Tuesday, 3 January 2023

భజన.

 భజన.

రామన్నరాముడోయ్! రాంభజన! రాముడొస్తున్నాడు రాంభజన!

 భజన అంటే రామభజన అనే అర్ధం చిరకాలంగా! కాని కాలంలో మార్పులొచ్చాయనుకోండీ!

ఒకప్పుడు పల్లెలలో కాలక్షేపం అంటే భజనే, అది కూడా సంవత్సరంలో ఆశ్వయుజం నుంచి జ్యేష్ఠం చివరదాకానే.భజనకి మొదటి మెట్టు 

హరేరామ హరేరామ 

రామరామ హరేహరే 

హరేకృష్ణ హరేకృష్ణ 

కృష్ణకృష్ణ హరేహరే

దీన్ని ఎలాపలికినా తొందరగాపలకడమే, నామసంకీర్తన చేయడమే లక్ష్యం. భజనచేసేవారంతా ఆరోజుల్లో నిరక్షరాస్యులే! భజనబృందం అంటే పదినుంచి ఇరవై మంది ఉండేవారు, వీరిలో కొందరు ఆడవారుండేవారు, శ్రావ్యంగా పాడగలవారుంటే ఆ బృందానికి అదనపు ఆకర్షణ. ఆ కాలంలో కొన్ని, సానుల భజనబృందాలూ ఉండేవి, వీరి భజనపాళీ అంటే జనానికి మరీ మక్కువ.   

ప్రతి బృందానికో గురువు, ఒక పేరు.బాలభక్త భజనబృందం, భక్తాంజనేయ భజన బృందం, ఇలా. వీళ్ళు ప్రతి పదేనురోజులకి ఒక సారి, ఏకాదశి అనుకోండి! ఉదయమే స్నానం ముగించుకుని రామాలయంలో చేరేవారు భజనకి, ఉపవాసం కూడా. భజనకి కావలసినవి తాళాలు. తాళాలు కంచువి ఎవరివి వారు కొనుక్కునేవారు, కొంతకాలం, ఆ తరవాత ధర్మాత్ములు తాళాలు కొనిపెట్టేవారు భజన బృందానికి 

భజన ఇలామొదలెట్టేవారు.

సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రప్రభువుకీ జై తో ప్రారంభించి, అందరు దేవుళ్ళు దేవతలకి జై చెప్పి గ్రామదేవతకి జై చెప్పి, చివరగా తమ గురువుకి జై చెప్పి భక్తబృందం పేరు చెప్పుకుని జైకొట్టేవారు ఆ తరవాత భజన మొదలయ్యేది. ఈ భజన మరుసటి రోజు ఉదయం దాకా కొనసాగేది, ద్వాదశి ఘడియలదాకా.  ఇలా నిష్ఠగా భజన చేసేవారికి ఫలహారాలు,   మిరియాల పానకం, మిరియాలపాలు , రాత్రికి టీ కొంతమంది పెద్దలు అందించేవారు. వీరి  పేరూ చెప్పుకుని జై కొట్టేవారు. భజన అంటే నామ సంకీర్తన. హరేరామ హరేరామ అని ఒకరనేవారు(లీడ్)తాళం వేస్తూ, ఆ వెనక అందరూ అదే అనేవారు, తాళం వేస్తూ, లేదా రామరామ హరేహరే అనేవారు. ఇలా ఈమాటలు పదేపదే అంటూ తారస్థాయికి చేరేది, ఒక్క సారిగా మెల్లని స్థాయికి చేరేది, ఆ తరవాత మళ్ళీ ఉధృతంగా కొనసాగేది. ఇలా మార్చి,మార్చి నామ సంకీర్తన జరుగుతుండేది.చెప్పడం కష్టం,  భజన వినాలి అంతే!   ఆ తరవాత కాలంలో తరంగాలు,కీర్తనలు కూడా చోటు చేసుకున్నాయి. వీటికి కొన్ని ఇబ్బందులూ ఉండేవి. ఒక మాట చెబుతా!వ్యత్యస్త పాదారవింద,విశ్వవందిత ముకుంద , పలకడం తొందరగా కష్టం. భజనకి మరీ కష్టం, అందుకు గాను ఎవరో గురువులు దానిని సరళం చేసి రెండవపాదం మార్చేశారు, విశ్వవందిత ముకుంద బదులు, ఇందిరా హృదాయానందగా, ఇలా చాలాచాలా మార్పులూ ఉండేవి. లక్ష్యం మాత్రం నామ సంకీర్తన.   

