Saturday 22 July 2023

కొక్కిరాయి కాలు విరిగె

కొక్కిరాయి కాలు విరిగె


 కొండ మీద వెండి గిన్నె

కొక్కిరాయి కాలు విరిగె

దానికేం మందు?

వేపాకు, చాదు,వెల్లుల్లి గడ్డ

నూనెమ్మబొడ్డు, నూటొక్కధార.

Friday 21 July 2023

భారతంతో పోలిక

 భారతంతో పోలిక


భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో ఉన్నది భారతంలో ఉంది అంటారు. చెప్పడంలో కొంచం పొరబడ్డానేమో పండిత/పిండితార్ధం మాత్రం ప్రపంచంలోని అన్ని విషయాలూ భారతంలో ఉన్నాయని చెప్పడమే! భారత రాజకీయాల్లో ఈ మధ్య  జరిగిన ఒక సంఘటన భారతంలో ఒక ఘట్టాన్ని గుర్తుచేసింది. అదెటులంటేని అవధరించండి.


శరద్ పవార్ ఈ పేరు తెలియనివారుండరు. మహారాష్ట్రలో పుట్టి, రాజకీయాల్లో కాంగ్రెసులో పెరిగి. కేంద్రంలో మంత్రిపదవులు అలంకరించినవాడు. కురు పితామహుడి లాటివాడు, రాజకీయాల్లో. ఈయన పుట్టి పెరిగిన కాంగ్రెస్ ను, సోనియా విదేశీవనిత, అనే విషయం మీద, కాంగ్రెస్ నుంచి విడిపోయి, కొత్త పార్టీ పెట్టుకున్నారు. దాని పేరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవారైతే కుడి భుజం అన్న కొడుకు  అజిత్ పవార్. ఇద్దరికి వయసు తేడా రెండు దశాబ్దాలే! శరద్  82 సంవత్సరాల కురు పితామహుడైతే,  అన్న కొడుకు, అజిత్ పవార్, అర్జునుడి లాటివాడు. ఈ మధ్య అజిత్ తిరుగుబాటు చేసి, ఒక వర్గాన్ని చీల్చి తాను ఉపముఖ్యమంత్రిగాను మరి కొంత మంది మత్రులుగా ప్రమాణ స్వీకారమున్నూ చేసేసేరు. 

(ఈ తిరుగుబాటుకున్నూ శరద్ ఆశీర్వచనమున్నదని రాజకీయవర్గాల భోగట్టా. గుసగుసలు కాదు, గట్టిగానే చెప్పుకుంటున్నారు.). ఆ తరవాత కార్యక్రమం నడుస్తోంది. ఈ లోగా మొన్ననోరోజు తిరుగుబాటు దార్లు అజిత్ నాయకత్వంలో శరద్ పవార్ దగ్గరకొచ్చి నమస్కారం చేసి పార్టీలో చీలిక నివారించండి, ఉపాయం మీరేచెప్పాలి, మీ ఆశీర్వచనం కావాలి, అనడిగేరు. దానికి శరద్ మాటాడలేదు.... తర్వాత కథ వెండి తెరపిచూడమన్నట్టు నడుస్తోంది కత. ఇక్కడికాపి, దీనికి భారతానికి ఉన్న సంబంధం చూదాం.


భారతం లో సంఘటన:-

కురు పాండవ యుద్ధం ఘోరంగా జరుగుతున్న రోజుల్లో, ఒక రోజు ధర్మరాజు కాలినడకన శత్రు శిబిరాలవైపు ఒంటరిగా బయలుదేరేడు. తిన్నగా భీష్మ పితామహుని శిబిరం చేరి, ప్రవేసించి, తాతగారికి నమస్కారం చేసి కుశల ప్రశ్నల తరవాత తాతా! మా విజయానికి ఉపాయం చెప్పమన్నాడు. దానికి పితామహుడు, నా చేత విల్లుండగా నన్నెవరూ జయించలేరు. ఐతే ఆడదానిగా పుట్టి మగవాడైన వారితో యుద్ధం చేయని నియమం ఉంది, నాకు. మీ పక్క శిఖండి అటువంటివాడని, చెప్పేరు.  

