Wednesday 29 November 2023

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.

 

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.


సిల్క్ యారా దగ్గర నిర్మాణం లో ఉన్న సొరంగంలో ప్రమాదవశాత్తు 41 మంది శ్రామికులు చిక్కుకుపోయారు, 17 రోజులుగా.  నిన్న అర్ధరాత్రి బయటికొచ్చేరు,క్షేమంగా


ప్రమాదం జరిగినప్పటినుంచి చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు రాత్రిపవలు తేడా లేక ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. బయటనుంచి చిక్కుకుపోయినవారి దగ్గరికి ఒక ఒక మార్గం ఏర్పాటు చేయడం ఒక ప్రయత్నం. దీనికోసం పెద్దపెద్ద యంత్రాలని హుటాహుటిన తరలించడం జరిగింది. ఒక యంత్రం కొంత పనిచేసి పాడయింది.ఆ తరవాత మరొక పెద్దయంత్రం ఆ పని కొనసాగించి రిపేరుకి సాధ్యం కానంతగా పాడయింది. ఏర్పాటు చేస్తున్నదారి, చిక్కుకున్నవారి నుంచి పన్నెండు మీటర్ల దూరాన ఆగిపోయింది. అప్పుడు సనాతనమైన ఎలుక బొరియ విధానమే అక్కరకొచ్చి చివరి పన్నెండు మీటర్లు పద్దెనిమిది గంటలలోపున నిపుణులు పూర్తిచేసేరు. దానిలోకి స్టీల్ పైపుని అమర్చారు, మనిషిపట్టి   ప్పించుకోను వీలున్నదానిని. దాని ద్వారా లోపల చిక్కుకున్న శ్రామిక సోదరలంతా క్షేమంగా బయటకొచ్చేరు. శ్రామికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు పని చేసిన సంస్థలకి,ఆందుకోసం పని చేసిన వారందరికి జేజేలు! ఇక చిక్కుని ఉండిపోయిన శ్రామికులు నమ్మకం కోల్పోక ఉండి జయప్రదంగా బయటకు వచ్చినందులకు అభినందనలు. ప్రయత్నం సఫలం చేసిన భగవానునునికి నమస్కారాలు.


ఎలుకబొరియ విధాన తవ్వకం భారతదేశం లో నిషేధింపబడింది, కాని అదేవిధానం నేడు అక్కరకొచ్చింది..

పాతంతా రోతకాదు! కొత్త వింతాకాదు!! పాతకొత్త విధానాల మేళవింపు  అద్భుతఫలితాలిస్తుంది.

Sunday 26 November 2023

Friday 24 November 2023

చిలికి చిలికి గాలివానయినట్టు.

 చిలికి చిలికి గాలివానయినట్టు.

ఇది ఒక నానుడి. చిన్నదిగా ప్రారంభమయినది ఆ తరవాత ప్రళయంగా మారడానికి వాడుతుంటారు.  నిజానికిది చినుకు చినుకు గాలివానయిందన్నది అసలు స్వరూపం అనుకుంటా. చిన్నదిగా ప్రారంభమైన ది  ఆ తరవాత చూస్తుండగా పెద్ద గాలివానైనట్టు. ఈ మాటని, చిన్న చిన్నగా, సరదా సరదాగా, ప్రారభమైన తగువు, ఆతరవాత పెద్ద కొట్లాటగాను ఆ తరవాత యుద్ధమే ఐనట్ట్లు కూడా చెబుతుంటారు

