Monday, 24 March 2025

దూడంత దుఃఖం

 దూడంత దుఃఖం  పాడంత సుఖం  లేదు.

ఇది పల్లెలో తరచుగా వాడుకునే మాట, ఒక నానుడి.

పాడి పశువుల్ని దూడలని అనడం పల్లెపట్టున మా అలవాటు. ఒక పాడి పశువు ఇంట్లో ఉంటే దాని ఆలనా పాలనా చూడాలి, లేకపోతే పాలు పితుక్కోడానికి తపేలా పట్టుకెల్తే ముఖొం పగిలేలా తన్నుతుంది. దూడని మన నివాసానికి కొంచం దగ్గరగానే ఆవాసం ఏర్పాటు చేయాలి. దానికి గూడు ఉండాలి. గాలి వెలుతురూ రావాలి. కట్టుగొయ్యకి దగ్గరగా కుడితిగోలెం ఉండాలి, దగ్గరగానే మేతకి పచ్చిగడ్డి ఎండుగడ్డి జనపకట్ట ఉండాలి. పగటి పూట తెలగ పిండి,పత్తి విత్తనాలూ పెడుతుండాలి వారానికి ఒక సారైనా. తిండి పెట్టినంతలో సరిపోలేదు. అక్కడ దోమలు లేకుండా చూసుకోవాలి,శుభ్రం చేయాలి. రోజూ కట్టుగొయ్యనించి విప్పి బయటకి తీసుకుపోవాలి. ఇక ఆవు ఎంత ఎండైనా సహిస్తుంది కాని వాన చినుకు మీదబడితే సహించలేదు. గేదె వాన ఎంతైనా హాయిగా సహిస్తుంది,ఎండకి ఓర్చుకో లేదు. ఇది గమనించాలి.  ఏ రాత్రిపూటో అరిస్తే లేచి చూడాలి, దాని అవసరం తీర్చి అప్పుడు పడుకోవాలి. ఇలా అన్నీ అవస్తలే. పాడి పశువును పెంచడం పురిటిలో పాను చూసుకున్నంత శ్రద్ధగా  చూసుకోవాలి. పాడి పశువును పెంచడం ఒక కళ,కల కూడా. ఇది అందరికి చేత కాదు.

పాలు తీయడానికి ఒక నియమిత సమయం ఉండాలి. పాలతపేలా శుభ్రంగా తోముకోవాలి. ఏమాత్రం శుభ్రం లేకపోయినా పాలు విరిగిపోతాయి, చింతపండేసి శుభ్రంగా తళతళా  మెరిసేలా లోపలా బయటా తోమి ఎండలో బోర్లించాలి. అన్ని చేతులతో నూ పాల తపేలా ముట్టుకోకూడదు. మంచి నీళ్ళు నింపి పాలు తీసేవారికి కివ్వాలి. పాలు తీసేవారు కాళ్ళూ చేతులూ శుభ్రంగా తోముకుని పాలు తియ్యాలి.పాలుతీసే చోటు శుభ్రంగా ఉండాలి. పశువుకు ఆహ్లాదం కలిగేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వెనకకాళ్ళకి బంధం వేయాలి.  తపేలాలో పట్టుకువెళ్ళిన నీళ్ళతో పొదుగును కడగాలి,శుభ్రంగా. అప్పుడు దూడను వదలాలి. దూడ కుమ్మితే ఆవు పాలు వదలిపెడుతుంది. ఒక సారి కనక ఆవు పాలు చేపితే మరి ఆపుకోలేదు,వెనక్కి తీసుకోలేదు. అప్పుడు నాలుగు చేర్లనుంచీ పాలు మార్చిమార్చి పితుక్కోవాలి. పాలు పితికేవారు పశువు కాళ్ళ దగ్గర గొంతు కూచోగలగాలి. పాల తపేలాను కాళ్ళ మధ్య జాగ్రత్తగా పట్టుకోగలగాలి. పాలు తీయడం కబుర్లు చెప్పినంత తేలికేం కాదు,పాలు కమ్మహా తాగినంత తేలికా కాదు. పాలు తీయడం ఒక కళ.  మరో ముఖ్యమైన మాట రోజూ ఒకరే పాలు పితకాలి,రోజుకొకరు తయారైపోకూడదు. ఇన్ని కష్టాలున్నాయి.      

 పాడి పశువును పెoచడానికి ఇన్ని పాట్లుంటాయి మరి ఇదంతా దుఃఖమే.