   నాటికే ఈ విషయాలు అందరికిన్నీ తెలుసు కాని భీష్ముడు గుర్తు చేసేరంతే!ఇంతకీ శిఖండి ఎవరూ? ద్రౌపదికి మరో అన్నగారు. సరే ధర్మరాజు శలవుతీసుకు వెళ్ళేడు... తరవాత జరిగిందందరికి తెలుసు. 


ఇప్పుడు చెప్పండి ఈ సంఘటన మొన్న జరిగిన దానికి పోలికుందా?  


Thursday 20 July 2023

హంస లేచిపోయింది.

 హంస లేచిపోయింది.


తోలు తిత్తి ఇది 

తూటులు తొమ్మిది

తుస్సు మన ఖాయం

జీవా తెలుసుకో

అపాయం! అపాయం.


ఈ శరీరం తొమ్మిది తూటులతో ఉండే తోలు తిత్తి. ఏదో ఒక రోజు హంస లేచిపోవడం/నిలిచిపోవడం ఖాయం. ఈ తొమ్మిది తూటుల్లో ఒకదానిలో నుంచి జీవుడు బయటి పోవడమే అపాయం, అది తెలుసుకో అని హెచ్చరించారు.


మరెలా పోవాలి? ప్రశ్న. పదో దారుంది, అది మూసుకుపోయింది, దాన్ని తెరుచుకో, అలా బయటపడు, అన్నదే హెచ్చరిక.. 


ఎలాపోతే ఏమి? ప్రశ్న.బ్రహ్మరంధ్రం నుంచి బయటికిపోతే జన్మ రాహిత్యం. ఊర్ధ్వ ముఖంగా పోతే మానవ జన్మ. అధో ముఖంగా పోతే తిర్యక్కులలో జన్మ. తిర్యక్కులననేమి? ప్రశ్న. భూమికి సమాంతరంగా వెన్నుపాముండేవన్నీ తిర్యక్కులు. 

 బయటికిపోవడం అంటే? ప్రశ్న. ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన, సమాన వాయువులు పంచ ప్రాణాలు. ఇవన్నీ శరీరం వదలిపెట్టడమే బయటికిపోవడం. అంటే వాయువు శరీరాన్ని వదిలెయ్యడం.

 దీన్నే హంసలేచిపోవడం/నిలిచిపోవడం అని చెబుతారు.

 హంస ఏమి? ప్రశ్న.

 అనేది గాలిలోపలికి పీల్చుకునేటపుడు కలిగే శబ్దం, హం  అనేది గాలివదలిపెట్టేటప్పుడు కలిగే శబ్దం. ఇదే హంస మంత్రం. దీని గురించి చాలా ఉంది, క్లుప్తంగా. నిమిషానికి ఏడుసార్లు ఊపిరిపీల్చి ఏడు సార్లు వదలుతాం. ఊపిరే జీవుడు. ఈ శరీరంలో నివాసమున్నాడు, బయటికిలోనికి తిరుగుతుంటాడు. ఒక సారి నిలబడితే మరిచొరబడడు. అదే హంస నిలిచిపోవడం లేచిపోవడం. 


మహన్యాసం ఇలా చెబుతోంది.


హకారః పురుషః ప్రోక్తః స ఇతి ప్రకృతిర్మతా

పుంప్రకృత్యాత్మకోహంసః తదాత్మకమిదంజగత్

దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనతనః

త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్


క్లుప్తంగా హకారం పురుషం సకారం ప్రకృతి వీటి జోడియే హంస. దేహమే దేవాలయం,సనాతనుడైన జీవుడే ఈ దేవాలయంలో ఉన్నాడు. ఆ జీవుణ్ణే సోహం అదేనేను, ఏది అది? అదే పరమాత్మ. ఆ పరమాత్మే నేను అనే భావంలో పూజించాలి. చాలు, ఇంకా చెబితే...


జంతూనాం నరజన్మ దుర్లభం, శంకరుని మాట.

జంతువు అంటే ప్రాణి అని అర్ధం. ప్రాణుల్లో నరజన్మ దొరకడమే కష్టం. దొరికిందంటే అదృష్టమన్నదే మాట.

అందుచేత హంస లేచిపోయేటపుడు కనీసం ఊర్ధ్వ ముఖ ప్రయాణానికి సిద్ధం కావాలి.


జీవుడికి ప్రాణాయామం అలవాటు చేయి.


ఊర్ధ్వ ముఖప్రయాణం అధో ముఖప్రయాణమననేమి?