కాలం గడిచింది.మైక్ లు  రంగప్రవేశం చేశాయి.దీంతో భజనకి మోజు పెరిగింది, ప్రజలలో.కొన్ని బృందాలు చాలా బాగ భజన చేయగలవనే పేరూ పడిపోయాయి. కాఫీ హొటల్, రైస్ మిల్లు, ఇలా ప్రారంభాలకి భజనపాళీ పెట్టడం అలవాటయింది. ఇది సమాజంలో ఎంతగా చొచ్చుకు పోయిందంటే, గండం గడిస్తే భజన చేయిస్తానని మొక్కుకునేదాకా! ఆ రోజుల్లోనే  అంటే అరవై ఏళ్ళ కితం,  ఇలా పిలుపు (పైడ్) భజనలకి, బృందానికి రోజుకి, 20 మంది బృందానికి ఖర్చులు పెట్టుకుని  200 దాకా ఇచ్చేవారంటే..... ఈ భజన ఒకరోజు, ఆ తరవాత కాలంలో సప్తాహం, ఎడతెరపిలేక రాత్రీపగలూ, విడతలమీద భజన చేసేవారు. ఇక సప్త సప్తాహం అంటే నలభైతొమ్మిది రోజులు రాత్రీ పగలూ తేడా లేక భజన కొనసాగించేవారు. ఈ రోజుల్లో భజన చేసేవారి అన్నపాన ఖర్చులు, వేతనాలూ కొందరు భరించేవారు. ఇలా భజన సమాజంలో ఊడలు దిగిపోయింది. 

  ఈ  భజన అలవాటు నెమ్మదిగా  కాంగ్రెస్  రాజకీయులకి చేరింది, నాటి కాలంలో ఎక్కువమంది రాజకీయులు పల్లెటూరివాళ్ళుగనక. కొంతమంది నాటి కాలంలో రాజకీయ ప్రచారానికి కూడా భజన బృందాలని నియమించుకునేవారు.  రాజకీయులనుంచి   భజన  విలేఖరులకీ చేరింది, పత్రికలకి చేరింది,రూపు మార్చుకుంది.  పత్రికలకి పండగే వచ్చింది

 ఆ తరవాత కాలంలో ఆల్ ఇండియా రేడియోవారికీ చేరింది. ఒకప్పుడు ఆలిండియా రేడియో వారిని ఆలిందిరా రేడియో అని సరదగా అనుకునేవారు.  

నెహ్రూ కాలం నుంచి భజన రాజకీయాల్లో ఉన్నా, ఇందిరకాలంలోనే అది పరాకాష్టకి చేరిందంటారు, కిట్టనివాళ్ళు.భజనచేసే విధము తెలియండీ! జనులార 

   మీరు   చేరి/కోరి మొక్కితె బతుకనేర్చేరు!అన్నది నాటికీ నేటికీ సత్యం అంటున్నారు. నేటికీ కుహనా గాంధీ కుటుంబానికి భజన చేసే జనం ఉన్నారంటారు,వారే పదవిలోనూ లేకపోయినా. భజన అనేది మేధావుల దగ్గరకి ఎప్పుడు చేరిందో దానికి తిరుగులేకపోయింది. అంతేకాదు రకరకాల పోకడలూ పోయింది.వేల్పుల నామ సంకీర్తన బదులు రాజకీయ వేల్పుల నామ సంకీర్తన మొదలయింది.ఆ తరవాత ఇది సినీ రంగాన్నీ వదలిపెట్టలేదు. రాజకీయ వేల్పుల/తెరవేల్పుల సంకీర్తన చెప్పతరంకాని స్థాయికీ చేరిపోయి, నేటికీ కొనసాగుతూనే ఉంది.  ఇది రాజకీయ పార్టీల/ తెరవేల్పుల  అంతేవాస మేధావుల గొప్ప.వీరినే ఒపీనియన్ మేకర్స్ అని ముద్దుగా పిలుస్తారు. భజన ఊరికే చెయ్యరు, చిన్నమ్మ పలికితేనే భజన జరుగుతుంది, లేకపోతే......అందుకే ఒపీనియన్ మేకర్స్ కి అంత క్రేజ్. 

 ఈ రాజకీయ భజన, కుటుంబ స్థాయి నుంచి  వ్యక్తి సంకీర్తన  స్థాయికి దిగజారిపోయింది. ఇది అన్ని రాజకీయపార్టీలకి అంటువ్యాధిలా పాకేసింది, మా పార్టీలో పోలసీలకేగాని వ్యక్తులకి ప్రాధాన్యం లేదని బోరవిరుచుకున్న పార్టీలు కూడా భజనలో చేరిపోయాయి. 

ఇక తెనుగునాట అమ్మభజన విరివిగా సాగేది. ఆ తరవాత అన్న భజన మొదలైనా అన్న తరవాతవారి భజన పెరిగిందంటారు, కిట్టనివాళ్ళు. 

నేటి కాలంలో సోషల్ మీడియా రాజ్యం నడుస్తోంది. ఇక భజన గురించి చెప్పెదే లేదు. కొన్ని కొన్ని చోట్ల ఇది జుగుప్సాకరమైన స్థాయికి చేరిపోయినా ఆ పార్టీల/తెర వేల్పుల అంతేవాస  మేధావులకి తేడా తెలియటంలేదు.

చంద్రశేఖర చంద్రశేఖర

చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర చంద్రశేఖర

చంద్రశేఖర రక్షమాం


ఇలా భజన జరిగిపోతూందిట.


12 comments:

  1. అబ్బ మీరెంత అందంగా రాస్తా రండి.

