Thursday 10 September 2020

కరోన-ఏంతకాలం దాక్కోవడం?

కరోన-ఏంతకాలం దాక్కోవడం?





కరోన గురించి వార్తల కి కొదవ లేదు. ఒక దానికొకదానికి పొంతనా లేదు. చివరికి హు వారు శలవిచ్చిన మాట. కరోన ప్రభావం అందరి మీద ఒకలా ఉండదు, అది ఎవరి తత్త్వాన్ని బట్టి వారి మీద ప్రభావం చూపుతుందీ, అని. Is it to say  ''survival of the fittest?'' అంటే ఎవరి కర్మ వారిదే అని చెప్పకనే చెప్పినట్టుంది.ఎవరిని కదిలించినా జగ్రత్తలు తీసుకోండి అన్నమాటే!

ఉదయం పాలపేకట్లు నీళ్ళల్లో వేయించి, కడుక్కుని తీసుకుని సబ్బు అరిగేలా తోముకుని స్నానం చేస్తున్నాం. కూరగాయలొస్తే ఉప్పునీళ్ళలో తోమి ఎండబెట్టుకుని తీసుకుంటున్నాం. కిరాణా వగైరా ఏ సరుకైనా, ఏండలో ఎండబెట్టుకునే ముట్టుకుంటూవున్నాం. బయటికి అడుగెడితే మూ.ము గుడ్డ కట్టుకుంటున్నాం. కర్మంజాలక బయటికెళితే దూరదూరంగా ఉంటున్నాం,మనుషుల్ని చూసి భయపడుతున్నాం. ఇంటికొచ్చి బట్టలు మిషన్లో వేసి వేడి నీళ్ళుతో సబ్బు అరగతోమి స్నానం చేసి లోపలికొస్తున్నాం. ఎక్కడికీ వెళటం లేదు, ఎవరిని ఇంటికి రానివ్వటం లేదు. గేటు తాళమేసే ఉంటోంది, అవసరపడితే కాని తియ్యటమే లేదు. నడక పెరటిలోనే,సూర్యుణ్ణి మాత్రం చూస్తున్నాం. ఈ సూర్యుణ్ణి కూడా చూడలేని జీవాలెన్నో!

మగవాళ్ళకిదో కర్మ, నెలకొకసారైనా శిరోముండనం తప్పదు కదా! సెలూన్ కెళితే భయం, అక్కడో గుంపు. అందుకు ఇంటికే రప్పించుకున్నవాడిని డెట్టాల్ వగైరాలతో క్లీన్ చేసి అప్పుడు తలప్పజెపితే, ఏమో అదృష్టం ఎలా ఉందో, ఎవరు చెప్పగలరు?

నాకేంటి ఉక్కు ఉక్కు అన్నవాళ్ళు తుక్కు తుక్కు ఐపోతున్నారు.చిత్రం,మాయ, పెనుమాయ..నేనెవరో తెలుసా! మాకేంటి, డబ్బు,హోదా, డాక్టర్లు,  అని అనుకున్న ఇంటినుంచి ఆరుగురు గాయబ్, పదిరోజుల్లో.  నిన్నటిదాకా సందడి సందడిగా ఉన్న ఇల్లు ఈ వేళ నిశ్శబ్దం.పెద్దాళ్ళు, కలిగినవాళ్ళు,పిట్టల్లా రాలిపోతున్నారు, మాకేంటన్నవాళ్ళు మాటలేకపోతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కారణమంటే నమ్మలేకున్నారు. ఈ రోగనిరోధక శక్తి ఒక రోజులో రాదంటే కూడా నమ్మలేకున్నారు. అన్నీ మందులతోనే జరిగిపోతాయనే భ్రమలో ఉన్నారు.కొంతమంది భయంతో జారిపోతున్నారు, కొంతమంది నాకేంభయంలేదని మొరాయించి తిరిగి కరోనాలో చిక్కుకుని జారిపోతున్నారు. కొంతమంది కరోనాకి చిక్కి హాస్పిటల్ లో అల్లాడుతున్నారు, వీరి స్థితి మరీ ఘోరం.

