Friday 28 April 2023

ఎవరికంపు వారికింపు.

 ఎవరికంపు వారికింపు.

ఇదొక నానుడి.ఎవరు చేసినపని,చెప్పిన మాట వారికి సొంపుగానూ, ఇంపుగానూ కనపడతాయని దీని భావం.కాకి పిల్ల కాకికి ముద్దు ఇదీ ఒక నానుడే! కాకి తనపిల్లని ముద్దు చేయడంలో తభావతేముంది? కాని అదే కాకి పిల్లని మరొకరు ముద్దు చేస్తారా అన్నదే మాట. అలాగే ఎవరు చేసినపని,మాట ఎదుటివారికి కూడా నచ్చాలి.లోకంలో అందరికి అన్నీ నచ్చవు, కాని ఎక్కువమందికి నచ్చాలికదా! అలా నచ్చని దాన్నే ఇలా ఈ నానుడితో చెబుతారు. 


ఈ విషయంమీద ఇదివరలో వాసన అని ఒక టపారాసిన గుర్తు.   

శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన

 ఇంతేకాదు నిజంగానే ఎవరి కంపు వారికి ఇంపుగానే ఉంటుంది. కారణం తమదైన వాసన తమకి తెలియదు, ఎదుటివారికి తప్పించి. సైన్స్ కూడా చెబుతున్నమాటిదే. ప్రతివ్యక్తి శరీరం నుంచి తమదైన ఫెరోమోన్స్ విడుదలవుతాయి. ఇవి చెమటతో బయటికొస్తాయి. ఎవరి ఫెరొమోన్ వాసన వారిదే! ఇద్దరి ఫెరొమోన్ ఒకలా ఉండదు, ఇద్దరి డి.ఎన్.ఎ ఒకలా ఉండనట్టు. ఈ ఫెరొమోన్ వాసన పక్కవారికి మాత్రమే తెలుస్తుంది, ఎవరిది వారికి తెలియదు. ఈ ఫెరొమోన్స్ వాసన చూసే కుక్కలు నేరస్థులని పట్టుకుంటాయి ఈ ఫెరొమోన్స్ వాసన కుక్కలు గుర్తించినంతగా ఇతరులు గుర్తించలేరు. మనం ఒక ప్రదేశంలో కొంతసేపుండి అక్కడనుంచి వెళ్ళిన తరవాత కూడా మన ఫెరోమోన్స్ వాసన అక్కడ ఉంటుంది. నేరస్థులు దీనిని తొలగించాలని చూసినా సున్నితమైన ముక్కుతో కుక్కపసికడుతుంది. ఈ పెరొమోన్స్ లో ఆడ మగ తేడాలున్నాయష! వామ్మో!!


ఇంతేకాదు కొంతమంది కొంతమంది ఫెరొమోన్స్ ఇష్టపడతారట. ఏడుస్తున్న చిన్న పిల్లల దగ్గర తల్లి దుస్తులు పడేస్తే ఏడుపు ఆపుతారట. ఆ దుస్తులనుంచి విడుదలైన ఫెరొమోన్స్ వాసన తల్లి దగ్గరుందన్న భావం బిడ్డకు కలగజేస్తుంది. బట్టలు ఉతికిన తరవాత కూడా ఈ ఫెరొమోన్స్ వాసన మిగిలే ఉంటుందిట.  మరి భార్య భర్త ఒకరి ఫెరొమోన్స్ మరొకరు ఇష్టపడితే జీవితమే హాయిలేహలా! వారే విడదీయలేని జంట.ఇది బహు అరుదు.


ఇక కొంతమందిని అందరూ ఇష్టపడతారు, కొంతమందిని ఎవరూ ఇష్టపడరు. కొంతమందిని కొందరే ఇష్టపడతారు. కారణం! మాట. అదెలాగో చూదాం. తినే ఆహారాన్ని బట్టి మనసు, మనసు బట్టి మాట. అలాగే తినే ఆహారాన్నిబట్టి ఫెరొమోన్స్ విడుదలవుతాయి. అదేవాసన. స్త్రీ పురుష ఫెరొమోన్స్ ఆకర్షణకి తోడవుతాయిట. అంటే మొత్తం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. 


చిన్న ఉదాహరణ. పచ్చి వెల్లుల్లి తినండి, మీ నుండి విడుదలయ్యే చెమటలో వెల్లుల్లి వాసన ఉంటుంది. ప్రయత్నించకండీ! ప్రమాదం!


