


జానపదం

Friday 21 August 2020

చేసుకున్న కర్మమోయ్


చేసుకున్న కర్మమోయ్ 
చెంబు (శంభు) లింగమా
అనుభవింపక తప్పదోయ్ 
ఆత్మలింగమా

కారుతో పాటు బతికి బయటపడే మార్గం చెప్పండి 

Monday 17 August 2020

మెక్కి మెక్కి తినకండోయ్!

మెక్కి మెక్కి తినకండోయ్!
ఎక్కసాలు పడకండోయ్!
ఒక్కసారి తినకండోయ్!
నొక్కి మేము చెబుతున్నాం!....Iమెక్కిI

మావారాని మేము 
మరీ మరీ అడుగుతుంటె
కావాలనే మాటేకాని 
మారుమాట లేదుగా!........Iమెక్కిI

వద్దు,వద్దు అంటారు,
పొద్దు చాలదంటారు
నేల మీద పడతారు, 
గోలపెట్టి దొర్లుతారు!........Iమెక్కిI

జానపదం

Thursday 13 August 2020

పెళ్ళిపాట.

 పెళ్ళిపాట.
============

ఏ దేశాన్నించొచ్చేరయ్యా మా దేశానికి

మేడలు మిద్దెలు కలవారనీ మీవారు చెబితిరి
ఇంత అద్దె ఇళ్ళల్లో వున్నారని ఎరక్కపోతిమి  IIఏ దేశాన్నించిII

ఇశాపట్నం కలకటేరని పిల్లనిస్తిమి
ఇంత కన్నం వేసేవాడని ఎరక్కపోతిమి.             IIఏ దేశాన్నించిII

చెన్నపట్నం జమీన్దార్లని పిల్లనిస్తిమి
ఇంత చెప్పులు మోసేవాళ్ళని ఎరక్కపోతిమి         IIఏ దేశాన్నించిII     

కంటెలు కాసులు పెడతారని మీవారు చెప్పిరి
ఇంత,ఇంత, ఒక్క పుస్తెముక్క కడతాడని ఎరక్కపోతిమి    IIఏ దేశాన్నించిII       
జానపదం

Tuesday 11 August 2020

మావగారు వినండి.

మావగారు వినండి.
==================
కన్యాదాతలైన మావగారు వినండి.
చెలిమితోడ మీ అల్లుడి కోర్కెలు చెప్పెద వినండి.

మాటిమాటికి వచ్చేలా మారుతి ఇవ్వండి.
ఫస్ట్ క్లాస్ గోల్డ్ చైన్ మా బ్రదర్ కి ఇవ్వండి.

కాలేజీ దూరం స్కూటర్ ఇవ్వండి.
ఫస్ట్ క్లాస్ బ్రాస్లెట్ మా బ్రదర్ కి ఇవ్వండి.

చాలినంత కట్నం చదువుకి ఇవ్వండి.
ఇంతకు మించి కోర్కెలు మరి ఏమీ లేవండి.




Sunday 9 August 2020

ఓ!వియ్యపూరాలా



ఓ!వియ్యపూరాలా
ఓ!వయ్యారీలోలా
నీ వయ్యారామూలే........Iఓ!I

కయ్యాలామారీవీ
గయ్యాళీ గంపావూ
కయ్యంబూ నీకేలా.........Iఓ!I

 వధువుతల్లి  వరుడితల్లినుద్దేసించి పాడేపాట.ఇంకా ఉందేమో తెలియదు. వియ్యపురాళ్ళని వీరకత్తిలని అనడం కూడా ఉత్తరాంధ్రలో అలవాటు.పాట వినడానికి సొంపుగా ఉండి. ఏదో ఛందస్సుకు చెందేదిలాగానూ కనపడుతోంది.జానపదులలో ఎంత గొప్ప కళ దాగిఉన్నదో కదా!

Thursday 6 August 2020

విందు చేసినారు వియ్యాల వారింట పాట

"విందు చేసినారు వియ్యాల వారింట
విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)

-------

(1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు

అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేము ఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
------------
(2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
నెయ్యి వేయ మన్న చెయ్యి తడవలేదు ||విందు||


(3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు కదుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||

(4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

(5). కూరే వంకాయ కూర, దానితోపాటే పచ్చడి లేదు

కలహంబులా కారం గుచ్చెత్తీనారూ   ||ఏలాగు||

(6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యికడిగే వీలు లేదు ||ఏలాగు||


(7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు

గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||

(8). లడ్డూ, జిలేబీలా పాకములో వడ్డించెరంట
వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమో

ఈ విందు మేమేలాగు భోంచేతుమో