Wednesday 27 September 2023

దొంగని దొంగే పట్టాలి.

దొంగని దొంగే పట్టాలి


దొంగని దొంగే పట్టాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఇవన్నీ సమానర్ధకమైన తెనుగు నానుడులు. దొంగతనం అరవైనాలుగు కళలో ఒకటిట. దొంగని దొంగ ఎలాపట్టగలడు? అదీ కొచ్చను!


దొంగలకి ఉండే అలవాట్లు, చేసే పొరబాట్లు, నమ్మకాలు, ఇలా చాలా విషయాలు సమానంగా ఉంటాయట, ఇది పెద్దలమాట. సాధారణంగా దొంగలు దొంగతనం చేయబోయే ఇంటిని చాలాకాలం జాగ్రత్తగా గమనిస్తారట. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు? ఎంతబలవంతులు? ఎదురుతిరగ్గలరా?ఎప్పుడు సొమ్ము ఉంటుంది ఇంట్లో?ఎంత ఉండచ్చు? బంగారం ఎంతుండచ్చు?  ఆ ఇంటివారి అలవాట్లు, భద్రత ఎంత?  ఎంతమంది ఆడాళ్ళున్నారు? కుక్కలున్నాయా? ఏజాతివి? బిస్కట్లకి లొంగుతాయా? లొంగదీసుకోడానికి ఇతర మార్గాలేంటి?కాపలా ఉంటుందా? పట్టుబడితే? కన్నగాడు కత్తి మరవడని సామెత.  


ఇలా చాలా విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే దొంగతనానికి దిగుతారట. అంతే కాదు, తిథి, వారం,నక్షత్రం ఇలా చూసుకునేవారూ ఉంటారట. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి సాటి దొంగకే తెలుస్తాయి, దీన్నే రెకీ చెయ్యడం అంటారట!!  కనక దొంగని దొంగే పట్టాలంటారు.


Monday 25 September 2023

జలే తైలం

 జలే తైలం


 జలే తైలం ఖలే గుహ్యం

పాత్రే దానం మనాగపి

ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి

విస్తారం వస్తుశక్తితః

నీటిపైన నూనె, ఖలునికి తెలిసిన రహస్యం,  అర్హునికిచ్చిన దానం తెలివైనవానికి తెలిసిన శాస్త్రం, అన్నిటికిన్నీ వాటివాటి గుణాల ప్రకారంగా విస్తరిస్తాయి.


 ఆచార్య చణకుని భావం. 

 దుర్జనునికి తెలిసిన రహస్యము, అర్హునికిచ్చిన దానము, తెలివైనవానికి చెప్పిన విద్య,నీటి మీద పడిన నూనె చుక్కలా వ్యాప్తి చెందుతాయి.


దుర్జనునికి రహస్యం తెలిస్తే దానిని ఎవరికి చెప్పకూడదో వారికే చెబుతాడు, ఆ తరవాత జరిగేది విధ్వంసం. అర్హునికి దానమిస్తే దానితో అతను వృద్ధి చెందుతాడు, తనలా ఉన్న మరో కొంతమందిని కూడా వృద్ధిలోకి తీసుకొస్తాడు. తెలివైనవానికి చదువు చెబితే చాలా తొందరగా గ్రహిస్తాడు, అంతే కాదు దానిని మరో పదిమందికి వ్యాప్తి చేస్తాడు.దానిని జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో కనుగొంటాడు.


ఇలాగే

సజ్జనునికి చెప్పిన రహస్యం,అనర్హునికిచ్చిన దానం,తెలివిలేనివానికి చెప్పిన విద్య నీటి మీద నేతి బొట్టులా ఘనీభవించి పోతాయి. ఇవన్నీ వారికి ఉపయోగపడవు, మరొకరికి అంతకన్నా ఉపయోగించవు. ఇదెక్కడో చదివిన గుర్తు.  

Saturday 23 September 2023

కలయో!

 కలయో!

బాలకృష్ణుడు మన్ను తిన్న సందర్భం.

ఈ సందర్భంగా వ్యాసుని మాటేమీ?

బాలకృష్ణ, బలరాములు పిల్లలతో కలసి ఆడుకుంటున్న సమయం. బలరాముడు మిగిలినపిల్లలు, కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదకి చెబుతారు. అంత, యశోద,కృష్ణుని చేయి పట్టుకుని, నీ నోరు నీ వశంలో లేదు.మన్నెందుకు తిన్నావని అడిగింది. మన్ను తిన్నావని వీళ్ళు చెబుతున్నారు.. దానికి కృష్ణుడు, అమ్మా! నేను మన్ను తినలేదు. వీరు చెప్పే నేరములు అబద్ధము, వీరంతా సత్యం చెబుతున్నారనుకుంటే, నీవే నా నోటిని చూడమన్నాడు. ఐతే వీరు చెప్పిన మాట అసత్యమైతే, నీనోరు తెరవమన్నది. కృష్ణుడు నోరు తెరిస్తే అందులో యశోదకు విశ్వరూపం కనపడింది. ఆ సందర్భంగా


కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధి మోహః

అధో ఆముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః

ఏతత్-ఇది ,కిం స్వప్నః-కలయా? ఉత-లేక,దేవమాయా- శ్రీహరిమాయయా? వా-లేక, మదీయః-నాదైన, బుద్ధి మోహః కిమ్- బుద్ధియొక్క వ్యామోహమా? బత-ఆశ్చర్యము! అథో-లేక, ఆముష్య-ఈ, మమ-నా, అర్భకస్య-పిల్లవానిదే ఐన,యః కశ్చన-ఏదో ఒకానొక, ఔత్పత్తికః-సహజసిద్ధమైన, ఆత్మయోగః-తనదైన యోగ సిద్ధియా?

ఇది కలా? లేక వైష్ణవ మాయయా? లేక నాబుద్ధి వ్యామోహపడుచున్నదా? ఆశ్చర్యము! లేక, ఈ పిల్లవానికే, ఏదో ఒక, పుట్టుకతో వచ్చిన యోగ సిద్ధియా? అనుకున్నదన్నారు.


ఇక పోతనామాత్యుడు,ఈ సందర్భంగా

మన్ను తిన్నాడు కృష్ణుడని బలరాముడుగోపాలురు చెబితే, మన్నేటికి భక్షించెదు,.........మఱి పదార్ధము లేదే.. అడిగింది. దానికి మన్నుదినంగ నే శిశువునో... చిన్నపిల్లాణ్ణా,ఆకలేసిందా?వెఱ్ఱివాడినా?వీరిమాటలు నమ్మకు.వీళ్ళు, నేను మన్నుతిన్నానని చెప్పి, నిన్ను నమ్మించి,  నీచేత నన్ను కొట్టించాలని వీరి పన్నాగం. అలాకాదనుకుంటే నా నోరు వాసనచూడు, నా మాటలు తప్పైతే కొట్టమ్మా! అన్నాడు. సరే! అంటే నోరు తెఱచి చూపాడు. నోటిలో విశ్వరూపం కనపడింది, యశోద  ఆలోచించిందిలా అన్నారు 

కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో

తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర

స్థలమో బాలకు డెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర

జ్వల మై యుండుట కేమి హేతువొ మాహాశ్చర్యంబు చింతింపగన్..భాగవతం..దశమ స్కందం..341

అనుకుని విభ్రమ చెందింది. 


