Tuesday 12 December 2023

సింహము-చిట్టెలుక

సింహము-చిట్టెలుక  


 అనగనగా ఒక అడవి. అడవిలో మృగాలు ఎన్నికలు జరుపుకున్నాయి, రాజెవరో తేల్చుకోడానికి.  సింహం,ఏనుగు పోటీ చేసాయి.  వీరవిహారంగా ప్రచారం జరిగిపోయింది. సింహాన్ని ఎన్నుకున్నాయి, రాజుగా, సాధుజంతువులన్నీ, కొద్ది మెజారిటీతో!

ఎలుకలు ప్రచారంలో పాల్గోలేదుగాని ఓట్లేసాయి.  సింహానికి, ఎలుకలు ఓట్లు తనకి వేయలేదేమోనని అనుమానం.

కాలం నడుస్తుండగా, ఒక ఎలుకపిల్ల (చిట్టెలుక) తన కలుగు దగ్గర చెట్టుకింద, నిద్రపోతున్న సింహం జూలు పట్టుకుని ఆడుకోడం మొదలెట్టింది, ఇంతలో సింహానికి మెలుకువొచ్చింది. చిట్టెలుకని పంజాలో పట్టుకుని ఒక్క సారి గర్జించింది. దాన్తో కలుగులో ఎలుకతల్లి బయటికొచ్చి, తనపిల్ల, సింహం పంజాలో ఉండటం చూసి, రాజా! మేము ఎలుకలం,బలహీనులం, తమ చేతిలో ఉన్నది చిన్నపిల్ల, అభం శుభం, లోకం పోకడ తెలియనిది. తమకే హాని తలపెట్టలేదు. తెలియక తమజూలుతో ఆడుకున్నట్టుంది. మన్నించి విడుదలచేయండి,అంతేగాదు. మా ఎలుక సంతతి అంతాకలసినా తమ పంటికిందకి, ఉదయఫలహారంగా కూడా సరిపోము. అదా! చిట్టెలుక, దయచేసి తప్పుకాసి విడుదల చేయమని వేడుకుంది.  సింహం ఆలోచనలో పడింది. తనకి వీళ్ళు ఓట్లేసినట్టులేదు, ప్రతీకారం తీర్చుకుంటేనో, ఆలోచనలో పడింది. ఈలోగా నక్క  మంత్రి,   సింహం  దగ్గరకు చేరి, మంతనాలు జరిపింది. తల్లి ఎలుక, రాజా! తమకు అత్యవసర సమయంలో నా సాయం అందించగలను, మన్నించి నా బిడ్డను విడుదలచేయమని వేడుకుంది, కాళ్ళావేళ్ళా పడి, కన్నీళ్ళతో.  


అంతట సింహం   హేళనగా నవ్వి, నువ్వో ఎలకవి, నేను సింహాన్ని, రాజును. నువ్వు నాకు సాయం చేస్తానంటావు. నేను నమ్మాలి,  అని   పరిహాసంగా గర్జించి, చిట్టెలుకను వదిలింది. ప్రాణగండం గడచిన చిట్టెలుక తల్లిని చేరింది.కాలం గడిచింది. తల్లెలుక మరణించింది, పిల్లెలుక పెద్దదయింది,  ఎలుకల నాయకుడయింది. సింహానికీ వయసొచ్చింది, వడి మళ్ళింది, చూపు ఆనడమూ తగ్గింది. 

ఒకరోజు వేటగాడొకడు వలపన్నేడు. చూపు తగ్గడం, అధికారం మత్తుతో చూసుకోక, వలలో చిక్కుకుంది, సింహం. తన్నుకుంటూంది,వదిలించుకోడానికి, తన్నుకున్నకొద్దీ బిగుసుకుంటోంది వల.  అడివిలో జంతువులన్నీ గుసగుసలు పోయాయి.ఎవరికి తోచినట్టు వారనుకున్నారు. అన్యాయం! అన్యాయం!! అని   ఆక్రోశించినవారు , మా బలే అయిందిలే అని చంకలు గుద్దుకున్న అశక్తదుర్జనులు,  చేసుకున్న కర్మ ఎక్కడికిపోతుంది, వెంటాడి వేధిస్తుందని శాపనార్ధాలు పెట్టిన వారు, ఇదంతా ఏనుగు చేసిందే! అనుమానం లేదు,ఇంతకింతా అనుభవిస్తుంది లే! అని గుసగుసలు పోయినవారు, ధర్మప్రభువుకే ఇంత కష్టమా? అడవిలో ఆటవిక న్యాయం చెల్లదా? అని కన్నీళ్ళు పెట్టుకున్నవారు, ఎంతకలికాలమైనా ఇంత చేటా? అని బుగ్గలు నొక్కుకున్నవారు. ఇలా నడచిపోతూంది, కాలం. సాధుజంతువులంతా చేసేది లేక,చేయగలదీ లేక, నిశ్చేష్టులయి చూస్తూ ఉండిపోయాయి. ఈలోగా   కౄర  జంతువుల సంచలనం కలగడంతో, సాధుజంతువులన్నీ పారిపోయాయి.   ఇలా గడచిపోతూవుంది, కాలం.

