Sunday 30 October 2022

మనం ఇంతే!

 




మనం ఇంతే!


 సంఘటన తరవాత ఆ వీధిని వెళ్ళడం మానేసాను, ఎందుకైనా మంచిదని.మరో వీధిన రాకపోకలు సాగిస్తున్నా! ఈ వీధి పరిస్థితి ఆ వీధికంటే అధ్వాన్నంగా ఉంది. ఇంటికో డస్టుబిన్ను, దానినిండా పారేసిన అన్నం, చూస్తే కడుపు తరుక్కుపోయింది,మళ్ళీ ఆవేశం వచ్చేసిందిగాని తమాయించుకున్నా! తలొంచుకుని వెళిపోడం అలవాటు చేసుకున్నా! సాధ్యం కావటం లేదు. ఈ డస్టుబిన్నులు ఎత్తుగా స్థంబాలకి కట్టేరు, విశేషం ఏమని అడిగా ఒకరిని. వారు చెప్పినది,ఈ డస్టుబిన్ను నిండితే, పందులని పెంచుకుంటున్నవారొచ్చి పట్టుకుపోతారనీ, డస్టుబిన్ను నిండా ఇలా ఇచ్చినదానికి డబ్బులు కూడా ఇస్తారని చెప్పేరు, నాకు ఒళ్ళు కంపరమే పుట్టింది. ఏం చేయగలను, అశక్తుడిని, తలొంచుకుని పోతున్నా! ఎవరికి ఉ.బో.స లు చేయకూడదని తీర్మానించుకున్నా.

చలితిరిగింది, ఉదయం నడక మంచిదికాదనిపించింది. సాయంత్రం ఏ సమయానికి వెళితే బాగుంటుందని బయలుదేరా నాలుగున్నరకి. ఇది చాలా హడావుడి సమయం. కేంపస్ లో కెజి నుంచి పిజి దాకా ఉంటారు విద్యార్థులు, నాలుక్కి చిన్న పిల్లలతో మొదలయ్యే పిల్లలు వెళ్ళడం పి.జివాళ్ళు చివరవెళ్ళడంతో హడావుడి ముగుస్తుంది. ఈ లోగా బస్సులరాకపోకలు, అబ్బో పెళ్ళివారిల్లే! ఈ మధ్యలో నడకకి వచ్చే స్త్రీలు, ముసలాళ్ళ రాకపోకలు. 

 ఇక గ్రవుండ్ కి వెళితే  మూలనుంచి ఫుట్బాలే కాళ్ళలో  , పడుతుందో, బేస్కెట్బాలే నెత్తిన పడుతుందో, క్రికెట్బాలే పక్కటెముకల్ని ముద్దు పెట్టుకుంటుందో,చెప్పలేం. :) ఇక ఏ కుర్రాడో, కుర్రదో పరిగేట్టుకొచ్చి గుద్దేస్తారో అని పీకుతూ ఉంటుంది. ఈ మధ్యలో ముసలాళ్ళు, ఆడాళ్ళు నడక, ఏం చెప్పను ఆనందం పొంగిపొర్లుతూ ఉంటుంది. పిల్లలికి ఆడుకునే సమయం కాదంటే ఎలా? వాళ్ళని అలా ఉత్సాహంగా చూడడం కూడా ఉత్సాహం తెచ్చుకున్నట్టే :) మరొకొంచం చలిపెరగనిద్దామని తీర్మానించుకుని ఉదయపు నడకే మళ్ళీ మొదలెట్టా.

అనుకోకుండా పాతవీధినే వచ్చేస్తున్నా. షరా మామూలే. ఆ పడచు గిన్నెతో అన్నం బయట పారబోసి వెళుతోంది, నన్ను చూసింది కాని తలొంచుకుని గబగబా లోపలికెళిపోయింది. నేనూ మరి మాటాడక తలొంచుకుని వచ్చేసాను.

రోజూ అన్నం ఇలా ఎందుకు పారేస్తున్నారు, ప్రశ్న దొలిచింది. ఒక అవ్వని అడిగా! నీకెందుకీ గోల ఈ వయసులో విదిలించింది. తెలుసుకుందామనీ, నసిగేసా! ఏమనుకుందోగాని, అన్నం పారెయ్యడం ఆడాళ్ళకి ఇష్టమా? కాని తప్పక పారేస్తున్నారు, ఎంత బాధపడుతూ పారేస్తారో చెప్పలేను. రోజూ రాత్రి అన్నం వండుతుంది, ఎదురు చూస్తుంది భర్తకోసం, ఆశ నిరాశే! తను తాళలేకపోతే తింటుంది, లేదంటే తనూ పస్తే ఉంటుంది. ఏ రాత్రికో తూలుకుంటూ ఇంటికొస్తాడా మనిషి. వచ్చినవాడు, మూడు నిమిషాలు పొల్లి పక్కకి తిరిగి పడుకుంటాడు. తిండి లేదు, ఇదేమని అడిగితే సమాధానంలేదు, లేదా చెయ్యి చేసుకుంటాడు. ఏం చెప్పమన్నావ్! గవళ్ళ గంగమ్మగారి హస్తోదక మహిమ, అని కొంగు దులుపుకుని లోపలికెళిపోయింది.  

Thursday 27 October 2022

పిట్టనికొట్ట పొయిలోపెట్ట.

పిట్టనికొట్ట పొయిలోపెట్ట.


 పిట్టనికొట్ట పొయిలోపెట్ట.

పూటబత్తెం పుల్లవెలుగు

రెక్కడితేగాని డొక్కాడదు.

అన్నీ ఒకలాటి నానుడులే ఐతే మొదటిది చాలా పురాతనమైనదనిపిస్తుంది. అన్నిటి అర్ధం ఒకటే ఏరోజు కూలితో ఆ రోజు గడపడమనీ, పని చేస్తేగాని పూటగడవదనీ, ఆహారం ఉండదనీ.


పొయ్యిలో పిల్లి లేవలేదు.

