Sunday 29 January 2023

చేతకాని మొగుడు కంటే

 చేతకాని మొగుడు కంటే చెడ్డ మొగుడు మేలు.

ఇదొక నానుడి

మొగుడు గురించి పెళ్ళానికంటే బాగా చెప్పగలవారు మరొకరుండరు. మొగుడు మగాడితనం  పెళ్ళానికి కాక మరొకరికి తెలిసే సావకాశం తక్కువ.  మొగుడు ఎంత మొనగాడో మొదటి మూడు రోజుల్లోనే చెప్పగలదు, పెళ్ళాం. ''చేతకాని మగడు మంచానికి అడ్డని'' ఒక నానుడి.

చేతకాని తనానికి నిర్వచనం చెప్పడం తేలికైన పనికాదు. చేయవలసిన పని,  చేయవలసిన సమయంలొ, పలకవలసిన మాట పలకవలసిన‌ సమయంలో పలకక పోవడమే, చేయక‌/చేయలేకపోవడమే చేతకాని తనం. ఇటువంటివానితో సంసారం చేయడం నరక ప్రాయమని అతివలంటారు, నిజం కూడా. వీటికి మూర్ఖత్వం అదనమై ఉంటుంది, తెలివితక్కువ జోడింపు.


ఇక చెడ్డ మగడంటే తెలివైనవాడేగాని మూర్ఖత్వంలో తీసిపోడు. ''మంచం మీదున్నంతసేపు మొగుడేగాని దిగితే యముడ''న్న‌ నానుడికి తీసిపోడు. చెప్పిన మాట వినిపించుకోడు,కాదు వినడు. ఇటువంటి మగనితోనూ కాపరం నరకమేనంటారు, అతివలు.


చేతకాని మగనికంటే చెడ్డమగడెలా మేలన్నదికదా ప్రశ్న.  చేతకానిమగడు,చెడ్డమగడూ కూడా చెప్పినమాట వినరు. కాని చెడ్డమగడు, చెప్పగా చెప్పగా ఎప్పటికైనా వినే సావకాశం ఉంది. చేతకాని మగడు విన్నా ఉపయోగం లేదు,ఏమీ చేయలేడు గనక. చెడ్డమగడు పెళ్ళాం మాట వినడం మొదలెడితే ఆ సంసారం స్వర్గమే!!!

అందుకని చేతకాని మగనికంటే చెడ్డమగడే మేలు.

2 comments:

  1. మీరు దీని గురించి కూడా వ్రాస్తే బాగుంటుంది 🙂👇.
    (1). చాదస్తపు మొగుడు చెబితే వినడు,
    గిల్లితే ఏడుస్తాడు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు29 January 2023 at 21:49
      అలాగే సార్!

      Delete