Saturday 15 October 2022

చావు కాలానికి లావు దుఃఖం.

చావు కాలానికి లావు దుఃఖం.


1. చావు కాలానికి లావు దుఃఖం.

  వయసు మీదపడేటప్పటికి దుఃఖమే ఎక్కువగా ఉంటుందన్నది పిండితార్ధం. లావు అన్న మాటకి బలం,ఎక్కువ, అనే అర్ధాలున్నాయి. లావు మాటని పోతనగారు వాడేరు భాగవతంలో, 'లా'వొక్కింతయులేదు (లావు+ఒకింత=లావొక్కింత).


వయసులో ఉన్నపుడు కష్టం తెలియదు,బాధా తెలియదు. శరీర బాధలుండవు. వయసుమళ్ళితే బంధువులు గతించడం,జీవిత భాగస్వాములే గతించడం, శరీరం సహకరించకపోవడం, ఇక  శంఖు,చక్రాలు నేటి కాలంలో అందరి ఉన్నవే!వాటిని పట్టివచ్చేబాధలు, కొడుకులు కోడళ్ళు చూడకపోవడం, స్వయంగా ఏపనీ చేసుకోలేకపోవడం, ఇతరులపై ఆధారపడక తప్పకపోవడం,

 అనాధాశ్రమాల్లోనూ,వృద్ధాశ్రమాల్లోనూ గడపడం, ఇక ఇంట్లో ఉంటే పిలిస్తే పలికే దిక్కులేకపోవడం,బాధ చెప్పుకుందామంటే వినేవారు లేక, అనుభవించేది నరకం. 

 ఇలా కష్టాలు,దుఃఖాలు జమిలిగా స్వారీ చేస్తుంటాయి, చెప్పుకోగలిగినవి,చెప్పుకోలేనివి.కాలుడూ కరుణించడు,సమయమొచ్చేదాకా,అన్నీ దుఃఖాలే

 అందుకే చావుకాలానికి లావు దుఃఖం అన్నారు.


2.కుంచం నిండాలి.

మనది వ్యవసాయం ప్రాధమికమైన దేశం,అందుకే నానుడులన్నీ వ్యవసాయం దాని అనుబంధంలో ఎక్కువ ఉంటాయి. కొలతకి ఉపయోగించే సాధనమే కుంచం. పాతరోజుల్లో అన్నీ కొలిచి అమ్మేవారు.ధాన్యాలు, నెయ్యి,నూనిలాటి ద్రవాలు, పిండిలాటివాటిని కూడా కొలిచి అమ్మేవారు. ఇక పండ్లు వగైరాలని లెక్కపెట్టి అమ్మేవారు, పరక,పాతిక,ఏభై, వంద అని. వర్షం కూడా కుంచాలలో చెప్పేవారు. పాపాన్ని కూడా కుంచాలలో చెప్పేవారు, అందుకే పాపం పండాలి,కుంచం నిండాలంటారు.  


3.నక్క పుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన చూడలేదందిట.

నక్కపుట్టి మూడాదివారాలు కాలేదు, అంటే నక్క వయసు ఇరవై ఒక్కరోజులు కూడా కాదు.

ఇరవై ఒకటో రోజు నాడు తొట్టిలో వెయ్యడం లాటి వేడుకలు చేసేవారు.  నాటికాలంలో పుట్టిన మూడు నెలలదాకా కళ్ళు తెరవనివారూ,గుప్పెళ్ళు కూడా విప్పనివారు

 ఉండేవారంటే నమ్మలేరు,ఒంటికి నూనిరాసి, ఒక సన్నని నూలు బట్ట కప్పేవారు.''నూని గుడ్డుకి నూరాపదలు'' అనేవారు. ఇరవైఒకటోనాడు నలుగుపెట్టి స్నానం చేయించి ఉయ్యాలలో వేసేవారు.

   ఇరవై ఒక్క రోజుల వయసుదాటని నక్క ఇంతపెద్దగాలివాన చూడలేదంది. అంటే వయసేలేదు, అనుభవమూ లేదు కాని ఆరిందాలా మాట్లాడితే ఇలా అంటారు.

ఇక నానుడికొస్తే అనుభవం లేనివారు పెద్ద అనుభవజ్ఞులలా మాటాడటాన్ని ఈ నానుడితో చెబుతారు. 

10 comments:

  1. అంటే వయసేలేదు, అనుభవమూ లేదు కాని ఆరిందాలా మాట్లాడితే ఇలా అంటారు

    ఇది బావుందండి. ( మీకు వర్తించదనుకుంటా)

    ReplyDelete
    Replies
    1. Anonymous15 October 2022 at 10:42
      అటులందురా? :)

      Delete
  2. మొదటి నానుడికి మీరిచ్చిన పలు ఉదాహరణలతో బాటు నాకు తోచిన మరొకటి …. తీరికగా కూచుని జీవితంలో చేసిన తప్పుల గురించి, జారిన మాటల గురించి తలుచుకుని “లావుగా” దుఃఖించడానికి ఇదే కదా వయసు (కాలాన్ని వెనక్కు తిప్పలేం గానీ తలుచుకోవడాన్ని ఆపలేం కదా … మానవ సహజం - సో కాల్డ్ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎన్ని సూక్తులు చెప్పినా కూడా; అన్నీ నేనే చేయిస్తాను “నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్” అని గీతాచార్యుడు అన్నప్పటికీ కూడా).

    ఏమైనప్పటికీ ఫస్ట్ క్లాస్ నానుడండీ 🙏.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      చెప్పుకోలేని దుఃఖాలివే కదండీ

      Delete
  3. pinDitaartham ani vraaSaaru. BahuSaa panDitaartham ani unDaalEmO.

    ReplyDelete
  4. Anonymous15 October 2022 at 20:21
    పిండితార్థం అని వ్రాశారు. బహుశాః పండితార్థం అని ఉండాలేమో.
    మీ కామెంటుని తర్జుమా చేసుకున్నా!
    పిండితార్ధం అంటే ఇంగ్లీష్ లో ’ఎసన్స్’ అనే అర్ధంలో వాడేనండి.

    ReplyDelete
  5. పిండితే వచ్చిన అర్థం అని భావమన్నమాట 😁🙂

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      "In a nut shell"అనుకోండి :)

      Delete
  6. పండితులు పిండి పిండి తీసే అర్థమండీ ; వ్రాసిన వారు ఏ భావంలో రాసేరో సమజవదు గానీ వీళ్లు కొత్త కొత్తగా దాన్నుంచి పిండుతుంటారు :(

    ReplyDelete
    Replies

    1. Anonymous16 October 2022 at 18:49
      అర్ధం కాలేదు. :)

      Delete