    ReplyDelete
    Replies
    1. Anonymous4 January 2023 at 01:53
      ఏమందును? చాలానే రాసాను. కుదించేసాను!!!

      Delete
  2. // “ చంద్రశేఖర పాహిమాం”
    ……
    ఇలా భజన జరిగిపోతూందిట.” //

    హ్హ హ్హ హ్హ, గొప్ప సమకాలీన అన్యాపదేశం 😁😁.
    ఏమైనా భజన - ముఖ్యంగా తెరవేల్పుల భజన - బాగా శృతి మించుతోంది.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు4 January 2023 at 09:24
      //హ్హ హ్హ హ్హ, గొప్ప సమకాలీన అన్యాపదేశం 😁😁.//
      చంద్రశేఖరా!!! ఎన్ని కష్టాలొచ్చాయయ్యా!! నీపేరు తలిస్తే ఇలా :)
      అలా అనుకున్నారా సారూ :)

      Delete
  3. సుఖంగా ఉండాలంటే జీవితమంతా భజనమయం చెయ్యాల్సిందే అంటారా శర్మ గారూ ?

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju4 January 2023 at 16:49
      సారూ! ఏమనుకోవద్దూ!!
      భజనలేని దెక్కడ సారూ!!
      ఇంట్లో ఇల్లాలి దగ్గర్నుంచి,ఆఫీసులోబాస్, కస్టమర్,ప్రభుత్వ అధికారి, రాజకీయుడు, ఇలా అవసరాన్ని బట్టి అందరికీ భజన చేయాల్సిందే! ఇరుసున కందెన బెట్టక పరమేశుని బండి యైన బారదు సుమతీ అన్నారు కదండీ!ఇల్లాలి నచ్చిన చీరకొనిపెట్టి, కట్టుకున్న తరవాత, ఎంతందంగా ఉన్నావో! నా దిష్టే తగిలేలా ఉందీ, అని దిష్టి తీసి, భజన చెయ్యకపోతే, ఫుడ్డూ, బెడ్డు కట్టే కదు సారూ!

      ఇలా రాజకీయులు, పార్టీలు, Opinion makers, ఎక్కడా ఉన్నదేసారూ, మతపిచ్చగాళ్ళని, రాంభజన చేసేవాళ్ళంటే లోకువ.

      ఇలాగే జీవితం నడుస్తది సారూ

      Delete
  4. బయటికి భజన చేసే వారు కొంతమంది. మానసికంగా జపం చేసేవారు మరికొంత మంది.
    భజ భజ జప జప. భజన చేసే విధము తెలియండి. జనులాల మీరు భజన చేసి మోక్షమందండి.

    పోస్టు చాలా బాగుంది.

    ReplyDelete
    Replies

    1. Anonymous4 January 2023 at 21:58
      సారూ! ఏమనుకోవద్దూ!!
      సమాజ క్షేమం కోరి చేసేది భజన, దాని జపం స్థాయికి దించేసేరు, జపం స్వార్ధంతో చేసేది, చివరగా సర్వేజనాః సుఖినోభవంతు అంటారనుకోండి.

      అకాల వర్షం, కరంటు రాను,పోను, కరంటువారికి పండగ కదా!కరంటువారికి భజన చెయ్యలేదు, చెయ్యకుండా ఎమ్.ఎల్.ఎ గారికి చెప్పి లో ఓల్టేజి సమస్యకి ట్రాన్ఫార్మర్ వేయించుకున్నాం, కడుపుమంట ఉండదేంటీ?

      Delete
    2. భజ్ సేవాయాం అని వ్యుత్పత్తి. సేవ చేసేవారు కూడా ఆత్మోన్నతికి చేయవచ్చును కదా. ఇకపోతే జపంలో స్వార్థం ఉంటుందన్నారు. జపసిధ్ధుడు కానివాడు తన జపఫలంగా సమాజానికి చేయగలిగేది స్వల్పం. జపం తపస్సులో భాగం. మహాతపస్వులు నారదవాల్మీకివ్యాసాదులు చేసిన లోకహితం జగద్విదితం.అభ్యాసదశలో జపంచేసేవాడు విద్యార్ధి వంటివాడు. సమాజంలోనికి వచ్చేముందు ఏకాగ్రంగా దూరంగానే అభ్యాసి ఉండాలి. జపం కేవలస్వార్ధం కాదు. జపోత్తీర్ణులు భగవదాదేశం ప్రకారం సమాజహితం చేస్తూనే ఉంటారు.

      Delete
    3. శ్యామలీయం5 January 2023 at 13:03
      మీరు చెప్పింది ఏంకాదనగలను? కాని అంతవారున్నారా? అదే సందేహం.సమాజహితం?....ఏం చెప్పగలను సార్!

      Delete
    4. he he he, maree mohamatstulla unnare. bha-ja-pa bhajana ani raste polaa ;)

      Delete
    5. Anonymous4 February 2023 at 14:51
      అలాగే అనుకోండి ఎవరు కాదన్నారు? :)

      Delete