Friday 30 October 2020

పనియే పరమాత్మ.

 

Courtyesy Whats app

 


పనియే పరమాత్మ. ఏదీ నీచమైనది కాదు.



Wednesday 28 October 2020

దురాశ


 Coutesy|Whats app

Award winning short film of Canes festival. 

Monday 26 October 2020

దుందుభి

 దుందుభి

దుందుభి రామాయణ కాలం నాటి వీరుడు. ఇతనికి యుద్ధం అంటే బహు మక్కువ. చాలా కాలంగా యుద్ధం ఎవరితోనూ చేయక చికాకుపడ్డ దుందుభి సాగరుని దగ్గరకెళ్ళి, యుద్ధం చేదాం రమ్మన్నాడు. దానికి సాగరుడు, నాలో అనంతకోటి జీవరాసి  బతుకుతోంది. వాటిని నిత్యం రక్షించే పని నాది, నీతో యుద్ధం చేయలేనని సౌమ్యంగా చెప్పాడు. ”పెట్టకపోతే పెట్టకపోయావు, పెట్టే ఇల్లైనా చూపమనట్టు, నాతో” యుద్ధం చేయగలవారెవరో చెప్పమన్నాడు.  హింవంతుడు బలశాలి ఆయన దగ్గరకెళ్ళు అని సలహా చెప్పాడు,సాగరుడు.


విన్న దుందుభి, హిమవంతుని దగ్గరకెళ్ళి యుద్ధం చేద్దామంటే ఆయన, ''నా పైన అనేక జంతుజాలం, వృక్షజాలం బతుకుతోంది. నానుండి అనేక నదులు పుట్టి ప్రవహిస్తున్నాయి. ఆ నీటితో ప్రజలు బతుకుతున్నారు. వీరందరిని వదిలేసి వచ్చి నీతో యుద్ధం చేయలేనని'' బ్రతిమలాడాడు. 


విన్న దుందుభి ''ఛస్! మీరంతా పిరికినాయాళ్ళు. యుద్ధం అంటే భయపడి ఛస్తున్నారు, పోనీ, నాతో యుద్ధం చేయగలవాడెవరో చెప్ప''మన్నాడు. హిమవంతుడు ఆలోచించి, వాలి కిష్కింధాపురి రాజు, మహా బలవంతుడు, నీలాగే యుద్ధం అంటే బాహు మక్కువ చూపేవాడు. నీ కోరిక తనే తీర్చగలడని చెప్పి పంపాడు. 


ఇప్పుడు దుందుభి వాలి దగ్గరకొచ్చి యుద్ధం చేద్దాం రమ్మన్నాడు. ''ఓరీ, నీవో బక్క ప్రాణివి. ఒక్క గుద్దుకు చచ్చేలా ఉన్నావు. నీకు నాతో యుద్ధమేంటి ఫో పొ''మ్మన్నాడు. అబ్బే దుందుభి వినలేదు. అంతట వాలి ''నేనెవరో తెలుసునా? నా బలమేంటో తెలుసుకునే నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావా?'' అని అడిగాడు. ''నువ్వు ఎవరైనా నాకు భయం లేదు యుద్ధం చెయ్యమని రంకెలేశాడు'' దుందుభి. 


నీ మంచి కోసమే చెబుతున్నా, నేనెవరో విను.

''రావణుడు తెలుసునా?''

''ఆయన రాక్షసరాజు, మా నాయకుడు'' 

''రావణుడికి నాతో తగని వైరం, నన్ను గెలవడానికి చేయని ప్రయత్నం లేదు.

ఒక సారి నేను సముద్రతీరంలో ఉదయ సంధ్యవారుస్తుండగా నన్ను గెలవడానికి నన్ను వెనకనుంచి పట్టుకున్నాడు. నేను నా బాహు మూలాల్లో తన చేతులు ఇరికించేటప్పటికి మూర్ఛపోయాడు. నేను తనని అలాగే పట్టుకుని సప్త సముద్రాలలో ములిగి సంధ్య వార్చేటప్పటికి చచ్చిన పురుగులా నా వీపున వేలాడేడు.. అలాగే బాహు మూలల్లో ఇరికించి తీసుకొచ్చి కోట ముందు చేతులు పైకెత్తా. పది తలల పురుగులా కిందపడ్డాడు. చాలా సేపటికి తెలివి తెచ్చుకుని, నా కాలికింద దూరి సంధి చేసుకుపోయాడు” అని చెప్పాడు. ”ఇప్పుడూ ఇంకా యుద్ధం చేయాలని ఉందా నాతో” అనీ అడిగాడు. విన్న దుందుభి పట్టు విడవక ”మా నాయకుణ్ణి గెలిచి ఉండచ్చు, నన్ను గెలవలేదుగా, అంచేత యుద్ధం చేద్దాం” అన్నాడు. సరేనని యుద్ధానికి తయారయ్యారు. వాలి పిడికిటి పోట్లతో రక్తం కక్కుకున్న దుందుభిని కాళ్ళు పట్టుకు విసిరితే  ఋష్యమూక