ఇక తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది? వాటి రకాలు. సాత్విక,రాజస,తమో గుణాహారాల మూలంగా మూడు గుణాలు ఏర్పడతాయి.అవే సత్వ,రజస్, తమో గుణాలు. ఈ గుణాల మూలంగానే మనసు, దాన్నిబట్టి మాట అలాగే విడుదలయే ఫెరోమోన్స్ ఉంటాయి. అయ్యో! నన్నెవ్వరూ పట్టించుకోటం లేదని బాధవద్దు. సాత్విక ఆహారం తీసుకోవడం ప్రారభిస్తే మార్పువస్తుంది, దీనికి కాలం తీసుకుంటుంది, మార్పు ఒక్క రోజులో రాదుకదా! అసలు ఇష్టం అనేదొకటుందికదా! ఆహారం తీసుకోవడం లో, దాని మాటేమీ? సాత్విక,రాజస,తామసాహారాలలో ఏవి ఎక్కువ ఇష్టమో అది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఏర్పడతాయి.  


ఇంత పెద్ద విషయాన్ని మనవారు ''ఎవరికంపు వారికింపు'' అని చిన్న మాటలలో చెప్పేసేరు.  


Monday 24 April 2023

ఫలాహారమే మేలు

ఫలాహారమే మేలు(2023)


కొత్తపల్లికొబ్బరి మామిడిపళ్ళు.




 వేసవి రావడం పళ్ళు రావడం, మార్కెట్ నిండా పళ్ళే! ఫలాహారమే చవగ్గా ఉన్నట్టుంది, ఇడ్లీ ,పెసరట్టు, ఉప్మాలకంటే.


పనసతొనలు మీడియం డజను ......30

ద్రాక్ష నలుపు/తెలుపు అరకేజి...... 50

ఆపిల్ కేజి ... .. 200

అరటిపళ్ళు అత్తం (24) పెద్దవి.... 100

దానిమ్మ మీడియం (12) కేజి .....200.ఒకటి 20

లంక దోసకాయ పెద్దది..... 60

కర్బూజా....30

పుచ్చకాయ మీడియం 1/6 వంతు ముక్క...... 10

సపోట కెజి మీడియం(24)........ 50

కమలా కేజి......... 200

బొబ్బాసికాయ మీడియం 1/6వంతు ముక్క......10

నేరేడు పళ్ళు 1/2 కేజి .....150

తాటిముంజలు12......60

జీడి మామిడి పళ్ళు 12.......50

వెలగపళ్ళు3........50

జామకాయలు కేజి.....50

కర్రపెండలం 1/2కేజి.......40

ఎండు ద్రాక్ష..కేజి (packed).......350

ఖర్జూరం 1/2 కేజి( Fresh fruit packed).....350

లేత కొబ్బరి నీళ్ళు,(పాకుడు). లీటరు....100

మామిడిపళ్ళు (కొత్తపల్లి కొబ్బరి)మీడియం..100...5000


రేగు సీజనయిపోయింది. తేగలు,బుర్ర గుంజు సీజనయిపోయింది.కమలా సీజన్ పూర్తికావస్తోంది.పంపర పనస,నారింజ మార్కెట్ కి రావటమే లేదు.అనాస సీజన్ మొదలుకాలేదు.


ఎన్ని రకాలపళ్ళు. మరేదేశం లోనూ ఇన్ని ఉంటాయా? ఉన్నాయా? 

................

ఇడ్లీ (మీడియం) 4 ...30

పెసరట్టు ....30

ఉప్మా...20


Thursday 20 April 2023

పునర్విత్తం

 పునర్విత్తం పునర్మిత్రం

పునర్భార్య పునర్మహి

ఏతత్సర్వం పునర్లభ్యం

న శరీరం పునః పునః

కోల్పోయిన విత్తం మరల సంపాదించచ్చు,  విడిపోయిన మిత్రుడిని మళ్ళీ కలవచ్చు.  భార్యపోతే మరొకరినీ సంపాదించుకోవచ్చు.భూమినికోల్పోతే మరలా సంపాదించచ్చు.  కాని శరీరం ఒక సారిపోతే  మళ్ళీ మళ్ళీ పొందలేం, తిరిగిరాదు.

Courtesy:Whats app
It is a graphic message. I love it,like it.

