Wednesday, 22 November 2023

కొఱవితో తల గోక్కున్నట్టు


కొఱవితో తల గోక్కున్నట్టు

మండుతున్న కట్టెను కొఱవి అంటారు. దీనితో తలగోక్కుంటే ఏమవుతుంది? తల అంటుకుపోతుంది. కాలుతుంది. అనగా అనాలోచిత అవివేక చర్యగా చెబుతారు. తెలిసి,తెలిసి చేసేతప్పుగానూ చెబుతారు. 


సంచి లాభం చిల్లి కూడదీసినట్టు.

 సంచిని గోతం అని కూడా అంటారు. ఇప్పుడంటే 25కేజిలకి,50కెజిలకి,100కెజిలకి గోతాలున్నాయిగాని ఒకప్పుడు సంచి అంటే 100కెజిలు లేదా 24 కుంచాలు ధాన్యం పట్టే జనపనార సంచి అని వాడుక. గుడ్డ సంచిని చేతి సంచి అంటారు, ఇది చిన్నదిగా ఉంటుంది. పాతకాలంలో కొలతేగనక సంచి నిండాఅంటే 24 కుంచాలేనని వాడుక. ఈ సంచుల్ని మరలమరల వాడుతుంటే సాగిపోతాయి. 24 కుంచాలకంటే ఎక్కువ పడతాయి. ఒక వ్యాపారస్థుడు ఇలా సాగిపోయిన సంచి తీసుకుని రైతు దగ్గర ధాన్యం కొన్నాడు, ఇలా సాగిపోయిన సంచిలో నింపుకున్నాడు,ఎక్కువ ధాన్యం తెచ్చుకోవచ్చని ఆశకొద్దీ, లాభపడచ్చనుకుని. వాడకం ఎక్కువ కావడంతో అది చిల్లి పడింది, కాని ఇతను గమనించలేదు. ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాడు, ఇంటికొచ్చేటప్పటికి అవి కాస్తా24 కుంచాలే ఉన్నాయి, కొల్చుకుంటే. ఎక్కువ పట్టిన వడ్లు ఏమయ్యాయి,చిల్లిలోంచి దారిపొడుగునా కారిపోయాయి. లాభం వస్తుందనుకుని ఆశకు పోయి మోసం చెయ్యబోతే జరిగేదానికి ఈ మాట చెబుతారు. ఒక్కొకప్పుడు ఇలా చేస్తే నష్టం కూడా వస్తుందనీ అంటారు. 

ఈనగాచి నక్కలపాలు.

ఇది వ్యవసాయ సంబంధమైన నానుడి. పంట వేసిన దగ్గరనుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, కాపలా కూడా కావలసొస్తుంది కొన్ని పంటలకి. ఇలా పంటని వేసింది మొదలు జాగ్రత్తగా కాపాడుకొచ్చి, చివరి కాలానికి అనగా పంట ఫలించే సమయానికి అశ్రద్ధ చేస్తే పాడవుతుంది, శ్రమ,సొమ్ము, సమయం వృధా అవుతాయి. ఈ నానుడి ముఖ్యంగా చెఱకు పంటకు చెబుతారు. చెఱకు సిద్ధమయ్యే కాలానికి నక్కలు పాడు చేస్తాయి.ఆ సమయం లో కాపలా కూడా పెడతారు, పంట కాపాడుకోడానికి. ఫలసాయం చేతికొచ్చే సమయానికి అశ్రద్ధ చేయడాన్ని ఈ నానుడితో చెబుతారు. 


10 comments:

  1. “బూడిదలో పోసిన పన్నీరు” అని కూడా ఒక నానుడి ఉన్నట్లుంది కదండి?

    ReplyDelete
    Replies
    1. ఏటిలో పిసికిన చింతపండు అని కూడా ఉందండి.

      Delete
    2. విన్నకోట నరసింహా రావు24 November 2023 at 14:50
      bonagiri24 November 2023 at 15:04
      రెండు నానుడుల అర్ధం ఒకటే కదండి.
      బూడిదలో పోసిన విలువైన పన్నీరు వ్యర్ధం.అలాగే ఏట్లో పిసికిన చింతపండూ వ్యర్ధమేగా :)

      Delete
  2. బూడిదలో పోసిన ప
    న్నీరను నా‌నుడియు తింత్రిణీ ఫలమును నా
    నీరమ్మున పిసికిన కత
    తీరు తమరు తెలిపిన కథ తెరగులొకటకో ?


    పని లేని .... పిల్లి బొచ్చు ....


    నారదా

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. “పిల్లి బొచ్చు ….” కాదండి, పిల్లి తల …. అన్నది సరైన సామెత, “జిలేబి” గారు😾.

      Delete
    2. పిల్లికి మాత్రం హెయిర్ స్టైల్ ఉండకూడదా?

      Delete
    3. -

      పిల్లికి మాత్రము హెయిరు స్ట
      యిల్లుండంగాను తప్పయినటులకో ? అ
      మ్మల్లార! అయ్యలారా
      పిల్లలు తిరు బోనగిరికి విశదించండీ!


      Delete
    4. Zilebi25 November 2023 at 06:13
      పిల్లితల ఏ రూపంలో ఉంటుందో. దాని నెత్తిన బొచ్చుంటుందో, దానికీ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో చెప్పగలదానివి నువ్వే! మరొకరినడుగనేల?

      Delete
  3. bonagiri24 November 2023 at 22:35
    బుజ్జమ్మే చెప్పగలదండి :)

    ReplyDelete
    Replies
    1. -
      బుజ్జమ్మేను తెలుపగల
      దుజ్జాయింపుగ బిడాలమునకు గలదకో
      గజ్జుగెలయు బొచ్చొ తలయొ!
      వజ్జల మాచన తెలివిడి వచ్చున మనకౌ :)



      Delete