Saturday 28 March 2020

తిరిగే కాలు తిట్టే నోరు....

తిరిగే కాలు తిట్టే నోరు....

తిరిగే కాలు తిట్టే నోరు తీరిగ్గా వుండలేవన్నది ఒక జాతీయం.

సాధారణం అవుసరం ఉంటే గాని బయటకి కదలరెవరూ, కాని కొంత మంది అవసరం లేకపోయినా తిరుగుతూనే ఉంటారు. ఇదొక అలవాటు.
 ”ఎక్కడికెళ్ళేవూ రాత్రి పదికి ఇంటికి చేరేవు,ఆఫీసు ఐదుకి ఐపోతే ఇప్పటిదాకా ఎక్కడ తిరిగినట్టూ, త్రిపాది లాగా?”....
”అబ్బే ఏం లేదమ్మా సత్యానందం కనపడితేనూ”...
”వాడితో పాటు ఇంటి దాకా వెళ్ళి.... వచ్చావనమాట”.
”వాడెదో కష్టం చెబుతుంటేనూ”..
”ఏవైనా చది వించుకొచ్చావా?”.. 
”   రెండు వేలుకావాలంటే.....నెలాకరికిచ్చేస్తానన్నాడు"
ఇటువంటి వాళ్ళు ఆఫీసులో కూడా సీట్లో కూచోలేరు. ”పక్క సెక్షన్లో మిత్రానందం నిన్న బండి మీంచి పడ్డాట్ట చూసొస్తా”, పక్క సీట్ వాడికి చెప్పి పెత్తనాలకి బయలుదేరతారు. ఇది నిజంగానే వ్యసనం. ఇలా   కూడా కాకుండా పని లేక తిరుగుతున్నవాళ్ళని కరోనా పోలీస్ కొడుతున్నారు, లేదా పొర్లు దండాలు పెట్టిస్తున్నారు కదా!   నేటి మాట, బండి పాడుచేసి ఇస్తున్నారు, మళ్ళీ తిరగడానికి లేకుండా,అలా కాకుండా వీళ్ళని అక్కడే ఒక పూట కాపలా కాయిస్తే రోగం చప్పగా కుదురుతుంది. తిక్కతిక్కగా మాటాడేవాడెవడేనా తగిలితే వీళ్ళకి అప్పజెప్పేస్తే సరిపోతుంది :)

తిట్టే నోటి నుంచి వచ్చేవెలా ఉంటాయో మచ్చుకి :) ”నిన్ను ఎన్నెమ్మమ్మెత్తుకుపోనూ!నీనోరడిపోనూ! న్నిన్నేట్లో కలిపెయ్యా!” ఇలాగే ఉంటాయి. ఇటువంటివారి నోటి నుంచి విందామంటే మంచిమాట వినపడదు. పొరబాటున వినపడిందో ఏదో ప్రళయం కరోనా లాటిది ప్రపంచం మీద కి వచ్చి తీరుతుంది. :)


ఉబోస అంటూ చెప్పేవాళ్ళు కూడా ఈ కోవకే చెందుతారనుకుంటా.ఇక నిత్యమూ ఏదో గిలక్కుండా ఉండలేని జనాభా ఉంటారు. వీళ్ళని తగలెయ్యా,  వీళ్ళ చేతులిరిగిపోనూ! ..... ఎక్కణ్ణించి ఊరతాయో కబుర్లు, తెగరాసి జనం మీద పారేస్తుంటారు. ఇదో వ్యసనం.



ఇలాటి పరిస్థితులలో కరోనా వచ్చి అందరిని లాక్ డవున్ చేసింది, ఎన్నాళ్ళూ ఇరవై ఒక్క రోజులట. చచ్చి చెడి మూడురోజులు నడవలేదు. ఏం తోచడం లేదు. ఏం చెయ్యాలి, ఏం తోచడం లేదు ఇదీ అసలు మాట.