పొయ్యిలో పిల్లి లేవలేదంటే, వంట ప్రయత్నమే లేదని అర్ధం. ఎలా? వంట ఉదయమే చేసుకునేవారు, ఆ రోజుల్లో వేసిన పొయ్యిలమీద కట్టెలతో వంట చేసుకునేవారు. సాయంత్రానికి  సూర్యాస్తమయం కాకుండానే భోజనాలు చేసేసేవారు, అందుకే  " నోట్లో మెతుకు గూట్లో దీపం" అని నానుడి, అందుకు చాలా ముందుగానే వంటైపోయేది.అప్పటినుంచి మరలా ఉదయందాకా పొయ్యి ఖాళీ,ఈ పొయ్యి వెచ్చగా ఉంటుంది కనక పిల్లి పడుకుంటుంది, దానిని అక్కడ పడుకోనిచ్చేవారు, ఎందుకూ? పొయ్యి వంటింట ఉంటుంది, ఆహారపదార్ధాలు అక్కడే కొంతైనా ఉంటాయి, మరి అక్కడికి ఎలకలు చేరతాయి కదా! పిల్లి కాపలా అనమాట, దొరికితే ఎలకని భో0చేసి పడుకుంటుంది.పొద్దుటే వంట ప్రయత్నానికి ముందు పొయ్యిలో నిప్పు వేస్తారు గనక పిల్లి లేవక తప్పదు, అదనమాట,అంటే వంట ప్రయత్నమే లేదు, అంటే పొయ్యిలో పిల్లి లేవలేదు, లేపలేదని అర్ధం,పొయ్యిలో నిప్పే వేయలేదని చెప్పే ప్రయత్నం .  


Monday 24 October 2022

తాటాకు టపాకాయలు

దీపావళి శుభకామనలు.
(సినీవాలి శుభకామనలు)
తాటాకు టపాకాయలు


తాటాకు టపాకాయలు దీపావళికి కాల్చడం ఆనవాయితీ. వీటి తయారు మాత్రం సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటుంది. మామూలు తాటాకులు పనికి రావు, చిట్టిమట్టల ఆకులు తెచ్చుకుని ఎండబెట్టి, ఆ పై మట్టలు నరికి, ఓపికగా కూచుని ఒక్కొక్క ఆకునూ వేరు చేసి, ఈనెలు తీసి, అకుల్ని లెక్కబెట్టి కట్టగట్టాలి. 

మాదగ్గరలో మందుగుండు తయారు చేసేవారున్నారు.వారు ఈ తాటాకులు కొనుక్కుపోతుంటారు.



 

ఆకును తయారుచేయడానికి ఓపిక శ్రద్ధ కావాలి.సంవత్సరం పొడుగునా చేయాలి, ఒక రోజులో అయేపని కాదు.



ఇంత కష్టపడ్డా మిగిలేది తక్కువ శ్రమ ఎక్కువ.


ఇక తాటాకు టపాకాయల్లో ఉపయోగించేది సూరేకారం, పటాసు , గంధకం,బొగ్గుపొడి, ఒక్క జొన్నగింజ.


ఒక తాటాకును ముక్కచేసి పైచెప్పినవాటిని అందులో వేసి ఒక వత్తిని మూలగా బయటికి పెట్టి ఆకును మడతపెట్టి, మిగిలిన ఆకును దానిపై ఒడుపుగా దానిపైచుట్టి బిగిస్తే టపాకాయ తయారు. బిగింపులో కూడా పేలుడు తేడా ఉంటుంది.  

Courtesy. What's app

ఢిల్లీ దీపావళి సంబరం 

Sunday 23 October 2022

తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు

 

తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు


తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు,తల్లిపుట్టింటి గురించి మేనమామకి చెప్పినట్టు,తల్లిపుట్టిల్లు మేనమామకి ఎరుకే, ఇలా రకరకాలుగా చెబుతుంటారీ నానుడిని.ఏమిది?


మేనమామ అంటే తల్లి అన్న లేక తమ్ముడు. అనగా ఈ తల్లి ఆమె అన్న/తమ్ముడు ఒక ఇంట పుట్టినవారే! మేనమామకి ప్రత్యేకంగా తల్లిపుట్టిల్లు గురించి చెప్పడం హాస్యాస్పదం. ఇద్దరూ ఒక ఇంట పెరిగినవారే! ఆ తల్లి ఎలాపెరిగిందో ఆమె అలవాట్లేంటో, ఎంత వైభవంగా పెరిగిందో,ఆ ఇంటి ఆచార వ్యవాహారాలేంటో ప్రత్యేకంగా మేనమామకి చెప్పాలా?తెలియవూ!

Friday 21 October 2022

తాతకి దగ్గులు నేర్పడం.

 తాతకి దగ్గులు నేర్పడం.

ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, పూర్తి జీవితం అనుభవించిన అనుభవజ్ఞునికి జీవితం గురించి చెప్పబోవడం అంటారు. 


ఇలా చెప్పబోయినవారు ఎవరూ? ఒక పిల్లకాకి, కళ్ళు పూర్తిగా తెరవని పసికూన, మనవడో/మనవరాలో, ఆ తాత కళ్ళెదుట పుట్టినవాళ్ళు, ఆ తాత చెయ్యిపట్టినడచినవాళ్ళు. ఇలా చెప్పబోయారంటే వారు జీవితంలో అప్పుడే అడుగుపెట్టినవారై ఉంటారు, అంటే వయసు పాతిక ముఫై మధ్య,అదే జీవితమనుకుని.  ఇక వీరి తండ్రి అంటే అరవై వయసు దగ్గరమాటే. మరితాతాంటే వీరితండ్రికదా! అంటే ఆయన వయసు ఎనభై ఆ పైమాటే కదా! 


ఇంతవయసు అనుభవమున్నవారికి జీవితంలో ఒడిదుడుకులగురించి చెప్పబోయినవారికి  మధ్య వయసుతేడా ఒక అర్ధశతాబ్ది, అనుభవంతేడా అంతే కదా!. మరీ తాత ఎనభై పైబడ్డ వయసులో ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎంత మందిని చూసి ఉంటాడు. ఎన్ని రకాల మనుషులని చూసి ఉంటాడు? 


ధూర్తులు,దుర్మార్గులు,వంచకులు, వదరుబోతులు, స్వప్రయోజనపరులు,నమ్మించి మోసంచేసినవారు, ఇలా చెప్పుకుపోతే ఇది అనంతంకదా!  జీవిత పరుగులో ఎన్నిసార్లు పడిపోయి లేచి మళ్ళీ పరుగందుకుని ఉంటాడు, ఎంత కష్టపడి వీళ్ళని పెంచి ఉంటాడు? నేడు కనుతెరచినవారింత అనుభవమున్నవారికి చెప్పబోవడమంటేనే తాతకి దగ్గులు నేర్పడం, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందనడం. దీనినే నక్కపుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంతగాలివాన చూడలేదంది అన్నట్టు కదా!

