Thursday 10 December 2020

నాకూడా రాకురా!

 నాకూడా రాకురా!                                                                                                       కత


”ఆరున్నర దాటింది లేవచ్చు, ఏంటో మరీ బద్ధకం పెరిగిపోతోంది,మీకు” అరిచింది సతి, కిచెన్ లోంచి 

”రిటయిర్ అయి వచ్చిన తరవాత కూడా ఈ నసేంటీ?”..పతి వాపోయాడు,  దుప్పటిలో ముణగ దీసుకుంటూ .

”చూడరాదూ! పక్కింటి ముసలాయన, మీ కంటే పెద్దాడు కదా, ఆరయేటప్పటికి టంచనుగా కర్ర పుచ్చుకుని నడకకి వెళిపోతాడు రోజూ” సాగదీసింది, జాయ.

”ఒకరితో మనకి పోలికేంటోయ్, చలేస్తోంది కాసేపు పడుకోనిద్దూ”గొణిగాడు  పతి 

”అవును లెండి మనకి మంచిపోలికలెలా వస్తాయీ..లేవడమే ఆలస్యం, ఇంక నడకెప్పుడూ”....విసుక్కుంది జాయ.

”లేస్తాను లేవే పొద్దుటే చలీ”...అంటూ మంచందిగాడు, పతి.

”మీరు పొద్దుటే లేచి, నాలుగడుగులేసి ఆరోగ్యం సాధించుకుని మమ్మల్ని ఉద్ధరిస్తారనీ,ఈ గోల. రేపు ఏకాశి సోమవారం, మంచిది నడక మొదలెట్టండి,” సూచన చేసింది.... జాయ.

”రేపు ఏకాశి సోమవారమా? ఐతే దగ్ధయోగం, రేపొద్దుగాని ఎల్లుండి నుంచి మొదలెడతాలే”..వాయిదా వేసేడు పతి.

నడవడానికి ఒప్పుకున్నాడు, అంతే చాలు అని సంబరపడింది.ఇలా ఊరుకుంటే మానేస్తాడు,రేపు రేపు అని జరిపేస్తాడు. ఏం చేయడం అని ఆలోచించి, 'పక్క ముసలాయన ఉదయమే నడుస్తున్నాడు కదా, ఆయన కప్పజెపితే' ఆలోచన చేసింది. 'ఆ( మంచి ఐడియా' అని నడకకెళ్ళిన ముసలాయన తిరిగిరావడాన్ని వేచి చూస్తూ, కన్ను వీధి వైపు వేసుంచింది. ఇంతలో ముసలాయన కర్ర బోటుతో వస్తూ కనపడ్డాడు. చేతిలో పనొదిలేసి చేతులు తుడుచుకుంటూ వీధిలోకి పరుగెట్టింది.

ముసలాయన్ని పలకరిస్తూ 

”నమస్తే బాబాయ్!” అని నిలిచింది.

”కులాసానా అమ్మా!” అంటూ పలకరించాడు ముసలాయన. 

”మంచి అలవాటు బాబాయ్! ఉదయమే నడకకి వెళతారు,ఇంత వయసులో కూడా క్రమం తప్పకుండా, ఈయనకితగని బద్ధకం, లేపితే లేవరు,మీరు నడకకి వెళ్ళేప్పుడు ఒక్క కేక వేస్తే, రోజూ ఈయనా నడకకి వస్తారు”, విషయం చెప్పేసింది.

”అలాగేనమ్మా! నువ్వేం మడులు, మాన్యాలూ అడిగావా, నేనేమన్నా రాళ్ళూ గుళ్ళూ ఎత్తుకోవాలా? అతని నడక అతను నడుస్తాడు, అలాగే, రేపు ఉదయం పిలుస్తా” అన్నాడు.

”కాదు బాబాయ్, రేపు ఈయనకేదో పనుందిట, ఎల్లుండి నుంచీ” అని నాన్చేసింది.

''అలాగేనమ్మా'' ఆని ముందుకు సాగిపోయాడు, ముసలాయన. 

అమ్మయ్య, ఒక ఆధారం దొరికిందనుకుంటూ లోపలికొచ్చిన ఆమెకు పతి బాత్ రూం నుంచి వస్తూ కనపడ్డాడు.ముసలాయనతో మాటాడిన సంగతి చెప్పి 'ఎల్లుండి నుంచి నడవండని' పతికి హుకుం జారీ చేసింది జాయ.


ఎల్లుండి రానే వచ్చింది, ఉదయమే ముసలాయన కర్రతో నడకకి వచ్చేసేటప్పటికి,వాకిట్లో పతికి బూట్లు తొడుగుతూ, ”ఐపోయింది బాబాయ్ వచ్చేస్తున్నారూ” అంటూ పతిని బయటికి పంపించింది. ముసలాయన, పతి ఇద్దరూ నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకుంటుండగా తాను నిష్క్రమించింది. కొత్త మిత్రు లిద్దరూ కబుర్లలో పడి, నడక సారించారు. 


