Saturday, 7 January 2023

వేలం వెర్రి

 వేలం వెర్రి


అనగనగా ఒక రాజ్యం, దానికో రాజు, మంత్రి. రాజుకో అనుమానం వచ్చి మంత్రిని అడిగాడిలా వేలం వెర్రి అంటే ఏంటీ? అని. దానికి మంత్రి రకరకాలుగా చెప్పేడుగాని రాజుకి సంతృప్తి కాలేదు. రాజా మీకో అనుభవం ద్వారా తెలియ జేస్తాను, నేను చెప్పినట్టు చేయాలని షరతు పెట్టేడు, రాజు ఒప్పుకున్నాడు. 


మరునాడు ఉదయమే రాజ అంగరక్షకులకు గుళ్ళు గీయించి కాషాయం కట్టించాడు, వస్త్రాలలో ఆయుధాలు దాచుకునేలా చేశాడు. రాజా మీరు కూడా సన్యాసిలా తయారవాలని చెప్పి గుండు గీయించి,కాషాయం కట్టించి, రహస్య సొరంగం ద్వారా ఊరికి ఒక పక్క ఉన్న ఆలయానికి చేర్చి, నెమ్మదిగా అడుగులేసుకుంటూ పట్టణం అవతలి వైపు ఆలయానికి చేరండి. ఇలా చేరడానికి సాయంత్రం అవుతుంది, అప్పుడు ఎవరూ చూడకుండా అక్కడి రహస్య సొరంగం ద్వారా కోటకి చేరమని చెప్పి పంపించాడు. 


రాజు సన్యాసి వేషంలో అంగరక్షకులు శిష్యుల వేషంలో నగరం వైపు నడుస్తున్నారు. సన్యాసిని చూసిన కొంతమంది నమస్కారం చేస్తున్నారు.పట్టణం దగ్గర పడుతుండగా నమస్కారాలు పెరిగాయి, నడక మందగించింది. ఈలోగా ఒక ప్రముఖుడు గుర్రం మీద పోతూ, సన్యాసిని చూసి, గుర్రందిగి అడ్డంగా పడుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది చూసిన కొందరు అలాగే చేశారు. పట్టణం మధ్యకి చేరేటప్పటికి మధ్యాహ్నమయింది. ఇక అక్కడి నుంచి, ప్రముఖులు చాలా మంది నడకకి అడ్డంగా సాష్టాంగ నమస్కారం చేయడం మొదలెట్టేరు. జనం విరగ బడ్డారు, నమస్కారాలు చేయడానికి, సన్యాసికి అడుగు తీసి అడుగు వేయడం కష్టమయింది. సూర్యాస్తమయానికి చచ్చిచెడి పట్టణం మరో వైపు గుడి చేరి,రాత్రికి కోట చేరేరు. మరునాడు ఉదయం మంత్రి అర్ధమయిందా రాజావారు అని అడుగగా, మన దేశంలో సన్యాసులకి ఇలా అడుగడుగునా నమస్కారాలు చేయడం కొత్త కాదని, చెప్పేడు. రాజుకి ప్రత్యక్షంగా అనుభవ చూపినా తెలియకపోవడంతో మరో ప్రయత్నం చేస్తానన్నాడు, మంత్రి.