జీవుడే ద్వారం నుంచి బయటకుపోయాడో ఎలా తెలుస్తుంది?

చెప్పండి కాస్త మీరు.

Wednesday 19 July 2023

ఆ ఎఱుకే నిశ్చలానందమోయ్!!

 Ankle sprain

Moderate pain

No seasonal rain

Misarable strain


So as to sow

So as to reap

No sow

What to reap?


No walk

Last one week

No talk

Many week


Physic weak

Not heading for a make

It's only time to break.

Old age knock.


Enjoy old age.


పుట్టినప్పటి నుంచి అన్ని వయసుల్లోనూ, ఆ వయసు ముచ్చట్లు అనుభవించేసేను. కష్టాలు పడ్డాను, సుఖాలూ అనుభవించేసేననుకున్నా! కాలమా గడచింది,పెద్ద వయసు పులిలా మీద పడింది. ఇప్పుడు ముచ్చట్లెక్కడ? అన్నీ కష్టాలే, బాధలే అని వగచి ఉపయోగం లేదు. ఏ వయసు బాధలు ఆ వయసువి కదా! ఈ వయసులో బాధలు అనుభవించలేనంటే ఎలా? వీటినీ అనుభవించాలి, 


బాధే సౌఖ్యమనే 

భావన రానీవోయ్! 

ఆ ఎఱుకే నిశ్చలానందమోయ్!! బ్రహ్మానందమోయ్!!! జగమే మాయ

 బతుకే మాయ,

వేదాలలో సారమింతేనయా!! 

ఈ వింతేనయా!!!! 



 ముదిమి కష్టాలూ ఎంజాయ్ చేస్తున్నా!!



Tuesday 18 July 2023

ప్రియవక్తృత్వం

 ప్రియవక్తృత్వం


 దాతృత్వం ప్రియవక్తృత్వం 

ధీరత్వముచితజ్ఞతా

అభ్యాసేన న లభ్యతె

 చత్వారః సహజా గుణాః

(ఆచార్య చాణక్య)


దానగుణం కలిగియుండడం అదే ఈవి కలిగియుండటం, ప్రియంగా మాట్లాడటం,ధీరత్వం కలిగి యుండటం, సమయోచితంగా మాట్లాడగలగటమనే నాలుగున్నూ సహజగుణాలు, నేర్చుకుంటే రావు.

( హెచ్చరిక:- ఇక ముందు టపాలో, ఇష్టం కాని మాటలు కనపడతాయి. భాధకలుగుతుందనుకునేవారిక్కడినుంచే మరలిపోవచ్చు)  


దాతృత్వం,ప్రియవక్తృత్వం, ధీరత్వం , ఉచితజ్ఞత, వీటిని వేరు వేరుగా చెప్పినా దాతృత్వం,ధీరత్వానికి; ప్రియవక్తృత్వం,ఉచితజ్ఞతకి అవినాభావ సంబంధం ఉంది.వీటిని వేరు వేరుగా చెబితే పేలవంగా ఉంటుంది, అందుకే కలిపి ఇలా.

దాతృత్వం, ధీరత్వం

దానగుణం కలిగి ఉండటం దానం చేయడం గొప్పవిషయాలు.దానాలు పది అన్నారు, కాదు పద్నాలుగూ అన్నారు.

అన్ని దానములకన్న అన్నదానము మేలు 

కన్నతల్లికంటె ఘనములేదు 

యెన్నగురునికంటె నెక్కుడు లేదయా 

విశ్వదాభిరామ వినురవేమ. 

దీనితో సమానమైనది లేదుగాని భూదానమూ గొప్పదంటారు,

 ఎన్నైనా గాని అన్నీ కూడా సొమ్ముతో కూడినవే, ఎంతోకొంత. ఓ ఉదాహరణ బలి దానమిస్తానంటే వద్దని శుక్రుడు అడ్డుపడ్డారు,కాని ఆపగలిగారా? లేదే. ఏమనమాట దానగుణం కలిగి ఉంటే, ఇచ్చే దానాన్ని ఎవరూ ఆపలేరు.