కబుర్లలో ఇద్దరికీ శంఖ చక్రాలున్నట్టు తేలింది, నడక అవసరమేననీ తేలింది.నడక కొనసాగిస్తుండగా, రోజూ వరు ముందు బయలుదేరితే, వారు రెండవవారిని పిలవాలని ఒక ఒప్పందం. సరే! ఏరోజూ పతి ముసలాయన్ని పిలిచిన పాపాన పోలేదు. ప్రతిరోజూ ముసలాయన వచ్చే సమయానికి పతికి నడక బూట్లు తొడుగుతూ ఉంటుంది జాయ. మధ్యలో ఆదివారమొస్తే శలవు ప్రకటించాడు, పతి. ''ఆదివారమని ఏపని చేయడం మానేస్తున్నావు మగడా, నడకకి శలవెందుకూ?" పోరింది సతి.

''నువ్వేమన్నా ఆదివారం నడకకి శలవే భీష్మించాడు'' పతి.అదేదో తేల్చుకోండని వెళ్ళాడు ముసలాయన.ఇలా తంపులతో నడక నడుస్తూ ఉంది. 


ఇంతలో వచ్చింది కరోనా, బయటకి కాలు కదపడానికి లేదంటే ఇద్దరూ ఇళ్ళలో బందీ ఐ పోయారు. ముసలాయన తన పెరటిలోనూ పతి తన డాబా మీదా నడుస్తూ వచ్చారు, కాని ఇద్దరికీ శంఖ,చక్రాలు పెరిగినట్టే అనిపించింది, ఆరు నెలలయేటప్పటికి. ఇద్దరూ ఒకే డాక్టర్ ని చూస్తే ఇద్దరికి ఉండవలసిన దానికంటే చక్కెర ఉత్పత్తి రెట్టింపే ఉన్నట్టు తేలింది. నడక తప్పని సరీ అయింది, మళ్ళీ ఒప్పందమూ అమలులోకొచ్చి, నడక మొదలెట్టేరు.ము.మూ గుడ్డలు కట్టుకుని దూరం పాటిస్తూ నడక కొనసాగించారు. నెలపాటు నడక సాగినట్టే సాగింది, 


ఇంతలో ఒక రోజు ఉదయమే, పతి ముసలయ్య ఇంటికొచ్చి ''బయటికి రావద్దు ఊళ్ళో బాగో లేదు,మన మిత్రుడు డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేడు, పెరటిలోనే నడక''  అన్నాడు. దానికి ముసలయ్య ''దూరం పాటిస్తున్నాం, ముమూ గుడ్డలు కట్టుకుంటున్నాం కదా! ప్రభుత్వమూ బయటి రావడానికి నిషేధమూ ప్రకటించలేదు, మరెందుకు నడక మానేయాలని'' ఆరాతీశాడు. ''వద్దూ బయటికి రావద్దూ, ఇంట్లోనే ఉండండీ'' అనేసి మాటకి దొరక్కుండా పోయాడు పతి. ముసలయ్య ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని నడకకై బయటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో తోచని ముసలయ్య ఇంట్లో చిక్కుకుపోయాడు. నడకా ఆరోగ్యమూ కొద్దిగా దారిలో పడుతున్న ముసలయ్యకి ఇది బాధే అనిపించింది. 


మళ్ళీ మొదలు కొచ్చేసినట్టుందే నడక వ్యవహారం అనుకుంటూ ఉండిపోయాడు,ఇంట్లో. వారం తరవాత కాళ్ళు గుదులెక్కిపోతే నడుద్దామని బయలుదేరి, అలవాటుగానే పతి కోసం ఇంటి కెళ్ళేడు. ఎంత పిలచినా పతి ఇంటినుంచి జవాబు రాలేదు. ఇంటికా తాళం లేదు, బయటికెళ్ళేరేమో, ఏమయి ఉంటుందీ అని అనుకుంటూ ముందుకు సాగిపోయాడు ముసలయ్య.  పతి ఆ రోజు  ముసలయ్యకి అందుబాటులోకి రాలేదు. మర్నాడు ఉదయమే వెళితే పతి కనపడలేదుగాని అతని భార్య,  తాము కట్టించుకుంటున్న అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేడని చెప్పింది. కాని, ఎదురుగా ఉన్న చెప్పుల స్టాండ్ లో పతి నడక బూట్ల తో సహా మిగిలిన చెప్పులూ కనపడుతూనే ఉన్నాయి. పతి ఇంట్లోనే ఉన్నాడని అర్ధమైపోయింది, ముసలయ్యకి.అంటే పతి ఇంట్లోనే ఉండి ముసలయ్యతో మాటాడటానికే ఇష్టపడటం లేదని అర్ధమయింది. సాలోచనగా ముసలయ్య చూసేటప్పటికి సిగ్గు పడింది, జాయ, తను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు. తన అసౌకర్య పరిస్థితి నుంచి తప్పించుకోడానికి మాట పొడిగిస్తూ, సతి