మరునాడు ఉదయానికి పగటి వేషగాళ్ళ ద్వారా రాజుకి అంగరక్షకులకి ఈ సారి గడ్డాలు మీసాలు, బవిరి జుట్టూ ఏర్పాటు చేసి, మరల రహస్య సొరంగంలో నుంచి పట్టణం చివరికి చేర్చి, ఈ సారి రాజునూ భటులనూ పట్టణం మధ్య రావి చెట్టు కింద తీనెపై కూచోవలసినదిగా చెప్పేడు. అలాగే రాజు పట్టణ మధ్య రావి చెట్టు చేరి, తీనె పై కూర్చున్నాడు, శిష్యులు చుట్టూ చేరి నిలిచారు. నమస్కారాలు పెడుతున్నారు ప్రజలు, శిష్యులు, ప్రజలని వరసలో పంపుతున్నారు స్వాములదగ్గరికి, ఇంతలో ఒక ప్రముఖుడు గుర్రం దిగి స్వామి   దగ్గరకొచ్చి  నమస్కారం చేసి, స్వామి  తలపై  ఒక వెంట్రుక పేకి కళ్ళకద్దుకుని పట్టుకుపోయాడు. ఆ తరవాత నుంచి అందరూ స్వామి తలపై ఒక వెంట్రుకా పీకుతూ, నమస్కారం చేస్తూ వెళుతున్నారు, ఇది స్వామి వేషం లో ఉన్న రాజుకి వింతగానే తోచింది, కాని ఏమీ  చేయలేక  బలవంతంగా కూచున్నాడు, సాయంత్రం దాకా. చివరికి సాయంత్రం అయింది.రాజు తలపై వెంట్రుకలూ పల్చబడ్డాయి, కాని జనం మిగిలిపోయారు, ఇప్పుడు శిష్యులు కలగజేసుకుని స్వామి నేటికి విశ్రమిస్తారు, రేపు రండని ప్రజలని పంపించి, ఊరి చివరి గుడి సొరంగం ద్వారా కోటకి చేరుకున్నారు. 


మర్నాడు మంత్రి కలిస్తే, ప్రజలు వెంట్రుకలెందుకు పీకారని, అడిగాడు.దానికి మంత్రి, రాజా! మొన్న మీకు నమస్కారాలు ప్రముఖుల సాస్టాంగ నమస్కారాలు నేను ఏర్పాటు చేసినవే! అప్పటిదాకా నమస్కారాలు పెట్టిన ప్రజలు, ప్రముఖులు సాస్టాంగ నమస్కారం చేస్తే ప్రజలూ అలాగే చేసేరు, తమరు అడుగు కదపడమే కష్టమయిందికదా! ఇక నిన్న కూడా నమస్కారాలతో మొదలయింది. ప్రముఖులు మీ తలపై వెంట్రుక పీకి కళ్ళకద్దుకుని
 నమస్కారం చేస్తే అంతా అలాగే చేసేరు. ఇదే వేలం వెర్రి అంటే! ఆ ప్రముఖుడు ఎందుకు చేశాడలా? ఎవరూ ఆలోచించలేదు.ఆలోచించరు కూడా! ఆ ప్రముఖుడు అలా వెంట్రుకపీకి భద్రపరచుకుంటే మంచి జరుగుతుందని ప్రజలకి ఒక సందేశం ఇచ్చినట్టయింది, ప్రజలు విరగబడ్డారు.

అంటూ రాజా! మీకిది తెలియనిదా! భగవానుడు చెప్పినమాట, చిత్తగించండని ఈ శ్లోకం చెప్పేడు.

యద్యాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే…భగద్గీత…అధ్యా..౩..శ్లో..21

మహనీయుడైన వ్యక్తి ఏ కార్యము చేయునో వానిని సామాన్యులు కూడ అనుసరింతురు. ఆదర్శ ప్రాయములయిన కార్యములచే అతడే ప్రమాణములను స్వీకరించునో ప్రపంచమంతయు వానిని అనుసరించును.


నేటి మన సమాజం అలా లేదా?


23 comments:

  1. సూపర్ డూపర్ :)

    యద్యదా "హరతి" శ్రేష్టః
    తదేవ ఇతరో జనాని స్వాహా :)

    ReplyDelete
    Replies
    1. Anonymous7 January 2023 at 12:53
      ధన్యవాదాలు.