 వచ్చినవాడు విష్ణువే కానీ, మరెవరైనాగానీ,ఏమైనాకానీ, ఇచ్చిన మాట తిరిగిపోను, దానమిచ్చి తీరతాను, అనే ధైర్యగుణం చూపి దానమిచ్చినవాడు, బలిచక్రవర్తి.ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్... అన్నారు లక్ష్మణకవి. ఉత్తప్పుడంతా కీ బోర్డ్ వారియర్లే! :) అవసరానికొక్కడూ ముందుకురాడు. ధైర్యం అంటే ఎలా ఉంటుంది? ఒకమ్మాయి గోదాట్లో దూకింది. ఏ కారణమో! దగ్గర్లో ఉన్న ఒకతను ములిగిపోతున్న యువతిని రక్షించడానికి వెంఠనే దూకేసేడు! రక్షించగలనా?లోతెంతో, ఎమో! మనకెందుకొచ్చిన తిప్పలు అనుకోలేదు. అదీ ధైర్యమంటే!ధైర్యగుణమంటే. నిజం ఒకప్పుడు కాపాడబోయినవారి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉంటాయి.  ఈ గుణాలు సహజంగా వచ్చేవే పుట్టుకతో, నేర్చుకుంటేరావు.

ప్రియ వక్తృత్వం, ఉచితజ్ఞత

ప్రియ వక్తృత్వం, ఉచితజ్ఞత ఇవి రెండూ విడదీయలేనివే! ప్రియంగా అంటే, అబద్దాలు చెప్పమనికాదు. విషయాన్ని వివరించడం, వినేవారికి చిరాకు,బాధ కలగకుండా, వినగలిగేలా చెప్పడం.ఉచితజ్ఞత అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎంతవరకు, ఎలా మాటాడాలో తెలిసుండటమే ఉచితజ్ఞత. ఎంత చెప్పీ ఉపయోగం లేదు ఎఱుకపరచలేనేమో!

భాస్కర శతకకర్త ఈ రెండిటికి కలిపి ఒకమాట చెప్పేరు అదే రసజ్ఞత. ఇదీ అర్ధం కానిదే! అందుకే ఒక ఉదాహరణ చెప్పేరు. అది..


చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక జాలకున్న నా

చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచికూర నలపాకము జేసినయైన యందు నిం

 పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య 

  భాస్కరా

చదువుతో విద్య రావచ్చు, వివేకంరాదు. ఎక్కడ,ఎప్పుడు,ఎలా,ఎంత మాటాడాలన్నది చదువుతో రాదు. ఏ యూనివర్సిటీ లలోనూ నేర్పరు, నేర్పలేరు. 

రసజ్ఞత ఉప్పులాటిదన్నారు శతకకర్త, నిజం ఎక్కువైనా తక్కువైనా నోటపెట్టలేం. ఈటన్ లోనో లార్డ్స్ లోనో చదుకున్నంతలో రసజ్ఞత రాదు. బుఱ్ఱకి బొక్కకొట్టి లోపలికి రసజ్ఞత జొప్పించలేరు. ఈ ప్రియవక్తృత్వం, ఉచితజ్ఞత అన్నవి నేర్చుకుంటే వచ్చేవికావు, పుట్టుకతో రావలసిన సహజగుణాలు. 


Monday 17 July 2023

మయా దోషాన్

మయా దోషాన్

పిల్లలు రిసర్వేషన్లు చేయించుకుంటూ కొండకెళ్ళొద్దాం రండీ అన్నారు. వద్దురా! ఇబ్బందులు పడలేను. నాతో మీరూ ఇబ్బందులు పడతారు, వెళ్ళిరండీ, అని పంపేను.

దర్శనానికెళితే క్యూలలో ఇబ్బంది పడతాననుకున్నా! పిచ్చి వాడిని, ఇబ్బంది పడి బాధపడే కాలం వస్తే ఎక్కడైనా తప్పదని తెలుసుకోలేకపోయాను. చిత్రం! పిల్లలు తిరిగొచ్చే సరికి, ఇక్కడ ఉండి మాత్రం, కాలు బెణికి తిప్పలు పడటంలేదూ!

అజ్ఞానినా మయా దోషాన్
అశేషాన్ విహితాన్ హరే!
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే 


Saturday 15 July 2023

ఆత్మాపరాధ వృక్షస్య

 ఆత్మాపరాధ వృక్షస్య


 ఆత్మాపరాధ వృక్షస్య

ఫలాన్యేతాని దేహినామ్

దారిద్ర్యరోగదుఃఖాని

బంధన వ్యసనాని చ

(ఆచార్య చాణక్య)


దరిద్రం,    రోగం, దుఃఖం, చెఱపడటం మఱియు ఇతర వ్యసనాలు స్వయంకృతాపరాధ వృక్షానికి కాసే ఫలాలు. 


