Saturday, 27 January 2024

దోచుకో! దాచుకో!!

 దోచుకో దాచుకో 

 దోచుకో! దాచుకో!! ఇదే నేటి నినాదమనిపిస్తూ ఉంది. దోచుకుని ఏమి అనుభవిస్తున్నట్లు? పొట్టకి తిండా మూడు పూటలకంటే ఎక్కువ తినలేము. కట్టుకునే గుడ్డా? ఏదైనా మానం కాపాడుకోడానికే! ఉండే ఇల్లా? ఎంతపెద్ద ఇల్లున్నా ఒకమంచంమీదే పడుకోగలం.స్త్రీ/పురుష అనుభవమా? మూడు నిమిషాల ముచ్చట. అంతే! ఇతర వైభవాలా? అర్ధం చేసుకుంటే కొరగానివే. ఇది ఐశ్వర్యంకాదు. రెండు పూటల తింటే ఆకలి వేయడం ఐశ్వర్యం.ఆరోగ్యం ఐశ్వర్యం. కట్టుకున్నవారితో మనసుకలిసుండడం ఐశ్వర్యం. ఎందుకు దోచుకుంటున్నట్లు?

నృసింహ శతకకర్త అన్నారిలా.

సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు

వెళ్లిపోయెడినాడు - వెంటరాదు

లక్షాధికారైన - లవణ మన్నమె కాని

మెఱుగు బంగారంబు - మ్రింగబోడు

విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని

కూడబెట్టిన సొమ్ము - తోడరాదు

పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి

దానధర్మము లేక - దాచి దాచి

తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ

తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।


సృష్టి మొదలు ఎందరు పుట్టేరు? ఎందరు పోయారు. పోయినవారెవరూ చిటికెడు మన్ను పట్టుకుపోలేదు.  నిన్న మొన్నటి ఉదాహరణలు స్టీవ్ జాబ్స్, రాకేష్ ఝున్ ఝున్ వాలా! కదలలేని స్థితిలో నిస్సహాయంగా ప్రాణాలు వదలినవారు.  ఆఖరికి తాను అనుకున్న శరీరం కూడా ఇక్కడే వదిలేసిపోతున్నారు. ఎవరూ నిన్ను గుర్తుపెట్టుకోరు. ఈవేళ చస్తే రేపటికి రెండు.  దోచుకోకు!

కడుపాకలికి కక్కుర్తి పడితే అదో అందం. అంతే!!!!


నోరున్నవారూ, బలమున్నవారూ;దోచుకుంటున్నారు,దాచుకుంటున్నారు.  ఎవరి వీలున్నంతవారు, వ్యాపారస్థులనుంచి, బలమైన వృత్తి వారలనుంచి,రాజకీయులదాకా! ఎందుకో!!!

ఎంత కళ్ళు మూసుకుందామనుకున్నా చూడక తప్పటం లేదు. బాధపడకా తప్పటం  లేదు . ఏమీ చేయలేని అసహాయ స్థితి. ఇదింతే!!!!

7 comments:

  1. -

    దోచుకొను! దాచుకొనురా!
    ఈచాపల్యముల కంతు లేదోయ్; వేళొ
    స్తే చాలన్నీ తన్నే
    స్తో చస్తావ్! విడు దురాశ దోపిడి వలదోయ్ !

    ReplyDelete
    Replies

    1. Zilebi28 January 2024 at 06:51
      చస్తే కూడా ఏం రాదు. నోటితో చెబుతుంటారిది అంతే!చిన్నమ్మ వెనక పరిగెడుతుంటారు! అదీ అంతే!!!అంతులేనిదే పరుగు,ఉన్నంతవరకు :)

      Delete
    2. ఓస్ మెట్ట వేదాంతమన్నమాట ఐతే

      Delete
    3. Zilebi28 January 2024 at 10:24
      తమలాటి మేధావులు చెప్పేదదీ, చేసేదిదీ :)

      Delete
    4. -

      చెప్పేదది చేసేదది
      గొప్పోళ్ల చరిత్ర చూడ గోల్మాల్ గోల్మాల్
      కుప్పల కొలదిగ శాస్త్రం
      బొప్పింతురు తమకు చిక్కు పొడలేకున్నన్

      Delete
  2. దోచుకునే నాయకులకు దోచుకున్నంత,
    అడుక్కునే ఓటర్లకు అడుక్కున్నంత.
    ఇదీ మన ప్రజాస్వామ్యం, సిగ్గు పడండి.

    ReplyDelete
    Replies
    1. bonagiri28 January 2024 at 08:15
      స్వతంత్రం మొదలు జరుగుతున్నది ధనస్వామ్యమని నా అపోహ! ప్రజాస్వామ్యంటారా? :)
      చిన్నమ్మని చూసి సిగ్గు పడకూడదండీ :)
      మనముందు చిన్నమ్మ నడిస్తే ఎప్పటికి అందదు.
      చిన్నమ్మ కూడా మనం నడిస్తే ఆ వెలుగులో మన నడకే కష్టం.
      అంచేత చిన్నమ్మ మనవెనకుండి నడవరా! భయంలేదంటే చాలు.

      Delete