Monday, 14 March 2022

జానపదం

 


Courtsy:Whats app

తల్లితండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ!

Friday, 11 March 2022

ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.

 ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.


యుద్ధం,ఎన్నికల హాడావుడిలో కరోనా మాట మరచిపోయారు.మాస్క్ కూడా వాడటం మానేశారు. పెద్దలు మాత్రం కరోనా మనల్ని వదలలేదు, జాగ్రత్తలు అవసరమే అని చెప్పినా వినేలా లేరు జనం.


ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్లు చాలా ఉన్నాయి, ఏది సోకింది సామాన్యుడికి తెలీదు, ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతోంది, టెస్ట్ చేసే సమయం కూడా ఉండటం లేదు,దాంతో ఇది మామూలుగా ఋతువులో వచ్చే జ్వరం, దగ్గు, రొంప స్థాయికి జారిపోయినట్టు కనపడుతోంది.కరోనా ఎవరిని వదలకుండా అందరిని సోకింది, ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, వేక్సిన్ వేయించుకున్నవాళ్ళు( బూస్టర్లతో సహా )  వేయించుకోనివాళ్ళు, ఒక సారి వచ్చినవాళ్ళు అనే తేడాలే లేవు. సర్వం సమానం. ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళకి బయటికి కనపడటం లేదు, అంతే తేడా.

 

ఇది సోకినా ప్రమాదం లేదనుకున్నాం కాని ఇది తప్పు అభిప్రాయం.కరోనా అంటే తగ్గుతోందిగాని దీని ఫలితాలు, నీరసం, తలనొప్పి, చిన్న దగ్గు, కొద్దిగా జలుబు, డిప్రషన్, ఇలా లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి, నెలలు గడుస్తున్నా. వయసు మళ్ళినవాళ్ళని, ఇమ్యూనిటీలేనివాళ్ళని వేధిస్తూనే ఉన్నాయి, ఇందులో ఏదో ఒక లక్షణం. సుగర్,బి.పి లాటి దీర్ఘవ్యాధులున్నవారు చెప్పాపెట్టకుండా టపాకట్టేస్తున్నారు. కాని ఇది కరోనావల్ల అనుకోలేకపోతున్నారు. మరో విచిత్రం ఏమంటే ఒకరికి ఉన్న లక్షణాలు మరొకరికి ఉండటం లేదు. జాగ్రత్తలు కొనసాగడం మంచిది.


 నిజమెంతో తెలీదుగాని, 

కోవిడ్ లాటి వైరస్లను ఎలకలు,గబ్బిలాలు,పక్షుల ద్వారా శత్రు దేశాల్లో ప్రవేశపెట్టడానికి యూక్రైన్ లో పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి తాలూకు కాగితాలు,వగైరా దొరికాయనీ, లేబరేటరీలను స్వాధీనం చేసుకున్నామని, ఈ పరిశోధనలు అమెరికా పనుపున,ఆర్ధిక సాయం తో జరుగుతున్నాయనీ, తద్వారా శత్రు దేశాల ప్రజలను నెమ్మదిగా అనారోగ్యంపాలు చేసి, ఆ దేశాన్ని ఆర్ధికంగా నిలదొక్కుకోలేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, రష్యా ఆరోపిస్తోంది. ఈ పెద్ద దేశాలకి ఇటువంటి ఆలోచనలఎందుకొస్తున్నాయీ? సైన్స్ వెర్రితలలేస్తోందా? కాలమే చెప్పాలి. ఎప్పుడైనా జాగరత అవసరం.  

Tuesday, 8 March 2022

భవతి రాక్షసో వైద్యః

 


రోగార్తస్య భిషక్ దేవ

ఆర్త్యన్తే మానవో భిషక్

భవతి రాక్షసో వైద్యః

సేవామూల్య ప్రదర్శనే


రోగంతో బాధపడుతున్నపుడు వైద్యుడు దేవుడులా కనపడతాడు. అర్త్యన్తే అనగా రోగబాధ నెమ్మళించిన తరవాత, వైద్యుడు మామూలు మనిషిలా కనపడతాడు. వైద్య సేవలకి మూల్యం అడిగినపుడు మాత్రం రాక్షసునిలా కనపడతాడని భావం.


ఇది పాతకాలం నాటి మాట. నాటి రోజుల్లో అనగా నేను ఎరిగిన రోజుల్లో కూడా వైద్యుడు, రోగి ఇంటికి వచ్చి వైద్యం చేసేవాడు. మందులూ ఆయనే ఇచ్చేవాడు. పధ్యపానాలూ వివరంగా చెప్పేవాడు.అంతే కాదు, వైద్యుడు అంటే ఇంటివారిలో ఒకడనే మాట ఉండేది. చిన్నచిన్న రోగాలకి వైద్యం చేసినా డబ్బులు అడిగేవారు కాదు. సంవత్సరానికి ఒక సారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వైద్యం చేయించుకున్నవారంతా కట్నాలని, కానుకలు చదివించేవారు. ఇవ్వలేనివారి దగ్గర అడిగేవారు కాదు.అదో సహకార జీవనం. 


కాలం మారింది, కాదు మనుషుల బుద్ధులు మారేయి ఎప్పటి సొమ్మప్పుడే చెల్లించాలి, నేడు.డాక్టర్ దగ్గరకే రోగిపోవాలి. అక్కడ ఒక కార్డ్ రాయించుకోవడంతో ఫీజు మొదలవుతుంది. ఈ కార్డ్ కి కూడా ఖరీదుంటుంది అది వందో ఆ పైమాటో, డాక్టర్ని బట్టి.నేటి డాక్టర్లు ఎక్కువ మంది తేనెటిగల్లాటివారు. కొద్దికొద్దిగా సంగ్రహిస్తారంతే, చిన్నచిన్న వైద్యాలకి, అదే పెద్దదైతే కార్పొరేటే :)


పై శ్లోకం మా వాట్సాప్ గ్రూప్ లో డాక్టర్ గారు పెట్టినది. ఇదేoటి ఆయన ఇలాటి టపా వేశారని మిత్రుణ్ణి కనుక్కుంటే తేలినదేమంటే, కరోనా మొదలుగా  డాక్టర్ గారు వాట్సాప్ లో రోగిని చూస్తూ అత్యవసర వైద్యం చేసేరు. అది గత రెండేళ్ళుగా జరిగిపోతూనే ఉంది కాని ఎక్కువమంది కన్సల్టేషన్ కూడా చెల్లించలేదని తెలిసింది. ఔరా! జనం, అనుకుంటూ ఒక సారి భుజాలు తడుముకున్నా! నా దగ్గర నుంచి డాక్టర్ గారికి ఇవ్వవలసినది ఉండిపోయిందేమోనని. సరి చూసుకున్నా! అన్నీ రాసుకుంటా కనక. 

ఇటువంటి వారు కూడా ఉన్నారా? ఉన్నారు అక్కడక్కడా!

Friday, 18 February 2022

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

 


 మనసు విరిగెనేని మరి అతుకగరాదు


ఇనుము విరిగెనేని 

ఇనుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు కమ్మరీడు

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

విశ్వదాభిరామ వినుర వేమ!

ఇనుము విరిగితే రెండు మాడుసార్లు అతకచ్చు, వేడిచేసి. కాని మనసు విరిగితే మరి అతుక్కోదు.


తాతగారి మాట చద్దన్నం మూట. 

ఇనుము చాలాగట్టి లోహం. అది విరగాలంటే చాలా పెద్ద సమ్మెటపోట్లు బలంగా తగిలితేగాని విరగదు. అలా విరిగిన ఇనుమును కూడా కమ్మరీడు కాలేసి అతకగలడు, అది కూడా రెండు మూడు సార్లే, ఆ తరవాత అదీ అతుక్కోదు. ఇక మనసు గాజుకాయలాటిది, ఎంత సున్నితమో అంత కఠినం కూడా. అటువంటి మనసు విరిగితే మరి అతకడం ఎవరివల్లా కాదంటారు, ఇంతటి మనసు ఎలా విరుగుతుంది, మాటల తూటాలకి విరుగుతుంది,అంటారు, తాతగారు. 


దీనికి నిదర్శనంగా భారతంలో ఒక పద్యం ఉంది, పద్యం గుర్తు లేదు, భావం రాస్తున్నా! ఎవరేనా పద్యం గుర్తు చేస్తే సంతసం. ''పదునైన బాణం ములుకులతో ఐన గాయాలను కూడా మాన్చవచ్చు, కాని మాటలో ఐన గాయాలు, మాన్చటం ఎవరితరమూ కాదు!'' అందుచేత  ముందు ఆలోచించాలి,ఆలోచించి మాటాడాలి, నోటి నుంచి బయటికి వచ్చిన మాట రామబాణ సమానం, అది తన లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది, వెనక్కి తీసుకోలేం. అందుకే నోరు సంబాళించుకో అంటారు, పెద్దవాళ్ళు.మరో మాట కూడా నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం. కాలు జారితే తీసుకోగలం ,నోరు జారితే తీసుకోలేము, ఇది మరో జాతీయం.


పద్యం గుర్తొచ్చింది 

తనువున విరిగిన యలుగుల

ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

Saturday, 12 February 2022

మూర్ఖులకిచ్చే సలహా ప్రమాదకరం


 అనగనగా ఒక అడవి, అందులో ఒక చింతచెట్టు చివర కొమ్మని, ఒక పిచుకల జంట గూడు కట్టుకుని ఉంటోంది. అదే చెట్టు మీద కింది పలవలో ఒక కోతి ఆవాసం. ఒక రోజు రాత్రి పెద్ద గాలి,వానా కుదిపేశాయి. పిచుకల జంట భయం భయంగానే చిటారు కొమ్మన వెచ్చగా ఉన్న గూటిలో గడిపేయి. కోతి వానకి తడిసి, చలికి వణుకుతూ ఉండిపోయింది.తెల్లారింది, పిచుకల జంట బయటకి చూస్తే అడవి అల్లకల్లోలంగా ఉంది, వర్షం కొంచం తగ్గింది. కింది కొమ్మల్లో కోతి చలికి వణుకుతూ కనిపించింది.ఆ జంట కోతితో, బావా! నువ్వు బలవంతుడివి కదా! నాలుగు కొమ్మలు విరిచుకుని, గూడు వేసుకుంటే ఈ తిప్పలు తప్పేవి కదా అన్నాయి. ఇది విన్న కోతికి అరికాలు మంట నెత్తికి ఎక్కింది. చర్రున లేచి, పిచుకల గూటిపై దాడి చేసింది. గూడు చిటారు కొమ్మన ఉండిపోవడంతో వెంటనే చిక్కలేదు. సంగతి గ్రహించిన పిచుకల జంట గూడు వదలి ఎగిరిపోయింది.. కోతి ఆగ్రహం పట్టలేక గూడున్న కొమ్మ విరిచి కింద పారేసింది. చూచిన జంట చెప్పిన సలహాకి  వగచి వేరు చెట్టుకు చేరాయి. 

సందర్భ శుద్ధి లేకఇచ్చే సలహా గాని మాటగాని రాణించవు.

మూర్ఖులకి సలహా ఇవ్వకూడదు, అది ప్రమాదకరం.