ఊరలేనిదే పేర పిలవరు

ఇదొక నానుడి. ఊళ్ళో పుట్టి పెరిగినవాణ్ణి ఆ ఊళ్ళోవాళ్ళు ఏదో పేరుతో పిలుస్తుంటారు.ముద్దు పేరైనా కావచ్చు. చిన్నబాబు,కన్నబాబు,ఎంకన్నబాబు,కొండబాబు ఇలా. ఇవి అసలు పేర్లూ కావచ్చు ముద్దుపేర్లూ కావచ్చు. ఇదే మనిషి, ఎక్కువకాలం ఊళ్ళో ఉండక ఎప్పుడేనా ఊరికి  వెళితే, ఎవరుబాబూ మీరు? అనే అడుగుతారు. ఎందుకంటే ఎక్కువకాలం ఎవరూ ఎవరినీ గుర్తు పెట్టుకోరు, గుర్తుంచుకోలేరు, కారణం రూపురేఖలు మారిపోతాయి, కాలంతో. ఇది నాకు చాలా స్వానుభవం, పుట్టి పెరిగిన ఊరిలో. అంతెందుకు నా సహాధ్యాయి, ఒరే అంటే ఒరే అనుకున్న వాళ్ళం మా ఊళ్ళో అన్నయ్య ఎదురుగా కలిసేం. అతను ఆ రోజుకు గ్రామ ప్రెశిడెంట్, ఏదో విషయం మాట్లాడడానికి వచ్చేడు, అన్నయ్యతో. నేనూ, అతనూ కూడా పలకరించుకోలేదు, గుర్తు పట్టలేదు ఇద్దరమున్నూ. అప్పుడు అన్నయ్య ఇతనెవరో తెలుసా? అడిగారు, నన్ను. తెలీదని బుర్రూపాను, అతన్ని అడిగితే అతనూ అంతే చెప్పేడు. అప్పుడు అన్నయ్య చెప్పేడు ఇద్దరికిన్ని ఇతను నీ స్నేహితుడు పాపోలు నాగరాజు అని, వీడు నా తమ్ముడు శర్మ అని చెప్పడంతో ఒక్క సారి నిర్ఘాంతపోయాం. ఆ తరవాత ఇద్దరమూ మీరు,మీరు అంటూ మాటాడుకున్నాం. చాలా సేపటికిగాని ఒరే అంటే ఒరే అనుకోలేకపోయాం. చిత్రం కదా! ఇదే ఊరలేకపోతే పేర పిలవరన్నదానికి సాక్ష్యం.


ఆ తరవాత కాలంలో దీనికి మరోలా అన్వయం కూడా చెపుతున్నారు, నిప్పు లేనిది పొగరాదుగా! ఏదో లేనిది కేసులెందుకు పెడతార్లే, ఊరలేనిది పేర పిలుస్తారేంటిలే!!! 

Wednesday 22 November 2023

కొఱవితో తల గోక్కున్నట్టు


కొఱవితో తల గోక్కున్నట్టు

మండుతున్న కట్టెను కొఱవి అంటారు. దీనితో తలగోక్కుంటే ఏమవుతుంది? తల అంటుకుపోతుంది. కాలుతుంది. అనగా అనాలోచిత అవివేక చర్యగా చెబుతారు. తెలిసి,తెలిసి చేసేతప్పుగానూ చెబుతారు. 


సంచి లాభం చిల్లి కూడదీసినట్టు.

 సంచిని గోతం అని కూడా అంటారు. ఇప్పుడంటే 25కేజిలకి,50కెజిలకి,100కెజిలకి గోతాలున్నాయిగాని ఒకప్పుడు సంచి అంటే 100కెజిలు లేదా 24 కుంచాలు ధాన్యం పట్టే జనపనార సంచి అని వాడుక. గుడ్డ సంచిని చేతి సంచి అంటారు, ఇది చిన్నదిగా ఉంటుంది. పాతకాలంలో కొలతేగనక సంచి నిండాఅంటే 24 కుంచాలేనని వాడుక. ఈ సంచుల్ని మరలమరల వాడుతుంటే సాగిపోతాయి. 24 కుంచాలకంటే ఎక్కువ పడతాయి. ఒక వ్యాపారస్థుడు ఇలా సాగిపోయిన సంచి తీసుకుని రైతు దగ్గర ధాన్యం కొన్నాడు, ఇలా సాగిపోయిన సంచిలో నింపుకున్నాడు,ఎక్కువ ధాన్యం తెచ్చుకోవచ్చని ఆశకొద్దీ, లాభపడచ్చనుకుని. వాడకం ఎక్కువ కావడంతో అది చిల్లి పడింది, కాని ఇతను గమనించలేదు. ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాడు, ఇంటికొచ్చేటప్పటికి అవి కాస్తా24 కుంచాలే ఉన్నాయి, కొల్చుకుంటే. ఎక్కువ పట్టిన వడ్లు ఏమయ్యాయి,చిల్లిలోంచి దారిపొడుగునా కారిపోయాయి. లాభం వస్తుందనుకుని ఆశకు పోయి మోసం చెయ్యబోతే జరిగేదానికి ఈ మాట చెబుతారు. ఒక్కొకప్పుడు ఇలా చేస్తే నష్టం కూడా వస్తుందనీ అంటారు. 

