Monday 28 December 2020

బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

 బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

''కుర్రోడితో యేపారం బెట్టిద్దామనుకుంటన్నాను, ఏం యేపారం పెట్టించమంటావూ?'' అడిగాడు మా సుబ్బారాజు.

''బుఱ్ఱలో గుంజుండాలిగాని బూడిదమ్ముకు బతకొచ్చు'' చెప్పేడు సత్తిబాబు.

 నువ్వన్నీ ఇలాగే చెబుతావు. అన్నీ యతి కుతం మాటలే 

విసుగు చూపాడు మా సుబ్బరాజు.

 ''ఎవడూ మొదటిరోజే అంబానీ ఐపోడయ్యా 

నీకు తెలుసా అంబానీ పెట్రోల్ బంకులో డెలివరీ బాయ్ గా పనిజేసేడు. కష్ట పడటానికి ఇష్టపడాలి. పనిజేయాలె. ఫలితమూ వస్తది.మంత్రసానితనం ఒప్పుకున్నాకా బిడ్డొచ్చినా పట్టాలె గొద్దొచ్చినా పట్టాలె.ఇదో సావెతలే అన్నా!''

''సరెలేవో సంగతేదో చెప్పరాదె!'' అరిసిండు సుబ్బరాజు. 

''తెల్లోడైనా నల్లోడైనా ఎవుడైనా వండుకోవాలె, తినాలె. వండుకున్న అంట గిన్నెలూ తోముకోవాలె''. 

''నీకన్నీ యాలాకోలమేనయ్యా'' అన్నాడు సుబ్బరాజు.

''నిజం జెపితే అలాగే ఉంటదిలే

నిన్నటి దాకా అంట గిన్నెలు తోముకోడానికి డిటర్జంట్లు, సబ్బులు  వాడేరు, ఇప్పుడో ఆర్గానిక్ బూడిద అరకేజి నాలుగొందలట. మంచేపారం. పిడకలు కొనిపించు, బూడిద చేయించు, దాన్ని పేక్ చేయించు అరకేజి మూడొంద ఏభై అను, బయో బూడిద అని యాడ్లేయించు, అరకేజి కొన్నోళ్ళకి స్పూన్ బహుమతను. ఐదు కేజిలు కొన్నోడికి మూడు వేలను, టీ కాసుకునే బొచ్చి గిఫ్ట్ పెట్టు. యాపారమే యాపారం.నిన్నటిదాకా బూడితతో అంట గిన్నెలు తోముకోడం అనాగరికమన్నారు. అందుకే సబ్బులు వచ్చాయి, కొన్నాం కాదా. ఇప్పుడు సబ్బులు వదలటం లేదు పూర్తిగా కడిగినా, అంచేత అనారోగ్యాలు కేన్సర్లు వస్తన్నాయంటన్నారు. మళ్ళీ ఆర్గానిక్ బూడిద ట్రెండవుతోంది. నువ్వు కొత్త ట్రెండ్ మొదలెట్టు. ఆర్గానిక్ బూడిడైతే పర్యావరణానికి నష్టం అందుకు బయో బూడిద వాడండి అని పిడకల బూడిదమ్ము. ఎలా ఉంది ఐడియా?'' అగాడు సత్తి బాబు. 

''అదిగాదుగాని మరోమాట చెప్పు'' అడిగాడు సుబ్బరాజు. 


''నీకేటి నేన్జెప్పింది బోదపడలా! ఏటిజేస్తాం. ఒక జరిగిన సంగతి చెప్తా ఇనుకో. మొన్నో పాలి కిరానా దుకానానికెల్లా, అదేలే స్టోరో ఎదోనట గందా? నీ కాడ ఎండు పళ్ళేటున్నాయన్నా? ఆడేటి తెల్లమొకమేసినాడు. అదెరా బాబూ డ్రై ఫ్రూట్స్ ఏటున్నాయన్నా? కిస్మిస్,డేట్స్ అంటా చెప్పుకొచ్చినాడు.ద్రాక్ష తీసుకున్నా, మరేదో కావాలన్నా లేవన్నాడు, తెచ్చినా అమ్మకం కావన్నాడు. 'మనూళ్ళో డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టినోడు లేకపోయె' అని గొణుక్కుంటా వచ్చేసినా.'' 

