Thursday, 25 January 2024

రహస్యం దాగదు.

రహస్యం దాగదు.

దుష్యంతుడు వేటకి వెళ్ళి, కణ్వుడు లేనప్పుడు కణ్వాశ్రమంలో శకుంతలని చూసి మోహించి, గాంధర్వం అని పెళ్ళి చేసుకుని, ఆమెను తల్లిని చేసి వెళ్ళాడు.నిన్ను తీసుకువెళతానని వాగ్దానమూ చేసాడు. అడగొచ్చిందా? అనుకున్నాడు. శకుంతల కొడుకుని కన్నది. కొడుకు పెద్దవాడవుతున్నాడు, రాజు దగ్గరనుంచి ఎన్నాళ్ళకి కబురులేకపోతే తనే బయలుదేరిందీసారి,కణ్వునికి చెప్పి. రాజసభలో కొడుకుని చూపించి, వీడు మన కొడుకు అని చెప్పింది. దుష్యంతుడు ఎవరినో కుర్రాణ్ణి తీసుకొచ్చి వీడు నీకొడుకు అనడం బాగుందా? అసలు నువ్వెవరు? నాకు తెలియదే అనేసాడు. దానికి శకుంతల చాలా చెబుతూ, ఇలా అంటుంది 


విమల యశోనిధీ పురుషవృత్త మెరుంగుచు నుండు జూవె వే

దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్

యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా

ర్థము లివి యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్.


తెల్లనిదైన యసస్సు కలిగినవాడా! మానవుల చర్యలను చూస్తున్నవారున్నారు సుమా! వారు

 ధర్మం-1

యముడు-1

అంతరాత్మ-1

సూర్యుడు,చంద్రుడు-2

పగలు,రాత్రి-2

సంధ్యలు-3

వేదములు-4

పంచభూతాలు-5.

     వీరిలో  ఎవరో ఒకరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మానవుడు  రహస్యంగా,  ఎవరికి తెలియకుండా  ఏమీ చేయలేడు.  అందుచేత నువ్వు చేసిన పని  ఎవరికీ తెలియదనుకోకు. అని చెప్పింది.అబ్బే అలాగా వినలేదు, తరవాత కత చాలానే జరిగి చివరికి ఒప్పుకున్నాడు. 


నేటికీ ఈ మహా పదార్ధాలు ఏదో ఒకటి మనం చేసేపని చూస్తూనే ఉంటాయి. నేటికాలం లో మరొకదాన్ని ఈ మహాపదార్ధాలలో చేర్చుకోవలసి వస్తూంది :) అదే గూగుల్. ఎలాగని అడగచ్చు. మీరు ఏం చదువుతున్నారు, ఏ రకపు వార్తలను చూస్తారు, ఏవస్తువులు కొనాలనుకుంటున్నారు, ఏవి మీకిష్టం, ఎక్కడ ఎమి దొరుకుతాయి,వాటిఖరీదులెంత,ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు,అక్కడకి దగ్గరలో చూడవలసినవేంటి? ఏమి తింటారు?  


మీ ఆలోచనేంటి? కల్పితమేధస్సుతో మీరెలా ఆలోచిస్తారో కూడా చెప్పేస్తున్న సంఘటనలున్నాయి. మీరెక్కడున్నారు,ఎంతసేపున్నారు, ఏ దిశగా కదిలేరు, ఇలా సర్వం జి.పి.ఎస్ లో దొరుకుతుంది. ఆధునికత పేరుతో బందీలైపోతున్నారు సుమా!  బహుపారాక్! ఒక రోజు మీ చర్యలే మీ కాళ్ళకి,చేతులకి బంధాలు కావచ్చు సుమా! 

 ఇలా మీసర్వస్వమూ గూగుల్ గుప్పెట్లో ఉంది. ఇది మహా పదార్ధం కాదా?


1 comment:

  1. బ్రవసర్ డాటా డిలీట్ చేస్తాంగా అన్నారొకరు.

    ReplyDelete