ఈనగాచి నక్కలపాలు.

ఇది వ్యవసాయ సంబంధమైన నానుడి. పంట వేసిన దగ్గరనుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, కాపలా కూడా కావలసొస్తుంది కొన్ని పంటలకి. ఇలా పంటని వేసింది మొదలు జాగ్రత్తగా కాపాడుకొచ్చి, చివరి కాలానికి అనగా పంట ఫలించే సమయానికి అశ్రద్ధ చేస్తే పాడవుతుంది, శ్రమ,సొమ్ము, సమయం వృధా అవుతాయి. ఈ నానుడి ముఖ్యంగా చెఱకు పంటకు చెబుతారు. చెఱకు సిద్ధమయ్యే కాలానికి నక్కలు పాడు చేస్తాయి.ఆ సమయం లో కాపలా కూడా పెడతారు, పంట కాపాడుకోడానికి. ఫలసాయం చేతికొచ్చే సమయానికి అశ్రద్ధ చేయడాన్ని ఈ నానుడితో చెబుతారు. 


Friday 10 November 2023

మొలతాడు బిగిసింది.

 మొలతాడు బిగిసింది.


మొలతాడు బిగిసిందంటాం. మొలపెరిగిందనుకోం.  మొలతాడు చిక్కదు :) మనమే బలుస్తాం,ఎప్పుడో కట్టుకున్న మొలతాడిప్పుడెందుకు బిగుస్తుంది?మొల చుట్టుకొల్త పెరిగితేనేకదా!


సమస్య పట్టుకుని వదలటం లేదంటాం. సమస్యని మన మనసు పట్టుకుంది, తన చుట్టూ కట్టేసుకుంది. కాని సమస్య పట్టుకుంది వదలటం లేదంటాం.వదలవలసిందెవరు? మనమనసే. 

తననెవరో పట్టుకున్నారంటుంది, మరెవరో విడిపించాలనీ అనుకుంటుంది. చెబితే శానా ఉంది. 

అన్నిటికి మూలం మన మనసు.

ఇక చాలు.

సర్వే జనాః సుఖినోభవంతు.

.....స్వస్తి.....


Thursday 9 November 2023

కాస్త తాళుము కృష్ణా

  కాస్త తాళుము కృష్ణా



తలుపు తీయునంతలోనె
తత్తర మదియేల నోయి?
తలుపుదీతు వీలు జూచి
తాళుము కృష్ణా!
    కొంతసేపు
తాళుము కృష్ణా!
    పతి నిద్దుర వోవలేదు
    మతి సందియ మొందె నేమొ
    పతికి కునుకు పట్టగ లో
    పలకు వత్తుగాని తాళు
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!
నుదుట బొట్టు దిద్దలేదు
చెదరియున్న ముంగురులను
కుదురుజేయలేదు యేల
పదెపదె పిలచెదవురా
తాళుము కృష్ణా!
    కాస్తసేపు
తాళుము కృష్ణా!
    ఏల నంత తత్తరమ్ము
    ఏల నంత భయము, సామి
    నిన్నుగాక వేరొక్కని
    నెట్లు వలవగలను కృష్ణ!
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!


గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!
కోరి వండినానోయ్‌ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్‌ బావా!
    కోరికతో తినవోయ్‌ బావా!తియ్యని పాయసమోయ్‌ బావా!
తీరుగ వండానోయ్‌ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్‌ బావా!
    బాగని మెచ్చాలోయ్‌ బావా!కమ్మని పూరీలోయ్‌ బావా!
కర కర వేచానోయ్‌ బావా!
కరకర వేగిన పూరీలతో నా
కాంక్ష వేపినానోయ్‌ బావా!
    కనికరించి తినవోయ్‌ బావా!వెన్నెల యిదుగోనోయ్‌ బావా!
కన్నుల కింపౌనోయ్‌ బావా!
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న గలిపినానోయ్‌ బావా!
    వేగముగా రావోయ్‌ బావా!పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వుల బరిచిందోయ్‌ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా
పొదిపిపెట్టినానోయ్‌ బావా!
    పదవోయ్‌ పవళింతాం బావా!
బసవరాజు అప్పారావు గారి గేయం

Wednesday 8 November 2023

మాట విలువ

మాట విలువ  

 రామకృష్ణులు మఠంలో ఉండగా, ఒక తల్లి తనకొడుకుని తీసుకుని వచ్చి, ఈ కుర్రవాడు చిన్నవయసులోనే చెప్పినమాట వినటం లేదు, బెల్లం ఎక్కువ తింటున్నాడు , మీరు చెబితే వింటాడని మీదగ్గరకి తీసుకొచ్చానంది.


విన్న రామకృష్ణులు రేపురమ్మని వాయిదా వేసేరు. ఆ తల్లి కొడుకుని తీసుకుని మరునాడొచ్చింది. మళ్ళీ రేపురమ్మని వాయిదావేసేరు. ఇలా వాయిదాలమీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు, కాని కుర్రవానికి బెల్లం తినద్దని చెప్పటం లేదు. ఆ తల్లి పట్టువదలక తిరుగుతూనే ఉంది. చివరికి   నెలదాటిన తరవాత రామకృష్ణులు ఆ కుర్రవానితో, బెల్లం తినకు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేరు. అప్పుడు ఆ తల్లి రామకృష్ణులతో, ఈ మాట మీరు నెలకితమే చెప్పి ఉండచ్చుగా! అని అడిగింది. అంత రామకృష్ణులు తల్లీ! నెలకితందాకా నేనూ బెల్లం తింటున్నవాడినే. ఈ నెలలోనే నేను బెల్లం తినడం మానేసాను, ఆ తరవాతే చెప్పేను, అన్నారు. చిత్రంగా ఆ కుర్రవాడు ఆ   తరవాత బెల్లం మరి తినలేదు.


ఆచరించి చెప్పినమాటకంత విలువుంటుంది.

గాలివాటు మనుషుల మాటకి విలువుండదు.

Monday 6 November 2023

గతకాలపు వైభవ చిహ్నాలు.

 



Raleigh సైకిలు


LG TV

Post-Box


కల్వం,సన్నికల్లు,రుబ్బురోలు,కుందిరోలు


వస్తువుల్ని గుర్తు పట్టండి

అవసరం తీరేకా మానవులూ ఇంతే! ఐతే కొందరు గతకాలపు వైభవ చిహ్నాలుగా మిగిలిపోతారు, మరికొందరు కాలగర్భం లో నామరూపాలు లేక మలిగిపోతారు.

