Wednesday 9 December 2015

రోజుకో పద్యం.-కోపమున


రోజుకో పద్యం.

కోపమునను ఘనత కొంచమైపోవును
గోపమునను మిగుల గోడుగలుగు
గోపమడచెనేని గోరిక లీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ.

మనిషి గొప్పతనం కోపంతో తగ్గిపోతుంది. దానితో బాధలు కలుగుతాయి.కోపాన్ని వదిలేస్తే కోరికలు తీరుతాయి అన్నారు వేమన తాత.. 

కోపం అందరికి వస్తుంది,’పేదవానికోపము పెదవికి చేటు’ నానుడి. పెద్దవారికోపమే కోపం మరి. పేదలది ధర్మాగ్రహం. కోపం వస్తే దాన్ని ’ఒంటికాలి మీద లేవడం’ అంటారు.జంతువులు పుట్టిన కొన్నిగంటలకే నిలబడి తల్లి దగ్గర పాలు తాగుతాయి, నడుస్తాయి కూడా. మానవుడో, నడవడం దేవుడెరుగు లేవలేడు, ఎవరో లేవదియ్యాలి, తల్లి పాలు తాగడం నేర్పాలి, కూచోడం, నుంచోడం,నడవడం నేర్పాలి. అసలు రెండు కాళ్ళ మీద నిలబడిందే ”రామా పితికస్” కాలం నుంచా? నిలబడటమే చేతకాని మానవుడు ఒంటికాలిమీద లేస్తే, అంటే మరో కాలితో తన్నాలని, ఎదుటివారిని. పాపం ఒంటి కాలి మీద లేస్తే రెండో కాలు భూమి మీద లేక సరిగా నిలబడలేక బోర్లా పడతారు. అందుచేత కోపం తెచ్చుకుని ఒంటికాలి మీద లేస్తే ఏమవుతుంది, బోర్లా పడటం తప్పించి. కోపమొస్తే ఫలితంగా పడితే పళ్ళు రాలిపోతాయి కదా! అందుచేత కోపం తెచ్చుకుంటే ఏడుపు మిగిలింది కదా! కోపం తెచ్చుకోని ఎదుటివాడు చేతకాని వాడనుకుంటే పొరబాటు. ధర్మాగ్రహం కాల్చేస్తుంది.కోపం, పులిమీద స్వారీ చేయడం లాటిది. పులి మీద ఎక్కడం తేలిక,దిగడమే కష్టం. దిగితే పులేతినేస్తుంది, ఎంతకాలం స్వారీ చేయగలరు, ఎప్పుడో ఒకప్పుడు దిగకా తప్పదు, చావకా తప్పదు :) రాముని రాయబారం వినిపించి హనుమపై కినిసి రావణుడు హనుమను చంపేయమంటే, దూతను చంపకూడదు శిక్షించు, అని విభీషణుడు చెబితే కోపంలో ఒళ్ళు తెలియక హనుమ తోకకి నిప్పు పెట్టమన్నాడు,రావణుడు . తరవాతేం జరిగింది? లంక కాలిపోయింది. రావణుని కోపం లంకను కాల్చింది. 


'తనకోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష
దయ చుట్టంబౌ'

 అదండి సంగతి. 
అందుచేత కోపం తెచ్చుకోకుండా బుద్ధితో యోచనచేస్తే తన పనులు సవ్యంగా నెరవేరుతాయని తాత మాట. ఆ( గాడిదగిడ్డు పాత చింతకాయ కబుర్లు. అవును పథ్యానికి పాత చింతకాయ పచ్చడే కావాలి, లేక మరేమైనా తింటే రోగం తిరగబెడుతుంది :)

8 comments:

  1. తాతగారూ,
    పద్యంలో చిన్న తప్పు దొర్లిందండి. మూడవ పాదం "గోపమడచెనేని గోరికలీడేరు" అని వుంటేకాని గణాలు సరిపోవండి.

    -సత్తిబాబు

    ReplyDelete
  2. మొదటిపాదం కూడా సరిపోవట్లేదు, చూడగలరు.

    ReplyDelete
    Replies
    1. చిరంజీవి sathibabu
      మంచి కోపం మీద రాశానబ్బాయ్! చూశావా తప్పురాశాను :) తప్పులుంటే చెప్పూ! నేనేం అనుకోను. తెలిసి తప్పులు రాసుకోకూడదు కదా! మరో చిన్న రహస్యం చెప్పేస్తున్నా, మనలో మాట ఎవరికి చెప్పకూ నాకు గణాలూ యతులూ వగైరా అంటే భయమయ్యా! నాదంతా మాటకచేరీ :)
      మరొకసారి,
      ధన్యవాదాలు.

      Delete
    2. నేనూ అదే బాపతులెండి. ఎంతో కష్టపడితే వొకటో అరో వుపజాతి పద్యాలైతే వ్రాయగలనుకానీ మరేదీ ప్రయత్నంచే సాహససమైతే యిప్పటి వరకు చేయలేదు.

      -సత్తిబాబు.

      Delete

  3. తన కోపమే తన శత్రువు పద్య పాదం అదీ ఈ కోవలో కే వస్తుందనుకుంటా .

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అవును జిలేబీగారూ ! ఎదో ఒకరోజు నమ్మక ద్రోహం గురించి కూడా శర్మగారు వివరించాలని ఆశిస్తూ

      Delete
  4. పై పద్యానికి వివిధరకాల సేకరణలు క్రింది లింకులో చూడొచ్చు . ఏ గణం సరిపోతే అది పెట్టుకోవచ్చు . అయినా భావం ముఖ్యం గానీ భాష ఏల
    http://manuscriptslibrary.ap.nic.in/vemana/Volume11/4411.html

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ జీ
      మంచి లింక్ ఇచ్చారు, చాలా ఉపయోగపడుతుంది. వీలు కుదిరినంతవరకు తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేద్దాం, తెలియక తప్పైతే ఏమీ చెయ్యలేం. ఏమంటారు?
      ధన్యవాదాలు.

      Delete