Wednesday, 9 February 2022

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక  


ఎవరు చేసిన కర్మ వారనుభవింపక 

ఏరికైనా తప్ప దన్నా

ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు

అనుభవింపక తప్పదన్నా!


చేసిన కర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.


ఉత్కృష్టమైన పుణ్య,పాపకర్మల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి.చేసినది వ్యక్తిగాని, సమాజంకాని దేశం కాని ఫలితాలు తప్పవు, అనుభవించాలిసిందే! అందుకే నవ్వుతూ చేస్తాం ఏడుస్తూ అనుభవిస్తామంటారు.  

ధర్మో రక్షతి రక్షితః  

Saturday, 5 February 2022

పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...

 పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...


పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది. పెట్టడం పెద్దలనాటి నుంచీ లేదన్నదే  మాట.


చెయి చిక్కని మనిషికి రా యే కాని పో లేదు..


నా ఇంటి కొస్తే నాకేం తెస్తావు, నీ ఇంటికొస్తే నాకేం పెడతావు?


లోభివానినడుగ లాభంబు లేదయా!

Thursday, 3 February 2022

భూయో భూయో నమామ్యహం

 ఆపదామప హర్తారం

దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం

భూయో భూయో నమామ్యహం

అపదల నుంచి రక్షించేవాడు, సర్వ సంపదలిచ్చేవాడు, జన్మోహనుడైన శ్రీరామునికి మరల మరల నమస్కారం.


చిత్రం రాముడు తీరికూచుని జనులను ఆపదలనుంచి రక్షిస్తాడు, సంపదలిస్తాడు అందుకు శ్రీరామునికి మరల మరల నమస్కారం.రాముడేం చెయ్యడు! రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడంటే రూపుకట్టిన ధర్మం. అంటే ధర్మానికి మరలమరల నమస్కారం. అంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని ఆచరించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది, అని చెప్పడమే!ధర్మాన్ని ఆచరిస్తానని మరలమరల సంకల్పం చెప్పుకోవడమే సుమా!భూయో భూయో నమామ్యహం!

Friday, 28 January 2022

రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?

 రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?


కరోనా మరో variant  ప్రపంచం మీదకి రాబోతోందని WHO మాట.ఇది ఇప్పటివాటికంటే చాలా తొందరనూ అందరికి సోకుతుందని వార్త.


ఇప్పటిదాకా కరోనా వచ్చి తగ్గినవారికి, ఏ వేరియంట్ ఐనా, ఇమ్యూనిటీ ఉంటుందా?


ఇప్పటికి టీకా వేసుకున్నవారు,బూస్టర్ తీసుకున్నవారికి ఇమ్యూనిటీ కొనసాగుతుందా?

 ఇప్పటికి తీసుకున్న బూస్టర్ టికా రాబోయే వేరియంట్ ని ఎదుర్కోగలదా?


కొత్తగారాబోయే వేరియంట్ తొందరగా సోకుతుంది సరే, దీని లక్షణాలేంటి?


ఎప్పటికి దీనినుంచి విముక్తి?


సమాధానం లేని రాని ప్రశ్నలు.


Wednesday, 26 January 2022

అమ్మో నొప్పి!

 అమ్మో నొప్పి!


అమ్మో! నొప్పి,ఒళ్ళంతా నొప్పులే, నోరు చేదు, పంచదార, కారం కూడా చేదుగా ఉన్నాయి. కడుపులో వికారం, లేస్తే తూలు,నిద్దర పట్టటంలేదు, ఆకలి లేదు చెప్పుకొచ్చారు, మనవరాలు, అబ్బాయి, జమిలిగా.విన్నాను, నేనెవరితో చెప్పుకోను అని మనసులో అనుకుని వీళ్ళని ఏమార్చాలని పిట్ట కత చెప్పేనిలా!


కర్ణాటక సంగీత కచేరీ చూశారుగా, అందులో గాయకుడు, అతనితో పాటు మృదగం, వయొలిన్, కంజీరా, ఘటం,మోర్సింగ్ వాయించేవాళ్ళూ ఉంటారు. సభ ప్రారంభం చేస్తూనే గాయకుడు పాడితే వయొలీన్,మృదంగం అనుసరిస్తాయి. రాగ ప్రస్తారం తరవాత గాయకుడు పాట అపుతాడు, అక్కడినుంచి వయొలిన్, ఘటం, కంజీరా, డొలక్,మోర్సింగ్ ఈ పక్క వద్యాలన్నిటికి సమయంఇస్తాడు. అందరూ పాట మొత్తాన్ని ఒకసారి పాడి వాయించి సభ ముగిస్తారు. మేం అడిగినదానికి మీరు చెప్పేదానికి అన్వయం కుదరలేదు తాతా అంది మనవరాలు. చెబుతా విను అనిమొదలెట్టా. 

గత పదిరోజులుగా ఒమిక్రాన్ అమ్మవారు మన ఇంట సభ జరిపింది కదా! ఆవిడతో పాటు జ్వరం,దగ్గు,రొంప కూడా వచ్చాయిగా, పక్క వాద్యాలలాగా. ఆవిణ్ణి శాంతింపజేయడానికి, మందులువాడేం.అవి మరికొన్ని పక్క వాద్యాలు.ఆవిడ పాట పాడి ఆపింది, ఇకపై పక్క వాద్యాలు ప్రతాపం చూపుతున్నాయి, కొన్ని రోజులు బాధలు తప్పవని ముగించాను.


Tuesday, 25 January 2022

పెద్దమ్మ-చిన్నమ్మ.

 

పెద్దమ్మ-చిన్నమ్మ.

పెద్దమ్మ ఇంటి నుంచి బయటికి వెళుతుంటేనూ చిన్నమ్మ బయటినుంచి లోపలికొస్తుంటేనూ ఆనందం అంటారు.

వివరించండి.


Monday, 24 January 2022

Omicron -3Be always positive in attitude. 

Be active even if tested positive. 

Family tested positive 😀

Thursday, 20 January 2022

ఒమిక్రాన్-2 (జరుగుతున్న కథ)

 

భయం లేదు, ఉత్సాహంగా ఉండండి.


ఒమిక్రాన్-2 (జరుగుతున్న కథ)

సార్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా........అంటే ఒక అనుభవం ఉన్న డాక్టర్ గారి మాట.

ఇదెవరిని వదలదండీ. మొన్నటి దాకా పల్లె చల్లగా ఉంది, పండక్కి పట్నవాసం నుంచి వలస వచ్చారు. ఎవరూ మాస్క్ లు వేసుకోడం లేదు. తిరునాళ్ళు, తీర్థాలు, కోడి పందాలు గడిపేసేరు. ఇది స్వయంకృతం.
ఎవరిని ఎందుకు వదలదో చెబుతా.

గత రెండేళ్ళుగా అందరికి ఎంతో కొంత ఇమ్యూనిటీ పెరిగింది, సాధించుకున్నారు. దానితో ఈ ఒమిక్రాన్ కి ఎక్కువ ఇబ్బందులు లేక, ఎవరు పాసిటివ్ తెలీదు.లక్షణాలు కనపడితేనే పరిక్ష జరుగుతుంది కదా! ఇలా లక్షణాలు లేనివారు దీనిని వ్యాప్తి చేస్తున్నారు, అంతే కాక ఒక రోజు జ్వరం,మరొకరి ఒకరోజు రొంప, తలనొప్పి, వీరికి కూడా సామాన్య మందులేసుకుంటే తగ్గిపోతున్నాయి కాని వీరూ పాసిటివే. టెస్ట్ జరగదు, బాధలు లేవు గనక.అందుచేత, టీకా వేసుకున్నవారు, వేసుకోని వారు,బూస్టర్ డోస్ తీసుకున్నవారికి రావచ్చు.ఇంతకు ముందు వచ్చి తగ్గినవారిలో నూ రావచ్చు. 

.  
మరో మాట, ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చిన వాళ్ళంతా అదృష్ట వంతులే, ఎందుకంటే వీరిలో ఇమ్యూనిటీ సహజంగా ఏర్పడింది, టి సెల్స్ కూడా పెరుగుతాయి, అలాగని అశ్రద్ధ వద్దు,జాగ్రత్తలు మానద్దు, వస్తే అనుభవించక తప్పదు,ఇప్పుడు వేరియంట్ కి ప్రమాదం కలిగించే లక్షణాలు లేవు, భయపడద్దు అని ముగించారు

https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/coronavirus-14-omicron-symptoms-ranked-from-most-to-least-prevalent/photostory/88973282.cms


పై లింక్ లో వార్త నెట్ లో రెండు గంటలు మాత్రమే ఉంది. ఏం? ఇది సంచలనం కలిగించేది కాదు, అక్కడ వంద, ఇక్కడ వెయ్యిమందికి వచ్చిందని భయపెట్టేది కాదు, అందుకీ వార్త నిలబడలేదు. ఇటువంటి ధైర్యం కలిగించేవార్తలని ఎందుకు ఉంచుతారూ?

ఒమిక్రాన్-1(ఇది జరుగుతున్న కథ.) ఒమిక్రాన్-1

బాబాయ్! వారం కితం రాజస్థాన్ వెళ్ళాను, ఆఫీస్ పని మీద, అక్కడ పెద్దాఫీసర్లనే కలిసేను, చాలా చోట్లు తిరిగాను. తిరిగి ఫ్లయిట్ లో వస్తుంటే, ఇబ్బంది అనిపించింది. ఇంటి కొచ్చేటప్పటికి నూట రెండు డిగ్రీల జ్వరం, కొద్దిగా తలనొప్పి.మాత్ర ఒకటి వేసుకుని పడుకున్నా! తెల్లారి డాక్టర్ దగ్గర కెళ్ళా. ఆయన చూసి, సాంపుల్ టెస్ట్ కి పంపుతూ, మందులిచ్చి, ఇంటి దగ్గరే ”హోం ఐసొలేషన్” లొ ఉండండని కాంటాక్ట్ నంబరిచ్చి, వెళ్ళమన్నారు. ఇంటికొచ్చాను.సాయంత్రానికి జ్వరం తగ్గిపోయింది, కొంచం తలనొప్పి ఉంది. మర్నాడు ఉదయం డాక్టర్ ఫోన్ చేసి కోవిడ్ సోకింది,”హోం ఐసోలేషన్” లో ఉండండి. ఏం భయం లేదు, మధ్యాహ్నానికి కిట్ పంపుతాను, దాని ప్రకారం మందులేసుకోండి అన్నారు. ఒక్కసారి కంగారు పడ్డా, తమాయించుకున్నా! వారమూ గడిచింది, మందులూ ఐపోయాయి, రెండో రోజునుంచే బాధలేం లేవు. వారం తరవాత మళ్ళీ టెస్ట్ కి వెళ్ళా!డాక్టర్ చెక్ అప్ చేశారు,సాంపిల్ తీసుసుకున్నారు.. మర్నాడు చెబుతామన్నారు, రిజల్ట్. మరునాడు ఫోన్ చేసి ఇంకా పాసిటివ్ ”హోం ఐసోలేషన్”కొనసాగించమన్నారు.పని పాటూ లేక తిని కూచోడం చికాగ్గా ఉంది బాబాయ్ అని ముగించాడు.