పర్వతం మీద పడింది దుంధుభి శరీరం. కోపించిన మతంగ మహాముని ఆ శరీరాన్ని విసిరినవాడుగాని, వాని స్థానీయులుగాని ఆ చోటుకి నాలుగు కోశాల దూరంలో అడుగుపెడితే చస్తారని శపించారు. అలా దుందుభి చరిత్ర ముగిసింది.

దుందుభి కొడుకు పేరు మాయావి. ఇతనికి వాలికి మధ్య ఒక స్త్రీగురించిన తగువు. ఒక రోజు వాలి కోట ముందు అల్లరి చేస్తుంటే శిక్షించేందుకు వాలి బయలుదేరాడు. వెనక వాలి తమ్ముడూ నడచాడు. వీరిని చూచి మాయావి పరుగుపెట్టేడు.

పరుగెట్టిన మాయావి  ఒక గుహలో దూరాడు.వాలి తమ్ముని గుహ ముందు కాపుంచి లోపలికి దూరాడు. లోపలి నుంచి అలికిడి లేదు. చాలా కాలం తర్వాత లోపలనుంచి భీకర ధ్వనులు రక్తపుటేరులు రావడం, సుగ్రీవుడు నిగ్రహించుకోలేకపోయాడు, అన్న బలం తెలిసినా. ఒక బండరాతిని గుహకి అడ్డంగా పెట్టి రాజధాని కొచ్చేశాడు. వాలి మాట తెలియలేదు. మంత్రులు రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని బలవంత పెట్టి పట్టాభిషేకం చేశారు. కొంత కాలానికి వాలి తిరిగొచ్చి తమ్ముణ్ణి తరిమేసి రాజ్యం ఆక్రమించుకున్నాడు. బలశాలి వాలి, దుందుభిని అతని కొడుకునీ కడతేర్చాడు,రాముని చేతిలో మరణించాడు, రావణునిలాగే.

నదీనాం సాగరో గతిః





Thursday 22 October 2020

వాక్కాయ పప్పు.


వాక్కాయ పప్పు.


వాక్కాయ రేగుకాయకంటే పెద్దదిగా ఉంటుంది,కోలగా ఉంటుంది, ఊదారంగు,ఆకుపచ్చరంగులో కాని ఉంటుంది. ఒక కాయ మీద రెండు రంగులూ ఉండచ్చు. ఇది బహు పుల్లగా ఉంటుంది. కొస్తే గింజలుంటాయి, వాటిని తీసేసి నీటిలో ఉడకబెట్టి, తగిన ఉప్పేసి, చిటికెడు పసుపేసి, ఉడికిన పప్పులో కలిపేస్తే, తగిన పోపు పెట్టుకుంటే ఇంగువ వేసుకుని, మామిడి కాయ పప్పు కి సరిసమానం అనిపిస్తుంది. 


ఈ కాయను ముక్కలుగా తరిగి ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు.


ఈ కాయ ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు దొరుకుతుంది. ఈ కాయ అంటే ఎక్కువ మందికి భయం, దగ్గు వస్తుందని. ఈ కాయ కోసినపుడు తెల్లగా పాలు వస్తాయి. ఆ పాలలో దగ్గును కలగజేసే గుణం ఉందంటారు, తెలిసినవారు. ఇంత చెబుతున్న ఈ వాక్కాయలో ఉన్నదేమిటి?


ఐరన్

విటమిన్ సి

విటమిన్ ఎ

మెగ్నీసియం

పొటాసియం.


శరీరానికి కావలసిన వన్నీ ఇందులో ఉన్నాయి, ముఖ్యంగా ఐరన్. ఇది ఇనపగని.  మా దగ్గర ఒక ఊరుంది వాకతిప్ప దాని పేరు, బహుశః వాక తుప్పలతో ఆ వూరికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఇది పల్లెటూరివారి ఆహారం :) పిజ్జాలు, బర్గర్లు తినేవారికి వీటి గురించి ఏం తెలుస్తుంది? సహజంగా శరీరానికి కావలసిన పోషకాలను రుచికరమైన ఆహారం లా ఉన్నవాటిని తినడం మానేసామా? ఎమో! కాలమే చెప్పాలి. 