ఏం చెయ్యచ్చూ
1.అమ్మ,నాన్న ఉంటే కాసేపు కబుర్లు చెప్పచ్చు.
2.ఇల్లాలి కి ముచ్చట్లు చెప్పచ్చు,వినచ్చు. కూడా కొంగు పట్టుకు తిరగచ్చు. వంటలో సాయం చేయచ్చు.వంటా చేయచ్చు. వంటగది సద్దచ్చు. కూరలు తరగచ్చు. వీలు కుదిరితే తలలో పేలు చూడచ్చు :) Work from Home or Work at Home :)''చాలు సంబడం ఇలా గొంగట్టుకు తిరగడమేంటో కొత్తగా, చూసేవాళ్ళు నవ్వుతారు'', అని ఆవిడ సున్నితంగా విదిలిస్తే ''చూడనిద్దూ'' అని దీర్ఘమూ తియ్యచ్చు, మరో కాఫీగ్లాసూ పుచ్చుకోవచ్చు.
3.తోట పని చెయ్యచ్చు
4.పిల్లలకి పద్యాలు,కతలు చెప్పచ్చు.
5.ఇల్లాలు చిన్నప్పుడు నేర్చుకున్న త్యాగరాజ కృతి వినచ్చు.
6.చిన్నతల్లి డేన్స్ చూడచ్చు.
7.మంచి పుస్తకం చదువుకోవచ్చు,కుటుంబం అంతా కలసి భోజనాలూ చెయ్యచ్చు,కబుర్లు చెప్పుకుంటూ.
8. ఒంటరి పక్షులు లేప్టాప్ ముందేసుకుని....ఎవరితోనైనా జగడమేసుకోవచ్చు. డవ్ జోన్స్,నిఫ్టీ వర్చుయల్ ట్రేడింగ్ చెయ్యచ్చు. 
9.పక్కవాళ్ళలో హాస్పిటల్ కి వెళ్ళేవాళ్ళకి సాయం చేయచ్చు.
10.ఒంటరి ఉండిపోయినవాళ్ళకి, బిచ్చగాళ్ళకి ఆహారం అందించచ్చు.
11.రైల్వే స్టేషన్లలో ఉండిపోయినవారిని ఆదుకోవచ్చు.
12.కరోనా గురించి ఇతరులకు వివరించవచ్చు,తెలిసున్నంతలో.
13.ఇతరులకు ధైర్యం చెప్పచ్చు,జాగ్రత్తలూ చెప్పచ్చు.
14.మా దగ్గర ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు, భోజనం లేక ఇబ్బంది పడుతున్నవారెవరైనా ఫోన్ చేస్తే ఆహారం అందిస్తున్నారు. వారికి సాయం చేయచ్చు.
15.పోలీస్,డాక్టర్, నర్స్,శానిటరీ వర్కర్స్,కరంట్ వాళ్ళు, డెలివరీ బాయ్స్ వీళ్ళకి అవసరం బట్టి ఒక ఆహార పొట్లం ఇవ్వచ్చు...వారికి మనిషి సాయం కావాలంటే చేయచ్చు 
ఇది అనంతం. సాయం చెయ్యాలనే మనసుండాలి కాని అవకాశాలు అనంతం.


ఇక, WHO Director General, ఈయన చూడండి, ఏమంటున్నారో
1.మందుకొట్టకండి.
వామ్మో! వారమైపోలా నాలిక పీక్కుపోతావుందయ్యా! షాపులా మూసేశారు, ఇంట్లో అమ్మో, కర్ర తిరగేస్తది, సతీష్ గాడి ఇంటి దగ్గర కుదురుద్దిగాని, వామ్మో పోలీసోళ్ళు, తల్చుకుంటేనే....
2.ధూమపానం వద్దు.
ఈయనెక్కడ దొరికాడండీ బాబూ చిన్నప్పుడు బళ్ళొ చదువుకున్నవన్నీ ఏకరువెడతన్నాడా?

ఏవయ్యా పె ద్దాయనా! నువు చెప్పినయ్యన్నీ మాకు సిన్నపటనుంచి అలవాటే గాని. ఈ కరోనా-19   భూతాన్ని పెపంచకం మీద ఒదిలినోడినేమనవేం...

అధో సూచిక:- ఇదెవరిని ప్రత్యేకంగా ఉద్దేసించినదీ కాదు. అలా అనిపిస్తే సా...రీ....

Thursday 26 March 2020

చెప్పిన మాట వింటేనా?


చెప్పిన మాట వింటేనా?

దేశం అంతా లాక్ డవున్ లో ఉంది. ఎవరూ బయటికి రాకండోయ్ అత్యవసరం ఉంటే తప్పించీ అని మొత్తుకుంటోంది ప్రభుత్వం. ఆ అత్యవసరం కూడా వైద్యం,ఆహారం తప్పించి మరోటి వద్దూ అంటోంది.

