Friday 18 February 2022

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

 


 మనసు విరిగెనేని మరి అతుకగరాదు


ఇనుము విరిగెనేని 

ఇనుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు కమ్మరీడు

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

విశ్వదాభిరామ వినుర వేమ!

ఇనుము విరిగితే రెండు మాడుసార్లు అతకచ్చు, వేడిచేసి. కాని మనసు విరిగితే మరి అతుక్కోదు.


తాతగారి మాట చద్దన్నం మూట. 

ఇనుము చాలాగట్టి లోహం. అది విరగాలంటే చాలా పెద్ద సమ్మెటపోట్లు బలంగా తగిలితేగాని విరగదు. అలా విరిగిన ఇనుమును కూడా కమ్మరీడు కాలేసి అతకగలడు, అది కూడా రెండు మూడు సార్లే, ఆ తరవాత అదీ అతుక్కోదు. ఇక మనసు గాజుకాయలాటిది, ఎంత సున్నితమో అంత కఠినం కూడా. అటువంటి మనసు విరిగితే మరి అతకడం ఎవరివల్లా కాదంటారు, ఇంతటి మనసు ఎలా విరుగుతుంది, మాటల తూటాలకి విరుగుతుంది,అంటారు, తాతగారు. 


దీనికి నిదర్శనంగా భారతంలో ఒక పద్యం ఉంది, పద్యం గుర్తు లేదు, భావం రాస్తున్నా! ఎవరేనా పద్యం గుర్తు చేస్తే సంతసం. ''పదునైన బాణం ములుకులతో ఐన గాయాలను కూడా మాన్చవచ్చు, కాని మాటలో ఐన గాయాలు, మాన్చటం ఎవరితరమూ కాదు!'' అందుచేత  ముందు ఆలోచించాలి,ఆలోచించి మాటాడాలి, నోటి నుంచి బయటికి వచ్చిన మాట రామబాణ సమానం, అది తన లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది, వెనక్కి తీసుకోలేం. అందుకే నోరు సంబాళించుకో అంటారు, పెద్దవాళ్ళు.మరో మాట కూడా నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం. కాలు జారితే తీసుకోగలం ,నోరు జారితే తీసుకోలేము, ఇది మరో జాతీయం.


పద్యం గుర్తొచ్చింది 

తనువున విరిగిన యలుగుల

ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

Saturday 12 February 2022

మూర్ఖులకిచ్చే సలహా ప్రమాదకరం


 అనగనగా ఒక అడవి, అందులో ఒక చింతచెట్టు చివర కొమ్మని, ఒక పిచుకల జంట గూడు కట్టుకుని ఉంటోంది. అదే చెట్టు మీద కింది పలవలో ఒక కోతి ఆవాసం. ఒక రోజు రాత్రి పెద్ద గాలి,వానా కుదిపేశాయి. పిచుకల జంట భయం భయంగానే చిటారు కొమ్మన వెచ్చగా ఉన్న గూటిలో గడిపేయి. కోతి వానకి తడిసి, చలికి వణుకుతూ ఉండిపోయింది.తెల్లారింది, పిచుకల జంట బయటకి చూస్తే అడవి అల్లకల్లోలంగా ఉంది, వర్షం కొంచం తగ్గింది. కింది కొమ్మల్లో కోతి చలికి వణుకుతూ కనిపించింది.ఆ జంట కోతితో, బావా! నువ్వు బలవంతుడివి కదా! నాలుగు కొమ్మలు విరిచుకుని, గూడు వేసుకుంటే ఈ తిప్పలు తప్పేవి కదా అన్నాయి. ఇది విన్న కోతికి అరికాలు మంట నెత్తికి ఎక్కింది. చర్రున లేచి, పిచుకల గూటిపై దాడి చేసింది. గూడు చిటారు కొమ్మన ఉండిపోవడంతో వెంటనే చిక్కలేదు. సంగతి గ్రహించిన పిచుకల జంట గూడు వదలి ఎగిరిపోయింది.. కోతి ఆగ్రహం పట్టలేక గూడున్న కొమ్మ విరిచి కింద పారేసింది. చూచిన జంట చెప్పిన సలహాకి  వగచి వేరు చెట్టుకు చేరాయి. 

సందర్భ శుద్ధి లేకఇచ్చే సలహా గాని మాటగాని రాణించవు.

మూర్ఖులకి సలహా ఇవ్వకూడదు, అది ప్రమాదకరం.

Wednesday 9 February 2022

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక  


ఎవరు చేసిన కర్మ వారనుభవింపక 

ఏరికైనా తప్ప దన్నా

ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు

అనుభవింపక తప్పదన్నా!


చేసిన కర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.


ఉత్కృష్టమైన పుణ్య,పాపకర్మల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి.చేసినది వ్యక్తిగాని, సమాజంకాని దేశం కాని ఫలితాలు తప్పవు, అనుభవించాలిసిందే! అందుకే నవ్వుతూ చేస్తాం ఏడుస్తూ అనుభవిస్తామంటారు.  

ధర్మో రక్షతి రక్షితః  

Saturday 5 February 2022

పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...

 పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...


పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది. పెట్టడం పెద్దలనాటి నుంచీ లేదన్నదే  మాట.


చెయి చిక్కని మనిషికి రా యే కాని పో లేదు..


నా ఇంటి కొస్తే నాకేం తెస్తావు, నీ ఇంటికొస్తే నాకేం పెడతావు?


లోభివానినడుగ లాభంబు లేదయా!

Thursday 3 February 2022

భూయో భూయో నమామ్యహం

 ఆపదామప హర్తారం

దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం

భూయో భూయో నమామ్యహం

అపదల నుంచి రక్షించేవాడు, సర్వ సంపదలిచ్చేవాడు, జన్మోహనుడైన శ్రీరామునికి మరల మరల నమస్కారం.


చిత్రం రాముడు తీరికూచుని జనులను ఆపదలనుంచి రక్షిస్తాడు, సంపదలిస్తాడు అందుకు శ్రీరామునికి మరల మరల నమస్కారం.రాముడేం చెయ్యడు! రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడంటే రూపుకట్టిన ధర్మం. అంటే ధర్మానికి మరలమరల నమస్కారం. అంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని ఆచరించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది, అని చెప్పడమే!ధర్మాన్ని ఆచరిస్తానని మరలమరల సంకల్పం చెప్పుకోవడమే సుమా!భూయో భూయో నమామ్యహం!