హంస లేచిపోయింది.
తోలు తిత్తి ఇది
తూటులు తొమ్మిది
తుస్సు మన ఖాయం
జీవా తెలుసుకో
అపాయం! అపాయం.
ఈ శరీరం తొమ్మిది తూటులతో ఉండే తోలు తిత్తి. ఏదో ఒక రోజు హంస లేచిపోవడం/నిలిచిపోవడం ఖాయం. ఈ తొమ్మిది తూటుల్లో ఒకదానిలో నుంచి జీవుడు బయటి పోవడమే అపాయం, అది తెలుసుకో అని హెచ్చరించారు.
మరెలా పోవాలి? ప్రశ్న. పదో దారుంది, అది మూసుకుపోయింది, దాన్ని తెరుచుకో, అలా బయటపడు, అన్నదే హెచ్చరిక..
ఎలాపోతే ఏమి? ప్రశ్న.బ్రహ్మరంధ్రం నుంచి బయటికిపోతే జన్మ రాహిత్యం. ఊర్ధ్వ ముఖంగా పోతే మానవ జన్మ. అధో ముఖంగా పోతే తిర్యక్కులలో జన్మ. తిర్యక్కులననేమి? ప్రశ్న. భూమికి సమాంతరంగా వెన్నుపాముండేవన్నీ తిర్యక్కులు.
బయటికిపోవడం అంటే? ప్రశ్న. ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన, సమాన వాయువులు పంచ ప్రాణాలు. ఇవన్నీ శరీరం వదలిపెట్టడమే బయటికిపోవడం. అంటే వాయువు శరీరాన్ని వదిలెయ్యడం.
దీన్నే హంసలేచిపోవడం/నిలిచిపోవడం అని చెబుతారు.
హంస ఏమి? ప్రశ్న.
స అనేది గాలిలోపలికి పీల్చుకునేటపుడు కలిగే శబ్దం, హం అనేది గాలివదలిపెట్టేటప్పుడు కలిగే శబ్దం. ఇదే హంస మంత్రం. దీని గురించి చాలా ఉంది, క్లుప్తంగా. నిమిషానికి ఏడుసార్లు ఊపిరిపీల్చి ఏడు సార్లు వదలుతాం. ఊపిరే జీవుడు. ఈ శరీరంలో నివాసమున్నాడు, బయటికిలోనికి తిరుగుతుంటాడు. ఒక సారి నిలబడితే మరిచొరబడడు. అదే హంస నిలిచిపోవడం లేచిపోవడం.
మహన్యాసం ఇలా చెబుతోంది.
హకారః పురుషః ప్రోక్తః స ఇతి ప్రకృతిర్మతా
పుంప్రకృత్యాత్మకోహంసః తదాత్మకమిదంజగత్
దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనతనః
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్
క్లుప్తంగా హకారం పురుషం సకారం ప్రకృతి వీటి జోడియే హంస. దేహమే దేవాలయం,సనాతనుడైన జీవుడే ఈ దేవాలయంలో ఉన్నాడు. ఆ జీవుణ్ణే సోహం అదేనేను, ఏది అది? అదే పరమాత్మ. ఆ పరమాత్మే నేను అనే భావంలో పూజించాలి. చాలు, ఇంకా చెబితే...
జంతూనాం నరజన్మ దుర్లభం, శంకరుని మాట.
జంతువు అంటే ప్రాణి అని అర్ధం. ప్రాణుల్లో నరజన్మ దొరకడమే కష్టం. దొరికిందంటే అదృష్టమన్నదే మాట.
అందుచేత హంస లేచిపోయేటపుడు కనీసం ఊర్ధ్వ ముఖ ప్రయాణానికి సిద్ధం కావాలి.
జీవుడికి ప్రాణాయామం అలవాటు చేయి.
ఊర్ధ్వ ముఖప్రయాణం అధో ముఖప్రయాణమననేమి?
జీవుడే ద్వారం నుంచి బయటకుపోయాడో ఎలా తెలుస్తుంది?
చెప్పండి కాస్త మీరు.




