Monday 30 November 2020

జీర్ణతృణంబు మేయునే?


 
తిరుమల ఘాట్ రోడ్డు



జీర్ణతృణంబు మేయునే?


క్షుత్సామో ఽ పి జరాకృశో ఽ పి శిధిలప్రాయో ఽ పి కష్టాం దశా

మా పన్నో ఽ విపిన్న దీధితిరసి ప్రాణేషు నశ్యత్స్వపి

మత్తేభేన్ద్ర విభిన్న కుమృపిశితగ్రాసైకబద్ధస్పృహః

కిం జీర్ణం తృణమత్తి మానమహతామగ్రేసరః కేసరీ


గ్రాసము లేక స్రుక్కిల జ రాకృశమైన విశర్ణ మైన సా

యాసము నైన నష్టరుచి యైనను బ్రాణభయార్తయైన ని

స్త్రాన మదేభకుంభ పిశి తగ్రహలాలసశీలసాగ్రహా

గ్రేసరభాసమాన మగు కేసరి జీర్ణతృణంబు మేయునే?.....లక్ష్మణకవి


శూరాగ్రణియగు సింహము ఆకలిచే డస్సినను,ముదిమిచే జిక్కినను, కష్ట స్థితిబొందినను, కాంతి విహీనమైనను, ప్రాణములు పోవుచున్నను,మదించి ఏనుగు కుంభస్థలము చీల్చి అందలి మాంసము భుజించునే కాని, ఎండుగడ్డి మేయునా?


సింహం ముసలిదైనా అంటే గోళ్ళు కోరలు ఊడిపోయినా,,ఆకలిచేత డస్సినా,కష్టంలో పడినా, ప్రాణం పోతున్నా ఎండు గడ్డి తినదు కాదు తినలేదు. సింహం ఉండే చోట చాలా ఎత్తుగా గడ్డి పెరుగుతుంది. సింహం తినదు, తినే జంతువులు సింగానికి భయపడి తినడానికిరావు.  సింహం శరీర నిర్మాణం ఎండుగడ్డి తినడానికి అనువుగా సృష్టింపబడలేదు. అందుచేత సింగం మాంసమే తింటుంది, కాదు మాంసపు ముద్దలు మింగుతుంది. సింగం వేటాడుకుంటే గాని ఆహారం దొరకదు, ఎవరూ పిలిచి ఆహారం పెట్టరు. సింగం పడుకుని నిద్రపోతే జంతువులు వచ్చి సింహం నోట్లో జొరబడవు. సింహం వేట చేయాల్సిందే. అందుకే గోళ్ళు కోరలు ఇచ్చాడు. గోళ్ళు కోరలు పోతే ఎవరూ సింగాన్ని లెక్క చేయరు, అందు చేత తన ఆయుధాలైన గోళ్ళు కోరలు రక్షించుకోవాల్సిందే!వేటాడుతుంటేనే, వాడుకలో ఉంటేనే బాగుంటాయి.



Saturday 28 November 2020

చిరునవ్వే చాలే .....


హారతి స్వామి ముఖం పైకి వచ్చినప్పుడు చూడండి, ముఖంలో కనపడే చిరు నవ్వు. శిల్పి గొప్పతనం. 

  సామీ!
నమస్కారం. 
ఒక విన్నపం. ఈ సంవత్సరం వర్షం మమ్మల్ని శని పట్టినట్టు పట్టింది. అతి సర్వత్ర వర్జయేత్ కదా!(కొఱకంచు చూపించినా వర్షం వాన తగ్గటం లేదు)

 గత మూడు రోజులుగా తలుపు తీస్తే రివ్వున చలిగాలి కొడుతోంది, దానికి తోడు వర్షం, ఇంక చెప్పేవా నా లాటివాని బతుకు. గత ఆరు నెలల పైగా ఇంట్లోనే బందీ ఐపోయినాము, ఇప్పుడిప్పుడే కొంత కాలు సారిస్తున్నాను, మళ్ళీ మొదలు కొచ్చేసింది సామీ. 

