Thursday 10 September 2020

కరోన-ఏంతకాలం దాక్కోవడం?

కరోన-ఏంతకాలం దాక్కోవడం?





కరోన గురించి వార్తల కి కొదవ లేదు. ఒక దానికొకదానికి పొంతనా లేదు. చివరికి హు వారు శలవిచ్చిన మాట. కరోన ప్రభావం అందరి మీద ఒకలా ఉండదు, అది ఎవరి తత్త్వాన్ని బట్టి వారి మీద ప్రభావం చూపుతుందీ, అని. Is it to say  ''survival of the fittest?'' అంటే ఎవరి కర్మ వారిదే అని చెప్పకనే చెప్పినట్టుంది.ఎవరిని కదిలించినా జగ్రత్తలు తీసుకోండి అన్నమాటే!

ఉదయం పాలపేకట్లు నీళ్ళల్లో వేయించి, కడుక్కుని తీసుకుని సబ్బు అరిగేలా తోముకుని స్నానం చేస్తున్నాం. కూరగాయలొస్తే ఉప్పునీళ్ళలో తోమి ఎండబెట్టుకుని తీసుకుంటున్నాం. కిరాణా వగైరా ఏ సరుకైనా, ఏండలో ఎండబెట్టుకునే ముట్టుకుంటూవున్నాం. బయటికి అడుగెడితే మూ.ము గుడ్డ కట్టుకుంటున్నాం. కర్మంజాలక బయటికెళితే దూరదూరంగా ఉంటున్నాం,మనుషుల్ని చూసి భయపడుతున్నాం. ఇంటికొచ్చి బట్టలు మిషన్లో వేసి వేడి నీళ్ళుతో సబ్బు అరగతోమి స్నానం చేసి లోపలికొస్తున్నాం. ఎక్కడికీ వెళటం లేదు, ఎవరిని ఇంటికి రానివ్వటం లేదు. గేటు తాళమేసే ఉంటోంది, అవసరపడితే కాని తియ్యటమే లేదు. నడక పెరటిలోనే,సూర్యుణ్ణి మాత్రం చూస్తున్నాం. ఈ సూర్యుణ్ణి కూడా చూడలేని జీవాలెన్నో!

మగవాళ్ళకిదో కర్మ, నెలకొకసారైనా శిరోముండనం తప్పదు కదా! సెలూన్ కెళితే భయం, అక్కడో గుంపు. అందుకు ఇంటికే రప్పించుకున్నవాడిని డెట్టాల్ వగైరాలతో క్లీన్ చేసి అప్పుడు తలప్పజెపితే, ఏమో అదృష్టం ఎలా ఉందో, ఎవరు చెప్పగలరు?

నాకేంటి ఉక్కు ఉక్కు అన్నవాళ్ళు తుక్కు తుక్కు ఐపోతున్నారు.చిత్రం,మాయ, పెనుమాయ..నేనెవరో తెలుసా! మాకేంటి, డబ్బు,హోదా, డాక్టర్లు,  అని అనుకున్న ఇంటినుంచి ఆరుగురు గాయబ్, పదిరోజుల్లో.  నిన్నటిదాకా సందడి సందడిగా ఉన్న ఇల్లు ఈ వేళ నిశ్శబ్దం.పెద్దాళ్ళు, కలిగినవాళ్ళు,పిట్టల్లా రాలిపోతున్నారు, మాకేంటన్నవాళ్ళు మాటలేకపోతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కారణమంటే నమ్మలేకున్నారు. ఈ రోగనిరోధక శక్తి ఒక రోజులో రాదంటే కూడా నమ్మలేకున్నారు. అన్నీ మందులతోనే జరిగిపోతాయనే భ్రమలో ఉన్నారు.కొంతమంది భయంతో జారిపోతున్నారు, కొంతమంది నాకేంభయంలేదని మొరాయించి తిరిగి కరోనాలో చిక్కుకుని జారిపోతున్నారు. కొంతమంది కరోనాకి చిక్కి హాస్పిటల్ లో అల్లాడుతున్నారు, వీరి స్థితి మరీ ఘోరం.

