Wednesday 29 July 2020

విందుచేసినారు వియ్యాలవారింట

Courtesy:Whats app

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ''విందుచేసినారు వియ్యాలవారింట'' పాట,ఇది తరతరాల మన వారసత్వ సంపద, ఇప్పటి వరకు మరుగున పడిపోయింది, ఎవరో మహానుభావులు దీన్ని వాట్సాప్లో పెట్టేరు.వారికి వందనం.  పాటపాడిన శ్రీరంగం గోపాలరత్నం గారికి ఇతర గాయకిలకు వందనం.వాద్య సహకారులకు వందనం.దీన్ని బ్లాగులో పెట్టడానికి సహకరించిన విన్నకోటవారికి నా అభినందనలు.

Monday 27 July 2020

ఈ పాపం ఎవరిది రాజా

ఈ పాపం ఎవరిది రాజా

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టెక్కి భేతాళుణ్ణి భుజాన వేసుకు చెట్టు దిగి నడక ప్రారంభించాడు. రాజా నీకు శ్రమ తెలియకుందికిగాను కత చెబుతా సమస్యకి పరిష్కారం తెలిసి చెప్పకపోతే నీ బుర్ర వెయ్యి ముక్కలవుతుంది. సమస్యకి నిజమైన పరిష్కారం చెబితే నేను చెట్టెక్కుతాను.నీవు చెప్పిన పరిష్కారం తప్పైతే నీతో వస్తానన్నాడు. చెప్పడం ప్రాంభించాడిలా.

అనగా అనగా కరోనా రోజులు. అదో పల్లెటూరు. ఒకామెకి ఆయాసం రోగం ఉంది. గత పదిరోజులుగా వర్షం ఎడతెరపిలేక కురుస్తోంది. రాత్రికి రోగం ఎక్కువైతే, ఉదయమే వర్షంలో ఆటో లో పక్క పట్నానికి వైద్యానికి తీసుకు బయలుదేరారు.కరోనా కు ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా వైద్యం చేస్తాయంటే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళేరు, ఏ వైద్యమైనా అక్కడే చేయించచ్చని.

 హాస్పిటల్ వారు చూసి కరోనా టెస్ట్ చేయించుకురమ్మని ఒక లేబ్ పేరిచ్చారు. అక్కడకి పేషంటుని తీసుకుపోతే టెస్ట్ చేసి పాతిక వందలు పుచ్చుకుని, కరోనా ఉంది, నాలుగో స్టేజిలో ఉంది అని చెప్పేరు.హాస్పిటల్ కి టెస్ట్ తో తిరిగొచ్చేరు. పేషంటును చూసిన వైద్యులు వీరి చికిత్సకు తగిన పరికరాలు మా దగ్గర లేవు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపొమ్మన్నారు. వర్షం ఆగదు. 

అలాగే గర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళితే, వారు వివరాలడిగి, మీరు ఇక్కడికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళండి. అక్కడ వైద్యం చేస్తారని చెప్పి పంపేరు.

 ఆ హాస్పిటల్ కి తీసుకెళితే కరోన టెస్ట్ చేయించండి. ఇక్కడికి రెండు కీలో మీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ లేబ్ లో చేస్తారన్నారు. కరోన టెస్ట్ ఫలాన చోట చేయించామని కాయితం చూపించారు. ఇది కుదరదు, మళ్ళీ చేయించండన్నారు. పేషంటుని అలాగే లేబ్ కి తీసుకెళితే టెస్ట్ చేసి రేపుగాని రిసల్ట్ ఇవ్వలేమన్నారు. 

ఏం చెయ్యాలో తోచనివారు, పేషంటును తీసుకుని ఇంటికి బయలుదేరి ముఫై కిలో మీటర్లు దూరం పోయాకా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, పేషంటుకి కరోన ఉంది, తీసుకురండి వెనక్కి, అని ఫోన్ చేశారు. ఫోన్ చేసిన మొదటి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళితే, ఇక్కడకాదు, ఇక్కడి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళమన్నారు. 

