12, డిసెంబర్ 2023, మంగళవారం

సింహము-చిట్టెలుక

సింహము-చిట్టెలుక  


 అనగనగా ఒక అడవి. అడవిలో మృగాలు ఎన్నికలు జరుపుకున్నాయి, రాజెవరో తేల్చుకోడానికి.  సింహం,ఏనుగు పోటీ చేసాయి.  వీరవిహారంగా ప్రచారం జరిగిపోయింది. సింహాన్ని ఎన్నుకున్నాయి, రాజుగా, సాధుజంతువులన్నీ, కొద్ది మెజారిటీతో!

ఎలుకలు ప్రచారంలో పాల్గోలేదుగాని ఓట్లేసాయి.  సింహానికి, ఎలుకలు ఓట్లు తనకి వేయలేదేమోనని అనుమానం.

కాలం నడుస్తుండగా, ఒక ఎలుకపిల్ల (చిట్టెలుక) తన కలుగు దగ్గర చెట్టుకింద, నిద్రపోతున్న సింహం జూలు పట్టుకుని ఆడుకోడం మొదలెట్టింది, ఇంతలో సింహానికి మెలుకువొచ్చింది. చిట్టెలుకని పంజాలో పట్టుకుని ఒక్క సారి గర్జించింది. దాన్తో కలుగులో ఎలుకతల్లి బయటికొచ్చి, తనపిల్ల, సింహం పంజాలో ఉండటం చూసి, రాజా! మేము ఎలుకలం,బలహీనులం, తమ చేతిలో ఉన్నది చిన్నపిల్ల, అభం శుభం, లోకం పోకడ తెలియనిది. తమకే హాని తలపెట్టలేదు. తెలియక తమజూలుతో ఆడుకున్నట్టుంది. మన్నించి విడుదలచేయండి,అంతేగాదు. మా ఎలుక సంతతి అంతాకలసినా తమ పంటికిందకి, ఉదయఫలహారంగా కూడా సరిపోము. అదా! చిట్టెలుక, దయచేసి తప్పుకాసి విడుదల చేయమని వేడుకుంది.  సింహం ఆలోచనలో పడింది. తనకి వీళ్ళు ఓట్లేసినట్టులేదు, ప్రతీకారం తీర్చుకుంటేనో, ఆలోచనలో పడింది. ఈలోగా నక్క  మంత్రి,   సింహం  దగ్గరకు చేరి, మంతనాలు జరిపింది. తల్లి ఎలుక, రాజా! తమకు అత్యవసర సమయంలో నా సాయం అందించగలను, మన్నించి నా బిడ్డను విడుదలచేయమని వేడుకుంది, కాళ్ళావేళ్ళా పడి, కన్నీళ్ళతో.  


అంతట సింహం   హేళనగా నవ్వి, నువ్వో ఎలకవి, నేను సింహాన్ని, రాజును. నువ్వు నాకు సాయం చేస్తానంటావు. నేను నమ్మాలి,  అని   పరిహాసంగా గర్జించి, చిట్టెలుకను వదిలింది. ప్రాణగండం గడచిన చిట్టెలుక తల్లిని చేరింది.కాలం గడిచింది. తల్లెలుక మరణించింది, పిల్లెలుక పెద్దదయింది,  ఎలుకల నాయకుడయింది. సింహానికీ వయసొచ్చింది, వడి మళ్ళింది, చూపు ఆనడమూ తగ్గింది. 

ఒకరోజు వేటగాడొకడు వలపన్నేడు. చూపు తగ్గడం, అధికారం మత్తుతో చూసుకోక, వలలో చిక్కుకుంది, సింహం. తన్నుకుంటూంది,వదిలించుకోడానికి, తన్నుకున్నకొద్దీ బిగుసుకుంటోంది వల.  అడివిలో జంతువులన్నీ గుసగుసలు పోయాయి.ఎవరికి తోచినట్టు వారనుకున్నారు. అన్యాయం! అన్యాయం!! అని   ఆక్రోశించినవారు , మా బలే అయిందిలే అని చంకలు గుద్దుకున్న అశక్తదుర్జనులు,  చేసుకున్న కర్మ ఎక్కడికిపోతుంది, వెంటాడి వేధిస్తుందని శాపనార్ధాలు పెట్టిన వారు, ఇదంతా ఏనుగు చేసిందే! అనుమానం లేదు,ఇంతకింతా అనుభవిస్తుంది లే! అని గుసగుసలు పోయినవారు, ధర్మప్రభువుకే ఇంత కష్టమా? అడవిలో ఆటవిక న్యాయం చెల్లదా? అని కన్నీళ్ళు పెట్టుకున్నవారు, ఎంతకలికాలమైనా ఇంత చేటా? అని బుగ్గలు నొక్కుకున్నవారు. ఇలా నడచిపోతూంది, కాలం. సాధుజంతువులంతా చేసేది లేక,చేయగలదీ లేక, నిశ్చేష్టులయి చూస్తూ ఉండిపోయాయి. ఈలోగా   కౄర  జంతువుల సంచలనం కలగడంతో, సాధుజంతువులన్నీ పారిపోయాయి.   ఇలా గడచిపోతూవుంది, కాలం.

 

కౄరజంతువులన్నీ సమావేశం చేశాయి, రాజుకు ఎదురుగా. ఏంటీ కలికాలం కాకపోతే! ఎప్పుడేనా సింహరాజిలా వలలలో చిక్కుకోడాన్ని విన్నామా? ఇదంతా ఏనుగు కుట్ర తప్పమరేంకాదు.ఏనుగును వదలిపెట్టం, రాజా! మీరు నిశ్చింతగా ఉండండి, అన్నాయి. కాలం గడచిపొతోందిగాని రాజును విడుదల చేసే మార్గం గురించిన ఆలోచనగాని, చర్చగాని చేయనేలేదు.     ఈ లోగా నక్కమంత్రి పరుగు పరుగున చేరుకుంది, రాజు దగ్గరకి.  రాజా! ఇలా జరిగిందే! తమరేంటి ఇలా వలలలో చిక్కుకోడాన్ని ఊహించలేను. జరిగిందేదో జరిగింది, మిమ్మల్ని విడుదలజేసే మార్గం చెబుతా! ముందు వీళ్ళందరికి పని అప్పజెప్పి పంపించెయ్యండి.ఆపద సమయంలో, రాజుకు రాజబంధువులే ద్రోహం చేస్తారు. వీరిని అడవి సరిహద్దుల్లో కాపలాకాయమనండి, వేటగాడు రాకుండా! అని ఉపాయం చెప్పింది. సింహం అలాగే చెప్పి అందరినీ పంపించింది. రాజబంధువులు,సన్నిహితమితృలంతా వలలో చిక్కుకున్నాడని చూడ్డానికొస్తే పని అప్పజెప్పేడే! అని సణుక్కుంటూ లేచి పోయాయి,సమావేశం నుంచి.   


ఆ తరవాత, మంత్రి, రాజా! వీళ్ళంతా అవసరం గడుపుకునేవాళ్ళే! అవసరానికి అడ్డుపడేవాడొక్కడూ లేడు. ఈ ఆపద గడవాలంటే ఉపాయం చెబుతా,వినండి. 

ఒకప్పుడొక ఎలుకపిల్లకి ప్రాణదానం చేసేరు, ధర్మప్రభువులు. ఆ ఎలుకపిల్ల నేడు ఎలుకల నాయకుడయింది. వాళ్ళే ఇప్పుడు ఈ వలను కొరికి మిమ్మల్ని రక్షించగలరు. నేను వెళ్ళి వారిని తమ దర్శనానికి తీసుకొస్తా! దర్పం,గాభీర్యం ఒలకబోయకండి.   ఇప్పుడు అవసరం మనది, దీనంగానే మాటాడండి. రక్షించమని కోరండి,అని హితబోధ చేసి, ఎలుకనాయకుడి దగ్గరకెళ్ళింది, నక్క మంత్రి. 

ఎలుకనాయకా! మహారాజు వేటగాని వలలో చిక్కుకున్నారు, ఇప్పుడు మీరే రక్షించాలి, అంది. దానికి ఎలుక, మంత్రిగారూ! మేమేమో చిన్నవాళ్ళం, ఎలుకలం, మహారాజుకు మేం చేయగల సాయమేం ఉంటుంది, అంది. దానికి నక్క, అన్నన్న ఎంతమాట!,ఎంతమాట!!, ఇప్పుడు మీరు పూనుకుని వల కొరకకపోతే మహరాజును వేటగాడు బోనులో పట్టుకుపోతాడు, ఆతరవాత మన రాజుగారు చిక్కి శల్యమై,తిండికి మొహంవాచి సర్కస్ లో డాన్సు చెయ్యాల్సి వస్తుంది. ఇది మన జంతులోకానికే తీరని అవమానం. అందుచేత మీరంతా పూనుకుని, వలను కొరికి రాజును రక్షించాలి, అని చెప్పింది. గతకాలంలో ఎలుక తల్లి రాజుకిచ్చిన మాట  గుర్తు  చేసింది.  సరేనని ఎలుక సింహం దగ్గరకి చేరుకుంది.   

 ఎలుకను చూసి సింహం, ఎలుక నాయకా! ఒకప్పుడు నీకు ప్రాణదానం చేసాను, ఇప్పుడు నేను వలలో చిక్కుకున్నాను, అంటూ ఉపన్యాసం మొదలెట్టింది. అంతట నక్క వారింపుగా రాజా! సమయం గడచిపోతోంది! అని హెచ్చరించింది. సింహం తన స్థితి గుర్తుచేసుకుని, సలహా పాటిస్తూ, ఎలుకనాయకా! ఇదివరలో ఏం జరిగిందో! జరిగిపోయింది, ఇప్పుడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. నన్ను రక్షించండి, నీవే నా ప్రాణదాతవి, నీవు తప్ప మరెవరూ నన్ను రక్షించలేరు అని వేడుకుంది, దీనంగా. అంతట ఎలుక, రాజా! ఇది చూస్తే చాలా పెద్దవల, చాలా బలంగానూ ఉన్నది. నా ఒక్కడివల్ల కాదు.మా వాళ్ళతో ఆలోచించాలి అని చెప్పింది. దానికి సింహం, నువ్వు తలుచుకుంటే మీవాళ్ళందరిని కూడగట్టగలవు, నన్ను రక్షించనూ గలవు, నన్ను రక్షించు, రక్షించు,అని కన్నీళ్ళు పెట్టుకుంది.  ఐతే ఒక మాట రాజా! మా  వాళ్ళని ఒప్పించాలంటే మీరో మాటివ్వాలంది. అదేంటో అడుగు, అంది నక్కమంత్రి. రాజా! బిడాల సంతానం మా ఉసురుతీస్తున్నాయి. వేధింపులకి అంతే లేకపోతోంది. వారినుంచి రక్షణ ఏర్పాటు చేస్తానంటే, మా వారిని ఒప్పిస్తానంది. అలాగే అంది, సింహం. ఎలుక నాయకుడు తనచోటు చేరి తనవారందరినీ సమావేశపరచి, జరిగింది చెప్పింది. కూడా ఉన్న నక్కమంత్రి, రాజుగారు మీకు బిడాల సంతానం నుంచి జరుగుతున్న అన్యాయాలని అరికడతానని  మాటిచ్చారని చెప్పింది. ఎలుకలన్నీ కిచకిచలాడుతూ బయలుదేరాయి, వల దగ్గరకి.

