Sunday 9 October 2022

పరాధికారము పైనవేసుకొనరాదు.

 పరాధికారము పైనవేసుకొనరాదు.


అనగనగా ఒక పల్లెటూరు, అందులో ఒక మడేలు, ఒక కుక్కని, గాడిదని పెంచుకుంటున్నాడు. కుక్క ఇంటి దగ్గర కాపలా. గాడిద ఇంటికి రేవుకి మధ్య బట్టలు మోసుకుపోవడం, పనులు. కుక్కకి ఉదయమే మడేలుతో పాటు చద్దిబువ్వ. మధ్యాహ్నం మడేలుతో పాటు వేడి బువ్వ పెడుతుంది, చాకిత.  కుక్క యజమాని మంచంకిందే పడుకుంటుందెప్పుడూ. అప్పుడప్పుడు రాజభోగాలు కూడా కుక్కకే, ముద్దులు, మురిపాలు సహా! ఇక గాడిద, రేవున్నరోజున బట్టలు రేవులో పడేసాకా, సాయంత్రందాకా ఏటిపట్టున మెయ్యడం, ఏట్లో నీళ్ళు తాగడం. రేవులో పనిలేనిరోజున ఉదయమే వదిలేస్తే ఏటిపట్టున తిని, ఏట్లో నీళ్ళు తాగి ఎండవేళ ఏ చెట్టుకిందో పడుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం. 


కుక్క, గాడిద ఎంత స్వేఛ్ఛ అనుభవిస్తోందో, నేనో పగలూ రాత్రీ ఇంటిదగ్గరే! గాడిద పని ఎంత బాగుందీ అని ఈర్ష్య చెందింది. గాడిద, కుక్కకి ఎంత ముద్దు,మురిపెం, ఇల్లు కదలనివ్వరు, రాజభోగాలు, మరినేనో ఉదయం నుంచి రాత్రిదాకా ఏటిపట్టునే బతుకు, రాత్రికి ఇంటికి చేరడం, తిన్నావా ఉన్నావా అని అడిగే దాతా,దూతా లేరు, ఇదీ బాధ.


రోజులు గడుస్తున్నాయి, ఎవరి మనసులో వారు, మరొకరిపై ద్వేషం పెంచుకున్నారుగాని, పైకి పొక్కనివ్వలేదు. ఒక వేసవిరోజురాత్రి   మడేలు, చాకిత గాలికోసం పెరట్లో మంచాలేసుకుని పడుకున్నారు. కుక్క మడేలు మంచంకింద పడుకుంది. గాడిదను దగ్గరలోనే కట్టేసేరు.


ఓరాత్రి వేళ ఒక దొంగ ఇల్లు దూరుతున్నాడు. కుక్క చూసింది, ముడుచుకు పడుకుంది, మొరగలేదు. గాడిద కుక్కని లేపి మొరగవేం. దొంగ ఇల్లు దూరుతున్నాడు, చూసావుగా అంది. దానికి కుక్క, ఉదయమే నాలుగు మెతుకులు పడేస్తాడు,మధ్యాహ్నం మరికొంచం పెడతారు. రాత్రికి కూడు పెట్టరు. ఆకలి కడుపుతో కాపలా కాయాలి. నీకేం ఏటిపట్టున కావలసినంత తింటావు, ఇంటికొచ్చి పడుకుంటావ్, నాలుగు మూటలు మొయ్యడం పెద్ద పనా? అడిగింది కుక్క. నీకేం కావలసినంత స్వేఛ్ఛ. బయట కావలసింది తింటావ్, ఏట్లో నీళ్ళు తాగుతావ్, చింతచెట్టుకింద పడుకుని నిద్దరోతావ్, అని దెప్పింది.


దానికి గాడిద ఉదయమే నీకు పిలిచి మరీ చద్దిబువ్వ పెడుతుంది, చాకిత. మధ్యాహ్నం మడేలు తిన్నదే నువ్వూ తింటావు, మడేలు మంచం కిందే పడుకుంటావ్, నువ్వు పడిపోతున్న కష్టం ఏంటబ్బా! నిలదీసింది గాడిద. నేను మొరగను, మడేలుని హెచ్చరించను,నువ్వేమనుకున్నా మరేం బాధ లేదు, తెగేసి చెప్పేసింది, కుక్క.  