''ఐడియా. నేను గొణుక్కున మాట షాపోడు ఇన్నాడు. వారం కితం ఓ కుర్రోడో పేకటొట్టుకొచ్చి నమస్కారమెట్టి నిలబడినాడు. ఏటో ఒవుళు నువ్వు? అడిగినా. నేను స్టోరతని కొడుకునని మొన్న మీరన్న డ్రై ఫ్రూట్ షాప్ పెట్టేను. మీరడిగిన వెరైటీ ఇది. ఉంచండి'' అన్నాడు. ''ఎంత అంటే పేకట్ నూట ఏబై అండి, మీకిది బహుమతి'' అన్నాడు. ''అదేటి మొదటి సారిగదా'' అంటే

''మీ ఇడియా సార్. ఆశీర్వదించండి. నా shop కి రండి'' అని ఆహ్వానిం చాడు

''యాపారం ఎలా ఉందన్నా?"

''పర్లేదు సార్! మీలాఐడియా ఇచ్చే వాళ్ళుంటే దున్నేస్తా'' అన్జెప్పేడు.

''పర్లేదురా అబ్బాయి, పైకొస్తావన్నా!'' వెళుతూ, ''నా షాపులో ఎప్పుడూ మీకు స్పెషల్ రేటు సార్'' అని చెప్పెళ్ళేడు.

''సంఝే!!! నువ్వేటి యాపారం సెయ్యనేవు, కొర్రోణ్ణి ఒగ్గీ ఆడే జూసుకుంటాడు. సలాలు ఊరికే చెప్పీరు, కరుసవుద్ది.నీల్లలో పారీస్తేనే ఈతొస్తది''. అన్జెప్పి తుండుగుడ్డ బుజానేసుకుని ఎలబారిపోనాడు మా సత్తి బాబు.


15 comments:


  1. అయిడియా వుంటే అమెరికానే అమ్మేసి బతకొచ్చంటారన్న మాట :) భేష్ :)




    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంతేకదు బుజ్జమ్మా :)

      Delete


  2. బూడి దైననమ్మి బతుకు బుర్ర వున్న
    వాడు! తాత మాట వినవే వారిజాక్షి
    అయిడియా వున్న చాలోయి అమెరికాను
    కూడ అమ్మేసి మరి బతకొచ్చు పోవె!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బుర్రలో ఉన్న గుంజు ఉపయోగించుకోవాలి బుజ్జమ్మా :)

      Delete
  3. బ్రహ్మాండమైన హెడింగ్ పెట్టారు, శర్మ గారు 👌. కాలక్రమేణా సామెతల్లో చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదు 🙂 .

    కార్పొరేటాధముల్ని దేశం నుండి తరిమేస్తే మన సమాజానికి పట్టిన దరిద్రం సగం వదులుతుంది. మామూలు వస్తువునే "ఆర్గానిక్" పేరు పెట్టి (ముఖ్యంగా కూరగాయల్ని) రెండింతలు మూడింతల రేట్లకు అమ్మెయ్యడం వాళ్ళకు వచ్చిన మార్కెటింగ్ ఆలోచన - డయాబెటీస్ వాళ్ళను ఆకర్షించడానికై మిఠాయి షాపుల వాళ్ళు sugar-free sweets అని రెట్టింపు ధరలకు అమ్ముతున్నట్లు, డయాబెటిక్ ఆటా (గోధుమపిండి) అనీ, డయాబెటిక్ బియ్యం అనీ, డయాబెటిక్ చెప్పులు అనీ (డయాబెటిక్ నాబొంద అనీ) (వెర్రివాడి పెళ్ళాం వాడకంతా వదిన అన్న సామెతలాగా తయారయింది డయాబెటిక్ వాళ్ళని వ్యాపారులు దోచుకోవడం) అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు. 200 గ్రాముల చెరుకుముక్కని అందంగా పాక్ చేసి 30 రూపాయలకు మాల్స్ లో అమ్ముతున్నారని విన్నాను (ఆ లెక్కన కిలో చెరకు 150 రూపాయలన్నమాట), ఇక బూడిదని అరకేజీ 400 రూపాయలకు అమ్మడంలో వింతేమీ లేదు. నీతి లేని వ్యాపారాలు 😡.