పోలీసులు పల్లెలనుంచి మరో పల్లెకి వెళ్ళే మార్గాలు కూడా మూసేశారు. అబ్బే అలా ఐనా వింటేనా? ఇంకా తిరుగుతూనే ఉన్నారు మోటార్ సైకిళ్ళేసుకుని. ఎందుకో తెలవదు.

నీళ్ళు,పాలవాళ్ళు,కరంటువాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. పోలీసులూ,డాక్టర్లు,నర్సులూ మనుషులేగా. పాపం వాళ్ళూ ఆహారం నిద్ర లేక రాత్రి పగలూ లేక పని చేస్తున్నారు. ఇంటిలో ఉండడి మహాప్రభో అని మొత్తుకుంటుంటే ఎందుకు బయట తిరిగి ముచ్చట్లు పెడుతున్నట్టు? ఇటలీ ప్రభుత్వం ఇక నా వల్ల కాదు, ఏం చేయలేనని చేతులెత్తేసింది. సరే పాకిస్తాన్ మొండికే పడింది. లాకు లేదు డవునూ లేదు, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నవాళ్ళుంటారు,పోయినవాళ్ళు పోతారననట్టు.

అరవై ఏళ్ళకితం మాట అదో పల్లెటూరు, ఊరంతా చక్కహా నిద్దరోతోంది.నేనొక్కణ్ణీ ఆఫీసులో స్విచ్ బోర్డ్ దగ్గర కూచుని ఉద్యోగం చేస్తున్నా! మొదటిలో చాలా ఆనందంగా ఉండేది, ఊరంతా నిద్దరోతోంటే మనం ఒకళ్ళం మెలుకువగా ఉండి ఉద్యోగం చేస్తున్నాం అని గొప్పగా ఉండేది. కాలం గడిచింది. ఇదేమి ఖర్మ? ఊరంతా నిద్దరోతుంటే నేనొక్కణ్ణీ మెలుకువగా ఉండడం అనిపించింది. మానవ మనస్తత్వంకదా! ఇలా రోడ్డున పడి ఉద్యోగం చేస్తున్న పోలీసులకి పెళ్ళాం పిల్లలు లేరూ? వాళ్ళకి హాయిగా ఇంటి దగ్గర కూచోవాలని ఉండదూ? డాక్టర్లు నర్సులకి అలా అనిపించదా?

రోడ్ మీద పని లేక ఊరికే తిరిగేవాళ్ళని చితక తన్నుతున్నారు పోలీస్, ఐనా తిరుగుతూనే ఉన్నారు, ఇదేమో? మనమూ ఇటలీలా ఐపోతామా? ఏమో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికెరుక.

Friday 20 March 2020

టముకు



భారత దేశం అంటే పల్లెలే. పాత రోజుల్లో వార్త ప్రజలకి చేరాలంటే ఆనోటా ఆనోటా చేరాల్సి వచ్చేది. వార్తను అదే ఊళ్ళో ఉన్నవారికి చేర్చేందుకుగాను ప్రభుత్వం ఇలా టముకు ద్వారా చార్త చేరేసేది. సాధారణంగా ఇవి కోర్ట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ద్వారా వేలం వేసే ప్రక్రియ గురించిన వార్తలే ఐ ఉండేవి. వ్యక్తుల ఆస్థులను వేలం వేసే సందర్భాలలోనే ఎక్కువుండేవి. ప్రోనోటు బాకీలు తీర్చలేకపోయిన సందర్భాలలో వ్యక్తుల ఆస్థులను జప్తు చేసేందుకు ఇలా టముకు ద్వారా వార్త చేరేసేవారు, వేలంలో పాల్గొనేవారి కోసం. ఈ ప్రక్రియ జరగడం అవమానకరంగా భావించేవారు. అదే టముకుమీద దెబ్బ పడటం అంటే,  డప్పు మీద దెబ్బ పడటం అన్నా! అంటే నీ ఆస్థి జప్తు చేయించి బాకీ వసూలు చేసుకుంటానని..బాకీ తీర్చలేక ఆస్థి జప్తు చేసే స్థితి రావడం అవమానకరంగా భావించేవారు..