Saturday 17 October 2020

పొణక-పాతర.

ఇప్పుడు ఆహార ధాన్యాలు దాచుకోడానికి పెద్ద పెద్ద గొదాములు, వాటిలో పెద్దపెద్ద ప్లాట్ఫారాలు, వాటి మీద బస్తాలలో పట్టి కుట్టి బస్తాబందీ చేసిన వాటిని నెట్టు కట్టి, వాటి మీద టార్పాలిన్ లు పరుస్తున్నారు. పాత రోజుల్లో ఇవన్నీ లేవుగా, అప్పుడు ఆహార ధాన్యాలు దాచుకో లేదా? ఎలా చూదాం.


 ఒకప్పుడు పల్లెలలో ఏ ఇంటికెళ్ళినా ముందు వసారాలో,ముందు దొడ్డిలో ఒక పొణక  అనే జల్ల కనపడేది. పొణకేంటని అనుమానం కదా!. వెదురుతో ఏడు, ఎనిమిదడుగుల ఎత్తున నాలుగైదు అడుగుల కైవారంలో బుట్టలా అల్లేవారు. దీనిని రెండడుగుల ఎత్తున్న నాలుగు బండరాళ్ళ మీద పెట్టేవారు. బంకమట్టి బయట మేగేవారు. ఆతరవాత పేడతో అలికేవారు. ఇందులో వేపరొట్ట వేసేవారు, ఆపైన గడ్డి వేసేవారు, ధాన్యం పోసేవారు. పైన మళ్ళీ వేపరొట్ట వేసి, ఆపై గడ్డి వేసి మెత్తటి మట్టిమేగేవారు. దీని చుట్టూ ఖాళీ ఉండేలా చూసుకునేవారు, రోజూ చూసేవారు. అవసరం వచ్చినపుడు తీసుకునేవారు. ఇలా సంవత్సరమూ ధాన్యం నిలవ ఉండేవి.ఇలా పాతిక కాటాల దాకా నిలవ చేసుకునేవారు, ఇంతకంటే ఎక్కువ నిలవ కావాలంటే?


పాతర...దొడ్డిలో మెరక ప్రాంతంలో, నీరు చేరని చోట, నీరు ఊరని చోట ఎనిమిదడుగులలోతు వరకు గొయ్యి తీసేవారు. గోతి వ్యాసం పైకొచ్చేకొలదీ ఎక్కువ ఉండేలా చేసుకునేవారు.గోతిని ఆరనిచ్చేవారు, ఆపై వేపరొట్ట పైదాకా పెర్చేవారు, కింద, పక్కల. ఆపై గడ్డి వేసేవారు పక్కల, కింద. గడ్డి మీద కుదిరితే పాత గోనె సంచులు కలిపి కుట్టిన బరకం వేసేవారు పైదాకా. దీనిలో ధాన్యం పోసేవారు. బరకం అంచులు ధాన్యం మీద కి మధ్యలోకి చేర్చేవారు. పైన వేపరొట్ట వేసేవారు,గడ్డి పరచేవారు. ఆపైన మట్టిని ముద్దలుగా చేర్చి పేర్చేవారు. దీనిమీద పక్కలా కూడా పేడ నీళ్ళు జల్లేవారు. ఈ గోతి చుట్టు పక్కల నిత్యం చూసేవారు, పందికొక్కు తవ్వుతోందేమోనని. చినుకులొస్తే నీరు నిలవకుండా చూసుకునేవారు. అవసరమనిపిస్తే తాటాకులు పరచేవారు. సంవత్సరంలో అవసరాన్ని బట్టి తవ్వి తీసుకుని మళ్ళీ కప్పేసేవారు. ధాన్యం మిలమిలామెరుస్తూ బాగుండేవి.ఇలా దాచుకోడాన్ని పాతర వేయడం అంటారు. మనదేశం లో మానేసారుగాని ఇదింకా అఫ్రికా దేశాలలో అమలు లో ఉంది. ఈ ధాన్యం బియ్యం రుచిగా ఉండేవి. 

