Thursday 24 October 2019

వెల్లుల్లిం, దిలపిష్టమున్

కుల్లాయించితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిం, దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్తవడ్డింపగాఁ
జల్లాయంబలిద్రావితిన్, రుచుల్ దోసంబంచు బోనాడితిన్
దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా నేను శ్రీనాథుడన్


కుళ్ళాయి లేదా కుల్లాయి అంటే తలపాగా, తెలుగు కన్నడనాట తలపాగా చుట్టడం అలవాటుండేది. అందునా ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే జిల్లాలలో. ఇదై చాలా పొడుగ్గా ఉండేదట, ఎందుకంటే ఎండలో ప్రయాణం చేసేటపుడు తలకు రక్షణ అదేగాక మంచినీటి వసతి తక్కువగా ఉన్నచోట దిగుడు బావులే గతి, వాటిలో కూడా నీరు చాలా లోతుగానూ ఉండేది. గొంతు తడుపుకోడానికి ఈ తలపాగాను ఉపయోగించుకునేవారు. శ్రీనాథుడు బయలుదేరితే మంది మార్బలం పల్లకీలు ఏనుగులు ఇలా సపరివారంగా బయలుదేరేవాడు ఒంటిగా సామాన్యునిలా తలపాగా చుట్టుకుని కాలి నడకన సంచారం చేశారన్నదానికిది సూచిక. నాటి సామాన్యులంతా ఈ తలపాగాలు ధరించేవారనమాట. 

కోక జుట్టితి, కోక అంటే నేడు స్త్రీలు కట్టుకునే వస్త్రమనే అర్ధం నిశ్చితమైనది తప్ప, నాడు కోక అంటే స్త్రీ పురుషులిద్దరు కట్టుకునే దానిని కోక అనే అనేవారు. శ్రీనాథుడు పట్టు పీతాంబరాలు కట్టుని పైన మరొక పీతాంబరం వేసుకునే అలవాటున్నవాడు, సామాన్యులు కట్టుకునే పంచ కట్టుకున్నానని చెబుతున్నమాట. 


కూర్పాసం అంటే పొట్టి చొక్కా!కటివలయం దాకా ఉండేది. మహా కూర్పాసం అంటే పెద్ద చొక్కా. ఆ చొక్కా ఎలా ఉండేది? చేతులు లేని జుబ్బా లాగా పొడుగ్గా పక్క జేబులతో మోకాళ్ళు దిగేదాకా ఉండేదే మహా కూర్పాసం. పల్లెలలో సామాన్యులు దీన్నే తొడిగేవారన్నది సూచన. 


ఇక్కడికి ఆయన ఆహార్యం చీని చీనాంబరాలు, పట్టు వస్త్రాలనుంచి ఎంత సామాన్య స్థితికి దిగజారిపోయిందో చెప్పారు.


ఇక ఆహారం గురించి చెబుతున్నారు. ఒకప్పుడు బంగారు పళ్ళెంలో రాజనాలు, మొలగొలుకులు 
లాటి మేలి వరి అన్నం, షడ్రుచులతో భోజనం చేసినవాడు, ఇప్పుడేలా ఉన్నది చెబుతున్నారు. 