కాలం మారింది. ప్రభుత్వం ప్రజలకు వార్త చవేయడానికి ఆ తరవాత కాలంలో వార్తాపత్రికలొచ్చాయి. ఆ తరవాత రేడియో మరో సాధనమయింది. ఐనా వార్త చేరడానికి సమయమూ పట్టేది. ఆ తరవాత టి.వి. వచ్చింది. వార్తల్ని వండి వడ్డించడం మొదలయింది.నిజమేదో అబద్ధమఏదో తెలిస్తే ఒట్టు. ఒక్కో పార్టీకో టి.వి ఛానలు, ఎవరి మాట వారిదే నిజం భగవంతునికే తెలుసు. :)

మరి నేటి కాలంలో వార్త గ్రామము,రాష్ట్రము,దేశమూ కూడా దాటి ఖండాంతరాలకి చేరడం చిటికెలో పని. ఒక్కసారి ఒక్క నొక్కు నొక్కితే మొత్తం ప్రపంచానికి వార్త తెలిసినట్టే. అందుకే మనవారు పెదవిదాటితే పృధివి దాటుతుందనేవారు.అంచేత మాట మాట్లాడే ముందు ఆలోచించాలి.. :) 

వార్త ఇంత సులభం చేరుతోందని సంతోషించాలో అబద్ధపు వార్తలు పెరిగినందుకు విచారించాలో తెలీటం లేదు. ప్రతిదానికి ఫేక్ట్ చెక్ చేసుకోవలసి వస్తోంది. ఇదీ నేటి ప్రారబ్ధం.

కరోనా గురించి కంగారొద్దు, నీలివార్తలు ప్రచారం చెయ్యద్దు. వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. 



Wednesday 18 March 2020

దూది ఏకడం-పరుపు కుట్టడం



పత్తి ఏకడం పురాతనమైన వృత్తి. మానవుడు బట్ట కట్టే కాలం నుంచి ఈ పత్తి ఏకే ఉపకరణం ఎన్ని రూపాంతరాలు చెంది ఇలా స్థిరపడిందో చెప్పలేం. దీనికి నేటి కాలంలో కమాన్ అని పేరు. ఐతే పురాతన కాలం లో దీని పేరు ధనురి కర్ర అని నేడే తెలిసింది. ఇప్పుడీ వృత్తిని దూదేకుల వారు చేస్తున్నారు, వారిని నూర్ బాషా అంటారట.నేటి కాలంలో దూది పరుపులు వాడుతున్నవారు లేరు. చక్రం మళ్ళీ మేట్రెస్సులు వదిలేసి దూది పరుపుల దిశగా మళ్ళింది.

చిన్నప్పుడన్నీ దూది పరుపులే. నాలుగేళ్ళ కోసారి దూది ఏకించి కుట్టించేవారు. నాగరికులమైపోయిన తరవాత కాయర్ మేట్రెస్ లు వాడడం మొదలు పెట్టేం. వీటితో నడుము నొప్పి, గాలి ఆడక ఇబ్బంది కలుగుతూనే ఉన్నా నెట్టుకొస్తున్నాం. ఒక దూది పరుపుండిపోయింది, అదిగో దాన్ని మళ్ళీ కుట్టించా. తయారు చేసిన పరుపు బాగుంటే మరికొన్ని కుట్టిస్తానని ఆశ పెట్టా. చాలా బాగా కుట్టేడు, బాగుంది, మరో రెండు కుట్టించా. ఇవి చూసి పక్కవాళ్ళో రెండు కుట్టించుకున్నారు. ఆ తరవాత పక్క అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోయారు, కుట్టిన పరుపుల పనితనం చూసి. చేసే పనిలో నైపుణ్యం బుర్రలో గుంజూ, మంచి మాటా ఉన్నవాడెక్కడేనా బతకగలడు

దూది పత్తి కాయల నుంచి,బూరుగు కాయల నుంచీ, జిల్లేడు కాయల నుంచీ తీస్తారు. ఈ దూదిని దారం తీయడం మొదలు, ఇలా పరుపులు కుట్టించుకునేదాకా వాదతారు. ఇక బూరుగుదూది పరుపు బాగుంటుందిగాని వేడి చేస్తుందని వాడరు,ఎక్కువగా. ఇక జిల్లేడు పత్తి వత్తులు చేసి శివారాధనలో వాడతారు. 