మూడో రోజు నాకీ కబురు చెప్పగానే డీలా పడిపోయా, కంగారు పడ్డా కూడా! తమాయించుకున్నా! కంగారు పడకు, భయం లేదు,మాస్క్ వాడు, బయట తిరగద్దు, మందులేసుకో, చెప్పినట్టు, తుష్టుగా భోజనం చెయ్యి. నిద్రపో!, అర్ధ రాత్రి దాకా మేలుకోకు. అని జాగరతలు చెప్పా!
ఇది నా మాటల్లో ఒక్క సారిగా రాసేనుగాని ఇది సంఘటన క్రమం,రోజూ అనుసరిస్తూ వచ్చినది.నిద్ర పట్టటం లేదు, ఇది నేటి వారికున్న పెద్ద సమస్య, ధ్యానం చేయండి, ఊపిరి పీల్చి వదిలే వ్యాయామమ్ చేయండి, యోగా చేయండి, చివరగా డాక్టర్ సలహా మీద మాత్ర వేసుకోండి.ముందుగా బుర్రలోచి భయం తొలగించండి. ఇది జరుగుతున్న కథ.

ఇలా చెప్పా! ఒకప్పుడు గానుగెద్దు జీవితం, వారాంతపు శలవు లేదు, రోజులో ఎనిమిది గంటలు పని చేయాలి, ఎప్పుడో నిసబు లేదు. ఇలా ఉద్యోగం చేయడం చాలా బాధగా ఉండేది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఊరు దాటితే కబురు చెప్పి కదాలాలి, నేటి కాలం లో ఇది చెబితే నమ్మకపోవచ్చు కూడా. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోడానికి మాకున్న ఒక్కటే ఒక్క మార్గం డాక్టర్ సర్టిఫికటుతో శలవు.ఎక్కువ రోజులు శలవు పెడితే ఇలా సెకండ్ మెడికల్ ఒపీనియన్ అని పెద్ద డాక్టర్ల కమిటీకి పంపేవారు. ఒక్కొకప్పుడు అక్కడికి వెళేవాళ్ళం. డాక్టర్లు బాగున్నావుగా ఏంటి సంగతంటే నిజం చెప్పేసేవాళ్ళం. ఆప్పుడు డాక్టర్లు మరో పది రోజులు ఇతనికి శలవు కావాలని,రోగం తగ్గలేదని, రాసిచ్చేవారు. ఇది యాజమాన్యానికి ఇబ్బందిగా ఉండేది. తరవాత కాలంలో ఇలా పంపడం మానేసి, బాగుంటే వచ్చి డ్యూటీ లో చేరమని కబురంపేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నీవు ఇంటి దగ్గరుండమంటే ఎందుకు ఇబ్బంది పడ్తావని చెప్పేను.
Monday, 17 January 2022

పండగనాటి ముగ్గు ముచ్చట

పండగనాటి ముగ్గు ముచ్చట


Photo courtesy :whats app

 పండగ రోజు
అందమైనట్టి
అంచ ముగ్గేస్తి
కరుణించవా
వరుణదేవా?

నా పని నేను చేశా! గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వదిలేయలేదు! నా ప్రయత్నం నేను చేశా! ఆ పై ఫలితమివ్వడం నీ వంతు. ”కర్తవ్యము నా వంతు  కాపాడుట నీ వంతు” భారతీయ తత్త్వం మాటలో, చేతలో ఎంత ఇంకింది ప్రజల్లో, ఇదీ సంస్కృతి అంటే. 
తల్లీ నీకు వందనం
శ్రీ మాత్రేనమః

Thursday, 13 January 2022

పండగ -వయసు ముచ్చట్లు

 పండగ-వయసు ముచ్చట్లు 


పెళ్ళయిన మొదటి సంవత్సరం, పెద్ద పండగకి పిలవడానికి మామగారొచ్చాడు. పండక్కి తీసుకెళ్తా రమ్మన్నాడు. మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, నేను తరవాతొస్తానన్నా! ఏమనుకుందోగాని ఇల్లాలు, ఇద్దరం కలిసివస్తాం,అనిజెప్పి తండ్రిని పంపేసింది. భోగి ముందురోజు ఉదయం డ్యూటీ చేసి సాయంత్రం బయల్దేరి ఇరవై కిలో మీటర్లు దూరం కోసం రెండు గంటలు ప్రయాణం కోసం వెచ్చించి కడియం చేరేం.గుమ్మంలో చేరగానే ఎదురింటి పిన్నిగారు "ఏమే పాపా! ఇదేనా రావడం? "  అంటూ పలకరించి, అదే వరసని "అల్లుడూ బాగున్నావా?"  అడిగింది. ఆవిడ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి రెండో కోడలు,దుర్గేశ్వర శాస్త్రి గారి భార్య, ఇంకేంఉంది ఇల్లాలు పిన్ని చేతుల్లో వాలిపోయింది, అయస్కాంతానికి అతుక్కున్న ఇనప ముక్కలా. ఎంతకీ ఇనపముక్క ఊడి బయటకు రాదు. దగ్గేను, సకిలించేను ఉపయోగం లేకపోయింది. ఇనపముక్క ఊడలేదు.ఏం చేయాలి? లోపలికెళితే ఒక్కడివే వచ్చావు మా అమ్మాయేదీ? అంటే, అలాకాక మా అమ్మాయేదీ అంటే ఏం చెప్పాలి? తోచక నిలబడిపోయా! ఈలోగా అత్తగారు బయటికొచ్చి కూతుర్ని పిన్నమ్మ చేతుల్లో చూసి, నన్ను, నువ్వు లోపలికి రావయ్యా! అదొస్తుందిలే అంది. అమ్మయ్య ఒక గండం గడిచిందని లోపలికెళ్ళా! 


ఇల్లాలు ఇంట్లోకెప్పుడొచ్చిందో! మళ్ళీ కనపళ్ళా! భోజనాల దగ్గర మెరిసింది, కంచాలెత్తుతూ.ఆ తరవాతెప్పుడో గదిలోకి చేరి నిద్దరోతున్నారా? అడిగింది. లేదన్నా పొడిగా.ఈ మాత్రానికే అంత కోపమా అంది. అబ్బే కోపమేం లేదే అన్నా!పేదవాని కోపము పెదవికి చేటు అన్నది గుర్తు చేసుకుని. నాకు తెలవదేంటీ? అని సాగదీసింది. మొత్తానికి తెల్లారింది, దోమలు కుట్టి చంపుతూంటే, నిద్దరట్టక.


ఉదయమే భోగి తలంటాలన్నారు.వదినగారు తనూ కలిసి,తోడల్లుడికి నాకూ. కాదనలేక పీటమీద కూచున్నా. తలకి వంటాముదం రాసింది, వదినగారు, తబలాలా వాయించేసింది. ఆ తరవాత ఇల్లాలు ఒంటినిండా నువ్వుల నూనె రాసి, నలుగు పిండి రాసింది. నలుగెడతామన్నారు.అమ్మో! అని పరుగెట్టేను. తోడల్లుడు చక్కహా నలుగెట్టించుకున్నాడు. ఏం? అడిగింది ఇల్లాలు. నలుగు పిండి ఎండిపోయింది. నలిస్తే రాదుగాని ఒంటినున్న వెండ్రుకల్లో చిక్కుకుందేమో, నలుగెడితే అంతకంటే నరకం ఉండదని చెబితే ఆపింది. అమ్మయ్య మరో గండం గడిచిందనుకున్నా. ఈ లోగా కుంకుడుకాయ పులుసోసి నా తలని అప్పా,చెల్లీ చెడుగుడు ఆడుకుని, విడతల మీద, మొత్తానికి తలకి రాసిన జిడ్డు వదిల్చేరు. కుంకుడు కాయ పులుసుతో సున్ని పిండి కలిపి ఒళ్ళు రుద్దుకుని స్నానం అయిందనిపించుకుని బయట పడ్డా.  


కూడా, కుట్టించుకుని తెచ్చుకున్న కొత్తబట్టలు కట్టుకున్నా. మావగారికి,  అత్తగారికి దణ్ణం పెడితే మావగారు ఒక ఇరవై రూపాయలు పండగ బహుమతి ఇచ్చాడు, వాటిని ఇల్లాలు ఊడలాకుంది. నవ్వుకున్నాము. పన్నెండయింది, భోజనాలన్నారు, కానిచ్చి లేచేం. వెళ్తానన్నా! అదేం మాట అన్నారంతా! రేపు పండగ కదా అన్నారు కూడా కోరస్ గా. నేను సమాధానం చెప్పేలోగా ఇల్లాలు, "చిన్నంటి  కెళ్ళాలి లే! లేకపోతే ఆవిడకి కోపం వస్తుందంది". ఒక్క సారి నిశ్శబ్డం అయిపోయింది.అంతే కాదు నేనేదో ఘోరం , నేరం చేసినట్టు చూశారందరూ, చాలా ఇబ్బందికరంగా ఉంది, నాకు మాత్రం. ఈలోగా ఇల్లాలే కలగజేసుకుని ''సాయంత్రం నాలుక్కి డ్యూటీ'' అని చెప్పింది. అంతా ఒక్క సారి భళ్ళున నవ్వేసేరు.ఇదేం ఉద్యోగం! పండక్కి కూడా శలవు లేదూ అని బుగ్గలు నొక్కుకున్నారు ఇరుగూ పొరుగూ! పెళ్ళికే,ఒకరోజు రాత్రి  డ్యూటీ   చేసి మరునాడు అంటే పెళ్ళి రోజు వారపు శలవు తీసుకుని, పెళ్ళైన మర్నాడు సాయంత్రం ఉద్యోగానికెళ్ళిన ఘనత కలవాడు మా అయన చెప్పింది ఇల్లాలు.   అటువంటి ఉద్యోగం కూడా ఉంటుందని తెలియని రోజులు, ఎప్పుడూ అరవై ఏళ్ళకితం   మాట.  


Friday, 7 January 2022

అభ్యాసము కూసు విద్య!

 


 అభ్యాసము కూసు విద్యఅభ్యాసము కూసు విద్య, ఎంత చెట్టుకు అంత గాలి, సంతోషము సగము బలము ఇలా ప్రతి క్లాసులో గోడలమీద రాసి ఉండేవి. అక్షరాలు కూడబలుక్కుని చదివే రోజుల్నించి బడి వదలి పోయేదాకా రోజూ బళ్ళో క్లాసులోకి రాగానే కనపడేవి, ఇవి నెమ్మదిగా ఇంకిపోయాయి మనసులో...ఇప్పుడు బడిలో ఇవి రాస్తున్నారా?..

అభ్యాసం గురించి తాత మాట, ఏంటో ఈయన్ని తాతగారంటే దూరం పెట్టినట్టు ఉంటుంది, అందుకే ఆప్యాయంగా తాతా అంటాను, చిన్న బుచ్చటం కాదు, చనువు సుమా...
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.
చిన్న మాటలో చెప్పేసేడు కదా!
గువ్వల చెన్నడు 
కుల విద్యకు సాటిరావు గువ్వలచెన్నా!
ఏం ఎందుకనీ? ఎందుకంటే కుల విద్యని తల్లి తండ్రులు తాత,అమ్మమ్మలు, తాత, మామ్మలు,ఆచరించగా,చూస్తూ పెరుగుతాం, ఇదీ అభ్యాసమే.

