Thursday, 24 December 2020

ధైర్యం చెడుతుంది.

 ధైర్యం చెడుతుంది.


ధైర్యం చెడుతుంది, ఎప్పుడూ? 

ధర్మం చెడినపుడు. 


ధర్మం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో సత్యం చెడినపుడు. 


సత్యం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో కామ,క్రోధ, లోభ,మద,మత్సరాలు హద్దులు లేక పెరిగిపోయినపుడు,వీటినే అరిషడ్వర్గాలంటారు.


అరిషడ్వర్గాలెప్పుడు పెరుతాయి?

మనిషిలో దురాశ పెరిగినపుడు, 


దురాశ ఎప్పుడు పెరుగుతుందీ? 

స్వార్ధం అలవిగాక పెరిగినపుడు. 


స్వార్ధం ఎప్పుడు పెరుగుతుందీ?

కాంతాకనకాలమీద మోజు పెరిగినపుడు. 


కాంతా కనకాలమీద మోజులేనివారున్నారా?

ఇద్దరున్నారు!


ఎవరు వారు?

ఒకరు పుట్టనివాళ్ళు, మరొకరు చచ్చినవాళ్ళూ!


 అందరికి కాంతా కనకాల మీద మోజు ఉంటుంది! అది సహజమైనదిగా ఉండాలంటారు పెద్దలు.....


సహజసిద్ధంగా ఉండవలసినవేంటీ?


ఆపదలందు ధైర్యగుణ మంచితసంపదలందు దాల్మియున్

భూప సభాంతరాళముల బుష్కల వాక్చతురత్వమాజి బా

హాపటు శక్తియున్ యశమునందనురక్తియువిద్యయందు వాం

ఛాపరివృద్ధియున్ బ్రకృతి సిద్ధగుణంబులు  సజ్జనాళికిన్..... లక్ష్మణ కవి


ఆపదల్లో ధైర్యం కావాలి, సంపదల్లో ఓర్పు కావాలి.ఆపద మొక్కులూ సంపద మరుపులూ అనేది ఒక నానుడి.సభలలో వాక్చాతుర్యం కావాలి, ఇది మంది మంచికై ఉండాలి.యుద్ధంలో వీరత్వం కావాలి, కీర్తి మీద కోరిక ఉండాలి,నిత్య విద్యార్ధి ఐ ఉండాలి. ఇవే ప్రకృతి సిద్ధంగా వచ్చే గుణాలు.

విపది ధైర్య మధాభ్యుదయే క్షమా

సదసి వాక్పటుతా,యుధి విక్రమః

యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ

ప్రకృతిసిద్ధ మిదం హి మహాత్మనామ్


5 comments:

  1. లైఫ్ ఇజ్ ఏ కంగ్లోమరేట్ ఆఫ్ చెయిన్ రియాక్షన్స్.. ఆ పూసల దండలో ఏ ఒక్క పూస కదలినా మరో దానిపై దాని ప్రభావం ఉండనే ఉంటుందాచార్య.

    నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు.. మాట తీరుతెన్ను మరోకరిపై ప్రభావం చూపెడుతాయి.. చల్లని నోటికి వాక్కే శ్రీరామ రక్ష.

    స్వస్తి

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా
      మాటకు బ్రాణము సత్యము
      కోటకు భ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
      బోటికి బ్రాణము మానము
      చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ

      Delete
  2. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
    బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
    వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
    స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్

    ReplyDelete
    Replies
    1. మంచి మాట సార్.
      కేయూరాణి న భూషయన్తి పురుషం హారాన చన్ద్రోజ్జ్వలా
      న స్నానం న విలేపనం న కుసుమం నలజ్కృతా మూర్ధజాః
      వాణ్యేకా సమలజ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
      క్షీయన్తేఽ ఖిలభాషణాని సతతం వాగ్భూషణం భూషణమ్

      Delete


  3. ధైర్యము వలయు నీ కాపదలను దాట
    నోర్పు కావలె సంపదలొప్ప వాసి!
    నిత్య విద్యార్థి యై జవ్వని బతుకవలె
    ప్రకృతి నేర్పు పాఠమ్ము లరయ జిలేబి!



    జిలేబి

    ReplyDelete