Wednesday 19 October 2022

చెప్పాలనిపించింది,చెప్పేశా!

చెప్పాలనిపించింది,చెప్పేశా!


పెదరాయుడు లుంగీ,తెల్ల చొక్కా,చేత పొడుగాటి చేపాటికర్ర, కాళ్ళకి ఆకుచెప్పులు, ఆహార్యంతో,  ఉదయమే కనుచీకటితో, కాలేజికి నడకకి బయలుదేరుతా . ఒక వీధివెంటేవెళతా!ఎప్పుడూ. కారణం, అరకిలోమీటరు పైన పొడవుంటుంది,అదేకాక సిమెంటు రోడ్డు, దానికి తోడు ఉదయం వెళ్ళేటపటికి,సంచారం ఉండదు,  ఎవరూ లేవరు. మరోమాట, వీధిలో రెండు పక్కలా ఇళ్ళు, అవికూడా నాలాటి 'రెక్కాడితే కాని డొక్కాడని' వారివే! తిరిగొచ్చేటప్పుడు ఉదయపు జీవి చిత్రం కనపడుతూ ఉంటుంది. మొన్న తిరిగొస్తున్న సమయం, ఒక పడుచు రోడ్ దాటి ఎదురుగా ఉన్న చెత్తకుండీలో తనచేతిలో ఉన్న, గిన్నెనిండా ఉన్న అన్నం ఒలకబోసి వెనుతిరిగిన సమయం. సరిగా నేను అక్కడికి చేరుకున్న సమయం, ఎదురుబొదురయ్యాం. నేను  రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ నిలబడేటపటికి, పడుచు ముఖంలో ఆశ్చర్యం,అరెరె అన్నం అనవసరంగా పారబోశానే! ఈ బిచ్చగాడు పట్టుకెళ్ళేవాడేమో! అనే భావం జమిలిగా  కనపడ్డాయి ఆమె ముఖంలో. పడుచు, ఏమిచేయాలో తోచక, చేత అంట గిన్నెతో నిలబడిపోయింది.  నేను, "తల్లీ అన్నం ఎప్పుడూ పారెయ్యకూ, ఎవరికేనా పెట్టు, లేదంటే మిక్సీలో అన్నంతో ఒక ఉప్పరాయి,మిరపకాయ,జీలకర్ర పలుకు వేసి ఒక తిప్పుతిప్పి వడియాలలా  పెట్టు ఎండిపోతాయి, వాటిని వేయించుకో, నూనెలో, తిను బాగుంటాయి, ఇంకా చాలా చెప్పచ్చు, సమయం కాదు, ఏమనుకోకూ ఇలా చెప్పేనని, అన్నా! " ఏమనుకోనని చెప్పి వెళ్ళింది, ముందుకు కదిలా! చెప్పాలనిపించింది ,చెప్పేశా!   

Monday 17 October 2022

నేలవిడచి సాము

 నేలవిడచి సాము



సాము అంటే కత్తితిప్పడం, కఱ్ఱతిప్పడం. పూర్వకాలంలో కత్తులు, కర్రలతోనే యుద్ధాలు చేసుకునేవారు. ఈ కఱ్ఱ,కత్తి తిప్పే అలవాటు ఒక్క రోజులో వచ్చెయ్యదు, దానికి కొంత నిత్య అభ్యాసం అవసరం, దీన్నే సాము నేర్చుకోడం అంటారు.ఇందులో చాలా మెలకువలూ ఉన్నాయి. ఏది చేసినా నేలమీదనే చెయ్యాలి.అవసరాన్ని బట్టి ఎగరడం దూకడం కూడా ఉంటాయి. ఎగిరినా దూకినా అది గాలిలో ఉండడం కొద్ది క్షణాలే, ఆ తరవాత నేలకి రాక తప్పదు. అంటే నేల విడిచి సాము చెయ్యలేరు. అదే ఈ నేల విడచిసాము. ఇదెందుకూ ఇప్పుడని కదా! వస్తున్నా!!



సుగర్ వ్యాధి లేనివాళ్ళు తక్కువ, నేటి కాలంలో. దీనికి అలోపతి వైద్యం తప్ప, మరో వైద్యం లేదూ అంటున్నారు.ఆయుర్వేదం బహు పురాతన వైద్యం, కాని ఇది నెమ్మదిగా అడుగంటి పోయింది, గత వందేళ్ళలో. నేనెరిగి కూడా ఆయుర్వేదమే పల్లెలలో వైద్యం. మనదగ్గర వైద్యం లేదు, అంతా పడమటివారిదే అనే మేధావులూ ఉన్నారు, నమస్కారం. ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదాన్ని బతికించాలనే ప్రయత్నం సాగుతూ ఉంది, సంతోషం.  ఈ సందర్భంలో సోషల్ మీడియాలో సుగర్ గురించిన వైద్యం, మందులు, విచ్చలవిడిగా కనపడుతూనే ఉన్నాయి. ఏది నిజం, తెలియటం లేదు. ఒక వేళ ఏదైనా ఒకరి దగ్గర మందువాడితే అది వికటిస్తే, అప్పుడు అలోపతీ వైద్యానికెళితే, జరిగేదేమో చెప్పాలా? ఈ ఆయుర్వేద వైద్యులు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, అందుబాటులో ఉండరు, పల్లెలలో ఆయుర్వేద వైద్యులు లేరు, అక్కడక్కడ కొద్దిగా హోమియో వైద్యులు ఉన్నారు. కొన్ని మందులను భారతప్రభుత సర్టిఫయ్ చేసిందని చెబుతూ ప్రకటనలు వస్తున్నాయి. సంతోషించే సంగతే, కాని వైద్యులు లేకుండా మందులు ఎవరిమటుకు వారు వేసుకుని స్వంతవైద్యం చేసుకుంటే...వికటిస్తుంది. వైద్యుడూ,వైద్య పర్యవేక్షణ లేక వైద్యమా? అందుచేత భారత ప్రభుత, ఆయుర్వేదమందులు తయారు చేసే కంపెనీలూ వైద్యులను తయారు చేయకపోతే ఇది నేల విడచి సామే అవుతుంది.

Saturday 15 October 2022

చావు కాలానికి లావు దుఃఖం.

చావు కాలానికి లావు దుఃఖం.