మరి నేటి కాలపు సినీ కవి చిన్న చిన్న మాటలతో

అమ్మా! తమ్ముడు మన్ను తినేను! 

చూడమ్మా అని రామన్న తెలుపగా!

అన్నా! యని చెవి నులిమి యశోద

ఏదన్నా! నీనోరు చూపు మనగా

 చూపితివట నీనోటను
బాపురె పదునాల్గు భువనభాండమ్ముల నా
రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్

 జయ కృష్ణా ముకుందా! మురారి

జయ గోవింద బృందా విహారీ 


పై ముగ్గురిలో ఎవరూ యశోద కృష్ణుని నోట విశ్వరూపం చూసి స్పృహ కోల్పోయిందనలేదు.

మళ్ళీ పోతనగారి దగ్గరకొద్దాం.


కలయో- మానవులకి మూడు అవస్థలు. జాగృత, సుషుప్తి,స్వప్నావస్థలు. కలలో మనసు సర్వాన్ని  సృష్టించుకుని వాటితో తాదాత్మ్యంచెంది, దుఃఖిస్తుంది, సుఖిస్తుంది. మెలకువవచ్చాకా నిజంకాదూ? కలా! అనుకుంటుంది. ఇక వైష్ణవమాయయో- ఇదీ కలలాటిదే కాని అనుభవంకూడా ఉంటుంది. నేటికాలపు (virtual reality)  వర్త్యుయల్ రియాలిటీ! ఇతరసంకల్పార్ధమో- ఇతరులు తమ సంకల్పం నాపై ఆపాదిస్తున్నారా? అంటే నేటి  hypnotism,  సత్యమో- నిజమా? తలపన్నేరక యున్నదాననో- ఆలోచింపలేకపోతున్నానా? యశోదా దేవిగానో- అసలు నేను యశోదనేనా? అనుమానపడింది, పరస్థలమో- భూమి మీదకాక మరో గ్రహం మీదకాని ఉన్నానా?  ఆశ్చర్యం! చిన్నకుర్రాడి నోట విశ్వరూపం కనపడ్డానికి కారణమేమై ఉంటుందని తలపోసింది.


పోతనగారు, నేటికాలంలో గొప్పగా చెప్పుకుంటున్న మానసిక స్థితులను నాడే దర్శించినవారు కదా! పోతన మహాశయులకు శతకోటివందనాలు.


Thursday 21 September 2023

తెనుగువార్తలు-మీడియా

తెనుగువార్తలు-మీడియా

మా చిన్నప్పుడూ అనను. ఆ రోజుల్లో ఈ రోజు పేపరు రేపొచ్చేది. అదొస్తే గొప్పే!!  నోటి మాటే వార్త. ఆ వార్త పేపర్లో కూడా వచ్చిందయ్యా! అంటే శిలాక్షరమని, నిజమని నమ్మేవారం, పల్లెలలో. రోజులు జరిగాయి, రేడియో వచ్చింది. వార్తలకి కొద్దికాలమే, పందులపెంపకానికి గంట సమయం. ఇదీ  రేడియో సంగతి. కాలం జరిగింది దూరదర్శన్  వచ్చింది. ఇదీ ఏం తక్కువ తినలేదు. చివరికి తెనాలి రామలింగడి పిల్లి కతైపోయింది, మాపల్లీయులకు :)  వార్త అంటే,   అందునా ప్రభుత్వ వార్త అంటే  నిజం కాదనే నిర్ణయానికొచ్చేసేం, అప్పుడే!


ఆ తరవాత ప్రైవేట్ టి.వి చానల్స్ వచ్చాయి, తల్లీబిడ్డా న్యాయంగా వార్తలుండేవి, ఇవీ తక్కువకాలమే, వార్తలు నిజానిజాల కలగలుపు.బియ్యంలో రాళ్ళేరు కున్నట్టుండేది. ఆ తరవాత వార్తా చానల్స్ వచ్చాయి. ఈ పాటికే పేపర్లు ఒకే వార్తని వారికి నచ్చిన రీతిలో రాసుకునే రోజులొచ్చాయి. నాలుగు పేపర్లు చదివితేగాని నిజమేంటో తెలిసేదిగాదు. ఆ తరవాత కాలంలో అదీ పోయింది.ఎవరివార్త వారిదే, నిజం ఎప్పుడో ఎగిరిపోయింది,ఇగిరిపోయింది.వార్త లేదు అంతా వారివారి అభిప్రాయాలే వార్తలైపోయాయి.

 ఇక ఆ తరవాత టి.వి చానల్స్ వారు వారికి తగినరీతిలో వార్తలు వండి వార్చుకోడం మొదలైంది, ఇంకేం అస్థాన విద్వాంసులు తిమ్మిని బెమ్మిని చేసి చూపే అలవాటు వచ్చి చేరింది, పేనల్ డిస్కషన్ పేరుతో. దీనితో టి.వి అంటేనే వెగటుపుట్టేసింది.


కాలం కొద్దిగానే నడిచింది.  సోషల్ మీడియా! ఎవరివార్త వారిదే!! ఆ తర్వాతొచ్చింది యు టూబ్, ప్రతివారూ ఒక పత్రికే,వార్త అందించేవారే, ఇక చెప్పేదేమి? ఏది నిజం, ఏది నిజంకాదు.తెలియదు. అంతలా వార్తలు బ్రష్టు పట్టిపోయాయి. మీడియా పేరు జెప్పుకుని భయపెట్టి, బ్లాక్ మైల్ చేసి డబ్బులు సంపాదించుకోడం పాతకాలపు విద్యే! పల్లెవాసులకిది కొత్త. యు ట్యూబ్ చానల్స్ వచ్చాకా మా దగ్గరా ఈ సంస్కృతి మొదలయింది.



ఇప్పుడన్ని వార్తా మాధ్యమాలకి దూరంగా ఉన్నాం. నిజమేంటి ఎవరూ చెప్పరు, కాదు చెప్పలేరు, కొందరటు, కొందరిటు,  తప్పుపట్టేవారే!!పోనీ ఎవడెటు పోతే నాకేం!!! అమ్మయ్యా! ప్రాణం సుఖంగా ఉంది.   ఎప్పుడూ పాలితుడినే, కాదు, ఎప్పుడూ పీడితుడినే!!!

ఏది నిజం? చిదంబర రహస్యం.


Tuesday 19 September 2023

అంకెలతో ఆట

Match stick magic


 
అంకెలతో ఆడుకోడం ఆనందం. కొంతమందికి చిరాకు కూడా. ఇలా అగ్గిపుల్లలతో అంకెలు తయారు చేయడం వాటితో కొన్ని సమస్యలు సృష్టించడం నేడు జరుగుతున్న పని. ఇది కొంత  మేథను
 మథించేదేకాని ఉపయోగం శూన్యమని నా అవగాహన.
వీటి తో ఏమేo చేయచ్చో చూదాం....

