Friday, 5 January 2024

కవులు-మసాగత్తు /మశాగత్తు.

కవులు-కదపా-మంద-మసాగత్తు/మశాగత్తు.


కవులుని, కౌలు అని కూడా అంటుంటారు, కవులు శబ్దానికి నానార్ధాలూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది రైతు,భూయజమాని మధ్య ఒడంబడిక గురించి. ఇది రైతు భూయజమానికి రాసిచ్చేది.  కవులును ఉయలు అనికూడా కొంతమంది లేకరులు నాటికాలం రాయగా చూసిన అనుభవం ఉంది. ఇక కదపా అన్నది భూయజమాని రైతుకు రాసిచ్చే హామీ.  ఈ రెండిటిలో వచ్చే పదాలే మంద,మశాగత్తు/మసాగత్తు. నేను వీటితో పరిచయం వదిలేసి చాలాకాలమే అయింది, నాకు తెలిసిన కాలంలో కవులు ఎలా ఉండేది? రాస్తాను.


దివి.....     .....నామ సంవత్సర,...మాస బహుళ/శుక్ల....  ...వాసరాన,......జిల్లా......తాలూకా.......గ్రామ కాపురస్థులు........గారి కుమారుడు..........గారికి.

......జిల్లా......తాలూకా..........గ్రామ కాపురస్థుడు.........గారి కుమారుడు........వ్రాయించి ఇచ్చిన కవులు.


మీకు ....గ్రామంలో ఉండుకున్న సర్వేనెం.......రి.సర్వేనెం.......లోని య........సెం.....భూమిని ఈ రోజు కొలతవేయించి వ్యవసాయం నిమిత్తంగా  నాకు  అప్పగించినారు.   సదరు భూమిపై కవులుగా    సంవత్సరం ఒక్కంటికి,  యకరానికి .......  3 గుళ్ళ /75 కే.జిల కాటాబస్తాలు  మొదటిపంట ధాన్యం ,  మొత్తం య........సెం.....భూమి కి   .....బస్తాల నెంబు,తప్ప,తాలు,పొల్లు, తుక్కు,దూగర లేని మొదటిపంట ధాన్యం, మీగాదివద్ద కొలగారంవారిచే తూకం వేయించి  అప్పగించగలవాడను. ఈ కవులు కాలం ఐదు సంవత్సరములు. ఈ కాలంలో మొదటిపంటగా వరిని,రెండవపంటగా నువ్వు,మినుము,పెసర,కంది, జొన్న లాటి మెట్టపైరులు పండించుకునే నిర్ణయం. రెండవపంట ఫలసాయంలో మీకు సంబంధము లేదు. ఈ భూమికి ప్రభుత్వానికి చెల్లించవలసిన   పన్నులు యావత్తూ మీరే చెల్లించుకోవలెను. ఈ భూమికి ఉన్న నీటివనరులు పాడుచేయక రక్షిస్తాను, ఉన్న ఈజుమెంటు హక్కుల్ని రద్దు చేయను,కొత్తవాటిని కలగజేయను.   సరిహద్దురాళ్ళను జాగ్రత్తగా కాపాడతాను. చివరి సంవత్సరంలో నువ్వు పంట వేయకుండా ఉండే నిర్ణయం. చివరి సంవత్సరం రెండవపంట తరవాత మంద,మశాగత్తులు జరిపించి, మీ భూమిని మీకు అప్పగించగలవాడను. ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కవులు. 

సంతకం....................


ఇందుకు సాక్షులు....

౧.

౨.


దస్తూరి..............


ఇక కదపా అనేది, కవులులో చెప్పబడిన షరతులు అన్నీ ఇందులోనూ ఉంటాయి. ఫలానా,ఫలానా షరతులు రైతు అమలు చేయాలనీ,వివరాలుంటాయి.  చివరలో ఈ కవులు కాలంలో ఇవ్వవలసిన కవులు బకాయిలు పెట్టకుంటే కవులు రద్దు చేయనని కదపా ఇస్తున్నాను, ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కదపా.

అనగా రైతుకు యజమాని చ్చే భరోసా,గేరంటీ,హామీ. చెవికదపా ఇస్తానోయ్! అన్నమాట వింటుంటాం, అంటే చెవిని హామీ ఇచ్చాడనమాట. :)


మంద అనేది మందగట్టడం. ఏభై ఏళ్ళ కితం రసాయన ఎరువులు లేవు, ఎరువుగా  పెంటతోలడం,పశువులు,మేకలు,గొర్రెలని మందగా భూమిలో ఉంచడం చేసేవారు.