ఆత్మాపరాధం అంటే స్వయంకృతాపరాధం అంటే తెలిసి తెలిసి చేసే తప్పు. ఇదొక వృక్షమనుకుంటే దానికి కాచే ఫలాలెలా ఉంటాయి?

మొదటిది దరిద్రం, ఎక్కువగా ఇది తెలిసిచేసే తప్పుల ఫలితమే, ఈ దరిద్రం ఏదేని కావచ్చు, భావదారిద్ర్యం కూడా అందులోదే!

రోగమెందుకొస్తుంది? వ్యసనంతో రోగమొస్తుంది. వ్యసనం తెలిసి చేసే తప్పుకదా!

దుఃఖం, తెలిసితెలిసి నిప్పులో చేయిపెడితే కాలకమానుతుందా? కలిగేది దుఃఖమే

చెఱపడటం ఎందుకు కలుగుతుంది? చేయకూడని పని చేయడం మూలంగా కదా!

ఇతరవ్యసనాలు వాక్పారుష్యం కూడా సప్తవ్యసనాల్లో ఒకటి కదా!

ఇవన్నీ తెలిసి చేసే తప్పులుకదా!!!

మనం నిత్య వ్యవహారంలో ఈ నీతిని పాటించం, ఇది ఎవరికో చెప్పిన మాటనుకుంటాం, మనకి సంబంధం లేదనుకుంటాం. అదీ విచిత్రం..

***


గతె శోకె న కర్తవ్యో

భవిష్యం న చింతయేత్

వర్తమానేన కాలేన

వర్తయంతి విచక్షణాః

(ఆచార్య చాణక్య)


గతము తలచి, వగచి ఉపయోగం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఆతృత పడవద్దు. విచక్షణ కలవారు వర్తమాన కాలం మీద దృష్టి పెడతారు. 


Thursday 13 July 2023

భోజనాంతె విషప్రదమ్

 భోజనాంతె విషప్రదమ్


అజీర్ణే భేషజం వారి

జీర్ణే వారి బలప్రదమ్

భోజనె చామృతం వారి

భోజనాంతె విషప్రదమ్

(ఆచార్య చాణక్య)


 అజీర్ణానికి మందు,నీరు తాగడం. ఆహారం జీర్ణమయ్యాకా నీరుతాగితే బలంకలిగిస్తుంది. భోజనం తో పాటుగా నీరు అమృత సమానం. భోజనానంతరం తాగే నీరు విషంతో సమానం.


 నీరు ఎప్పుడెప్పుడు తాగితే ఏమి ఫలితం అన్నది ఒక చోటికి చేర్చారనుకుంటాను.


వృద్ధకాలే మృతా భార్యా

బంధుహస్త గతం ధనం

భోజనం చ పరాధీనమ్

తిస్రః పుంసాం విడమ్బనాః

(ఆచార్య చాణక్య)


పెద్దవయసులో భార్యగతించడం,తన డబ్బు బంధువుల చేత చిక్కడం, భోజనానికి ఇతరులపై అధారపడటం అనే మూడు అనుభవించేవాడు దురదృష్టవంతుడు.


Friday 7 July 2023

లెక్క తప్పుతోంది.

 లెక్క తప్పుతోంది.


నీకీ వయసులో లెక్కలేంటయ్యా? అనకండి.

లెక్క లెక్కే కదా!

లెక్క ఎందుకూ? అన్నది మాట.

నేను కూడబెట్టుకున్న ఆస్థులు,షేర్లు విలువ పెరిగిందా తరిగిందా? నిప్టీ  లెక్కేసుకోడానికి కాదు.

మరేంటి?

ఉదయం ట్రేక్ మీద నడుస్తాను. ఎన్ని రౌండ్లు తిరిగాను? అదీ లెక్క!

వేళ్ళు లెక్కెంటుకుంటే సరిపోయె!

వేళ్ళు లెక్కేట్టేను, వేలి కణుపులు లెక్కెట్టేను. అబ్బే! నడుస్తుండగా, వేళ్ళు ముడవడం మరవడమో, కణుపులు లెక్క ముందుకా వెనక్కా! సందేహం రావడం, ఇలా లెక్క తప్పుతోంది.

ఏం చేయాలి?

సెల్ పోన్ పట్టుకెళ్ళి స్టాప్ వాచ్ లో రౌండ్లు లెక్కేసేను. ఇందులో కూడా రౌండు అయ్యాకా నొక్కేనా? లేదా? సందేహం! ఇలాగా లెక్కతప్పుతోంది.

అసలు రౌండ్లు లెక్కెందుకూ?

పది రౌండులైతే నాలుగు కీలో మీటర్లు నడచినట్టు! అదీ సంగతి.

ఏం చేయాలో తోచలేదు, ఇలా పడుతూ లేస్తూ, లెక్కతప్పుతూ నడుస్తూనే ఉన్నా రోజూ!

ఓ రోజు నడుస్తుండగా, హటాత్తుగా మెరుపు ఆలోచనొచ్చింది.

ఉదయం నడకలో బలే బలే ఆలోచనలొస్తాయి, బుర్రొంచుకు నడుస్తుంటే! ఈ ఆలోచనలన్నీ కొద్ది సేపటికే ఆవిరైపోతాయి. కొన్ని మాత్రమే బతికి బట్టకడతాయి. అటువంటివే ఇక్కడ కంప్యూటరుకి ఎక్కుతాయి. ఈ సొదెందుకుగాని ఏం చేసేవో చెబుదూ అని సెలవా!

ఆలోచనొచ్చిన దగ్గరే వంగున్నా, చిన్న చిన్న రాళ్ళు ఏరుకున్నా!

కూడా ఉన్నవాళ్ళడిగేరు. రాళ్ళుందుకూ? చెప్పేను. నవ్వుకున్నారు.

నవ్వుకోండి నాకేం! ఏదో ఒక రోజు మీకూ ఈ అవస్థ తప్పకపోవచ్చని మనసులో అనుకున్నా!

ఒక్కో రౌండుకి ఒక్కో రాయి పారేస్తూ వచ్చా! 

చివరికి చెయ్యి ఖాళీ అయింది, రౌండ్ల లెక్క సరిపోయింది, కాళ్ళూ పీకేయి :)


లోకో భిన్నరుఛిః  లోకంకదా! నవ్వుతారు. నవ్వేరని మనపని మానుకుంటామా?  మనిషి నోరు మూయడానికి మూకుడుందిగాని,లోకం నోరు మూయడానికి మూకుడు లేదు, ఇదో నానుడి.

Wednesday 5 July 2023

అమిత్రం కురుతె మిత్రం

 

అమిత్రం కురుతె మిత్రం

మిత్రం ద్వేష్టి హినస్తి చ

కర్మ చారభతె దుష్టం

తమాహుర్మూఢచేతసమ్.

(విదుర నీతి) 

అమిత్రులతో (స్నేహానికి అర్హులు కానివారితో)మిత్రత్వం నెరపేవారు,స్నేహానికి అర్హులను ద్వేషించేవారు. స్నేహార్హులపై పగ సాధించేవారు,  హానిపొందుతారు. వారే మూఢులని పిలవబడతారు.

కర్ణుడు, శిశుపాలుడు,జరాసంధుల స్నేహం, చేయ కూడనివారితో స్నేహంచేసి, స్నేహం చేసి బాగుండవలసిన పాండవుల పట్ల ద్వేషం పూని వారి చావుకు ప్రయత్నం చేసి, తాను చావును కొనితెచ్చుకున్నవాడు, దుర్యోధనుడు.


ఇది లోకం, రకరకాలవాళ్ళుంటారు. ఎవరితో స్నేహం చేయచ్చో,ఎవరితో చేయ కూడదో, తెలుసుకోవడమే విజ్ఞత. 

Tuesday 4 July 2023

చచ్చి బతికేరు

 చచ్చి బతికేరు


 చచ్చి బతికేరు

 చస్తే ఎలా బతుకుతారు చెప్మా! కష్టం మీద బతికి బయటపడ్డారని అర్ధంట, గండం గడిచిందని.


చావలేక బతుకుతున్నాం బతకలేక చస్తున్నాం!

కష్టాలు పడలేకున్నాం. చావడానికి తెగించలేకున్నామనిట.


చావు బతుకు.

కష్టమైన బతుకని అర్ధంట.


చావరా! చావు!! చావమన్నాగా!!!