అలాగే తీసుకెళ్ళేరు. పేషంట్ తడిపొడి బట్టలతో ఉండగా స్ట్రెచర్ మీదకి చేర్చారు. అంతే లోపలికి తీసుకుపోవలసిన అవసరం కలగలేదు.మార్చురీకి శవాన్ని తీసుకుపోయారు. ఇప్పుడు బంధువులు శవం కోసం పడిగాపులు పడుతున్నారు. ఉదయం తొమ్మిది మొదలైన తిరుగుడు రాత్రి తొమ్మిదికి పేషంట్ ఊపిరి అనంతవాయువుల్లో కలవడంతో పూర్తయ్యింది . ఈ పేషంట్ ప్రాణం పోవడానికి ఎవరు కారణం చెప్పు రాజా! 


Sunday 26 July 2020

.మదికదిలినవేళ

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటనగా చెబుతున్నారు.

భార్యభర్త కీచులాడుకున్నారు. అది పెరిగి పెద్దదీ అయింది. జీవితం లో నీ మొహం చూడను,నీతో కలిసిబతకను. విడాకులేకావాలి అమ్మాయి పట్టు. నీవు లేక నా జీవితం లేదు, వ్యర్ధం అబ్బాయి మాట. ఎవరిపంతం వాళ్ళు వదలలేదు. చివరికి కేసు పోలీసులకి ఫేమిలీ కోర్టుకు చేరింది. అమ్మాయిని పోలీసులు కన్విన్స్ చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. సరిపడలా. అప్పుడు అబ్బాయికి వచ్చిన చిన్న ఆలోచనే ఈపాట. నా భార్య మనస్సు నాకు తెలియదా? నేనే నా భార్యను సముదాయించుకుంటానని ఈ పాట పాడి ఆమె మనసు మళ్ళీ గెలుచుకున్నాడు.ఆ పాట అర్ధం ఎవరేనా చెబితే ఆనందం.మాటకున్న పవరెంత? కవికి నమస్కారం.


https://youtu.be/GiYsvyMWnAk

మధురం మధురం ఈ సమయం 
ఇక జీవితమే ఆనందమయం.
తొలగిపోయె పెను చీకటి తెరలూ
లగిపోయె అనుమానపు తెరలు
పొంగి పొరలె మనకోర్కెల అలలు
భావియే మనకు నందనవనముగ.
మధురం మధురం ఈ సమయం 
ఇక జీవితమే ఆనందమయం.

Coutesy:పాత చినిమా పాట. కవిగారికి వందనం.
Courtesy:Whats app

Saturday 25 July 2020

ప్రయత్నం.




ఈ చిన్నారి నేర్పుతున్న జీవిత పాఠం ఏమిటి? ఓడిపోతానని,పడిపోతానని, దెబ్బ తగులుతుందని తెలిసినా  ప్రయత్నించు. గెలుపు నీదే,అంతిమ విజయం నీదే! నిరాశలో కూరుకుపోకు.

Friday 24 July 2020

దధ్యోదనం

దధ్యోదనం

అసలు పేరు దధ్యోదనం కాని అలవాటుగా దధ్యోజనం అని వాడేస్తున్నాం. ఈ మాటే బాగుందా? దధ్యోదనం అంటే పెరుగన్నం అని అర్ధం. దధి+ఓనమా ఏసంధి? ఏ సమాసం, ఏది విగ్రహ వాక్యం, శలవీయాలి .. సరే ఇక ముందుకెళదాం. కొంచం తెలివి తక్కువవారిని ఎగతాళీ చేయడానికి వాడే మాటలలో ఇదొహటి. ఆ ఎగతాళీ మాటలు, పప్పూ, ముద్దపప్పూ,పప్పు సుద్దా, చలిమిడి ముద్ద, దద్దోజనం. కాని ఇవన్నీ గొప్పవి, శక్తినిచ్చేవి అదేగాక వ్యాధి నిరోధాకాలు కూడా, ఉదయాన్నే మంచి ఉపాహారం. దీనికేంగాని అలాముoదుకుపోదాం :) 