ఇంతెందుకు అని, ఒక్క మాటలో చెప్పేసేరు. అదే ''శరీరమాద్యం ఖలు ధర్మసాధనం''.ఏం చెయ్యాలన్నా శరీరం ముఖ్యం,దాన్ని కాపాడుకో అన్నారు. నేనేంటి ఉక్కు ఉక్కు అన్నవాళ్ళు తుక్కు తుక్కు ఐపోయారు, కోవిడ్ దెబ్బకి . కొందరు చచ్చి బతికేరు.  కోవిడ్ మళ్ళీ పుంజుకుంటోంది. ఒక సారొచ్చింది మళ్ళీ రాదనుకోవద్దు. వాక్సీన్ వేసుకున్నా జాగరత అవసరమే. దీనికి తోడు H3N2 Flu variant  బలంగా వ్యాపిస్తోంది.  ఇమ్యూనిటీ కొనుక్కుంటే దొరకదు, ఇమ్యూనిటీ పెంచుకునే చర్యలు తీసుకోండి.  యోగా చేయండి, వయసుతో నిమిత్తంలేదు,దీనికి. నడవండి. ఇప్పుడు ఎండలు జోరుగా ఉన్నాయప్పుడే, 40,41,42   ఇలా వేడి పెరుగుతోంది.(Heat wave sweeping) వేడి 45 దాకా చేరచ్చంటున్నారు. వడదెబ్బ తగలచ్చు, ఎండలో తిరగద్దు. జాగర్తా!

పుట్టింది మొదలు గిట్టే దాకా మనతోడు మన శరీరమే, తల్లితండ్రి,భార్య,పిల్లలు,బంధువులు,మిత్రులు ఊపిరినిలబడితే ఎవరూ తోడుండరు.శరీరాన్ని కాపాడుకోవాలి.వయసు ముదిరితే చెయ్యీ కాలూ ఆడకపోతే హాస్పిటల్ లో పారేస్తారు, చాకిరీ ఎవరూ చెయ్యలేరు. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే,ఇక్కడే,ఇక్కడే పొంచిఉంది.జాగర్త. ఎల్లకాలం ఎవరూ ఉండరని మిట్ట వేదాంతం చెప్పద్దు, ఉన్నంతకాలం చెయ్యీ,కాలూ ఆడాలి మరచిపోవద్దు, జాగర్త..

Saturday 15 April 2023

భ్రమర,కీటన్యాయం.

 భ్రమర,కీటన్యాయం.

భ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు. ఏంటీ (సామెత)న్యాయం?

కీటకం భ్రమరానికి చిక్కుతుందనీ, ఆ తరవాత భ్రమరం కీటకం చుట్టూ తిరుగుతుందనీ, ఆ కీటకం భ్రమరమవుతుందనీ చెబుతారు, పెద్దలు. కీటకం ఎప్పటికి భ్రమరం కాలేదంటారు, కొందరు.పెద్దలు ఇదెందుకు చెప్పినట్టూ, ఇందులో ఏదో గూఢం ఉందా? చూదాం!


కీటకమనే మనసు భ్రమరమనే ద్వేషానికి చిక్కుతుంది.చిక్కిన మనసు చుట్టూ ద్వేషం తిరుగుతూ ఉంటుంది.  ఎంతకాలం? కీటకం భ్రమరమేదాకా!అంటే మనసు ద్వేషంతో నిండిపోయేదాకా!


ఇది ఒక ద్వేషానికే చెప్పుకోనక్కర లేదు. పగ,ద్వేషం ఇలా అవలక్షణాలకే మనసు చిక్కుతుందనే పెద్దల మాట.భక్తికి చిక్కదా? బహు అరుదు. అలా భక్తి భ్రమరానికి మనసనే కీటకం చిక్కితే అదే అదృష్టం.

Thursday 13 April 2023

పట్టుకో!పట్టుకుంటా!!



ఇది జిజ్ఞాసువు ప్రశ్న. దేవునిగురించి ఎవరికివారు తెలుసుకొవలసిందేగాని మరొకరు ఎఱుక పరచలేరన్నది నానమ్మిక.దీనిపై అంతులేని ప్రశ్నలు, అనంతమైన సమాధానాలూ ఉన్నట్టున్నాయి, నేడో రేపో కమే కూడా దీనిమీద సిద్ధాంతం రాసెయ్యచ్చు.


