చిలికి చిలికి గాలివానయినట్టు.
ఇది ఒక నానుడి. చిన్నదిగా ప్రారంభమయినది ఆ తరవాత ప్రళయంగా మారడానికి వాడుతుంటారు. నిజానికిది చినుకు చినుకు గాలివానయిందన్నది అసలు స్వరూపం అనుకుంటా. చిన్నదిగా ప్రారంభమైన ది ఆ తరవాత చూస్తుండగా పెద్ద గాలివానైనట్టు. ఈ మాటని, చిన్న చిన్నగా, సరదా సరదాగా, ప్రారభమైన తగువు, ఆతరవాత పెద్ద కొట్లాటగాను ఆ తరవాత యుద్ధమే ఐనట్ట్లు కూడా చెబుతుంటారు.
ఊరలేనిదే పేర పిలవరు
ఇదొక నానుడి. ఊళ్ళో పుట్టి పెరిగినవాణ్ణి ఆ ఊళ్ళోవాళ్ళు ఏదో పేరుతో పిలుస్తుంటారు.ముద్దు పేరైనా కావచ్చు. చిన్నబాబు,కన్నబాబు,ఎంకన్నబాబు,కొండబాబు ఇలా. ఇవి అసలు పేర్లూ కావచ్చు ముద్దుపేర్లూ కావచ్చు. ఇదే మనిషి, ఎక్కువకాలం ఊళ్ళో ఉండక ఎప్పుడేనా ఊరికి వెళితే, ఎవరుబాబూ మీరు? అనే అడుగుతారు. ఎందుకంటే ఎక్కువకాలం ఎవరూ ఎవరినీ గుర్తు పెట్టుకోరు, గుర్తుంచుకోలేరు, కారణం రూపురేఖలు మారిపోతాయి, కాలంతో. ఇది నాకు చాలా స్వానుభవం, పుట్టి పెరిగిన ఊరిలో. అంతెందుకు నా సహాధ్యాయి, ఒరే అంటే ఒరే అనుకున్న వాళ్ళం మా ఊళ్ళో అన్నయ్య ఎదురుగా కలిసేం. అతను ఆ రోజుకు గ్రామ ప్రెశిడెంట్, ఏదో విషయం మాట్లాడడానికి వచ్చేడు, అన్నయ్యతో. నేనూ, అతనూ కూడా పలకరించుకోలేదు, గుర్తు పట్టలేదు ఇద్దరమున్నూ. అప్పుడు అన్నయ్య ఇతనెవరో తెలుసా? అడిగారు, నన్ను. తెలీదని బుర్రూపాను, అతన్ని అడిగితే అతనూ అంతే చెప్పేడు. అప్పుడు అన్నయ్య చెప్పేడు ఇద్దరికిన్ని ఇతను నీ స్నేహితుడు పాపోలు నాగరాజు అని, వీడు నా తమ్ముడు శర్మ అని చెప్పడంతో ఒక్క సారి నిర్ఘాంతపోయాం. ఆ తరవాత ఇద్దరమూ మీరు,మీరు అంటూ మాటాడుకున్నాం. చాలా సేపటికిగాని ఒరే అంటే ఒరే అనుకోలేకపోయాం. చిత్రం కదా! ఇదే ఊరలేకపోతే పేర పిలవరన్నదానికి సాక్ష్యం.
ఆ తరవాత కాలంలో దీనికి మరోలా అన్వయం కూడా చెపుతున్నారు, నిప్పు లేనిది పొగరాదుగా! ఏదో లేనిది కేసులెందుకు పెడతార్లే, ఊరలేనిది పేర పిలుస్తారేంటిలే!!!
No comments:
Post a Comment