Tuesday 28 April 2020

పల్లె సీమలు.

పల్లె సీమలు.
కితం వారం లాక్ డవున్ ను పల్లెలలో సడలించారు. రెండవపంట బాగానే పండింది.దిగుబడి కూడా బాగుంది.ఎకరానికి రెండున్నర టన్నులు కావచ్చు. ఇది రెండవపంట కనక యంత్రాలు ఉపయోగించి కోతనుంచి మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. యంత్రాలకి అయ్యే ఖర్చు డబ్బులొచ్చాకా ఇస్తారు. ఇది అలవాటే. ఎఫ్.సి.ఐ రంగంలోకి దిగి కొనుగోళ్ళు చేస్తోంది. సరకు కూడా గొదాములకు చేరుతోంది. నెల లోగా సొమ్ములు రైతు చేతికి రావడం మామూలే.ఏమైనా సరుకు ఒబ్బిడి అవుతోంది సంతోషం.   పంట పండించిన రైతు గిట్టుబాటు ధర  కోసం చూస్తాడు అలాగే సరుకు పాడవకుండా ఒబ్బిడి ఐతే సంతోషిస్తాడు,చేసిన శ్రమ ఫలించినందుకు.
    

  ఇంకా   సగం  పైగా మాసూళ్ళు కావాలి,మొత్తం పూర్తి కావాలంటే మరో రెండు వారాలు తప్పదు. కాని ఈ లోగానే 27,28 తారీకులలో తుఫాను తాక నుందని  వార్త. ఇదెంత నిజమో తెలియదు.   ఇటువంటి అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి.నిన్న ఉదయమే గాలివాన తో మామిడి రాలిపోయింది, వరికి కొంత నష్టం.  ఏమైనా పల్లెసీమలు పని పుంజుకున్నాయి. పల్లెలకు సంబంధించిన అన్నీ పని చేస్తున్నాయి. ఈ లోగా ప్రధాని నుంచి వచ్చే సహాయం ప్రతి ఒక్కరి కాతాలోనూ పడుతోంది.  (2000+2000) ఇది సమయానికి రైతుకు ఉపయోగకరంగానే ఉంది. మరొక విడత సొమ్ములు మాత్రం రావాలి. మొత్తం గోజిలలో పన్నెండున్నర లక్షల టన్నులాఅహారధాన్యాలు ఒబ్బిడి అవుతున్నాయి. కరోనా పల్లెలనేం చెయ్యలేకపోయింది.  మందులేక ఇబ్బంది పడుతున్న మాట నిజం.  బియ్యం ఇత్ర నిత్యావసరాలు ఇంటికే చేరుస్తున్నారు, బాధ లేదు. 



ఒక రైతు మాట
''మూడో తారీకు తరవాత ఎలా వుంటుంది? కంగారు పడద్దు. నెమ్మది నెమ్మదిగా అంతా సద్దుకుంటుంది,  కరోనా, తుఫానులూ ఏం చేయలేవు. పనులు పూర్తైనా రైతన్నలు మిగిలినవారికి సహాయం చెయ్యండి. తొలకరికి కావాల్సిన విత్తనాలు,ఎరువులు సరఫరా అవుతాయి, భయపడద్దు. ఆరోగ్యంగా ఉండండి, ఇంట్లోనే ఉండంది, పనులు పూర్తయితే
  పల్లెలను  అలవాట్లే రక్షిస్తున్నాయి. లాక్ డవున్ ఎత్తేసినా,ఉన్నా మంచి అలవాటలు మానకండి.అనవసర ప్రయాణాలొద్దు. అవసర ప్రయాణాలు మానొద్దు.బయట తిరగద్దు.గాలి వార్తలు నమ్మద్దు.


గొప్ప మార్పు వచ్చేస్తుందని అనుకోనుగానిమార్పు మంచికే జరుగుతుందని ఆశిద్దాం."

15 comments:

  1. రైతు సంతోషంగా ఉంటే అందరికీ ఆనందం. చల్లటి మాట చెప్పారు. ఒబ్బిడి అంటే ఏమిటి sir

    ReplyDelete
    Replies
    1. బుచికి గారు,

      ఈ పేరే బాగుందండి. కనులు తెరిచినా బుచికాయె,కనులు మూసినా బుచికాయే, ఎటు చూచినా బుచికాయే! బుచికి,బుచికి!! బుచికి పవర్ఫుల్.అలాగే కంటిన్యూ ఐపోండి.