    దేన్నీ ప్రతిఘటించలేం గనక (consumer resistance అన్నది దాదాపు శూన్యం కాబట్టి, ప్రతిఘటించినా ఉపయోగం ఉండదు కాబట్టీ) కాలానికనుగుణంగా నలుగురితో నారాయణా అనుకోవాలి. కాబట్టి మీ "సత్తిబాబు" సూచించిన అవుడియా మహత్తరంగా ఉంది అనీ, ఫాలో అయిపోవడం బెస్ట్ అనీ, టౌన్లల్లోనూ నగరాల్లోనూ అమ్మితే డబ్బులే డబ్బులు అనీ (పల్లెటూరి వాళ్ళకు బూడిదను కొనుక్కోవలసిన అగత్యం ఉండదు కాబట్టి - అనుకుంటున్నాను సుమండీ) మీ "సుబ్బరాజు" గారికి నా మాటగా కూడా చెప్పండి.

    మీరన్నట్లు "బుర్రలో గుంజు" ఉండాలే కానీ అవుడియాలకేం కొదవ 😀.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      కార్పొరేట్లు ఎక్కడికీ పోవు :) మనమే ఎంతవరకు కార్పొరేట్లని ఉపయోగించుకోవాలో తెలియాలి.వేలం వెర్రి మనలోనే ఉంది. డయాబెటిస్ పేరు చెప్పి వ్యాపారం బాగా సాగుతోంది. అసలు డయాబెటిస్ ఎందుకొస్తుంది? ఎన్ని రకాలు. మనదేరకం? అందులో మనకున్న ఇబ్బందేంటి? మనం అడగం డాక్టరూ చెప్పడు. ఇన్సులిన్ ఉత్పత్తి లేదా? ఉత్పత్తి ఐన ఇనుస్లిన్ రక్తం లో కలవటం లేదా? ఇలా రకరకాల ఇబ్బందులు. ఇది పట్టించుకోం. ఎవరేది చెబితే అదే...దాన్ని కార్పొరేట్లు కూడా ఉపయోగించుకుంటున్నాయి. తప్పెవరిది? ఆర్గానిక్ కంటే బయో మంచిదే కదండీ. అదే చెప్పి పిడకల బూడిద బయో క్లీనర్ అని అమ్ముకుంటే తప్పా? :)బుర్రలో గుంజు ఉపయోగించుకోడం అంటే ఇదేగా?

      Delete
  4. అవిడియాలన్ని బూడిద నారబోసు
    కొను దినమొకటుంది జిలేబి,ఘనమదేను,
    అంతదనుక, జీవు డడుగొ అతని కొఱకు
    ఎదురుచూడక తప్పదు , ఎవరుగాని .

    ReplyDelete
    Replies

    1. హేవిటీ నిర్వేదము :)

      Delete
    2. రాజావారు,
      సాధనమున పనులు సమకూరు ధరలోన తమకు తెలియని మాటా?

      Delete
  5. ఒహప్పుడు ఊళ్ళలో కర్రబొగ్గుతో, యాపులియేల్ తో, కళ్ళుప్పుతో పళ్ళు తోముకునే వారు.. ఇపుడు బొగ్గు పేస్ట్, పుల్ల పేస్ట్, ఉప్పు పేస్ట్.. పీటర్ డ్రక్కర్ బిజినెస్ టాక్టిక్స్ శర్మాచార్య..