1. చావు కాలానికి లావు దుఃఖం.

  వయసు మీదపడేటప్పటికి దుఃఖమే ఎక్కువగా ఉంటుందన్నది పిండితార్ధం. లావు అన్న మాటకి బలం,ఎక్కువ, అనే అర్ధాలున్నాయి. లావు మాటని పోతనగారు వాడేరు భాగవతంలో, 'లా'వొక్కింతయులేదు (లావు+ఒకింత=లావొక్కింత).


వయసులో ఉన్నపుడు కష్టం తెలియదు,బాధా తెలియదు. శరీర బాధలుండవు. వయసుమళ్ళితే బంధువులు గతించడం,జీవిత భాగస్వాములే గతించడం, శరీరం సహకరించకపోవడం, ఇక  శంఖు,చక్రాలు నేటి కాలంలో అందరి ఉన్నవే!వాటిని పట్టివచ్చేబాధలు, కొడుకులు కోడళ్ళు చూడకపోవడం, స్వయంగా ఏపనీ చేసుకోలేకపోవడం, ఇతరులపై ఆధారపడక తప్పకపోవడం,

 అనాధాశ్రమాల్లోనూ,వృద్ధాశ్రమాల్లోనూ గడపడం, ఇక ఇంట్లో ఉంటే పిలిస్తే పలికే దిక్కులేకపోవడం,బాధ చెప్పుకుందామంటే వినేవారు లేక, అనుభవించేది నరకం. 

 ఇలా కష్టాలు,దుఃఖాలు జమిలిగా స్వారీ చేస్తుంటాయి, చెప్పుకోగలిగినవి,చెప్పుకోలేనివి.కాలుడూ కరుణించడు,సమయమొచ్చేదాకా,అన్నీ దుఃఖాలే

 అందుకే చావుకాలానికి లావు దుఃఖం అన్నారు.


2.కుంచం నిండాలి.

మనది వ్యవసాయం ప్రాధమికమైన దేశం,అందుకే నానుడులన్నీ వ్యవసాయం దాని అనుబంధంలో ఎక్కువ ఉంటాయి. కొలతకి ఉపయోగించే సాధనమే కుంచం. పాతరోజుల్లో అన్నీ కొలిచి అమ్మేవారు.ధాన్యాలు, నెయ్యి,నూనిలాటి ద్రవాలు, పిండిలాటివాటిని కూడా కొలిచి అమ్మేవారు. ఇక పండ్లు వగైరాలని లెక్కపెట్టి అమ్మేవారు, పరక,పాతిక,ఏభై, వంద అని. వర్షం కూడా కుంచాలలో చెప్పేవారు. పాపాన్ని కూడా కుంచాలలో చెప్పేవారు, అందుకే పాపం పండాలి,కుంచం నిండాలంటారు.  


3.నక్క పుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన చూడలేదందిట.

నక్కపుట్టి మూడాదివారాలు కాలేదు, అంటే నక్క వయసు ఇరవై ఒక్కరోజులు కూడా కాదు.

ఇరవై ఒకటో రోజు నాడు తొట్టిలో వెయ్యడం లాటి వేడుకలు చేసేవారు.  నాటికాలంలో పుట్టిన మూడు నెలలదాకా కళ్ళు తెరవనివారూ,గుప్పెళ్ళు కూడా విప్పనివారు

 ఉండేవారంటే నమ్మలేరు,ఒంటికి నూనిరాసి, ఒక సన్నని నూలు బట్ట కప్పేవారు.''నూని గుడ్డుకి నూరాపదలు'' అనేవారు. ఇరవైఒకటోనాడు నలుగుపెట్టి స్నానం చేయించి ఉయ్యాలలో వేసేవారు.

   ఇరవై ఒక్క రోజుల వయసుదాటని నక్క ఇంతపెద్దగాలివాన చూడలేదంది. అంటే వయసేలేదు, అనుభవమూ లేదు కాని ఆరిందాలా మాట్లాడితే ఇలా అంటారు.

ఇక నానుడికొస్తే అనుభవం లేనివారు పెద్ద అనుభవజ్ఞులలా మాటాడటాన్ని ఈ నానుడితో చెబుతారు. 

Thursday 13 October 2022

ఏకచక్రే మహాభోగే

 ఏకచక్రే మహాభోగే


ఏకచక్రే మహాభోగే

ద్విచక్రే మహాపండితః

త్రిచక్రే లోక సంచారే

చతుశ్చక్రే మహాబలాః


ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి, రెండు చక్రాలున్నవాడు, మహా పండితుడు, త్రి చక్రే, మూడు చక్రాలున్నవాడు, లోక సంచారి, తిన్నచోట నిద్రపోడు, నిద్రపోయిన చోట తినడు, తిరుగుతూనే ఉంటాడు. నాలుగు చక్రాలున్నవాడు మహా బలవంతుడు. :) ఇదండీ సంగతి, ఏంటిటా? ఇది సాముద్రికంలో మాటంటారు. చక్రం, శంఖం,అనేవి చేతిలోనూ గద,పద్మం అనేవి కాళ్ళలోనూ ఉంటాయిట. ఇందులో కూడా సవ్య చక్రం,అపసవ్య చక్రం, దక్షణావర్త శంఖం, ఉత్తరావర్త శంఖం అని రకాలూ ఉన్నాయట. :) ఇదంతా మనకొద్దు, మనం అధునికులం కదా! మన దారిలోకి పోదాం :)


ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి కదా! సత్యం.రెండు కాళ్ళే ఏకచక్రం, కాలినడకన తిరిగేవాడు, సైకిల్ కొనడు,కారు అసలే కొనడు.పెట్రోల్/డిజిల్ ధరలు పెరిగాయనే గోల లేదు.  సైకిల్ కొననివాడు సైకిల్ బాగుచేయించే పనిలేదు. వీడు కాలి నడకన తిరుగుతుంటాడు కదా! రోగం రొచ్చు రాదు, డాక్టర్ దగ్గరకెళ్ళడు. మందులు కొనడు. మందు మొదలే కొనడు. సినిమా కెళ్ళడు, నడిచిపోవాలిగా!ఇంటి దగ్గర టివి చూస్తాడు, పెళ్ళాంతో కబుర్లాడుతాడు, వెచ్చగా తింటాడు, వెచ్చగా పడుకుంటాడు, హాయిగా నిద్దరోతాడు. వీని వల్ల ఎకానమీకి ఉపయోగం...లేదు. సైకిల్,కారు,మందులు, వైద్యం ఇండస్ట్రీకి శత్రువు. గోల లేదు,గొడవలేదు.మరి మహా భొగమేగా నేటిరోజుల్లో :)   

నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారో మహానుభావుడు. ఈ సామాన్యుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఏడు కరువులొస్తాయంటే, మొదటి కరువుకే చచ్చిపోతే మిగిలిన ఆరు కరువులూ నన్నేంచేస్తాయనగల ధీరుడు. కరంటు పోతే విసనకర్రతో సరిపెట్టేసుకుంటాడు. కుళాయి నీళ్ళు రాకపోతే టేంక్ దగ్గరకెళ్ళి తెచ్చుకుంటాడు. ఏ పార్టీ  వాళ్ళడిగినా నా వోటు మీకే అంటాడు.  అంతా దరిద్రమో అని ఏడుస్తుంటారు, దరిద్రం అన్నదో భావన అంటాడు. ఉన్నది తింటాడు, లేకపోతే పస్తుంటాడు. కట్టలు, కట్టలు డబ్బు పోగేసెయ్యాలన్న తపన లేదు. ఇ.డి వాళ్ళొస్తారో, దొంగే వస్తాడో అన్న భయం లేదు, గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్దరోగలడు, నిద్దర మాత్రల పనిలేదు.

కారేరాజులు రాజ్యముల్ గల్గవే

వారేరీ? సిరి మూట గట్టుకొని పోవన్ జాలిరే? అని అడగగల ధీమంతుడు. 


వేయిమాటలేల?

మితంగా తినడం భోగం. కంటినిండా నిద్ర భోగం. భార్య/భర్త తో ఊసులాడుకోడం,సరస సల్లాపాలు భోగం. తల్లితండ్రులుండటం భోగం. తల్లితండ్రులతో కలసి ఉండటం భోగం. పిల్లల్ని కని పెంచడం భోగం. కష్టసుఖాలు కావలసినవారితో పంచుకోడం భోగం. సన్మిత్రులను కలిగి ఉండటం భోగం. ఆరోగ్యమే మహాభాగ్యం, భోగం. చివరగా తన సంతానం,బంధుమిత్రుల మధ్య తనువు చాలించడం భోగం. 


ఏకచక్రే మహాభోగే!

వీలును బట్టి మిగతా చక్రాలు చూద్దాం 

 

Tuesday 11 October 2022

ఆవు,దూడ బాగానే ఉన్నాయి, గుంజకొచ్చింది గురక తెగులు.

 ఆవు,దూడ బాగానే ఉన్నాయి, గుంజకొచ్చింది గురక తెగులు.


ఇదొక నానుడి, తెనుగునాట చెప్పుకునేది, ముఖ్యంగా గోజిలలో చెప్పుకునీదీ.

గుంజ అనేది అవు,దూడలని కట్టే కఱ్ఱ. ఇది వంపుతిరిగి భూమిలో పాతపెట్టబడి ఉంటుంది. పలుపుతాడును ఆవు మెడలోనూ గుంజకి కట్టేస్తారు. ఈ గుంజని కట్టుకొయ్యి,కట్రాట వగైరా పదాలతోనూ వాడుకలో ఉంది. 

ఇక గురక  తెగులు అనేది పశువులకొచ్చే భయంకర వ్యాధి. దీనినే దొమ్మ తెగులు అని కూడా అంటారు.  గిట్టలు చీలివున్న పశువులకొచ్చేది. ఈ వ్యాధి వస్తే పశువు జ్వరంతో బాధ పడుతుంది, గొంతువాస్తుంది, నోట పుళ్ళు పడతాయి, గిట్టల మధ్య ఒరుస్తుంది, కొంతకాలం బాధపడి పశువు చనిపోతుంది. ఈ వ్యాధికి నేటికీ మందులేదు. వాక్సిన్ కూడా లేదు. ఈ వ్యాధిలో చాలా రకాలుండడమే వాక్సిన్ లేకపోడానికి కారణం. దీనిని ఇంగ్లీష్ లో ఫుట్ అండ్ మౌథ్ అంటారు. ఇది వ్యాపించడం గిట్టల ద్వారా జరుగుతుంది గనక. 

విషయంలో కొస్తే ఈ తెగులు వస్తే ఆవుకి రావాలి లేదా దూడకి రావాలి గాని వాటిని కట్టేసే ప్రాణం లేని గుంజకెందుకు వస్తుంది? రాదు. అంటే ఈ వ్యాధికి గుంజకి అసలు సంబంధమే లేదు.

మరి ఇలా ఎందుకంటారు? ఆవుకి రాక దూడకీ రాక ఈ వ్యాధి గుంజకొచ్చిందంటే, అపసవ్యమని, ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన అభిప్రాయభేదం గురించి, అసలు వారు బాగానే ఉన్నా, ఇబ్బందులు లేక, సంబంధం లేని మధ్యవారు బాధపడిపోడంగా, కొట్లాడుకోడంగా, చెబుతారు, ఈ నానుడి.

Sunday 9 October 2022

పరాధికారము పైనవేసుకొనరాదు.

 పరాధికారము పైనవేసుకొనరాదు.


అనగనగా ఒక పల్లెటూరు, అందులో ఒక మడేలు, ఒక కుక్కని, గాడిదని పెంచుకుంటున్నాడు. కుక్క ఇంటి దగ్గర కాపలా. గాడిద ఇంటికి రేవుకి మధ్య బట్టలు మోసుకుపోవడం, పనులు. కుక్కకి ఉదయమే మడేలుతో పాటు చద్దిబువ్వ. మధ్యాహ్నం మడేలుతో పాటు వేడి బువ్వ పెడుతుంది, చాకిత.  కుక్క యజమాని మంచంకిందే పడుకుంటుందెప్పుడూ. అప్పుడప్పుడు రాజభోగాలు కూడా కుక్కకే, ముద్దులు, మురిపాలు సహా! ఇక గాడిద, రేవున్నరోజున బట్టలు రేవులో పడేసాకా, సాయంత్రందాకా ఏటిపట్టున మెయ్యడం, ఏట్లో నీళ్ళు తాగడం. రేవులో పనిలేనిరోజున ఉదయమే వదిలేస్తే ఏటిపట్టున తిని, ఏట్లో నీళ్ళు తాగి ఎండవేళ ఏ చెట్టుకిందో పడుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం. 