 అక్కడి చేరుకున్న తరవాత, ఎలుకనాయకుడు, రాజా! మీరిచ్చిన వాగ్దానం మీ నోటిద్వారా, మావారంతా వినాలని కుతూహలపడుతున్నారని చెప్పింది. అంతట నక్క మంత్రి, రాజుగారు బిడాలసంతానం మీపట్ల వ్యవహరిస్తున్న దాని గురించి రాజుగారు, విచారం వెలిబుచ్చారు, ఇక మీదట ఈ అన్యాయాలు జరక్కుండా కట్టడి చేస్తానని   మాటిచ్చారు , అని చెప్పింది. దానికి సింహం తలూపింది. ఇంతలో ఒక చిట్టెలుక, నాయకా! ఏవిషయమూ రాజుగారి నుంచి వినాలని మా ఎలుకలన్నీ కుతూహలపడుతున్నాయని సన్నాయి నొక్కునొక్కింది. ఎలుకలన్నీ ఏకకంఠంతో రాజుగారు మా ఎలుకజాతికి బిడాలసంతానం నుంచి జరుగుతున్న వేధింపులు,హత్యలనుంచి రక్షణ ఏర్పాటు చేస్తానని చెబితే ఈక్షణమే వల కొరకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేయి. సింహానికి చెప్పకతప్పలేదు.

గొంతు సవరించుకుని దీనంగా, మీరంతా నా ప్రాణదాతలు, మిమ్మల్ని రక్షించకూడా ఉండలేను, బిడాల సంతానం, మీ అందరిపట్ల కొనసాగిస్తున్న వేధింపులని అరికడతానని చెప్పింది. ఎలుకలు సింహరాజుకీ జై అంటూ వలమీదపడి, తెంపిపారేశాయి. తుక్కుతుక్కుగా కొరికేసాయి,వలని.  

  సింహం బయటికొచ్చింది. ఒక్కసారి జూలు విదిలించి, పెద్ద గర్జనచేసింది, దానితో అప్పటిదాకా సింహం మీద స్వారీ చేసిన ఎలుకలన్నీ ప్రాణభయంతో పారిపోయాయి,ఎలుకనాయకునితో సహా!


అప్పుడు నక్కమంత్రి రాజా!మీరు విడుదలయ్యాకా, ఎలుకల్ని సన్మానిస్తారనుకున్నా! ఒక్క సారి గర్జించే సరికి అంతా అస్తవ్యస్తమయింది, అంది. దానికి సింహం, ''మంత్రీ! వారు నా రాజ్యంలో నా పాలితులు. రాజుకి కష్టం వచ్చినప్పుడు రక్షించడం  వారి విధి. దానిని వారు చక్కగా నిర్వర్తించారు, మన పౌరులకి వారి ధర్మం తెలిసి ఆచరించినందుకు సంతసం. మరోమాట విను,ఎంతఖరీదైన చెప్పులైనా కాలికే తొడుగుతారుగాని నెత్తిన పెట్టుకోరు '' . విన్న నక్క మంత్రి, చేష్టలుడిగి రేపటి రోజూ నేనూ అంతే కదా! అని మనసులో అనుకుని, వగచింది,ఇలా అనుకుంటూ....

శా.రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
బీజంబుల్‌, తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితి\న్‌ జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!


కత పాతదే కొత్తహంగులతో  

8, డిసెంబర్ 2023, శుక్రవారం

తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నట్టు

 తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నట్టు


ఇదొక నానుడి.

 ఒకపల్లెలో ఒక ఇల్లాలు పాలు దాలి మీద పెట్టి నిద్దరోయింది. పాలు కాగిపోయాయి, దాలి దిగిపోయింది, పాలు చల్లారాయి. ఐనా ఇల్లాలు పాలు జాగ్రత్త చేసుకో లేదు. ఈ లోగా ఒకపిల్లి చూసింది. బలే ఛాన్సు లే! బలే ఛాన్సులే లలలాం లలలాం లక్కీ ఛాన్సులే!! అనుకుని దాలి దగ్గరకి చేరింది. కుండలో మూతెట్టింది. పాలందలేదు. ఒక కాలితో కుండని వంచబోయింది. కుండ ఒరిగిందిగాని పాలందలేదు. మరికొంచం వంచబోతే పాలు ఒలికాయి. ఈ చప్పుడుకి ఇల్లాలు లేచింది. పిల్లి పరుగుపెట్టక తప్పలేదు :) మెడ మరి కొంచం కుండలోకి వంచితే పాలు దొరికేవి, కాని బద్ధకం ఆవరించి కుండ వంచితే పాలు ఒలికితే వీపు చిట్లింది. 


ఇలాగే 

ఎప్పుడు సంపదగల్గిన

అప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెఱువు నిండిన 

గప్పలు బదివేలు చేరు గదరా సుమతీ.


ఇంకా

సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ

నారికేళ సలిలము భంగిన్

సిరిదా పోయిన పోవును 

కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!


సిరి చేరే టప్పుడు గజ్జెల చప్పుడుండదు. చేరిన తరవాత గజ్జెల చప్పుడు ఆగదు. సిరి చేజారేటప్పుడు గజ్జెల చప్పుడు వినపడదు. అలాగే సిరి ఉన్నంతకాలం జనం వెంటుంటారు, నీరున్నంతకాలమే కప్పలున్నట్టు. 


అధికారం చేజిక్కించుకోడం తేలికైన పనికాదు.  శిఖరాగ్రానికి చేరాలంటే కష్టపడాలి. అక్కడికి చేరేకా కిందికి చూస్తే ఇళ్ళు బొమ్మరిళ్ళులా,మనుషులు చీమల్లా కనపడతారు. ఇలా కనపడ్డం నిజమే, కాని ఇలా కనపడుతున్నది భ్రాంతి సుమా, నిజం కాదని తెల్సుకుంటే కొంతసేపు శిఖరం పై ఉండగలరు. లేకపోతే పతనం పెద్ద సమస్య కాదు. అప్పుడు తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నవతు.

అధికారమూ ఇంతే!!!!

6, డిసెంబర్ 2023, బుధవారం

పనసపండు కోసి పళ్ళెంలో పెడితే

పనసపండుకోసి పళ్ళెంలో పెడితే, తినడం చేతకానివాడు 

  దిక్కు దిక్కున చూసాడు.

***

పనసపండు కోసుకు తినడం అంత తేలికైన పనేం కాదు. పనసపండు కోసుకోడం తెలియాలి. దీనికి పదునైన కత్తి కావాలి. నూనె కావాలి. వాటిని సిద్ధం చేసుకోవాలి. నూనె లేకపోతే పండులో ఉన్న జిగురు చేతులకంటుకుపోతే కోసుకోడమే కష్టం. చేతులకి నూనె రాసుకోవాలి. కత్తికి నూనె రాయాలి. పండును తకిందులుగా నిలబెట్టి వెనకనుంచి నిలువుగా కోయాలి కొంచంలోతుగా, పై తొక్క దళసరిగా ఉంటుంది, అది తెగేదాకా కోయాలి. ఆలాగే నాలుగు పక్కలా కోయాలి. అప్పుడు  ముక్కలుగా గట్టిగా విరవాలి. లోపల ఉన్న బొడ్డును నిలువుగా కోయాలి. ఇప్పుడు ముక్కలొస్తాయి. తొనలప్పుడే దొరకవు. ముక్కని మిగిలిపోయిన బొడ్డు కోయాలి. ముక్కని విరవాలి. తొనలు పీచులో ఉంటాయి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఒక్కో తొనా పీకాలి,  తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులనున్న నూనె జిగట పోవాలంటే, కొంచంగా అంటిన జిగురుపోవాలంటే మరికొంచం నూనె పట్టించి చేతులు గుడ్డతో తుడుచుకుని ఆపైన సున్నిపిండితో చేతులు రుద్దుకోవాలి.


ఇంత బాధ పడక్కరలేక పనసపండు కోసి తొనలు పళ్ళెంలో పెట్టి తినమంటే దిక్కులు చూసినవాణ్ణేమంటారు? చేతకాని వాడు.

చేతకాని మొగుడికి చేష్టలెక్కువ. చెల్లని రూపాయికి గీత లెక్కువ

ఇంకొంచం మోటు సామెత చెబుతారు, వద్దు లెండి.

4, డిసెంబర్ 2023, సోమవారం

ఓటమికన్నీ కారణాలే!

 ఓటమికన్నీ కారణాలే!


గెలుపుకంతా చుట్టాలేనంటారు. సరేలే! నేను పోటీ చెయ్యక, నిన్ను బలపరిచేనుగనక నెగ్గేవు దగ్గరనుంచి, గల్లీ లీడర్ నుంచి  జండా మోసిన కార్యకర్తదాకా, ఓటేసిన మారాజుదాకా అంతా చుట్టాలే! 


మరి ఓటమికన్నీ కారణాలే!

మొదటిది నోటివట్టం. కనపడే కారణాలు కొన్నే!!  నిజంగా వెతుక్కుంటే,   కనపడని కారణాలెన్నో!!!


అదేంటయ్యా! నిన్నటిదాక ఇదే నోటివట్టం కదా!   పనికొచ్చింది,నచ్చింది.  ఇప్పుడేమయింది, కొత్తగా?  

 నిన్నటిదాకా నోటివట్టాన్ని జనాలు మెచ్చేరు, నేడు నొచ్చేరు, అంతే తేడా!!!!!

అదేకదా కాలం కలసి రాకపోవడమంటే! అదే   విధి అంటేనూ!


3, డిసెంబర్ 2023, ఆదివారం

ఇలా జరిగింది.

 ఇలా జరిగింది.

 వివిధ ఇంగ్లీషు పత్రికలలో ( ఏడుపుగొట్టు పత్రికలతో సహా)  వచ్చిన వార్తలు చదివిన మీదట ఏర్పరచుకున్న అవగాహనతో రాసినది.


సొరంగం కూలినదాని గురించి  తెలుసుకోడానికి,  కొన్ని ముందు మాటలు.సొరoగం పొడవు నాలుగు కిలో మీటర్ల పైమాట. ఎత్తు పదేను మీటర్లు. చుట్టుకొలత నలభై ఐదు మీటర్లవుతుంది. సొరంగం రెండు కిలోమీటర్ల పైగా తవ్వేసేరు. స్టీలు గర్డర్లు అమర్చుకుంటూ కాంక్రీట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారని అవగాహన. ఈపని కొంత దూరం జరిగింది. ఈ కూలినచోటు ముఖద్వారానికి కొద్ది  దూరంలోనే జరిగినట్టు అనిపిస్తుంది. కొద్దిగా కాంక్రీటు రాలితే చర్యలు తీసుకునేలోగానే కూలిపోయింది. కూలిన డెబ్రిస్ లో మట్టి,రాళ్ళు, కాంక్రీటు, ఇనుము కూడా ఉన్నాయి. సొరంగం కూలిన దూరం అరవై మీటర్లని అంచనా! డెబ్రిస్ దూరం అరవై మీటర్లు. సొరంగం తవ్వినంత మేరా కరంటు ఏర్పాటుంది. లోపల ఒక నీటి ఊట ఉన్నది. దానినుంచి వచ్చేనీటిని బయటికి పంపేందుకు ఒక పైపు వేయబడింది.


సొరంగం కూలే సమయానికి లోపల పనివారున్నారు. వెంటనే వారిని రక్షించే చర్యలు మొదలయ్యాయి. ఎంతమందున్నారో ( వెంటనేతెలీదు ), ఎలా ఉన్నారో తెలీదు. లోపలివారికి బయటివారికి మధ్య సంభాషణకి మార్గం,మాధ్యమంలేదు. ఈ పరిస్థితులలో కూలిన డెబ్రిస్ ని తొలగించడానికి పూనుకుంటే, మరికొంత కూలడం మొదలైతే, దాన్ని అపేసేరు. ఇతర విధాలగా రక్షణ చర్యలు ప్రారంభించారు.