ఈ నెల రెండో తారీకు మొదలు రొంప,దగ్గు,జ్వరం నన్ను సిరి పీడించినట్టు పీడిస్తున్నాయి, వదలక. దీనికి తోడు నాలుగురోజులుగా వేడి దంచుతోంది, నలభై లెక్కన. నా కష్టాలు పరమాత్మకే ఎఱుక.ఇంతలోనూ కొంచం ఓపిక జేసుకుని..ఇది గిలికా...


పల్లెటురివాణ్ణి,చదువు లేనివాణ్ణి, మట్టిలో బతికే మనిషిని, మేధావినికాను.ఇది నా అనుకోలు, పెద్దలు మన్నించెయ్యండి,తప్పుల్ని.


ప్రశ్నలోనే ఇద్దరున్నట్టుకదా? ఇద్దరుంటే కదా ఒకరినొకరు పట్టుకోడం? ఎవరిని ఎవరు పట్టుకోవాలన్నది ప్రశ్న.


విషయంలో కెళదాం.

మార్జాలకిశోరన్యాయం, మర్కటకిశోర న్యాయమన్నవి రెండు సామెతలు, సంస్కృతంలో.

మొదటిదానిలో పిల్లి తన పిల్లను నోటకరచుకుపోతూ ఉంటుంది.పిల్లకి బాధ్యతలేదు. అంతా తల్లి చూసుకుంటుంది. రెండవది దీనికి విరుద్ధం. అందులో తల్లికోతి వీపును పిల్ల పట్టుకు ఉంటుంది.తల్లికేం బాధ్యతలేదు. పిల్లబాగోగులు పిల్ల చూసుకోవాలంతే!

ఈ రెంటినీ సమన్వయ పరచుకుంటే!ఎలా?

భాగవతం దగ్గరకెళదాం.ప్రహ్లాదోపాఖ్యానం లో ప్రహ్లాదుడు హరి నామాన్ని పట్టుకున్నాడు. ఎలా? పానీయంబులుద్రావుచున్,కుడుచుచున్,, హాస నిద్రాదులు జేయుచున్, అన్నీ చేస్తూ కూడా నామం పట్టుకున్నాడు.మర్కటకిశోర న్యాయంలా. కష్టాలొచ్చాయి, ఎంతదాకా పీకలదాకా,హిరణ్యకశిపుడు ఇలా ఏడ్చేదాకా

ముంచితి వార్ధులన్ గదలమొత్తితి .......జావడిదేమి చిత్రమో అనుకుని ఏడ్చేదాకా!  ఎవరు పట్టుకున్నారు ప్రహ్లాదుని? హరి పట్టుకున్నాడు మార్జాలకిశోర న్యాయయంలో లా. 


దీన్ని బట్టి తెలిసేదేమి? నువ్వు పట్టుకో! నిన్ను పట్టుకుంటా!! 

Sunday 9 April 2023

కమే! కమే!! కమే!!!

 కమే! కమే!! కమే!!!


ఎక్కడజూసినా కమే మాటే!

కమే ఏంజెయ్యగలదయ్యా? అడిగేడో జ్ఞిజ్ఞాసువు 

ఏమైనా చెయ్యగలదన్నాడో మేధావి.

కొన్ని ఉజ్జోగాలే పోతాయన్నాడు మరొకడు.

అదేంజేయగలదు? ఏం ఉజ్జోగాలో పొతాయో చెప్పరాదే అడిగేడు మరో పెద్దమడిసి.

ఇనుకోండి. 

లెక్కల్లో బొక్కలు సిటికలో కనిపేట్టస్తది. అక్కౌంటెంట్లు, ఆడిటర్ల పని కాళీ!

గ్రంధాలు, ఉద్గ్రంధాలు రాసేయగలదు, కవులు కళాకారులు పని ఖాళీ!

ఇలా జెప్పినియ్యి కొన్నే!సమస్యలు చిటికిలో విడదీసెయ్యగలదు.ఏమైనా చేసెయ్యగలదు, చెప్పేసేడు. ఇలా చాలా చాలా పనులు చేసెయ్యగలదు, చాలా ఉజ్జోగాలు  హాంఫట్, బెదిరించేడు.

ఐతే చెయ్యలేనిదేం లేదంటావ్? అడిగేడు మరో అనుమానం  పక్షి.

దానే అడిగేదాం అనేసేడు ఒక విజ్ఞాని.