      పల్లెలలో పాలు,తేనె ప్రవహించటం లేదండి. బతుకు వెళ్ళదీస్తున్నాం. బెంబేలు పడి మరొకరిని బాధపెట్టడం ఎందుకని,ధైర్యం చెప్పుకుంటున్నాం. ఉన్నవరకు సరుకు ఒబ్బొడి చేశాం, ఇక ముందు మాట పరమాత్మకే ఎరుక. కష్టాలే మా పుట్టిళ్ళు. నాలుఓ తారీకు తరవాత డబ్బున్నోళ్ళంతా ఇక నోట్లు నూరుకు తాగాలి, మెరుగు బంగారం మింగాలి. ఊహిస్తే రోజులు భయంకరంగా ఉన్నాయండి. కష్టాలు మాకు కొత్త కాదుగనక నడిపిస్తున్నాడు భగవంతుడు.

      ఒబ్బిడి అంటే పంట నూర్పు అని అర్ధం, బాగుచేసుకోవడం, పోగుచేయడం, జాగ్రత్త పెట్టడం అనే బహుళార్ధం లో చెప్పచ్చండి, పల్లెటూరోళ్ళం కదండి, అప్పుడప్పుడు, ఇలా దొర్లిపోతుంటాయండి, పదాలు...
      ధన్యవాదాలు.

      Delete
  2. Thank you sir. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎన్నో కష్టాలను ఓర్చుకుంటారు. వనరులు సౌకర్యాలు లేకపోయినా సర్దుకుపోతారు. అది వారి గొప్పదనం. ఈ మహమ్మారి ప్రభావం నుంచి బయట పడడానికి 6 నెలలు - 1 సం. పట్టవచ్చు.
    ఒబ్బిడి వంటి పదాలు పల్లెలలో నిలిచి ఉన్నాయి. అందరి ఆకలి తీర్చే రైతులు దేవుడితో సమానం.

    ReplyDelete
    Replies
    1. బుచికి గారు,
      నా మాట మన్నించినందుకు ధన్యవాదాలు.
      రాబోయే కష్టాలు, ఎవరో ఒకరికి చెప్పుకోవాలి కదండీ, అందుకే ఈ వెళ్ళబోసుకోవడం.

      ఇప్పటి వరకు యంత్రాలతో పనయిపోయిందండి. ఇప్పుడు మొదటి పంటకి యంత్రాలు పనికిరావు. కూలీలు కావాలి. ఇక విత్తనాలు, ఎరువులు అన్నదానిగురించి ఆశ వదులుకున్నాం. వస్తే సంతోషమే,నమ్మకం మాత్రం లేదు. దేశం లో మా గురించి మొదటగా ఆలోచించినవారు కె.సి.ఆర్ మరియు మోడీ.

      అప్పు: బేంకు లు అప్పులివ్వవండి. అదో మాయా జాలం, నోరున్నవారిదే రాజ్యం. మా కూడా ఉండేవాడె అప్పు పెడతాడు, చివరికి వడ్డీతో తీర్చాలి,ఇదో విషవలయం,ఎంత చెప్పుకున్నా తీరనిదే.

      కూలీలు: ఈ పంటకి కూలీలు తప్పరు. లోకల్ గా ఉన్న కూలీలను పని పేరుతో వ్యవసాయానికి దూరం చేసింది,ప్రభుత్వం.పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలొచ్చేవారు, నిరుటి దాకా, ఇప్పుడు రాలేరు,రారు కూడా. పది మంది ఒక గ్రూప్ గా ఏర్పడి రోజుకు రెండెకరాలు ఊడ్చాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికి గట్టెక్కితే దయగల మహానుభావులెవరూ కరోనా ను తెచ్చి మాకు అంటించకపోతే,పంట వేద్దామనే ఉందండి.ఇంతకీ నీళ్ళుంటాయా? పెద్ద కొచ్చను.

      Delete
  3. బీదరికం, నిర్లక్ష్యం, అణిచివేత, & వివక్షలనే ఘోరమయిన రోగాలకు తరతరాలుగా అలవాటు పడిన భారత పల్లెల బీదాబిక్కీ జనాన్ని నిన్నగాక మొన్న వచ్చిన కరోనా ఏమీ చేయలేకపోయిందని సంతోషించాలా, బడుగు బతుకులు ఎప్పుడు బాగు పడతాయోనని బాధ పడాలా తెలువడం లేదు.

