Saturday, 28 November 2020

చిరునవ్వే చాలే .....


హారతి స్వామి ముఖం పైకి వచ్చినప్పుడు చూడండి, ముఖంలో కనపడే చిరు నవ్వు. శిల్పి గొప్పతనం. 

  సామీ!
నమస్కారం. 
ఒక విన్నపం. ఈ సంవత్సరం వర్షం మమ్మల్ని శని పట్టినట్టు పట్టింది. అతి సర్వత్ర వర్జయేత్ కదా!(కొఱకంచు చూపించినా వర్షం వాన తగ్గటం లేదు)

 గత మూడు రోజులుగా తలుపు తీస్తే రివ్వున చలిగాలి కొడుతోంది, దానికి తోడు వర్షం, ఇంక చెప్పేవా నా లాటివాని బతుకు. గత ఆరు నెలల పైగా ఇంట్లోనే బందీ ఐపోయినాము, ఇప్పుడిప్పుడే కొంత కాలు సారిస్తున్నాను, మళ్ళీ మొదలు కొచ్చేసింది సామీ. 

ఈ కరోనాతో సహజీవనం ఎలాగా తప్పదు,కష్టపడి పంట వేశాం, పంట పండింది తమ దయవల్ల కాని ఈనగాచి నక్కలపాలైనట్లేనా వర్షంతో అని బాధ. ప్రపంచంలోనే ఆహారానికి కరువొచ్చేలా ఉందేమి స్వామీ! ఈ వానలు వరదల వల్ల. 

చైనా ప్రపంచంలో ఏమూల ఆహారం కనపడినా కొనేస్తోందిట, ఆముదాలతో సహా. ఆహారం ఎక్కువగా ఉత్పత్తి చేసేవి కొన్ని దేశాలే, మిగిలినవి అంతంత మాత్రమే కదా! మా దేశం మాటేమిసామీ! మాకు పండిన గింజలైనా దక్కించవా?కలిగినవారికి, లేనివారికీ బాధలేదు, మరి మధ్య తరగతి ఒకటుంది మా దేశం లో వీరి బతుకు అధోగతి కానీవద్దని మనవి, వీరు తెగించి బావురుమని వీధినపడి ఏడవలేరు, గుడ్లనీరు కుక్కుకోవడం తప్పించి మరేం చేయలేరు, కరుణించు సామీ, నీ చిరునవ్వు ప్రసాదించి మా జీవితాలలో వెలుగు పూయించు  

8 comments:

  1. నవ్వు: మనసు స్థితికి దర్పణం
    నవ్వు: మానసికొల్లాసానికి తార్కాణం

    నవ్వు: నివురు కప్పిన విషాదాన్ని రూపు మాపే టూల్
    నవ్వు: నిరశించిన వేళ ఆశకు ప్రాణం పోసే టూల్

    నవ్వు: అతిహాస్యం మందబుద్ధికి హేతువు
    నవ్వు: అనాహాస్యం విశాదాలకి సేతువు

    ఉప్పు తగినంత చాలు కూరలో రుచికి
    నవ్వు తగినంత చాలు జీవితంలో గతికి

    ~శ్రీధర్

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      నవ్వు నాలుగిందాల చేటు నాటి మాట,
      నవ్వు నాలుగిందాల గ్రేటు నేటి మాట :)
      నిరసించిన వేళ/ నీరసించిన వేళ ఏదైనా రైటే :)

      పదునుగ మంచి కూర నలపాకము జేసినయైన యందు యింపొదవెడు నుప్పు లేక రుచి చేకురునటయ్య భాస్కరా?

      Delete
  2. // "కొఱకంచు చూపించినా వర్షం వాన తగ్గటం లేదు" //

    ఇదెలా సాధ్యం, శర్మ గారు? నేను ఎప్పుడూ వినలేదులెండి. వానకు కొఱకంచు ఆరిపోతుందేమో కానీ దాన్ని చూసి వాన ఆగిపోవడం ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు
      ఎడతెఱపి లేక వానలు పడుతుంటే ( ఎడ అన్నా తెఱపి అన్నా ఖాళీ అనే అర్ధంటండి,ఇలా ఏడతెఱపి అని వాడేస్తుంటామండి అగ్గి,నిప్పులాగా పల్లెటూరోళ్ళం కదండీ, మొరటోళ్ళం)పొయ్యిలో మండుతున్న కొఱవిని తెచ్చి ఆకాశానికి చూపుతూ చాలు, చాలు అనేవారు. తండ్రీ కొడుకులకి వైరం కదండీ.
      ఇలాటిదే మరో ఆచారం వరసగా ఆడపిల్లలు పుడుతుంటే ఆఖరి ఆడపిల్లకి సావిత్రి పేరు పెట్టి చాలు చాలు సావిత్రి అనేవారు. వీటి సాంకేతికత తెలియదనుకోండీ :)
      పాత కాలపు అలవాట్ల గురించి చెప్పడమే :)