Sunday 5 November 2023

శిలాభిశ్చ ప్రహరతి

 శిలాభిశ్చ ప్రహరతి


నమోఽస్తు రామాయ స లక్ష్మణాయ

దేవ్యై చ తస్త్యె జనకాత్మ జాయై

నమోఽస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో

నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః


జయత్యతి బలోరామో

లక్ష్మణస్య మహాబలః

రాజా జయతి సుగ్రీవో

రాఘవేణాభి పాలితః


దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః

హనూమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః


న రావణ సహస్రం మే

యుద్ధే ప్రతిబలం భవేత్

శిలాభిశ్చ ప్రహరతి

పాదపైశ్చ సహస్రసః


అర్దయిత్వా పురీం లంకా

అభివాద్య చ మైథిలీమ్

సమృద్దార్ధో గమిష్యామి

మిషతాం సర్వ రక్షసామ్


అర్థసిద్ధిం తు వైదేహ్యాః

పశ్యామ్యహముపస్థితామ్

రాక్షసేంద్రవినాశం చ

విజయం రాఘవస్య చ


**********

రామరామ జయరాజారామ్

రామరామ జయసీతారామ్

Saturday 4 November 2023

దొంగని దొంగే పట్టాలి-1

 దొంగని దొంగే పట్టాలి...1


మొన్నీ మధ్యే ముల్లును ముల్లుతో తీయాలన్నదానికి ఒక కత చెప్పుకున్నాం. మరి దొంగని దొగే పట్టాలంటే! ఇదీ ఒక నానుడే. ఒక కత చెప్పుకుందాం.అలా ముందుకుపోదాం.


అనగనగా ఒక రాజ్యం, దానికోరాజు,ఒక మంత్రి.రాజ్యం ధనవంతమైనదే కాని పేదలే ఎక్కువ. ఆ రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి.రాజుకి తాకిడి ఎక్కువయ్యింది, దొంగతనాల గురించి. మంత్రిని నిలదీశాడు,రాజు. దానికి మంత్రి ''రాజా! కలిగినప్పుడు మాత్రమే దొంగతానాలెక్కువగా ఉంటాయి. లేనివాడింటికి కన్నమేసేటంత మూర్ఖుడు ఎవడూ ఉండడు. 'లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవు'. అంచేత మనదేశం ధనవంతమైనది, అందుకు సంతసించండి'', అన్నాడు మంత్రి.


రాజు,''దేశం ధనవంతమైనందుకు నిన్ను అభినందిస్తున్నాను. మన పరిపాలన  సవ్య దిశలో నడుస్తున్నట్టేగా! అది సరేగాని లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవన్నావు. అదేంటో చెప్పూ'', అన్నాడు.


వినండి, రాజా! మన దేశంలో ఒక పల్లెటూరు. అందులో ఒక జాయ,పతి. వయసులోనే ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ధనానికి లోటేమోగాని సంతానానికి లోటు లేదు, ఇంటి నిండా పిల్లలే! ఆ కుటుంబ యజమాని ధనం మాటెలా ఉన్నా పిల్లల్ని మాత్రం కనేసేడు, పదిమందిని. పూర్వులు సంపాదించి ఇచ్చిన కొంప పడిపోడానికి సిద్ధంగా ఉన్నదానిలో కాపరం. ఒక రోజు ఇంటి ఇల్లాలు పిల్లలికి కలిగినదేదో పెట్టి తను గంజితాగి పడుకుంది, ఉన్న ఒకే ఒక్కదీపాన్ని మలిపేసి.పిల్లలు తనూ కింద పడుకున్నారు. నడిరాత్రి ఒక దొంగ నెమ్మదిగా ఉతకలెత్తేసి తలుపులు తీశాడు. మెలుకువొచ్చిన ఇల్లాలు పడుకునే ఉంది. దొంగ ఇల్లంతా తిరిగేడు. చీకటి, ఎక్కడ చూసినా తలకి ఆనపకాయ బుర్రలేతగులుతున్నాయి. అవీ ఖాళీగా ఉన్నవే. ఇంక కాలికి పిల్లల పిర్రలే తగులుతున్నాయి, ఎటుతిరిగినా. ఏమీ విలువైనది దొరక్కపోతే దొంగ, ''ఎరక్కపోయి ఇంటికి కన్నం వేసాను, ఎటుచూసినా పైన బుర్రలు,కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకలేదని'' సణుక్కున్నాడు. విన్న ఇంటి ఇల్లాలు. 