ఉదాహరణ చెబుతా వినండి.

ఒక జడ్జీగారు తను ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండాలో అని కమేని అడిగితే ఆయనేమని రాసేడో తీర్పు అలాగే చెప్పేసిందిట. అదిజూసి ఆయన నోరొదిలేసేడంట. ఆయనేజెపిండు, ఇటు సెయ్యద్దూ, ప్రమాదమూ అని.

మరో ముచ్చట. ఒకయనో ముచ్చటజెప్పిండంట, సేనాకాలం కితం. అది వివాదం అయ్యిందంట, నాడు. నేడు కమేని అడిగితే ఈన జెప్పిందే నిజమన్నదంట. ఆయనో డప్పేసుకుని జెప్పుకుంటాన్నాడు.

ఐతే కొన్ని కొచ్చన్లేదాం ఏటి జెప్పుద్దో!

2024 లో మోడీగారు ప్రధానిగా ఎన్నిక కాకపోతే ఏం జేసుకు బతగ్గలడు?

హిమాలయాల్లో టీ అమ్ముకుని ఐనా బతికెయ్యగలడని ఆన్సరు.

2024 లో రాహుల్ బాబా ప్రధానిగా ఎన్నిక కాలేకపోతే ఏ0 చేసిబతగ్గలడు?

ఏమీ చెయ్యలేడు. ఏమీ చెయ్యలేకపోయిన బతికెయ్యగలడు ఆన్సరు.

అమ్మాయి నీళ్ళడుతోంది ఏబిడ్డ?

Input డాటా ఇనకంప్లీట్, ఆన్సరు.

నువ్వు చెయ్యలేనిదేంటో చెప్పూ?

కొన్ని నిమిషాలే మౌనం. ఏమైందీ అని భయపడ్డారు, జనం. నోరిప్పింది కమే,

  పిడక పజ్యాలు రాయలేను, ఆన్సరు.


ఇది చదివి నవ్వుకోండి. ఏవరికైనా బాధ కలిగితే బాధ్యత నాది కాదు కమేదేస్మీ!

So many errors, correct them yourself :)

Sunday 2 April 2023

రాముని రాజ్యం-భరతుని పట్టం-2

 రాముని రాజ్యం-భరతుని పట్టం-2


జయత్యతిబలోరామో

లక్ష్మణస్య మహాబలః

రాజా జయతి సుగ్రీవో

రాఘవేణాభిపాలితః

(జయ మంత్రం)       హనుమ.  

https://kasthephali.blogspot.com/2023/03/1.html

continued.....

అవగాహన

దశరథుని పార్ధివదేహానికి అగ్ని సంస్కారం చేసిన తరవాత,రాముని తల్లి కౌసల్యను దర్శించాడు,భరతుడు.   తల్లీ! జరిగినదానిలోగాని, నా తల్లి కోరిన కోరికలలో గాని నా ప్రమేయం లేశమాత్రమున్నూ లేదు. ఏమాత్రం ప్రమేయమున్నా అనేక ఘోరమైన పాపాలు చేసినవాణ్ణి అవుతాను, అని ఒట్లు పెట్టుకున్నాడు. మనం అందరం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామనీ చెప్పాడు.  ఆ తరవాత లక్ష్మణుని తల్లి సుమిత్రకు కూడా ఇలాగే చెప్పాడు. అందరం వెళ్ళి రాముని వెనక్కి తీసుకొద్దామని చెప్పేడు.  ఆపై సభచేసి మంత్రి,పురోహిత, పౌర, జానపదులుండగా, ఈ రాజ్యం రామునిది, రాముడే పరిపాలనార్హుడు.  నా తల్లి కోరినవరాలలో నా ప్రమేయం లేదు, అని ప్రకటించి, మనం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామని చెప్పేడు.


ఆ తరవాత అనుకున్నట్టు అందరూ అనగా, రాణివాసం, సైన్యం,మంత్రులు,పౌరులు,జానపదులు కదలిరాగా రాముని కోసం అడవులకు బయలుదేరారు. పట్టపుటేనుగు సిద్ధంగా ఉన్నా భరతుడు గుఱ్ఱం ఎక్కేడు. పట్టపుటేనుగు హౌదా ఖాళీగా ఉండగా బయలుదేరింది. 