 ఇక  లోపలివారు,  ఉన్నవారెంతమందో, లోపలున్నవారెలా ఉన్నారో, ప్రమాదంలో గాయపడ్డారో చూసుకున్నారు, బయటపడే మార్గానికి ఎదురు చూస్తూ. లోపల నలభై ఒక్కమంది ఉన్నట్టూ అంతా బాగున్నట్టూ,లోపల కరంట్ ఉన్నట్టూ, పోలేదని వివరంగా ఒక చీటి మీదరాసి నీటి పైప్ లో వదలిపెట్టేరు. దీని బయటివారు చూసి అమ్మయ్య! అంతా బతికున్నారని సంబరపడి రక్షణ చర్యలు ముమ్మరం చేస్తూ, లోపలివారికి ఆహారం, మిగిలిన వసరాలూ కోసం ఒక ఆరంగుళాల పైప్ ని లోపలికి చొప్పించారు.   ఆరంగుళాల పైప్ లకి మరలుంటాయి, ఆ పై సైౙ్ వాటికుండవు. పైప్ పొడవు ఆరుమీటర్లుంటుంది. ఆరంగుళాల హోల్ డ్రిల్ చేసి అందులో పైప్ ని దూర్చేసేరు, కపులర్ బిగించి తరవాత పైప్ ని దూర్చచ్చు. కాని మూడడుగుల పైప్ కి అలా కుదరదు. వెల్డింగ్ చెయ్యాలి అదికూడా అన్నీ ఒక్క సారి చేసేస్తే కుదరదు. ఒక పైప్ దూర్చిన తరవాత దానిలోంచి ముందుకు డ్రిల్ చేసి ఈ కొత్త పైప్ ని లోపలున్నదానికి వెల్డ్ చేయ్యాలి, అదికూడా జాగ్రత్తగా చెయ్యాలి ఖాళీలు లేకుండా! ఇవన్నీ సమయం తీసుకునే పనులే! మరికొంతమంది వెల్డర్లని డిల్లీ నుంచి పంపేరు. ఇలా సమయం గడుస్తూంది. అంతేకాదు ఈ డ్రిల్ మిషనలకి కూడా విరామం కావలిసొచ్చేది రెండు గంటల పని తరవాత. ఇలా ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ పని కొనసాగింది, మొండికి పడిపోలేదు.    ఇదంతా నేను చెప్పినంత తేలిగా జరగలేదు. 


లోపలున్నవారి దగ్గర పెన్నూ పేపరూ ఉండటం అదృష్టం. పేపర్ మీద రాసి నీటి పైప్ లో వదలాలనే ఆలోచన రావడం అదృష్టం. ఇటువంటి గత రెండు సంఘటనల్లో చిక్కుకుని బతికి బయటపడ్డ సీనియర్, గబ్బర్ సింగ్ నేగీ లోపల  చిక్కుబడటం మరో అదృష్టం. బయటివారు ఆరంగుళాల  పైప్  లోపలి చొప్పిస్తే దానికి అడ్డులేం తగలకపోవడం మరో అదృష్టం. ఇదంతా జరగడానికే రెండు రోజుల పైగా సమయం పట్టినట్టుంది. ప్రతి క్షణం ఏం జరగబోతుందో తెలీదు.  ఈ నేగి అనే ఆయన లోపల వారికి ధైర్యం చెప్పడమే కాక అందరూ ఒకరితో ఒకరు మాటాడుకునే మాట చెప్పేరు. యోగా చేసేరు,చేయించేరు. కొంతమందికి నేర్పేరు కూడా. ఇది లోపలి వారికి కలిసొచ్చిన అదృష్టం. 


అంతా ఉత్కంఠ, నిజానికి కొన్ని రోజులు వార్తలు చదువుతూ నేను కొంత ఉద్విగ్నతకులోనై నిద్రలేక ఆరోగ్యం చెడగొట్టుకున్నానన్నది నిజం. ఆరంగుళాల పైప్ లోంచి కెమేరా పంపించారు, లోపలికి. వీడియో  తీశారు. కావలసిన వన్నీ ఆహారంతో సహా పైపు లోంచి లోపలకి పంపించారు.  

లోపలివారి క్షేమసమాచారం బంధువులకి చేరేసేరు. ఆ తరవాత సెల్ ఫోన్ లు లోపలికి పంపేరు,లోపలివారు వారికి కావలసినవారితో మాటాడటానికి. ఇక  బయటికి తీసుకు రావడానికి మూడడుగుల పైప్ లోపలికి చొప్పించే పని మొదలెట్టేరు. యంత్రం హుటాహుటిన అక్కడికి చేరుకుంది.కొంత పనయింది.  పనయింపోతుంది, దీనితో అనుకునేలోగా యంత్రం చెడింది, బాగుచెయ్యడానికి సమయం పట్టింది.మళ్ళీ మొదలెట్టి కొంతపనయ్యేటప్పటికి మళ్ళీ చెడింది, మరి బాగుకాలేదు. ఈలోగా చాలా సార్లు స్టీలు అడ్డుపడటం దానిని తొలగించడానికి చర్యలు తీసుకోడం జరిగింది.   అడ్డుపడిన స్టీలు గర్డర్లని కొయ్యడానికి కట్టర్ యంత్రాలని హైదరాబాద్ నుంచి వాయుమార్గంలో పంపేరు. చాలా యంత్రాలు డిల్లీనుంచి వచ్చాయి. ఇక రెండవ అమెరికన్ డ్రిల్ యంత్రం మారుమూల ఉన్నదానిని ప్రత్యేక మార్గంలో,  రైల్వే చేరేసింది, హుటహుటిన.   ఈ యంత్రం కొంతపని పూర్తి చేసింది. దీన్ని  నిలబెట్టడానికి   కాంక్రీట్ వెయ్యల్సివచ్చింది. కొంత పనయ్యాకా కాంక్రీట్ నిమళ్ళీ పటిష్టం చేయాల్సివచ్చింది. ఈలోగా ఇటువంటి విషయాలమీద అవగాహన కలిగిన థాయ్ నిపుణులను సంప్రదించారు. ఆ తరవాత ఒక అమెరికన్ నిపుణుడు చివరిదాకా ఇక్కడే మకాం చేసేరు. ఇదొకటే రక్షణ మార్గం కాకపోవచ్చని పైనుంచి తొలిచే డ్రిల్ ఒ.ఎన్ జి.సి వారు ఏర్పాటు చేసి కొంతపని చేసేరు. కొన్ని అవసరమైన కొత్త రోడ్లు వేసేరు,హుటాహుటిన. ఇక లోపలివారి ఆరోగ్యానికి చర్యలు తీసుకున్నారు, మానసిక ఆరోగ్య నిపుణులు సలహాలిచ్చారు. పక్కనుంచి మరో సొరంగం చిన్నది తవ్వాలనుకున్నారు. ఇలా చాలా ఆలోచనలు చర్యలూ సాగాయి.అందరిది ఒకటే లక్ష్యం లోపలివారిని క్షేమంగా బయటకు తీసుకురావాలి. ఈ అమెరికన్ యంత్రం చాలా పనిచేసి చివరగా లోపలివారికి పన్నెండు మీటర్ల దూరంలో ఉండగా చెడిపోయింది. దీన్ని తొలగించడానికే సమయం పట్టింది. చిక్కుపోయిన యంత్ర భాగాలు తొలగించడం పెద్ద పనైపోయింది.ఇలా ఎప్పటికప్పుడు ఆశ నిరాశల మధ్య ఊగులాడింది.    చెప్పినంత సులువుగానేం జరగలేదు.  . ఈ పనులు హుటహుటిన జరగడానికి అన్ని శాఖలూ వెంటవెంటనే పనిజేసాయి.


ఇలా మూడదుగుల పైప్ చొప్పించే పని చివరికి చేరడానికి పన్నెండు మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు నిరాశ కమ్ముకుపోయింది. ఈ పరిస్థితులలో ఎలుకబొరియ విధానం అక్కరకొచ్చింది. ఏమది?


ఎలుక తనులోపలికి వెళ్ళడానికి తనుపట్టేపాటి రంధ్రం చేస్తుంది, మట్టి వెన్నకి తోస్తూ తనులోపలికి ప్రవేశిస్తుంది. ఇలా మైనింగ్ చేయడం అనాదిగా ఉన్నదే. ఈ పనికి ముగ్గురుంటారు. ఒకరు తవ్వేవారు, ఒకరు మట్టి పోగుచేసి తట్టలలో నింపేవారు, మూడో వారు దానిని బయటికి చేరేసేవారు. ఈ విద్య ఇంకా అక్కడక్కడ అవసరపడి అమలు లోనే ఉన్నది. నవయుగ అనే కంపెనీ నీటి గొట్టాల్లో పేరుకుపోయిన మట్టిని ఈ విధానంలో తొలగిస్తూ ఉంటుంది. విషయం తెలిసిన కంపెనీ ఆరుగురిని ఒక చోటనుంచి, మరో ఆరుగురుని మరో చోటనుంచి ఎంపిక చేసింది. వారిని సిల్క్ యారా పంపింది. వీరు ముగ్గురు ఒక జట్టుగా ఆరేసిగంటలు  పనిచేసేరు. మొత్త పన్నెండు మీటర్ల దూరాన్ని 22 నుంచి 26 గంటలలో తవ్వి పైప్ అమర్చేందుకు సిద్ధం చేస్తే పైప్ ని దూర్చి వెల్డ్ చేసి దారి ఏర్పాటు చేసేరు.


ఇంతజరిగిన తరవాతగాని లోపలివారిని బయటకు తీసుకురావడం సాధ్య పడలేదు. నేను కొన్ని విషయాలని ముందు వెనుకలూ చెప్పి ఉండచ్చు. మొత్తానికి ఇది ఇలా సాధ్యమయింది.    

 

 నిజానికీ టపా రాయగలిగి రాయలేదు. బోనగిరిగారి మాట "ఆ పైప్ ని ముందే వేసుకునుండచ్చుగా?" అన్న ప్రశ్న నాచే ఈ టపా రాయించింది, చాలా కష్టపడ్డాను. ఈ రోజు మొత్తం నాలుగు గంటలు పైగా కంప్యూటర్ దగ్గర కూచున్నా!. 


ఇక ఇటువంటి భారీ పనులు జరిగే చోట ప్రమాదం జరక్కుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? ఏవి తీసుకున్నారు? ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలేంటి? వాటిని తీసుకున్నారా? ప్రశ్నలుండిపోయాయి. జరగబోయే ఎంక్వైరీలో బయటకు రావచ్చేమో!    


1, డిసెంబర్ 2023, శుక్రవారం

కన్నూ మిన్నూ

 కన్నూ మిన్నూ


'నీకు కన్నూ మిన్నూ కానరావటంలేదురా!' అని తిడుతుంటారు. దీని అర్ధమేమీ?

కన్ను కానకపోవడం జరిగితే మిన్నే కాదు ఏదీ కనరాదుకదా! అంటే దీని అసలు రూపం ఇది కాదనమాట.


'మన్నూ మిన్నూ కనరావటం లేదు, నీకు' అనితిడితే ఏమన్నట్టు? మన్ను, కాళ్ళ కిందుంటుంది అదే భూమి. ఇక మిన్ను అంటే ఆకాశం నెత్తి పైనుంటుంది. అంటే నీకు కిందపైనా లేదా కిందా మీదా కనపట్టం లేదూ! అని అర్ధం. అదేమి? అంటే నీకు పెద్దా, చిన్నా తేడా కాని, ఉచ్చం, నీచమనే తేడా; ఉచితం, అనుచితమని కాని అవుపించటం లేదనర్ధం. అదీ అసలు సంగతి.