ఇదింతేనయ్యా! మందులేదు, వేక్సిన్ రాదు. యోగముంటే బతకడం లేకపోతే చావడం అన్నవారొక మేధావి. మరొక మేధావి ఇదంతా ఉత్తిదే, పెట్టుబడిదారీ దేశాలాడుతున్న నాటకం. మిమ్మల్ని అందరిని పిచ్చాళ్ళని చేసి భయపెట్టి చంపుతున్నారన్నారు. పేరా సిటమాల్,చిన్న మందులు చాలయ్యా!కరోనా ఏం చెయ్యలేదు.ఏది నిజం? పరమాత్మా!హు వారు, ఇంతకంటే పెద్ద పెద్ద వ్యాధులకి మానవజాతి సిద్ధంగా ఉండాలని శలవిస్తున్నారు.

ఆరు నెలల నుంచి ఇంట్లో ఉంటూనే ఉన్నాం బయటికి కదల లేదు. ఇదెంత కాలం? తెలీటం లేదు. ఎక్కడో ఒక చోటికి కదలాలిగా తప్పదు.ఆరు నెలల కితం ఉన్న పాత రోగాలకైనా వైద్యం చేయించుకోవాలిగా!ఎంత మందులేసుకున్నా అవీ పెరుగుతాయిగాని తగ్గవు.

ఎక్కడ చూసినా గుంపులే, ఒక్క మందుకొట్టు దగ్గర మాత్రం క్యూ ఉంది. మందు తాగిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. :)  రోజూ క్యూలో వాళ్ళే కనపడుతున్నారట. గుంపు మనస్తత్త్వం, బానిస మనస్తత్వం, మన నరనరానా జీర్ణించుకుపోయిందనుకుంటా.  పోదనుకుంటా. క్యూ లో నిలబడ్డం అంటే మనకి చిన్నతనం, ఎవరో ఒకరు అదుపుచేస్తే క్యూలో నిలబడతాం.ఒకరికి ఒకరు తగలకుండా అసలు నిలబడలేం, తోసుకోకుండా ఉండలేం. డాక్టర్ని కలవడం తప్పించుకుంటున్నాం. వీడియో లో కలుస్తాం,సరే. మరి టెస్టులు తప్పవు కదా! అక్కడా గుంపులే.టెస్టులకి  పల్లెలలో మరీ చిరాకు. చెప్పుకుంటే అదో కత.వెనక నుయ్యి ముందు గొయ్యిలా వుంది రోజు, అలాగే ఉంది బతుకు.మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం, అది చెప్పినా వినేలా లేరు, జనం

భారతంలో ఇటువంటిదే ఒక కత చిన్నదే వినండి.