వీడియోలో అమ్మాయి అన్ని మెలికలు తిరగ్గలిగిందంటే ఎంత సాధన చేసి ఉంటుంది?

ఇలాగే యోగా చిన్నప్పుడు చేశా!పదిహేడేళ్ళ దాకా ఆ తరవాత పొట్టకూటికి సాధనలన్నీ వదిలేశా! అందునా రాత్రి పగలు నిసబు లేని ఉద్యోగం దొరికింది.పెళ్ళైన తరవాత ఇల్లాలు మీ పెద్ద పెళ్ళాం పిలుస్తోంది, వెళ్ళండి, వెళ్ళండి అనేది, ఎంతకాలం వదిలేశా? దగ్గరగా ఏభై ఏళ్ళు. మొన్న కరోనాలో మళ్ళీ గురువు దగ్గర నేర్చుకున్నా ఓనమాలు. సాధన చేస్తూ వచ్చా, రెండేళ్ళనుంచి, కాని ఇదిగో ఒక నలభై రోజుల్నించి మానేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్తైపోయింది. కాలు చెయ్యి సాగటం కష్టంగా ఉంది, సాధన చెయ్యాలి. 

యోగా చేసేవారు ప్రాణాయామం కూడా చేస్తారు సాధారణంగా, నాకు తోచిన చిన్న మాట.ఇందులో ఊపిరి తిత్తులలోకి గాలి పీల్చుకుని వదలిపెడతాం. ఎంత ఎక్కువ సేపు ఊపిరి తీసుకుంటే అంత బాగుంటుందనుకుంటాం. కాని కాదు. మామూలుగానే ఊపిరి పీల్చాలి, కాని నెమ్మదిగా ఊపిరి వదలిపెట్టాలి, దీనికి ఎక్కువకాలం తీసుకోవాలి, ఎంత ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేస్తామో అంత గాలీ మనం తీసుకుంటాం తెలియకనే. అందు చేత సాధన చేయవలసినది ఊపిరి పీల్చడం కాదు,ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేయడమని నా నమ్మకం.ఆ పై మీ ఇష్టం..Wednesday, 5 January 2022

కాటరాక్ట్ ఆపరేషన్.

 కాటరాక్ట్ ఆపరేషన్


సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇది పెద్దలమాట. కాని బాగా అశ్రద్ధ చేయబడేదీ కన్నే! 


నేటి రోజుల్లో ముఫై ఏళ్ళకే సుగర్ వ్యాధి కలుగుతోంది, దీని వల్ల వచ్చే అవకరాల్లో కాటరాక్ట్ ఒకటి. ఇది నెమ్మదిగా సంవత్సరాల తరబడి పెరుగుతుంది, నెమ్మదిగా దృష్టిని అడ్డుకుంటుంది. ఒకసారి కాటరాక్ట్ అని తేలితే ఆపరేషన్ తప్పదు, నేడో !రేపో!నాకు ఆరేళ్ళగా ఉన్నట్టు తెలిసింది,కాని అశ్రద్ధ చేసేను, కారణాలనేకం, అందులో భయం ముఖ్యమైనది.

నా అనుభవాలు రాస్తున్నా!

ఒకసారి ఆపరేషన్ కి నిర్ణయించుకున్న తరవాత డాక్టర్ గారితో తారీకు నిర్ణయం చేసుకున్నా! నిర్ణయమైన తారీకుకు ముందు నాలుగు రోజులు కంటిలో మందు చుక్కలు రోజూ నాలుగు సార్లు వేసుకోమన్నారు. రోజుకొక కాప్శూల్ వేసుకుని నాలుగో రోజు మూడు గంటలకి రమ్మన్నారు. అలాచేసి నాలుగో రోజు మధ్యాహ్నం మూడుకు చేరేం.ఒక రూం ఇచ్చారు. విశ్రాంతి తీసుకున్నా, ఆ తరవాత బి.పి,సుగర్,కారోనా టెస్టులయ్యాయి. వాటి ఫలితాలు చూసి కంటికి పరీక్ష చేసి అన్నీ బాగున్నాయి రేపు ఉదయం ఆరుగంటలి రండి, రోజూ వేసుకునే మందులు సమయం ప్రకారం వేసుకోండి, టిఫిన్ సమయానికి చేయండి. అని చెప్పి ఇంటి కెళ్ళి మరునాడు ఉదయమే రమ్మన్నారు.(లోకల్ కనక) ఆపరేషన్ లో ఉపయోగించే ఐ.ఒ.ఎల్ కొనమని రాసిచ్చారు, దాని ఖరీదు పదివేలు,అక్కడే పక్కన కొన్నాం.


మరునాడు ఉదయమే స్నానం అన్నీ పూర్తి చేసుకుని రోజువారీ మందులేసుని టిఫిన్ చేసి ఉదయం ఆరుకి రూంలో చేరాం.ఏడుకి కంటిలో మందు వేసింది, నర్సు.ఎనిమిది తరవాత ఆపరేషన్ చెప్పింది.కంటి రెప్పలపై ఉన్న వెంట్రుకలు తొలగించింది.ఎనిమిదికి ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్న సీనియర్ సర్జన్ రూంలో కూచో బెట్టేరు. నాకు ముందు ఒకరున్నారు.ఎనిమిదికి సీనియర్ సర్జన్ మళ్ళీ టెస్ట్ చేశారు, ఒకె ముందుకెళ్ళమంటే నా ముందున్నతన్ని ఆపరేషన్ కి తీసుకెళ్ళారు.

 ఆ తరవాత పది నిమిషాల్లో నాకు పిలుపొచ్చింది. ఒక నర్స్ నన్ను డిసానిజేషన్ రూంలోంచి నడిపించి తీసుకెళ్ళింది. మరో సానిటజెడ్ వరండాలో పీట మీద కూచోమంది.నాకు రెండు మాత్రలిచ్చి వేసుకోమంది. వేసుకున్నా! ఐదు నిమిషాల్లో కొద్దిగా మత్తనిపించింది,(ముందుగానే నాకు ఆపరేషన్ భయం ఎక్కువని, ఆతృతరోగం ఉందని, వినపడదని,రాసిచ్చి విన్నవించుకున్నా,   డాక్టర్ గారికి.)

చిత్రంగా నాలో భయం,ఆలోచన ఏమీలేని శూన్యస్థితి ఏర్పడింది.కుడికాలుపెట్టి థియేటర్ లో అడుగుపెట్టా. నన్ను నర్స్ ఆపరేషన్ టేబుల్ దగ్గరకి నడిపించింది. టేబుల్ మీద పడుకోమన్నారు. టేబుల్ మీద బుట్టలా ఉన్నచోట తలపెట్టి పడుకున్నా. కంటిలో మందు చుక్కలేశారు, కళ్ళమీద గుడ్డలాటిది వేశారు, కళ్ళు కనపడుతున్నాయి.కంటి పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పిగా అనిపించి అబ్బా అన్నా! చేతులు పక్కన పెట్టుకోండన్నారు,ఈ లోగా కంటి మీద లేజర్ ఫోకస్ చేశారు, ఒక బొమ్మ కనపడింది,(ఈ బొమ్మ కితంరోజు సాయంత్రం టెస్ట్ చేసినప్పుడు కనపడింది)మరుక్షణం లేజర్ తొలగించారు, ఏమీ కనపడలేదు, మరుక్షణం ఏదో పెట్టినట్టయింది, కన్ను కనపడింది.మందు చుక్కలేశారు. దూది ఉండ కంటి మీద పెట్టి టేప్ వేశారు నిలువుగా అడ్డంగా కదలకుండా.( దీనికి తీసుకున్న సమయం పది నిమిషాల లోపు ఉండి ఉంటుందని ఊహించా)కొంచం పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పి ఉంది. లేవమన్నారు, నర్స్ నన్ను థియేటర్ నుంచి నడిపించి తీసుకొచ్చి మా వాళ్ళకి  అప్పజెప్పింది.

నన్ను రూం కి తీసుకెళ్ళి పడుకోమన్నారు. టైం ఎంతన్నా! తొమ్మిది దాటిందన్నారు. మరి కాసేపటిలో ఇంటికెళ్ళిపోమన్నారు, మర్నాడు ఉదయం రమ్మన్నారు.   విశ్రాంతి తీసుకోమన్నారు, రాత్రికి నిద్ర పట్టదేమో అని సంశయం చెప్పా,నిద్ర పడుతుందని చెప్పేరు.లిఫ్ట్ లో కిందకి తీసుకొచ్చారు. ఆటోలో ఇంటికొచ్చాం! పదయింది. ఆటో వాళ్ళకి అలవాటనుకుంటా ఎవరూ చెప్పకనే నెమ్మదిగా గతుకుల రోడ్ లో తీసుకొచ్చాడు.ఇంట్లో విశ్రాంతి తీసుకున్నా, మామూలుగా భోజనం చేసాను.సాయంత్రానికి కంటి నొప్పీ తగ్గింది, హాయిగా నిద్ర పట్టింది.

 మర్నాడు ఉదయం ముఖాన్ని తడి దూదితో తుడుచుకున్నా! స్నానం మామూలుగా చేసాను.హాస్పిటల్ కి చేరాం. నాలాటివారు మరో పది మంది, ఒక హాల్ లో కూచున్నాం,నర్స్ లు కంటి కట్టు తీసేశారు.కంట్లో మందు చుక్కలేశారు, కన్ను కనపడుతోంది.కళ్ళు మూసుకు కూచున్నా! ఈ లోగా నల్లకళ్ళజోడిచ్చి పెట్టుకుని చూడచ్చన్నారు. నల్ల కళ్ళజోడులోంచి లోకం అందంగా కనపడింది. 

ఆనందమానందమాయె!మరి ఆశల నందనమాయె! మాటలు చాలని చోట పాటగ మారిన మాయే! 

డాక్టర్ పరీక్ష చేశారు, బాగుందన్నారు. ఈ కింది జాగ్రత్తలూ తీసుకుంటూ నల్లకళ్ళజోడు వాడుతూ ఇరవైరోజుల తర్వాత రమ్మన్నారు.

నాకు తోచినది ముఖ్యంగా కంటికి శ్రమ వద్దు.ఇన్ఫెక్షన్ కి దూరంగాఉండాలి.ఎక్కువ వెలుగు చూడద్దు.హాస్పిటల్ నుంచి ఇంటి కొచ్చాకా మొదటిరోజు ఇంట్లో కూడా నల్ల కళ్ళజోడు పెట్టుకున్నా, మర్నాటి నుంచి బయటికెళ్ళినప్పుడు మాత్రం నల్ల కళ్ళజోడు వాడేను.మొదటి మూడు రోజులూ దూదితో కళ్ళు ముఖం శుభ్రం చేసున్నా. నాలుగో రోజునుంచి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కున్నా. ఇరవైరోజుల తరవాత షాంపూతో తలంటుకున్నా! క్షవరం చేయించుకున్నా. గడ్డం మామూలుగానే చేసుకున్నా. టివి.ఫోన్ వగైరాలన్నీ ఇరవై రోజులు వదిలేశా.మొదటి పది రోజులు బాగుందిగాని తరవాత కాలం గడవడం కష్టం అనిపించింది. ధ్యానం చేయడం నేర్చుకున్నా. కాలం గడచిపోయింది, తెలియకనే.ఇక అవసరమైన మైల్స్,మెసేజిలకి రోజూ మనవరాలు సాయంత్రం ఒక గంట సాయపడేది. సమాధానాలివ్వవలసిన చోట నేను చెప్పినట్టు టైప్ చేసి పంపేది, అలా గడిపేశా.