తిలపిష్టం అంటే తెలగపిండి. నేటికి తెలగపిండి కూర అంటే నీచంగానే చూస్తారు. ఈ తెలగపిండి కూరలో వెల్లుల్లి వేయడం సామాన్యులకు అలవాటూ. మరి శ్రీనాథుడు ఆహితాగ్ని, వెల్లుల్లి తినడం నిషేధం, కాని వెల్లుల్లి వేసిన తెలగపిండి కూర తిన్నాను అన్నారు. అది కూడా ఎంత హీనస్థితిలో, ఆచారం ఐతే విశ్వస్త వంట చేసిన,వడ్డించినా ఆహితగ్నులకు పనికిరాదు. మరి శ్రీనాథుడు కడుపు కాలిపోతుంటే వెల్లుల్లివేసిన తెలగపిండి కూర తిన్నానన్నారు. విశ్వస్త అంటే విధవ, సకేశి అనగా కేశములుంచుకున్న విధవ.   ఆహితాగ్ని ఐన శ్రీనాథునికి ఈమె వడ్డిస్తే తినడం నిషిద్ధం. చల్లాయంబలి ద్రావితిన్, ఆయన జన్మలో ఎప్పుడూ చల్లగాని అంబలికాని తాగలేదు అప్పటి వరకూ, పెరుగు మాత్రమే ఎరిగినవాడు, అది లేదు సరికదా చల్ల తాగేనన్నారు, అది కూడా దొరక్కపోతే అంబలి తాగేనన్నారు. కడుపులో కాలుతుంటే, దోషమని తెలిసినా రుచులు, ఆచారాలు వదిలేశానన్నారు. 


 తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ, దయ చూపవా,  నేను శ్రీనాథుడిని సుమా,  అన్నారు. 

Tuesday 22 October 2019

ఆ చూపులకర్ధమేంటి?






కదలబోతున్న లిఫ్ట్ లోకి ఒక యువకుడు దూసుకొచ్చాడు. లిఫ్ట్ నా తాహతు కు మించిన బరువు మోయలేనని, కదల్లేనని మొరపెడుతూ ఒకళ్ళని దిగమని అరుస్తోంది.. చూసిన యువకుడు నాకేం సంబంధం లేదన్నట్టుగా,  నేను అదనపు బరువు కాదు, బయటికిపోనన్నదానికి సూచనగా  మొరాయిస్తూ తలవిదిలించి,తలొంచుకుని ఫోన్ లో ములిగిపోయాడు. అప్పటికే లిఫ్ట్ లో ఉన్నవారు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు, చివరగా దూసుకొచ్చిన యువకుని కేసీ చూశారు. సమయం మించిపోతోందని వాచీలు చూసుకున్నారు, ఎవరు లిఫ్ట్ నుంచి బయటకు నడవలేదు. లిఫ్ట్ అరవడం మానలేదు, కదల లేదు. ఇంతలో ఒకమ్మాయి నెమ్మదిగా, వెనుకనుంచి దారి చేసుకుని బయటికొచ్చింది,నడవడానికి ఇబ్బంది పడుతూ ఊతకర్రల సాయంతో. లిఫ్ట్ లో అందరూ ఆమెను చూశారు, యువకుడూ చూశాడు. అప్పుడూ అతనిలో మార్పురాలేదు. మిగతావారు మాటాడ లేదు. అమ్మాయి లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళి వెనుతిరిగి చూచింది, విరిసీ విరియని పెదవులపై చిరునవ్వో, మౌన నిరసనో తెలియనట్టు. ఇంతకీ, ఈ సంఘటనలోనివారి, ఆ నడవలేని ఆయువతి చూపులకర్ధమేంటీ?


యువకుడు:- నేను పైకి వెళ్ళాలి, నా అవసరం తీరాలి, లిఫ్ట్ కదలకపోడానికి నాది కాదు పొరబాటు,వ్యవస్థ తప్పు.  ఒకళ్ళు దిగిపొండి. నడవలేక ఊతకర్రల సాయంతో నడచే యువతి దిగినపుడు " అది ఆమె ఇష్టం, నాకేం సంబంధం" అనే తిరస్కార భావం. 


లిఫ్ట్ లో ఉన్నవారు:- కదలబోతున్న లిఫ్ట్ లోకి యువకుడు దూసుకురావడంతోనే బరువు ఎక్కువై లిఫ్ట్ కదలనంటోంది, దాని ఓపికకంటే ఎక్కువ బరువు కావడం చేత. ఎవరు దిగాలి? చూపులలోప్రశ్న  . చివరికి దూసుకొచ్చిన యువకుని మూలంగానే బరువు ఎక్కువైంది కనక, అతనే దిగాలని ఏకాభిప్రాయం, కాని ఒక్కరి నోటి వెంట వెలువడని నిర్ణయం. యువకుని నిర్లక్ష్యం. అతనిని బయటికి  పంపలేని అసహాయత. చివరికి కాళ్ళు గట్టిగా లేక చంకకర్రలతో నడిచే యువతి దిగినప్పుడైనా నోరు విప్పలేని అసహాయత, అన్యాయం జరుగుతున్నా,  అన్యాయం జరుగుతోందని తెలుస్తున్నా మాటాడలేని, తప్పు సరి దిద్దలేని పెద్దలు.