పరిక్షిత్తు రాజ్యం చేస్తున్నాడు. వేటకి వెళ్ళేడు. దాహమేసింది. పరిశీలిస్తే ఒక ముని ధ్యానం లో కనపడ్డాడు. దగ్గరకెళ్ళి మంచినీళ్ళడిగాడు. మునిలో చలనం లేదు. రాజుకి కోపమొచ్చి అశక్త దుర్జనత్వంతో పక్కనే చచ్చి పడి ఉన్న పామును ఆ ముని మెడలో వేసి వెళ్ళేడు. ముని కొడుకొచ్చి చూసి, విషయం తెలుసుకుని,  కోపించి శపించాడు, ఈ పని చేసినవాడు తక్షకుని కాటుతో మరణిస్తాడని. ముని ధ్యానం నుంచి బయటికొచ్చి విషయం తెలుసుకుని కొడుకును మందలించి విషయం రాజుకు శిష్యుల ద్వారా చేరవేసేడు.రాజు రక్షణ కోసం ఒంటి స్థంభం మేడలోకి చేరిపోయాడు. చీమ దోమ కూడా లోపలికి రాలేని కట్టుదిట్టం చేసుకున్నాడు.తక్షకుడు బయలుదేరేడు,కాటుకి. భద్రత చూస్తే అబ్బో భయమేసింది, చీమ కూడా లోపలికిపోలేదు, మరి దోమ ఎగిరి కూడాలోపలికి పోలేదు.లోపలికి చేరడం ఎలాగబ్బా,ఆలోచించాడు. ''ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని'' సామెత కదా! రాజుకోసం వెళ్ళే సాపాటుతో లోపలికి చేరలేమా అని ఆలోచించాడు. అబ్బే మెతుకు మెతుకు పట్టి చూసి మరీ పంపుతున్నారు లోపలికి. పళ్ళు కూడా వెడుతునాయి, లోపలికి. చూశాడు, నెమ్మదిగా చిన్న పురుగుగా ఒక పండులో ప్రవేశించాడు. పైకి చూడడానికి పండు బాగానే ఉంది, పరిక్ష చేసి లోపలికి పంపేరు. లోపలికి చేరిపోయాడు తక్షకుడు,చేరలేననుకున్న ఒంటి స్థంభం మేడలో రాజు దగ్గరికి. రాజు పండు కోశాడు, తక్షకుడు బయటి కొచ్చాడు, క్షణాల్లో పెరిగాడు, రాజు అరిచేలోపు కాటేశాడు, పనైపోయింది. అంతే! 
శ్రీమద్రమారమణగోవిందో హరి 

రాజు తప్పించుకోగలిగాడా? మనమెంత?కొంత కాలం తప్పించుకోగలమేమో! అంతే.

కొసమాట:-కరోన చాలా మందినే చేరుతోందిగాని మరణాలు తక్కువేననిపిస్తూ ఉంది.ఆశాజీవులం.

Tuesday 8 September 2020

మొక్క భయపెడుతోంది.



మొక్క భయపెడుతోంది.

అవి స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజులు. దేశంలో ప్రజలకి తగు ఆహారం లేదు. అమెరికాని సాయమడిగింది, భారత దేశం. పి.ఎల్.480 కింద అమెరికా మనకు గోధుమలు సప్లయి చేసింది.వాటితో పాటు తెలిసో తెలియకో కొన్ని మరోరకం విత్తనాలూ చేరిపోయాయి, మనదేశం. అ విత్తనాలనుంచి వచ్చిన మొక్కే పార్థీనియం( parthinium ) https://en.wikipedia.org/wiki/Parthenium అనే కాంగ్రెస్ గడ్డి. ఇది దేశం అంతా పాకిపోయింది.ఇది కలుపు మొక్క. పశువులుగాని,చివరికి మేక కూడా దీనిని ముట్టుకోదు. దీనిని ముట్టుకుంటే ఒళ్ళు దద్దుర్లొస్తాయి, ఎక్కువగా సోకితే అనేక వ్యాధులు కూడా వస్తాయి. దీనిని వదిలించుకోవాలంటే అందరు ఒక సారిగా పీకి దీనిని తగలబెట్టాలి. సాధ్యం కాలేదు. 

ప్రస్తుతం అమెరికా ఈరకం చిక్కుల్లో ఉన్నట్టుంది.చైనా నుంచి అమెరికాలో కొంతమందికి పార్చెళ్ళు వస్తున్నాయి, టపాలో. అవి వారు కోరినవీ కావు. వాటిని విప్పి చూస్తే కొన్ని విత్తనాలు కనపడుతున్నాయి,
అవి ఏ విత్తనాలో తెలీదు. అమెరికా ప్రభుత్వం మేలుకుంది. లింక్ లో చూడండి. విత్తనాలు నాటద్దని ప్రజలకు చెబుతోంది.
https://www.foxnews.com/us/virginia-utah-unsolicited-seeds-china
ఇక ముందు యుద్ధాలు ఇలాగే ఉండబోతాయా కరోన మొదలా?