 ఇరవైరోజుల తరవాత హాస్పిటల్ కి వెళ్ళా. రెండు కళ్ళు టెస్ట్ చేశారు. కళ్ళ జోడు రాసిచ్చారు.ఇరవై రోజుల తరవాత వెళ్ళినపుడు ఒక చుక్కల మందు రాసిచ్చారు. అది రోజు ఆపరేషన్ ఐన కంటిలో ఒక చుక్క ఉదయం సాయంత్రం వేయమన్నారు, అది వచ్చినంత కాలం,  వేసుకుంటున్నా! రేపో, మాపో ఐపోతుంది. మూడో రోజు కళ్ళ జోడుతో జీవితం గాటిలో పడింది.రెండు కళ్ళకి జోడి కుదరడానికి కొంత కాలం పడుతుంది. ఆపరేషన్ కన్ను చురుగ్గాను, అప్పటిదాక పని చేసిన కన్ను మందంగా ఉంటాయి.మొదటి మూడు రోజులు నడక మానేశా. ఆ తరవాత నడిచాను. ఆపరేషన్ ఐన రోజునుంచి యోగా మానేశాను. ఆరు వారాల తరవాత మొదలెట్టాను. 

Total cost of operation.Rs24,500.

I.O.L 10,000.

Doctor fees 10,000

Medicines 2,200

Transport 3days 300

karona test 500

Spectacles 1500


డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు. Monday, 3 January 2022

మీ నాన్నగారున్నారా?

 మీ నాన్నగారున్నారా?

మీ నాన్నగారున్నారా , నీ అమ్మ మొగుడుగారున్నారా అన్నవి రెండూ తెనుగు వాక్యాలే! రెండిటి అర్ధమూ ఒకటే, కాని మొదటి వాక్యమే వాడతాం, ఏం? అదే సభ్యత, సంస్కారం అన్నారు పెద్దలు.కొంత మందికి సభ్యత సంస్కారం పుట్టుకతోనే వస్తాయి, కొంతమంది లోకం చూసి నేర్చుకుంటారు. కొందరికి నేర్పినా రావు, ఇదే లోకంఅంటే!


ఒక పల్లెలో పుట్టాను, అక్కడే చదువుకున్నా!మరో పల్లె కి దత్తత వచ్చా!నాకు ఊరు కొత్త, మనుషులూ కొత్తే!మా ఇంటికి పక్కనే ఒక హొటలు, తెల్లారుగట్ల నాలుగుకి నమో వెంకటేశా పాటతో మొదలయ్యేదా హొటలు. నాలుక్కే జనంతోకిటకిటలాడిపోయేది.లోపల కాళీ లేకపోతే పక్కనే ఉన్న మా ఇంటి అరుగు హోటల్ కి వచ్చిన వాళ్ళకి విశ్రామ స్థానం.ఉదయం ఏడుగంటలకి స్నానం పూర్తి చేసుకుని వీధరుగు మీద కూచుని పాత ఇంగ్లీషు పేపరు చూస్తూ, కొత్త పేపర్ కోసం ఎదురు చూస్తూ గడిపేవాడిని. 


ఇక ఆ అరుగు మీద జనం లోకం లో ముచ్చట్లు,రాజకీయాలు, పెళ్ళిళ్ళు, ముండ తగవులు ఇలా అన్నీ దొర్లిపోతుండేవి. వూళ్ళో విషయాలన్నీ నాకు చేరుతుండేవి. నేనే సంభాషణలోనూ పాల్గొనే వాడిని కాదు.జనాల మాటలు వింటూ, జనాలని పరిశీలిస్తూ  ఉండేవాడిని.


మాది మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇల్లు, ఆ వీధి చివర ఒకాయన ఉండేవారు. ఆయన తో సైకిలు,గొడుగూ ఎప్పుడూ ఉండేవి. అవి రెండూ ఆయన ట్రేడ్ మార్కు. వారి ఇంటి పేరు చల్లా! ఆయన నోరు విప్పితే చాలు బూతులే వచ్చేవి, తల్లి,పిల్ల, పిన్న,పెద్ద,ఆడ, మగ, కూతురు,కోడలు ఇలా తేడాలేం లేవు.ఎవరితోనైనా బూతులే మాటాడేవాడు, అదీ పెద్ద గొంతుతో. ఆయన మాత్రం మా అరుగు మీద చేరితే, మరెవరూ కూచునేవారు కాదు, లేకపోతే జనంతో కిటకిటలాడుతూ ఉండేవి, మా అరుగులు. ఈయనొస్తే నేను పని ఉన్నటు లోపలికి పోయేవాడిని. ఈయన్ని అందరూ ఇంటి పేరుకి ఉకారం చేర్చి పలికేవారు.

ఒక పెద్దరైతు ఏభై ఏళ్ళవాడు, పొలం వెళ్తూ పలకరించేవాడు.ఏం బాబా అనేవాడు. ఈయన ఆడవారిని అమ్మా అనీ,పెద్దవారిని తల్లీ అనీ, మగవారిని అయ్యా అనే సంబోధించేవారు.వీరిని అందరూ పెదకాపుగారనేవారు, ఏభై ఎకరాల ఆసామీ వ్యవసాయం చేసేవారు. ఆయన కాపుకాదు, కాని ఎప్పుడూ ఎవరినీ పెదనాయుడనిగాని, పెదచౌదరనిగాని పిలవమని అనలేదు.ఒక్కో రోజు వీరితో కలసి పొలం వెళ్ళే వాడిని. ఆయన కార్యక్షేత్రంలో ఆయనను గమనించేవాడిని, మాట తీరు వ్యవహార శైలి వగైరా.ఆయనెప్పుడూ కోపంలో కూడా, సంయమనం కోల్పోయింది చూడలేదు. 


ఆ తరవాత ఒక సెట్టిగారి దగ్గర గుమాస్తాగా చేరా! ఆయన ఎవరినైనా ఏమండి అనే సంబోధించేవారు.ఆ తరవాత ఒక బ్రాకెట్ కంపెనీలో పని చేశా! ప్రతి చోట మనుషుల్ని చదవడం నేర్చుకున్నా! ఇదంతా  రెండు సంవత్సరాల వ్యవధిలో. మనుషుల్ని  చదవడం నేర్చుకోవాలి, అదంత తేలిగ్గాదు.Wednesday, 29 December 2021

చలిగా ఉంది! చలి చలిగా ఉందీ!!

 చలిగా ఉంది! చలి చలిగా ఉందీ!! 


పగలు వేడి  ౩౦డి లోపుంటోంది.ఉదయం 17,18డి, మధ్యాహ్నం 30డి లోపు, నాలుక్కే వేడి 24.21డిలకి తగ్గిపోతోంది.పగలు కూడా ఇంట్లో చలేస్తోంది.చలికి ముణగదీసుకు కూచోడం సరిపోతోంది, చేసే పనిలేదు,చేయగలదీ దేదన్నట్టు ఉంది,దీనికి తోడు బద్ధకం, ఏ పనీ చేయ బుద్ధి కావటం లేదు.పగలు కూడా ఏ.సి వేసుకోవల్సి వస్తూంది. మధ్యాహ్నం భోజనం తరవాత కప్పుకు పడుకుంటే కునుకట్టింది. 


పగటి నిద్రలో మా గీరీశం కనపడ్డాడు.చాలా చెప్పేడు, చెప్పాలంటే బద్దహం గా ఉంది.సంవత్సరం చివరి రోజులకొచ్చాం, బుజ్జమ్మ కనపడిందా?


Thursday, 23 December 2021

సిరివెన్నెల-మారదులోకం-స్మృత్యంజలి.

 

సిరివెన్నెల-మారదులోకం-స్మృత్యంజలి.


సిరి వెన్నెల మరి లేదు, కనుమరుగయింది, కాని సిరివెన్నెల కలం బాలు గొంతులో చిరంజీవిగా ఉండిపోయింది.మిత్రుడు చేంబోలు సీతారామ శాస్త్రి అనే సిరివెన్నెల బహుముఖ ప్రజ్ఞా శాలి, అతని పాటలలోనే కొన్ని మచ్చుకి.


మేటనీ పిక్చరుంది బోటనీ లెక్చరుంది దేనికో ఓటు చెప్పరా?

అనగల చిలిపి చెలికాడు.


ఐయాం సారీ అన్నాగా వందో సారి

అని ప్రేయసి చేత అనిపించి, ఏం వంద సార్లు చెప్పాలా అని సన్నగా ప్రియుణ్ణి సాధింప జేయగల కొంటెవాడు. 


మారదు లోకం, మారదు కాలం, ఎవ్వరు ఏమైపోనీ

నిగ్గదీసి అడుగు, నిప్పులతో కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని, మారదు లోకం, మారదు కాలం

అంటూ,  సమాజాన్ని మార్చేసాం,అని, నిప్పులతో కడిగి నిగ్గదీసిన వారెందరు చరిత్రలో లేరు? ఐనా సమాజం మారిందా? లేదు మారదు అని నొక్కి వక్కాణించి చెప్పిన మేధావి. సమాజం మారదు ఎవరు ఏమైపోయినా కాలం మారదు, మారుతుందనే భ్రమలో బతక్కు, నిజాన్ని చూడు అని చెప్పిన విప్లవవాది.


జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. 

సత్యం.ఈ మానవ సమాజం అంతా ఒక కుటుంబం కాని ఎవరి బతుకు వారిదే, ఎవరిచావు వారిదే అనే నిష్టుర సత్యాన్ని సినీ పాట ద్వారా సామాన్యులకి చేర్చగల తాత్వికుడు.


బిచ్చమడిగేవాని నేమి అడిగేది, బూది నిచ్చేవానినేమి కోరేది?

నిందాస్తుతితో శంకరుణ్ణి వశంకరుణ్ణి చేసుకునే మార్గాన్ని బోధించినవాడు. కోరికలతో వేగిపోకు, కర్మఫలం అనుభవింపక తప్పదు, ఈ ఉపాధిలో కొత్తగా కర్మఫలాన్ని పొగేసుకోకు, బూది అంటే వైభమనే మాట చెప్పి తనలో కలుపుకునే వైభవాన్ని ఇచ్చేవాడిని ఇంకా ఏమడుగుతావన్న వేదాంతి.వేదాంతాన్ని చినచిన్న మాటలలో సినీ గేయంలో ప్రజలకి చేరువజేయగల నేర్పరైన మిత్రుడు నిజంగానే బోళా శంకరుడు.కుడుము చేతికిస్తే పండుగనుకునేవాడు.


నిజమే నిజంగానే భోళా శంకరుడు కనుకనే ఏకాదశి మరణం ద్వారా నిరూపితమయింది. ఏకాశి మరణం ద్వాదశి దహనం అన్నవి పుణ్య ఫలశేషాలని పెద్దల మాట.మరో మాట కూడా చెబుతుంది లోకం, ఎమీ తెలియనివానికి ఏకాశి మరణం, అన్నీ తెలిసినవానికి ఆమావాస్య మరణం, అని.మిత్రుడు ఏకాదశి రోజు ఇహలోక యాత్ర ముగించి పరలోకానికి చేరిన వాడు వైకుంఠ ప్రాప్తి చెందినట్టుగానే భావిస్తాను.