యువతి చూపులకర్ధమేంటీ:- విరిసీ విరియని పెదవులపై అది చిరునవ్వా? లేక సమాజం మీద ఎక్కుపెట్టిన నిరసనా? నిర్ణయంగా చెప్పలేను.

అది చిరునవ్వయితే......
చిరునవ్వు:- యువకుడిని ఉద్దేసించి, ''అన్నా కాళ్ళు బలంగా లేకున్నా, ఊతకర్రల్తో నడిచే శక్తి ఇచ్చిన భగవంతునికి ప్రణామం. నేడు మెట్లు ఎక్కి ఐనా ఆఫీస్ కు చేరగలనన్న నమ్మకం నాకుంది, నేను జీవన గమ్యం చేరడానికి ఆలస్యం కావచ్చేమోగాని, కచ్చితంగా మాత్రం గమ్యం చేరతాననే ధైర్యం ఉన్నది. నీవు జీవన గమ్యం చేరడానికి,  తొందరగా చేరాలనే ఆతృతలో తప్పులు చేసి అసలు గమ్యమే చేరలేవేమో చూసుకో! భగవంతుడు నాకు గట్టి కాళ్ళివ్వకపోయినా సంఘం పట్ల నా గట్టి నిర్ణయాన్ని అమలు చేసే తెలివి, సంస్కారం,ఆలోచన ప్రసాదించాడు, నీకది శూన్యమేమో తెలుసుకో! ''అన్నా! నీ శరీర అవయవాలన్నీ బాగున్నా, నీ మనసులోని అవిటితనానికి నా సానుభూతి.

అది నిరసనైతే....
నిరసన... ఒక  పాపం జరిగినపుడు దాని పాప  ఫలితం  ముగ్గురు పంచుకుంటారు, వారు, కర్త,కారయిత,అనుమోదకులు. కర్త, పాపం చేసేవాడు. కారయిత,  పాపం చేయించేవాడు. అనుమోదకుడు,   పాపం ను బాగుందని ప్రోత్సహించేవాడు. ఇందులో మీరెవరు? మీరు నోరు విప్పనంతకాలం, సమాజం ఇలాగే లిఫ్ట్ లాగే కదలదు.  అన్యాయం మీదాకా వచ్చినపుడు మాత్రమే మీకు నొప్పి కలుగుతుంది, అప్పుడు బాధపడి లాభం ఉండదు, చేతులుకాలిన తరవాత ఆకులు ప ట్టుకున్నట్టవుతుంది. ధర్మో రక్షతి రక్షితః ..నేడు లిఫ్ట్ కదలడానికి, నేను అదనపు బరువు కాకపోయినప్పటికీ, స్వయంగా నేనే అదనపు బరువుగా భావించుకుని తొలగిపోయాను, మీ అందరూ పైకి వెళ్ళడానికి సహకరించాను. సమాజం కూడా కదలలేని లిఫ్ట్ లాగానే ఉంది. అదనపు బరువైనవారి కోసం ఎవరో ఒకరు త్యాగాలు చేస్తూనే ఉన్నారు, ఇక ముందు సాగదేమో, హెచ్చరిక, తస్మాత్ జాగ్రత! 