మరో చిత్రమైన వార్త, అమెరికాలోని ఒక జూ లో కోతులు కత్తులు,చైన్లు,స్క్రూ డ్రైవర్లు పట్టుకు తిరుగుతున్నాయిట. చూడ్డానికి వెళ్ళన వారి కార్ల మీద దాడి చేస్తున్నాయట.లింక్ మిస్సయ్యాను,మీకెవరికైనా దొరికితే పెట్టండి.

Monday 7 September 2020

కానున్నది కాకమానదు.

 

అత్తా! అత్తా!!


ఎవరదీ? లలితా! రా! రా!! ఈవేళప్పుడొచ్చావ్, కాలేజీ లేదూ?చదువెలా సాగుతోంది? ప్రశ్నించింది సావిత్రమ్మ.


నాచదువుకేం అత్తా! బాగానే సాగుతోంది. ఇటువంటి వేళయితే నీతో తీరుబడిగా మాట్టాడటానికి కుదురుతుందని, కాలేజి డుమా కొట్టేసేను. 


ఎవరే అదీ? పక్కగదిలోంచి ప్రశ్నించింది, సావిత్రమ్మ అత్తగారు.


మన పక్కింటి వాళ్ళమ్మాయి లలిత. సమాధానమిచ్చింది సావిత్రమ్మ.


దా కూచో! నాతో అంత ప్రత్యేకంగా మాటాడే రాచకార్యం ఏంటే?


అత్తా! డొంకతిరుళ్ళొద్దుగాని,నీ పెద్దకొడుకు ఆగేలా లేడు, మీద మీద పడుతున్నాడు,నాకూ ఆగాలని లేదు, పెళ్ళి చేసుకునే దాకా ఆగుదామన్నా వినేలా లేడు, అని ఆగింది.


అయ్యో! అయ్యొ!! అవేం పనులే! నీకు సిగ్గు లేదుటే? పరువు మర్యాద లేదుటే?


అత్తా! పెళ్ళి చేసి నీ కొడుకునూ నన్నూ గదిలోకి పంపి నువ్వు తలుపులేస్తే పరువు మర్యాద. పెళ్ళి కాకుండానే నీ కొడుకు నన్ను గదిలోకి తీసుకుపోయి తలుపులేస్తే మర్యాద అవుతుందా?


ఇంతకీ ఏంటంటావ్?


నాలుగు రోజుల్లో ప్రేమ సమాజంలో నాకు నీ పెద్ద కొడుక్కీ పెళ్ళి. చెప్పిపోదామని వచ్చా!


ఎంతకి తెగించేవే!కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఎగరేసుకుపోతావుటే?


అత్తా! అవసరం నాది, రేపు నీ కొడుకు దులుపుకుని వెళితే, నాకు కడుపో కాలో వస్తే, భరించేది నేనేగా! అందుకే ఈ జాగర్త. ఎర్రగా బుర్రగా ఉన్నాడని కదూ అంటున్నావు. ఏముంది నీ కొడుకు దగ్గర? చదువా?  డిగ్రీలో రెండు సబ్జక్టులు తన్నేసేడు, తెలివా? కిరాణా చీటీ కూడా తిన్నగా తప్పులు లేకుండా రాయలేడు. మొన్న చీటిలో వెల్లుల్లి రాయమంటే వెళ్ళుళ్ళి అని రాశాడు. ఇక డబ్బా! ఇది అయ్యవార్లంగారి నట్టిల్లని తెలుసు. ఇంక ఎగరేసుకుపోడానికేం ఉంది?


అంత పనికి రానివాడెందుకే నీకూ?

మంచి ప్రశ్న వేసేవత్తా! నిజమే పిచ్చిదాన్ని, పడిపోయా! తన ప్రేమలో.


పెళ్ళి చేసుకుంటే ఏం తిని బతుకుతారే?