ఈ కరోనాతో సహజీవనం ఎలాగా తప్పదు,కష్టపడి పంట వేశాం, పంట పండింది తమ దయవల్ల కాని ఈనగాచి నక్కలపాలైనట్లేనా వర్షంతో అని బాధ. ప్రపంచంలోనే ఆహారానికి కరువొచ్చేలా ఉందేమి స్వామీ! ఈ వానలు వరదల వల్ల. 

చైనా ప్రపంచంలో ఏమూల ఆహారం కనపడినా కొనేస్తోందిట, ఆముదాలతో సహా. ఆహారం ఎక్కువగా ఉత్పత్తి చేసేవి కొన్ని దేశాలే, మిగిలినవి అంతంత మాత్రమే కదా! మా దేశం మాటేమిసామీ! మాకు పండిన గింజలైనా దక్కించవా?కలిగినవారికి, లేనివారికీ బాధలేదు, మరి మధ్య తరగతి ఒకటుంది మా దేశం లో వీరి బతుకు అధోగతి కానీవద్దని మనవి, వీరు తెగించి బావురుమని వీధినపడి ఏడవలేరు, గుడ్లనీరు కుక్కుకోవడం తప్పించి మరేం చేయలేరు, కరుణించు సామీ, నీ చిరునవ్వు ప్రసాదించి మా జీవితాలలో వెలుగు పూయించు  

Thursday 26 November 2020

రామాయ స్వస్తి.....

 రామాయ స్వస్తి....


రామాయ స్వస్తి రావణాయ స్వస్తి అనే మాట అంటుంటారు. ఏంటి దీని అర్ధం? రామునికి శుభం, రావణునికీ శుభం. ఇదెలా సాధ్యం? 


రామునికి నమస్కారం పెడితే శుభం కలగజేస్తాడు. నమస్కారం పెట్టకపోయినా ఏమీ అనుకోడు, అశుభం కలగజేయడు. రావణునికి నమస్కారం పెట్టకపోతే కోపం తెచ్చుకోవచ్చు,అశుభం కలగజేయచ్చు (భయం). 


అంచేత రామాయ స్వస్తి రావణాయ స్వస్తి అనేవారే ఎక్కువ :)

Tuesday 24 November 2020

పొన్నగంటి కూర పచ్చడి

పొన్నగంటి కూర

 

 ఆకు కూరలంటే గోంగూర,తోటకూర, గుర్తొచ్చినట్టు మిగిలిన కూరలు గుర్తురావు. బచ్చలి,కరివేపాకు,పొన్నగంటికూర,చింతచిగురు,షీకాయాకు, తూటి కూర,నెల్లి కూర ఇలాటివి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సి ఉంటాయి. ఇక గల్జేరులాటివైతే ప్రత్యేకంగానే గుర్తు చేయాలి. ఇది తినడానికేం ఇదేమన్నా విషమా గల్జేరా అని అడిగేవారు. గల్జేరు వేళ్ళు పచ్చడి చేస్తారట. నిజంగానే బహు చేదుగా ఉంటుందిట, నేనెప్పుడూ తినలేదు.కాని గొప్ప ఔషధంగా చెబుతారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి ఇటువంటివే. నిత్య జీవితంలో వాడుకుంటుంటే వ్యాధి నిరోధక శక్తి, వ్యవస్థ బలపడుతుంది. దానికేంగాని అదంతా ఎవరిష్టం వారిది. ఈ పొన్నగంటి కూర పచ్చడి బాగుంటుంది. పొన్నగంటి కూరని బాగుచేసుకుని మూకుడులో వేసి వేయించి తీసి ఉంచుకుని తగిని పసుపు ఉప్పు చింతపండు వేసి, పోపుతో రోటిలో రుబ్బుకుంటే బహు బాగుంటుంది. ఈ కూర పప్పులో కూడా వేసుకుంటారు. కంటికి మేలు చేస్తుంది.తోటకూర కూడా పచ్చడి చేస్తారు.  ఆ పై మీ చిత్తం, మా భాగ్యం

Friday 20 November 2020

దుంపల పచ్చడి.