      Delete
    2. మీరిలా అన్నారా.. కాని మా ఊరిలో నిజంగానే జరిగింది.. ఒకానొక దంపతులకు పిల్లలు పుట్టగానే గిట్టేవారుట.. అలా జరగ కుండా ఉండాలంటే ఎవరో మంత్రసాని వారికి ఇలా చెప్పిందిట.. కూరకాయల పేరు పెట్టండని.. ఐతే ఆ ఇంట్లో అపుడు పది మంది పుట్టారట.. వారి పేర్లు కంద, వంకాయ, పొట్లకాయ,సొరకాయ, దొండకాయ, వీరు అన్నాదమ్ములు. బీరకాయ, బుడుంకాయ, దోసకాయ, నీరుల్లి, పచ్చి బఠాని వీరు అక్కాచెల్లెళుట.. వీరిలో ఒకరు అనగ బీరకాయ అనే పేరుగల ఆమే మా తాతయ్య వారి బాబాయి వారి చిన్నబ్బాయి కి ఇచ్చి పెళ్ళి చేశారుట.. అంటే ఆమే మా తాతయ్య గారికి మరదలి వరుస అయ్యే వారు కాని పదిహేనేళ్ళ క్రితమే అస్వస్థతకు గురై ×_×. నా ఐదో యేటనే ఆమెకు యాభై మరి.

      Delete
    3. శ్రీధరా!
      నేటి కాలంలో పెట్టుకుంటున్న సోకు పేర్లగురించి అనుకోవద్దుగాని, పల్లెలలో బలే చిత్రమైన నవ్వొచ్చే పేర్లు ఉంటాయి. కొన్ని చెబుతా.
      అన్నవరం,పకీరు,పల్లాలు, సామాన్యమే, మరికొన్ని చెబుతా, పుల్లాకు, అబద్ధం, అబద్ధాలు, శబ్దం, తలుపులు ఇలా ఎన్నో.ఒక అనుభవం చెబుతా! మొదటగా ఒక కోఆపరేటివ్ బేంక్ లో పని చేశా! అదీ లోన్ అప్లికేషన్లు పూర్తి చేసేపని. రాస్తూ వస్తున్నా, ఇద్దరొచ్చారు నా ముందుకి, పేరు అన్నా దూళ్ళ అబద్ధాలు అన్నాడు ,తండ్రి రాఘవులు రాసేశాను, శూరిటీ పేరు అంటే తలుపులు అంటే అనుమానమొచ్చి బుర్రపట్టుకుని పెన్ను పేపర్ మీద పెట్టి కూచుండిపోయా! వీళ్ళుగాని నాతో హాస్యమాడుతున్నారేమోనని. మీ కార్డ్ లు ఇమ్మని తీసుకుని రిజిస్టర్ లో చూసి నమ్మాను. అప్పటి నా వయసెంత? ఇరవై, లోకం చూసినదే లేదు.ఇటువంటి చిత్రాలు లోకంలో చాలా ఉన్నాయండీ

      Delete
    4. ఒకప్పుడు ఇలాగే పుట్టిన పిల్లలు బతకాలనే ఉద్దేశ్యంతో ఓసారి పెంటమీద పడేసి మళ్లీ తెచ్చి పెంచుకునేవారని అలాంటివారికి పెంటమ్మ అని మీరు పెట్టినట్లు ఎవరో చెప్పారు. నిజమో కాదో తెలియదు

      Delete
    5. సూర్యగారు,
      నిజమేనండి, అన్నీ ఒక్క సారి గుర్తుకురావుగాని, నేనెరిగి నున్న అరవాలు అతనిపేరైతే ఆమె పేరు ఆడారి ఆడారి, ఇంటి పేరూ ఆడారి. అదో చిత్రం

      Delete