ఇదింతేనయ్యా! మందులేదు, వేక్సిన్ రాదు. యోగముంటే బతకడం లేకపోతే చావడం అన్నవారొక మేధావి. మరొక మేధావి ఇదంతా ఉత్తిదే, పెట్టుబడిదారీ దేశాలాడుతున్న నాటకం. మిమ్మల్ని అందరిని పిచ్చాళ్ళని చేసి భయపెట్టి చంపుతున్నారన్నారు. పేరా సిటమాల్,చిన్న మందులు చాలయ్యా!కరోనా ఏం చెయ్యలేదు.ఏది నిజం? పరమాత్మా!హు వారు, ఇంతకంటే పెద్ద పెద్ద వ్యాధులకి మానవజాతి సిద్ధంగా ఉండాలని శలవిస్తున్నారు.

ఆరు నెలల నుంచి ఇంట్లో ఉంటూనే ఉన్నాం బయటికి కదల లేదు. ఇదెంత కాలం? తెలీటం లేదు. ఎక్కడో ఒక చోటికి కదలాలిగా తప్పదు.ఆరు నెలల కితం ఉన్న పాత రోగాలకైనా వైద్యం చేయించుకోవాలిగా!ఎంత మందులేసుకున్నా అవీ పెరుగుతాయిగాని తగ్గవు.

ఎక్కడ చూసినా గుంపులే, ఒక్క మందుకొట్టు దగ్గర మాత్రం క్యూ ఉంది. మందు తాగిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. :)  రోజూ క్యూలో వాళ్ళే కనపడుతున్నారట. గుంపు మనస్తత్త్వం, బానిస మనస్తత్వం, మన నరనరానా జీర్ణించుకుపోయిందనుకుంటా.  పోదనుకుంటా. క్యూ లో నిలబడ్డం అంటే మనకి చిన్నతనం, ఎవరో ఒకరు అదుపుచేస్తే క్యూలో నిలబడతాం.ఒకరికి ఒకరు తగలకుండా అసలు నిలబడలేం, తోసుకోకుండా ఉండలేం. డాక్టర్ని కలవడం తప్పించుకుంటున్నాం. వీడియో లో కలుస్తాం,సరే. మరి టెస్టులు తప్పవు కదా! అక్కడా గుంపులే.టెస్టులకి  పల్లెలలో మరీ చిరాకు. చెప్పుకుంటే అదో కత.వెనక నుయ్యి ముందు గొయ్యిలా వుంది రోజు, అలాగే ఉంది బతుకు.మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం, అది చెప్పినా వినేలా లేరు, జనం

భారతంలో ఇటువంటిదే ఒక కత చిన్నదే వినండి.