ఒకప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలుండేవి. బియ్యం ఏరుకోవడం ఓ పెద్ద పనిగా ఉండేది, ఆడవారికి. కాలం మారింది ఆ తరవాత పలుకురాళ్ళు వచ్చేవి బియ్యంలో. వీటిని ఏరుకోవడం కష్టంగా ఉండేది. తరవాత కాలంలో నూటికి ఐదు బస్తాల మట్టిబెడ్డలు కపలడానికి బెడ్డల ఫేక్టరీలు పుట్టేయి, సరే పలుకు రాళ్ళ కి కూడా ఫేకటరీలుండేవి. కాలం మారింది, మట్టి బెడ్డలుండటం లేదుగాని ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారట, నేడు. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం ఎలా వేరు చేసుకోవాలో తెలియక ప్రజలు తలలు పట్టుకునే రోజులు ముందున్నాయిట. కలికాలం. 

తక్కువ ఖర్చుతో ఆహారం నిలవచేసుకునే అలవాట్లు వెనకబట్టేయి.      



Monday 12 October 2020

కాపూ కరణం నా వాడైతే.........

  కాపూ కరణం నా వాడైతే.........


కాపూ కరణం నావాడైతే/నా వాళ్ళైతే/నామాటైతే/ నా వైపైతే ఇలా రకరకాలుగా ఈ నానుడిని చెబుతుంటారు తెనుగు నాట.....ఇదేంటొ చూదాం, అలా ముందుకుపోదాం.


నలభై సంవత్సరాల కితం దాకా పల్లెలలో ప్రభుత్వ అధికారులు అంటే ఇద్దరే, మునసబూ,కరణమున్నూ...చరిత్ర కనక కొంత చెప్పుకోవాలి..తప్పదుగా...టూకీగా చెప్పాలంటే మునసబు క్రిమినలు, కరణం సివిల్ వ్యవహారాలు చూసేవాడన మాట.మునసబుకి కరణం సహాయం రాత కోతలకి. మునసబుకి క్రిమినల్ వ్యవహారంతో పాటు, లా,ఆర్డర్, మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉండేవి. పల్లెలోకి వచ్చే బిచ్చగాడైనా మునసబుకి తెలియక అడుక్కోడానికి లేదు,”ఊళ్ళో అడుక్కోడానికొచ్చాను బాబయ్యా” అని కనపడాలి.పగటి వేషగాళ్ళు, జముకుల కత చెప్పేవాళ్ళు, మాట్లేసేవాళ్ళు,ఉప్పమ్ము కోడానికొచ్చిన వాళ్ళు ఇలా అందరూ మునసబుకి కనపడాలి,చెప్పాలి, వెళ్ళేటప్పుడూ కనపడాలి. ఒకప్పుడు ఆశీలు కూడా మునసబే వసూలు చేసేవాడు,   భూమిపన్నే కాక.  ఒక రకంగా చెప్పాలంటే పల్లెకి నియంత, మునసబు. ఏదైనా తగవు, జరగరానిది, ఆలు మగల తగువు నుంచి, కోట్లాట,హత్య, ఇలాటివి జరిగితే తన పరిధికి మించిన వాటికి,  మునసబు ఒక రిపోర్ట్ రాసి పోలీస్ కి పంపేవాడు. అప్పుడు పోలీస్ వచ్చేవారు. ఈ రిపోర్ట్ నే ”బకీరు” అనేవారు. ప్రాధమికంగా దీని మీద ఆధారపడి వ్యవహారం నడిచేది.  ఇది రాసేందుకు కరణం, మునసబుకి సహాయం. ఇక కరణం లెక్క,డొక్క,ఆదాయం ఇలా అంతా సివిల్ వ్యవహారం, ఇలా కాలం గడుస్తున్న రోజుల నాటి మాట.


అటువంటి రోజులలో ఒక పల్లెలో, ఒక జాయ,పతి, యువ జంట.అమ్మాయిది ఆ వూరేనో, పక్క ఊరో, ఏమైనా స్థానికురాలే. ఇక అబ్బాయి స్థితిమంతుడేగాని, కొద్ది మేదకుడు, అమ్మాయి జాణ.సంసారం గుట్టుగానే సాగిపోతున్నవేళ, ఒక రోజబ్బాయికి ఎందుకోగాని పట్టరాని కోపమొచ్చి, కొడతానేంటనుకున్నావో అని జాయని బెదిరించాడు. మేదకుడు కదా జాణతో వాదనలో నెగ్గలేక అశక్త దుర్జనత్వంగా అమ్మాయిని కొడతానని బెదిరించాడు. ఆ కాలంలో, ఆ కాలంఏం లేండి ఈ కాలం లోనూ భార్యను కొట్టే మూర్ఖులు ఉన్నారు, ముందు కాలంలో కూడా ఉంటారు.