ఒక అగ్గిపెట్టిలో పాతకాలంలో 60 పుల్లలుండేవి. వీటికి హార్స్ హెడ్ మేచ్ బాక్సులని పేరు,   వీటినే అగ్గిడెక్క లేదా డెక్క అగ్గిపెట్టి అనేవారు.. పెట్టిమీద రాసుండేది కూడా సిక్టీ మేచ్ స్టిక్స్ అని. నేటి కాలంలో అగ్గిపెట్టిలో50 గాని 52 కాని పుల్లలుంటాయి. 1 నుంచి 0 అంకెలు తయారు చేయడానికి 49 అగ్గిపుల్లలు కావాలి. ఈ 49 ప్రైమ్ నంబరా? కాదు. ఇలా అంకెలతో  ఆడుకోవడమో వ్యసనం కూడా, దీని గురించి మరో సారి.

ఇప్పుడు1నుంచి0 దాకా అంకెలలో మార్పులు చేర్పులుతో ఏమేం చెయ్యచ్చు....
  
చేర్పు/అదే అంకెలో చోటు మార్పు.

1. కి మరొక పుల్ల చేరిస్తే 7 చేయచ్చు. 
2. కి చేర్పువల్ల అంకె మారదు, ఒకపుల్లను అందులోనే చోటు మారిస్తే 3చేయచ్చు.
3. దీనికి ఒక పుల్ల చేరిస్తే 9 చేయచ్చు , ఒక పుల్ల చోటు మారిస్తే 2,5 చేయచ్చు .
4. ఏమి చేసినా మార్పు రానిది 4 మాత్రమని గుర్తుంచుకోవాలి.
5. ఒక పుల్ల చేరిస్తే 9,6 చేయచ్చు,ఒక పుల్ల చోటు మారిస్తే 3 చేయచ్చు .
6. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చు.ఒక్కపుల్ల చోటు మారిస్తే 0 చేయచ్చు.
7. ఒక పుల్ల చేరిస్తే మార్పు లేదు.
8. చేరిస్తే మార్పురాదు.
9. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చుఒక్కపుల్ల చోటు మారిస్తే 0 చేయచ్చు.
0. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చు.

ఒక పుల్ల తీసేస్తే
1 నుంచి  6 దాకా ఒకపుల్ల తీసేస్తే అంకెలో మార్పు రాదు.
7.లో పుల్ల తీసేస్తే 1 చేయచ్చు.
8.లో పుల్ల తీసేస్తే 0 చేయచ్చు.

ఇలాగే రెండు పుల్లలు చేరిస్తే,  ఏమవుతుంది చూడచ్చు.ఒక రూపాయి అగ్గిపెట్టేతో డబ్బులు సంపాదిస్తున్నారు, రోడ్ పక్క ఒక చిన్న స్టాండ్ వేసుకుని ఇలా సమస్యలు పెట్టి తికమకపెట్టి. ఇది ఒక మానసిక ఆటలా చెప్పి మనుష్యులని చిన్న సమస్య చెయ్యలేకపోయామనే కసిపెంచి, డబ్బులు పోగొట్టుకునేలా చేస్తున్నారు. అందుకే ఈ టపా..,.హెచ్చరిక. ఇందులో వింతే లేదు! ఇందులో చిక్కుకోకండి...
2-2=6 ఒక్కపుల్ల మార్చండి,   ఆ తరవాత 1-2=6. ఒక్కపుల్ల మార్చండి బహుమతి గెల్చుకోండంటూ అరుస్తున్నాడు. ఒక్క క్షణం ఇంత చెప్పిన నేనే బిత్తరపోయా!! ఆ తరవాత ఫక్కున నవ్వుకున్నా!!!!!

 డబ్బులుపోగొట్టుకునేవాళ్ళు పోగొట్టుకుంటూనే ఉన్నారు.

Saturday 16 September 2023

Correct the equation

Correct the equation 



Digits are formed by arranging match sticks which can be moved


 Correct the equation by moving only one match stick

Thursday 14 September 2023

సెల్ఫీ

 సెల్ఫీ


ఒకప్పుడు ఫోటో తీయించుకోవడమంటే గ్రూప్ ఫోటో యే. మరికొంచం వెనక్కెళితే అది కలిగినవారు తీయించుకునేది, అదిన్నీ చెల్లిపోయిన తరవాతే! నాడు ఫోటో తీయడానికి చాలా బాదరబందీ! చెప్పుకుంటూ పోతే చాటు భారతమంత. ఇదివరలో ఒక టపా సాయించినగుర్తు. లింక్ వెతికే ఓపిక లేక విరమించుకున్నా! 


ఆ తరవాత కాలంలో పెళ్ళిళ్ళకి ఫోటోలు తీసుకోడం అలవాటయింది. అదీ ఖరీదు వ్యవహారమే! అన్నీ బ్లేకండ్ వైటే..ఆ తరవాత డబ్బా కెమేరాలొచ్చాయి. అందులో పదిహేనో ముఫైయ్యో ఫోటోలు తీసుకోడానికో ఫిల్ము,అవీ బ్లాక్ వైటే. అదీ ఖరీదైన వ్యవహారమే! ఇదీ కలిగినవారి మాటే. తరవాత కాలంలో ఇందులో కలర్ ఫిల్ములొచ్చాయి. దేనికైనా రీలు కడగడం ప్రింట్లు వెయ్యడం ఖర్చుతో కూడినదే! ఆ తరవాత స్తబ్ధుగా నడిచింది కొంత కాలం.  ఆ తరవాతది డిజిటల్ యుగం. ఫిలుము వగైరాబాదరబందీ లేక ఫోటో తీసుకునే అవకాశం, నిమిషాల్లో ఫోటో వచ్చే సావకాశం. కొద్దికాలమే గడిచింది, సెల్ ఫోన్ రావడంతో విప్లవం. ఫోటో ఎక్కడపడితే అక్కడ, ఎవరికిపడితే వారికి ఫోటో తీయడం అలవాటయింది. హార్డ్ కాపీకావాలంటే ప్రింట్ ఎప్పుడూ తప్పలేదు. డబ్బా కెమేరాల కాలంలో అంతా బ్లాక్ అండ్ వైటే! అప్పుడు కలర్ ఫోటో విప్లవం. ఇప్పుడంతా కలరే! తెల్లకాగితం మీద కూడా ప్రింట్ తీసుకునే బాదరబందీ లేని సావకాశం ఇంకేంచెప్పేది?


ఆ తరవాతది సెల్ ఫోన్ లోనే తనఫోటో తనుతీసుకునే సావకాశం, అదే సెల్ఫీ.దీంతో కూచుంటే ఫోటో నుంచుంటే ఫోటో, పడుకుంటే ఫోటో.ఎక్కడో ఒక మాధ్యమానికి ఎక్కించెయ్యడమే!