కొసమాట:- లిఫ్ట్ అరుపులు తప్పించి, మాట లేని చిన్న టెలిఫిల్మ్ లో దర్శకుడు అన్నీ తానే ఐ కనిపించాడు విశ్వరూపంతో. గొప్ప భావాలను చూపులతోనే తెలుపగలిగిన దర్శకునికి జే జేలు. నటీ నటులంతా పాత్రలలో జీవించారంటే అతిశయోక్తి కాదు, దర్శకుని భావాలను కళ్ళతోనే పలికించారు. యువకుడు నటనలో జీవించాడు, పాత్రలో. యువతి విరిసీ విరియని పెదవులలో చిరునవ్వో, మౌన నిరసనో, తెలిసీ తెలియనట్లు భావాన్ని ప్రదర్శించి లఘు చిత్రానికి కొలికి పూసైయిందంటే,ఆశ్చర్యం లేదు.

వాట్సాప్ లో కనిపించిన ఈ చిత్రం పాతదే కావచ్చు, నా దృష్టిని ఆకర్షించింది.  
I feel it is an old, short  telefilm. OLD IS GOLD. Enjoy!!!

Monday 14 October 2019

వసుదేవుడు గాడిద కాళ్ళు


వసుదేవుడు గాడిద కాళ్ళు..... 

వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు అంటుంటారు. వసుదేవుడంతవాడు గాడిద కళ్ళెందుకు పట్టుకోవలసి వచ్చింది, అసలు గాడిద కాళ్ళు పట్టుకున్నాడా? భాగవతంలో చూదాం..రండి...

భాగవతంలో ఎక్కడా వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్న సందర్భం కనపడలేదు. పరమాత్మ పుట్టడమే నాలుగు చేతులతో శంఖ, చక్ర,గద లతో పుట్టేరు, తల్లితండ్రులకు అలా దర్శనమిచ్చి ఆ తరవాత మామూలు బాలకుడయ్యాడని భాగవతం చెబుతోంది. ఆ సమయం లో లోకమంతా గాఢ సుషుప్తిలో ఉన్నదని భాగవతం మాట.  కాని లోకం మాటేంటంటే, పరమాత్మని తలపై బుట్టలో ఉంచుకుని తీసుకు వెళుతున్న వసుదేవుని చూసి గాడిద ఓండ్ర పెట్టిందనీ, ఆ అరుపుకు కావలివారు లేస్తే పరమాత్మని వ్రేపల్లె చేర్చడం కుదరకపోవచ్చు గనక ఓండ్ర పెట్టద్దని వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు. లోకమంతా గాఢ సుషుప్తిలో ఉండగా ఈ గాడిద మాత్రం ఎలా మెలుకువగా ఉండగలిగింది? ఈ ప్రశ్న అడిగినవారూ లేరు, దీనికి సమాధానమూ లేదు.

మనం కొంచం ముందుకెళ్ళి దేవకి, వసుదేవుల గురించి కంసుని గురించి చూదాం. 

దేవకి కంసుని పినతండ్రి కూతురు. తోడబుట్టిన చెల్లెల్లు కాకపోయినా కంసుడు దేవకి పై ప్రేమ చూపాడు. వసుదేవునికిచ్చి దేవకిని వివాహం చేసిన సందర్భంలో స్వయంగా రథం నడుపుతూ, దేవకిని అత్తవారింటికంపుతున్న సందర్భం. ఇంత ఆనందకర సందోహంలో ఆకాశవాణి అసదర్భంగా ఇలా పలికింది. ”కంసా! ఇంత ఆప్యాయతతో అత్తవారింటికంపుతున్న ఈమె అష్టమ గర్భం నీకు మారకం కలగజేస్తుందీ” విన్న కంసుడు విచలితుడై చరాలున కత్తి దూసి దేవకిని సంహరించడానికి పూనుకుంటాడు. ఆ సందర్భంగా వసుదేవుడు పలికిన పలుకులు చిత్తగించండి. 