      Delete
  2. వేలంవెర్రి కథ బాగుంది కాని చివర్న దానికి భగవద్గీత శ్లోకం అన్వయించడం సబబుగాలేదు అనిపిస్తోంది. వేలంవెర్రి విషయంలో మొదట పని చేసినవాడు మహనీయుడు అయి ఉండక్కర్లేదు. మిగతా జనాలు (మూర్ఖులు కాబట్టి) వాడు చేసిన పని వాళ్ళు కూడా (ఆలోచించకుండా) చేస్తున్నారు. BTW, "వెర్రి" కరెక్టా లేక "వెఱ్ఱి" కరెక్టా?

    ReplyDelete
    Replies
    1. "వెర్రి" కరెక్టా లేక "వెఱ్ఱి" కరెక్టా?" అంటే "వెఱ్ఱి" అన్న వర్ణక్రమమే‌ సరైనది. నిజానికి 'ర్ర' అన్నది ఎప్పుడూ సరైనది కాదు. ఎప్పుడూ 'ఱ్ఱ' అనే వ్రాయాలి. కాని ఈవిషయం ఎక్కువమందికి గమనికలో లేదు. పైగా కొందరు గొప్పగా 'ఱ' అనే అక్షరాన్ని తెలుగు వర్ణమాలలో నుండి తీసివేసాం అంటారు వాళ్ళకేదో అధికారం ఇచ్చినట్లు!

      Delete

    2. కాంత్8 January 2023 at 05:57
      //వేలంవెర్రి కథ బాగుంది//
      ధన్యవాదాలు.
      //భగవద్గీత శ్లోకం అన్వయించడం సబబుగాలేదు అనిపిస్తోంది//
      లోకోభిన్న రుచిః, మీ అభిప్రాయం మీది.
      //వేలంవెర్రి విషయంలో మొదట పని చేసినవాడు మహనీయుడు అయి ఉండక్కర్లేదు. మిగతా జనాలు (మూర్ఖులు కాబట్టి) వాడు చేసిన పని వాళ్ళు కూడా (ఆలోచించకుండా) చేస్తున్నారు//
      వేలం వెఱ్ఱిని వ్యాపారవర్గాలు అర్ధం చేసుకున్నట్టు ఎవరూ అర్ధం చేసుకోలేదని నా మాట. మొదట చేసిన వాడు గొప్పవాడే కానక్కరలేదు. కాని ఓ తార/తారడు ఉపయోగిస్తున్నానన్న టూత్ పేస్టు కొంటున్నారు కాని ప్రకటన లేని పళ్ళపొడి మంచిది అన్నీ శరీరానికి మంచి చేసేవి ఉన్నదాన్ని కొనటం లేదు. లోకల్ వ్యాపారి దాన్ని తెప్పించడు, (true)కారణం లాభం లేదు, లేదా తక్కువ. దీన్నేమంటారు?ఆలోచన లేక చేసేది కనకే వేలం వెఱ్ఱి అన్నారు.సామాన్యులని మూర్ఖులు అనలేను, ఆలోచన చేయనివారనే అంటాను.విన్నకోటవారు చెప్పిన కధలో రాయలు మూర్ఖుడా? ఆ సమయానికి ఆలోచించలేదంతే!
      వెర్రి కాదు వెఱ్ఱి సాధువు(కరక్టు)ర్ర లేదు దాన్ని ఱ్ఱ గా రాయాలి.కాని చాలా కాలంగా ఱ ని వాడటం లేదు. కాని చాలా చోట్ల అవసరమే ఆ పదాలని కూడా రాయటం లేదు ఏఱుక అని రాయాలి కాని ఎరుక అనే రాస్తున్నారు,రాస్తున్నారనకూడదు వ్రాస్తున్నారనాలి కాని ఇలా జరిగిపోతోంది.మరో మాట నీరు అంటే ఉదకం నీఱు అంటే బూడిద ఇటువంటి మాటల వాడకమే లేదు. ఇది పెద్దలు చేస్తున్నారు కనక నేనూ చేస్తున్నా! మరిది కూడా వేలం వెఱ్రే గా!