ఈ సెల్ఫీ జ్వరం సామాన్యులకే కాదు మాన్యులకీ ఉందిట :) మొన్న జి.-20 లో ఒక ముసలినాయకుడు ఒక ముసలి నాయకురాలితో సెల్ఫీ దిగేట్ట. అదో పెద్దవార్తైపోయిందా రెండు దేశాల్లోనూ. ఇలాగే మరొకరితో సెల్ఫీ, రైలింజన్తో సెల్ఫీ, విమానంతో సెల్ఫీ, ఈ జ్వరం ఎంతగా ముదిరిందంటే, పిల్లలు, పెళ్ళాంతో కలిసి వరదలో నుంచుని సెల్ఫీకి ప్రయత్నిస్తే పెళ్ళాన్ని వరదెత్తుకుపోయింది. ఇటువంటి వెన్నో! ఈ సెల్ఫీతో పాటే సెల్ఫీ వీడియో! వామ్మో దీని గురించి చెప్పడం మొదలెడితే....అసభ్య చిత్రాలు అతి లాఘవంగా నెట్ ని ముంచెత్తుతున్నాయి. ఇక ఆపేస్తానూ...


ఆతర్వాతది వాట్సాప్, సెల్ఫీకి పరాకాష్ట. నిమిషనిమిషానికి సెల్ఫీ ఆతరవాత అది స్టేటస్ లో అప్ లోడూ. ఈ పిచ్చి నాకూ పట్టింది, ఎందుకూ?? బ్లాగులో బుద్ధిగా టపా రాసుకునేవాణ్ణి, కాలు విరిగి మంచాన పడటంతో వాట్సాప్ వాడకం పెరిగింది. దాంతో సెల్ఫీల పిచ్చి పెరిగింది.అంతా సెల్ఫిలు పెడుతుంటే. పిచ్చిగా తీసుకున్నా సెల్ఫీలు, అదేంటో ఒక్కటి నచ్చలేదు, స్టేటస్ లో పెట్టడానికి. అన్నీ డిలీటాయనమః

ఒక సెల్ఫీ అందంగా ఉండేలా తీసుకోడమెలాగో ఉపాయం చెప్పండి. :)


Tuesday 12 September 2023

వినాశ కాలే విపరీతబుద్ధిః

వినాశ  కాలే విపరీతబుద్ధిః 


రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః

పాపే  పాపాః   సమే సమాః

రాజానమనువర్తంతే

యథా రాజా తథా ప్రజాః

(ఆచార్య చణకుడు)

రాజు ధార్మికుడైతే ప్రజలు ధార్మికులై ఉంటారు. రాజు పాపకార్యాలు చేసేవాడైతే ప్రజలూ పాపకార్యరతులే! రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.


న నిర్మితా కేన న దృష్టపూర్వా

న  శ్రూయతే హేమమయీ కురంగీ

తథాపి తృష్ణా రఘునందనాస్య

వినాశ   కాలే విపరీతబుద్ధిః 

(ఆచార్య చణకుడు)


ఇంతకు ముందు బగారు లేడిని ఎవరూ నిర్మించలేదు, చూడలేదు, దాని గురించి వినలేదు. కాని బంగారు మాయలేడి కనపడితే రఘురాముడే ఆకర్షింపబడ్డాడు. వినాశ కాలానికి విపరీత బుద్ధులే పుడతాయి.


బంగారు లేడిని చూసినది సీత. ముచ్చటపడింది. బంగారు లేడి ఉండదని ఎప్పుడూ,ఎవరూ చూడలేదని తెలియనిదా సీత?. కాని ఆ క్షణానికి మాయ కమ్మింది. ఆలోచన నశించి రాముణ్ణి బంగారు లేడిని పట్టి తెమ్మని కోరింది. ఎప్పుడూ సీత కోరిక కోరినది కాదు, మరి ఈ సారి కోరిక కోరింది, అదిన్నీ తన వీరత్వానికి సంబంధించినదీ, కావచ్చు. రాముడికి మాత్రం బంగారు లేడి ఉండదని తాము రాక్షసుల మధ్య ఉన్నామని, వారి ఏ పన్నాగమైనా కావచ్చని తెలియనివాడా? సీతలాగే మాయలో పడిపోయాడు. విల్లంబులు పుచ్చుకు బయలుదేరాడు.   లక్ష్మణుడు  అన్నా! ఇది రాక్షసమాయ కావచ్చు, అని  చెప్పినా వినలేదు. బయలుదేరుతూ లక్ష్మణునికి సీత గురించి జాగ్రత్తలూ చెప్పాడు.

 అదే వినాశకాలె విపరీత బుద్ధి,కష్టపడే కాలానికి ఇటువంటి బుద్ధులే పుడతాయి.


కయ్యానికైనా వియ్యానికైనా ........

కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలి.


కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలి, ఇదోనానుడి.అలాగే కుర్రాడితోనూ గుణం తక్కువవాడితోనూ దెబ్బలాడకు. ఏమి వీటి సంగతి? యోచించగా...చించగా.....


కుర్రాడితో దెబ్బలాడితే ఇంతవయసొచ్చింది కుర్రాడితో గొడవేంటయ్యా! అనేస్తారు, తప్పెవరిదైనా, చూసేవాళ్ళు, విషయం తెలుసుకోకనే!అంచేత కుర్రాడితో వివాద పడటం మంచిదికాదని ఉవాచ. ఇక గుణం తక్కువవాడు, ఈ మాట అనచ్చు ఇది అనకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇది ఉచితం,ఇది అనుచితం అనే ఇలాటి శషభిషలేం పెట్టుకోడు. దీనికితోడు వీడు బలవంతుడై ఉంటాడు. దాంతో ఎవరూ నిజం మాటాడరు. పోనిద్దురూ గొడవెందుకూ అనేస్తారు. ఎం?అంటే, ఒక్కమాటలో చెప్పాలంటే, భయం.  రేపు నిజం మాటాడినవారి ఇంటి మీద రాళ్ళేస్తాడేమో,కాదు వేస్తాడు, తన పెళ్ళాన్ని, కూతుర్ని  గొడవపెడ్తాడేమో అని భయం. అందుకు గుణం తక్కువవాడి జోలికే పోకూడదు. 