రా! రారా! రమ్మన్నగా!! అని అర్ధంట.


చచ్చినా చెప్పిన మాట వినడు.

ఏం చెప్పినా ఎలా చెప్పినా వినడని అర్ధంట.

చస్తే చెప్పినమాటేలా వింటాడు సినబ్బా!!


చావు పీనుగు 

ఇదేంటి? చస్తేనే కదా పీనుగయ్యేది!!!!!

పనికిరానివాడని అర్ధంట.


చచ్చినాడా! వచ్చేవా!!! 

 ఇదొక తిట్టు, మురిపెంగా. సాధారణంగా స్త్రీలు వాడేది.


చచ్చిచెడి చాయంగల విన్నపాలు.

చాలా కష్టం మీద చేసే విన్నపాలు.

గ్రామీణుల తెనుగు నుడికారపు సొంపులు

Saturday 1 July 2023

పృధివ్యా త్రీణి


 


  పృధివ్యా త్రీణి రత్నాని   

 (ఆచార్య చాణక్య)     

   

                                             

                                         పృధివ్యా త్రీణి రత్నాని                                              

జలమన్నం సుభాషితమ్

మూఢే పాషాణఖండెషు

రత్నసంజ్ఞా విధీయతె


భూమి మీద విలువైనవి మూడే!అవి నీరు,అన్నం,సుభాషితమున్నూ. మూర్ఖులు రాతి ముక్కలని రత్నాలని భ్రమిస్తారు.


అన్నము,నీరు,సుభాషితము (ఇవే రత్నాలంటారు కవి) ప్రాణాలు పోస్తాయి.రత్నాలనుకునే రాతి ముక్కలు ప్రాణాలు తీస్తాయి. రాతి ముక్కల్ని రత్నాలనుకుని మూఢులు భ్రమపడతారని చాణుక్య ఉవాచ.



శైలె శైలె న మాణిక్యం 

మౌక్తికం న గజె గజె

సాధవో న హి సర్వత్ర 

చందనం న వనె వనె


అన్ని పర్వతాలోనూ మాణిక్యాలు దొరకవు.అన్ని ఏనుగులలోనూ ముత్యాలు దొరకవు ( ఏనుగు కుభస్థలంలో ముత్యాలుంటాయని ప్రతీతి).సాధకులు ప్రతిచోట ఉండరు.చందనపు చెట్లు అన్ని అడవుల్లోనూ ఉండవు.


గొప్పవైనవన్నీ కొన్ని చోట్లమాత్రమే ఉంటాయని కవిగారి మాట


రాజా వేశ్యా యమశ్చాగ్ని

తస్కరో బాలయాచకో

పరదుఃఖం న జానంతి

 అష్టమో గ్రామకంటకః


రాజు,వేశ్య,యముడు,అగ్ని, దొంగలు,బాలలు,యాచకులు వీరంతా ఇతరుల కష్టం గుర్తించరు. ఎనిమిదోవాడు గ్రామీణుడు.(పల్లెటూరి బైతు)  


విద్వాన్ ప్రశస్తతె లోకె 

విద్వాన్ గఛ్ఛతి గౌరవమ్

విద్యయా లభ్యతె సర్వం

 విద్యా సర్వత్ర పూజ్యతె


విద్వాంసుడిని లోకం పొగుడుతుంది.విద్వాంసుణ్ణి లోకం గౌరవిస్తుంది. విద్యతో సర్వం లభిస్తాయి. విద్యను సర్వత్రా పూజిస్తారు. 


విద్యలేనివాడు వింత పశువని తెనుగుమాట. 


అనాహూతః ప్రవేశతి

అపృష్ఠో బహు భాషతె

అవిశ్వస్తె విశ్వసతి

మూఢచేతా నరాధమః


పిలవక వచ్చేవాడు,అడగకనే అనవసరంగా అనర్గళంగా మాటాడేవాడు,నమ్మకూడనివారిని నమ్మేవాడు,పనికిరానివాడు, మూర్ఖుడు.

****

పక్షిణా బలమాకాశం

మత్స్యానాముదకం బలం

దుర్బలస్య బలం రాజా

బాలానం రోదనం బలం


పక్షికి ఆకాశం బలం.చేపకు నీరు బలం. దుర్బలులకు రాజు బలం. బాలలకు రోదన బలం.


నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థానబల్మిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!