Thursday, 5 November 2020

ఉపనయనం

 ఉపనయనం


ఒక రాజుగారి కొలువు,కొలువులో ఒక కవిగారు, కవిగారికి రాజుగారికి మంచిదోస్తీ. కవిగారికి కావలసినదేదైనా రాజుగారు కాదనరు, అంతటి స్నేహం. కవి దోచుకు తినేస్తున్నాడని దివాన్ గారి బాధ.  దివాన్ గారికి కన్నుకుట్టింది, కాని ఏం చేయలేడు, సావకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 


ఇలా ఉండగా ఒక వేసవిలో కవిగారు నొక వినతి పంపుతూ అందులో ఇలా రాశారు, ''నా కుమారునికి మరియు నాకున్నూ ఉపనయనముల నిమిత్తంగా ఏలినవారు సొమ్ము మంజూరు వేడుతున్నాను'' , అది సారాంశం. చూసిన దివాన్ మా బలేగా దొరికాడు కవి అనుకుని, రాజుగారికి కవిగారి వినతి పత్రం పంపుతూ, కూడా వెళ్ళేరు.  


కవిగారు కాకమ్మ కతలు వినిపించి, ఖజానానుంచి సొమ్ము ఎలా దోచుకుంటున్నాడో వైన వైనాలుగా చెప్పాలనుకున్నాడు,నిలబడ్డాడు. కాని రాజుగారు వినతిని శ్రద్ధగా చదివి, తలపంకించి, దివాన్ గారి వైపు సాలోచనగా చూసి,  రాజుగారు ''సొమ్ము పంపండి, విషయం కనుక్కోండి'' అన్నారు. కవిగారి గురించి వివరించే సావకాశం చిక్కక పోవడంతో దివాన్జీ నీరుగారిపోయాడు.

  

ఇది దివాన్జీకి విషయం కనుక్కుని సొమ్ము పంపండి అన్నట్టు అర్ధమయింది. అవసరం కవిది, అతనే వస్తాడులే, అని సొమ్ము పంపక కూచున్నాడు దివాన్, విషయం కూడా కనుక్కోకుండా. కవిగారి కుమారుడి ఉపనయన సమయం దగ్గరపడుతోంది, పనులే కాలేదని, సంగతేంటో కోటలో తన మనుషులను వాకబు చేశాడు, కవిగారు. దివాన్ చేసిన మతలబు తెలిసింది చూచాయగా. 


మర్నాడు రాజావారిని దర్శించాడు, కవిగారు తిన్నగా. చాలా కాలం తరవాత కనపడ్డ కవిగారిని సాదరంగా ఆహ్వానించిన అనంతరం, సాహిత్య చర్చలో ములిగిపోయారిద్దరూ. చివరగా రాజుగారు ఉపనయనాల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. కవిగారికి విషయం అర్ధమయింది, రాజు గారు కవిగారికి సొమ్ము చేరిందనుకుంటున్నారని. విషయం విన్నవించారు కవిగారు, రాజుగారికి, లక్ష్మీ కటాక్షం లేక పనులు సాగలేదని.. విన్న రాజావారు, వెంటనే కోటనుంచి సర్వ సంభారాలు పంపమని ఉత్తరువిస్తూ, తమ కుమారునికి ఉపనయనం సహజం,తమకైతే షష్టి పూర్తి, ఉగ్రరధ శాంతిగాని సహజం కాని  ఈ ఉపనయనం ఏంటో అర్ధం కాలేదని సమస్య చెప్పేసేరు, రాజుగారు. కవిగారికి విషయం అర్ధమయింది. అప్పుడు కవిగారు చెప్పేరిలా.


నాకుమారునికి నాకున్నూ ఉపనయనములనిమిత్తం అనికదా నా వినతి. కుమారుని ఉపనయనం అంటే తమకు తెలిసినదే, నాకు ఉపనయనాల గురించి కదా! వయసా పెరిగింది, చత్వారం పెరిగింది, రచన సాగటం లేదు, వైద్యుని వద్దకెళితే ఉపనయనాలు పెట్టుకోమని రాసిచ్చాడు మహరాజా, అని వివరించారు. విన్న రాజుగారు కవిగారి చమత్కారానికి భళ్ళున నవ్వేరు,దివాన్ గారి ముఖం వంక చూస్తూ. దివాన్ గారి ముఖం ఆరిపోయిన చిచ్చు బుడ్డిలా ఉంది.     

   

ఇది ఎక్కడో చదివినదే







12 comments:

  1. తెలుగు భాష చమత్కారం 👏🙏.
    అలాగే “సులోచన” అనే పేరు విన్నప్పుడల్లా నాకు కళ్ళద్దాలే గుర్తొస్తాయి 🙂.

    ReplyDelete


  2. "కవిగారు నొక" వినతి పంపుతూ అందులో ఇలా రాశారు :)

    పజ్జాలు చదివి చదివి గ్రాంధికం "వంట" బడుతోంది :)


    రాజా వారు ఎక్కడండీ మీరు ఇలా వచ్చి కొంత గ్రామ్ యామ్ గురించి వీరికి చెప్పాలె ంంంంంంంం ర

    :)
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పజ్జాలు చదివి చదివి గ్రాంధికం "వంట" బడుతోంది :)
      అది టైపో లే బామ్మా

      Delete

    2. పెద్దల మాట శిలోధాల్యం :)

      Delete
    3. అరె! ఇదీ తప్పు టైప్ చేశానా?టిప్ చెయ్యడంలో పొరబాట్లు ఎక్కువ జరుగుతున్నట్టున్నాయి! ఓల్డేజ్ యు నో! :)

      Delete
  3. // "అరె! ఇదీ తప్పు టైప్ చేశానా? టిప్ చెయ్యడంలో పొరబాట్లు ......" //

    "టిప్" ? మళ్ళీనా, శర్మ గారు 🙂 ?

    ReplyDelete
    Replies

    1. తప్పులు పడిపోతున్నాయి, మరుపొచ్చేస్తోంది, బ్లాగుల్లోంచి కూడా రిటయిర్ ఐ పోవచ్చేమోనండీ :)

      Delete
    2. టైపోలు దొర్లినంత మాత్రానికే రిటైరయి పోతారేమిటండీ, శర్మ గారు? అయినా మేం ఒప్పుకోవద్దూ?

      Delete

    3. విన్నకోటవారు.
      మళ్ళీ అదోటుందా? ఈ పాలికిలా కానిచ్చెయ్యలేరా? :)

      Delete
  4. మార్పు నాకూ వచ్చేస్తోందండోయ్. ఏదన్నా ఒకపనిని మధ్యలో వదిలి మరొకపనికి మళ్ళవలసివస్తే ఇక మదటిపని సంగతి పూర్తిగా మర్చిపోతున్నాను! అది ఎప్పటికీ తనంతతానుగా గుర్తుకు రావడం లేదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంగారు,
      అరవైకే ముసలిటండీ :) మరీ దిష్టి కొట్టేస్తారని భయమా :)

      Delete