అందుకే కయ్యానికైనా వియ్యనికైనా సమ ఉజ్జీ కావాలి. అదేంటో! కయ్యానికి ఉజ్జీ సరిపోవాలి, అంటే సమానంగా దెబ్బలాడగలిగి ఉండాలి. అది వాక్కలహమైతే ఒకరో మాటంటే ఎదుటివారు దాన్ని తిప్పికొట్టగలగాలి, అదిన్నీ వెంట, వెంటనే కావాలి.  మరి ఈ వాక్కలహంలో చణుకులు, సామెతలు, ముచ్చట్లు, దెప్పులు, ఎగతాళీలు వరదగోదారిలా సాగిపోతాయి. ఇది కవులు రచయితల మధ్యనైతే చదువరులకు పండగే, చెళ్ళపిళ్ళవారికి, శ్రీపాదవారికి మధ్య జరిగిన వాక్కలహంలో ”ఈ ’దాక’లో అరసున్నా వేయించండి”, అన్నదో చెణుకు. నిజానికి చూసేవారికిదో గొప్ప అనుభూతి కూడా! ఇటువంటి వాక్కలహం రాతలో ఉంటే అబ్బో! అదో గొప్ప. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. ఆనందిస్తుంటారు కూడా.  మరి ఈ వాక్కలహంలో సరితూగలేకపోతే, తిట్లు,శాపనార్ధాలు  చోటు చేసుకుంటాయంటే, సరి తూగలేనివారు, ఉడుకుబోతుతనంతో తిట్లకి లంకించుకుంటే,   త్వం..అంటే త్వం.. అనుకుంటే,  అది అసహ్యంగా ఉంటుంది.   ఒక వేళ సరితూగలేకపోతే ఏ సమయంలో తగ్గిపోవాలో తెలిసుండాలి. ఆ తగ్గిపోవడంలో కూడా అందముండాలి. అలా తగ్గిపోయారని ఎదుటివారు రెచ్చిపోతే... ఇక చూడు నా సామిరంగా, చూస్తూన్నవాళ్ళు అలా రెచ్చిపోయేవాళ్ళ తలంటేస్తారు. సమయం చూసుకు   తగ్గిపోవడం కూడా కళే సుమా!



ఇక బాహాబాహీ కలహమైతే ఇద్దరూ సమాన బలం కలవాళ్ళైతే! అదీ వింతే, చూచేవారికి ఆనందం, రెచ్చగొట్టేవారికి... చెప్పెదేలేదు. అలా సమ ఉజ్జీలు కాకపోతే అబ్బే! చప్పగా ఉంటుంది.


వియ్యానికో! అంటే ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారు, ఆర్ధికంగా, బంధుబలగంలో సరిసమాన ప్రతిపత్తులున్నవారు, వరుడు,వధువు అన్నిటా సరితూగేలా ఉంటే చూడముచ్చట. 


చూతము రారండి.

 శ్రీ సీతారాముల కల్యాణము చూతమురారండి.        

సురలును మునులును చూడవత్తురట

చూచువారలకు చూడముచ్చటగ

 పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట, 

భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట,

 చూతము రారండి, 

శ్రీ సీతారాముల కల్యాణము 

చూతమురారండి.

Thursday 7 September 2023

ధనికః శ్రోత్రియో రాజా

 ధనికః శ్రోత్రియో రాజా

(999 post)


 ధనికః శ్రోత్రియో రాజా

నదీ వైద్యస్తు పంచమః

పంచ యత్ర న విద్యన్తే

న తత్ర దివసం వసేత్

(ఆచార్య చాణక్య)

డబ్బున్నవాడు (అప్పిచ్చేవాడు)శ్రోత్రియుడు (వేదం చదువుకున్నవాడు)రాజా (రక్షకుడు)నదీ ( ఎల్లప్పుడు పారేదానినే నది అంటారు)వైద్యుడు, ఈ ఐదుగురు ఉన్నవూరిలో ఉండు. లేని ఊరిలో ఒక్కరోజు కూడా ఉండకు.


అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడతెగక బారు నేరును ద్విజుడున్

జొప్పడిన యూరనుండుము

   చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ.

ఆచార్య చణకుడు ఐదుగురిని చెబితే సుమతీ శతకకర్త నలుగురితోనే సరిపెట్టేరు, ఎందుకో చెప్పలేను, తెలిస్తే చెప్పండి.



లోకయాత్రా భయం లజ్జా

దాక్షిణ్యం త్యాగశీలతా

పంచ యత్ర న విద్యంతె

న కుర్యాత్ తత్ర సంగతిమ్

(ఆచార్య చాణక్య)


లోకయాత్రా (జీవనోపాధి) లేనిచోట,భయం,లజ్జ (సిగ్గు),అభిమానం(దాక్షిణ్యం)త్యాగశీలత ( ఈవి కలిగి ఉండటం, విడిచేగుణం కలిగి ఉండటం) మనుషుల్లో,ఈ ఐదున్నూ లేనిచోట ఉండకు.


ఆతురె వ్యసనె ప్రాప్తె

దుర్భిక్షె శత్రుసంకటె

రాజద్వారె శ్మశానె చ

యస్తిష్టతి స బాంధవః

(ఆచార్య చాణక్య)


ఆతురె(అనారోగ్యం)లో, వ్యసనె(దుఃఖం, దురదృష్టం)లో, దుర్భిక్షం (కరువు కాలం)లో శత్రుసంకటె (శత్రువు దాడి చేసినపుడు), రాజద్వారె(రాజసభ, కోర్టు)లో, శ్మశానె(శ్మశానం)లో వదలక ఉండే బంధు సమానుడు ఎవరు? 


న పశ్యతి చ జన్మాంధః

కామాంధో నైవ పశ్యతి

మదోన్మత్తా న పశ్యతి

అర్ధి దోషం న పశ్యతి.


పుట్టిగుడ్డి ఎప్పుడూ చూడలేరు.కామంతో కళ్ళు మూసుకుపోయినవారూ చూడలేరు. మదోన్మత్తులూ చూడలేరు.

కోరేవారికి దోషం కనపడదు.


పుట్టుగుడ్డివారెప్పుడూ చూడలేరు. కాని కామాంధులు గర్వాంధులు కూడా కాన లేరు. ఇకా యాచన చేసేవారికిన్నీ అడగకూడనిది, అడగతగినది ఉండదు, తమకు కావాలి అంతే! అడిగేస్తారు. ఉదాహరణలు చూదాం.

 కామాంధులకు, మొదటగా చెప్పుకునేవాడు రావణుడు, గర్వాంధుడు కూడా.తరవాత చెప్పుకోదగ్గవాడు కీచకుడు, మాలిని రూపంలో ఉన్న ద్రౌపదిని మోహించాడు, అంతే.. తరవాత కత తెలిసినదే!. ఇలాటి వాడే మరొకడు సైంధవుడు. కౌరవుల, పాండవుల చెల్లెలైన దుస్సల భర్త. ముని ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని మోహించి ఆమెను బలవంతంగా రథం మీద తీసుకుపోతుంటే ధౌమ్యుడు అరచి పండవులతో చెప్పగా, పాండవులు ద్రౌపదిని కాపాడారు.  సైంధవునికి  ద్రౌపది చెల్లితో సమానం. కామంతో కళ్ళు మూసుకుపోయి, వీరంతా చచ్చారు.


చివరగా అర్ధికి ఉచితానుచితాలు తెలియవనడానికి, కళ్ళు కానవనడానికి ఉదాహరణ, దేవతలు ధధీచి వెన్నెముక అడగడం



Tuesday 5 September 2023

ముల్లును ముల్లుతోనే తీయాలి

 

https://kasthephali.blogspot.com/2023/09/blog-post.html

మోసం 

తరవాయి భాగం


ముల్లును ముల్లుతోనే తీయాలి


రత్నంతో సంభాషణ తరవాత,

 ముత్యం మాటాడక ఇంటికి చేరిన రాత్రి, భార్యతో,రత్నంతో 

  సంభాషణలో జరిగినది చెప్పేడు. విన్నామె, ”కంపమీద   

బట్ట పడింది, నెమ్మదిగా  లాక్కోవాలి, 

 బర్రున లాగేస్తే చేతులారా చింపుకున్నట్టవుతుంద'’ంది. ఈ మాట ముత్యానికి నచ్చింది, తాను ఉద్రేకపడక, మాటాడక వచ్చేసినదానికి భార్య వత్తాసు పలికినట్టయింది. 