కుక్క, గాడిద ఎంత స్వేఛ్ఛ అనుభవిస్తోందో, నేనో పగలూ రాత్రీ ఇంటిదగ్గరే! గాడిద పని ఎంత బాగుందీ అని ఈర్ష్య చెందింది. గాడిద, కుక్కకి ఎంత ముద్దు,మురిపెం, ఇల్లు కదలనివ్వరు, రాజభోగాలు, మరినేనో ఉదయం నుంచి రాత్రిదాకా ఏటిపట్టునే బతుకు, రాత్రికి ఇంటికి చేరడం, తిన్నావా ఉన్నావా అని అడిగే దాతా,దూతా లేరు, ఇదీ బాధ.


రోజులు గడుస్తున్నాయి, ఎవరి మనసులో వారు, మరొకరిపై ద్వేషం పెంచుకున్నారుగాని, పైకి పొక్కనివ్వలేదు. ఒక వేసవిరోజురాత్రి   మడేలు, చాకిత గాలికోసం పెరట్లో మంచాలేసుకుని పడుకున్నారు. కుక్క మడేలు మంచంకింద పడుకుంది. గాడిదను దగ్గరలోనే కట్టేసేరు.


ఓరాత్రి వేళ ఒక దొంగ ఇల్లు దూరుతున్నాడు. కుక్క చూసింది, ముడుచుకు పడుకుంది, మొరగలేదు. గాడిద కుక్కని లేపి మొరగవేం. దొంగ ఇల్లు దూరుతున్నాడు, చూసావుగా అంది. దానికి కుక్క, ఉదయమే నాలుగు మెతుకులు పడేస్తాడు,మధ్యాహ్నం మరికొంచం పెడతారు. రాత్రికి కూడు పెట్టరు. ఆకలి కడుపుతో కాపలా కాయాలి. నీకేం ఏటిపట్టున కావలసినంత తింటావు, ఇంటికొచ్చి పడుకుంటావ్, నాలుగు మూటలు మొయ్యడం పెద్ద పనా? అడిగింది కుక్క. నీకేం కావలసినంత స్వేఛ్ఛ. బయట కావలసింది తింటావ్, ఏట్లో నీళ్ళు తాగుతావ్, చింతచెట్టుకింద పడుకుని నిద్దరోతావ్, అని దెప్పింది.


దానికి గాడిద ఉదయమే నీకు పిలిచి మరీ చద్దిబువ్వ పెడుతుంది, చాకిత. మధ్యాహ్నం మడేలు తిన్నదే నువ్వూ తింటావు, మడేలు మంచం కిందే పడుకుంటావ్, నువ్వు పడిపోతున్న కష్టం ఏంటబ్బా! నిలదీసింది గాడిద. నేను మొరగను, మడేలుని హెచ్చరించను,నువ్వేమనుకున్నా మరేం బాధ లేదు, తెగేసి చెప్పేసింది, కుక్క.  


దానికి గాడిద, నువ్వు తప్పుచేస్తున్నావు,యజమానికి ద్రోహం చేస్తున్నావు, సహించలేనని, గట్టిగా ఓండ్ర పెట్టింది. నిద్రా భంగమైన మడేలు, చాకిత లేచేరు,చూసారు, ఏమీ తేడా కనపడలేదు, తిని పడుకుందిగా, ఏందుకు ఓండ్ర పెట్టినట్టు అని చికాకుపడి, పక్కనే ఉన్న కఱ్ఱతో గాడిద వీపుమీద కఱ్ఱ తిరగేసాడు. ఈ హడావుడిలో దొంగ పారిపోయాడు. గాడిద మీద కఱ్ఱ తిరగేసిన తరవాత మడేలు ఇంటివైపు చూస్తే తలుపులు తీసి ఉన్నాయి, దొంగ ఇల్లు దూరినట్టున్నాడని, ఇల్లు వెతుక్కుంటే, చక్కబెట్టుకోవలసినవి చక్కబెట్టుకునే దొంగ పారిపోయాడని తేలింది. అప్పుడు ఆయ్యో! గాడిదను అనవసరంగా చెయిచేసుకున్నానే అని మడేలు బాధ పడ్డాడు, ఉపయోగమే లేకపోయింది. కుక్క చక్కగా మంచంకిందే పడుకుంది, కదలక మెదలక. 


అయ్యో! ఉపకారం చేయబోయి దెబ్బలు తిన్నానే అని గాడిద విచారించింది, తనలో.


కత చిన్నదే కాని నేర్చుకోవలసినదెంతేనా ఉంది.


1.ఒకరిపని పరిధిలో జోక్యం చేసుకోకు.పరాధికారము పైన వేసుకొనరాదు.

2.మరొకరిని చూసి ఈర్ష్య పడకు.

3.ఎవరి పని వారిదే, ఎవరి పనిలో కష్టసుఖాలు వారివే.నేను కష్టపడిపోతున్నాను, ఎదుటివారంతా సుఖపడుతునారనుకోకు.

4.తొందరపాటు పనికిరాదు.

5.చేతులు కాలేకా ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. జరగవలసిన నష్టం జరిగిపోతుంది. 

6.పని అవసరాన్ని బట్టి యజమాని ఉద్యోగులను నియమిస్తూ ఉంటాడు.

7.యజమాని తెలివితక్కువ వాడనుకోకు.

8.యజమానికి నష్టం కలగజేస్తే నీవూ నష్టపోతావు, గుర్తుంచుకో!


Friday 7 October 2022

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.

 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.


పులి బంగారం రంగులో ఉండి,ఆపై నల్ల మచ్చలుంటాయా? నల్ల ఒంటి మీద బంగారపు మచ్చలుంటాయా? తేలలేదు. కాని అందరూ నల్లమచ్చలే ఉంటాయంటారు. పులిని చూస్తే భయం, రాజసం అందుకు అడవిలో జంతువులంతా అణిగిమణిగి ఉంటాయి. ఇది చూసిన నక్కకి కన్నుకుట్టింది. ఎలాగైనా తానూ పులిలా కావాలనుకుంది.   మార్గం ఏంటీ? అలోచించింది. ఒంటి మీద మచ్చలు వేసుకుంటే తానూ పులిలాగే ఉంటాననుకుంది.ఒంటి మీద మచ్చలు శాశ్వతం కావాలంటే, ఆలోచించింది,అట్లకాడ కాల్పించి   మచ్చలేయించికుంది,వాతలు పెట్టించుకుని , బాధ సహిస్తూ. ఒంటి మీద మచ్చలొచ్చాయి గాని తోటి నక్కలు చూసి అసహ్యించుకున్నాయి, ఇప్పుడు తాను అటు పులీ కాదు, ఇటు నక్కాకాదు . రెండికీ చెడ్డ రేడు అయింది.                            