 దుంపల పచ్చడి.



దుంపలంటారుగాని నేలలోపల పండేవన్నీ దుంపలే. వీటి అసలు పేరు చిలకడ దుంపలు. ఇవి రెండు రకాలు, తెల్ల దుంపలు, ఎర్ర దుంపలు. ఎర్ర దుంపలు కొంచం తియ్యగా ఉంటాయి, తెల్ల దుంపలకంటే. వీటిని తియ్య దుంపలని కూడా అంటారు.


ఈ దుంపల్ని తెచ్చుకుని నీళ్ళలో పడేసి శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు చేసుకుని వాటికి తగిన ఉప్పు, పసుపు చేర్చి, తగిన పోపు కూడా చేర్చి రోటిలో రుబ్బుకోవాలి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా ఐపోయి రుచిపోతుంది. అందుకే హోటళ్ళలో ఇప్పుడు రోటి పచ్చడి హోటల్ అనేదో క్రేజ్. ఈ పచ్చడి సరిగా కనక చేసుకుంటే కొబ్బరికాయ పచ్చడిలా ఉంటుంది. 


ఈ దుంపలని సుగర్ ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా తినచ్చు. ఎందుకంటే వీటిల్లో కార్బ్ ఎక్కువగానే ఉన్నా, గ్లైసిమిక్స్ ఇండెక్స్ తక్కువ, రక్తంలో చక్కెర విడుదల జేయడానికి చాలా కాలం పడుతుంది, పీచు ఉంటుంది, కడుపు నిండినట్టూ ఉంటుంది. ఆధునికులు ఛీ దుంపలా అని ఈసడిస్తారు గాని గొప్ప ఆహారం.


కొస మాట:- ఈ దుంపని తరుక్కుని బెల్లం పాకంలో ఉడకబెట్టుకుని నాలుగు ముక్కలు సుగర్ వాళ్ళు కూడా తినచ్చు, అలా నోట్లో వేసుకుంటే రంగనారాజా! ఆహా ఏమిరుచి అనరా మైమరచి. 


మరో చిత్రం మన శరీరంలో ఉండే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే వృకం అనే పాంక్రియాసిస్ చిలకడ దుంపలా ఉంటుందిట. :)


దుంపలొచ్చే టైమ్ ఇదే


Sunday 15 November 2020

చేతకానమ్మకి






చేతకానమ్మకి చేష్టలెక్కువ.

చెల్లని రూపాయికి గీతలెక్కువ.

చెల్లే రూపాయైతే ఆ ఊళ్ళోనే చెల్లేది.

చేతకానమ్మకి రోసమెక్కువ.









Saturday 14 November 2020

మొండివాడు

 మొండివాడు రాజు కంటే బలవంతుడు

ఊరుకున్నవాడిని ఊరేమీ చేయలేదు.

ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదు.

కచ్చలో నిప్పుపడ్డా కచేరీలో కాయితంపడ్డా నష్టం జరిగి తీరుతుంది



.




Friday 13 November 2020

ఎంచుకుంటే.....

 ఎంచుకుంటే మంచమంతా కంతలే

జంతిక చక్కిలాన్ని ఎక్కిరించినట్టు

తనదిపాలికిచ్చి తను కూలికెళ్ళినట్టు.

చేతకాని మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు.




Thursday 12 November 2020

వామన చింతకాయ పచ్చడి.

 వామన చింతకాయ పచ్చడి.


చితకమతక చింతకాయ పచ్చడిలా కొట్టేసేరు బాబూ అంటుంటారు.చింతకాయ పచ్చడి చేయడమంటే ఊరికే బాదెయ్యడమేంకాదు. చింతకాయ పచ్చడి చెయ్యడమే కష్టం. ఎందుకనీ:) కాయ చితకాలి, గింజ చితక్కూడదు, అంటే దెబ్బ తగలాలి, కనపడకూడదు, పోలీస్ దెబ్బలాగనమాట. అదీ అసలు పాయింటు. 