ముత్యం మాటాడక వెళ్ళినా, రత్నం మనసులో గుబులు పోలేదు. మరునాడు భార్యతో కలిసి ముత్యం ఇంటికి వెళ్ళి, ముత్యాన్ని భార్యా పిల్లలని కుశల ప్రశ్నలు వేసి, కొన్ని బహుమతులిచ్చి, చివరగా వారందరిని తమ ఇంటికి విందుకు రావలసినదిగా ఆహ్వానించారు. ముత్యం ఇంటి దగ్గర గడపినంత సేపులోనూ, ముత్యంగాని, భార్యగాని తాము మోసపోయినట్టుగాని, నష్టపోయినట్టుగాని, బాధ పడుతున్నట్టుగాని అనిపించలేదు,రత్నానికి అతని భార్యకు. ఇది రత్నానికి మరింత బాధ కలిగించింది. అనుకున్నట్టుగానే ముత్యం భార్య పిల్లలతో కలసి విందుకొచ్చాడు,రత్నం ఇంటికి.


రత్నం ఇంటికొచ్చిన ముత్యం దంపతులు, రత్నం దంపతులకు బహుమతులిచ్చి,  విందు స్వీకరించి,కులాసాకబుర్లతో, ఆటపాటలతో గడిపేసారు. ఆరేళ్ళ రత్నం ఏకైక కుమారుడు, ముత్యానికి, అతని భార్యకు బాగా చేరికయ్యాడు, ఆ ఒక్క రోజులోనే. ఇంటికి బయలుదేరుతూ ముత్యం దంపతులు రత్నం కుమారుడిని తమతో తీసుకెళతామని కొద్ది రోజులుంచుకుని పంపుతామని అనడంతో రత్నం దంపతులు అంగీకరించారు. 

రత్నం ఆరేళ్ళ కొడుకు ముత్యం పిల్లలతో కలసి ఆటపాటల్లో మునిగిపోయాడు, ఇంటి ధ్యాసే మరచాడు.   ఒక  రోజు, ముత్యం భార్య పెరటితోటలో తిరుగుతుండగా ముల్లు గుచ్చుకుని కూలబడింది. కూడా ఉన్న పరిచారిక ముల్లును బయటికి తీసిందిగాని, కాలిలో ముల్లు విరగడంతో, లోపల ములుకు ఉండిపోయింది. పరిచారిక అదిగమనించి సన్నటి సూదిని తీసుకుని, నెమ్మది ములుకు చుట్టూ కుట్టి ములుకును బయటికితీస్తూ. 'ముల్లును ముల్లుతోనే తీయాలమ్మా కంగారుపడితే ఉపయోగంలేదు' అన్నది. ఈ మాట ముత్యం భార్యకి ''మోసాన్ని మోసంతోనే జయించాలనే'' మాట స్ఫురింపజేసింది, ఉత్సాహపడింది. ఆ రాత్రి ముత్యంతో మాటల్లో జరిగినది చెప్పి 'మోసాన్ని మోసంతోనే జయించాలి,వజ్రం వజ్రేన భిద్యతె' అనే మాట గుర్తు చేసింది. ఆలోచనలు రాపాడాయి, రూపు దిద్దుకున్నాయి,అపాయంలేని ఉపాయంతట్టింది.


మర్నాడు సాయంత్రం ముత్యం అవుడు గుడుచుకుంటూ రత్నం దగ్గరికి పరిగెట్టుకొచ్చాడు. రత్నం ఏమయిందని కంగారూ పెట్టేడు. ముత్యం తమాయించుకుని, ''మిత్రమా! నీకొడుకూ నేనూ సంతలోకెళ్ళేం. అక్కడ తినుబండారం   కొనుక్కున్నాడు. 

 తిరిగి వస్తుండగా ఒక పెద్దగద్ద వచ్చి కుర్రవాడిని ఎత్తుకుపోయిందని'' బావురుమన్నాడు. విన్న రత్నం కూలబడి కోపంతో ''నువ్వే నాకొడుకును ఏదో చేసేవు,లోకంలో గద్ద మనుషుల పిల్లలని ఎత్తుకుపోవడం విన్నామా?'' అంటు రంకెలేసి, గబగబా రాజుగారి దగ్గరికి పరిగెట్టేడు. 


రాజుగారి  తో,

 ”ముత్యమనే అతను నా స్నేహితుడు ఐదేళ్ళకితం వ్యాపారం కోసం విదేశం వెళ్ళేడు. కొద్దిరోజుల కితం తిరిగొచ్చేడు. ఆ సందర్భంగా విందు ఇచ్చాను. విందు తరవాత నా కొడుకును తమ దగ్గర కొన్ని రోజులుంచుకుని పంపుతామని ముత్యం దంపతులు చెబితే వారితో పంపించాను. ఇదిగో ఇప్పుడు ముత్యం, నా కొడుకును గద్ద ఎత్తుకుపోయిందంటున్నాడు. తమరే విచారణ చేసి న్యాయం చేతాలని కోరుతున్నా” అన్నాడు

 ''లోకంలో గద్దలు కోడిపిల్లల్ని ఎత్తుకుపోడం విన్నాంగాని ఆరేళ్ళ పిల్లాణ్ణి ఎత్తుకుపోడం వినలేదు మహరాజా!  ముత్యమే నాకొడుకుని ఎదో చేసేడని'' బావురుమన్నాడు. విన్న రాజు ముత్యం కోసం కబురంపేడు. ఈలోగా అక్కడే ఉన్న మంత్రి గూఢచారితో జరిందేమో రహస్య విచారణ చేసుకురమ్మన్నాడు. ఈలోగా ముత్యం చేతులుకట్టుకుని రాజు ఎదుట నిలిచేడు. కుర్రాణ్ణి ఏంచేసేవో చెప్పమని ముత్యాన్ని నిలదీశాడు రాజు. దానికి ముత్యం, 'నేను కుర్రాణ్ణి ఎమీ చేయలేదు, నిజంగానే గద్ద పిల్లాణ్ణి ఎత్తుకుపోయింది మహరాజా' అని లబలబలాడేడు.దానికి రాజు 'గద్ద ఆరేళ్ళ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయిందంటే నమ్మమంటావా?' అడిగాడు రాజు. దానికి ముత్యం ''రెండు వందలబారువుల ఇనుమును ఎలుకలు  తిన్నాయని మిత్రుడంటే నమ్మేను

 ఆరేళ్ళ కుర్రాణ్ణి గద్ద ఎత్తుకుపోడం విచిత్రమా మహరాజా!'' అని వాపోయాడు. 