పరిక్షిత్తు రాజ్యం చేస్తున్నాడు. వేటకి వెళ్ళేడు. దాహమేసింది. పరిశీలిస్తే ఒక ముని ధ్యానం లో కనపడ్డాడు. దగ్గరకెళ్ళి మంచినీళ్ళడిగాడు. మునిలో చలనం లేదు. రాజుకి కోపమొచ్చి అశక్త దుర్జనత్వంతో పక్కనే చచ్చి పడి ఉన్న పామును ఆ ముని మెడలో వేసి వెళ్ళేడు. ముని కొడుకొచ్చి చూసి, విషయం తెలుసుకుని,  కోపించి శపించాడు, ఈ పని చేసినవాడు తక్షకుని కాటుతో మరణిస్తాడని. ముని ధ్యానం నుంచి బయటికొచ్చి విషయం తెలుసుకుని కొడుకును మందలించి విషయం రాజుకు శిష్యుల ద్వారా చేరవేసేడు.రాజు రక్షణ కోసం ఒంటి స్థంభం మేడలోకి చేరిపోయాడు. చీమ దోమ కూడా లోపలికి రాలేని కట్టుదిట్టం చేసుకున్నాడు.తక్షకుడు బయలుదేరేడు,కాటుకి. భద్రత చూస్తే అబ్బో భయమేసింది, చీమ కూడా లోపలికిపోలేదు, మరి దోమ ఎగిరి కూడాలోపలికి పోలేదు.లోపలికి చేరడం ఎలాగబ్బా,ఆలోచించాడు. ''ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని'' సామెత కదా! రాజుకోసం వెళ్ళే సాపాటుతో లోపలికి చేరలేమా అని ఆలోచించాడు. అబ్బే మెతుకు మెతుకు పట్టి చూసి మరీ పంపుతున్నారు లోపలికి. పళ్ళు కూడా వెడుతునాయి, లోపలికి. చూశాడు, నెమ్మదిగా చిన్న పురుగుగా ఒక పండులో ప్రవేశించాడు. పైకి చూడడానికి పండు బాగానే ఉంది, పరిక్ష చేసి లోపలికి పంపేరు. లోపలికి చేరిపోయాడు తక్షకుడు,చేరలేననుకున్న ఒంటి స్థంభం మేడలో రాజు దగ్గరికి. రాజు పండు కోశాడు, తక్షకుడు బయటి కొచ్చాడు, క్షణాల్లో పెరిగాడు, రాజు అరిచేలోపు కాటేశాడు, పనైపోయింది. అంతే! 
శ్రీమద్రమారమణగోవిందో హరి 

రాజు తప్పించుకోగలిగాడా? మనమెంత?కొంత కాలం తప్పించుకోగలమేమో! అంతే.

కొసమాట:-కరోన చాలా మందినే చేరుతోందిగాని మరణాలు తక్కువేననిపిస్తూ ఉంది.ఆశాజీవులం.

18 comments:

  1. భూమి మీద ప్రతి ఒక్కరికి కొన్ని మెతుకులపై వాటిని తిని బ్రతికే యోగం ఉంటుందంటారు ఆచార్య.. ఆ మెతుకులు మనకు సర్వసాధారణంగా పలు రకాలుగా మన దరికి చేరుతాయట.. పిండిగానో, నూకలుగానో, మరే ఇతర రూపం లోనో.. ఆ మెతుకులు గత జన్మ లో మనం చేసిన పుణ్యాలకు లోబడి, ఈ జన్మ లో మన కర్మలకు ఆధీనమై ఉంటాయట.. అవి ఏదో ఒక నాడు చెల్లిపోతాయి.. అపటిదాక ఈ శరిరానికి ఎన్ని రుగ్మతులు చుట్టుముట్టినా కోలుకుంటారు.. లేని పక్షాన శ్రీమద్రమారమణగోవిందో హరి..