నిలవ పచ్చడి పెట్టుకునీ చింతకాయలు అటుపండూ కాకూడదు, ఇటు పచ్చిగానూ ఉండకూడదు, దోరగా ఉండాలి. వీటిని రోటిలో వేసి చితకా ముతకాగా కొట్టాలి, చితకా మతకా కానే కాదు. అంటే కాయ చితకాలి, గింజ చితక్కూడదు. గింజ కనక చితికి పచ్చడిలో కలిసిపోతే పచ్చడి బాగోదు, వగరుగా ఉంటుంది. అందుకు చితకా, ముతకాగా తొక్కాలి. అప్పటికే ఐపోలేదు. ఈముద్దలో కాయమీద ఉన్న దొప్పలొస్తాయి వాటిని ఏరాలి తీసెయ్యాలి, గింజలు ఏరెయ్యాలి, ఉట్లు ఏరెయ్యాలి, ఇప్పూడు ఈ చింతకాయ ముద్దకి పసుపు చేర్చాలి, తగిన ఉప్పెయ్యాలి, మళ్ళీ తొక్కాలి మెత్తగా. చింతకాయ తొక్కు తయారయింది. దీనికి తగిన కారంతో పోపును చేర్చి మళ్ళీ తొక్కాలి. పచ్చిమిర్చీ వేసుకోవచ్చూ. ఈ తొక్కిన పచ్చడిని ఒక రాచ్చిప్పలో పెట్టాలి, దానిలో గుంట చెయ్యాలి, నూనె కాచి అందులో ఇంగువ వేసి మంచి వాసనొచ్చిన తరవాత దానిని రాచ్చిప్పలో ఉన్న పచ్చడి గుంటలో పొయ్యాలి, కొంచం పచ్చడితో గుంత మూసెయ్యాలి. రాచ్చిప్ప పైన గట్టి మూత పెట్టాలి. ఇప్పుడు చింతకాయ పచ్చడి రెడీ వాడుకోడానికి. 


ఇదేంటి వామనచింతకాయ పచ్చడి చెబుతానని. వామన చింతకాయంటే మరేంకాదు, ముదరని గింజపట్టని చింతకాయని వామన చింతకాయ అంటారు. ఇవి చిన్నగానూ,పల్చగానూ ఉంటాయి. వీటిని మెత్తగా రోట్లో పచ్చడి చేయాలి, మిక్సీల లో పచ్చడి బాగోదు రుచిరాదు.చింతకాయ పచ్చడిలాగనే వామన చింతకాయ పచ్చడిన్నూ, ఇందులో తుక్కులు,ఉట్టిలు, పెచ్చులు,గింజలురావు, ఆ అవస్థ తప్పుతుందంతే. :) 


పాత చింతకాయ పచ్చడి పథ్యానికి పనికొస్తుంది.పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకు అంటారు. అంటే పథ్యమైనమాట చెప్పకు అని కదా! లోకమింతే!పాతచింతకాయపచ్చడి పాత గుడ్డముక్క దొరకవు. అదేంటీ పాతగుడ్డముక్కా..అబ్బో దీని గురించి మరోసారి.

Wednesday 11 November 2020

ఎగిరి ఎగిరి దంచినా

 ఎగిరి ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి :)

వంక దొరకనమ్మ డొంక పట్టుకుందని ఏడ్చింది.

పనివాడు పందిరేస్తే పిచికిలొచ్చి పడగొట్టేసేయి.

కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడింది

Tuesday 10 November 2020

చింతకాయ-గోంగూర.

 చింతకాయ-గోంగూర.

వాళ్ళిద్దరూ చింతకాయ,గోంగూరలాటివాళ్ళండి బాబూ అంటుంటారు. ఏంటి తిరకాసు? :)


చింతకాయ పుల్లటిది, గోంగూరా పుల్లటిదే!రెండిటికీ ఉప్పూ కారాలతోనే స్నేహం.రెండిటినీ పచ్చడీ చేస్తారు ఎక్కువగా! రెండూ నిలవా ఉంటాయి. రెండూ రుచిగానే ఉంటాయి, కాని రెండిటికీ పడదు. అందుకే చింతకాయ గోంగూర అంటారు. ఇన్ని పోలికలున్నవి రెండూ కలిసి ఎందుకుండవూ? తిరకాసదే కదా!!! 