      Delete

    3. Anonymous8 January 2023 at 09:59
      వర్ణక్రమం అంటే ఏంటని అడిగే రోజులు సార్!మీరన్నది నిజమే పై కామెంట్లో చెప్పినది దయచేసి చూడగలరు.కొద్ది రోజుల్లో ప్రపంచంలో రెండే రెండు భాషలు మిగులుతాయ అవి, ఇంగ్లీషు, మాండరిన్ అని శలవిచ్చారొకరు. జనాలని మానసికంగా తయారు చేస్తున్నట్టే!కాలంతో పాటే మనమూ!!!!

      Delete
    4. >> .కొద్ది రోజుల్లో ప్రపంచంలో రెండే రెండు భాషలు మిగులుతాయని ...
      ఒప్పుకోనండీ. కొద్దిరోజులు కాదు కానీ కొద్దిసంవత్సరాలు అనుకుంటాను. ఏభాషా మిగలదు. ఎందుకంటే అసలు అప్పుడు జరిగే మారణహోమంలో మానవాళి అంటూ‌ మిగలదు కదా. మానవజతి జరిపిన విధ్వంసాన్నుండి కోలుకొని భూమి మరలా క్రమంగా పచ్చబడుతుంది.

      Delete
    5. Paper By: Xavier Castello, Lucia Loureiro - Porto , Ritta Toivonen , J. Saramaki and K. Kaski (page 59): ప్రపంచం లో చాలా సమాజాలలో రెండు మూడు భాషలు ప్రాచూర్యంలో ఉన్నవి కానీ వాటి భవిష్యత్ ఎట్లావుంటుందో చెప్పటం కష్టం. ఇప్పుడు ప్రపంచం లో ఉన్న దాదాపు 6000 భాషల భవిష్యత్తు ప్రశ్నార్ధకము. వీటిలో 50% ఈ శతాబ్దంలో మాయ మవుతాయి. దీనికి కారణము ప్రపంచంలో ప్రజల భాషల వాడుక సమానత్వం లేదు. ఎందుకంటే 96% ప్రజలలో వాడుకలో 4% భాషలే ఉన్నాయి. అందులో 25% భాషలు మాట్లాడే వాళ్ళు 1000 మంది కూడా లేరు. కొన్ని కొత్త భాషలు రావటానికి ప్రయత్నిస్తున్నాయి కానీ అంతరించే భాషలతో పోలిస్తే అవి చాల తక్కువ.
      సియాటిల్ ఇంటిలో పుస్తకాల కోసం వెతుకుతుంటే "The Evolution of Language" అనే పుస్తకం దొరికింది. పెద్ద పుస్తకం. చదవటానికి ఉపక్రమించాను. ఇది March 2008 లో బార్సిలోనా, స్పెయిన్ లో జరిగిన "Evolution of Language " కాన్ఫ రెన్స్ లో సమర్పించిన పరిశోధనా పత్రాల సంకలనం.

      Delete
    6. Rao S Lakkaraju9 January 2023 at 19:35
      తెనుగు భాష మాటాడేవారు దగ్గరగా పది కోట్లు ఐనా భాష ఇలా ఐపోవడానికి కారణాలేమిటో? పరభాషా మోహమా? అర్ధం కాదు.

      Delete
  3. వేలంవెర్రి గురించి సన్యాసులు, స్వాముల వేషం కాదు గానీండి నేను విన్నది తెనాలి రామకృష్ణుడి కథ ఒకటుంది (చిన్నప్పుడు “చందమామ” లో చదివాననుకుంటాను).