    మీరు వివరించిన పరీక్షిత్తు కథ లాటిదే మరోకటి:
    ఒకానొక ఊరిలో ఓ ఆసామి.. గాదెల నిండ ధాన్యం.. ఖజానా నిండుగా ధనం.. అజాతశత్రువు.. కాని ఒకసారి అతనికొక కల వస్తుంది.. ఆ కలలో.. నీవు ఊపిరి పీల్చుకున్న మరుక్షణమే గతిస్తావని సారాంశం.. కాని అతను కిమ్మనలేదు.. రోజు పీల్చుకుంటునపుడే ఏమీ కాలేదు.. ఇపుడేమైతదని అనుకున్నాడు.. తనకి తెలిసిన ఫాం హౌస్ లో మకాం మార్చాడు.. అంతే.. అక్కడ ఎక్కడో ఏదో కెమికల్ డబ్బ.. పుసుక్కున ప్రెషరెక్కువై ధనేల్ మంది.. వాయువులో కలసి పోయింది.. ఆతను పీల్చుకున్నాడు.. ఠా..!
    మరొకటి
    సమవర్తి ఇంద్ర సభకంటు బయలు దేరుతారు, మార్గ మధ్యలో గరుడు కనిపిస్తాడు.. సమవర్తి ఆ గరుడి పక్కన ఉన్న ఒక చిన్న పక్షిని ఆశ్చర్యంగా చూడటం గమనిస్తాడు.. అరే.. సమవర్తి ఏమిటిలా చూశాడు.. అంటే ఆపద ఉందేమో అంటు ఆ పక్షిని అక్కడ నుండి కనుమలలో ఒక చెట్టు కొమ్మపై గూడు కింద బీలం లో దాచి వస్తాడు గరుడు. ఇంతలో సమావేశం పూర్తి గావించి సమవర్తి అటుగా వస్తాడు.. అపుడు గరుడు అడుగుతాడు.. ఏమిటి స్వామి ఇందాక ఆ పక్షి వంక అదోలా చూశారేమని.. ఐతే సమవర్తి ఇలా వివరిస్తారు: అదే.. ఆ పక్షిని చూస్తే చాలా చిన్నదిగా ఉంది.. రెక్కలు సైతం అంత బలంగా లేవు మరి ఈ అరగంటలోనే వేయి యోజనాల దూరం ఎగురుకుంటు వెళ్ళి కనుమలలో చెట్టు కింది బీలం లో మృత్యువాత ఎలా సాధ్యమవుతుందనే అలా చూశానంటారు సమవర్తి.. ఈ వార్త విని ఎగురుకుంటు అక్కడికెళ్తే నిజంగానే ఆ బీలం లో ఆ పక్షి ఢాం..

    మార్కడేయుని కథ సైతం అటువంటిదే కదా శర్మాచార్య.. కాకపోతే.. వీటిలో మనం గ్రహించాల్సిన నీతి.. ఎవరికి ఎంత కాలం రాసి పెట్టి ఉంటుందో వారికి అంత కాలమే దక్కుతుంది..

    ~జై సాయి దేవ~
    ~శ్రీ

    ReplyDelete
    Replies

    1. दानॆ दानॆ पर लिखाहै खानॆवालॆ का नाम
      .ये तॊ सही
      నూకలు చెల్లిపోయినవాళ్ళే వెళ్ళిపోతారు. ఇదీ నిజమే.

      ఉన్నవాళ్ళకే ఈ తిరుగుళ్ళన్నీ
      మీరు మరీ ఆశాజీవులు. గుర్రం ఎగరచ్చు అనుకోవాలిగాని మరీనా! ఇది బాక్టీరియానా? వైరసా? తేలలేదు.కొందరదంటున్నారు, మరికొందరిదంటున్నారు. అదిగో అన్న వాక్సిన్ వెనక్కిపోయింది. మందు సరే లేనే లేదు. పాత కాలం చిటకాలే పని చేస్తున్నట్టున్నాయి.

      Delete
    2. ఈ కాలం లో కొద్దో గొప్పో ఆశను మన గుప్పిట బంధించాల్సి వుంటుంది ఆచార్య.. ఆ కొవిడ్ ఇన్ఫెక్షన్ మూలాన సైడ్ ఎఫెక్ట్ కింద న్యూమోనియ వస్తుంది. అల్వియోలై రక్త నాళాలు చిట్లి..