మరో చిన్నకత, విష్ణుశర్మ పంచతంత్రంలోది.

ఒక పోతరించిన నక్క, అడవిపక్క గ్రామంలో కొచ్చింది.ఒక కోడిని తరిమింది  . ఆ కోడి ఒక సాలీల ఇంట్లో దూరింది. తరుముకు వెళుతున్న నక్క చూసుకోక, సాలివాడు బట్టలకి వేద్దామని కలిపి ఉంచిన నీలి రంగులో పడింది.ఒళ్ళంతా నీలి రంగు పట్టేసింది. కోడి దొరకలేదు, ఈ సందడిలో అది పారిపోయింది. అలాగే అడవికొచ్చిన నక్కని చూసి జంతువులు భయపడ్డాయి. వెళ్ళి పులికి చెప్పేయి, ఏదో భయంకరమైన జంతువు అడవిలో తిరుగుతోందని, అది చాలా కౄరమైనదని, రకరకాల కతలు , పులిని భయపెట్టేయి. పులి కూడా చూసీ చూడనట్టు ఉండిపోయింది. నీలినక్క ఎవరితో పలకలేదు, మాటలేదు. దీనితో ఆ జంతువు నక్కేనని గుర్తించలేకపోయాయి, జంతువులన్నీ. కాలం గడిచింది, ఓ రోజు వర్షం వస్తే ఆ వర్షంలో తడిసిన నీలి నక్క ఒంటిమీద రంగు కరిగింది కొంత, వికారంగా తయారయింది. ఇది చూసిన తోటినక్కలు గుసగుసలు పోయాయి. ఇంతలో పున్నమి వచ్చింది, తోటి నక్కలన్నీ సభచేసి గొంతెత్తి ఊళలు పెట్టాయి. నీలినక్క కూడా ఆనందం పట్టలేక గొంతెత్తి ఊళపెట్టింది. దానితో ఇది నక్కేనని తెలిసిపోయి, తోటి నక్కలు తిట్టేయి, ఇది తెలిసి పులొచ్చి ఒక్క పెట్టు పెట్టింది, పోతరించిన నక్క కత సమాప్తం.


పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా రవీoద్రనాథ ఠాకూర్ అంతవారవుతారా?


పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా ప్రధాని అవుతారా?


పెద్దతెల్లగడ్డం కాకపోతే నల్లగడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?


పోనీ మల్టీ కలర్ గడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?


పాదయాత్ర చేసినవాళ్ళంతా 

ముఖ్యమంత్రులయ్యారు. నడవనివాళ్ళూ ముఖ్యమంత్రులయ్యారు.


పాదయాత్రవాళ్ళంతా ముఖ్యమంత్రులవుతారా?


రథయాత్రలు చేసినవాళ్ళు ప్రధాని అయ్యారా?

రథయాత్రచేస్తే ప్రధాని అవుతారా? 


గొప్పవారి పేరుకు దగ్గరగా మనం పేరు పెట్టుకున్నంతలో వారి గొప్ప మనకొస్తుందా?


పెద్దవాళ్ళని తిట్టినవాళ్ళంతా మేధావులైపోతారా?


మేధావులంతా పెద్దవాళ్ళని తిడతారా?


పులినిజూసి నక్క వాతలు పెట్టుకోడం అంటే ఇదేనా?


ఏంటో సమాధానం లేని ప్రశ్నలు 

Wednesday 5 October 2022

అత్యవసర ద్వారము./EMERGENCY.

అత్యవసర ద్వారము. EMERGENCY.


 ఎల్లరకు

విజయదశమి శుభకామనలు



అత్యవసర ద్వారము.

                                   అత్యావసర ద్వారము.

అత్యవసర ద్వారము.
అత్యావసర ద్వారము.
అసలు మాటేదీ? 

Tuesday 4 October 2022

సిరిఅబ్బదు చీడబ్బినట్టు

 సిరిఅబ్బదు చీడబ్బినట్టు, ఇదో నానుడి.

 మంచి అలవాట్లు కావడం కష్టం, కాని చెడు అలవాట్లు తొందరగా అవుతాయంటారు, ఇదీ పెద్దలమాట.


సిరి అంటే లక్ష్మి, మనవారు లక్ష్ములని ఎనిమిదిగా చెప్పారు. ఆధునికులు మరో అడుగు ముందుకేసి, పెళ్ళాం పిల్లలు చెప్పిన మాట వినేవారైతే సిరి,ఇంట్లో ఉన్నవాళ్ళంతా కలసి భోజనం చెయ్యడం సిరి, తల్లితండ్రులతో కలసి ఉండడం సిరి అని ఇంకా ఏవో చెప్పేరు, ఇదంతా మా వాట్సాప్ యూనివర్సిటీ విజ్ఞానం :)


ఇలా మంచి అలవాట్లు కావడం కష్టం చెడు అలవాట్లు కావడం చాలా సులభం, అన్నది, పెద్దల మాట. 


కుండలో,రాగిపాత్రలో,ఇత్తడిపాత్రలో వండుకోండి. గంజివార్చండి, వార్చిన గంజి పారబోయక అన్నంలో కలుపుకు తినండి.అతివేడిగా, అతి చల్లగా ఆహారం తీసుకోకండి, వండుకున్న అన్నం ఉమ్మగిలనివ్వండి,ఉమ్మగిలడం అంటే సాధారణ ఉష్ణోగ్రతకు చేరడం, ఇలా కావాలంటే అన్నం వండుకున్నతరవాత దానిని కలియబెట్టి ఆరనివ్వడమే. ఇలా ఆరనిస్తే కార్బోహైడ్రేట్లలో మార్పు జరిగి, వరిఅన్నపు గ్లైసిమిక్స్ ఇండెక్స్ తగ్గుతుందిట. దంపుడు బియ్యపు అన్నం మంచిది,కాని డబుల్ పాలిష్ బియ్యమే తింటున్నాం. సనాతనమైనది కాదనుకుని, తాతతండ్రులు తిన్నదాన్ని నిరసిస్తూ పురోభివృద్ధి సాధించామా లేదా?కుండ,రాగిపాత్ర,ఇత్తడి పాత్రలలో వండుకోడం అనాగరికమని అల్యూమినియం బొచ్చల్లో వండుకుంటున్నామా లేదా? నాగరికతంటే ఇదేకదా అని అడుగుతున్నాం కూడా! 