ఎంతచెప్పినా మిత్రుడు లేనిలోటు తీర్చరానిదే. మిత్రుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ స్మృత్యంజలి ఘటిస్తున్నాను.


---------------------------------

మిత్రుని గురించి ఎంత చెప్పినా కొంత మిగిలుంటుంది.మిత్రుని మరణ వార్తను నాకుటుంబ సభ్యులు చేరవేశారు నాకు, ఆ తరవాత మిత్రులు విన్నకోటవారు తెలియజేశారు.కొంతకాలంగా కంటికి విశ్రాంతినివ్వడం కోసం అన్ని  మీడియాలనుంచీదూరంగా ఉన్నాను. ఫోను కంప్యూటర్లు వాడటం లేదు, చదవను కూడా మానేశాను. సృత్యంజలి సమర్పించడం ఆలస్యమయింది.


Sunday, 14 November 2021

చెఱువైన వరి చేను.


 తూర్పు గోదావరి జిల్లాలో గతవారంగా చిన్న చినుకు పడుతూనే ఉంది. నేటికీ తగ్గలేదు,ఒరుపివ్వ లేదు. కోసిన చేలలో పనలు తేలుతున్నాయి. కోయవలసిన చేలు కోయక్కర లేదు, కుళ్ళుతున్నాయి, నీట మునిగి. రైతు పూర్తిగా మునిగిపోయాడు. కోసిన చేను చెఱువైతే గుండె చెఱువైన  ఒక రైతు వ్యధ.

రాబోయేది పున్నమి సముద్రం పోటు మీదే ఉంటుంది. నీరు లాగదు, చేళు పూర్తిగా కుళ్ళిపోవడం ఖాయం.

Saturday, 23 October 2021

ఎవరు చేసిన కర్మ

 ఎవరు చేసిన కర్మ

 వారనుభవింపకా 

ఏరికైనా తప్పదన్నా

ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు

అనుభవింపక తప్పదన్నా

అనుభవించుట తథ్యమన్నా.


కరోనా పుట్టింట కథాకళీ చేస్తోందని వార్త.


పుట్టింటి వారి బంధులింటా నిన్నటిదాకా కథాకళీ చేసినట్టుంది.


లోకువ వాళ్ళని చూసి నవ్వకు.

నవ్విన నాపచేను పండింది(ట).


Sunday, 3 October 2021

అందితే జుట్టు లేకపోతే కాళ్ళు .

 అందితే జుట్టు లేకపోతే కాళ్ళు .

ఇదొక నానుడి. తరచుగానే చెబుతుంటారు. దీని గురించి చూస్తే చిన్న కత భాగవతంనుంచి.
బహుశః ఈ సంఘటన నుంచే ఈ నానుడి పుట్టిందేమో!

శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు హస్తినాపురం వెళ్ళి, దుర్యోధనుని కూతురైన లక్షణ అనే కన్యను, రాక్షస వివాహం చేసుకోడానికి తీసుకొస్తుంటే కౌరవులు అడ్డుకున్నారు. (రాక్షస వివాహం అంటే కన్యను, కన్య బంధువుల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుతెచ్చుకుని వివాహం చేసుకోవడం.భారతం, నాటి సమాజం ఎనిమిది రకాల వివాహాలను అనుమతించినట్లు చెబుతోంది)


“కోరి సుయోధను కూతురి సర్వలక్షణములు గల్గి లక్షణ యనంగ
మహినొప్పు కన్యకామణి వివాహంబున జక్రహస్తుని తనూజాతు డైన
సాంబుడు బలసాహసమున నెత్తుకపోవ గౌరవు లీక్షించి కడగి క్రొవ్వి
పడుచువాడొక డదె బాలిక గొనిపోవుచున్నాడు గైకొన కుక్కు మిగిలి

ఇట్టి దుర్మదు గయిముట్టి పట్టి తెచ్చి
జనులు వెఱగంద జెఱబెట్టి యుంతుమేని
యదువులు మనల నేమి సేయంగ గలరొ
యనుచు గురు వృద్దజనముల యనుమతమున….భాగవతం….స్కం. ౧౦ ఉత్తర భా….౫౫౬

దుర్యోధనుడి కూతురు లక్షణ అనే పేరుగల కన్యను శ్రీ కృష్ణుని కొడుకైన సాంబుడు వివాహం చేసుకోడానికి తీసుకొస్తూ ఉంటే, కౌరవులు చూసి, కుఱ్ఱాడొకడు పిల్లని తీసుకుపోతున్నాడు, ఇటువంటి వాణ్ణి పట్టుకుని, పెద్దల అనుమతితో, బంధిస్తే యాదవులేమి చెయగలరో చూద్దామనుకున్నారు.”

ఇలా అనుకుని “దుర్యోధనుడు, కర్ణుడు,శల్యుడు, భూరిశ్రవ, యజ్ఞకేతులు బయలుదేరి సాంబుడిని అడ్డుకున్నారు. సాంబుడు వీరత్వంతో యుద్ధం చేసేడు అందరితో, వీణ్ణి ఇలా గెలవలేమని అందరూ కలిసి ఒక్క సారిగా దాడి చేసి లక్షణతో సహా పట్టుకున్నారు.” “ఈ సంగతి నారదుని ద్వారా యాదవులకి తెలిసింది.రాజు ఉగ్రసేనుని అనుజ్ఞతో యుద్ధాని బయలుదేరుదామన్నారు యాదవులు. అంతలో బలరాముడు అడ్డుపడి కౌరవులు మనకు బంధువులు వాళ్ళతో గొడవ వద్దు అని ఆపేడు. అప్పుడు యుద్ధం చేద్దామన్నావాళ్ళతో కూడా కలిసి కరిపురం చేరి, కోట బయట విడిసి ఉద్ధవుడిని దూతగా పంపేడు, బలరాముడే వచ్చేడని కౌరవులు బయలుదేరి వెళ్ళి అర్ఘ్య, పాద్యాలిచ్చి గౌరవించారు. ఆప్పుడు బలరాముడు దుర్యోధనుని చూసి, మా రాజు ఆజ్ఞ ప్రకారం వచ్చేం, మీరందరూ కలిసి, ఒక్కణ్ణి చేసి సాంబుడిని బంధించడం తప్పు, ఐనా సరే మా రాజు బంధుత్వం తలచి ఆ తప్పు సైరించేడని చెప్పేడు. అందుకు సుయోధనుడు,

అనుమాటలు విని కౌరవ జననాయకుడాత్మ గలగి చాలు బురే! యే
మనగలదు కాలగతి చక్కన గాలం దొడుగు పాదుకలు దలకెక్కెన్…..భాగ…దశ స్కం.ఉత్తర…౫౭౨

ఆ మాటలకి సుయోధనుడు కోపించి కాళ్ళకి తొడుక్కునే చెప్పులు తలమీదపెట్టుకున్నట్లుంది, కాలం, ఏం చెప్పను, యాదవులతో సంబంధం సఖ్యం చాలు,భీష్ముడు, ద్రోణుడు,కర్ణుని లాటి వీరులకు దొరికినవాణ్ణి, దేవేంద్రుడయినా విడిపించగలడా, వృధా మాటలెందుకు అంటూ దుర్భాషలాడుతూ దిగ్గునలేచి మందిరానికి వెళ్ళిపోయాడు.”

ఇప్పుడు బలరాముడికి కోపం వచ్చి “రాజ్యవైభవ మధాంధుల మాటలు విన్నారు కదా అని కూడా వచ్చిన వారితో అని” ఇంకా ఇలా అన్నాడు.

“శ్రీ మధాందులు సామముచేత జక్క
బడుదురే యెందు బోయడు పసుల దోలు
పగిది నుగ్ర భుజావిజృంభణ సమగ్ర
సుమహితాటోప మనిలోన జూపకున్న….భాగ…..దశ.స్కం.ఉత్తర.భా….౫౭౬

డబ్బు మదంతో కొట్టుకుంటున్నవాళ్ళకి మంచిమాటలు పనికిరావు, బోయవాడు పసువుల్ని తోలినట్లు, యుద్ధంలో బుద్ధి చెప్పాలిసిందే, అని, కృష్ణుడు, మిగిలినవారిని రావద్దని వారించి వచ్చాను,దేవ దేవుడయిన కృష్ణుని కాదంటారా” అంటూ,ఇంకా

“తామట తలపగ దలలట యేమట పాదుకలమట గణింప రాజ్య
శ్రీ ముదమున నిట్లాడిన, యీ మనుజాధముల మాటలేమనవచ్చున్….భాగ…దశ.స్కం. ఉత్తర….౫౮౧

తమరేమో తలలా మేమేమో చెప్పులమా! రాజ్యమదం తో మాట్లాడే వాళ్ళని ఏమనగలమని, భూమి మీద కౌరవులను లేకుండా చేస్తానని, చేతిలో నాగలి హస్తినాపురానికి సంధించి గంగలో కలిపేసే ప్రయత్నం చేస్తూంటే నగరం అతలాకుతలమై పోయింది.” అప్పుడు …” దానికి ప్రతీకారంబు లేమిని గలవళంబున భయాకుల మానసులయి, పుత్ర మిత్ర కళత్ర, బంధు, భృత్య, పౌరజన సమేతంబుగా భీష్మ సుయోధనాది కౌరవ్యులు, వేగంబున నతని చరణంబులు శరణంబుగా దలంచి, సాంబునిం గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబులతో దోడుకవచ్చి దండప్రణామంబులాచరించి, కరకమలంబులు మోడ్చి, యిట్లనిరి…..”..భాగ..దశ.స్కం.ఉత్తర….౫౮౪

బంధు,మిత్ర, భార్యలతో సహా అందరూ చీని చీనాంబరాలూ పట్టుకుని సాంబుని లక్షణను తీసుకువచ్చి బలరాముని కాళ్ళు పట్టుకుని రక్షించమని వేడుకుని, సాంబుని, లక్షణ సహితంగా లక్షణంగా అప్పజెప్పి శరణు వేడేరు. బలరాముడు కొడుకుని, కోడలిని తీసుకుని తమ రాజ్యం చేరుకుని, అక్కడి వారికి జరిగిన కధ చెప్పేడు”. అందుకే ఇప్పటికీ హస్తినాపురం దక్షణం వైపు కొద్ది ఎత్తుగా ఉంటుంది, బలరాముడు నాగలితో పెళ్ళగించడానికి ప్రయత్నించడం చేత.

బాజాభజంత్రీలతో పెళ్ళికి విందుభోజనానికి పిలిస్తే, కాదని, మూకుడు పట్టుకుని పెళ్ళివారింటికి పులుసుకి వెళ్ళిందని సామెత.బలరాముడు సౌమ్యంగా సాంబుని, లక్షణను వదిలిపెట్టమంటే కాదని టెక్కుపోయి, చెప్పులలాటివారని హేళనచేసిన నోటితోనే, కొద్ది సేపటిలోనే, రక్షించమని కాళ్ళు పట్టుకోవడం ఏమంటారు? దీన్ని అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోడమే అంటారుగా, నిజంగా జరిగింది కూడా ఆదే కదా.