ఇక మశాగత్తు/మసాగత్తు అనే పదానికి అర్ధంలేదు. మసాహత్ అనే ఉర్దూ/హిందీ పదం మన తెనుగునోటబడి            మశాగత్తు/మసాగత్తు అయింది. దీనికి అర్ధం, భూమి కొలత,సర్వే అని అర్ధం. రైతు భూమి తీసుకునేటపుడు కొలతవేయించి అప్పజెప్పుకుంటాడు, మళ్ళీ కొలత వేయించి అప్పజెపుతాడు.  ఇక మసాహత్ అనగా కొలత ఎందుకని సందేహం కదా! సర్వేరాళ్ళు జరిపేసేవారు,గట్లు  జరిపేసేవారు, ఇలా చాలాచాలా అపభ్రంశాలు జరిగేవి,దీనితో తగవులూ చాలా ఉండేవి, వీటిని మొదటిలోనే పరిహరించడానికి చేసే ప్రయత్నమే ఇది. మాస్టర్ రాయి అని ఒక పెద్ద సర్వేరాయి ఉంటుంది. మొత్తం గ్రామ సర్వే అంతా ఆ రాయి ఆధారంగా నడుస్తుంది.   ఇది ఎంతుంటుందంటే, పైన రెండ డుగుల పొడవు వెడల్పులతో దగ్గరగా   పది అడుగుల పొడవుంటుంది.  కిందికిపోను లావుగా ఉంటుంది. ఏడు,ఎనిమిదడుగులలోతుపాతిపెట్టి,ఒకడుగు పైకి ఉంచేటట్టు చేస్తారు. ఈ మాస్టర్ రాయిని రైతులంతా గమనిస్తుంటారు. దీనినే రాత్రికి రాత్రి తవ్వితీసి మరోచోట పాతిపెట్టిన ఘనులూ ఉన్నారు,నాడే! ఆ తరవాత కాలంలో రివెన్యూవారు సరిచేసిన సందర్భాలు కోకొల్లలు. 

గ్రామానికో డిగ్లాటు ఉంటుంది. ఇది కరణం దగ్గరఒకటి,తాసిల్దారు దగ్గరొకటి, కలక్టర్ దగ్గర కాపీలుంటాయి. ప్రతి సర్వే నెంబరు భూమి పరిమితం,కొలతలు,భూమి ఆకారపు చిత్రం స్కేలుకి వేసి ఉంటుంది, సర్వేరాళ్ళు ఎక్కడ ఉన్నదీ నమోదయి ఉంటుంది. మనభూమి తాలూకు డిగ్లాట్ కావాలంటే కరణం అచ్చుగుద్దినట్టు వేసి ఇచ్చేవాడు, అసలును చూసి. ఈ డిగ్లాటును సర్వే,రిసర్వేలలో సర్వే చేసినవారు, వేస్తారు. సర్వే చేసి డిగ్లాటు వేసిన వారి పేరు హోదా కూడా నమోదయి ఉంటుంది. చాలాచాలా మార్పులొచ్చాయి, ఇప్పుడెలా ఉన్నది తెలియదు.


6 comments:

  1. అద్భుతః
    చాన చక్కటి మెమొరీ

    ReplyDelete
    Replies
    1. Zilebi 6 January 2024 at 05:51
      ధన్యవాదాలు.

      Delete
    2. “మెమరీ” ఏమిటి “జిలేబి” గారు, శర్మ గారు ఏకసంధాగ్రాహి అయ్యుంటారు 👏🙏.

      Delete
    3. అవునండోయ్ ఒకే సంత వారయ్యుండవచ్చు :)

      Delete
  2. విన్నకోట నరసింహా రావు6 January 2024 at 20:49
    మీ అభిమానానికి ధన్యవాదాలండి. దయచేసి అభిమానం బహిరంగంగా వెల్లడించద్దు. కుళ్ళుమోతులు, మిమ్మల్నీ ఎగతాళీ చేస్తారు, అది నాకు బాధాకరం.
    నమస్కారం.

    ReplyDelete
    Replies
    1. ఈయన ఏ కాలపు మనిషండీ బాబు
      బహిరంగంగా తెగడకు అంటారు గాని ఇలా పొగడకు అనేవారుంటారా ఎవరైనా ? ప్చ్ పాతకాలపు మడిసి :)

      Delete