ఇక పాడంత సుఖం. ఇంట్లో పాడి  ఉంతే కల్తీ లేని పాలు తాగచ్చు.  పిల్లలికి గుమ్మపాలూ పట్టించచ్చు. పిల్ల లు  బలే బలంగా పెరుగుతారు. ఆపైన ఇంట్లో వాడుకోవచ్చు,గడ్డపెరుగు పోసుకుని కమ్మగా లాగిoచచ్చు. మీగడ,వెన్న,నెయ్యి కమ్మహా తినచ్చు. ఇంకా పాలు మిగిలితే అమ్ముకోవచ్చు,లేదా కేంద్రానికి పోసి డబ్బు చేసుకోవచ్చు. మనవాళ్ళ లో గొప్పచెప్పుకోవచ్చు,ఇంటికొచ్చినవాళ్ళకి చూరు నీళ్ళ కాపీ కాక మంచి చిక్కటి కాఫీ ఇవ్వచ్చు.  పాడి ఉన్నంత సుఖం లేకుంటే ఉంటుందా? 


పళ్ళచెట్టు,అదిన్నీ మామిడి,కొత్తపల్లి కొబ్బరైతే ఎంత బాగుంటుంది. ఊరగాయెట్టుకోవచ్చు,పులుపే పులుపు,పండితే ఆబ్బ ఆ రుచే వేరు. పండు చేతిలోకి రావాలంటే ఎంత కష్టం? చెట్టుని సంరక్షించాలి. ఆకులు రాలుతుంటాయి,తుడుచోకోవాలి,రోజూ. ఇది చాలా పెద్దపని. ఆపై పూత వస్తే దాని సంరక్షణ చెయ్యాలి. పూసిన పూతంతా కాపు కాదు. చాలాపూత రాలుతుంది. కాడలు రాలతాయి. ఎప్పటికప్పుడు తుడుచుకున్నా పెద్ద తలనొప్పి రెండు నెలలు. ఆపై కాసిన కాపంతా నిలబడదు. పిందే రాలుతుంది,కాయా రాలిపోతుంది,ఎంత? గంపలకొద్దీ. ఎత్తిపోసుకోవాలి. ఆపై ప్రకృతి కరుణించాలి,వాన,గాలి లేక. ఆ తరవాత పరువు కొచ్చిన కాయను కింద పడకుండా కోయాలి. ఊరగాయి పెట్టుకోవచ్చు. పండేసుకోవచ్చు. అన్నీ పండవు,కుళ్ళిపోతాయి,వాటిని పారేయక తప్పదు. లేదూ తాండ్రపోసుకోవచ్చు. పండెయ్య డానికి గడ్డి,అనువైన ప్రదేశం కావాలి,మిద్దెలాటిది. అప్పుడు కదా పండిన పండు తినేది. ఇంత కష్టం ఉన్నది మరి.అదే దూడంత దుఃఖం  పాడంత సుఖం లేదన్న సామెత. 

సుఖస్యానంతరం దుఃఖం   
దుఃఖస్యానంతరం సుఖం. 
న నిత్యం  లభతే దుఃఖం   
న నిత్యం లభతే సుఖం 

18 comments:

  1. హేవిటో! అంతా చేస్తున్నట్టు స్వయానా

    పాల ప్యాకెట్టు, పండ్ల బుట్టా ఇంటికాడికే వస్తా వుంటే తాతగారేమో మరీ వామ్మో వామ్మో అనిపించేస్తా‌ వుండారు :)


    ReplyDelete
    Replies
    1. Zilebi24 March 2025 at 13:42
      కష్టం తరవాత సుఖం ఎంతబావుంటుమో తమకు తెలియదు. తమరింతే.ఈ పనులన్నీ ఎవరో ఒకరు చేయాలిగా! ఓపికున్న కాలంలో చేసినవాళ్ళమే! కనకనే నేటికిన్నీ ఇంకా నీలాటి ధేబ్యాలతో కొట్లాడుతున్నాం!

      Delete
  2. పాలు ప్యాకెట్లలోకి ఎక్కడానికి, పళ్ళు బుట్టలో పడడానికీ ముందు జరగవలసిన తతంగమండీ “జిలేబి” గారూ శర్మ గారు వివరించింది.