Tuesday, 28 September 2021

చి...ప్ప! కొబ్బరి చి...ప్ప!!లప్ప లప్పనియేవు 
లప్పనాదనియేవు
లప్ప నీ దెటులౌను చిలకా.....అయ్యో!
కొబ్బరి చిప్పయే నీ గతి చిలకా

లప్పయే సుఖమనీ 
లప్పయే బతుకనీ 
లప్పెనక పోయేవు చిలకా......ఖర్మ!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా

చిప్ప చిప్పనియేవు
చిప్పకాదనియేవు
చిప్పయే నీ గతీ చిలకా...అవునూ!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా

కాని కాలామొచ్చి
కళ్ళు మూసుకుపోయి
నీ బతుకు తెలియవే చిలకా...వహ్వా!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా
 
ఒళ్ళు పెరిగీ పోయి
మెడ తిప్ప లేకుంటె
చిప్పయే నీగతీ చిలకా...నిజమే!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా

ఒళ్ళు పెరిగీ పోయి
కళ్ళు మూసుకుపోయి
పిచ్చెక్కినప్పుడూ చిలకా...రామరామ!
కొబ్బరి చిప్పయే నీగతీ చిలకా

ఒళ్ళు పెరిగీ పోయి
బుఱ్ఱ పెరగాకుంటే
అప్పుడూ నీగతీ చిలకా...అయ్యయ్యో!
కొబ్బరి చిప్పలే నీ గతీ చిలకా

లప్పెక్కువైతేను
అతిమూత్ర వ్యాదొస్తె
చిప్పయే నీకు గతి చిలకా...శాభాషూ!
కొబ్బరీ చిప్పయే నీకు గతి చిలకా

చిప్పనూ కాదనీ 
లప్ప సంపాదిస్తే
లప్ప నీ వెంటవదు చిలకా........అయ్యో!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా

కొడుకులూ కోడళ్ళు తన్ని తగిలినవేళ
ఆత్మీయులెవ్వరూ ఆదరించని వేళ
రామ నామమే  నీగతీ చిలకా....అంతే! అంతే!!
కొబ్బరిచిప్పలే నీ గతీ చిలకా

లప్పకాదనుకునీ
చిప్పయే బతుకంటె
తిప్పక్కడున్నదే చిలకా...నిజమా?
నీ బతుకు తిప్పక్కడున్నదే చిలకా

కాని కాలంలోన
కట్టెలే నీ తోడు
కాని కాలమొచ్చి కట్టెలే లేకుంటె
చిప్పలే నీ గతీ చిలకా

కొబ్బరి చిప్పలే నీగతీ
మొద్దులే నీ గతీ
డొక్కలే నీ గతీ
కమ్మలే నీ గతీ
ఆకులే నీ గతీ
గులకలే నీ గతీ
పుచ్చెలే నీగతీ
దయ్యపు పుచ్చలే నీ గతీ చిలకా

దయ్యపు పుచ్చలూ లేకుంటె
పాతరే నీగతీ చిలకా
నిలువు పాతరే నీ గతీ చిలకా
ఉప్పు పాతరే నీ గతీ చిలకా

Saturday, 4 September 2021

రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు/వఱడు

 రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు/వఱడు

 ''రెంటికీ చెడ్డ ఱేవడు'' అన్నది జన సామాన్యంలోని మాట, కాని ''రెంటికీ చెడ్డ వఱడు'' అన్నది అసలు మాటేమోనని నా అనుమానం.

ఇదొక నానుడి. దీనికో చిన్నకత.

రేవడు/ఱేవడు అనే పదాలికి రజకుడు అని అర్ధం. రెంటికీ  చెడడం ఏమనేదే మిమాంస.


రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు

ఒక రజకుడు బట్టలుతికేందుకు ఒక ఏటి దగ్గరకు పోయి, బట్టలు తడిపి గూనలో వేసి ఉడకబెట్టేడు. ఉడికిన బట్టలని తీసి ఉతకేడు, వాటిని ఆరేశాడు, ఏటి గట్టు పైన. మిగిలినబట్టలు ఉతుకుతున్నాడు. ఎండ మిటమిటలాడుతోంది. ఉన్నట్టుండి, గాలి చల్లగా వీచింది. అంటే దూరంలో వర్షం పడుతోందని సూచన కలిగింది. వర్షం పడితే కొన్ని ఏర్లు క్షణాలలో ఉధృతంగా ప్రవహిస్తాయి, అదీ రజకునికి తెలుసు. కాని అంత తొందరగా ఏరుకి నీరు వస్తుందని ఊహించక ఉపేక్ష చేసి బట్టలు ఉతుకుతూనే ఉన్నాడు. ఈ లోగా గాలి పెరిగింది,సుడిగాలయింది. ఆరేసిన బట్టలు ఎగిరిపోనారంభించాయి. వాటికోసం పరుగెట్టేడు, ఏటి గట్టు పైకి. ఈ లోగా ఏరు గలగలమంటు ఉధృతంగా వచ్చి పడిపోయింది. చూస్తుండగానే సుడిగాలి ఆరేసిన బట్టలెత్తుకుపోయింది, ఉతుకుతున్న బట్టల్ని ఏరు పట్టుకుపోయింది. పాపం! ఉత్తి చేతులతో రేవడు మిగిలిపోయాడు. అలా ఆరేసిన బట్టలకీ చెడ్డాడు, ఉతుకుతున్న బట్టలకీ చెడ్డాడు, అదేరెండిటికీ చెడడం.


రెంటికీ చెడ్డ వఱడు

మరో కత. రేవడు అంటే రజకుడు, వఱడు అంటే నక్క అని అర్ధం.వరుడు అంటే పెళ్ళి కొడుకు.  కత పంచతంత్ర కథలలోదని గుర్తు. 

ఒక వేటగాడు, వేట కోసం పొంచి ఉన్నది, ఒక నక్క చూచింది. వేటగాడికి వేట పడితే ఏమైనా కొద్దిగా తనకి ఆహారం దొరక్కపోతుందా! అని, నక్క దాపునే పొంచి ఉంది. వేటగాడు విల్లు ఎక్కుపెట్టుకుని ఉండగా అనుకోకుండా పులి తారసపడింది. బాణం వదలకపోతే పులి మీదబడి చంపుతుంది, తప్పక బాణం వదిలేడు, పులికి ఆయుస్థానం లో ములుకు తగిలింది. కాని పులి ముందుకు దూకి వేటగాడిని ఓ పెట్టు పెట్టి కూలిపోయింది. పులి పెట్టుకి వేటగాడూ కూలిపోయాడు, పులీ కూలిపోయింది. జరిగిన హటాత్ సంఘటనకి నక్క నివ్వెరపోయి తేరుకుని,తన అదృష్టాన్ని అభినందించుకుంది. పులి శరీరాన్ని ఒక వారం తినచ్చు,వేటగాడి శరీరాన్ని మరో వారం తినచ్చు అని లెక్కలేసుకుంది. ఎవరి నుంచి మొదలు పెట్టాలీ అనేది తేల్చుకోలేకపొయింది. వేటగాని విల్లు కనపడింది.   దానికున్న నారి బలంగా కనపడింది. ఈపూటకి ఈ నారిని భోంచేస్తాననుకుని, ఎక్కుపెట్టి ఉన్న వింటి నారిని కొరికింది. నారిని కొరకడంతోనే ఎక్కుపెట్టిన విల్లు కొన విసురుగా తగిలి నక్క కూడా చనిపోయింది. లోభత్వంతో రెంటికీ చెడి నక్క ప్రాణాలే కోల్పోయింది. అదే రెంటికీ చెడ్డ వరడు కత.


Friday, 3 September 2021

ఇంతేరా ఈ జీవితం

 


ఇంతేరా ఈ జీవితం 15.8.21 తేదీని ఎండిన మొక్క 


1.9.21 తేదీనాటికి చిగిర్చి పూలు పూసిన మొక్క 

ఇంతేరా ఈ జీవితం  తిరిగే రంగుల రాట్నము. కష్టం నిలిచిపోదు, సుఖమూ నిలిచిపోదు.కాలమూ ఆగదు, ఎవరికోసమూ. జరిగినది విధి, వగచి ప్రయోజనం శూన్యం, రోజులు సంవత్సరాలూ లెక్కపెట్టుకోడం తప్పించి, ఇదీ తప్పనిదే.  

Past is perfect

Present Continuous.

Future Tense.

Monday, 30 August 2021

అమ్మా తమ్ముడు మన్ను తినేను...


https://youtu.be/YpTb3VvqQ5Q

అమ్మా తమ్ముడు మన్ను తినేను...
మన్నేటికి భక్షించెదు ? మన్నెందుకు తిన్నావయ్యా? మన ఇంట తినడానికేం లేదా అడిగింది యశోద.

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరిమాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ
రి మ్మార్గము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మాదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే...

అమ్మా మన్ను తినడానికి నేను చిన్నపిల్లాడినా,వెఱ్ఱివాడినా?వీరి మాటలు నమ్మకు. నేను మన్ను తిన్నానంటే నువ్వు నమ్మేసి నన్ను కొడతావు చూడు, అలా నన్ను నీ చేత కొట్టించాలని వీరి పన్నాగం. కావాలంటే నా నోరువాసన చూడమ్మా? అని నోరు తెఱచి  నిలబడిన కన్నయ్య నోట్లో అమ్మకి కనపడిందేంటీ? సర్వజగత్తూ.  చూసిన తల్లి ఏమనుకుంది?

కలయో వైష్ణవ మాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్..

కలగంటున్నానా? మాయా? మరో ఆలోచన చేస్తున్నానా? నిజమా? ఆలోచించలేకపోతున్నాను. అసలు నేను యశోదనేనా?వేరే లోకంలో కాని ఉన్నానా? చిన్ని బాలుని ముఖంలో ఈ విశ్వమంతా కనపడటానికి కారణం ఏంటని ఆశ్చర్యపోయిందా తల్లి. 

ఒకప్పుడు ఆటపాటలతో మట్టి తినడం కూడా ఒక బాల్య చేష్ట. నేడు మట్టి కనపడటం లేదు కనక మట్టి తినడం, మట్టిలో ఆడుకోవడం, మట్టిని ఆనందంగా ఒంటినిండా పట్టేలా దొర్లడం అనేది వికృత చేష్ట, ఏం చేస్తాం కాలం మారింది కదా! ఉస్స్.. కాలం మారలేదు, మనుషులే మారేరు...బుద్ధులు మారేయి.