      మీరు ఉదహరించినట్లే మాకు చాలా దూరపు బంధువులొకరు.. ఆ పల్లెలో ఆసామి లా బ్రతుకు తుండే.. ఆయనకు ఇద్దరబ్బాయిలు, ఐతే ఒకానొక రోజు అతని భార్యకు విపరీతంగా హైపర్టెన్సివ్ షాక్, బీపీ అమాంతం హెచ్చింది.. మెదడు నరాలు చిట్లిపోయి.. ఎక్కడికక్కడ క్లాట్స్ మూలాన స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డారు.. ఆమే ఆవేదన వర్ణనాతీతం.. కోమా అనుకున్నారు, కాని ఆమే చూడగలుగుతున్నారు, శరీరం లో వేరే ఏ అవయవం పక్షపాతం వచ్చినట్లు నో కదలిక.. రోజుకి మూడు సెడేటివ్, న్యూరో ట్రాన్స్మీటర్ (ట్రిగబ్యాంటీన్, ఈటార్‌నెక్స్-ట్) ఐవీ, ఇంజెక్షన్ లతో కంట్లో కునుకు లేక, కన్నీళ్ళతోనే సపర్యాలు చేస్తు ఉన్నారు ఆ ఆసామి. కాని ఇపటికీ కదలికలైతే లేవు. అమ్మ అంటారు.. అరేయి.. ఆస్తి అనేది మనమందరికి మూడు పూటలు తినెంత, బట్టలు కొనెంత, ఇల్లలో ఉండెంతగా ఉంచుకోవాలి.. ఇంత ఆస్తి ఉండి కూడా తన భార్య ఈ రోజు ఈ పరిస్థితికి చేరుకున్నారు.. బ్రతుకు వెళ్ళదీయటానికి సరిపడెంతగా వెనకేసుకుంటే చాలు అంటారు. ఆ ఆసామి భార్యకు అలా జరగటానికి కారణం ఆ ఆసామే నట.. "మనకు ఇద్దరు అబ్బాయిలున్నారు, మనకు సరిపడ ఆస్తి ఉంది అనంటే లేదు ఇంకా సంపాదించాలని రాజకీయాల వైపు మొగ్గు చూపించి.. రెండు మాట్లు షుమారుగా డైబ్బై లక్షలు అంటే ఎమ్ ఎల్ ఏ పదవి కని ఒకసారి, సర్పంచ్ పదవి కని మరోసారి కోటి నలభై లక్షలు హాంఫట్ చేశారట.. అంతే ఆ రోజు నుండి దిగులు పట్టుకుంది ఆమెకు.. అదే డిప్రెషన్ కు లోనై, అదే పనిగా ఆలోచిస్తు, భర్తను వారించలేక, లాభనష్టాలను భరించే శక్తి కోల్పోయి.. కొద్ది కొద్దిగా నీరశించి.. ఇపుడు పరిస్థితి చేయి దాటినాక అందరి కంట్లో చెమ్మ.. ఒక్కో పూట ఇంజెక్షన్ డోస్ కే లక్షన్నర ఔతోందంటే నమ్మండి ఎంతలా పరిస్థితి క్షిణీంచిందో.. ఇంత లోనే కరోనా.. ఉన్నంతలో సుఖమో దుఃఖమో అంటు కడదాక ఒకరికొకరుగా జీవించిన వారు లేకపోలేదు ఈ సమాజాన..

      అందుకే స్ట్రెస్, స్ట్రేయిన్, డిప్రెషన్, సప్రెషన్, టెన్షన్ వీడవే.. ఒక సామెత ఉంది.. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లాగా.. మాట నేర్చిన వాడి సున్నం నీరు కూడా అమ్ముడుపోతుంది.. మాట రాని వాడి పాలు సైతం అమ్మకానికి నోచుకోదని..
      మనకు ఉండాల్సింది కాస్త ముందుచూపు.. అంచే కనుచూపు మేర దాక ఆలోచించగలిగే సత్తువ.. మరో రోజు ఉంటుంది.. ఆ రోజూ కూడా కనుచూపు మేర వరకే ఆలోచించాలి.. అపుడే సంసార సాగర నావ కడలి ఆటుపోట్లను తట్టుకుని పయనించగలదు. పడవ ను కడలిలో పెట్టగానే లాహిరి లాహిరి లేకుండానే ఈ ఒడ్డు వదలి ఆ ఒడ్డుకి ఒక రాత్రికే చేరుకోలేదుగా.. తెడ్డు, తెరచాప, కడలి టర్బిడిటి, వేవ్స్, హైలో టైడ్స్, దిక్సూచి ఇవన్ని కూడా సరిగా ఉండాలి.. అపుడే నావ పయనం సుగమం సురక్షితం.. స్వస్తి.. ! తులసి తీర్థం, వేపాకు కషాయం వేడి నీటీలో రోజుకి మూడు పూటలు.. ఇమ్యూనిటిని బూస్ట్ చేస్తాయి ఆచార్య..!