    ReplyDelete
    Replies
    1. మీరు వకీలా వారికి ? :)

      Delete
    2. Zilebi25 March 2025 at 11:40
      మొన్ననే ఐ.బి.ఇ లో లాయర్ పరీక్ష పాసయ్యానని బోర్డ్ కట్టడమే తరవాయని చెప్పిందో మనవరాలు. జూలు లేని ఛావా దూకుతుంది సివంగిలా చీల్చి చండాడుతుంది. వదులుతా!

      Delete

    3. విన్నకోట నరసింహా రావు25 March 2025 at 10:45
      ఈ గుండ్రాతికి వివరించడం దండగండీ

      Delete
  3. శర్మ గారు,
    // “ అన్నీ పండవు,కుళ్ళిపోతాయి,వాటిని పారేయక తప్పదు. లేదూ తాండ్రపోసుకోవచ్చు.” //

    అయ్యబాబోయ్ శర్మ గారు, తాండ్ర పోసేది కుళ్ళిపోయిన పళ్ళతోనా 😳😳 ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు25 March 2025 at 14:25
      సాధారణంగా తాండ్రపోసేవాళ్ళు రసాలు వాడరు.వాటి రసం పల్చగా ఉంటుంది. అందుకు తోతాపురి,ఏనుగుతల మామిడి ఇలాటి రకాలు ఉపయోస్తారు. వీటిలో కుళ్ళు సమస్య చాలా తక్కువ. కుళ్ళు అంటే డాగు,మచ్చ పడ్డవాటిని కూడా కుళ్ళు అనే అంటారు. వీటిని ఎవరికిన్నీ పెట్టలేరు ఆ డాగు, మచ్చ, చిదిమేసి నీళ్ళతో మిగిలిన పండును కడిగి దీనిని తాండ్రపోసుకోడానికి ఉపయోగిస్తారు, ఒకటి రెండు చెట్లున్నవాళ్ళు.

      Delete
  4. Replies
    1. Zilebi25 March 2025 at 14:37
      తాండ్ర ఎలాపోస్తారో తెలుసుకో!

      Delete
  5. పాడి ఆవుల పాలన పోషణ కళ్లకు కట్టినట్టు వివరించారు. మంచి పోస్టు సార్. గోమాత భూమాత తో అనుబంధం ఉన్నవారు ధన్య జీవులు 🙏🏻

    ReplyDelete
    Replies
    1. బుచికి25 March 2025 at 22:05
      భూమాత,గోమాతలతో అనుబంధం చిన్నప్పటినుంచీ ఉందండి. జీవితం గడచించిందీ పల్లెలలోనే,నడచిపోయిందలా.... ధన్యవాదాలు

      Delete

  6. -


    చైంచిక్ జాల్రా :)

    పాడి ఆవుల పోషణ పాలనలను
    మాకు కళ్లకు కట్టిరి మాచనార్య!
    అవును ! గోమాత భూమాత సాహచర్య
    ము గల వారలు ధన్యులు మ్రొక్కెదనిదె!

    ReplyDelete
    Replies
    1. Zilebi26 March 2025 at 09:14
      తమది పాలపేకట్ల,పళ్ళ బుట్టల అనుబంధమే!

      Delete
  7. ఎంతైనా మీ యనుభవకథల్ , హృద్యమై యుండు జూడన్
    సాంతం బార్యా ! యనుసరవిధిన్ , సాధ్యమై యొప్పు నెప్డున్
    చింతల్ దీర్చున్ తెరవరులకున్ , జీవితాశా విభూతిన్
    సంతోషంబీ కథలు వినగా , శర్మగారూ ! మహాత్మా !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల26 March 2025 at 11:03
      ధన్యవాదాలు.
      పల్లెటూరివాడిని కదండీ,అందుకు దూడా,పాడీ,పెంటా,పొలం,పంటా ఇలాగే ఉంటాయండి. బతుకంతా పల్లెలలోనే గడచిపోయింది. కొన్ని అనుభవాలు,కొన్ని అనుభూతులు. జీవనాన్ని బట్టి అన్నీ పల్లెటూరి సామెతలే రాలుతుంటాయి.

      Delete
  8. ఎరుక గల ఙ్ఞాను లందరు
    గురువులె , యెగి రెగిరి పడరు , కోవిదులుగదే !
    అరయగ మీరూ , నరసిం
    హరావు గారలు , నమోస్తు 🙏 , అనయము దలతున్ .

    ReplyDelete
    Replies

    1. వెంకట రాజారావు . లక్కాకుల27 March 2025 at 09:53
      🙏 అతి సామాన్యుడిని మహాత్మా! వందనం

      Delete