 

కౄరజంతువులన్నీ సమావేశం చేశాయి, రాజుకు ఎదురుగా. ఏంటీ కలికాలం కాకపోతే! ఎప్పుడేనా సింహరాజిలా వలలలో చిక్కుకోడాన్ని విన్నామా? ఇదంతా ఏనుగు కుట్ర తప్పమరేంకాదు.ఏనుగును వదలిపెట్టం, రాజా! మీరు నిశ్చింతగా ఉండండి, అన్నాయి. కాలం గడచిపొతోందిగాని రాజును విడుదల చేసే మార్గం గురించిన ఆలోచనగాని, చర్చగాని చేయనేలేదు.     ఈ లోగా నక్కమంత్రి పరుగు పరుగున చేరుకుంది, రాజు దగ్గరకి.  రాజా! ఇలా జరిగిందే! తమరేంటి ఇలా వలలలో చిక్కుకోడాన్ని ఊహించలేను. జరిగిందేదో జరిగింది, మిమ్మల్ని విడుదలజేసే మార్గం చెబుతా! ముందు వీళ్ళందరికి పని అప్పజెప్పి పంపించెయ్యండి.ఆపద సమయంలో, రాజుకు రాజబంధువులే ద్రోహం చేస్తారు. వీరిని అడవి సరిహద్దుల్లో కాపలాకాయమనండి, వేటగాడు రాకుండా! అని ఉపాయం చెప్పింది. సింహం అలాగే చెప్పి అందరినీ పంపించింది. రాజబంధువులు,సన్నిహితమితృలంతా వలలో చిక్కుకున్నాడని చూడ్డానికొస్తే పని అప్పజెప్పేడే! అని సణుక్కుంటూ లేచి పోయాయి,సమావేశం నుంచి.   


ఆ తరవాత, మంత్రి, రాజా! వీళ్ళంతా అవసరం గడుపుకునేవాళ్ళే! అవసరానికి అడ్డుపడేవాడొక్కడూ లేడు. ఈ ఆపద గడవాలంటే ఉపాయం చెబుతా,వినండి. 

ఒకప్పుడొక ఎలుకపిల్లకి ప్రాణదానం చేసేరు, ధర్మప్రభువులు. ఆ ఎలుకపిల్ల నేడు ఎలుకల నాయకుడయింది. వాళ్ళే ఇప్పుడు ఈ వలను కొరికి మిమ్మల్ని రక్షించగలరు. నేను వెళ్ళి వారిని తమ దర్శనానికి తీసుకొస్తా! దర్పం,గాభీర్యం ఒలకబోయకండి.   ఇప్పుడు అవసరం మనది, దీనంగానే మాటాడండి. రక్షించమని కోరండి,అని హితబోధ చేసి, ఎలుకనాయకుడి దగ్గరకెళ్ళింది, నక్క మంత్రి. 

ఎలుకనాయకా! మహారాజు వేటగాని వలలో చిక్కుకున్నారు, ఇప్పుడు మీరే రక్షించాలి, అంది. దానికి ఎలుక, మంత్రిగారూ! మేమేమో చిన్నవాళ్ళం, ఎలుకలం, మహారాజుకు మేం చేయగల సాయమేం ఉంటుంది, అంది. దానికి నక్క, అన్నన్న ఎంతమాట!,ఎంతమాట!!, ఇప్పుడు మీరు పూనుకుని వల కొరకకపోతే మహరాజును వేటగాడు బోనులో పట్టుకుపోతాడు, ఆతరవాత మన రాజుగారు చిక్కి శల్యమై,తిండికి మొహంవాచి సర్కస్ లో డాన్సు చెయ్యాల్సి వస్తుంది. ఇది మన జంతులోకానికే తీరని అవమానం. అందుచేత మీరంతా పూనుకుని, వలను కొరికి రాజును రక్షించాలి, అని చెప్పింది. గతకాలంలో ఎలుక తల్లి రాజుకిచ్చిన మాట  గుర్తు  చేసింది.  సరేనని ఎలుక సింహం దగ్గరకి చేరుకుంది.   