      Delete

    3. ఆశ సహజం. గుర్రం ఎగరచ్చు అన్నది ఆశ కల్పించడం. గుర్రం ఎగరదన్న సత్యం తెలిసుండాలి. ధనం కావాలి సంపాదించాలి.ఎంత? అది తెలుసుకోవడమే విజ్ఞత. అనాయాసేన మరణం ఆనందమే. చావో రేవో తేలక త్రిశంకువులా వేలాడటం నరకం. ఉదయమే స్నానం తరవాత తులసికి నీరు పోసి నమస్కారం చేసి ఆరు తులసి దళాలు బుగ్గన పెట్టి ఒక పావుగంట రసం మింగి తర్వాత ఆకులు మింగడం రోజువారీ చాలు, ఇది నిత్య కృత్యం. ఇక వేప కషాయం వయసు మళ్ళినవారికి ప్రమాదం,అతిసారం చేస్తుంది. చిన్నప్పటి నుంచి కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటే.....కృషితో నాస్తి దుర్భిక్షం ప్రయత్నం చేయాలి, దైవ నిర్ణయం
      .

      Delete
  2. భయపడి చేసేదేముంది? నిబ్బరంగా ఉండండి. మీ కార్యకలాపాలను జాగ్తతో చాకచక్యంగా నిర్వహించుకోండి. భగవంతుడి మీద నమ్మకం ఉంటే కలౌ స్మరణా న్ముక్తి అని స్మరణ చేస్తూ సంతోషంగా ఉండండి. జరిగేది జరుగుతుంది. చింతదేనికి?

    ReplyDelete
    Replies
    1. నిబ్బరంగా ఉండక చేయగలది లేదండి. మొన్న సాయంత్రం దాకా తెగ అరిచింది. రాత్రికి బి.పి పెరిగిందిట. చాలా అయిందిట మెదడు నరాలు చిట్లాయట. ఏముంది......నిన్న మా డాక్టర్ గారి తండ్రి తిని తిరుగుతున్నవాడు...సడన్ గా....అయిపోయింది, ఏమనుకోవాలి. ఎదురుగా జరుగుతున్నవాటికి స్పందించక రాయిలా ఉండలేం కదా!

      Delete
  3. ఒకరి నుండి ఏకకాలం లో ఆరుగురి వరకు తుమ్ము, దగ్గు తుప్పరలతో ఘాణి తీస్తున్న (జోరందుకుంటున్న కరోనా.. లేక బలహిన పడనున్న) కరోనా తాలుకు సమర్థవంతమైన టీకా ను లోకంలో గల ఖండాలన్నిటికి చేర వేసేటానికి మాత్రం ౮౦౦౦ బోయింగ్/ఎయిర్బస్ విమానాలు అవసరమవుతాయని అంటున్నారు. అస్ట్రాజెనెక ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ ఒకరిద్దరిలో వికటించిందంట.. స్పుత్నిక్ రష్యన్ వ్యాక్సిన్ ఓ మోస్తరు. మీరు, శ్యామల్ రావు గారు చెబుతునట్లు ఏమో ఆ కొద్ది కాలం లోనే ఈ మహమ్మారిని కూకటివేళ్ళతో పెకలించగలిగేది రావచ్చు కదా.. ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు.. ఆప్టిమిస్టిక్ గా ఉండటం.. ఎవరి కనీస జాగ్రతలతో మెలగటం.. ఇదే ఇపటికి నివారిణి..!
    జై అంబె భవాని

    ReplyDelete
  4. పరీక్షిత్తు మహారాజు కథ పోలిక బాగుంది శర్మ గారు. అంటుకునే చెడు యోగం ఉంటే వైరస్ పురుగు ఎక్కడ దాక్కున్నా వదిలి పెట్టదు.