***

ఆలోచన

ఇంట గెలిచి రచ్చగెలవాలి, ఇదొక నానుడి, తెనుగునాట. ఇది రామాయణం లో భరతుడు చేసినదానిని బట్టే ,ఈ నానుడి పుట్టిందని నా నమ్మిక. తాను రాజ్యం రామునిదే అని నమ్మేడు, అదే చెప్పేడు,  ఆచరణలో చూపాడు.  అది అమలుకు, ముందు ఇంటిలో వారిని ఒప్పించగలగాలి,  జరిగినదానిలో తనప్రమేయం లేదని.. అందుకు ముందుగా రాముని తల్లి కౌసల్యను కలిసాడు,ఎన్ని ఒట్లు పెట్టుకున్నాడో, నేనైతే ఒట్లు పెట్టుకున్నాడని తేల్చేసేను.  ఆనాటికి ఘోరపాపాలేవైతే ఉన్నాయో అవన్నీ తాను చేసినవాడినౌతానని చెప్పేడు.  చివరికి మనం వెళ్ళి రాముని తీసుకొద్దామని చెప్పి పెదతల్లికి  నమ్మకం కలగజేసేడు. రామునికి బహిఃప్రాణం లక్ష్మణుడు, అలాగే తన బహిఃప్రాణం శత్రుఘ్నుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు కవలపిల్లలు, సుమిత్ర కొడుకులు. అటువంటి సుమిత్ర దగ్గర ఏడ్చేడు, తనగోడు వినిపించేడు, కౌసల్య దగ్గర పెట్టుకున్నన్ని ఒట్లూ పెట్టుకున్నాడు, మనం రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నాం, అనీ చెప్పేడు. నిజానికి ఇంత చెప్పక్కరలేదు, ఈ పెదతల్లికి, కాని చెప్పేడు. తన బహిఃప్రాణమైన తమ్ముడు, శత్రుఘ్నునికి తనేమిటో తెలుసు, తన తమ్ముని ద్వారా సుమిత్రకీ తెలిసి ఉండే సావకాశాలే మెండు. కాని అలాగని ఉపేక్ష చేయలేదు.కౌసల్య దగ్గర చెప్పినదంతా ఇక్కడా చెప్పేడు,  పెదతల్లికి  నమ్మకం కలగజేసేడు. ఆపై పౌరులు,జానపదులకూ  తెలిసేందుకుగాను సభచేసి ప్రకటించాడు.   తాను చెప్పడమే కాదు, అది నిజమనిపించేందుకుగాను, పట్టపుటేనుగు బయలుదేరినా దానిని ఖాళీగానే ఉంచి, తాను   గుఱ్ఱం మీద మాత్రమే బయలుదేరాడు.  ఎందుకిలా చేసాడు? రాజుమాత్రమే పట్టపుటేనుగు ఎక్కేందుకు అర్హుడు, తాను రాజుకాదని ప్రజలకి తెలియజేసేందుకే అలా చేసేడు. మరి పట్టపుటేనుగెందుకు ఖాళీగా? తిరిగి వచ్చేటపుడు రాముని కోసం. సైన్యమెందుకు? రాణివాసానికి రక్షణ. అంతేకాదు రాజు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు, సైన్యం కూడా ఉండాలి. తిరిగొచ్చేటపుడు రాముడు రాజు గనక సైన్యం కూడా ఉండాలి. ఇక మంత్రులు ఎందుకు? మంత్రులందరూ బుద్ధి కుశలురై ఉంటారు, అనుకోని అవాంతరాలలో ఆలోచనకి అవసరపడతారు. ఇక పౌరులు,జానపదులు ఎందుకు? పౌరులు,జానపదులూ నీ తిరిగిరాక కోరుతున్నారని  రామునికి తెలియజేసేందుకు, ముఖ్యులు కూడా ఉండేందుకు. ఇన్ని ముందు జాగరతలూ తీసుకున్నాడు, భరతుడు, రాముని తిరిగి రమ్మని చెప్పడానికి. అంతేకాదు తన ప్రయత్నలోపం ఉండకూడదనీ, తన ఆంతర్యం అందరికీ తెలియాలనీ ఇన్ని పనులు చేసేడు. భరతుడు బుద్ధిశాలి.  


ఇలా ఇంట నమ్మకం కలగజేసి,వారి మనసులు గెలిచాడు, ఇదే ఇంట గెలవడం. ఇక రచ్చ ఎలాగెలిచాడో తదుపరి చూదాం.

తరువాయి...