చింతకాయ పచ్చడి నిలవున్నకొద్దీ పథ్యం. గోంగూర పచ్చడి సంవత్సరం దాటి నిలవుండదు.అసలు తిరకాసు చింతకాయ చలవ చేస్తుంది, గోంగూర వేడి చేస్తుంది. అంచేత చింతకాయ గోంగూరలకి ఎన్నిపోలికలున్నా, కలిసుండలేవంతే!!! అర్ధమయితే !!!Like poles repel :)






Sunday 8 November 2020

దున్నబోతేదూడలలోకి...

 దున్నబోతేదూడలలోకి...


దున్నబోతే దూడలలోకి మెయ్యబోతే ఎడ్లలోకి అని సామెత. రైతులు పశువుల మందలనే మేపేవారు. పశువులు 4 రకాలు. చూలుగట్టి పాలిచ్చేవి,పనిజేసేవి, ఒట్టిపోయినవి,దూడలు.


చూలుగట్టి పాలిచ్చేవాటికి, పచ్చిగడ్డి, తెలగపిండి,జనపకట్ట, పిల్లిపెసర, ఇలా పుష్టికరమైన ఆహారం పెడతారు, పాలు బాగా ఇస్తాయి.


పని జేసే పశువులకి, పచ్చగడ్డి,ఎండుగడ్డి,జనప,పిల్లిపెసర,తెలగపిండి,కుడితి,పెడతారు. కొంచం ఇంచుమించు చూలుగట్టి పాలిచ్చేవాటికి, పనిజేసేవాటికి సమానమైన తిండి పెడతారు.


ఇక ఒట్టిపోయిన పశువులు. ఒకప్పుడు మహరాజభోగం వెళ్ళదీసినవే ఐనా వీటికి తిండి తక్కువ పెడ్తారు,ఇవి రిటయిర్ అయినవారి లాటివి ఎండుగడ్డిపడేస్తారు,ఇక దూడలు. 


దూడలు, లేగదూడలైతే పాలు, కొంచం పచ్చగడ్డిపెడతారు, పెయ్యదూడలు, కోడెదూడలకీ. వయసుపెరుగుతున్నకొద్దీ కోడెదూడలు తలగరేస్తాయి, చెప్పిన మాట వినవు.వీటికి పనిజేసేపశువులతో సమానంగా తిండి పెడతారు, ఎందుకంటే రేపన్న రోజు పనిజేసేవి ఇవేగనక.పెయ్యదూడలకి పాలిచ్చే పశువులతో సమానంగా తిండి పెడతారు, రాబోయే కాలంలో చూలుగట్టి పాలిచ్చేవిగనక.   కోడెదూడలు మెయ్యబోయినపుడు ఎడ్లలోకి జమవుతాయి, కాని పనికి మలిపేటపుడు దూడలలోనే జమవుతాయి,ఎడ్లతో సమానంగా పని చేయలేవుగనక.అందుకే ఈ సామెత పుట్టింది.

లోకంలో,మనుషులు పలురకాలు.ఎవరిటువంటివారో ప్రత్యేకంగా చెప్పాలా? 

 


Saturday 7 November 2020

రైతన్న కష్టం

 









 

ఊరికెళ్ళేప్పుడు గుడ్డెండ ఉంది, తిరిగొచ్చేప్పుడు వర్షం, రైతన్నకిలా కష్టం.