29, నవంబర్ 2023, బుధవారం

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.

 

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.


సిల్క్ యారా దగ్గర నిర్మాణం లో ఉన్న సొరంగంలో ప్రమాదవశాత్తు 41 మంది శ్రామికులు చిక్కుకుపోయారు, 17 రోజులుగా.  నిన్న అర్ధరాత్రి బయటికొచ్చేరు,క్షేమంగా


ప్రమాదం జరిగినప్పటినుంచి చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు రాత్రిపవలు తేడా లేక ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. బయటనుంచి చిక్కుకుపోయినవారి దగ్గరికి ఒక ఒక మార్గం ఏర్పాటు చేయడం ఒక ప్రయత్నం. దీనికోసం పెద్దపెద్ద యంత్రాలని హుటాహుటిన తరలించడం జరిగింది. ఒక యంత్రం కొంత పనిచేసి పాడయింది.ఆ తరవాత మరొక పెద్దయంత్రం ఆ పని కొనసాగించి రిపేరుకి సాధ్యం కానంతగా పాడయింది. ఏర్పాటు చేస్తున్నదారి, చిక్కుకున్నవారి నుంచి పన్నెండు మీటర్ల దూరాన ఆగిపోయింది. అప్పుడు సనాతనమైన ఎలుక బొరియ విధానమే అక్కరకొచ్చి చివరి పన్నెండు మీటర్లు పద్దెనిమిది గంటలలోపున నిపుణులు పూర్తిచేసేరు. దానిలోకి స్టీల్ పైపుని అమర్చారు, మనిషిపట్టి   తప్పించుకోను వీలున్నదానిని. దాని ద్వారా లోపల చిక్కుకున్న శ్రామిక సోదరలంతా క్షేమంగా బయటకొచ్చేరు. శ్రామికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు పని చేసిన సంస్థలకి,ఆందుకోసం పని చేసిన వారందరికి జేజేలు! ఇక చిక్కుని ఉండిపోయిన శ్రామికులు నమ్మకం కోల్పోక ఉండి జయప్రదంగా బయటకు వచ్చినందులకు అభినందనలు. ప్రయత్నం సఫలం చేసిన భగవానునునికి నమస్కారాలు.


ఎలుకబొరియ విధాన తవ్వకం భారతదేశం లో నిషేధింపబడింది, కాని అదేవిధానం నేడు అక్కరకొచ్చింది..

పాతంతా రోతకాదు! కొత్త వింతాకాదు!! పాతకొత్త విధానాల మేళవింపు  అద్భుతఫలితాలిస్తుంది.

24, నవంబర్ 2023, శుక్రవారం

చిలికి చిలికి గాలివానయినట్టు.

 చిలికి చిలికి గాలివానయినట్టు.

ఇది ఒక నానుడి. చిన్నదిగా ప్రారంభమయినది ఆ తరవాత ప్రళయంగా మారడానికి వాడుతుంటారు.  నిజానికిది చినుకు చినుకు గాలివానయిందన్నది అసలు స్వరూపం అనుకుంటా. చిన్నదిగా ప్రారంభమైన ది  ఆ తరవాత చూస్తుండగా పెద్ద గాలివానైనట్టు. ఈ మాటని, చిన్న చిన్నగా, సరదా సరదాగా, ప్రారభమైన తగువు, ఆతరవాత పెద్ద కొట్లాటగాను ఆ తరవాత యుద్ధమే ఐనట్ట్లు కూడా చెబుతుంటారు. 

ఊరలేనిదే పేర పిలవరు

ఇదొక నానుడి. ఊళ్ళో పుట్టి పెరిగినవాణ్ణి ఆ ఊళ్ళోవాళ్ళు ఏదో పేరుతో పిలుస్తుంటారు.ముద్దు పేరైనా కావచ్చు. చిన్నబాబు,కన్నబాబు,ఎంకన్నబాబు,కొండబాబు ఇలా. ఇవి అసలు పేర్లూ కావచ్చు ముద్దుపేర్లూ కావచ్చు. ఇదే మనిషి, ఎక్కువకాలం ఊళ్ళో ఉండక ఎప్పుడేనా ఊరికి  వెళితే, ఎవరుబాబూ మీరు? అనే అడుగుతారు. ఎందుకంటే ఎక్కువకాలం ఎవరూ ఎవరినీ గుర్తు పెట్టుకోరు, గుర్తుంచుకోలేరు, కారణం రూపురేఖలు మారిపోతాయి, కాలంతో. ఇది నాకు చాలా స్వానుభవం, పుట్టి పెరిగిన ఊరిలో. అంతెందుకు నా సహాధ్యాయి, ఒరే అంటే ఒరే అనుకున్న వాళ్ళం మా ఊళ్ళో అన్నయ్య ఎదురుగా కలిసేం. అతను ఆ రోజుకు గ్రామ ప్రెశిడెంట్, ఏదో విషయం మాట్లాడడానికి వచ్చేడు, అన్నయ్యతో. నేనూ, అతనూ కూడా పలకరించుకోలేదు, గుర్తు పట్టలేదు ఇద్దరమున్నూ. అప్పుడు అన్నయ్య ఇతనెవరో తెలుసా? అడిగారు, నన్ను. తెలీదని బుర్రూపాను, అతన్ని అడిగితే అతనూ అంతే చెప్పేడు. అప్పుడు అన్నయ్య చెప్పేడు ఇద్దరికిన్ని ఇతను నీ స్నేహితుడు పాపోలు నాగరాజు అని, వీడు నా తమ్ముడు శర్మ అని చెప్పడంతో ఒక్క సారి నిర్ఘాంతపోయాం. ఆ తరవాత ఇద్దరమూ మీరు,మీరు అంటూ మాటాడుకున్నాం. చాలా సేపటికిగాని ఒరే అంటే ఒరే అనుకోలేకపోయాం. చిత్రం కదా! ఇదే ఊరలేకపోతే పేర పిలవరన్నదానికి సాక్ష్యం.


ఆ తరవాత కాలంలో దీనికి మరోలా అన్వయం కూడా చెపుతున్నారు, నిప్పు లేనిది పొగరాదుగా! ఏదో లేనిది కేసులెందుకు పెడతార్లే, ఊరలేనిది పేర పిలుస్తారేంటిలే!!! 

22, నవంబర్ 2023, బుధవారం

కొఱవితో తల గోక్కున్నట్టు


కొఱవితో తల గోక్కున్నట్టు

మండుతున్న కట్టెను కొఱవి అంటారు. దీనితో తలగోక్కుంటే ఏమవుతుంది? తల అంటుకుపోతుంది. కాలుతుంది. అనగా అనాలోచిత అవివేక చర్యగా చెబుతారు. తెలిసి,తెలిసి చేసేతప్పుగానూ చెబుతారు. 


సంచి లాభం చిల్లి కూడదీసినట్టు.

 సంచిని గోతం అని కూడా అంటారు. ఇప్పుడంటే 25కేజిలకి,50కెజిలకి,100కెజిలకి గోతాలున్నాయిగాని ఒకప్పుడు సంచి అంటే 100కెజిలు లేదా 24 కుంచాలు ధాన్యం పట్టే జనపనార సంచి అని వాడుక. గుడ్డ సంచిని చేతి సంచి అంటారు, ఇది చిన్నదిగా ఉంటుంది. పాతకాలంలో కొలతేగనక సంచి నిండాఅంటే 24 కుంచాలేనని వాడుక. ఈ సంచుల్ని మరలమరల వాడుతుంటే సాగిపోతాయి. 24 కుంచాలకంటే ఎక్కువ పడతాయి. ఒక వ్యాపారస్థుడు ఇలా సాగిపోయిన సంచి తీసుకుని రైతు దగ్గర ధాన్యం కొన్నాడు, ఇలా సాగిపోయిన సంచిలో నింపుకున్నాడు,ఎక్కువ ధాన్యం తెచ్చుకోవచ్చని ఆశకొద్దీ, లాభపడచ్చనుకుని. వాడకం ఎక్కువ కావడంతో అది చిల్లి పడింది, కాని ఇతను గమనించలేదు. ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాడు, ఇంటికొచ్చేటప్పటికి అవి కాస్తా24 కుంచాలే ఉన్నాయి, కొల్చుకుంటే. ఎక్కువ పట్టిన వడ్లు ఏమయ్యాయి,చిల్లిలోంచి దారిపొడుగునా కారిపోయాయి. లాభం వస్తుందనుకుని ఆశకు పోయి మోసం చెయ్యబోతే జరిగేదానికి ఈ మాట చెబుతారు. ఒక్కొకప్పుడు ఇలా చేస్తే నష్టం కూడా వస్తుందనీ అంటారు. 

ఈనగాచి నక్కలపాలు.

ఇది వ్యవసాయ సంబంధమైన నానుడి. పంట వేసిన దగ్గరనుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, కాపలా కూడా కావలసొస్తుంది కొన్ని పంటలకి. ఇలా పంటని వేసింది మొదలు జాగ్రత్తగా కాపాడుకొచ్చి, చివరి కాలానికి అనగా పంట ఫలించే సమయానికి అశ్రద్ధ చేస్తే పాడవుతుంది, శ్రమ,సొమ్ము, సమయం వృధా అవుతాయి. ఈ నానుడి ముఖ్యంగా చెఱకు పంటకు చెబుతారు. చెఱకు సిద్ధమయ్యే కాలానికి నక్కలు పాడు చేస్తాయి.ఆ సమయం లో కాపలా కూడా పెడతారు, పంట కాపాడుకోడానికి. ఫలసాయం చేతికొచ్చే సమయానికి అశ్రద్ధ చేయడాన్ని ఈ నానుడితో చెబుతారు. 


10, నవంబర్ 2023, శుక్రవారం

మొలతాడు బిగిసింది.

 మొలతాడు బిగిసింది.


మొలతాడు బిగిసిందంటాం. మొలపెరిగిందనుకోం.  మొలతాడు చిక్కదు :) మనమే బలుస్తాం,ఎప్పుడో కట్టుకున్న మొలతాడిప్పుడెందుకు బిగుస్తుంది?మొల చుట్టుకొల్త పెరిగితేనేకదా!


సమస్య పట్టుకుని వదలటం లేదంటాం. సమస్యని మన మనసు పట్టుకుంది, తన చుట్టూ కట్టేసుకుంది. కాని సమస్య పట్టుకుంది వదలటం లేదంటాం.వదలవలసిందెవరు? మనమనసే. 

తననెవరో పట్టుకున్నారంటుంది, మరెవరో విడిపించాలనీ అనుకుంటుంది. చెబితే శానా ఉంది. 

అన్నిటికి మూలం మన మనసు.

ఇక చాలు.

సర్వే జనాః సుఖినోభవంతు.

.....స్వస్తి.....


9, నవంబర్ 2023, గురువారం

కాస్త తాళుము కృష్ణా

  కాస్త తాళుము కృష్ణా



తలుపు తీయునంతలోనె
తత్తర మదియేల నోయి?
తలుపుదీతు వీలు జూచి
తాళుము కృష్ణా!
    కొంతసేపు
తాళుము కృష్ణా!
    పతి నిద్దుర వోవలేదు
    మతి సందియ మొందె నేమొ
    పతికి కునుకు పట్టగ లో
    పలకు వత్తుగాని తాళు
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!
నుదుట బొట్టు దిద్దలేదు
చెదరియున్న ముంగురులను
కుదురుజేయలేదు యేల
పదెపదె పిలచెదవురా
తాళుము కృష్ణా!
    కాస్తసేపు
తాళుము కృష్ణా!
    ఏల నంత తత్తరమ్ము
    ఏల నంత భయము, సామి
    నిన్నుగాక వేరొక్కని
    నెట్లు వలవగలను కృష్ణ!
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!


గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!
కోరి వండినానోయ్‌ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్‌ బావా!
    కోరికతో తినవోయ్‌ బావా!తియ్యని పాయసమోయ్‌ బావా!
తీరుగ వండానోయ్‌ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్‌ బావా!
    బాగని మెచ్చాలోయ్‌ బావా!కమ్మని పూరీలోయ్‌ బావా!
కర కర వేచానోయ్‌ బావా!
కరకర వేగిన పూరీలతో నా
కాంక్ష వేపినానోయ్‌ బావా!
    కనికరించి తినవోయ్‌ బావా!వెన్నెల యిదుగోనోయ్‌ బావా!
కన్నుల కింపౌనోయ్‌ బావా!
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న గలిపినానోయ్‌ బావా!
    వేగముగా రావోయ్‌ బావా!పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వుల బరిచిందోయ్‌ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా
పొదిపిపెట్టినానోయ్‌ బావా!
    పదవోయ్‌ పవళింతాం బావా!
బసవరాజు అప్పారావు గారి గేయం

8, నవంబర్ 2023, బుధవారం

మాట విలువ

మాట విలువ  

 రామకృష్ణులు మఠంలో ఉండగా, ఒక తల్లి తనకొడుకుని తీసుకుని వచ్చి, ఈ కుర్రవాడు చిన్నవయసులోనే చెప్పినమాట వినటం లేదు, బెల్లం ఎక్కువ తింటున్నాడు , మీరు చెబితే వింటాడని మీదగ్గరకి తీసుకొచ్చానంది.


విన్న రామకృష్ణులు రేపురమ్మని వాయిదా వేసేరు. ఆ తల్లి కొడుకుని తీసుకుని మరునాడొచ్చింది. మళ్ళీ రేపురమ్మని వాయిదావేసేరు. ఇలా వాయిదాలమీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు, కాని కుర్రవానికి బెల్లం తినద్దని చెప్పటం లేదు. ఆ తల్లి పట్టువదలక తిరుగుతూనే ఉంది. చివరికి   నెలదాటిన తరవాత రామకృష్ణులు ఆ కుర్రవానితో, బెల్లం తినకు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేరు. అప్పుడు ఆ తల్లి రామకృష్ణులతో, ఈ మాట మీరు నెలకితమే చెప్పి ఉండచ్చుగా! అని అడిగింది. అంత రామకృష్ణులు తల్లీ! నెలకితందాకా నేనూ బెల్లం తింటున్నవాడినే. ఈ నెలలోనే నేను బెల్లం తినడం మానేసాను, ఆ తరవాతే చెప్పేను, అన్నారు. చిత్రంగా ఆ కుర్రవాడు ఆ   తరవాత బెల్లం మరి తినలేదు.


ఆచరించి చెప్పినమాటకంత విలువుంటుంది.

గాలివాటు మనుషుల మాటకి విలువుండదు.

6, నవంబర్ 2023, సోమవారం

గతకాలపు వైభవ చిహ్నాలు.

 



Raleigh సైకిలు


LG TV

Post-Box


కల్వం,సన్నికల్లు,రుబ్బురోలు,కుందిరోలు


వస్తువుల్ని గుర్తు పట్టండి

అవసరం తీరేకా మానవులూ ఇంతే! ఐతే కొందరు గతకాలపు వైభవ చిహ్నాలుగా మిగిలిపోతారు, మరికొందరు కాలగర్భం లో నామరూపాలు లేక మలిగిపోతారు.

5, నవంబర్ 2023, ఆదివారం

శిలాభిశ్చ ప్రహరతి

 శిలాభిశ్చ ప్రహరతి


నమోఽస్తు రామాయ స లక్ష్మణాయ

దేవ్యై చ తస్త్యె జనకాత్మ జాయై

నమోఽస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో

నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః


జయత్యతి బలోరామో

లక్ష్మణస్య మహాబలః

రాజా జయతి సుగ్రీవో

రాఘవేణాభి పాలితః


దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః

హనూమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః


న రావణ సహస్రం మే

యుద్ధే ప్రతిబలం భవేత్

శిలాభిశ్చ ప్రహరతి

పాదపైశ్చ సహస్రసః


అర్దయిత్వా పురీం లంకా

అభివాద్య చ మైథిలీమ్

సమృద్దార్ధో గమిష్యామి

మిషతాం సర్వ రక్షసామ్


అర్థసిద్ధిం తు వైదేహ్యాః

పశ్యామ్యహముపస్థితామ్

రాక్షసేంద్రవినాశం చ

విజయం రాఘవస్య చ


**********

రామరామ జయరాజారామ్

రామరామ జయసీతారామ్

4, నవంబర్ 2023, శనివారం

దొంగని దొంగే పట్టాలి-1

 దొంగని దొంగే పట్టాలి...1


మొన్నీ మధ్యే ముల్లును ముల్లుతో తీయాలన్నదానికి ఒక కత చెప్పుకున్నాం. మరి దొంగని దొగే పట్టాలంటే! ఇదీ ఒక నానుడే. ఒక కత చెప్పుకుందాం.అలా ముందుకుపోదాం.


అనగనగా ఒక రాజ్యం, దానికోరాజు,ఒక మంత్రి.రాజ్యం ధనవంతమైనదే కాని పేదలే ఎక్కువ. ఆ రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి.రాజుకి తాకిడి ఎక్కువయ్యింది, దొంగతనాల గురించి. మంత్రిని నిలదీశాడు,రాజు. దానికి మంత్రి ''రాజా! కలిగినప్పుడు మాత్రమే దొంగతానాలెక్కువగా ఉంటాయి. లేనివాడింటికి కన్నమేసేటంత మూర్ఖుడు ఎవడూ ఉండడు. 'లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవు'. అంచేత మనదేశం ధనవంతమైనది, అందుకు సంతసించండి'', అన్నాడు మంత్రి.


రాజు,''దేశం ధనవంతమైనందుకు నిన్ను అభినందిస్తున్నాను. మన పరిపాలన  సవ్య దిశలో నడుస్తున్నట్టేగా! అది సరేగాని లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవన్నావు. అదేంటో చెప్పూ'', అన్నాడు.


వినండి, రాజా! మన దేశంలో ఒక పల్లెటూరు. అందులో ఒక జాయ,పతి. వయసులోనే ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ధనానికి లోటేమోగాని సంతానానికి లోటు లేదు, ఇంటి నిండా పిల్లలే! ఆ కుటుంబ యజమాని ధనం మాటెలా ఉన్నా పిల్లల్ని మాత్రం కనేసేడు, పదిమందిని. పూర్వులు సంపాదించి ఇచ్చిన కొంప పడిపోడానికి సిద్ధంగా ఉన్నదానిలో కాపరం. ఒక రోజు ఇంటి ఇల్లాలు పిల్లలికి కలిగినదేదో పెట్టి తను గంజితాగి పడుకుంది, ఉన్న ఒకే ఒక్కదీపాన్ని మలిపేసి.పిల్లలు తనూ కింద పడుకున్నారు. నడిరాత్రి ఒక దొంగ నెమ్మదిగా ఉతకలెత్తేసి తలుపులు తీశాడు. మెలుకువొచ్చిన ఇల్లాలు పడుకునే ఉంది. దొంగ ఇల్లంతా తిరిగేడు. చీకటి, ఎక్కడ చూసినా తలకి ఆనపకాయ బుర్రలేతగులుతున్నాయి. అవీ ఖాళీగా ఉన్నవే. ఇంక కాలికి పిల్లల పిర్రలే తగులుతున్నాయి, ఎటుతిరిగినా. ఏమీ విలువైనది దొరక్కపోతే దొంగ, ''ఎరక్కపోయి ఇంటికి కన్నం వేసాను, ఎటుచూసినా పైన బుర్రలు,కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకలేదని'' సణుక్కున్నాడు. విన్న ఇంటి ఇల్లాలు. 


''అన్నా!రాత్రి వేళ ఇంటికొచ్చావు. కనీసం గంజి కూడా లేదు, పోద్దామంటే! ముందు తలుపులెత్తేసేవు, దయ ఉంచి వెనక తలుపులు కూడా ఉతకలెత్తెయ్యి. వాటిని బాగుచేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా! వాటిని ఎత్తి బయటకు తీయలేక ఊరుకున్నా!'' అంది. విన్న దొంగ నిర్ఘాంతపోయాడు. ''చెల్లీ! దీపమేనా పెట్టుకోలేదే''మని అడిగాడు. 


''అన్నా! ఉన్నది ఒక్కదీపం అది రాత్రంతా వెలిగితే మర్నాడు వెలిగించుకోడానికుండదు'' ''బావగారు!......'' వాకబు చేశాడు దొంగ. ''పొరుగూళ్ళో ఉద్యోగానికెళ్ళేరు. ఉదయానికొస్తా''రంది. దొంగ చలించిపోయాడు, ఇంత దుర్భర దారిద్యం చూసి. దీపం వెలిగించమని, ఆపై ఆమె చెప్పిన పని చేసి పెట్టి, తన దగ్గరున్న సొమ్మును ఆమెకిచ్చి, దణ్ణం పెట్టి, ఇకపై దొంగతనం చేయనని కష్టపడి బతుకుతానని ఆమెకు మాటిచ్చి వెళ్ళేడు.


కతబాగుందిగాని అసలు సంగతి చెప్పండి, అడిగాడు రాజు. రాజా! విషయం రేపు చెబుతానని వాయిదా వేసాడు మంత్రి...

ఎదురు చూడక తప్పదుగా

1, నవంబర్ 2023, బుధవారం

నడక నేర్చుకుంటున్నా!

 

 


నడక నేర్చుకుంటున్నా!

 ఓం సర్వవ్యాధి ప్రశమనీయైనమః


చిన్నప్పుడు నడక నేర్చుకున్నా! అమ్మ వెనకుండి నేర్పింది. మూణ్ణెల్లు మంచం మీదుంటే, నడక మరిచిపోయా! నడవడమంటే భయంగా ఉంది పడిపోతానేమోనని, మళ్ళీ ఎముక విరుగుతుందేమోనని,భయం. మళ్ళీ

( ఓం దరహాసోజ్వలన్ముఖాయైనమః) అమ్మలగన్నయమ్మే నడక నేర్పిస్తోంది. మెల్లమెల్లగా అడుగులేస్తూ కఱ్ఱ బోటేసుకుని గ్రౌండు దాకా నడిచా! 


ఎందుకిన్ని తిప్పలు? హాయిగా పడుకోవచ్చుగా! నిజమే అలా మూడు నెలలు, కాలు విరిగి  బలవంతంగా పడుకుంటే, బద్ధకం ముందు పెరిగింది. ఆ పై సుగర్ పెరిగింది, బరువు పెరిగింది,BMI పెరిగింది.కనపడని బి.పి పెరిగింది.ఆకలి తగ్గింది.

సుగర్ డాక్టర్ నడిస్తేగాని సుగర్ తగ్గదు,బరువు తగ్గదు,బి.పి తగ్గదు, ఆకలిపుట్టదంటారు. ఎముకల డాక్టర్ పడుకునుంటేగాని కాలు సరిపడదంటారు. పిచ్చి కుదిరితే పెళ్ళికుదురుతుంది, పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది. ఏది ముందు? బలే లింకులేసేవయ్యా సామీ!అంతేలే కారణం లేనిది కార్యం జరగదని అంటారు. తీసుకుపోయేటందుకు, నెపం నీమీదుంచుకోవనీ అంటారు.