”దేవకి కి అన్నవు కదయ్యా! చీరలు,సారెలు పెట్టడమో,చక్కగా మాటాడటమో చేయాలిగాని, ఆకాశవాణి చెప్పిందని, అది నిజమనీ నమ్మి 
చెల్లెలిని చంపకు! ఆలోచించు,తొందరపడకు” అని బతిమాలాడాడు. కోపం మీద ఉన్న కంసుడు కంగలేదు. దాంతో మళ్ళీ నీ చెల్లెలు ముద్దరాలు, ఏమీ తెలియనిది, నీ క్షేమమే ఎప్పుడూ కోరేది అటువంటి దానిని బయటవారి మాట పట్టుకుని చంపుకుంటావా? అని నిలదీసాడు.నువ్వు పుట్టడంతోనే కూడా మృత్యువూ పుట్టింది, ఇప్పుడో మరో నూరేళ్ళకో చావు తప్పదు అంటూ

కర్మంబులు మేలునిచ్చును, గర్మంబులు కీడు నిచ్చు కర్తలు దనకున్
గర్మములు బ్రహ్మకైనను,గర్మగుడై వరల దడవగా నేమిటికిన్.....

ఇంత చెప్పినా కంసుడు వినలేదు.ఇలా మరికొన్ని మాటలు చెబుతూ వసుదేవుడు ఆలోచించాడు తనలో.
''ఎంతదాకా వీలుంటే అంతదాకా ప్రయత్నం చేయాలి కదా అనుకుని కష్టంలో ఉన్న దేవకిని రక్షించాలంటే కొడుకుల్ని ఇచ్చేస్తాను అని చెప్పడం మంచిది కదా! ఇప్పుడీమె ప్రాణాలు దక్కితే రేపేమవుతుందో ఎవరికెరుక? కొడుకులు పుడితే వారి చావు వెంట వస్తే తప్పించగలవారెవరు? అంతెందుకు వీడు బ్రహ్మరాత కొద్దీ రేపటికేమవుతాడో ఎవరి కెరుక? వీడి కర్మ ఎలారాసి ఉందో ఎవరికి తెలుసు? అందుకని కొడుకులనిస్తానని భార్యను విడిపించుకోవడం నేటి నీతి,కర్తవ్యం''  అని తలపోసి ”కొడుకుల్ని ఇచ్చేస్తాను దేవకిని వదిలేయ”మంటే అలాగేనని ఒప్పుకుని వారిని నగరులోని సౌధంలో ఉంచాడు. నజర్ బంద్ అనమాట అంటే కళ్ళెదురుగా ఎక్కడికి పోకుండా బందీగా మహల్ లోనే ఉంచటం. హవుస్ అరస్ట్. అలా బందీగా ఉండడానికే వసుదేవుడు ఇష్టపడ్డాడు. నీ చెల్లెలు, ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, దీనికి పుట్టే వాడు నీ ప్రాణహానికి కారణమని, నీ చెల్లిని చంపుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో నాకేం, మరో పెళ్ళాం దొరకదా! అని వదిలేసిపోక  కంసుని గాడిదను చేసి,
కాళ్ళు పట్టుకున్నంత పని చేసి దేవకిని రక్షించుకున్నాడు. 


వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నంత దైన్యంగా మాటాడినంతలో కంసుడు గొప్పవాడుకాలేదు, వసుదేవునికి చిన్నతనమూ రాలేదు. కంసుడే గాడిదయ్యాడు.
14.10.19
చిన్న వివరణ:- కంసుడు దేవకి వసుదేవులను మొదటగా హౌస్ అరస్ట్ మాత్రమే చేశాడు. దేవకి సంవత్సరానికి ఒక బిడ్డని కన్నట్టు కన్నది. కన్న బిడ్డలను ఎప్పటికప్పుడు కంసుని వద్దకు వసుదేవుడు తీసుకుపోయాడు. కంసుడు అలా తీసుకువచ్చిన బిడ్డలను, ''వీడు నా శత్రువు కాదు,  అష్టమ గర్భంలో జన్మించేవాడే నాకు శత్రువు తీసుకుపొమ్మని'' వసుదేవునికిచ్చి పంపేశాడు. ఇలా ఆరుగురు పుత్రులను వెనక్కి ఇచ్చేశాడు. ఒక రోజు నారదుడు కంసుని వద్దకు వచ్చి ''దేవకి,వసుదేవుడు యాదవులు అందరు దేవతాంశవారు , నీవు రాక్షసుడవు, కాలనేమి అంశవాడివి'' అని చెప్పిపోయాడు. కంసునిలో కోపం రగిలింది, వసుదేవుని ఆరుగురు బిడ్డలను నరికేశాడు. దేవకి వసుదేవులను కారాగృహంలో సంకెళ్ళతో బంధించాడు. అలా కృష్ణుడు కారాగారంలో జన్మించాడు. ఇది భాగవతం మాట
కీ అలవాటు పోలేదనమాట’’ అనడంతో మానిటర్ తన పక్క తిప్పుకుని పూర్తిగాచదివి……
సుదేవుడు కండి కాళ్ళు