    వేలంవెర్రి అంటే ఏమిటని ఓసారి రాయలవారు అడిగితే రేపు ఉదయం తమరు మన ఊరి చివరనున్న చెరువు గట్టు దగ్గరకు వస్తే చెబుతాను అంటాడు రామకృష్ణ కవి. మర్నాడు ఉదయం రాయలవారి కన్నా ముందే కవి గారు చెరువు దగ్గరకు చేరుకుని, తలెత్తి ఆకాశం వైపు చూస్తూ నిలబడతాడు - అక్కడ వింతేమీ లేకపోయినా. ఆకాశంలో ఏముంది ఏముంది అనుకుంటూ క్రమంగా బోలెడంత మంది జనం కవి గారి వెనక నిలబడి తలెత్తి ఆకాశం వైపు చూస్తూ నిలబడతారు. రాయలవారు వచ్చేసరికి అదీ సీను. రాయలవారు కూడా ఆకాశం వైపు చూస్తుంటారు. ఇదే ప్రభూ వేలంవెర్రి అంటే అంటాడు తెనాలి రామకృష్ణుడు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు8 January 2023 at 09:06
      మంచి కథ చెప్పేరు. ధన్యవాదాలు.

      Delete
  4. Anonymous8 January 2023 at 09:59: ఇది నేనే నండీ. కామెంట్ చేసేటప్పుడు సరిగా ప్రొఫైల్ సెలెక్ట్ చేయకపోవటం నాపొరపాటు. అందువలన Anonymous ఐపోయాను. మన్నించాలి - శ్యామలీయం.

    ReplyDelete
    Replies

    1. Anonymous8 January 2023 at 09:59
      శ్యామలీయం9 January 2023 at 12:44
      సాధువు, అసాధువు అనుకోకుండా భాషని బతికించుకోవడమే నేటి అవుసరంలా కనపడుతోంది.భాషలో విదేశీ పదాలు అదేపనిగా జొరబడిపోతున్న కాలం. కొన్ని రోజులనడం పొరబాటే, కొంత కాలం కావచ్చు, పట్టచ్చు.ఆ పొరపాటు సహజమైపోయింది లెండీ :) మన్నింపులక్కరలేదు

      Delete
  5. Rao S Lakkaraju10 January 2023 at 11:55
    భాష మాటాడేవాళ్ళు పదికోట్లు పైమాట.నేర్పేవారికీ లోటులేదు.కాని నేర్చుకునేవారెవరూ అన్నదే మాట?

    విదేశాల్లో ఉన్నవారు, మొదటి తరం వారు ఈ భాష సంస్కృతి అని బాధ పడతారు, తరవాతి తరాలుకి అవుసరం లేదు. ఇక్కడ మాట, ఒక తరం అంటే ముఫై ఏళ్ళని లెక్క. ఇప్పుడు కని,పెంచే తల్లులకి తెనుగు పూర్తిగా తెలుసు అనుకోను, పిల్లలకెలా వస్తుంది?నాకు పరాయి భాషలపై కోపం లేదు, నా భాషమీద ప్రేమ అంతే! ఇంగ్లీషులో మాటాడండి, కాదనను,మంచి భాష మాటాడచ్చు, మనం మాటాడేది శశి థరూర్ భాషలా ఉండక్కరలేదు.పూర్తి ఇంగ్లీష్ లో మాటాడచ్చు. తెనుగులో మాటాడండి, పూర్తి తెనుగేవాడండి. మరీ చాదస్తపడక్కరలేదు, రోడ్డు, రైల్ ని కూడా తర్జుమాచేసి. తెనుగు మాటాడుతూ ఇంగ్లీష్ మాటలు చొప్పించేసి భాష సంకరం చెయ్యద్దని నా మనవి. భాష జీవగఱ్ఱ. కర్రన్నా, కఱ్ఱన్నా నాకిష్టమే సుమా! కాని స్టిక్ అంటే నే ......