అప్పుడు ఆ జాణ ”కాపూ కరణం నావాడైతే ఎట్లాకొడతావో కొట్రా మగడా” అని అన్నది.నిజానికి దారుణంగా ఎగతాళీ చేసింది, పతి చేతకాని తనాన్ని. అదేమీ గుర్తించని పతి ”ఏం ఎందుకు కొట్టలేను, ఆడదానివి, ఏం చేయగలవు” అనేసేడు. 

ఎలా కొట్టలేవో చెబుతా విను, వినారా! సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను, అసలు వివరము చెబుతానని మొదలెట్టిందిలా.  


 ''నా పుట్టింటివారికి మునసబు కరణాలకి అవినాభావసంబంధం. ఏ ఒక్కరూ మా వాళ్ళ మాట కాదనలేరు, కాదు కాదనరు. నువ్వు చెయ్యెత్తి నన్ను కొట్టి చూడు, నా ఒంటి మీద దెబ్బ పడితే, నేను వీధిలో పడతా, నా మొగుడు నన్ను కొట్టి చంపుతున్నాడో అని. మన ఇంటెదురుగా ఉన్న గుడ్లగూబ,సూర్పణఖ, చుప్పనాతి, నువ్వు నన్నెప్పుడూ కొట్టలేదని కుళ్ళుకుంటూ, ఏడుస్తూ, నువ్వు నన్ను కొట్టడం కోసం ఎదురు చూస్తున్నది,  వెంఠనే మునసబుకి కబురు అందజేసేస్తుంది, కబురు అందజేసేదాకా నిద్రపోదు. శత్రువుని కూడా మన అవసరానికి ఉపయోగించుకోవడమంటే ఇదే. దానికెంత సంతోషం అంటే మునసబెక్కడున్నా ఈ కబురు అతనికి తెలియ జేయక ఉండలేదు. కబురు తెలిసిందో మునసబు ఇక్కడ వాలిపోతాడు. మునసబొస్తే కరణం రెక్కలుగట్టుకు వాలిపోతాడు. కబురు తెలిసి సాటివాళ్ళొచ్చేస్తారు, పుట్టింటివారూ వచ్చేస్తారు. పంచాయతీ జరిగిపోతుంది, నేను చెప్పే ఒక్క మాటతో. ఇంకేముంది కరణం బకీర్ రాస్తాడు, మునసబు సంతకం పెడతాడు, వెట్టి అది పట్టుకుని టవున్ లో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ తరవాత జరిగేది ఇంకా చెప్పాలా? దొరగారికి. ఇది చాలదా?” అని బెదిరించింది. వామ్మో కొడతానంటే ఇంత చెప్పింది, నిజంగా కొడితే...నా బతుకు... అనుకున్న పతి, నెమ్మదిగా


”ధనం, వరిధనం, వర్థనం ఎందుకే అంత కోపం, నేనేమన్నాననీ, నిన్ను కొట్టడమా? ఎదీ నేను, నిన్ను కొట్టగలనా? సాధ్యమా?ఊహలో కూడా కుదరదే!” అని కాళ్ళ బేరానికొచ్చేసేడనమాట. కాళ్ళ బేరం ఏంటని మాత్రం అడగద్దు.     




Thursday 8 October 2020

ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.

 