Saturday 12 October 2019

మానసిక రోగులు


మానసిక రోగులు.

ఇదెప్పటి మాటా? ఏభై సంవత్సరాల పైబడినది. ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాకా కాఫీ ఇచ్చి కబుర్లు చెబుతూ ఓ కార్డ్ చేతిలో పెట్టింది, ఇల్లాలు.ఏంటన్నట్టు చూసా. మీరే చూడండన్న మాటగా చూసింది. ఈలోగా అమ్మ కలగజేసుకుని ఇటువంటి ఉత్తరాలు వస్తూనే ఉంటాయి, అనేసి వెళిపోయింది. 

అసలింతకీ ఉత్తరంలో సంగతేమంటే ”ఓం నమో వేంకటేశాయ” అని పాతిక సార్లు రాసి పదిమందికి పంపండి మీ కష్టాలు తొలగిపోతాయి, అదీ సారాంశం. నిజమే పీకలోతు కష్టంలో ఉన్నాం, అప్పటికి. పెద్దమ్మాయికి వినపడదు, మాటలు రాలేదు, ఏం చేయాలి? నీటిలో ములిగిపోతున్నవాడు గడ్డిపరక దొరికినా ఆసరా చేసుకోడానికి ప్రయత్నించినట్టు, ఎవరేది చెబితే అది చేస్తున్న కాలం.

నాకైతే ఇలాటి వాటిని నమ్మేవాడిని కాదుగాని, ఇల్లాలేమంటుందోనని చిన్న భయం. ఆవిడేమో చెళ్ళపిళ్ళవారికి ముద్దుల ఆడపడుచు, మరో పక్క దువ్వూరి సుబ్బమ్మగారికి (స్వాతంత్ర్య సమరయోధురాలు) అనుంగు శిష్యురాలు. ఈ దువ్వూరి సుబ్బమ్మ అనేపేరు చాలామందికి ఉన్నదికాని అసలు సుబ్బమ్మగారిది కడియం, ఇల్లాలు ఆవిడకి అనుంగు శిష్యురాలు, అదనమాట సంగతి. 

ఏంటన్నట్టు చూశా,మళ్ళీ. ఇలా కార్డులు రాసేస్తే కష్టాలు తొలగిపోతుంటే, ఇంకా లోకంలో చాలామందికి కష్టాలెందుకున్నాయంటారు? ప్రశ్నించింది. ఏం చెప్పాలో తోచలేదు. కార్డ్ పట్టుకు వెళిపోతుంటే ఆపేను, రేపు పొద్దుటే నీళ్ళపొయ్యి అంటించుకోడానికి ఏమీ లేదే అని చూస్తున్నా అంటూ కార్డ్ పట్టుకుని వెళ్ళిపోయింది. తన భావమేంటో అర్ధమయి ఊరుకున్నా!