ఒకప్పుడు చద్దెన్నం తింటూ అన్నం పారేసాను. పెంచుకున్న తల్లి తిట్టలేక యశోదలాగానే ”నాన్నా! అన్నం పారేయ కూడదయ్యా!! అన్నం పరబ్రహ్మ స్వరూపం''. అని చెప్పింది. అప్పుడు అర్ధం కాకపోయినా ఆ మాటలు గుర్తుండిపోయాయి. కాలంలో అవగతమయ్యాయి. అప్పుడే మరో మాటా చెప్పింది. ”కరువు కాలం లో అన్నం లేక జనులు మట్టి తినేవారు సుమా" అని. నాకున్న కొద్దిపాటి జ్ఞానం ప్రదర్శించా! మట్టి ఎలా తింటారని? అమ్మ మాట నిజం కాదనుకుని. అప్పుడు అమ్మ వివరంగా చెప్పిందిలా" 

“ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || ”

“ సమస్త ప్రాణులూ ‘ అన్నం ’ నుంచి పుడ్తున్నాయి … అన్నోత్పత్తి ‘ వర్షం ’ వల్ల కలుగుతోంది; ‘ వర్షం ’ ‘ యజ్ఞం ’ వల్ల కలుగుతుంది ; ‘ యజ్ఞం ’ సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతోంది.
Courtesy: pssmovement.org

వర్షం లేకపోతే పంటలేదు. పంట లేక ఆహారం లేదు, అన్నం లేదు. అప్పుడు ప్రజలు గంజి,అంబలి తాగి బతికేవారు. ఆ తరవాత ఆకులు ఉడక బెట్టుకుని తినేవారు. ఆ తరవాత కరువు తీవ్రమైతే రేగడి మట్టి పిసుక్కుని మజ్జిగలో/పెరుగులో కలుపుకుని తాగేవారు, అలా మట్టి తినేవారయ్యా! ఇప్పుడు మనకు అన్నం దొరుకుతోంది అదృష్టవంతులం, అన్నమెప్పుడూ పారెయ్యకూ" ఇది అస్తిగతమైపోయింది, నేటికీ...

అమ్మ చెప్పిన అన్నం పారెయ్యద్దన్న మాట ఆచరించాగాని, మట్టి తింటారన్న మాట, నమ్మలేకపోయాను, మొన్నటి దాకా. 

మనం తీసుకునే ఆహారం మట్టి నుంచి పుట్టినదే! మట్టితో మిగిలిన నాలుగు భూతాలూ సంయోగం చెంది పుట్టేదే అన్నం. అన్నం నుంచే జనులు పుడతారు. అది తిని మనుషులు పెరుగుతారు. అది తిన లేకపోతే మరణిస్తారు. పంచభూతాలూ సంఘటితమైతే జననం, విఘటితమైతే మరణం, ఇంతే ఇది..ఇదే సృష్టి..


 వీడియో చూడండి. హైతీ అనే దేశంలో అన్నం దొరక్క మట్టి తింటున్నారు, ఎలాగో చూడండి...

Saturday, 28 August 2021

జకార పంచకం

జకార పంచకం

జామాతా జఠరం జాయా జాతవేదా జలాశయః

పూరితేనైవ పూర్యన్తే జకారాః పంచ దుర్లభాః (దుర్భరా)


తృప్తి పడనివారు జకారంతో ఉన్నవారు ఐదుగురు.


ఎంత పూరించినా తృప్తి లేనివారు,

జామాతా ( అల్లుడు):- నిజానికి ఇది నాటి మాటే అనుకుంటున్నాను. 

జఠరం:- ఆకలి, ఎంత తిన్నా పరగడుపే.

జాయా:- పత్ని. ఎంత సంపాదించినా తృప్తి పడనిది, ఏమి చేసినా తృప్తి కానిది.

జాతవేదా:- అగ్ని, ఈయన ఎంతటీవాడంటే, తనను అర్చించేవానిని కూడా కాల్చేస్తాడు, ఎంత తిన్నా తృప్తి లేదు.

జలాశయః:- సముద్రం. ఎన్ని వరదలొచ్చినా నీరంతా సముద్రంలో కి పోయేదే! ఎంతైనా తీసుకుంటుంది కొంచం వెనక ముందులంతే తేడా.


వకార పంచకమని మరొకటి ఉంది. వీరితో పని పడ కూడదుగాని....

Friday, 27 August 2021

పెడితే పెళ్ళి

 పెడితే పెళ్ళి లేకపోతే శ్రార్ధం.


ఇది జన సామాన్యంలో ఉన్నమాట. మనకి ఉపకారం జరిగేటట్టు ప్రవర్తించిన వారికి మంచి జరగాలనీ లేకపోతే చెడు జరగాలనీ అనుకోవడంగా చెబుతారు.అసలేమి?


పెడితే పెళ్ళి:- పెళ్ళి ఇంట పదిమంది చెయికడగాలని అనుకుంటారు. అలా తృప్తిగా భోజనం చేసినవారు వధూ వరులను ఆశీర్వదించాలని పెద్దల కోరిక. అటివంటి చోట ఒక యాచకునికి తినడానికే దొరకదా? అదే పెడితే పెళ్ళి. పెళ్ళిరోజు పెడతారు.


ఇక


పెట్టకపోతే శ్రార్ధం:- ఇది నిజం, సమాజంలో ఉన్నది జరుగుతున్నదిన్నూ. శ్రార్ధం అంటే శ్రద్ధగా చేసేది, అంటే తద్దినం, అంటే తత్+దినం. అనగా ఆరోజు, ఏరోజు, ఆ ఇంట పెద్దలెవరో కాలం చేసినరోజు. ఆ రోజుగనక యాచకుడు ఆ ఇంటికి యాచనకొస్తే,ఏమీ పెట్టరు, పైకెళ్ళమంటారు లేదా మళ్ళీ రమ్మంటారు, లేదా ఈరోజు తద్దినం అని చెబుతారు. అంటే ఇప్పుడు వీలు కుదరదని చెప్పడం. కాలం చేసిన వారికి అర్చన పూర్తి కాకుండా ఇతరులెవరికి ఏమీ పెట్టరు. ఇదీ లోకంలో ఉన్న ఆచారం. తద్దినాన్ని తిథి అని కూడా అంటారు.ఏరోజూ సూర్యోదయానికి ఉన్న తిథిని ఆరోజు  తిథిగా చెబుతారు, కాని తద్దినానికి తిథి ఐతే మాత్రం ఏరోజు అపరాహ్నానికి పోయినవారి తిథి ఉంటుందో ఆరోజే తద్దినం పెట్టాలి.


ఇదీ పెడితే పెళ్ళి పెట్టకపోతే శ్రార్ధం కత.

Thursday, 26 August 2021

కన్యా వరయతే రూపం…

 కన్యా వరయతే రూపం…

కన్యా వరయతే రూపం
మాతా విత్తం, పితా ధనం
బాంధవా కులమిఛ్ఛంతి
మృష్టాన్నమితరే జనాః.

ఇది పూర్వ కాలంలో చెప్పిన మాట. ఏంటిటా? కన్యా వరయతే రూపం, ఇది తెలుస్తూనే ఉంది, నేటి కాలానికి కూడా అమ్మాయి ముందు చూస్తున్నది, కాబోయే వాడు అందగాడేనా? అని. ఇది అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి మారని సత్యం. ఆత్మ సౌందర్యమే అసలు సౌందర్యమన్న మాట తెలిసేటప్పటికి చేతులు కాలుతున్నాయి. ఆ వయసులో ఆలోచన అలాగే ఉంటుంది, అది ప్రకృతి సిద్ధమైన ఆకర్షణ కనక. తరవాతది మాతా విత్తం, ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం, అప్పుడూ, ఇప్పుడూ కూడా. తల్లి అనగా కన్యా ప్రదాత భార్య, కాబోయే అత్తగారు, తన అల్లుడికి ఉన్న సంపాదనా మార్గాలు, రాబోయే, లేక ఉన్న ఆస్థిపాస్థులు, అల్లుడు అమ్మాయికి పెట్టబోయే నగలు, నాణ్యాలు, ఇంటి వస్తువులు, తన కూతురు అనుభవించబోయే సుఖ, భోగ, సంతోషాలగురించి ఆలోచిస్తుందట, అందుకే మాతా విత్తం అన్నారు.  ఇప్పటికి ఇందులో మార్పు రాలేదు, ఇక ముందుకూడా రాదు. “పెళ్ళి సంబంధం చూసొచ్చానోయ్! మనమ్మాయికి, కలిగినవారు, బలగం ఉన్నవారు, సరసులు” అంటే. ” అది సరేగాని అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు, ఇతని వాటా కొచ్చే ఆస్థి ఎంత? ఇతని సంపాదన పెరుగుతుందా? జీతమేనా పైన గీతం కూడా ముడుతుందా” ఇదీ ప్రశ్న, తల్లినుంచి వచ్చేది. ఆ తరవాతది పితా ధనం, ఇదేంటీ, తల్లి విత్తం చూస్తోందిగా అని అనుమానం రావచ్చు, విత్తానికి ధనానికి తేడా ఉంది. తండ్రి చూసేది ధనం కదా! అది అభిమానధనం, పౌరుషధనం, మరి ఇతరమైన ధనాలు అనగా విద్య వగైరా చూస్తాడు. ఇది కూడా నేటి కాలానికీ నిజమే, అబ్బాయి చిన్న ఉద్యోగం లో ఉన్నాడని అనుకోవద్దు, అతనికి పెద్ద ఉద్యోగానికి, సంపాదనకి తగిన హంగులున్నాయి, వృద్ధిలోకి వస్తాడు అన్నది చూస్తాడట, ఇది తండ్రి ముందు చూపు. ఇది కూడా నిజమే ఇప్పటికీ.  బాంధవా కులమిఛ్ఛంతి, కుర్రాడి తల్లి తండ్రులు తమ కులం అనగా తమ కట్టుబాట్లలో వారేనా కాదా, రేపు ఆ ఇంటివారితో సంబంధ బాంధవ్యాలు నెరిపేసావకాశం ఉందా, ఇవి చూస్తారట, తోటివారు.  ఇది కూడా నేటికీ సత్యమే.

ఇక చివరిది మృష్టాన్నమితరే జనాః పప్పన్నమే పెడతాడా? ఇంకా ఘనంగా చెస్తాడా, పెళ్ళి? మొన్ననెవరో పెళ్ళిలో అరవైనాలుగు పదార్ధాలు పెట్టేరు, ఈయన అంతకంటే ఎక్కువ చేస్తాడా, తక్కువ చేస్తాడా అని చూస్తారట.  చిప్పలో కూడెట్టినా, తిని వచ్చి “అహా! ఏం గొప్పగా చేసేడండి పెళ్ళి” ఆంటారు. ఇది కూడా నిజమే నేటి కాలానికి కూడా. ఇంక తేడా ఎక్కడండీ అని కదా మీ ప్రశ్న.

నేటి కాలంలో అమ్మాయి తన వరుణ్ణి తనే ఎంచుకుంటున్నప్పుడు, అంటే గాంధర్వ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నపుడు, అమ్మాయే తల్లి తండ్రి, ఇతర బంధువులు చేయవలసిన పనులు చేసుకుంటూ ఉంది, తన పనితో, అనగా కన్యా వరయతే రూపంతో. నిజంగా నేటి అమ్మాయి ఎంత బాధ్యత తీసుకుంటూ ఉంది చెప్పండి. ఇదంతా చెప్పిన మాట వినకపోడంగా పరిగణించుకుంటే ఎలా? నేటి అమ్మాయిలు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోడం తప్పు లేదుకాని, తప్పుడు నిర్ణయాలు తీసుకుని అవస్థలు పడుతున్నారనుకుంటా. శకుంతల తండ్రికి చెప్పక వివాహం చేసుకుని కొడుకుని కని, ఎన్ని అవస్థలుపడి భర్తను చేరుకుందీ తెలుసుగా. అవి సత్య కాలపు రోజులు, మరి ఇప్పుడో…..

(3.1.2013)