రాత్రి తోడు పెట్టిన పెరుగు తీసుకోండి, గిలక్కొట్టండి, కొంచం నీరు పోసి.అందులో చిటికెడు పసుపు వేయండి, తగిన ఉప్పు వేసి కలపండి. బాణలి లో కొంచం నెయ్యి వేయండి దానిలో శనగపప్పు,వేసి కొంచం వేగనివ్వండి, ఆతరవాత చీల్చిన పచ్చి మిర్చి,కొంచం ఎండు మిర్చి చేర్చండి, వేగుతుండగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలేయండి,జీలకర్ర, కరివేపాకు వేయండి, ఆ తరవాత వాము చేర్చండి, చివరగా ఆవాలు వేయండి. వేగిన పోపును మజ్జిగలో చేర్చండి, పోపు వేయించడానికి ఇనపమూకుడు వాడండి.ఇష్టమైతే చిన్న ఇంగువముక్క పోపులోవేయండి. 
 ఇప్పుడు ఈ మజ్జిగలో వేడిగా వండుకున్న అన్నం చేర్చండి.పైన కొత్తిమీరి వేయండి. బలెబలే దధ్యోదనం తయారు.

ఇది మంచి రుచికరమైన ఆహారము మరియు మందు కూడా ఎలా?ఇందులో మజ్జిగ మందు, పసుపు,ఇంగువ,ఉప్పు,అల్లం ,జీలకర్ర, ఆవాలు,కరివేపాకు,కొత్తి మీరి అన్నీ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే వ్యాధి నిరోధకాలే...ఆ పై తమ చిత్తం 

Thursday 23 July 2020

ఏమి సేతురా లింగా ఏమి చేతు

ఏమి సేతురా లింగా ఏమి చేతు   
ఏమి సేతురా లింగా ఏమి చేతు   

కరోనా కాలమాయె!
దారి కానదౌను లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు! మాహానుభావా!!  
 ఏమి సేతురా లింగా ఏమి చేతు!   

చీనా పుట్టిల్లాయే !
ప్రపంచమంతపాకె లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు!   మాలింగమూర్తీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!   

తగులుకుంటే వదలదాయె!
 తేల్చునాయె చావొ రేవో లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!  మాదేవ శంభో!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!

మందేమో లేదాయె!
వేక్సిన్ రాదాయె  లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! మాలింగ మూర్తీ!!
 ఏమి చేతురా లింగా ఏమి చేతు!   

గోటి దనే దొకడాయె!
 గొడ్డలనే దొకడాయెలింగా!!
 ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిశూల పాణీ !! 
 ఏమి చేతురా లింగా ఏమి చేతు !

గాల్లో నిలవదనే దొకడాయె!
 కాదనుదొకడాయెలింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! హాలాహలధరా!!  
ఏమి చేతురా లింగా ఏమి చేతు!

కన్ను చాలానే దొకడాయె!
 కాదు కాదనే దొకడాయెలింగా!!
 ఏమి చేతురా లింగా ఏమిచేతు! మహా శివా!!
ఏమి చేతురా లింగా ఏమిచేతు!

ఏది నికరమొ తెలియదాయె!
 తిరమాయె చావు లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిపురాంతక శివా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! 

భయమేమో లావాయె! 
ఆకలి తప్పదాయె లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! అన్నపూర్ణాపతే!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!  

చాకిరేమో తప్పదాయె!
 మనుజులంటె భయమాయెలింగా!! 
ఏమి చేతురా లింగా ఏమి చేతు! గజచర్మధారీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు !


 బాలమురళిగారికి అపరాధ శత పరిహార నమస్సులు అర్పిస్తూ


Wednesday 22 July 2020

కొత్తిమీరి కారం

కొత్తిమీరి కారం

కరోనా వచ్చినారికి మందుగానూ, రాని వారికి రోగ నిరోధకంగానూ నిమ్మకాయ వాడమంటున్నారు విటమిన్ సి కోసం. ఇలాటిదే మరొకటి ఉసిరికాయ. ఉసిరి కాయంటే రాచ ఉసిరి లేదా పెద్ద ఉసిరి. దీని నిలవ పచ్చడి నల్లగా ఉంటుంది అందుకు దీన్ని నల్ల పచ్చడి అంటారు, ఇది అణువణువూ విటమిన్ సి. కాని దానిని ఇప్పుడు వాడ కూడదన్నారు. అది వాడే సమయం వేరు. ఈ నిమ్మకాయ రసాన్ని తాగమంటున్నారు. దానితో పాటు కొత్తి మీర చేర్చి పచ్చిమిర్చి,ఉప్పు చేర్చి కొత్తిమీరి కారం చేసుకు తింటే బలే రుచి. వ్యాధినిరోధానికి మరొకటి కొత్తిమీరి చేర్చినట్లవుతుంది. కొత్తిమీరి అంటే మరేంకాదు ధనియాలే :)

కొత్తిమీరి తీసుకోండి నీటిలో ఝాడించండి. ముక్కలుగా తరగండి. స్తీలు పాత్రలో వేయండి. నిమ్మకాయ రసం పిండండి,చిటికెడు పసుపు వేయండి, తగిన ఉప్పు చేర్చండి, పచ్చి మిర్చి తొక్కి కలపండి. దీనిలో కొత్తిమీరి చేర్చండి, కలిపేయండి,బాగా. రుచికరమైన మందు కొత్తిమీరి కారం రెడీ :)


నిమ్మరసంతో పచ్చి బీరకాయముక్కలు.


నిమ్మ రసం పిండుకోండి. తగిన ఉప్పు జత చేయండి. లేత బీరకాయ ముక్కలు, లేత దొండకాయ ముక్కలు, మరీ ముదురుకాని పచ్చి మిర్చి ముక్కలు, చిన్నవిగా తరుక్కోండి. ఒక స్టీల్ పాతర్లో వీటిని కలిపే ఉంచండి, చిటికెడు పసుపు వేయండి.రెండు మూడు గంటలు తరవాత అన్నంలో కలుపుకు తినండి, అద్భుతం. పప్పు అన్నం ఐతే చెప్పేదే లేదు.


నిమ్మకాయ కారం.


పైన చెప్పినవి బాగానే ఉన్నాయి కాని చేసుకోవడం తలనొప్పి అంటారా! మరో చిన్న చిటకా.నిమ్మకాయ ను పిండి రసం తీయండి. తగినంత ఉప్పు వేయండి చిటికెడు పసుపు వేయండి. వేయించిన్ జీలకర్ర కారం కలిపేయండి బలే ఉంటుంది. నోటికి బలే రుచిగా ఉంటాయి,ఆహారం తీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంటే చెప్పక్కర లేదు.


Tuesday 21 July 2020

చలిమిడి

చలిమిడి

పుట్టింటికెడితే ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా చలిమిడి తెచ్చుకోని ఆడపడుచు వుండదు, తెలుగునాట. కలిగినవారు మడులు మాన్యాలూ కూతురికివ్వచ్చు గాని ఏమీ లేనివారైనా చలిమిడి పెట్టకుండా పసుపు,కుంకుమ ఇవ్వకుండా మాత్రం పంపరు. పుట్టింటి కెళ్ళొచ్చిన ఆడకూతురు భర్తకు మొదటగా పెట్టేదీ చలిమిడే. :) 

ఇక తెలివి తక్కువ వాళ్ళని చలిమిడి ముద్దా, ముద్దపప్పూ,పప్పూ  అనడం అలవాటే :)కాని చలిమిడి చాలా మంచిది,బలవర్ధకమేకాదు, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందిట. 