 ఎలుకను చూసి సింహం, ఎలుక నాయకా! ఒకప్పుడు నీకు ప్రాణదానం చేసాను, ఇప్పుడు నేను వలలో చిక్కుకున్నాను, అంటూ ఉపన్యాసం మొదలెట్టింది. అంతట నక్క వారింపుగా రాజా! సమయం గడచిపోతోంది! అని హెచ్చరించింది. సింహం తన స్థితి గుర్తుచేసుకుని, సలహా పాటిస్తూ, ఎలుకనాయకా! ఇదివరలో ఏం జరిగిందో! జరిగిపోయింది, ఇప్పుడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. నన్ను రక్షించండి, నీవే నా ప్రాణదాతవి, నీవు తప్ప మరెవరూ నన్ను రక్షించలేరు అని వేడుకుంది, దీనంగా. అంతట ఎలుక, రాజా! ఇది చూస్తే చాలా పెద్దవల, చాలా బలంగానూ ఉన్నది. నా ఒక్కడివల్ల కాదు.మా వాళ్ళతో ఆలోచించాలి అని చెప్పింది. దానికి సింహం, నువ్వు తలుచుకుంటే మీవాళ్ళందరిని కూడగట్టగలవు, నన్ను రక్షించనూ గలవు, నన్ను రక్షించు, రక్షించు,అని కన్నీళ్ళు పెట్టుకుంది.  ఐతే ఒక మాట రాజా! మా  వాళ్ళని ఒప్పించాలంటే మీరో మాటివ్వాలంది. అదేంటో అడుగు, అంది నక్కమంత్రి. రాజా! బిడాల సంతానం మా ఉసురుతీస్తున్నాయి. వేధింపులకి అంతే లేకపోతోంది. వారినుంచి రక్షణ ఏర్పాటు చేస్తానంటే, మా వారిని ఒప్పిస్తానంది. అలాగే అంది, సింహం. ఎలుక నాయకుడు తనచోటు చేరి తనవారందరినీ సమావేశపరచి, జరిగింది చెప్పింది. కూడా ఉన్న నక్కమంత్రి, రాజుగారు మీకు బిడాల సంతానం నుంచి జరుగుతున్న అన్యాయాలని అరికడతానని  మాటిచ్చారని చెప్పింది. ఎలుకలన్నీ కిచకిచలాడుతూ బయలుదేరాయి, వల దగ్గరకి.

 అక్కడి చేరుకున్న తరవాత, ఎలుకనాయకుడు, రాజా! మీరిచ్చిన వాగ్దానం మీ నోటిద్వారా, మావారంతా వినాలని కుతూహలపడుతున్నారని చెప్పింది. అంతట నక్క మంత్రి, రాజుగారు బిడాలసంతానం మీపట్ల వ్యవహరిస్తున్న దాని గురించి రాజుగారు, విచారం వెలిబుచ్చారు, ఇక మీదట ఈ అన్యాయాలు జరక్కుండా కట్టడి చేస్తానని   మాటిచ్చారు , అని చెప్పింది. దానికి సింహం తలూపింది. ఇంతలో ఒక చిట్టెలుక, నాయకా! ఏవిషయమూ రాజుగారి నుంచి వినాలని మా ఎలుకలన్నీ కుతూహలపడుతున్నాయని సన్నాయి నొక్కునొక్కింది. ఎలుకలన్నీ ఏకకంఠంతో రాజుగారు మా ఎలుకజాతికి బిడాలసంతానం నుంచి జరుగుతున్న వేధింపులు,హత్యలనుంచి రక్షణ ఏర్పాటు చేస్తానని చెబితే ఈక్షణమే వల కొరకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేయి. సింహానికి చెప్పకతప్పలేదు.

గొంతు సవరించుకుని దీనంగా, మీరంతా నా ప్రాణదాతలు, మిమ్మల్ని రక్షించకూడా ఉండలేను, బిడాల సంతానం, మీ అందరిపట్ల కొనసాగిస్తున్న వేధింపులని అరికడతానని చెప్పింది. ఎలుకలు సింహరాజుకీ జై అంటూ వలమీదపడి, తెంపిపారేశాయి. తుక్కుతుక్కుగా కొరికేసాయి,వలని.  

  సింహం బయటికొచ్చింది. ఒక్కసారి జూలు విదిలించి, పెద్ద గర్జనచేసింది, దానితో అప్పటిదాకా సింహం మీద స్వారీ చేసిన ఎలుకలన్నీ ప్రాణభయంతో పారిపోయాయి,ఎలుకనాయకునితో సహా!


అప్పుడు నక్కమంత్రి రాజా!మీరు విడుదలయ్యాకా, ఎలుకల్ని సన్మానిస్తారనుకున్నా! ఒక్క సారి గర్జించే సరికి అంతా అస్తవ్యస్తమయింది, అంది. దానికి సింహం, ''మంత్రీ! వారు నా రాజ్యంలో నా పాలితులు. రాజుకి కష్టం వచ్చినప్పుడు రక్షించడం  వారి విధి. దానిని వారు చక్కగా నిర్వర్తించారు, మన పౌరులకి వారి ధర్మం తెలిసి ఆచరించినందుకు సంతసం. మరోమాట విను,ఎంతఖరీదైన చెప్పులైనా కాలికే తొడుగుతారుగాని నెత్తిన పెట్టుకోరు '' . విన్న నక్క మంత్రి, చేష్టలుడిగి రేపటి రోజూ నేనూ అంతే కదా! అని మనసులో అనుకుని, వగచింది,ఇలా అనుకుంటూ....

శా.రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
బీజంబుల్‌, తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితి\న్‌ జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!


కత పాతదే కొత్తహంగులతో  

No comments:

Post a Comment