Wednesday 19 October 2022

చెప్పాలనిపించింది,చెప్పేశా!

చెప్పాలనిపించింది,చెప్పేశా!


పెదరాయుడు లుంగీ,తెల్ల చొక్కా,చేత పొడుగాటి చేపాటికర్ర, కాళ్ళకి ఆకుచెప్పులు, ఆహార్యంతో,  ఉదయమే కనుచీకటితో, కాలేజికి నడకకి బయలుదేరుతా . ఒక వీధివెంటేవెళతా!ఎప్పుడూ. కారణం, అరకిలోమీటరు పైన పొడవుంటుంది,అదేకాక సిమెంటు రోడ్డు, దానికి తోడు ఉదయం వెళ్ళేటపటికి,సంచారం ఉండదు,  ఎవరూ లేవరు. మరోమాట, వీధిలో రెండు పక్కలా ఇళ్ళు, అవికూడా నాలాటి 'రెక్కాడితే కాని డొక్కాడని' వారివే! తిరిగొచ్చేటప్పుడు ఉదయపు జీవి చిత్రం కనపడుతూ ఉంటుంది. మొన్న తిరిగొస్తున్న సమయం, ఒక పడుచు రోడ్ దాటి ఎదురుగా ఉన్న చెత్తకుండీలో తనచేతిలో ఉన్న, గిన్నెనిండా ఉన్న అన్నం ఒలకబోసి వెనుతిరిగిన సమయం. సరిగా నేను అక్కడికి చేరుకున్న సమయం, ఎదురుబొదురయ్యాం. నేను  రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ నిలబడేటపటికి, పడుచు ముఖంలో ఆశ్చర్యం,అరెరె అన్నం అనవసరంగా పారబోశానే! ఈ బిచ్చగాడు పట్టుకెళ్ళేవాడేమో! అనే భావం జమిలిగా  కనపడ్డాయి ఆమె ముఖంలో. పడుచు, ఏమిచేయాలో తోచక, చేత అంట గిన్నెతో నిలబడిపోయింది.  నేను, "తల్లీ అన్నం ఎప్పుడూ పారెయ్యకూ, ఎవరికేనా పెట్టు, లేదంటే మిక్సీలో అన్నంతో ఒక ఉప్పరాయి,మిరపకాయ,జీలకర్ర పలుకు వేసి ఒక తిప్పుతిప్పి వడియాలలా  పెట్టు ఎండిపోతాయి, వాటిని వేయించుకో, నూనెలో, తిను బాగుంటాయి, ఇంకా చాలా చెప్పచ్చు, సమయం కాదు, ఏమనుకోకూ ఇలా చెప్పేనని, అన్నా! " ఏమనుకోనని చెప్పి వెళ్ళింది, ముందుకు కదిలా! చెప్పాలనిపించింది ,చెప్పేశా!   

8 comments:

  1. ఉబోస అనుకునుంటుంది అంటారా?
    ఈ తరం వారికి (“పడుచు” అన్నారుగా) ఏం చెప్పాలన్నా జంకాల్సి వస్తోంది.
    అయినా చెప్పాలనిపించినది సంకోచించకుండా చెప్పేసి మంచి పనే చేసారు లెండి 👌. “చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం” అనే సినిమా పాటలో లాగా నన్నమాట 🙂. బాగుందండీ.

    మీరు రోజూ ఉదయం నడకకు ఆ కాలేజీ గ్రౌండ్స్ కు వెడుతుంటారుగా, అప్పుడు జరిగిన సంఘటనా ఇది?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఏమో ఏమనుకుందో చెప్పలేను. సాధారణంగా ఇతరుల విషయాల్లో కలగజేసుకోను, ఆ రోజు ఆ పడతి అంతన్నం పారేస్తోంటే చూసి ఆగలేకపోయాను. ఆ తరవాత చెప్పినందుకు కొంచం విచారించా! అంటగిన్నుచ్చుకుని ఒక్కపెట్టు పెట్టనందుకు ఆనందపడ్డా! మరెప్పుడూ ఇలా ఉబోసలు చేయకూడదనీ అనుకున్నా! ఆ వీధిని వెళ్ళడం మానేశా! :) ఉదయపు నడకనుంచి తిరిగొస్తుండగా జరిగిన సంఘటనండి.

      Delete
    2. // “ అంటగిన్నుచ్చుకుని ఒక్కపెట్టు పెట్టనందుకు ఆనందపడ్డా!” //

      అవును, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోదగినదే 🙂🙂.

      Delete
    3. విన్నకోటవారు,
      సందర్భం అటువంటిది కదండీ :)

      Delete
  2. మీకెన్నెన్ని విషయాలు తెలుసండి ! మీకు తెలీనివి లేవే లేవనుకుంటా!

    మార్కెట్లో కొనే వడియాలన్ని ఈ బాపతేనేమో ? పెండ్లి సత్రాలలో మిగిలినవి ఫంక్షన్ హాల్లలో మిగిలినవి ఎట్సెట్రా వడియాలు గా మార్కెట్లో బ్రాండెడ్ సరుకులుగా వస్తున్నాయేమో!

    ReplyDelete
  3. Anonymous19 October 2022 at 22:01
    /మీకెన్నెన్ని విషయాలు తెలుసండి ! మీకు తెలీనివి లేవే లేవనుకుంటా!/
    విపులాచ పృధ్వీ
    /మార్కెట్లో కొనే వడియాలన్ని ఈ బాపతేనేమో ? పెండ్లి సత్రాలలో మిగిలినవి ఫంక్షన్ హాల్లలో మిగిలినవి ఎట్సెట్రా వడియాలు గా మార్కెట్లో బ్రాండెడ్ సరుకులుగా వస్తున్నాయేమో!/
    తినేవాళ్ళ అదృష్టం

    ReplyDelete
  4. ఫంక్షన్లలో వడియాలు వడ్డించుకోవడానికీ, బజార్లో వడియాలు కొనుక్కోవడానికీ కూడా ఆలోచించాల్సిన సందిగ్ధాన్ని కలిగించారే పై Anonymous గారెవరో గానీ (19 Oct, 22:01)😳😳.

    ReplyDelete
    Replies
    1. సందేహం రావడానికి మూలం ఈ‌ టపాయే కదుటండీ

      Delete