ఇంకా కొంతకాలం తిరిగే యోగం ఉన్నట్టే ఉంది, నడుస్తున్నా, నెమ్మదిగా, ధైర్యం వచ్చింది. :) 


పైవాడు బలే లింకు లేస్తాడు, తీయాలంటే అంత తేలిగ్గానే తీసేస్తాడు. అది పైవాని వల్లే ,అవుతుందిగాని మనవల్లగాదు. కాని మనం మాత్రం సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, ఇదీ కత.బయట లోకం అంతా కొత్తగా ఉంది, బ్లాగ్ లోకం వింతగా ఉంది  :)

20, అక్టోబర్ 2023, శుక్రవారం

కూలికి విషం తాగరు.

  కూలికి విషం తాగరు.


ఇదొక నానుడి, పల్లెలలో బాగా చెబుతారు.

డబ్బుకోసం ఏ నీచపుపని చేయడానికైనా దిగజారిపోతారు, కొందరు. ప్రపంచంలోని యుద్ధాలు తగువులు అన్నిటికి మూలకారణాలు కాంతా,కనకాలే!

కాంతపైన ఆశ 

కనకంబుపై ఆశ

లేనివాడు మొదలు లేడురా

ధరణిలేడురా! 

అన్నారో సినీకవి,చాలా కాలంకితం.


వయసుతో కాంతమీద మోహం,ఆశ తగ్గుతుందేమోగాని, చావదు. ఇంక కనకం మీద ఆశ చచ్చినా చావదు. :)

చావుకాలానికి ప్రాణంపోక, ఉండక కొట్టుకుంటున్నపుడు, తలకింద పెట్టుకున్న రూపాయల్ని, నీళ్ళలో కడిగి ఆ నీళ్ళు పోసేవారు. అప్పుడు ఆ జీవుడు కదైలేది బొందినుంచి. :)


డబ్బుకోసం హత్యలు చేస్తారు,చేయిస్తారు,  ఎంతకైనా తెగిస్తారు.

 


కాని డబ్బుకోసం చేయని పని ఒకటే  ఒక్కటి ఉంది ప్రపంచంలో,

 అదే ఆత్మహత్య. డబ్బుకోసం ఎవరూ ఆత్మహత్యకి పాల్పడరు. దాన్నే మా గ్రామీణులం కూలికి విషం తాగరు అంటూంటాం.


16, అక్టోబర్ 2023, సోమవారం

అదృష్టం బుఱ్ఱగుంజు

 తాటితాండ్ర



  తాటితాండ్ర

తాటిబెల్లం




వేసవిలో వచ్చేవి తాటికల్లు,తాటిముంజలు.

 వర్షకాలంలో వచ్చేవి తాటితాండ్ర,తాటిబెల్లం.

శీతకాలంలో వచ్చేవి తేగలు బుర్రగుంజు. 


 
  వేసవిలోతాడిచెట్ల సీజన్ ప్రారంభం. ముందుకల్లొస్తుంది. దానినుంచి తాటిబెల్లం అనే కల్లుబెల్లం లేదా పాతబెల్లం వండుతారు.వేసవిని తప్పించుకోడానికి తాటికల్లు ఆరోగ్యప్రదాయిని. తాటిముంజలూ అంతే! వీటినే ఐస్ ఆపిల్ అంటారు.  వేసవిలో తాటిముంజలొచ్చాకా అవి పెరిగి తాటికాయలవుతాయి, ఆ తరవాత పళ్ళూ అవుతాయి.తాటిపళ్ళనుంచి రసం తీసి మరగబెట్టి చాపలమీద పోస్తారు, పల్చగా,తాటి చాపలమీదే. అందుకే దీన్ని తాటితాండ్ర చాపలంటారు.  ఇక గుజ్జు తీసుకున్న తరవాత టెంకలు మిగులుతాయి, వీటిని కొచం ఎత్తుగా ఉన్నచోట పాతరేస్తారు. టెంకలనుంచి మొలకలొస్తాయి భూమిలోకి, ఇవే తేగలు.   టెంకలు అలా ఒకదానిమీద ఒకటిపేర్చేస్తారు. ఈ తేగలు తవ్వడానికి, శీతకాలానికి తయారవుతాయి, ఫిబ్రవరిదాకా వస్తాయి. తేగలు తవ్వుకున్న తరవాత టెంకలు మిగులుతాయి. వీటిని చితక్కొట్టుకుంటే బుర్రగుంజు దొరుకుతుంది, తియ్యగా ఉంటుంది. అన్ని టెంకల్లోనూ బుర్రగుంజుండదు. అందుకే  బుర్రగుంజన్నారు. టెంక చితక్కొట్టేదాకా బుర్రగుంజున్నది లేనిదీ తెలీదు. అలాగే మనిషిని వాడేదాకా బుర్రలో గుంజున్నదీ లేనిదీ తెలీదు. 

14, అక్టోబర్ 2023, శనివారం

మహాలయం

 

కష్టేఫలే-శర్మ కాలక్షేపం కబుర్లు-మహాలయ అమావాస్య

రేపు సెప్టెంబరు ఇరువదిఏడవతేది మహాలయ అమావాస్య.
ప్రతీ సంసృతిలోను  కాలంచేసినవారిని తలుచుకోవడం సహజం. దీనినే మనవాళ్ళు పెద్దలకి పెట్టుకోవడం అంటారు. అలాగే కాలంచేసినవారిని తలుచుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక పదిహేను రోజులని కేటాయించారు.అవి భాద్రపద బహుళ పాడ్యమి మొదలు భాద్రపద బహుళ అమావాస్య వరకు. ఈ రోజులలో పెద్దలు కాలం చేసిన తిధినాడుగాని అప్పుడూ కుదరకపోతే అమావాస్య నాడుగాని పెద్దలను తలుచుకొని తర్పణంచేసి సాత్వికులైన వారికి అన్నపానీయలిచ్చి గౌరవం చేయడం మన ఆచారం. ఈరోజు కనీసంగా పిత్రు తర్పణం అనగా గతించిన తండ్రి, తాత, ముత్తాతలని తల్లి, మామ్మ, తాతమ్మలకు ఋషి సహిత గోత్రనామాలతో నీళ్ళు వదిలిపెడతారు.తన వంశంలో పిల్లలు లేకుండాగతించినవారికి, అకాలమరణం పొందినవారికి తర్పణం ఇస్తారు. గతించిన గురువుకి,తరువాత తనకు ముఖ్యులై గతించినవారికి, గతించిన రాజుకు,చివరగా ఈ భూమండలంమీద అనాధగా చనిపోయినవారందరికి తర్పణం ఇస్తారు. తర్పణం అంటే మంత్ర సహితంగ నీళ్ళువదలి పెట్టడమే. మంత్రం చెప్పుకోలేనివారు తర్పణం చేయలేరా. శ్రద్ధ ముఖ్యంకాని మంత్రం కాదు. మంత్రంతో చేయగలిగితే మంచిదే. లేకపోయినా ఆయా పెద్దలను తలుచుకొని నీళ్ళువదలచ్చు. విశేషం ఏమంటే గంగా నది ఒడ్డున ఈరోజు మధ్యహ్నం పన్నెండు గంటలు దాటిన తరువాత ఈ కార్యక్రమం జరుపేవారు ఎక్కువ. మనమూ ఈ కార్యక్రమాన్ని అవుసరం ఉన్నవారు మధ్యాహ్నం పన్నెండు దాటిన తరువాత ఆచరించ వచ్చును. పెద్దలను గౌరవించడం తలవడం మన సంసృతి. అంతేకాదు మనకు ఏ సంబంధమూ లేని భూగోళం మీద గతించిన అనాధలందరూ కూడా శాశ్వత పుణ్యలోకాలలో మనవారితో సహా వుండాలని మన భారతీయ సంస్కృతి చెబుతోవుంది. ఇది చాదస్తంగా కనపడవచ్చు కాని
మనంఆచరించవలసినదే.

పెళ్ళికిముందుగా గతించిన పెద్దలను ఆహ్వానించి అర్చన చేసి, వంశములో జీవించియున్నవారిలో పెద్దలిని పిలిచి వారికి సత్కారం చేసి అప్పుడు చేయబోయే శుభకార్యంకి కంకణం కట్టుకుంటాము. గతించిన పెద్దలను తలుచుకొని చేసే కార్యక్రమమే సంకల్పం.

అది నాటిమాట. 

(25.09.2011)

*********************

ఇది నేటిమాట

(14.10.2023)

 లయం అంటే కలసిపోవడం మహాలయం అంటేసర్వజీవులూ కలసిపోవడం. ఎవరితో? అదీ ప్రశ్న. 

జీవులెనుబదినాల్గు లక్షలచావు పుట్టుకలిక్కడా! ఎవరుచేసిన పాపకర్మము లనుభవవించేదక్కడా! అనేది తత్త్వం. పుట్టిన ప్రతిజీవి లయంకాకతప్పదు. ఎప్పుడూ? ఎవరి కర్మానుసారంగా వారు లయమవుతూ ఉంటారు! చావూ పుట్టుకల చక్రం తిరుగుతూనే ఉంటుంది. అంతెక్కడా?  ఇలా చావుపుట్టుకలచక్రం నుంచి తప్పించుకోలేని జీవులకు కూడా ముక్తి ప్రసాదిస్తాడు శంకరుడు, అదే అదే మహాలయం. ఆ సమయంలో శంకరుడు ఈ సృష్టి సమస్థాన్ని లయంచేసి తన ఒంటికి బూడిదగా రాసుకుంటాడంటారు, ఈ పితృ పక్షంలో.

11, అక్టోబర్ 2023, బుధవారం

కాలం కలసిరానప్పుడు తాడేపామై కరచింది.

 కాలం కలసిరానప్పుడు తాడేపామై కరచింది.


కాలం కలిసొచ్చినపుడు, ప్రపంచమే మనచుట్టూ తిరుగుతున్నట్టనిపిస్తుంది, మనమాట మీదే నడుస్తున్నట్టుంటుంది. మన మాటే వేదమని పాటించేవారికంటే, మన మాటకోసం ఎదురుచూసేవారే ఎక్కువ. సరే  తరవాత చిన్నతల్లి పరుగు పరుగునా గలగలలాడుతూ చేరిపోతుంది.   అడగకనే న్యాయదేవత మన ముంగిట్లోకి నడచొచ్చేస్తుంది.  తెప్పలుగ జెరువునిండిన కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ! వందిమాగధులకి లోటుండదు. ఇంద్రుడు చంద్రుడు అననివారు దుర్మార్గులే! సమయం అదే కాలం తెలియకనే దొర్లిపోతుంటుంది. రోజులు నిమిషాల్లా,సంవత్సరాలు రోజుల్లా నడచిపోతుంటాయి. ఆకలుండదు దాహముండదు, నిన్ను చూస్తుంటే, అన్నట్టుంటుంది.  


కాలం నడుస్తున్నప్పుడు, రోజులు భారంగా నడుస్తుంటాయి. తెల్లవారుతుంది మళ్ళీ పొద్దుగూకుతుంది, అంతే!!పిలిస్తే పలుకుతారు జనం, లేకపోతే లేదు. ఎవరి ప్రపంచం వారిదే! వందిమాగధులు కైవారాలు కష్టం మీద కొనసాగచ్చు,సాగకాపోవచ్చు. ఏదీ నికరం లేదు. న్యాయదేవత కోసం పరుగులు పెడితే కరుణించచ్చు, లేకపోవచ్చు. జనాలు చేరిక చెప్పలేం, చిన్నతల్లి పలుకును బట్టి ఉంటుంది. చిన్నతల్లి పరుగులుండవు, నడకలూ ఎనకబడతాయి. ఒక్కొకప్పుడు చిన్నతల్లి పోకేగాని రాకుండదు. విత్తంకొద్దీ వైభోగం,నడుస్తూ ఉంటుంది. ఆకలుంటుంది, దాహమేస్తూ ఉంటుంది. ఇంతేనా జీవితం అనిపిస్తూ ఉంటుంది. కాలం నడుస్తుంటుంది, భారంగా. 