ఈ మధ్య ఒక అంతర్జాతీయ సదస్సులో ఒక శాస్త్రవేత్త ఆఫ్రికా ఖండం వాడు, నీరుల్లిపాయ సుగర్ ని అదుపులో ఉంచుతుందన్నారు,మెట్ఫార్మిన్ తో కలిపితీసుకుంటే . మిగిలిన ఆధునికులు ఈ మాటమీద ఇంకా దీనిపై పరిశోధన జరగాలని విషయాన్ని బుట్టదాఖలా చేసేసారు.  


నాకైతే ఒకమాటనిపించింది. భారతదేశంలో ఉల్లివాడకం ఎక్కువకదా! మరిక్కడ ఇన్ని సుగర్ కేస్ లూ ఎందుకున్నట్టు? ఇదిగదా కొచ్చను :)


మనం తీసుకునే ఆహారంలో రకరకాల ఆహార పదర్ధాలుంటాయి. అన్నిటికి ఒకటే జి.ఐ  (G.I )ఉండదు, ఎక్కువ తక్కువలుంటాయి. వీటిని కలిపితీసుకున్నపుడు జి.ఐ తగ్గుతుంది, అది 50 కి లోపు ఉంటే మంచిదే, దానికంటే ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర శాతం తొందరగా పెరుగుతుంది. ఇక పచ్చిఉల్లి జి.ఐ 10, అదే ఉడికిస్తే అది కాస్తా 40 అయి ఊరుకుంటుంది. మనకు పచ్చి ఉల్లిని తినడమూ అలవాటే కాని ఈ  మధ్యనే ఈ అలవాటు తప్పించుకుంటున్నాము. పచ్చి ఉల్లిని ఆహారంలో తీసుకుంటే మొత్త జి.ఐ తగ్గుతుంది, మందులు, సమర్ధవంతంగా పనీ చేస్తాయనుకుంటున్నా! పచ్చి ఉల్లి తినిచూస్తే పోయిందేంలేదు.పంజాబీలు రోటీతో ఒక పెద్ద ఉల్లిపాయ,ఒకపచ్చిమిరపకాయ కూడా తింటారనుకుంటా. 


ఇక ఈ మధ్యనే ఒకదేశి డాక్టరమ్మ,అలోపతి డాక్టరమ్మే  చద్దన్నం తినండి అన్నారు, శాబాసో! అనుకున్నా, ఆ తరవాతే చెప్పిందా తల్లి, నిన్నరాత్రి మిగిలిన అన్నం ఫ్రిజ్ లో పెట్టుకుని మర్నాడు ఉదయం తినమన్నారు. అన్నం ఉడికిన తరవాత దానిని ఫ్రిజ్ లో పెట్టి ఉంచి చల్లబడ్డ తరవాత మళ్ళీ వేడి చేసుకు తినండీ, అని. అసలే కుక్కర్లో వండిన వాటిలో పోషక విలువలు చస్తున్నాయంటున్నారు, ఇక ఫ్రిజ్ లో పెట్టి తీసి మళ్ళీ వేడి చేసి తింటే అసలు పోషక విలువలుంటాయా? నా ఉద్దేశం ఈ అలవాటు మాత్రం చాలా తొందరగానే అందరిని చేరచ్చు అనుకుంటున్నా!


Saturday 1 October 2022

మొండివాడు రాజుకంటే బలవంతుడు.

  మొండివాడు రాజుకంటే బలవంతుడు.


ఇది పాతకాలం మాట, కాని నేటికీ వర్తిస్తుంది. ఏం? ఏలా?

రాజుకి కొన్ని నియమాలుంటాయి, అవి దాటితే కౄరుడు అన్నమాట పడిపోతానని, ఇతరులు ఏమనుకుంటారోనని,ప్రజలేమనుకుంటారోనని, భయపడతాడు, ఎంతో కొంత. కాని మొండివాడో? అటువంటి శసభిషలేం ఉండవు. ఎవరేమనుకున్నా ఈ మొండివానికి బాధాలేదు, భయమూ లేదు.తనకి ఎంతతోస్తే అంతే! మరి నేటికాలానికెలా వర్తింపూ అనికదా కొచ్చను :)


నేడు సోషల్ మీడియా అన్నదో కోతికి కొబ్బరికాయ దొరికిన చందమైయింది. వాక్స్వాతంత్ర్యం అన్నది  రాజ్యాంగం

 ప్రసాదించింది,ఇంకేం కావాలి? ఏదైనా అంటాం! ఎవరినైనా అంటాం!! ఇదీ నేటి వరస. సుప్రీం కోర్ట్ కూడా వాక్స్వాతంత్ర్యానికి కూడా హద్దులుంటాయంటోంది. కాని వినేవారే కనపట్టం లేదు. సోషల్ మీడియాలో యుట్యూబ్, ఒక పెద్ద సాధనమయింది. ఏంతోస్తే అదే షూట్ చేసి పెట్టెయ్యడమే! బాధితులు కొంతకాలం సహిస్తారు. అందరూ సహించరుగా!! కోర్టే కినుక వహిస్తే జైల్లో పారేస్తే, ప్రభుత్వం ఉద్యోగం పీకేస్తే, నిరాహారదీక్ష... 


దీనికితోడు మరోటి, గాంధీగారు చచ్చి ఏలోకాన్న ఉన్నాడోగాని, దేశం లో అలవాటు చేసినది మరొకటి నిరాహారదీక్ష. సరే ఇందులో రకాలనుకోండి. ఇక నిరవధిక నిరాహారదీక్ష. దాని అర్ధమైనా తెలుసునో లేదో, చేసేవారికి, తెలియదు. ఆపై దీని గురించి మీడియావారి హడావుడి, ఇక చెప్పేదేముంది? అసలే కోతి, కల్లు తాగింది,ముల్లు గుచ్చుకుంది, దయ్యం పట్టింది, మరేం కావాలి? 


మొండివాడు రాజుకంటే బలవంతుడు కాదా?