31, అక్టోబర్ 2026, శనివారం

ఆర్ణబ్ తుఫాను

 ఆర్ణబ్ తుఫాను


ఆర్ణబ్ తుఫాను చివరిసారిగా నిన్న మధ్యాహ్నం ఒకసారి జల్లు కురిసి  వెళ్ళింది.


27 మధ్యాహ్నం నుంచి చినుకుప్రారంభమై కురిసి సాయంత్రానికి తగ్గింది. రాత్రికి గాలి వెర్రిగా వీచింది తొమ్మిది మొదలు. రాతిరంతా విడతలుగా అలాగే ఉంది.  పొద్దుటికి అంతా బాగున్నట్టుంది,మబ్బులు ఉండిపోయాయి. 27 రాత్రికే కరంటుపోయింది. సోలార్ ఉండటంతో రాత్రి గడచింది. మర్ణాడు 28 అంతా కరంటులేదు. విడతలుగా వర్షంగాలి కొనసాగేయి. పగలంతా మబ్బులతో సోలార్తో బేటరీ చార్జికాలేదు. రాత్రంతా చీకటిలో గడిపేం. 70 సంవత్సరాల వెనకటి రాత్రులు గుర్తొచ్చాయి. ఊరంతా చిమ్మచీకటిలో ములిగి నిశ్శబ్దంగా గడచింది. ఉదయానికి అనగా 29 ఉదయానికి వార్తలు లేవు. 29 కూడా అడపాదడపా గాలి,వాన కొనసాగేయి. 29 మధ్యాహ్నానికి వార్తలు ఊపందుకున్నాయి. ఆస్థినష్టం ఎక్కువగానే ఉన్నట్టు వార్తలు కనపడ్డాయి. అప్పటికి మరణాల వార్తలు లేవు. పాత తూర్పుగోదావరికి ఎక్కువనష్టం జరిగింది. నరసాపురానికి నష్టం వివరాలు తెలియలేదు. తుఫాను నరసాపురం-అంతర్వేది మధ్య తీరందాటినట్టువార్త. తుఫాను బహునెమ్మదిగా మమ్మల్ని వదలి వెళ్ళలేని బంధువులా 8 గంటల సమయం తీసుకుని తీరందాటింది.  ఆ తరవాత వర్షం గాలి కొనసాగేయి.  ఇంతగాలి వానలోకూడా కరంటువారు పనిచేసి 28 సాయంత్రానికే కరంటు ఇవ్వాలని ప్రయత్నం చేసినట్టుందిగాని జరగలేదు. 29 ఉదయానికి కొన్ని ప్రాంతాలకి ఇచ్చారు. దానిమీద కరంటువారిపై నిందలు వేసేరు. ఆ తరవాత ఎందుకొచ్చినగొడవని అందరికి ఇచ్చేసేరు. పావుగంటకి ఒకసారి కరంటుపోవడం మొదలయింది. LI గారు ఫోన్ లో దొరికితే అడిగేం,ఇలా జరుగుతోందేమని. ఆయన వాపోయారిలా,ఒక్కో ప్రాంతానికి కరంటు ఇచ్చి,గంట తరవాత మరొక ప్రాంతానికి ఇవ్వాలని ప్రయత్నం చేశేం.మా మీదనింద వేసేరు అందుకు ఒకసారే ఇచ్చేసేం. ఓవర్ లోడ్ అవుతుండటంతో జరుగుతున్నది. ప్రతిసారి అవస్థపడుతున్నాం.  ఎంతమండికి చెప్పగలం?. మాకు 29న కొంత సూర్యుడు కనపడటంతో సోలార్తో బేటరీ ఛార్జీయి కొంత వెసులుబాటొచ్చింది. 29 రాత్రికి నిలబాటుగా కరంటు వుంది. ఇటువంటి సమయంలో రాత్రి పగలు అనక కష్టపడి కరంటు ఇవ్వాలనే తపనతో పనిచేసేవారిపై అభాండాలు వేయడం తగనిది. 


ఈ పరిస్థితులలో చేలు ఎలా ఉన్నాయి, కనుక్కోలేదు.  29 న కనుక్కుంటే వర్షానికి చేలన్నీ ములిగిపోయి ఉన్నాయి. నీరు లాగటం లేదు. ఊళ్ళూ, కోళ్ళూ ఏకమైపోయాయన్నాడు.  నీరులాగే స్థితి కూడా లేదు. పున్నమికి దగ్గరలో కనక సముద్రం పోటు మీద ఉంది, కోళ్ళు గట్లొరిసి పారుతున్నాయి. మూడురోజుల్లో నీరు లాగితే పంట కొంత నష్టంతో కళ్ళచూడచ్చు. లేదంటే చేలు కుళ్ళిపోతాయి,ధాన్యం పనికి రావన్నాడు అబ్బాయి. ఇంత సమయంలో కూడా కొందరు,పడిపోయిన చేలలో దిగి కర్రముక్కలు గుచ్చుకుంటూ పడిపోయిన,నీళ్ళలోని వరిని ఎత్తి కర్రకి కట్టే పని చేస్తున్నారు,ఆశ చావక. 


నీటిలో నానినధాన్యం ఏమవుతుంది,తెలియనివారికోసం. 

కొద్దికాలం నానితే బియ్యం రంగుమారుతుంది, ఒకప్పుడు ఎరుపుకు మారుతుంది,ఒకప్పుడు నల్ల చారలు ఏర్పడతాయి. దీన్నే పాయపడిందంటారు మా పల్లీయులు. పాయపడ్ద బియ్యం కొనరు. తడిసిన ధాన్యంతో రైతు వెతలు ఒక పెద్ద గ్రంధం. కొనేవాడు ఆరబోసే తెస్తే కొంటానంటాడు, ఎవరైనా, లేకపోతే పచ్చి ఉబ్బడాలు ఉప్పు డు బియ్యానికి కాని పనికిరావు  ,ఉప్పుడు బియ్యానికి గర్నమెంటు  ఆర్డర్లేదు అంటూ రేటు తగ్గించేస్తాడు. ఆరబోదామంటే చోటులేదు,మరోపక్క వర్షం ఏమో చెప్పలేం.    ఇలా అవస్థలు ఉంటాయి.   చంద్రబాబు అన్ని పంటల నష్టానికీ పరిహారం బాగానే ప్రకటించి నట్టుంది. అది రైతు చేరడంలో ఎన్నితిరకాసులు ఉంటాయో చెప్పడం తేలిక కాదు. ఎంతకాలం పడుతుందో చెప్పడం మరంత తేలిక కాదు.      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి