Tuesday 27 November 2018

పొడుపు కథ విప్పడం.

పొడుపు కథ విప్పడం.

ముత్తాత కనపడతాడుగాని దొరకడు.
తాతకి రూపులేదు.
తండ్రిని చూస్తే అందరికి భయమే.
కొడుకుని చూస్తే తండ్రికి భయం.
ఎవరీకుటుంబం.

ఏ పొడుపు కథనైనా విప్పాలంటే కొన్ని విషయాలు తెలిసుండాలి. అప్పుడు గాని అది సాధ్యపడదు. పై పొడుపు కథలో ఒక కుటుంబం ముత్తాత కనపడతాడుగాని,దొరకట్ట,తాతకి రూపే లేదు, ఇదో విరుద్ధం. తండ్రిని చూస్తే అందరీ భయం, ఇది మరో చిత్రం. ఇక చివరగా కొడుకుని చూస్తే తండ్రికి భయం, ఇది మరో విరుద్ధం. సమన్వయమెలా?

కనపడుతూ ఉంటుంది ఎంత దూరం పోయినా కాని చేతికందనిది ఆకాశం. ఇదే ముత్తాత, చివరి వాడైన వానికి ముత్తాత.  ఇక తాతకి రూపులేదు అది వాయువు. వాయువుకి రూపు లేదుగదా! తరవాత తండ్రిని చూస్తే అందరికి భయం అది అగ్ని. కొడుకును చూస్తే తండ్రికి భయం. అదే నీరు,నీటితో నిప్పు ఆరిపోతుందిగా! బాగానే ఉందిగాని బంధుత్వమెలా? పంచభూతాలు పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్, అంటే భూమి,నీరు,నిప్పు,వాయువు,ఆకాశం కదా! ఇక్కడో అనుమానం రావాలి, అదే ముందు భూమి కదా, ఆకాశం ఎలా ముత్తాతవుతుందీ అని.  మొట్టమొదటిది ఆకాశమే, దాని నుంచి పుట్టినది,గాలి, గాలినుంచి పుట్టినది,నిప్పు, నిప్పు నుంచి పుట్టినదే నీరు,నీటినుంచి పుట్టినది భూమి. ఈ మాటని మన పూర్వీకులూ చెప్పేరు, నేటి శాస్త్రజ్ఞులూ చెబుతున్నారు.ఆ కుటుంబం పంచ భూతాలలో నాలుగూ, ఆకాశం,వాయువు,నిప్పు,నీరు. అదండి సంగతి. 

Sunday 25 November 2018

పొడుపు కథ విప్పండి




ముత్తాత కనపడతాడుగాని దొరకడు.
తాతకి రూపులేదు.
తండ్రిని చూస్తే అందరికి భయమే
కాని కొడుకును చూస్తే తండ్రికి భయం.
ఎవరీ కుటుంబం?

Friday 23 November 2018

కుక్కకు మాంసం దొరికినది

కుక్కకు మాంసం దొరికినది
అది వంతెన మీదకుపోయినది
నీటిలో నీడను చూచినది
వేరొక  కుక్కని తలచినది
భౌ! భౌ!! భౌ!!! యని అరచినది
మాసం ముక్క పోయినది.