    ఉన్నంతలో జాగ్రత్త పడుతూ కరోనా తో సహ జీవనం చేయడం తప్పదు.

    ReplyDelete
    Replies
    1. రాసి పెట్టి ఉంటే అంతే! అలాగని విచ్చలవిడిగా ఉండమనీ కాదు కదా! ఏం జరిగినా మన మంచికే

      Delete
  5. ఈ సందర్భానికి పరీక్షిత్తు-తక్షకుడు ఉదంతం సరిగ్గా సరిపోతుంది.

    పాలపాకెట్లు వేసే మనిషిని పాకెట్లు నీళ్ళబకెట్లో పడెయ్యమని చెప్పడం మహత్తరమైన ఉపాయం, శర్మ గారు. I like it.

    “టెస్టులకి పల్లెలలో మరీ చిరాకు” అన్నారు, ఎందుకలాగ? బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికా? ఇప్పుడు నగరాల్లోనయితే చాలా లాబ్ ల వాళ్ళు తమ టెక్నీషియన్ ని మనింటికే పంపిస్తున్నారు మన రక్తం పిండటానికి ��. మీ ఊళ్ళల్లో ఆ సౌలభ్యం ఇంకా రాలేదా?

    పైన వీడియోలోని దృశ్యం బట్టి తెలుస్తోంది జనాలకు ఏ మాత్రం డిసిప్లిన్ ఉందో.

    ReplyDelete
    Replies
    1. పాల పేకట్లనుంచి మిగిలిన అలవాట్లు పాతవేనండి. మూ.ము గుడ్డ కట్టుకోవడం. బేంక్ నుంచి తెచ్చుకున్న నోట్లు ఒక సారో గంట సూర్యనారాయణునికి చూపించి లోపలెట్టుకోవడం కొత్తగా మొదలెట్టినవి.
      పల్లెలలో టెస్టింగ్ లాబ్ లు వేరుగా ఉండవండి. అవి డాక్టర్ ఆఫీస్ లోనే ఉంటయి. ఒక వేళ వేరుగా ఉన్న వాటి దగ్గర చేయించినా మళ్ళీ ఇక్కడ చేయించాలి. డాక్టర్ గారినడిగితే, ఆ టెస్ట్ నమ్మలేమండి. వాటిని నమ్ముకు వైద్యం చేస్తే కొంపకొల్లేరన్నారు. అందుకు తప్పదు. ఇక్కడ గుంపులు చేరతాయి. అదే బాధ. ఎవరికి చెప్పలేం,ఎవరూ వినరు కూడా.

      Delete
  6. కొద్దో గొప్పో సంపాదించుకున్న వాళ్ళు దాక్కోగలరు కాని ప్రతీ రోజూ జీవనపోరాటం చేసే సామాన్యులు దాక్కుని ఉంటే ఆకలితో ముందే మరణిస్తారు.
    నేతల చేతకానితనానికి ముందు బలయ్యేది సామాన్యులే.

    ReplyDelete
    Replies
    1. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది :)
      ఈ టపాలో ఆరు నెలల ఇంటివాసం గురించేనండి అనుకున్నది. ఆకలి-జరుగుబాటు మీద టపారాయాలి. :)

      Delete
  7. “జిలేబి” గారి నుండి చాలా రోజులుగా చడీచప్పుడు లేదు. మీకేమైనా భోగట్టా ఉందా, శర్మ గారు?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      జిలేబి గురించిన వివరాలూ తెలియవు, కనపడకపోడానికి కారణాలూ తెలియవండి.

      Delete