Thursday 5 November 2020

ఉపనయనం

 ఉపనయనం


ఒక రాజుగారి కొలువు,కొలువులో ఒక కవిగారు, కవిగారికి రాజుగారికి మంచిదోస్తీ. కవిగారికి కావలసినదేదైనా రాజుగారు కాదనరు, అంతటి స్నేహం. కవి దోచుకు తినేస్తున్నాడని దివాన్ గారి బాధ.  దివాన్ గారికి కన్నుకుట్టింది, కాని ఏం చేయలేడు, సావకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 


ఇలా ఉండగా ఒక వేసవిలో కవిగారు నొక వినతి పంపుతూ అందులో ఇలా రాశారు, ''నా కుమారునికి మరియు నాకున్నూ ఉపనయనముల నిమిత్తంగా ఏలినవారు సొమ్ము మంజూరు వేడుతున్నాను'' , అది సారాంశం. చూసిన దివాన్ మా బలేగా దొరికాడు కవి అనుకుని, రాజుగారికి కవిగారి వినతి పత్రం పంపుతూ, కూడా వెళ్ళేరు.  


కవిగారు కాకమ్మ కతలు వినిపించి, ఖజానానుంచి సొమ్ము ఎలా దోచుకుంటున్నాడో వైన వైనాలుగా చెప్పాలనుకున్నాడు,నిలబడ్డాడు. కాని రాజుగారు వినతిని శ్రద్ధగా చదివి, తలపంకించి, దివాన్ గారి వైపు సాలోచనగా చూసి,  రాజుగారు ''సొమ్ము పంపండి, విషయం కనుక్కోండి'' అన్నారు. కవిగారి గురించి వివరించే సావకాశం చిక్కక పోవడంతో దివాన్జీ నీరుగారిపోయాడు.

  

ఇది దివాన్జీకి విషయం కనుక్కుని సొమ్ము పంపండి అన్నట్టు అర్ధమయింది. అవసరం కవిది, అతనే వస్తాడులే, అని సొమ్ము పంపక కూచున్నాడు దివాన్, విషయం కూడా కనుక్కోకుండా. కవిగారి కుమారుడి ఉపనయన సమయం దగ్గరపడుతోంది, పనులే కాలేదని, సంగతేంటో కోటలో తన మనుషులను వాకబు చేశాడు, కవిగారు. దివాన్ చేసిన మతలబు తెలిసింది చూచాయగా. 


మర్నాడు రాజావారిని దర్శించాడు, కవిగారు తిన్నగా. చాలా కాలం తరవాత కనపడ్డ కవిగారిని సాదరంగా ఆహ్వానించిన అనంతరం, సాహిత్య చర్చలో ములిగిపోయారిద్దరూ. చివరగా రాజుగారు ఉపనయనాల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. కవిగారికి విషయం అర్ధమయింది, రాజు గారు కవిగారికి సొమ్ము చేరిందనుకుంటున్నారని. విషయం విన్నవించారు కవిగారు, రాజుగారికి, లక్ష్మీ కటాక్షం లేక పనులు సాగలేదని.. విన్న రాజావారు, వెంటనే కోటనుంచి సర్వ సంభారాలు పంపమని ఉత్తరువిస్తూ, తమ కుమారునికి ఉపనయనం సహజం,తమకైతే షష్టి పూర్తి, ఉగ్రరధ శాంతిగాని సహజం కాని  ఈ ఉపనయనం ఏంటో అర్ధం కాలేదని సమస్య చెప్పేసేరు, రాజుగారు. కవిగారికి విషయం అర్ధమయింది. అప్పుడు కవిగారు చెప్పేరిలా.


నాకుమారునికి నాకున్నూ ఉపనయనములనిమిత్తం అనికదా నా వినతి. కుమారుని ఉపనయనం అంటే తమకు తెలిసినదే, నాకు ఉపనయనాల గురించి కదా! వయసా పెరిగింది, చత్వారం పెరిగింది, రచన సాగటం లేదు, వైద్యుని వద్దకెళితే ఉపనయనాలు పెట్టుకోమని రాసిచ్చాడు మహరాజా, అని వివరించారు. విన్న రాజుగారు కవిగారి చమత్కారానికి భళ్ళున నవ్వేరు,దివాన్ గారి ముఖం వంక చూస్తూ. దివాన్ గారి ముఖం ఆరిపోయిన చిచ్చు బుడ్డిలా ఉంది.     