చలిమిడి ఎలా తయారు చేస్తారు? ఇది రెండు రకాలు, చలిమిడి,పచ్చి చలిమిడి. చలిమిడికి కొట్టుపిండి కావాలి. కొట్టు పిండంటే, బియ్యం నానబోసి, ఆరబెట్టి దంపాలి. పిండి జల్లించుకోవాలి. మెత్తగా ఉంటుంది, పిండి.దీన్ని పంచదారతోనూ,బెల్లంతోనూ చేస్తారు. బెల్లంతో చేయడం శ్రేష్టం. బెల్లం కోరుకుని పాకం పట్టాలి, ఈ పాకం పట్టడమే టెక్నిక్. తీగపాకం రావాలి, అందులో కొట్టుపిండి పోయాలి కలియ బెట్టాలి. ఆపైన అందులో ఎండుకొబ్బరి ముక్కలు చిన్నగా తరుక్కున్నవి వేయాలి.కలిగిన వారు జీడిపప్పు,యాలకులు,పచ్చకర్పూరం కూడా వేస్తారు.

 మరోమాట ఈ చలిమిడినే చిన్నచిన్న ఉండలులా తయారు చేసి వత్తి నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయిస్తే అదే అరిసె. అరిసెల వంట చెప్పినంత తేలికకాదు సుమా.

ఇక పచ్చి చలిమిడి. బియ్యపు పిండిని కోరిన బెల్లంలో కలిపి, కొబ్బరిముక్కలేసి, కొద్ది నీటితో ముద్దలా చేస్తారు.ఇది నాగులచవితికి చేస్తారు. 

Monday 20 July 2020

మునగ ఆకు పచ్చడి

మునగ ఆకు పచ్చడి

మునగ/ములగ ఎలగైనా వాడతారు. ములగ పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నదే.ములగ నీటిని శుద్ధి చేస్తుంది.  ములగ కాడ వాడకం తెలిసినదే. కూర చారు వగైరాలలో ఎక్కువగా వాడేదే. బలవర్ధక ఆహారం. ములగ లో ఇనుము ధాతువు ఎక్కువ. ఆషాఢ మాసం లో ములగ కూర తినాలని అంటారు. ములగ ఆకు కొంచం వాసన ఉంటుంది, ఎక్కువ మంది ఆకును ఇష్టపడలేకపోవచ్చు, పప్పులో కలగలుపుగా వాడుకున్నా. అందుకు పచ్చడి చేసి చూడండి ఇలా. గుప్పెడు ములగ రెమ్మలు విరవండి. కొన్ని లేతవి కొన్ని ముదురువి. చీడ పీడ చూడండి. నీటిలో జాడించంది. ఆపైన ఆకుకోయండి. తడిగా ఉంటే ఆరబెట్టండి. కొద్దిగా చమురు వేసి మూకుడులో వేయించండి. ఆపైన గోంగూర పచ్చడిలా చేసుకోండి. కొద్దిగా చింతపండు ఎక్కువ వేస్తే బాగోవచ్చు. ఖర్చులేని బలమైన వంటకం,సులువుగా అరుగుతుంది. ఇప్పుడి మినగాకు కూడా ఎగుమతి చేస్తున్నారట.ఇలాటిదే మరొకటి పొన్నగంటి కూర, ఇది కళ్ళకి మంచిదిట, పచ్చడి చేసుకుంటే బాగుంది పైన చెప్పినట్టే.  

Saturday 18 July 2020

కరోనా తో వ్యవసాయం

18.4.2020
ముంజలగెలలు తో తాడి

18.6.2020
నారుమడి సిద్ధం చేస్తున్న రైతు

11.7.2020

కాలవ. పచ్చని చేలు
11.7.2020
ఊడ్చిన చేలు
11.7.2020
ఊడ్చడానికి నారు కట్టలు పడేసిన చేను
11.7.2020
వెదజల్లిన చేను