కాలం కలసిరానపుడు,పిలిచినా పలికేవాడుండడు. నిన్నటిదాకా మన గుమ్మందగ్గర నిలబడ్డవాడి గుమ్మం దగ్గర నిలబడ్డా దర్శనముండదు. దర్శనమిచ్చినా పలుకుండకపోవచ్చు.చిన్నతల్లి పలుకే బంగారం. పోయేగాని రాలేదు. న్యాయదేవత పెడముఖం పెడుతుంది. నిన్నటిదాకా మనం చెప్పినదే న్యాయమే, మరి నేడేంటి? న్యాయదేవత శలవులు తీసుకుంటూ ఉంటుంది.పలికేవారు ఉండరు. చెరువెండిపోతే కప్పలుండవు. ఇంద్రుడు, చంద్రుడు మాట దేవుడెరుగు మన పెరే గుర్తుండదు, ఎవరికి. గడియారం లో చిన్నముల్లు కదలదు, పెద్ద ముల్లు సరే సరి. రోజు నడవదు, భారంగా కూడా. నీడని చూసి భయపడాల్సివస్తుంటుంది. తాడు కరుస్తుందా? కాని కానికాలమొస్తే తాడే పామై కరుస్తుంది.


ఇంతకీ ఎవరీకాలం?అదీ కొచ్చను. కాలం గంటలు,నిమిషాలు, రోజులు ,సంవత్సరాలే కాదు. కాలానికి రూపులేదు, గుణం లేదు;  దయలేదు, దాక్షిణ్యం లేదు; పుట్టుకలేదు, చావులేదు; ఆది లేదు, అంతం లేదు; సమవర్తి. పెద్ద చిన్న తేడా లేదు.  ఎవరికోసమూ ఆగదు, నడుస్తూనే ఉంటుంది.ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. మరి ఇన్నిగుణాలూ ఉన్నవారొకరున్నారు, వారే దేవుడు, మీరే పేరుతో పిలుచుకున్నా, ఏమతంవారైనా, ఇదే నిజం. 


కాలం కలసిరావడమంటే భగవంతుడు మనతో ఉన్నాడు, అప్పుడు. అందుకే మనకి రోజులలా గడిచాయి, మనమా సమయంలో మంచిపనులు చేస్తామేమో అని భగవంతుడు ఎదురుచూచాడు. మన కర్మ బాగుంటే అదే కాలం కలిసొచ్చేది.


 ఆ తరవాత అరోజులు భారంగా నడిచాయి, ఎందుకు? భగవంతుడు నీ పట్ల ఉన్నట్టు లేనట్టు ఉన్నకాలం. ఇక కాలం కలసిరానపుడు భగవంతుడు మన పట్ల లేడు. 

అందరూ పడిపడి దణ్ణాలెట్టేవాళ్ళే!నాటి రోజుల్లో. ఎందుకూ? ఆ రోజు మన వెనక విధి ఉన్నది. అందరూ దణ్ణాళెట్టేరు, విధికి, కాని మనం, మనకే దణ్ణాలెట్టేరని భ్రమపడ్డాం, మనగొప్పే అనుకున్నాం. విధిని మరచాం. అందుకే...ఈ రోజు, పిలిచినా పలికేవాడు లేడు, సాయంచేసేవాడసలే లేడు, చిన్నతల్లి అడుగులు లేవు, ఆ రోజు మొక్కినవాడు, ఈ రోజు బయటకాపలా ఉన్నాడు, బయటికి పోకుండా. ఇప్పుడు గుళ్ళూ గోపురాలూ గుర్తొచ్చాయి, ఉపయోగమే కనపట్టదు.అదే తాడు పామైకరవడమంటే...


9, అక్టోబర్ 2023, సోమవారం

గోగుపూలు

 గోగుపూలు


గోగుపూలు

గోంగూర తెనుగువారి ఇష్టదైవం,ఆంధ్రమాత. గోగులో రెండు రకాలు, తెల్లగోగు దీన్నే ధనాసకూర అంటారు. రెండోది ఎర్రగోగు దీన్ని పుల్లగోగు అంటారు. గోంగూర పచ్చడిని ఇష్టపడని తెనుగువాడుండదని నా నిశ్చితాభిప్రాయం :)

ఉమ్మెత్తపూవు.

ఉమ్మెత్తలో రెండు రకాలు, తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, రెండూ ఆయుర్వేదంలో మతిభ్రమణానికి వాడే మందుల్లో వాడతారట. 


మొల్ల పూవు.

మొల్ల కవయిత్రి. 
ఈ పూవు పూజకి పనికిరాదు. తలలో పెట్టుకోడానికీ పనికిరాదు. వాసనలేని పూవును తలలో ధరించకూడదంటారు, పెద్దలు.

వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్, సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్,
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!

5, అక్టోబర్ 2023, గురువారం

చదువెందుకు చంకనాకను...

  చదువెందుకు చంకనాకను...


కాలు కదపద్దంటే, మంచం మీద పడుకునుండిపోతుంటే, బద్దకం పెరిగింది, అదొకటే ఏంలెస్తురూ! అన్నీ పెరిగేయి.... అలా పడుకునుంటే చిన్నప్పటి సంగతులు ముసిరేయి..... ఇలా ఒకటి...


''చదువెందుకు చంకనాకను నాలుగావులు,గేదెల్ని మేపుకుని బతకవచ్చును'', అనేవాడు మా నున్నం నర్సన్న బాబాయ్, డెభైఐదేళ్ళకితం, సాయంత్రం పూట వీధరుగుమీద కూచుని చదువుకుంటున్న మాతో, పశువుల్ని పొలం నుంచి తోలుకొస్తూ,పూటుగా గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం పుచ్చుకుని వస్తూ. ఈలొగా వచ్చేసేవారు మానాన్నగారో పెదనాన్నగారో, ''ఒరే తమ్ముడూ! ఏంటిరా? ఈ అల్లరి, ఇంటికెళ్ళు మరదలు ఎదురుచూస్తూ ఉంటుందీ" అని అనునయించి పంపించేసేవారు. నిజంగానే తను చెప్పినట్టు పశువులపాల వ్యాపారమే చేసేవాడారోజుల్లో. ఇంట్లోవాళ్ళు ఆ మాట గుర్తుకురానివ్వకుండా రోజూ "చదువుకోక మన్నుకొట్టుకొట్టుకుంటావా? చదువుకోక గాడిదల్ని కాస్తావా?" అని ఇవేవో చాలా తక్కువపనులని బ్రెయిన్ వాష్ చేసేవారు. అదే నిలిచిపోయింది. పాల వ్యాపారం చేసి కొన్ని దేశాలే బాగుపడ్డాయి. ఒకప్పుడు భారతదేశంలో గొల్లభామ మార్కు పాల డబ్బాలమ్మేవారు, ఎంతమంది కి తెలుసో చెప్పలేను. ఈ పాల డబ్బాలు స్విజర్లాండ్ నుంచి దిగుమతి అయ్యేవి.  పేరుగొల్లభామ మార్కు  , condensed. sweetend milk'.   'cow and Gate' brand, milk powder of England.  నేడు పెటా వారు అముల్ వారిని పశువులపాలు అమ్మరాదని గొడవ చేస్తున్నారు. పశువుల పాలు తీయడం సభ్యతకాదట. మరీ మాట నేటికీ Switzerland దేశాలలో చెబుతారో? తెలీదు. భారత్ లోనే ఈ పలుకు పలుకుతున్నట్లుంది. 


ఆ తరవాత కాలంలో మాత్రం. అదేమాట నిలిచిపోయింది. ఐదెకరాలు రోడ్డు పక్క చేను, మూడెకరాలు ఊడ్చుకుని, ఎకరంలో గడ్డి పెంచుకుని, ఎకరంలో షెడ్లు,కొంప కట్టుకునుంటే, ఈ వేళ...ఎందుకులెండి....పాల  వ్యాపారం

 చేస్తే ఎలా ఉండేదో....., జీవితం మూడు పువ్వులు ఆరుకాయల్లా నడిచేది.ఉప్చ్! రోజులలా నడిచిపోయాయలా.


సరే! పదేళ్ళకితం ''గాడిదల్ని కాయండి, కోటీశ్వరులుకండి'', అంటే నవ్వేసేరు. ఇప్పుడు గాడిదపాలు లీటరు ఎనిమిదివేలు, తొందరలో పదివేలు కాబోతోంది. ఇదీ చెయ్యలేకపోయా! తెలివైనవాళ్ళు ఈ మాట అంది పుచ్చుకున్నారు. యోగం లెద్దురూ! కారణం లేనిది కార్యం జరగదు. ఇదింతే.....ఎవరియోగమెంతో అంతే!!


రాబోయే కాలంలో మనిషిపాల వ్యాపారం జరగబోతోంది. "బ్రెస్ట్ మిల్క్! బెస్ట్ మిల్క్!!" ఈ వ్యాపారం ఐడియా, ఆ స్లోగనూ నావే! రిజిస్టర్ చేయించాలి పేటెంటు కోసం. చూద్దాం.... 


27, సెప్టెంబర్ 2023, బుధవారం

దొంగని దొంగే పట్టాలి.

దొంగని దొంగే పట్టాలి


దొంగని దొంగే పట్టాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఇవన్నీ సమానర్ధకమైన తెనుగు నానుడులు. దొంగతనం అరవైనాలుగు కళలో ఒకటిట. దొంగని దొంగ ఎలాపట్టగలడు? అదీ కొచ్చను!


దొంగలకి ఉండే అలవాట్లు, చేసే పొరబాట్లు, నమ్మకాలు, ఇలా చాలా విషయాలు సమానంగా ఉంటాయట, ఇది పెద్దలమాట. సాధారణంగా దొంగలు దొంగతనం చేయబోయే ఇంటిని చాలాకాలం జాగ్రత్తగా గమనిస్తారట. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు? ఎంతబలవంతులు? ఎదురుతిరగ్గలరా?ఎప్పుడు సొమ్ము ఉంటుంది ఇంట్లో?ఎంత ఉండచ్చు? బంగారం ఎంతుండచ్చు?  ఆ ఇంటివారి అలవాట్లు, భద్రత ఎంత?  ఎంతమంది ఆడాళ్ళున్నారు? కుక్కలున్నాయా? ఏజాతివి? బిస్కట్లకి లొంగుతాయా? లొంగదీసుకోడానికి ఇతర మార్గాలేంటి?కాపలా ఉంటుందా? పట్టుబడితే? కన్నగాడు కత్తి మరవడని సామెత.  


ఇలా చాలా విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే దొంగతనానికి దిగుతారట. అంతే కాదు, తిథి, వారం,నక్షత్రం ఇలా చూసుకునేవారూ ఉంటారట. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి సాటి దొంగకే తెలుస్తాయి, దీన్నే రెకీ చెయ్యడం అంటారట!!  కనక దొంగని దొంగే పట్టాలంటారు.