   

ఇది ఎక్కడో చదివినదే







Monday 2 November 2020

కరోనా నడక


 కరోనా నడక


కరోనా తగ్గిందా? పోయిందా? తగ్గిపోయిందా??ఏమోగాని వాళ్ళని తీసుకెళ్ళేరు,వీళ్ళని తీసుకెళ్ళేరు, నలుగురు హౌస్ క్వారంటైన్ వార్తలు లేవు.మా ఊళ్ళో  ఒక కరోన ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీగానే ఉందని వార్త.పల్లెటూళ్ళలో పెద్దగా అలజడి లేదు. వర్షాలు వెనకబట్టేయి ఒక వారం నుంచి, చలి తిరిగింది కొద్దిగా. బడి తీస్తారట, కార్పొరేట్ల సంబరమేమో! ఏమో పిల్లలు కదా, భయంగానే ఉంది. ఒక తరం జారిపోతోంది, మారిపోతోంది.  


కరోన వార్తలకి లోటు లేదు. వారాలు, టెస్టులు, కరోన తెలియడం, ఏం లేదు మూడు రోజుల్లో అంతా ఫినిష్ ఒక వార్త, గుండెలవిసేలా, అదేం ఆనందమో. మరోవార్త ఇదంతా హంబగ్ చైనాను ఒంటరి చెయ్యాలనే ప్రయత్నం, అందులో మోడిగారు కూడా ఉన్నారు. పాపం చైనా ఎన్ని కష్టాలలో ఉందీ ఇది మరో వార్త. జర్మనీ,బ్రిటన్, ఇటలీ, France మళ్ళీ లాక్డవున్ అంటున్నాయి, మనమేమో ఓపెన్ అంటున్నాం, ఇదేంటీ. అదుగో వాక్సీన్ ఇదిగో, వాక్సీన్, అన్నీ సిద్ధం చేసుకోండి మరో వార్త. ఏదో ఒకటి అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలి, కొంతమంది తాపత్రయం. 

కరోనాకీ వలపక్షమే.ఎ బ్లడ్ గ్రూప్ వాళ్ళమీద పిలవకపోయినా వాలిపోతుందిట. బి గ్రూపంటే మొహమాటంట. ఎబి వాళ్ళంటే ముట్టదుట, ఒ గ్రూపంటే భయమేనట. సరే ఆడాళ్ళంటే మొదలే భయంకదా కరోన కి. ఇక కరోన వచ్చి తగ్గినవాళ్ళ గురించి ప్రచారమూ లేదు, వాళ్ళ సంగతీ తెలీదు. మరోమాట కరోన వచ్చి తగ్గిన పదిమందిలో ముగ్గురికి మాత్రం మానసికరోగం చిరస్థాయిగా ఉంటుందిట. కొంతమందికి దీర్ఘకాలానికి కొన్ని వ్యాధులు బయట పడతాయని కొందరి ఉవాచ. ఏంటో! అంతా విష్ణు మాయ.! ఏది నిజం పరమాత్మకీ తెలియదేమో! 