11.7.2020
ఊడ్పుకు వెళుతున్న కూలీలు

కాలవ. 11.7.2020
11.7.2020
కూలీల మోటార్ సైకిళ్ళు
  

Monday 6 July 2020

గడ్డి గుడిసెలు-గూన పెంకలు




గడ్డి గుడిసెలు గూన పెంకలు
మట్టి గోడలు మాయమాయే

మోటబావులు పూడిపోయే
ఊటబావుల ఊసె లేదే

వరికల్లం కానరాదే
వడ్లు ఇంటికి చేరవాయే

బండిఎడ్లు ఏడబోయే
బర్రె తలుగు కానరాదే

ఒడ్ల గుమ్ములు ఒరిగిపోయే
కుడితి గోలెం ఇరిగిపాయే

మొక్కజొన్న చేనలల్ల
మంచెలన్నీ కూలిపోయే

పొద్దు తిరుగుడు చేనులన్నీ
ఆ పొద్దుకోసం ఎదురుచూసే

వెదురు షాటలు పెండ్ల తట్టలు
పెంటకుప్పల కూలిపోయే

బడికిపోయేబత్త సంచీ
బుక్కులెయ్యని ఎక్కి ఏడ్చే

చెక్కపలక సుద్దముక్కా
సూద్దమన్నా లేకపోయే

మర్రి చెట్టు ఉయ్యాలలేవీ
ఈత పండ్ల జాడలేవీ

మోదుగు పూల హోళీ రంగు
ఎరుపు తగ్గీ ఎలిసిపోయే

సిర్రగోనెలు సెదలుపట్టే
శిలుక్కొయ్యలు శిధిలమాయే

మంచినీళ్ళ మట్టికుండలు
మట్టిలోనే కలిసిపోయే

తేనెటీగల గోండ్రు కప్పల
రాగమేదీ తాలమేదీ

నింగిలోన పిల్లలకోడి
నిద్రపోయి లేవదాయే

గడ్డిగుడిసెల గూండ్లు కట్టిన
బుర్రు పిట్ట ఎగిరిపోయే

మనిషి ఆడిన కోతికొమ్మ
ఇపుడు కోతులొచ్చీ ఆడబట్టే

రచ్చబండ రంది తోటి
మంది ఏరని ఎదురు చూసే

తిరిగిరానీ రోజులన్నీ
తలుసుకుంటూ తల్లడిల్లే

జ్ఞాపకాలను మది మందిరంలో
దాచుకుంటూ సాగిపోతూ.....

జానపద అజ్ఞాత కవి కి నమస్కారం.

ఇది తెలంగాణా ప్రాంతంలోని జానపద గీతంగా తలుస్తాను, కొన్ని పలుకుబడులకు అర్ధం చెప్ప గలను. 
Courtesy Whats app







Wednesday 1 July 2020

వద్దురా చిన్నయ్యా!




వద్దురా చిన్నయ్యా!వద్దురా చిన్నయ్యా!!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా!
వద్దురా చిన్నయ్యా!!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా!
వద్దురా చిన్నయ్యా!!


కరోన ఇళ్ళకి కదలివచ్చేవేళ ముదిపాపలను చూసి పట్టుకెళ్ళేవేళ
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

కట్టిన మాస్కేమో దగ్గుకే మాసేను పాలుగారే మోము తుమ్ముకే వాడేను
వద్దురా వద్దురా కన్నయ్యా!
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

కరోన తగిలిన  కానివాళ్ళేనని చీలివాళ్ళంతా అల్లరి చేసేరు
వద్దురా చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!
వద్దురా చిన్నయ్యా!!

ఆడుకోవలెనన్న,పాడుకోవలెనన్న
ఆదటను నేనున్నా,అన్నిటను నీదాన (సెల్ఫోన్)
వద్దురా! వద్దురా!!వద్దురా!!!చిన్నయ్యా
ఈ పొద్దు ఇలువదలిపోవద్దురా అయ్యా! అయ్యా!!అయ్యా!!!
వద్దురా చిన్నయ్య!చిన్నయ్య!!



తొలి ఏకాదశి సందర్భంగా,శుభకామనలతో!
కంటైన్మెంట్ జోన్ లో గడుపుతున్న సందర్భంగా!!
బ్లాగు మరల ఓపెన్ ఐన సందర్భంగా!!!

With due respects to all concerned.