ఈ మాత్రం చదువులకి ఇక్కడేం గొప్ప ఉద్యోగాలు రావు. నీ కొడుకేం సైంటిస్ట్ కాడు. నాకైతే జీవితం మీద ఒక ప్లాన్ ఉంది. పల్లెటూరుకి పోయి, కూలీ చేసుకు బతుకుతాం.


సినిమాలు చూసి చెడిపోయారే!

నీ కొడుకే కూలీ నెంబర్.1, అనీ ముఠామేస్త్రీ ననీ అనుకుంటూ ఉంటాడు.


పెళ్ళి ఆగదుటే?

నీ చేతనైతే ఆపు.నేను పిలిస్తే నీకొడుకు కుక్కపిల్లలా తోక ఊపుకుంటూ వస్తాడు.నువ్వు బలవంతంగా ఆపితే పోలీసులొచ్చి తీసుకొస్తారు,నీ కొడుకుని. నా వెనక పడ్తుంటే, మీద పడుతుంటే,నీకు చెప్పినప్పుడు నువ్వు ఆపగలిగేవా? ఇప్పుడాపగలగడానికి, అంటూ, వస్తానత్తా! అని లేచి వెళ్ళింది.


పక్క గదిలోంచి బయటికొచ్చిన సావిత్రమ్మ అత్తగారు. ఏంటే అదీ అడిగింది. 


చెప్పడానికేముందీ, మీ మనవడి నిరవాకం, అంది చేతులు తిప్పుకుంటూ, సావిత్రమ్మ. 


అయ్యో! అయ్యొ!! ఎంతన్యాయం, ఎంతన్యాయం.వాడికేమే మగ మహరాజు. ఆడపిల్లలు బరి తెగించేస్తున్నారే! నువ్వేంటి దానికి సమాధానం చెప్పక నసుగుతావూ?


వాడికేం మగమహరాజని వెనకేసుకొచ్చే ఇలా కొంప మీదకి తెచ్చేరు.నా పెళ్ళయి పాతికేళ్ళయింది. ఏ విషయంలోనూ, నీకేం తెలీదు, నీకేం తెలీదూ అంటూ మీరూ,మీ కొడుకూ నా నోరు నొక్కేసేరుగా! ఇప్పుడు నేను నసుగుతున్నాననడమేం?


ఏమవుతుందంటావే?


ఏమో నాకు మాత్రం ఏo తెలుసూ! అది చెప్పిందిగా నాలుగు రోజుల్లో పెళ్ళీ అని. కానున్నది కాక మానదు! అని ముక్కు చీదుతూ పెరట్లోకెళ్ళింది సావిత్రమ్మ. 



Sunday 6 September 2020

కృష్ణార్పణం

  ఏదైనా భగవంతునికి సమర్పించి, నమస్కరించి అనుభవించడం భారతీయులకి అలవాటు. దీనినే కృష్ణార్పణం అంటారు లేదా కైంకర్యం చేయడం అంటారు. నేటి కాలంలో కృష్ణార్పణం అంటే పోగొట్టుకోవడమనీ, కైంకర్యం చేయడమంటే దొంగిలించడమనీ రూఢి అర్ధాలు చెప్పేస్తున్నారు. గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం అనే నానుడి ఒకటి ఉంది. ఏమది? ఒక చిన్న కత, అవధరించండి.