దానికి గాడిద, నువ్వు తప్పుచేస్తున్నావు,యజమానికి ద్రోహం చేస్తున్నావు, సహించలేనని, గట్టిగా ఓండ్ర పెట్టింది. నిద్రా భంగమైన మడేలు, చాకిత లేచేరు,చూసారు, ఏమీ తేడా కనపడలేదు, తిని పడుకుందిగా, ఏందుకు ఓండ్ర పెట్టినట్టు అని చికాకుపడి, పక్కనే ఉన్న కఱ్ఱతో గాడిద వీపుమీద కఱ్ఱ తిరగేసాడు. ఈ హడావుడిలో దొంగ పారిపోయాడు. గాడిద మీద కఱ్ఱ తిరగేసిన తరవాత మడేలు ఇంటివైపు చూస్తే తలుపులు తీసి ఉన్నాయి, దొంగ ఇల్లు దూరినట్టున్నాడని, ఇల్లు వెతుక్కుంటే, చక్కబెట్టుకోవలసినవి చక్కబెట్టుకునే దొంగ పారిపోయాడని తేలింది. అప్పుడు ఆయ్యో! గాడిదను అనవసరంగా చెయిచేసుకున్నానే అని మడేలు బాధ పడ్డాడు, ఉపయోగమే లేకపోయింది. కుక్క చక్కగా మంచంకిందే పడుకుంది, కదలక మెదలక. 


అయ్యో! ఉపకారం చేయబోయి దెబ్బలు తిన్నానే అని గాడిద విచారించింది, తనలో.


కత చిన్నదే కాని నేర్చుకోవలసినదెంతేనా ఉంది.


1.ఒకరిపని పరిధిలో జోక్యం చేసుకోకు.పరాధికారము పైన వేసుకొనరాదు.

2.మరొకరిని చూసి ఈర్ష్య పడకు.

3.ఎవరి పని వారిదే, ఎవరి పనిలో కష్టసుఖాలు వారివే.నేను కష్టపడిపోతున్నాను, ఎదుటివారంతా సుఖపడుతునారనుకోకు.

4.తొందరపాటు పనికిరాదు.

5.చేతులు కాలేకా ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. జరగవలసిన నష్టం జరిగిపోతుంది. 

6.పని అవసరాన్ని బట్టి యజమాని ఉద్యోగులను నియమిస్తూ ఉంటాడు.

7.యజమాని తెలివితక్కువ వాడనుకోకు.

8.యజమానికి నష్టం కలగజేస్తే నీవూ నష్టపోతావు, గుర్తుంచుకో!


5 comments:

  1. "యజమానికి నష్టం కలగజేస్తే నీవూ నష్టపోతావు, గుర్తుంచుకో" అన్నారు. కానీ ఈకదథలో యజమానికి లాభంగా వర్తించిన గాడిదకు లాభం ఏమీ కలుగలేదు - యజమానికి నష్టం కలిగించే పనిచేసిన కుక్కకు నష్టం ఏమీ కలుగలేదు.

    ReplyDelete
    Replies
    1. ఆయనేదో ఉబుసుపోక కతల్ రాస్తూంటే మీరేమో లాజిక్కుల కోడి యీకలు పీకుతున్నారు మల్లే వుందండి

      Delete
    2. శ్యామలీయంవారు,
      కథ బహు పురాతనం. అసంపూర్తా? చెప్పలేను.
      ===================================
      గాడిద స్వలాభం కోసం ఓండ్ర పెట్టలేదు. యజమానికి నష్టం జరుగుతోందని, పరాధికారం పైన వేసుకుని దెబ్బలుతింది. కాని మడేలు వెంటనే చేసిన తప్పు గుర్తించాడు, పశ్చాత్తాపపడ్డాడు. అప్పటికే ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నందుకుగాను, నిదానించాడు. ఇంత హడావుడిలోనూ కుక్క నిద్ర నటిస్తోందని గుర్తించలేనంత తెలివితక్కువ వాడనుకోలేను. కుక్కపై చర్య తీసుకోకమానడు, కుక్క వీధిన పడకా తప్పదు, అప్పుడు నష్టపోయేది కుక్కే, గాడిద కాదు కదా!

      Delete
  2. These stories are not without a purpose (ubusupOni kaburlu kaavu). That is the reason for the phrase "the moral of the story is...."
    Some of the confusion may be due to the incomplete version of the story. The washerman felt that his feeding of the dog was useless, since it did not do its job. So, he either threw it out or stopped feeding it for a few days. The dog learned its lesson. Moral: do your job faithfully and do not shoulder duties that properly belong to others.

    ReplyDelete
    Replies
    1. Anonymous9 October 2022 at 22:15
      కథకి ఒక ప్రయోజనం ఉంది, లేదనుకున్న వారికి వందనాలు.ఇక కథ అసంపూర్తా చెప్పలేను.

      Delete