” బాబాయ్!  డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేరు తెలిసిందా? ఆయన మీ స్నేహితుడట కదా!”  వాకబు చేసింది.  ”అవునమ్మా! ఆయనకి ఎనిమిది పదులు నిండేయి, నాకంటే వారం పది రోజులు పెద్దవాడు, నేనీ వూరు వచ్చిన రోజునుంచి స్నేహితుడు,గుండె జబ్బు కి ఆపరేషనయింది, డయాబెటీస్ ఉన్నవాడు, ఎలాపోయాడో”? అడిగాడు ముసలయ్య. 

”అదేం కాదు బాబాయ్! కొత్తమ్మోరే ఎత్తుకుపోయిందంది”,  కరోనా పేరు చెప్పకుండా.

 ”అయ్యో” నిట్టూర్చాడు, ముసలయ్య. 

బాబాయ్! నడక్కి వెళ్ళద్దు,ఈయన బయటకి రావడానికి భయపడుతున్నారు, తప్పక అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేరు. నిన్నూ నడకకి వెళ్ళద్దన్నారు. అదీగాక నిన్ను తను కూడా నడక్కి తిప్పుతుంటే ఏం మాట పడిపోతానోనని మధన పడిపోతున్నారు, నీకా మాట చెప్పలేకపోతున్నారు, ఏమీ జరగదనుకో,  ఏదీ మన చేతులో లేదు కదా! ఇలా అన్నానని ఏమనుకోకు బాబాయ్! ఇంటికెళిపో” అంది చివరగా.  తనకూడా నడకకి రావద్దని చెప్పలేక భార్యతో చెప్పించాడనమాట.  తను నా కూడా నడకలో ఉంటుంటే, నాకేమైనా ఐతే తను మాట పడిపోతానేమోననుకుంటున్నాడనమాట, అనుకుంటూ  ముసలయ్య నడకకి సాగిపోయాడు.

”నాకూడా రాకురా అంటే నన్నెత్తుకోరా” అని వెనకపడినట్టు, పతి వెనక పడటం తెలివి తక్కువేమో అనుకున్నాడు, ముసలయ్య. ఉదయమే మంచు,దానికి తోడు చలి, మంచులో సూర్యుడు కనపడ్డు. ఇన్ని కష్టాలతో ఉదయం నడకెందుకని సాయంత్రానికి మార్చుకున్నాడు, ముసలయ్య.

''కానున్నది కాక మానదుగదా! ఒకప్పుడు పతి నా కూడాపడి నడకకి వచ్చినవాడు, ఇప్పుడు తన కూడా నడకకి రావద్దంటున్నాడు.చూడరాదూ చిత్రం'',అనుకున్నాడు ముసలయ్య .

లోకం ఎంత చిత్రమైనదీ



4 comments:

  1. ఆచార్య.. ఇది కత లా లేదు.. కత కాని కత లా అనిపించింది.. కోవిడ్ మూలానా ఇరవై-ఇరవై సం. అంతా పక్షవాతం వచ్చినట్లుగా ఐపోయింది.. మరో ఇరవై ఒకటి రోజులలో ఇరవై ఇరవై ఒకటి.. మరీ ఆ వత్సరం ఎలా ఉండబోతుందో ఏమో.. ఏదైనా మనసుకి నొప్పించినట్లుగా చెప్పి ఉంటే పెద్ద మనసుతో క్షమించేద్దురు.. అందరు బాగుండాలనే ఆశ.. అందరి క్షేమమే కాంక్ష.. జై శ్రీమన్నారాయణ..!

    ~శ్రీయమ్ ధారయేతేతామ్ మమ శ్రీధర నామధేయమితి

    ReplyDelete
    Replies
    1. శ్రీధర,
      జీవితం నుంచే కతలు పుడతాయి కదా!
      అదిద సరిద :)

      Delete


  2. హాయి గా సోఫాలో కూర్చుని కోకోకోలా పేద్ద ఫ్రెంచ్ ఫ్రైసు లాగిస్తూ టీవీ చానల్సు తిప్పేసుకుంటూ ఎంజాయ్ మాడి అంటూ వుండక_ ఏవిటీ చెడలవాట్లో పొద్దున్నే లేవటమటా యూ నో ఐ గో ఫార్ వాక్ అంటూ



    ఛ ఛ ఛ

    దేశం చెడిపోతోందాయె !



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      అటుద ఎంజాయ్ మాడి

      Delete