ఒకపల్లెలో ఒక ముసలమ్మ, పళ్ళూడిపోయాయి. నమలలేదు కనక ఏం తిన్నా అరగదు. అందుకు పేలాలు తినడం మొదలు పెట్టింది. పేలాలు అంటే పాత ధాన్యంతో చేస్తారు. అటుకులు కొత్త ధాన్యంతో చేస్తారు. పేలాలు వేరు,అటుకులు వేరు. వీటి గురించి ఇదివరలోనే చెప్పేనుగనక మళ్ళీ చెప్పను. పాండిందే పాటరా పాచి పళ్ళ దాసరీ అన్నట్టు. పాలలోనో పెరుగులోనో కలుపుకున్నా పేలాలని చప్పరించక తప్పటం లెదు. అందుకు పేలాలని పిండి చేసుకుంది.ఈ పిండిని పాలలో కలుపుకుని భగవంతునికి అర్పించి కృష్ణార్పణం చేసి తను తీసుకుంటూ వచ్చింది. ఒక రోజు ఇలా తయారు చేసుకున్న పేలపిండిని ఎండలో పెట్టి కాపలా కూచుంది. ఇంతలో ఒక సుడిగాలి వచ్చి ఆ పేల పిండి మొత్తాన్ని ఎత్తుకుపోయింది. ఏం చేయాలో ముసలమ్మకి తోచలేదు. అయ్యో! కృష్ణార్పణ చేయలేకపోయానే అని బాధ పడింది. ఈ పేలాలూ భగవంతుడే ఇచ్చాడు, ఈ సుడిగాలీ భగవంతుని రూపమే. ఆయనే ఇచ్చి ఆయనే తీసుకెళితే మధ్యలో నేనెందుకు బాధ పడాలి? అనుకుని తూర్పుకు తిరిగి ఒక నమస్కారం చేస్తూ గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం అని నమస్కారం చేసి ఉపవాసం ఉంది. 


మన చేతిలో లేనిదాని గురించి బాధ పడేకంటే కృష్ణార్పణం అని అనుకుని భగవంతునికి అర్పించేస్తే చాలుగా.


సందర్భం ఏంటో? ఒక బ్లాగును ముచ్చటపడి మొదలుపెట్టా దగ్గరగా తొమ్మిదేళ్ళ కితం. ఆ బ్లాగంటే నాకిష్టం, మమత, ఎందుకు? చెప్పలేను, అంతే! నాలుగు నెలలకితం అది నా చేతి పరిధి దాటిపోయింది.ప్రయత్నం చేశా నా వలన కాలేదు. అందుకే కృష్ణార్పణ చేశా, అంటే సమాజానికే వదిలేశా.  







Thursday 3 September 2020

చింతచిగురు పప్పు.

చింతచిగురు పప్పు.

చింతచిగురు,షీకాయ చెట్టు చిగురించే కాలం. షీకాయ చెట్టుకు ముళ్ళుంటాయి. చిటారు కొమ్మన ఉన్న చిగురు కోయడం తేలికేం కాదు. ఆ చిగిరు పప్పులో వేసుకుంటారు. బలే రుచి. :)

చింత చిగురు/షీకాయాకు చిగురు మెత్తగా నలిపేయండి, అరచేతులతో. స్టీలు గిన్నెలో వేసి తగిన పప్పు వేయండి కొద్దిగా పసుపేయండి. పప్పు ఉడికేదాకా ఉడకపెట్టండి. ఇది జారుగానూ చేసుకోవచ్చు,పొడిగానూ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఉడికిన తరవాత పోపు పెట్టండి, కావాలనుకుంటే ఇంగువ ముక్క వేసుకోండి, పోపులో. వెల్లుల్లి వేసుకుంటే అదుర్స్. షీకాయాకు పప్పు ఇలాగే వేసుకుంటారు,షీకాయాకు, చింత చిగురు కూడా పచ్చళ్ళుగా చేసుకుంటారు. షీకాయ ఆకు పచ్చడి నోరు రుచి లేనివారికి అనగా జ్వరపడి లేచినవారికి మంచి మందు అంటారు.

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా
!

Tuesday 1 September 2020

రామ నామ తారకం


రామ నామ తారకం
భక్తి ముక్తి దాయకం
జానకీ మనోహరం
సకల్లోక నాయకం

శంకరాది శ్రవ్యమాన 
పుణ్య దివ్య  నామ కీర్తనం

తారంగం తారంగం
తాండవ కృష్ణ తారంగం
వేణూ నాదా తారంగం
వెంకట రమణా తారంగం

హరి యను రెండక్షరములు  
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరియని బొగడంగ వశమె హరి శ్రీకృష్ణా