Monday 16 March 2020

करॊ न కరో న= చేయవద్దు.


करॊ न
కరో న= చేయవద్దు.


పీకలదాక త్రావితే,పెంపువహింపగ మత్తున మునిగితే
వెలభామల మూతులు నాకితే,పాయకితరుల చేతులు పిసికితే
పాచిన జిలేబి మెక్కితే,దుష్ట జిలేబి మెచ్చి గుచ్చితే
ఎటుల కరోన సోకక మాను పవన సుతా!


పద్యం నా స్వంతమేం కాదు! లిజిబే గారిది, పవన్ గారి బ్లాగు సౌజన్యంతో!

కరోన అంటే చేయవద్దని అర్ధం హిందీలో. ఏం చేయద్దూ?

1.చేతులు పిసుక్కోవద్దు: ఎదుటివారి దగ్గర చేతులు పిసుక్కోవడం బానిసత్వ లక్షణం. ఆపని చేయద్దు. మరొకరి చేతులూ పిసకద్దు. దీనివల్ల అంటువ్యాధులు అందునా కరోనా లాటివి వ్యాపిస్తాయి. 

2.మూతులు నాక్కోవద్దు: ఆడ మొగ తేడా లేక సమయం సందర్భమూ కాక, వావి వరుసా లేక మూతులు నాక్కుంటే కరోనా వచ్చి తీరుతుంది.
ముద్దిస్తానని దగ్గితే పారిపోయిన వీరులు :)

3.హగ్గులొద్దు:హగ్గులంటే కౌగిలింతలు.ఇవీ కరోనా వ్యాప్తికి తోడు. హగ్గులు లేకపోతే ఎలా? ఇంట్లో,వీధిలో ఇష్టమైనవారందరినీ హాగ్ చేయకపోతే వాళ్ళేమనుకుంటారూ. వోరి నీ హగ్గు కూలిపోను గుచ్చి కౌగలింతలు పాతవేనోయ్! నువ్వేం కొత్తగా కనిపెట్టలేదుగాని. దానికి సమయం సందర్భం ఉంటుంది. హగ్గులొద్దు, కిస్సులూ వద్దు. కిస్ ఫెచివల్స్ చేసుకుంటే కరోనా ఏ ఆపై మీ ఇష్టం. In front crocodile festivals.

4.పెగ్గులొద్దు:సిగ్గులు లేవు, హగ్గులూ లేవు, పెగ్గులూ వద్దు అంటే ఎలా? నాలుగు పెగ్గులు మింగితే కారోనా దగ్గరికి రాదట (ష). పిచ్చి పడిపోకు, నాలుగు పెగ్గులేసుకుంటే కరోనా కి తలుపులు బార్లా తెరిచినట్టే! ఏసుకో నా రాజా! ఏస్కో, ఆకేసుకో వక్కేసుకో ఆపైన చుక్కేస్కో!!  ఆపైనా కరోనా పక్కేస్కో!

5.Avoid packed and food on streets:వామ్మో హిమ క్రిములొద్దా! పానీ పూరీ లొద్దాంటే ఎలాబాబూ, నాలిక పీక్కుపోదూ, పిల్ల పేరు చెప్పి పట్టుకొచ్చే పేకట్లు పిల్లలతో పాటుగా తినకపోతే పిల్లలు నొచ్చుకోరూ :) ఏదీ వద్దంటే ఎలా చచ్చేదీ

బారు లేదు,బీరు లేదు, పోరిలేదు, చినిమా లేదు, బైస్కోప్ లేదు. ఏమీ లేదు, ఇదా స్వతంత్రం. ఆజాది చాహియే ఆజాదీ. తుపాకీ గుండు కంటే బలమైన కరోనా ఉన్నది అందుకో! నా ఇష్టమొచ్చినట్టు చేస్తాను కాదనువారెవరూ కళ్యాణ రామా! కాదనువారెవరూ! మా కేం అభ్యంతరం లేదుగాని ఒక్క మాట. నా ఇల్లు నా సొంతం తగలబెట్టుకుంటానంటే కుదరదు. నీ ఇల్లు తగలబెట్టుకుంటే అగ్గి అక్కడితో ఆగదు. ఊరు తగలబడుతూంది, అంచేత నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకో లేవు. ఇదీ నీ స్వాతంత్రం, తెరియమా? 