ఏదొచ్చినా బాలీ ఉడ్ వారికి వింతే. పోయేవాళ్ళు పోతున్నారు.పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పుట్టేవాళ్ళు పుడుతున్నారు.    బాలీవుడ్ కి చెడ్డకాలం సెలిబ్రిటీలు రాలిపోతున్నారు. కష్టజీవులకి, మురికివాడలవారికి కరోన రాదు, ఇదో రిసెర్చ్ రిజల్ట్, మరో వార్త, ఎందుకంటే వారి వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది, అశుభ్రమైన ప్రదేశంలో బతుకుతున్నారు కనక, ఎవరిష్టం వారిది, ఎవరివార్త వారిది. బలమైన జీవులే బతుకుతాయన్నది సైన్స్ వారి వార్త అంతేకాదు, ఇది ప్రకృతి చెప్పేమాట. Survival of the fittest. దీనికి కావలసింది రోగ నిరోధక శక్తి, అదెలా వస్తుందిబాబూ, ఎక్కడ దొరుకుతుంది,మార్కెట్లో దొరుకుతుందా?  డాక్టర్లని ఆశ్రయిస్తే విటమిన్ డి మాత్రలేసుకో అంటున్నారు.రోజూ నడవండోయ్! ఉదయంచిన సూర్యుణ్ణి చూడండొయ్! డి విటమిన్ చేరుతుంది, రోగ నిరోధక శక్తి అదేవస్తుందంటే, ఎండోపతీ అని నవ్వినవారున్నారు.పోనిద్దురూ ఎవరిష్టం వారిది కదా,లోకో భిన్నరుచిః. ఏడెనిమిది నెలనుంచి కాలు బయట పెట్టలేదు, నడకలేదు, ఇంట్లోనే మిడుకుతున్నామని నడక మొదలెడదామనుకున్నా, విజదశమిరోజు. ఆలోచనొచ్చేటప్పటికే సాయంత్రమయింది,మర్నాడనుకుంటే ఏకాదశీ సోమవారం, దగ్ధయోగమని మానేశా :) మంగళవారం మొదలెట్టేను.


కర్రపుచ్చుకు బయలుదేరినా, కాలు నిలవటం కష్టంగానే ఉంది. తేలిపోతానో,తూలిపోతానో,పడిపోతానో, తూలిపడిపోతానో అని నెమ్మదిగా కుంటుకుంటూ, గ్రవుండికి చేరా! అన్నీ ముసిలి తలకాయలే! రండి రండంటూ చేతులూపుతూ స్వాగతం పలికేసేరు. అందరికి పలకరింపు చేతులు ఊపేసి, నమస్కారబాణాలలా, ట్రేక్ కిదణ్ణం పెట్టి అడుగు ముందు కేసాను. కాళ్ళకి సూదులు గుచ్చినంత బాధ. వర్షాలకి  ట్రేక్ మీద గులక రాళ్ళు తేలాయి. అలాగే నెమ్మదిగా నడిచా! నాలువందల మీటర్లు నడవడానికి పదేను నిమిషాలు పట్టింది.పక్కనే ఉన్న పచ్చగడ్డి మీద నడిచా, బాగుందిగాని పల్లేరు కాయలు గుచ్చుకున్నాయి. కుంటుకుంటూ పక్కనే ఉన్న ప్లాట్ పాం మీదకి చేరా, బాసిన పట్టు వేసుకుని కూచుందామని. అబ్బే కాళ్ళు దగ్గరకి రావే! వామో! ఏదో ఐపోతోందనుకుని నెమ్మదిగా కాళ్ళు దగ్గరకి తీశా. కాళ్ళు  నొప్పులెట్టేశాయి. నెమ్మదిగా ఇoటికి చేరా. మర్నాడు నడవగలనా అనుమానమే వచ్చేసింది. ఏమైనా నడవాలని ట్రేక్ మీద నడిస్తే పదినిమిషాలు పట్టింది. ఫరవాలేదనుకుని కాళ్ళు నొప్పులున్నా నడక మానలేదు. ఆదివారానికి నాలుగువందల మీటరు నడవడానికి ఆరు నిమిషాలు పట్టింది. పచ్చ గడ్డి మీద 8 లూప్ నడక చేయడం మొదలెట్టా. బాసినపట్టు వేసి పావుగంట కదలకుండా కూచున్నా! సాధనమున పనులు సమకూరు ధరలోన!

మూడో రోజనుకుంటా పై చిత్రంలోలా రక్తపుముద్దలా భాస్కరుని దర్శనమైంది, ఫోటో తీసి నమస్కారం పెట్టుకునే లోపే ఫోన్ టింగ్ మంది, ఇంత పొద్దుటే ఎవరబ్బా! ఎవరూ ఇంకా మంచాలమీంచే దిగరుకదా అనుకుంటూ చూస్తిని కదా ఒ పజ్జం ఊడిపడింది :)