    ReplyDelete
    Replies
    1. ఆ‌ మధ్యేదో వాకింగ్ స్టిక్ పట్టుకొని నడక మెదలెట్టానన్నట్టున్నారు ? :)

      Delete
    2. Anonymous11 January 2023 at 11:25
      (ఏమనుకోవద్దూ)
      మీరు చెప్పింది నా మోకాలి పొడుక్కి సరిపోదు :) నా దగ్గరెప్పుడూ ఆరడుగుల చేపాటి కర్ర ఉంటుంది. నడిచేటపుడు అడ్డంగానూ, నిలబడేటపుడు నిలువుగానూ పట్టుకుంటాను, ఎందుకో చెప్పండి :) దండం దశ గుణం భవేత్!!! :)

      Delete
    3. ఆ “పాటి” కఱ్ఱ చేతిలో ఉండాలి లెండి 🙂🙂.

      Delete
    4. // “ శశి థరూర్ భాషలా ఉండక్కరలేదు” //
      😁😁 UNO లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈయన మాట్లాడేది తతిమ్మా ఉద్యోగులకు ఏం అర్థమయ్యేదో పాపం?

      తెనుగు భాష పతనం గ్లోబలైజేషన్ తరువాత బాగా వేగవంతం అయిందని నా గట్టి నమ్మకం.

      Delete
    5. విన్నకోట నరసింహా రావు11 January 2023 at 13:32
      విన్నకోట నరసింహా రావు11 January 2023 at 14:02

      పల్లెటూరివాళ్ళం కదండీ! నడిచేటప్పుడు పట్టుకునే కఱ్ఱని ”చేపాటికఱ్ఱ” అంటాం :) చక్కటి తెనుగుమాటుంది కదండీ, ఇంగ్లీషు మాటెందుకంట :)
      మా భాష అంతేనంట :)
      దక్షణ భారతదేశీయులు చక్కటి ఇంగ్లీష్ మాటాడతారు, విన సొంపుగా ఉంటుందట. శశి థరూర్ ని ఒక ఉపమానం చెప్పేనండి.మన చుట్టూ ఉన్న తమిళ్, మలయాలం, కన్నడిగులు ఇద్దరు కలిస్తే వారి భాషలోనే మాటాడుకుంటారు, శత్రువులు కూడా! మరి మనవారు ఇద్దరు మిత్రులు కలిస్తే ఆంగ్లంలో తప్పించి తెనుగులో మాటాడుకోరు, చిత్రం కదా!దెబ్బలాటకి మనవారు ఆంగ్ల భాషకి మారిపోతారు :)
      గ్లోబలైజేషన్ అన్నది ఒక సాకు సుమండీ!

      Delete
    6. చేపాటి కఱ్ఱ అంటే నాకు తెలుసు సారూ. దానికి పల్లెటూరేమిటి, పట్టణమేమిటి? ఎక్కడయినా తెనుగు తెనుగే.

      Delete
    7. ఈ పల్లెటూర్ వాల్లకి అదో తుత్తండి. తాము చేసేదే గొప్పని నగరవాసులకి ఏమీ తెలీదని ఓ పెద్ద అరిందా అభిప్రాయం.

      నిజంగా అదే అయితే గ్రామాలెప్పుడో ముందంజ వేసుండాలి అయిందా ?

      శర్మగారి వూరు విలేజ్ ఎప్పుడో ఒకానొక కాలంలో అయ్యుంటుంది.


      Delete
    8. విన్నకోట నరసింహా రావు11 January 2023 at 18:27
      పల్లెటూరివాళ్ళు వాడే మాటకదా పట్నవాసం వాళ్ళకి అవసరమా అనుకున్నానండీ :)

      Delete
    9. Anonymous11 January 2023 at 19:24
      పల్లెటూరివాళ్ళు వాళ్ళకి ఏం తెలీదనే అనుకుంటాం, మీలా మేధావులం కాదుగా :) తుత్తి మీదే :)
      తెలియనైవాళ్ళం కనకే ముందంజలో లేం :)
      పాతికివేల జనాభా పల్లె కాదూ!

      Delete