  విషయం  విన్నరాజు, జరిగింది నిజం

  చెప్పమన్నాడు. దానికి ముత్యం జరిగినదంతా వివరించాడు. తగువు వ్యాపారానికి సంబంధించినది, ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించినరాజు,విచారణ మర్నాటికి వాయిదా వేసేడు. మర్నాటికి వేగుల దగ్గరనుంచి వార్తా వచ్చింది.  ఇనుము ఎలుకలు తినేసేయని నీవన్నావని నీ మిత్రుడు అంటున్నాడు. దీనికి నీ సంజాయిషీ ఏమంటే, రత్నం, ''నిజంగానే ఎలుకలు ఇనుమును తినేసేయి మహరాజా'' అన్నాడు. అప్పుడు రాజు ''రెండు వందల బారువుల ఇనుమును ఎలుకలు తిన్నాయంటే  ముత్యం నమ్మేడు, నువ్వూ అదే చెబుతున్నావు,   నేనూ నమ్మేను, ఆరేళ్ళ కుర్రవాడిని గద్ద ఎత్తుకుపోయిందంటే నమ్మలేనా? గద్ద ఎత్తుకుపోతే ముత్యం ఏం చేయగలడో చెప్పు'' అన్నాడు.  దానికి రత్నం  నిజం చెప్పుతున్నా మహరాజా!    

ముత్యం విదేశం వెళ్ళే ముందు నా గొదాములో 200 బారువుల ఇనుము నిలవచేసిన మాట నిజం. సంవత్సరంలో వస్తాను, వచ్చాకా అమ్ముకుంటానన్నది నిజం..ముత్యం అనుకున్నట్టుగానే సంవత్సరానికి ధర రెట్టింపైయ్యింది,ముత్యం రాలేదు, ఆపై మూడేళ్ళు అగాను, నాలుగురెట్లయింది, ధర. మిత్రుని జాడలేదు. ఆగలేక అమ్మేసాను. కొంతకాలం సొమ్ము వేరుగా ఉంచాను, ఆ తరవాత నా సొమ్ములో కలిపేసాను. మిత్రుడు వచ్చి ఇనుము అమ్ముతాననడంతో స్వార్థం మనసులో అప్పటికప్పుడు పుట్టి కట్టుకత కల్పించి, ఎలుకలు ఇనుమును తినేసాయని చెప్పేను. తప్పుచేసాను.  ''మొత్తం సొమ్ము వడ్డితో సహా ఇచ్చుకుంటాను. తమరు వేసే శిక్షకు కూడా అర్హుణ్ణి మహరాజా!  నన్ను క్షమించమని వేడుకుంటున్నాను'' అని లబలబ లాడేడు.  విన్న,రాజు రత్నం చెప్పినట్టు సొమ్ము ముత్యానికిచ్చేటట్టు, మోసం చేయాలని ప్రయత్నించినందుకు మరొక లక్ష రూపాయలు ముత్యానికి అదనంగా చెల్లించేటట్టు,ఖజానాకు కొంత పరిహారం చెల్లించేటట్టు, ముత్యం రత్నం కొడుకును అతనికి అప్పచెప్పేటట్టు తీర్పు చెప్పేడు. దానికి, ముత్యం రాజుకు ధన్యవాదాలు చెబుతూ, ''ఇతను నా మిత్రుడు, బలహీన క్షణంలో దురాశకు లోబడిపోయాడు. ఇతన్ని క్షమించండి. నాకు నా ఇనుము అమ్మిన సొమ్ముమిస్తే చాలు, వడ్డి కూడా వద్దు. అతని గొదాముకు ఇవ్వవలసిన అద్దె నా కివ్వవలసిన సొమ్మునుంచి మినహాయించుకోవచ్చును. రత్నం కొడుకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు'' తమ ఆజ్ఞతో హాజరు పెడతాననడంతో, రత్నం కొడుకును ప్రవేశపెట్టి రత్నానికి 

   ప్పజెప్పడం జరిగింది. జరిగినదానికి సిగ్గుపడ్డ రత్నం ముత్యం కాళ్ళకి మొక్కేడు, అంతట ముత్యం మిత్రుణ్ణి లేవదీసి గుచ్చి కౌగలించి, నీవు చిరకాల నామిత్రుడివి, బలహీన క్షణంలో తప్పు చేసినంతలో నిన్ను వదులు కోగలనా? నీ కొడుకు నా ప్రాణం కదూ! అటువంటివానికి హాని చేస్తానని ఎలా అనుకున్నావని అడిగాడు. 

రత్నం మరో సారి చేసినదానికి సిగ్గుపడ్డాడు 

చిన్నప్పుడు చదువుకున్న కత. నేను కొంత మార్పు చేసేనేమో కూడా, పూర్తిగా గుర్తులేక. స్వార్ధం ఎంతపని చేయిస్తుందన్నది, కతలో ముఖ్యభాగం, అలాగే మిత్రుడు క్షణిక బలహీనతకు లోనైనా సరిదిద్దుకోవాలిగాని శత్రుత్వం వహించడం కాదని నీతి చెప్పే కత.


Monday 4 September 2023

చంద్రయాన్-3 విజయానికంతా చుట్టాలే!!!!

 చంద్రయాన్-3 విజయానికంతా చుట్టాలే!!!!

Scroll down for latest update


23.08.23

చంద్రయాన్-3 లేండర్, చంద్రుని ఉపరితలంపై నెమ్మదిగా దిగింది, అందులోనూ ఎక్కడా? చంద్రుని దక్షణ ధృవం దగ్గర, ఏం దీని ప్రత్యేకత? అక్కడ ప్రదేశం సాపుగా ఉండదు, అంతేకాదు అక్కడ ఘనీభవించి నీరుందని అంచనా! ఏ దేశమూ ఆ ప్రాంతంలో తమలేండర్లను దింపడానికి ప్రయత్నం చేయలేదు.ఆ ప్రాంతానికి లేండర్ను దింపడానికి రష్యా ప్రయత్నం 23.8.23తారీకు కు ముందే విఫలమయింది.


ఈ విజయాన్ని సాధించిన అందరికి జేజేలు చెబుతున్నారు, మా వాళ్ళు ఇస్రో లో ఉన్నారంటే మావాళ్ళున్నారని చెబుతున్నారంతా. ఐతే సోమనాథ్ గారు ఉటంకించిన ముగ్గురిలో ఒకరు మా జిల్లావారు, అంతేగాక మండపేట దగ్గర వల్లూరు గ్రామవాసి, ఒకరు ముఖ్యులుగా ఉన్నారని తెలిసింది, అంతేకాదు, గోదావరిజిల్లాలనుంచి చాలామంది ఉన్నట్టూ తెలిసింది. విజయానికి కారణమైన అందరికి జేజేలు.


చంద్రయాన్ గురించి చాలా వార్తలు ఉన్నాయి, అందులో నిజమేదో తేల్చుకోడమే కష్టంగా ఉంది. నాకు తెలిసినవరకు...

లేండర్ విక్రం, క్రాలర్ ప్రజ్ఞాన్ రెండున్నూ పదనాల్గు భూమి రోజులు మాత్రమే పని చేస్తాయి. ఎందుకు అలా? అంటే చంద్రుని పై సూర్యకాంతి భూమి పదనాలురోజులుంటుంది, అది చంద్రునికో పగలు. ఆతరవాత ఈ పరికరాలు నిద్రలోకి జారిపోతాయి, సోలార్ పేనల్స్ సూర్యకాంతి లేక పని చెయ్యవు గనక. ఆ చంద్ర రాత్రిలో (పద్నాలు భూమి రోజుల్లో) అక్కడ విపరీతమైన చలి. ఆ తరవాతొచ్చే ఉదయంలో ఇవి పని చేస్తాయా? ప్రశ్నార్ధకమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, పనిచేస్తే అదో గొప్ప విజయం. ఇక క్రాలర్ చంద్రుని మీద దిగింది. ఇది చంద్రుని ఉపరితలం మీదనే స్థిరంగా ఉండి పరిశోధనలు చేసి వాటి ఫలితాలు లేండర్కి అందిస్తుంది. అవి భూమికి పంపబడతాయి. వాటిని విశ్లేషించడం ఒక రోజులో ఆయ్యే పనిగాదు. వేచి ఉండాల్సిందే! మరో ప్రమాదమూ పొంచి ఉన్నదని ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చంటున్నారు, సోమనాథ్. ఏం? చంద్రునిపై వాతావరణం లేదు గనక ఉల్కాపాతం తిన్నగా చంద్రుని ఉపరితలాని తాకుతుంది. అలా రాలే ఉల్కలు ఈ రెంటినీ పాడు చేయచ్చు. భూమికి కూడా ఉలకలు రాలుతుంటాయి కాని ఇవి మన దాకా చేరవు, వాతావరణంలోకి చేరినవెంటనే వేగానికి మండిపోతాయి. ఇన్ని అవాంతరాల మధ్య చంద్రయానం సంపూర్తిగా విజయవంతంకావాలని ...

వివిధ దేశాలవారు, మన దేశంలో కొందరు చంద్రయాన్-3 విజయం మీద  స్పందించినది తరవాత చూదాం...

3.9.23

చంద్రయాన్ లో రోవర్ తనకు అప్పగించిన పని దిగ్విజయంగా ముగించింది. చంద్ర రాత్రి ప్రారంభం కాకముందే దానిలో బేటరీలను పూర్తిగా చార్జి చేసి నిద్రలోకి జారుకుంది. అతి శీతలానికి ఇతర ఆపత్తులకు తట్టుకుని  చంద్రునిపై సూర్యోదయంతో మేలుకుంటే అదో గొప్ప విజయం. ఇక లేండర్ దిగినచోటునుంచి కొద్ది ఎత్తుఎగిరి పక్కగా కొద్ది దూరంలో మరలా క్షేమంగా దిగడమూ విజయమే!! లేండర్ కూడా నిద్రలోకి జారుకుంది. ఇది కూడా చంద్రునిపై సూర్యోదయంతో మేల్కుంటే ఘనవిజయం. దీనిని ఇస్రో సాధిస్తుందని ఆశిద్దాం.

Saturday 2 September 2023

మోసం

మోసం


 అనగనగా ఒక రాజ్యం. అందులో ఒక పట్టణంలో ఇద్దరు వ్యాపారస్తులు, స్నేహితులు, రత్నం సెట్టి,ముత్యం సెట్టి.


ఒక రోజు ముత్యం రత్నం దగ్గర కొచ్చి మిత్రమా! నేను 200 బారువుల ఇనుము కొన్నాను, సంవత్సరంలో దాని వెల రెట్టుంపు అవుతుందని అంచనా. నేను రేపే భార్య, పిల్లలతో బయలు దేరి, విదేశం వర్తకానికి వెళుతున్నాను. ఇనుమును నీ గొదాములో నిలువచేసి కాపాడు, పాడవకుండా. సంవత్సరంలో నేను తిరిగిరావచ్చు, వచ్చిన తరవాత అమ్ముకుంటాను, అన్నాడు. రత్నం దానికి అంగీకరిస్తే ఇనుమును రత్నం గొదాములో నిలువచేసి వెళిపొయాడు, ముత్యం. 


సంత్సరమైంది, ముత్యం రాలేదు, కబురూ తెలియలేదు. ఇనుము ధర రెట్టింపు అయింది.రత్నానికి ఏమి చేయాలో తోచలేదు. చూస్తుండగా మరో ఏడాదీ గడచింది, ఇనుము ధర మరింత పెరిగింది,అమ్మేసి సొమ్ము చేద్దామనే ఆలోచన కలిగిందిగాని, మిత్రుడు వచ్చేకా చూసుకుంటాడు అనుకుని ఊరుకున్నాడు. మూడో ఏడూ గడచిపోయింది. ఇనుము ధర నాలుగు రెట్లు పెరిగింది. ఇక ఆగలేక రత్నం ఇనుము అమ్మేశాడు.వచ్చిన సొమ్ము వేరుగా ఉంచాడు కొన్నాళ్ళు, మిత్రుడు వచ్చేకా ఇద్దామని, మిత్రుని జాడలేదు, సొమ్ము వ్యర్ధంగా ఉంచడమెందుకని తన వ్యాపారంలో కలిపేశాడు. మిత్రుడు వచ్చాకా ఇవ్వచ్చులే అనుకుని. కొంతకాలానికి మరచిపోయాడు. 


ఐదో ఏట మిత్రుడు విదేశం నుంచి తిరిగొచ్చాడు, ఇనుము ధర మరింత పెరిగింది. ముత్యం మిత్రుని దగ్గరకొచ్చి విదేశం నుంచి నిన్ననే భార్య,పిల్లలతో తిరిగొచ్చాను, నువ్వు, నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు? ఇనుముధర బాగా పెరిగింది, నీ గొదాములో దాచిన ఇనుము అమ్మేద్దామనుకుంటున్నా నంటే,  రత్నం, నీకో చెడు వార్త  చెప్పాల్సి వస్తోందని విచారంగా ఉంది. గొదాములో వేసిన ఇనుమును చూస్తూ వచ్చాను అప్పుడప్పుడూ, కొంచంకొంచం తగ్గుతున్నట్టనిపించింది, ఎలకలు ఎక్కువగా సంచరిస్తున్నాయక్కడ. వాటిని అరికట్టే ప్రయత్నాలూ చేసాను ఫలితం లేకపోయింది, ఎలుకలు ఇనుమును పూర్తిగా తినేసాయన్నాడు, విచార వదనంతో. విషయం విన్న ముత్యం, మిత్రుడు రత్నం తనను మోసం చేస్తున్నాడని గ్రహించి, మరుమాటాడక ఇంటికెళిపోయాడు.


రత్నం చేసిన మోసాన్ని మిత్రుడు ముత్యం ఎలా బయటపెట్టేడు?

(సశేషం)

ఇది నేను కొత్తగా చెప్పిన కతకాదు, చిన్నప్పుడు చదువుకున్నదే!!!