అదేం కుదరదు నా ప్రాణం నా ఇష్టం, ఆజాదీ,ఆజాదీ కరోనా యా మరోనా !
ఆగు ,ఆగు, నా ఇష్టం ఛస్తానంటే కుదరదు, నువు కరోనా తో ఛస్తే పూడ్చి పెడితే మరొకరికి అంటుకుంటుంది, చాలా మంది ఛస్తారు, అందుకు తగలబెట్టాల్సిందే!

కరోనా తో చచ్చినవాళ్ళని పూడ్చకండి, తగలబెట్టండి. ఇది వర్ల్డ్ హెల్త్ వారి మాట. కరోన,కరోన, కరోనా!!!

ప్రయాణాలొద్దు, ఎవరినీ దేనినీ అనవసరంగా ముట్టుకోవద్దు, నీ ముక్కు మూతి T సెంటర్ని కూడా. కరోనా! 

ప్రపంచంలో ప్రతి ఇంటి ముందు లోపల అన్ని దేశాలలో కరోనా గార్డులున్నారు, యమభటులు కరోనా రూపంలో కనపడకుండా తిరుగుతున్నారు. తస్మాత్జాగ్రత! జాగ్రత!! జాగ్రత!!!



खून कि दलाली
మృత్యు బేహారులు. మేరా భారత్ మహాన్
కరన్సీతో పాటు కరోనా కూడా వస్తుంది. పాపం సొమ్ము లెక్కెట్టుకుంటే కారోనా మహమ్మారి నిన్నే ఎత్తుకుపోతుందో నరుడా!

మాస్క్ తయారు చేసుకోడం ఎంత వీజీయో!

చావక మిగిలినవాళ్ళకి మోకాల్లోతు కూడని బ్రహ్మంగారి మాట.
Videos: Credits to Whats app University.
Secret caution message leaked from the office of  YAMA through WHO





Sunday 15 March 2020

అరణ్య రోదన

అరణ్య రోదన

అరణ్య రోదన అనగా అడవిలో ఏడవడం. అడవిలో ఏడవడమెందుకూ? గ్రామంలో ఏడిస్తే ఆర్చేవారూ తీర్చేవారూ లేక. అదేంటీ? మానవులకు ఆరు ఊర్ములు ఉంటాయి. అవి ఆకలి,దప్పిక, జర,మరణం;మోహము,శోకము. ఇందులో ఏ ఒక్కదాన్ని ఎవరిది వారే అనుభవించాలి తప్పించి మరొకరికి బదలాయింపు కుదరదు. అందుకే ఎవరి ఏడుపు వారే ఏడవాలి,మరొకరు ఏడవరు. గ్రామంలో ఎవరి ఏడుపువారు ఏడుస్తుంటే మరొకరెవరు ఆరుస్తారు,తీరుస్తారు. మరి అడవిలో తీర్చేవారుంటారా? పూర్వకాలంలో సాయంత్రం వేళ పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గాన విహారం చేస్తున్నపుడు ఇలా అడవిలో ఒంటరిగా ఏడుస్తున్నవారిని ఓదార్చి వారికి మంచి చెసేవారని పెద్దల మాట. అందుకు ఊళ్ళో కాక అడవిలో ఏడిస్తే ఎప్పటికైనా దేవుడు కరుణించకపోతాడా అని ఆశ. అందుకే అరణ్య రోదనం అన్నారు. ఇప్పుడీ అరణ్య రోదన సంగతేల


శ్రీ జి.పి.శాస్త్రి అనే గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారొక రిటయిర్డ్ ప్రొఫెసరు. వారు తెనుగులో ఒక పద్యాల పుస్తకం వేశారు. ఆ పుస్తకాన్ని నాకు పంపే సందర్భంలో జిలేబి నాకు శాస్త్రి గారిని పరిచయం చేశారు.పారితోషికం పంపించే సందర్భంగా ఒకటి రెండు సార్లు మెయిలిచ్చారు. అదే పరిచయం. పెద్దవారు కదా వీరికి జరుగుతున్నది విన్నవిద్దామనుకుని చెప్పేను. వారు నాకు తెనుగే తెలియదన్నారు. తెనుగులో పద్యాలల్లి పుస్తకాలేసినవారు తెనుగు రాదంటే అర్ధమే కాలేదు. జిలేబి మాయలో మరో మాయ.