    ఒబ్బిడి: చాలా బాగుంది, కొత్త పదం నేర్చికున్నాను.

    ReplyDelete
    Replies
    1. జై గారు,
      కోట్ల రూపాయలు, ఇళ్ళు, భూములు మందులు కొనగలవేమో గాని ఆరోగ్యాన్ని కొనలేవండి.36 ఏళ్ళ నియంత కొంచం ఆరోగ్యం కొనుక్కో లేకపోయాడు. ఎంత పాడైనా మా అలవాట్లే మమ్మల్ని రక్షిస్తున్నాయండి.కూడా ఏమీ రావనే మాట నాలుక చివరినించి చెబుతారు, పైస తీసి దానం చెయ్యలేరండి. నిజానికి మేమే బాగున్నాం ,బాగుంటాం కూడా.

      ఒబ్బిడి పదం నిఘంటువులకు ఎక్కినదేనండి. వాడకం పల్లెలలో తప్పించి లేదంతే

      Delete
    2. బాగా చెప్పారు గురువు గారూ.

      ఇకపోతే ప్రతి పదం జనం నుంచి పుట్టిందే. Language belongs to the people, dictionaries/lexicon is a mere compilation.

      Delete
    3. జైగారు,
      పల్లెలలో మేం వాడుకునే మాటలు నిఘంటువుల్లో కూడా ఉన్నాయంటే ఆనందపడిపోతామండి, పల్లెటూరివాళ్ళంకదండీ..

      Delete
  4. ఈ వయసులో కూడా మీరు ఇంకా వ్యవసాయం చేస్తున్నారా? విశ్రాంతి తీసుకోండి.
    గోదావరి జిల్లాల వారే ఇంత కష్టపడితే ఇంక మెట్ట ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటో?
    ఒబ్బిడి అన్ని పదం మా ఊరు వెళ్లినప్పుడు వింటుంటాను. జాగ్రత్తగా, పొదుపుగా, పద్ధతిగా అన్ని అర్ధంలో వాడుతూ ఉంటారు. వృధా కి వ్యతిరేకం అనుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు,

      వ్యవసాయం చేస్తున్నారా? చూస్తున్నానండి. అబ్బాయి చెబుతాడు,సూచన చేస్తాను,నిర్ణయం అతనే తీసుకుంటాడు. పిల్లలికి కష్టాలు నేర్పుతున్నానండి. చేలో దిగితే నారు కట్టలేనా విసరలేకపోతానంటారా? :)
      చేస్తున్న పనిని చివరిదాకా కొనసాగించడమే విశ్రాంతి అని నా అభిప్రాయం. ఈ వ్యవసాయంతో కోట్లు కూడ పెట్టలేం కాని పది మందికి ఆహారం సమకూరుస్తున్నామనే దే తృప్తి.రైతు ఈ అలవాటు మానుకోలేడు. అదే అతని బలహీనత,బలం కూడా

      Delete
  5. ఒబ్బిడి
    గొప్పలకు పోక పోవడం అని అర్థం .
    ఉబ్బు ఇడి
    ఉబ్బు _ అతిశయం
    ఇడి _ లేకపోవడం (తదభావద్యోతకం గా ఇడి చేరుతుంది )
    ఉబ్బిడి వ్యవహారంలో ఒబ్బిడిగా మారింది .

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ మాస్టారూ.

      Delete
    2. మిత్రులు రాజారావుగారు,
      ఒబ్బిడి పదానికి జన్యుపటం చెప్పినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  6. "చేస్తున్న పనిని చివరిదాకా కొనసాగించడమే విశ్రాంతి అని నా అభిప్రాయం." - యెంత గొప్ప మాట। ఎంతో జీవితానుభవం ఉంటేకానీ ఈమాట అనటం మనకి అన్వయించుకొని బ్రతకటం వీలు కాదు। ��

    ReplyDelete
    Replies


    1. అన్యగామిగారు,
      కష్టపడి పని చేయడం కాదు, ఇష్టపడి పని చేయడమే......కొనసాగడమే.....

      Delete