Monday 14 March 2022

జానపదం

 


Courtsy:Whats app

తల్లితండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ!

Friday 11 March 2022

ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.

 ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.


యుద్ధం,ఎన్నికల హాడావుడిలో కరోనా మాట మరచిపోయారు.మాస్క్ కూడా వాడటం మానేశారు. పెద్దలు మాత్రం కరోనా మనల్ని వదలలేదు, జాగ్రత్తలు అవసరమే అని చెప్పినా వినేలా లేరు జనం.


ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్లు చాలా ఉన్నాయి, ఏది సోకింది సామాన్యుడికి తెలీదు, ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతోంది, టెస్ట్ చేసే సమయం కూడా ఉండటం లేదు,దాంతో ఇది మామూలుగా ఋతువులో వచ్చే జ్వరం, దగ్గు, రొంప స్థాయికి జారిపోయినట్టు కనపడుతోంది.కరోనా ఎవరిని వదలకుండా అందరిని సోకింది, ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, వేక్సిన్ వేయించుకున్నవాళ్ళు( బూస్టర్లతో సహా )  వేయించుకోనివాళ్ళు, ఒక సారి వచ్చినవాళ్ళు అనే తేడాలే లేవు. సర్వం సమానం. ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళకి బయటికి కనపడటం లేదు, అంతే తేడా.

 

ఇది సోకినా ప్రమాదం లేదనుకున్నాం కాని ఇది తప్పు అభిప్రాయం.కరోనా అంటే తగ్గుతోందిగాని దీని ఫలితాలు, నీరసం, తలనొప్పి, చిన్న దగ్గు, కొద్దిగా జలుబు, డిప్రషన్, ఇలా లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి, నెలలు గడుస్తున్నా. వయసు మళ్ళినవాళ్ళని, ఇమ్యూనిటీలేనివాళ్ళని వేధిస్తూనే ఉన్నాయి, ఇందులో ఏదో ఒక లక్షణం. సుగర్,బి.పి లాటి దీర్ఘవ్యాధులున్నవారు చెప్పాపెట్టకుండా టపాకట్టేస్తున్నారు. కాని ఇది కరోనావల్ల అనుకోలేకపోతున్నారు. మరో విచిత్రం ఏమంటే ఒకరికి ఉన్న లక్షణాలు మరొకరికి ఉండటం లేదు. జాగ్రత్తలు కొనసాగడం మంచిది.


 నిజమెంతో తెలీదుగాని, 

కోవిడ్ లాటి వైరస్లను ఎలకలు,గబ్బిలాలు,పక్షుల ద్వారా శత్రు దేశాల్లో ప్రవేశపెట్టడానికి యూక్రైన్ లో పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి తాలూకు కాగితాలు,వగైరా దొరికాయనీ, లేబరేటరీలను స్వాధీనం చేసుకున్నామని, ఈ పరిశోధనలు అమెరికా పనుపున,ఆర్ధిక సాయం తో జరుగుతున్నాయనీ, తద్వారా శత్రు దేశాల ప్రజలను నెమ్మదిగా అనారోగ్యంపాలు చేసి, ఆ దేశాన్ని ఆర్ధికంగా నిలదొక్కుకోలేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, రష్యా ఆరోపిస్తోంది. ఈ పెద్ద దేశాలకి ఇటువంటి ఆలోచనలఎందుకొస్తున్నాయీ? సైన్స్ వెర్రితలలేస్తోందా? కాలమే చెప్పాలి. ఎప్పుడైనా జాగరత అవసరం.  

Tuesday 8 March 2022

భవతి రాక్షసో వైద్యః

 


రోగార్తస్య భిషక్ దేవ

ఆర్త్యన్తే మానవో భిషక్

భవతి రాక్షసో వైద్యః

సేవామూల్య ప్రదర్శనే


రోగంతో బాధపడుతున్నపుడు వైద్యుడు దేవుడులా కనపడతాడు. అర్త్యన్తే అనగా రోగబాధ నెమ్మళించిన తరవాత, వైద్యుడు మామూలు మనిషిలా కనపడతాడు. వైద్య సేవలకి మూల్యం అడిగినపుడు మాత్రం రాక్షసునిలా కనపడతాడని భావం.


ఇది పాతకాలం నాటి మాట. నాటి రోజుల్లో అనగా నేను ఎరిగిన రోజుల్లో కూడా వైద్యుడు, రోగి ఇంటికి వచ్చి వైద్యం చేసేవాడు. మందులూ ఆయనే ఇచ్చేవాడు. పధ్యపానాలూ వివరంగా చెప్పేవాడు.అంతే కాదు, వైద్యుడు అంటే ఇంటివారిలో ఒకడనే మాట ఉండేది. చిన్నచిన్న రోగాలకి వైద్యం చేసినా డబ్బులు అడిగేవారు కాదు. సంవత్సరానికి ఒక సారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వైద్యం చేయించుకున్నవారంతా కట్నాలని, కానుకలు చదివించేవారు. ఇవ్వలేనివారి దగ్గర అడిగేవారు కాదు.అదో సహకార జీవనం. 


కాలం మారింది, కాదు మనుషుల బుద్ధులు మారేయి ఎప్పటి సొమ్మప్పుడే చెల్లించాలి, నేడు.డాక్టర్ దగ్గరకే రోగిపోవాలి. అక్కడ ఒక కార్డ్ రాయించుకోవడంతో ఫీజు మొదలవుతుంది. ఈ కార్డ్ కి కూడా ఖరీదుంటుంది అది వందో ఆ పైమాటో, డాక్టర్ని బట్టి.నేటి డాక్టర్లు ఎక్కువ మంది తేనెటిగల్లాటివారు. కొద్దికొద్దిగా సంగ్రహిస్తారంతే, చిన్నచిన్న వైద్యాలకి, అదే పెద్దదైతే కార్పొరేటే :)


పై శ్లోకం మా వాట్సాప్ గ్రూప్ లో డాక్టర్ గారు పెట్టినది. ఇదేoటి ఆయన ఇలాటి టపా వేశారని మిత్రుణ్ణి కనుక్కుంటే తేలినదేమంటే, కరోనా మొదలుగా  డాక్టర్ గారు వాట్సాప్ లో రోగిని చూస్తూ అత్యవసర వైద్యం చేసేరు. అది గత రెండేళ్ళుగా జరిగిపోతూనే ఉంది కాని ఎక్కువమంది కన్సల్టేషన్ కూడా చెల్లించలేదని తెలిసింది. ఔరా! జనం, అనుకుంటూ ఒక సారి భుజాలు తడుముకున్నా! నా దగ్గర నుంచి డాక్టర్ గారికి ఇవ్వవలసినది ఉండిపోయిందేమోనని. సరి చూసుకున్నా! అన్నీ రాసుకుంటా కనక. 

ఇటువంటి వారు కూడా ఉన్నారా? ఉన్నారు అక్కడక్కడా!