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడుమాత్రం మిమ్మల్ని ఆపేదెవరండీ బొగ్గు, బూడిద వాడకుండా? కార్పోరేట్లదగ్గరే కొనుక్కోవాలని రూలుందా?

      Delete
    2. శ్రీధరా!
      మూలాలు మారవు కదండీ! మనం మరచిపోతున్న మూలాలని అదే నేటి అధునికతని ఉప్పు పేస్ట్, వేప సబ్బు అని అమ్ముతున్నారు. మూలాలు మరచిపోవడం తప్పు కార్పొరేట్లదా?పోటీ ప్రపంచం లో కార్పొరేట్లు అనే ఏమి ప్రతివారూ వారి బతుకుకోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నేటి స్టార్టప్ రేపు జైంట్ కార్పొరేట్. బుర్రలో గుంజే కారణం :)

      Delete
  6. // "యాపులియేల్" // అంటే ఏమిటి, శ్రీధరా?

    ReplyDelete
    Replies
    1. నా ఏడవ యేట అనుకుంటా వియన్నారాచార్య.. గోదావరి ఎక్స్ ప్రెస్ దిగి బస్ స్టేషన్ లో వచ్చి కూర్చున్నాము.. అపుడు సమయం తెలవారు ఝాము పది తక్కువ మూడు గంటలు.. గోదావరి ఎక్స్ ప్రెస్ ఆగేది ఆ స్టేషన్ లో అపుడే మరీ.. ఆ టైమ్ కీ బస్సులన్ని పార్కింగ్ లో ఉంటాయి.. ఇక అక్కడే తెలవారు ఝాము ఐదింటి దాక పడికాపులు ఊరికి చేరాలంటే ప్రతి యేడాది వేసవిలో ఇదే తంతు.. అపుడు ఐదు గంటల సమయంలో నలుగురైదుగురు వారి చేతులలో ఓ కట్ట కట్టుకొచ్చి బస్ స్టేషన్ లో అమ్మేవారు.. "యాపులియేల్" అనుకుంటు.. కుతూహలం కొలది ఏమిటబ్బ అవి అని చూస్తే ఇంకేముంది.. మనం రోజు వాడేదే.. వాటినే మాడ్యులేట్ చేసి పలుకుతున్నారన్నట్లుగా గుర్తించటం జరిగింది.. అవి మరేమి కావు.. వేప పుల్లలు..
      అది సంగతి వియన్నారాచార్య

      Delete
    2. ఓహో, వేపపుల్లలా, శ్రీధరా? Thanks.
      అవును గుర్తొచ్చింది. ఒకప్పుడు బస్సులో హైదరాబాదుకు వస్తుంటే తెల్లవారుఝామున నార్కాట్‌పల్లి బస్స్టాండులో అనుకుంటాను పళ్ళుతోముకునే పుల్లలు అమ్మేవారు పిలగాళ్ళు - బస్సు దగ్గరకు తీసుకువచ్చి మరీ. అదంతా ఒకానొక కాలంలో - ఇంకా "మన మూలాల్ని" మర్చిపోని కాలంలో.

      అయినా మరిచిపోయామని ఏం బెంగ అక్కరలేదు. మన పళ్ళుతోముకునే పుల్లని "Organic Toothbrush" అని పేరు పెట్టి అమెరికాలోని వాల్మార్ట్ స్టోరులో (Walmart) 200 గ్రాముల పేక్ ని 15 డాలర్లకు అమ్ముతున్నారట. కార్పొ"రెట్ట"లా మజాకానా? పాత సారానే కొత్త సీసాలో పోసి కొత్త పేరు పెట్టి హైప్ చేసి అమ్మెయ్యడం వాళ్ళకు వెన్నతో బెట్టిన విద్య. "బుఱ్ఱలో గుంజు" ఉండాలే కానీ .....

      ఈ క్రింది లింకులు చూసి ఆనందించండి.

      "Organic toothbrush"

      "Walmart Brands Chewing Stick As “Organic Toothbrush” Selling A Box $15"

      Delete