Saturday 17 November 2018

శర్మ కాలక్షేపంకబుర్లు-eBooks

eBooks

నా బ్లాగులో టపాలను ఈ బుక్ చేయమన్నవారు,చేస్తామన్నవారు, అబ్బే ప్రింట్ పుస్తకాలే వేయమన్నవారు, ప్రింట్ పుస్తాకాలేస్తామన్నవారు, అలా ప్రింట్ పుస్తకమేస్తే నాకు ఇరవై కాపీలు కావాలన్నవారు, అబ్బో చిటికెల పందిళ్ళు చాలా వేసేశారు, చాలా మంది. ఎందుకు జరగలేదూ? విత్తం కొద్దీ వైభోగం.....నాకా ఓపిక లేకపోయింది.మాటలు కోటలు దాటేయి తప్పించి కాళ్ళు గడపలు దాట లేదు.
కాలం గడచింది, ఇప్పుడు నా బ్లాగు టపాలను ఈ బుక్స్ గా వెయ్యాలని నాకే అనిపించింది. మొదలు పెట్టాను. చాలా వేగంగానే పని అవుతున్నది. వారంలో ఐదు పుస్తకాలు తయారయ్యాయి. వీటిని ముందు మాట కోసం కొంతమంది మిత్రులకు పంపించాను. జిలేబి దగ్గరనుంచి ఒక జాబొచ్చింది," ముందు మాట రాయడానికి నాకు అర్హతలేదేమోగాని, మీ టపాల మీద అభిప్రాయం అంటూ ఒక లేఖ రాశారు. అదే ముందుమాటగా ప్రచురిస్తున్నాని చెప్పేను. మిగిలిన నలుగురునుంచీ జవాబు రావాలి. ఆ తరవాత ఐదు పుస్తకాలు ఒక సారి విడుదల చేస్తాను. 

బ్లాగులో చాలా టపాలున్నాయి,వీటిని ఇలా విడ దీస్తున్నాను.

1.కథలు,సామెతల కథలు,రామాయణ,భారత,భాగవతాలనుంచి నేటి కాలానికి అన్వయించేవి,న్యాయాలు....
2.గురువు, చదువు, సుభాషితాలు,స్నేహితులు,స్నేహం.....
3.పెళ్ళి,వంట,వార్పు,వడ్డింపులు,భోజనాలు.......
4.ఆత్మ,పరమాత్మ....
5. మామూలు టపాలు తో మిగిలిన పుస్తకాలు.
బ్లాగు మొత్తాన్ని చేస్తే పది పుస్తకాలు పైన అయేలా ఉన్నాయి. ఫోటోల తో ఈ బుక్ చేయడం కొంత కష్టమైనా అలాగే చేస్తున్నాను.
మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.

Wednesday 14 November 2018

కాకి సేవ/సేన

Courtesy: BBC, from whats app

ఇదే తెల్లోడికి మనకి తేడా!

Saturday 10 November 2018

గృధ్ర వాయస జలచర ......

Courtesy:Whats app
గృధ్ర వాయస జలచర ముఖేన భుంక్ష్వా ...... ఇదీ మంత్రం. అనగా గృధ్ర అనగా గ్రద్ద, వాయస కాకి, జలచర అనగా నీటిలో బతికే ప్రాణులు,చేప,తాబేలు...వగైరా జీవులు, వీటి ద్వారా చనిపోయిన వారికి చేరాలనేది ఆకాంక్ష... కాకి ముట్టుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నారు, పర్యావరణ సంతులన కాపాడుకుంటే కాకులు లేకుండాపోయేవికాదు కదయ్యా!

Courtesy:Whats app
కొడుకుల్లారా! ”బతికుండగా గొతులో మంచినీళ్ళు పోయలేదుగాని చనిపోయిన తరవాత కాటిలోకి పడమటి ఆవును తోలేడని” సామెత. తల్లి తండ్రులు బతికుండగా పలకరించండి,మాటాడండి, వారితో కూచుని భోజనం చేయండి, వారికి తృప్తి కలిగించేలా వ్యవహరించండి. చనిపోయిన తరవాత పడమటి ఆవు అంటే ఒంగోలు జాతి మంచి ఆవుని కాటిలోకి తోలి పాలు పిండి చితి దగ్గర పోసినా, పంచ భక్ష్య పరమన్నాలు కాటి దగ్గర పోసినా తల్లి తండ్రులు తినరారు సుమా! నిజానికివన్నీ మీ గొప్పకోసమూ, మీ మానసిక తృప్తి కోసమే, మీ మానసిక సంతులన కాపాడటం కోసం పెద్దలు పెట్టినవే సుమా! గుర్తించండి.