''అన్నా!రాత్రి వేళ ఇంటికొచ్చావు. కనీసం గంజి కూడా లేదు, పోద్దామంటే! ముందు తలుపులెత్తేసేవు, దయ ఉంచి వెనక తలుపులు కూడా ఉతకలెత్తెయ్యి. వాటిని బాగుచేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా! వాటిని ఎత్తి బయటకు తీయలేక ఊరుకున్నా!'' అంది. విన్న దొంగ నిర్ఘాంతపోయాడు. ''చెల్లీ! దీపమేనా పెట్టుకోలేదే''మని అడిగాడు. 


''అన్నా! ఉన్నది ఒక్కదీపం అది రాత్రంతా వెలిగితే మర్నాడు వెలిగించుకోడానికుండదు'' ''బావగారు!......'' వాకబు చేశాడు దొంగ. ''పొరుగూళ్ళో ఉద్యోగానికెళ్ళేరు. ఉదయానికొస్తా''రంది. దొంగ చలించిపోయాడు, ఇంత దుర్భర దారిద్యం చూసి. దీపం వెలిగించమని, ఆపై ఆమె చెప్పిన పని చేసి పెట్టి, తన దగ్గరున్న సొమ్మును ఆమెకిచ్చి, దణ్ణం పెట్టి, ఇకపై దొంగతనం చేయనని కష్టపడి బతుకుతానని ఆమెకు మాటిచ్చి వెళ్ళేడు.


కతబాగుందిగాని అసలు సంగతి చెప్పండి, అడిగాడు రాజు. రాజా! విషయం రేపు చెబుతానని వాయిదా వేసాడు మంత్రి...

ఎదురు చూడక తప్పదుగా

Wednesday 1 November 2023

నడక నేర్చుకుంటున్నా!

 

 


నడక నేర్చుకుంటున్నా!

 ఓం సర్వవ్యాధి ప్రశమనీయైనమః


చిన్నప్పుడు నడక నేర్చుకున్నా! అమ్మ వెనకుండి నేర్పింది. మూణ్ణెల్లు మంచం మీదుంటే, నడక మరిచిపోయా! నడవడమంటే భయంగా ఉంది పడిపోతానేమోనని, మళ్ళీ ఎముక విరుగుతుందేమోనని,భయం. మళ్ళీ

ఓం దరహాసోజ్వలన్ముఖాయైనమః) అమ్మలగన్నయమ్మే నడక నేర్పిస్తోంది. మెల్లమెల్లగా అడుగులేస్తూ కఱ్ఱ బోటేసుకుని గ్రౌండు దాకా నడిచా! 


ఎందుకిన్ని తిప్పలు? హాయిగా పడుకోవచ్చుగా! నిజమే అలా మూడు నెలలు, కాలు విరిగి  బలవంతంగా పడుకుంటే, బద్ధకం ముందు పెరిగింది. ఆ పై సుగర్ పెరిగింది, బరువు పెరిగింది,BMI పెరిగింది.కనపడని బి.పి పెరిగింది.ఆకలి తగ్గింది.

సుగర్ డాక్టర్ నడిస్తేగాని సుగర్ తగ్గదు,బరువు తగ్గదు,బి.పి తగ్గదు, ఆకలిపుట్టదంటారు. ఎముకల డాక్టర్ పడుకునుంటేగాని కాలు సరిపడదంటారు. పిచ్చి కుదిరితే పెళ్ళికుదురుతుంది, పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది. ఏది ముందు? బలే లింకులేసేవయ్యా సామీ!అంతేలే కారణం లేనిది కార్యం జరగదని అంటారు. తీసుకుపోయేటందుకు, నెపం నీమీదుంచుకోవనీ అంటారు.

ఇంకా కొంతకాలం తిరిగే యోగం ఉన్నట్టే ఉంది, నడుస్తున్నా, నెమ్మదిగా, ధైర్యం వచ్చింది. :) 


పైవాడు బలే లింకు లేస్తాడు, తీయాలంటే అంత తేలిగ్గానే తీసేస్తాడు. అది పైవాని వల్లే ,అవుతుందిగాని మనవల్లగాదు. కాని మనం మాత్రం సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, ఇదీ కత.బయట లోకం అంతా కొత్తగా ఉంది, బ్లాగ్ లోకం వింతగా ఉంది  :)