కాలం గడుస్తుండగా ఇటువంటివే కొన్ని భయపెడుతూనూ, కొన్ని మభ్యపెడుతూ, మరికొన్ని ప్రలోభపెడుతూ రకరకాల ఉత్తరాలొస్తుండేవి. అలవాటయిపోయాయి కూడా. కాలం మారింది ఉత్తరాలు రాసే అలవాటేమో వెనకబట్టింది, కాని మనుషుల్లోని అవకరం మాత్రం వెనకబట్టలేదు. ఆ తరవాత కాలంలో మెయిళ్ళొచ్చాయి. ఈ మెయిల్ పాతిక మందికి ఫారావార్డ్ చేయండి, పార్వార్డ్ చేయండి  గంటలో శుభవార్త వింటారు, ఇలా రకరకాలే..మెయిళ్ళూ వెనకబట్టేయి, ఇప్పుడు మరీ తేలికైపోయింది, వాట్సాప్ లో. కింద మెసేజి చూడండి. 




 వీరు ఇటువంటివి ప్రచారం చెయ్యడమే కాక పుకార్లు పుట్టించడంలో ప్రచారం చేయడం లో సిద్ధ హస్తులు కూడా. ఈ మధ్య కాలంలో వీరికి కొంత సొమ్ముకూడా గిట్టుబాటవుతున్నట్టే వుంది





టెక్నాలజీతో అవకరం కూడా పెరిగిందిగాని తరగలేదు. ఇటువంటి మానసిక రోగులై తే పెరుగుతూనే ఉన్నారు.



వీరు మానసికరోగులు మరో మానసిక రోగిని తయారు చెయ్యాలనే తాపత్రయంలో ఉన్నారంతే 


Tuesday 1 October 2019

15th August 1947 న కూడిన మొదటి తరం సినీ నటీనటులు,గాయనీ మణులు


Photo courtesy... Sree. Vinnakota Narasimha Rao.

నాకు సినిమాల గురించి తెలిసినది తక్కువ, పల్లెటూరిలో పుట్టి పెరగడం చేత. ఈ నటీనట గాయనీమణులలో కొంతమంది తెలియరు. తెలిసినవారిని వరుసగా.

కూర్చున్నవారు. ...  రావు బాలసరస్వతీ దేవి..గాయని లలితగీతాలు,భావగీతాలు. అద్భుత గాత్రం.

కుర్చిలలోవారు. ...   మాలతి కొద్దిగా తెలుసు.  మాలతిని చూసి భానుమతిగా పొరబడ్డా. శాంత కుమారి  పాడవోయిభారతీయుడా.

 ఆ తరవాత నటి,గాయని,దర్శకత్వం,రచయిత్రి, వ్యాపారి, ఒకటేమి సినిమా అంటే నిర్వచనం. అభిమానంతో కూడిన భయం. భయంతో కూడిన అత్మీయత. తిరుమతి భానుమతి. మాట కరుకు మనసు వెన్న.

 టంగుటూరి సూర్యకుమారి యా?

నిలబడ్డవారు.. నాగయ్య, నాటి హీరో! మనసున్న మనిషి. గోవిందరాజుల సుబ్బారావు. అద్భుత నటుడు. గుండె పట్టేసే లింగమూర్తి.సి.ఎస్. ఆర్ అసలు పేరు  సి.ఎస్. ఆర్ ఆంజనేయులు,ఇంటి పేరు తెలీదుగాని సీతారామాంజనేయులు, నటుడు, విలన్ కి నిలువెత్తు రూపు, తడిగుడ్డతో గొంతు కోసే రకం విలనీకి మారు పేరు. నారాయణరావు నాటి హీరో. రంజన్, ఆర్. నాగేశ్వర రావు విలన్ కాకముందు విలన్. రామచంద్రన్ ఆనాటి నటుడు,  అప్పుచేసి పప్పుకూడు లో నటించినట్లు గుర్తు.

మిగిలినవారు తెలియదు. కొంతమంది లేరు. అందులో ముఖ్యులు బొడ్డపాటి,విన్నకోట. 
ఫోటో పెద్దది గా ఇచ్చాను, ఇబ్బంది లేకుండా గుర్తించడానికి.  ఎందరు సజీవులో తెలియదు. వీరంతా ఆల్ ఇండియా రేడియో లో సమావేశానికి సూత్రధారి కెమెరా వెననకుండిపోయినట్టుంది.