25, సెప్టెంబర్ 2023, సోమవారం

జలే తైలం

 జలే తైలం


 జలే తైలం ఖలే గుహ్యం

పాత్రే దానం మనాగపి

ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి

విస్తారం వస్తుశక్తితః

నీటిపైన నూనె, ఖలునికి తెలిసిన రహస్యం,  అర్హునికిచ్చిన దానం తెలివైనవానికి తెలిసిన శాస్త్రం, అన్నిటికిన్నీ వాటివాటి గుణాల ప్రకారంగా విస్తరిస్తాయి.


 ఆచార్య చణకుని భావం. 

 దుర్జనునికి తెలిసిన రహస్యము, అర్హునికిచ్చిన దానము, తెలివైనవానికి చెప్పిన విద్య,నీటి మీద పడిన నూనె చుక్కలా వ్యాప్తి చెందుతాయి.


దుర్జనునికి రహస్యం తెలిస్తే దానిని ఎవరికి చెప్పకూడదో వారికే చెబుతాడు, ఆ తరవాత జరిగేది విధ్వంసం. అర్హునికి దానమిస్తే దానితో అతను వృద్ధి చెందుతాడు, తనలా ఉన్న మరో కొంతమందిని కూడా వృద్ధిలోకి తీసుకొస్తాడు. తెలివైనవానికి చదువు చెబితే చాలా తొందరగా గ్రహిస్తాడు, అంతే కాదు దానిని మరో పదిమందికి వ్యాప్తి చేస్తాడు.దానిని జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో కనుగొంటాడు.


ఇలాగే

సజ్జనునికి చెప్పిన రహస్యం,అనర్హునికిచ్చిన దానం,తెలివిలేనివానికి చెప్పిన విద్య నీటి మీద నేతి బొట్టులా ఘనీభవించి పోతాయి. ఇవన్నీ వారికి ఉపయోగపడవు, మరొకరికి అంతకన్నా ఉపయోగించవు. ఇదెక్కడో చదివిన గుర్తు.  

23, సెప్టెంబర్ 2023, శనివారం

కలయో!

 కలయో!

బాలకృష్ణుడు మన్ను తిన్న సందర్భం.

ఈ సందర్భంగా వ్యాసుని మాటేమీ?

బాలకృష్ణ, బలరాములు పిల్లలతో కలసి ఆడుకుంటున్న సమయం. బలరాముడు మిగిలినపిల్లలు, కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదకి చెబుతారు. అంత, యశోద,కృష్ణుని చేయి పట్టుకుని, నీ నోరు నీ వశంలో లేదు.మన్నెందుకు తిన్నావని అడిగింది. మన్ను తిన్నావని వీళ్ళు చెబుతున్నారు.. దానికి కృష్ణుడు, అమ్మా! నేను మన్ను తినలేదు. వీరు చెప్పే నేరములు అబద్ధము, వీరంతా సత్యం చెబుతున్నారనుకుంటే, నీవే నా నోటిని చూడమన్నాడు. ఐతే వీరు చెప్పిన మాట అసత్యమైతే, నీనోరు తెరవమన్నది. కృష్ణుడు నోరు తెరిస్తే అందులో యశోదకు విశ్వరూపం కనపడింది. ఆ సందర్భంగా


కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధి మోహః

అధో ఆముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః

ఏతత్-ఇది ,కిం స్వప్నః-కలయా? ఉత-లేక,దేవమాయా- శ్రీహరిమాయయా? వా-లేక, మదీయః-నాదైన, బుద్ధి మోహః కిమ్- బుద్ధియొక్క వ్యామోహమా? బత-ఆశ్చర్యము! అథో-లేక, ఆముష్య-ఈ, మమ-నా, అర్భకస్య-పిల్లవానిదే ఐన,యః కశ్చన-ఏదో ఒకానొక, ఔత్పత్తికః-సహజసిద్ధమైన, ఆత్మయోగః-తనదైన యోగ సిద్ధియా?

ఇది కలా? లేక వైష్ణవ మాయయా? లేక నాబుద్ధి వ్యామోహపడుచున్నదా? ఆశ్చర్యము! లేక, ఈ పిల్లవానికే, ఏదో ఒక, పుట్టుకతో వచ్చిన యోగ సిద్ధియా? అనుకున్నదన్నారు.


ఇక పోతనామాత్యుడు,ఈ సందర్భంగా

మన్ను తిన్నాడు కృష్ణుడని బలరాముడుగోపాలురు చెబితే, మన్నేటికి భక్షించెదు,.........మఱి పదార్ధము లేదే.. అడిగింది. దానికి మన్నుదినంగ నే శిశువునో... చిన్నపిల్లాణ్ణా,ఆకలేసిందా?వెఱ్ఱివాడినా?వీరిమాటలు నమ్మకు.వీళ్ళు, నేను మన్నుతిన్నానని చెప్పి, నిన్ను నమ్మించి,  నీచేత నన్ను కొట్టించాలని వీరి పన్నాగం. అలాకాదనుకుంటే నా నోరు వాసనచూడు, నా మాటలు తప్పైతే కొట్టమ్మా! అన్నాడు. సరే! అంటే నోరు తెఱచి చూపాడు. నోటిలో విశ్వరూపం కనపడింది, యశోద  ఆలోచించిందిలా అన్నారు 

కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో

తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర

స్థలమో బాలకు డెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర

జ్వల మై యుండుట కేమి హేతువొ మాహాశ్చర్యంబు చింతింపగన్..భాగవతం..దశమ స్కందం..341

అనుకుని విభ్రమ చెందింది. 


మరి నేటి కాలపు సినీ కవి చిన్న చిన్న మాటలతో

అమ్మా! తమ్ముడు మన్ను తినేను! 

చూడమ్మా అని రామన్న తెలుపగా!

అన్నా! యని చెవి నులిమి యశోద

ఏదన్నా! నీనోరు చూపు మనగా

 చూపితివట నీనోటను
బాపురె పదునాల్గు భువనభాండమ్ముల నా
రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్

 జయ కృష్ణా ముకుందా! మురారి

జయ గోవింద బృందా విహారీ 


పై ముగ్గురిలో ఎవరూ యశోద కృష్ణుని నోట విశ్వరూపం చూసి స్పృహ కోల్పోయిందనలేదు.

మళ్ళీ పోతనగారి దగ్గరకొద్దాం.


కలయో- మానవులకి మూడు అవస్థలు. జాగృత, సుషుప్తి,స్వప్నావస్థలు. కలలో మనసు సర్వాన్ని  సృష్టించుకుని వాటితో తాదాత్మ్యంచెంది, దుఃఖిస్తుంది, సుఖిస్తుంది. మెలకువవచ్చాకా నిజంకాదూ? కలా! అనుకుంటుంది. ఇక వైష్ణవమాయయో- ఇదీ కలలాటిదే కాని అనుభవంకూడా ఉంటుంది. నేటికాలపు (virtual reality)  వర్త్యుయల్ రియాలిటీ! ఇతరసంకల్పార్ధమో- ఇతరులు తమ సంకల్పం నాపై ఆపాదిస్తున్నారా? అంటే నేటి  hypnotism,  సత్యమో- నిజమా? తలపన్నేరక యున్నదాననో- ఆలోచింపలేకపోతున్నానా? యశోదా దేవిగానో- అసలు నేను యశోదనేనా? అనుమానపడింది, పరస్థలమో- భూమి మీదకాక మరో గ్రహం మీదకాని ఉన్నానా?  ఆశ్చర్యం! చిన్నకుర్రాడి నోట విశ్వరూపం కనపడ్డానికి కారణమేమై ఉంటుందని తలపోసింది.


పోతనగారు, నేటికాలంలో గొప్పగా చెప్పుకుంటున్న మానసిక స్థితులను నాడే దర్శించినవారు కదా! పోతన మహాశయులకు శతకోటివందనాలు.


21, సెప్టెంబర్ 2023, గురువారం

తెనుగువార్తలు-మీడియా

తెనుగువార్తలు-మీడియా

మా చిన్నప్పుడూ అనను. ఆ రోజుల్లో ఈ రోజు పేపరు రేపొచ్చేది. అదొస్తే గొప్పే!!  నోటి మాటే వార్త. ఆ వార్త పేపర్లో కూడా వచ్చిందయ్యా! అంటే శిలాక్షరమని, నిజమని నమ్మేవారం, పల్లెలలో. రోజులు జరిగాయి, రేడియో వచ్చింది. వార్తలకి కొద్దికాలమే, పందులపెంపకానికి గంట సమయం. ఇదీ  రేడియో సంగతి. కాలం జరిగింది దూరదర్శన్  వచ్చింది. ఇదీ ఏం తక్కువ తినలేదు. చివరికి తెనాలి రామలింగడి పిల్లి కతైపోయింది, మాపల్లీయులకు :)  వార్త అంటే,   అందునా ప్రభుత్వ వార్త అంటే  నిజం కాదనే నిర్ణయానికొచ్చేసేం, అప్పుడే!


ఆ తరవాత ప్రైవేట్ టి.వి చానల్స్ వచ్చాయి, తల్లీబిడ్డా న్యాయంగా వార్తలుండేవి, ఇవీ తక్కువకాలమే, వార్తలు నిజానిజాల కలగలుపు.బియ్యంలో రాళ్ళేరు కున్నట్టుండేది. ఆ తరవాత వార్తా చానల్స్ వచ్చాయి. ఈ పాటికే పేపర్లు ఒకే వార్తని వారికి నచ్చిన రీతిలో రాసుకునే రోజులొచ్చాయి. నాలుగు పేపర్లు చదివితేగాని నిజమేంటో తెలిసేదిగాదు. ఆ తరవాత కాలంలో అదీ పోయింది.ఎవరివార్త వారిదే, నిజం ఎప్పుడో ఎగిరిపోయింది,ఇగిరిపోయింది.వార్త లేదు అంతా వారివారి అభిప్రాయాలే వార్తలైపోయాయి.

 ఇక ఆ తరవాత టి.వి చానల్స్ వారు వారికి తగినరీతిలో వార్తలు వండి వార్చుకోడం మొదలైంది, ఇంకేం అస్థాన విద్వాంసులు తిమ్మిని బెమ్మిని చేసి చూపే అలవాటు వచ్చి చేరింది, పేనల్ డిస్కషన్ పేరుతో. దీనితో టి.వి అంటేనే వెగటుపుట్టేసింది.


కాలం కొద్దిగానే నడిచింది.  సోషల్ మీడియా! ఎవరివార్త వారిదే!! ఆ తర్వాతొచ్చింది యు టూబ్, ప్రతివారూ ఒక పత్రికే,వార్త అందించేవారే, ఇక చెప్పేదేమి? ఏది నిజం, ఏది నిజంకాదు.తెలియదు. అంతలా వార్తలు బ్రష్టు పట్టిపోయాయి. మీడియా పేరు జెప్పుకుని భయపెట్టి, బ్లాక్ మైల్ చేసి డబ్బులు సంపాదించుకోడం పాతకాలపు విద్యే! పల్లెవాసులకిది కొత్త. యు ట్యూబ్ చానల్స్ వచ్చాకా మా దగ్గరా ఈ సంస్కృతి మొదలయింది.



ఇప్పుడన్ని వార్తా మాధ్యమాలకి దూరంగా ఉన్నాం. నిజమేంటి ఎవరూ చెప్పరు, కాదు చెప్పలేరు, కొందరటు, కొందరిటు,  తప్పుపట్టేవారే!!పోనీ ఎవడెటు పోతే నాకేం!!! అమ్మయ్యా! ప్రాణం సుఖంగా ఉంది.   ఎప్పుడూ పాలితుడినే, కాదు, ఎప్పుడూ పీడితుడినే!!!

ఏది నిజం? చిదంబర రహస్యం.