Tuesday 31 January 2023

కొడితే ఏడుస్తాడు

 కొడితే ఏడుస్తాడు

చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే/గిల్లితే ఏడుస్తాడు.


ఇదొక నానుడి. విన్నకోటవారి కోరిక మేరకు రాసినది

చాదస్తం అంటే    చెప్పినదే  చెప్పడం చేసినదే మళ్ళీ మళ్ళీ చేసామా లేదా అని చూసుకోడంగానూ చివరికి అడుసులో కాలెయ్యడం గానూ చెబుతారు.కొడితే ఏడుస్తాడని పల్లెటూరివాళ్ళం అంటాం, నాగరీకులు మాత్రం గిల్లితే ఏడుస్తాడంటారు.

దీనికేంగాని, చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెబుతా! 

ఆయనో కలిగినమారాజు,ఆరడుగుల ఎత్తున కోటలాటి ఇంటి యజమాని, మా తాతగారి దగ్గరే కొన్నాడట ఆ ఇల్లు కూడా! మా తాత తవ్వించి ఊరివారికిచ్చిన నుయ్యీ ఆ స్థలంలో ఉంది,నేటికీ. నుయ్యున్న మారాజు గనక ఇంటి పేరు నూతి చేసేసేరు, ప్రజలు. ఈయన తొండం లేని నల్లరాతి వినాయకుడి విగ్రహంలా ఉండేవాడు, ఈయన భార్య గెడకర్రకి చీరకట్టినట్టుండేది. వీరిద్దరు ఎప్పుడూ దెబ్బలాడు కుంటున్నట్టే ఉండేది. ఎప్పుడు ఏకీభావానికొచ్చారోగాని ఒక కూతురు పుట్టింది. ఆమెకి పెళ్ళి చేసాడు ఊళ్ళోనే. అత్తారింటికెళ్ళిపోయింది. కోటలాటి ఇంట్లో ఇద్దరు లింగూ లిటుకూ మంటూ. ఈయన అరుగు మీద కూచునేవాడు, ఆమెలోపల వంట చేసుకునేది. వంట చేస్తూ పెద్దనోటితో సాధిస్తూ ఉండేది, ఇక్కడినుంచి ఈయన ''నేనేమన్నానే'' అని అంటుండేవాడు. ఇదొక ముచ్చటగా ఉండేది చూసేవారికి. ఇదెంతదాకా అంటే మా ఇళ్ళలో ఎవరేనా ''నేనేమన్నానే'' అంటే నూతి.........లాగా అదేంటిరా అనేదాకా! 


ఓ రోజు ఉండబట్టలేక ఆయన్నే అడిగేసా! ఆవిణ్ణి అడిగే దమ్ములేక! ''మావా! ఏంటిది? అత్త అలా లోపల్నించి తిడుతూ ఉంటుంది, నువ్వేమో చిద్విలాసంగా 'నేనేమన్నానే' అంటావు, దీని తిరకాసేంటీ?'' అని. నవ్వేడు! ఒరే! ఇంతకాలం ఎవరూ నన్నీ ప్రశ్న వేయలేదురా! నేటికాలానికి నువ్వడిగేవు, చెబుతా విను ఇది రహస్యం, నీకిప్పడు అర్ధంకాదు, వయసురావాలి,'' అన్నాడు. సరే చెప్పు అన్నా! 


''నాకా చేసేపని లేదు, అమ్మాయి కాపరానికెళ్ళిపోయింది, అత్త వంట చేస్తూ ఉంటుంది, లోపల. ఇల్లు చూస్తే లంకంత, మామూలుమాట వినపడదు, అందుకు అత్త ఏదో ఒక వంకని సాధిస్తూ ఉంటుంది, నాకిదే బాగుంది, ఎందుకంటే లోపల ఆవిడెలా ఉన్నదీ తెలియాలంటే మాటాడాలికదా! మాటాడ్డానికి కారణం కావాలికదా! అందుకే ఏదో ఒక వంకని తగువు, మరి నేను ఇక్కడే ఉన్నట్టు ఆవిడకి తెలియడమెలా? అందుకే నేను నేనేమన్నానే అనే అంటూ ఉంటా'' అని గుట్టు విప్పేసేడు.

ఇక నేటి కాలానికొస్తే ఇటువంటి మొగుడో భోళా శంకరుడు,ఎవరికి ఏదీ కాదనలేడు. ఆవిడే సీడు బ్రేకరు, వెనకనుంచి గిల్లుతూ ఉంటుంది. ఒరే మీమావ చెప్పేవన్నీ నిజాలనుకోకూ! ఏం జరగవంటూ ఉంటుంది. ఈయన గాలి తీసేసినందుకు నవ్వుతూ ఉంటాడు. ఇదొక లాలూచీ కుస్తీ!!!

తిక్క మొగుడుతో తీర్థానికెడితే తిప్పి తిప్పి చంపేడు! మరో నానుడి, కత చెప్పండి.


4 comments:

  1. Replies
    1. విన్నకోట నరసింహా రావు31 January 2023 at 15:38
      విన్నకోట నరసింహా రావు31 January 2023 at 20:13
      ధన్యవాదాలు సార్!
      జిలేబి గురించిన కామెంట్ ఎక్కువమంది చూడాలని ఎవరికి తెలిసినది వారు చెబుతారని ఆలస్యం చేసానండి.

      Delete
  2. తిక్క మొగుడుతో తీర్థానికెడితే...

    మీరేచెప్పాలండి

    ReplyDelete