కరోనా లాక్ డవున్ మొదటిసారి ప్రకటించేనాటికి, కితం సంవత్సరం రెండో పంట మాసూలుకి రెడీగా ఉంది. విదేశాలనుంచి దిగుమతి ఐన రోగం కనక మహాపట్టణాలలోనే కాలు మోపింది. అందుచేత లాక్డవున్ ప్రభావం పెద్దగా లేక రెండవపంట మాసూలైపోయింది, చక్కగా, పల్లెలలో. ఆ తరవాత ఏప్రిల్ చివరరోజులు మే ఎండల రోజులు గడచిపోయాయి, పల్లెలలకు కరోనా పెద్దగా సోకలేదు. జూన్ వచ్చేటప్పటికి పల్లెలలకి కరోనా  బాగానే అంటుకుంది. జూన్ రెండో వారం వర్షాలు మొదలయ్యాయి, గోదావరొచ్చింది.ఉన్న కొద్దిపాటి కూలీల తోనే,కరోనా తో సహవాసం చేస్తూ, దమ్ము చేసి విత్తనాలు జల్లేసేరు, వరసలలో ఊడ్చడం మానేసి. ఆ తరవాత చెత్తకోత, పిండి వెయ్యడం జరిగిపోయాయి, నెమ్మదిగా. చేలుబాగానే ఎదిగాయి, చీడ పీడలు లేక. కరోన చుట్టు ముట్టి బాధ పెడుతున్నా పల్లెలు జంకలేదు,నిజానికి వ్యాధి నిరోధక శక్తి పల్లెవాసులలోనే ఎక్కువ ఉంది. మరణాలు లేవనను కాని బహుతక్కువ.నిజానికి పల్లెవాసులే కరోనా ని జయించారు.  జూన్ మధ్యనుంచి నేటిదాకా వర్షం రోజూ పడుతూనే ఉంది. రోజు వర్షం పడటం మంచిదే.


మరో వారంలో పొట్ట తగులుతుంది. మరో వారం పైగా చేను ఈనుతుంది. ఈనితే కంకి/వెన్ను బయటికొస్తుంది. ఇక ఇప్పుడు వర్షం కనకపడితే పువ్వారం రాలిపోయి తప్పలు మిగులుతాయి.వర్షం కనక లేకపోతే తప్పలలోకి నెమ్మదిగా పాలు చేరతాయి. ఇలా తప్పలలో పాలు చేరడాన్నే చేను పాలుపోసుకోవడం అంటారు. ఇలా చేరిన పాలుతోడుకుంటాయి.  అలా తోడుకున్న పాలు బియ్యపు గింజ అవుతుంది. ఇలా పండిన చేను చూడడానికి ధనలక్ష్మి నేలపై పరచుకున్నట్టు ఉంటుంది. లక్షాధికారైన లవణమన్నమెకాని మెరుగు బంగారంబు మ్రింగబోడన్నట్టు, ఎవరైకైనా కావలసినవి ఆ పిడికెడు మెతుకులే! చివరికి కొడుకు/కోడలు పెట్టేవి కూడా మూడు ముద్దలే!


ఇంతకాలమూ చేలో మొక్క మొదట్లో నీరుండాలి, వర్షం పడకూడదు. వర్షం పడితే తప్ప, తాలు మిగులుతాయి.పండిన చేను మాసూలు చెయ్యడం ఆలస్యమైతే కొణిగిపోతుంది. రెల్ల రాలిపోతుంది.  కోతకి వారం ముందు, మిగులు,పెసలు,అలసందలు,జనుము,అవిశ ఇలా ఏదో ఒకటి జల్లుతాం నీరు, పూర్తిగా తీసేసి. నేలకి పైన ఒకడుగుదాకా మోడు ఉండేలా కోస్తాం.కోసిన వరిని పనలుగా మోళ్ళమీద వేస్తాం, మడమ పచ్చి ఉండేలా. మూడు రోజులు ఎండనిస్తాం.

 కట్టేస్తాం, కుప్పేస్తాం. ఎందుకిదంతా తిన్నగా మాసూలు చేసుకోవచ్చుగా? దశలవారీగా ఎండ తగలనివ్వడమనమాట. ఆ తరవాత కుప్ప నూరుస్తాం. ఒక్కొకప్పుడు అర్జంటు అవుతుంది,వాతావరణం సరిలేక. అప్పుడు కొద్ది పొడి చోటు చూసి ఒక బల్ల వేస్తాం. కోసేవాళ్ళు కోస్తుంటారు, పనలు తెచ్చేలాళ్ళు తెస్తుంటారు. బల్ల కొట్టేవాళ్ళు కొడుతుంటారు. ధాన్యం పోగు చేసేస్తాం. ఇలా చేస్తే పచ్చి ఉంటుంది, పనలని కొంత ధాన్యమూ ఉండిపోతుంది.  

వర్షం ఆగి పంట పండి ఒబ్బిడయ్యేనా?ప్రపంచం మొత్తం మీదే ఆహారానికి కొరత వచ్చేలా ఉంది. పండిన పంట దాచుకోవాలని చూస్తున్నాడు నేడు జరిగిన రైతు.కరువొచ్చేలా ఉందని కంగారు పడుతున్నాడు. కాని దాచుకోడమెలా? కొన్ని పద్ధతులు చెప్పా! మరో సారి మరో టపాలో!