Tuesday, 10 January 2023

కేలండరు

 కేలండరు


కొత్త సంవత్సరం రాకుండానే కేలండర్ల కోసం పోటీ పడటం ఒకప్పటి మాట. ఒకప్పుడు కేలండర్ అంటే వేంకట్రామా అండు కో వారిది, వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం, చింతలూరు వారివే గుర్తొస్తాయి. 

పంచాంగం ఉన్నకేలండరు కే క్రేజు, నిత్య వ్యవహారంలో కేలండరే, ఎప్పుడో గాని పంచాంగం పట్టుకుని తిథి,వార,నక్షత్రాలూ చూసి మిగతావాటికోసం చూసేది.

 ఆ తరవాత కాలంలో తారల బొమ్మలతో కేలండర్లు ప్రజల్లో కొచ్చాయి. కంపెనీలు కేలండర్లేసి పంచిపెట్టి ప్రచారం చేసుకునే రోజులవి. ఆ తరవాత రోజుల్లో టూ పీస్ బికినీ భామల ఫోటోలతో కేలండర్లకి పెద్ద మోజు, కాదు క్రేజు అంటాడు మా సుబ్బరాజు. అవి వేసి మట్టిగొట్టుకుపోయాడులే మల్లయ్య అంటాడు మా సత్తిబాబు. ఆడేం మట్టిగొట్టుకుపోలేదు, దేశమేనష్టపోయిందంటాడు మా సుబ్బరాజు. ఇదెంతకీ తేలని చర్చే అయిపోయింది. ఆడతారల ఫోటోలతో కేలండర్లే ఎక్కువ, మగ తారలవి తక్కువే, అందులోనూ ఆడతారలవి రెచ్చగొట్టే భంగిమల్లో కేలండర్లకి మరీ మోజు. సమానత్వం కావాలని స్త్రీ వాదులెందుకు అడగరో అర్ధం కాదు! 


ఇలా నడిచిపోతున్న కాలంలో తిరుపతి వేంకన్న బాబు కూడా కేలండర్లేయడం మొదలెట్టేడు. ఈ కేలండరు కొన్నుక్కోవాలిట.అయినా దొరకడం కష్టమే! మేమేం తక్కువ తినలేదని ప్రభుత్వ రంగ బేంకులూ కేలండర్లేయడం మొదలెట్టేయి. ఇవీ దొరకవు, ఎవరో నోరున్నవారికి తప్పించి.

ఇలా ఉండగా తెనుగునాట కేలండరూ అంటే వేంకట్రామా అండుకోవారిది, వేంకటేశ్వర ఆయుర్వేదనిలయం చింతలూరు వారిది అనుకున్నాం కదూ! ఏ కేలండరు వచ్చినా రాకపోయినా ఈ రెండు కేలండర్లూ తప్పక వచ్చేవి, చిన్నప్పటినుంచీ ఎరుగుదును.వేంకట్రామా అండుకో వారిది నిలువుగానూ చింతలూరు వారి కేలండరు అడ్డంగానూ వుండేవి, ఇప్పటికి అలాగే ఉన్నాయి కూడా. చాలా కాలం ఈ రెండు కేలండర్లూ రాలేదు. మొన్ననే మళ్ళీ మొదలుగా వేంకట్రామా అండుకో కేలండరు గోడకి ఎక్కింది. చిన్నప్పుడు ఈ కంపెనీ మీదో చిన్న పేరడీ కూడా ఇలా!


వేంకట్రామా అండుకో!

తవ్విడు బియ్యం వండుకో!!

దొబ్బితిని పండుకో!!!    


2 comments:

  1. // “ ఆడేం మట్టిగొట్టుకుపోలేదు, దేశమేనష్టపోయిందంటాడు మా సుబ్బరాజు.” //

    మీ సుబ్బరాజు గారు సూపరండీ 👌.

    ప్రభుత్వరంగ బ్యాంకులు వేయించే కాలెండర్లలో బొమ్మలుండవు శర్మ గారు. ఇటీవల కాలంలో ఏమన్నా మారిందేమో తెలియదు.

    కాలెండరులందు “వేంకట్రామా అండ్ కో” వారి కాలెండరే శ్రేష్ఠమయా అనాల్సిందే. తెలుగువారి జీవితాల్లో ఒక భాగం గా స్ధిరపడి పోయింది 🙏.

    ReplyDelete
  2. విన్నకోట నరసింహా రావు10 January 2023 at 15:35
    పల్లెటూరోళ్ళం కదండీ ఉన్నమాట మొహమ్మీదనేస్తాం! అంతే!!
    ప్రభుత్వరంగ బేంకులు వేసే కేలండర్లలో బొమ్మలుండవండి,ఐనా 60 ఏళ్ళుగా ఉన్న బేంక్ కస్టమర్ కి కూడా చేరవు. అదీ వారి గొప్ప సారూ

    ReplyDelete