Friday 8 December 2023

తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నట్టు

 తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నట్టు


ఇదొక నానుడి.

 ఒకపల్లెలో ఒక ఇల్లాలు పాలు దాలి మీద పెట్టి నిద్దరోయింది. పాలు కాగిపోయాయి, దాలి దిగిపోయింది, పాలు చల్లారాయి. ఐనా ఇల్లాలు పాలు జాగ్రత్త చేసుకో లేదు. ఈ లోగా ఒకపిల్లి చూసింది. బలే ఛాన్సు లే! బలే ఛాన్సులే లలలాం లలలాం లక్కీ ఛాన్సులే!! అనుకుని దాలి దగ్గరకి చేరింది. కుండలో మూతెట్టింది. పాలందలేదు. ఒక కాలితో కుండని వంచబోయింది. కుండ ఒరిగిందిగాని పాలందలేదు. మరికొంచం వంచబోతే పాలు ఒలికాయి. ఈ చప్పుడుకి ఇల్లాలు లేచింది. పిల్లి పరుగుపెట్టక తప్పలేదు :) మెడ మరి కొంచం కుండలోకి వంచితే పాలు దొరికేవి, కాని బద్ధకం ఆవరించి కుండ వంచితే పాలు ఒలికితే వీపు చిట్లింది. 


ఇలాగే 

ఎప్పుడు సంపదగల్గిన

అప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెఱువు నిండిన 

గప్పలు బదివేలు చేరు గదరా సుమతీ.


ఇంకా

సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ

నారికేళ సలిలము భంగిన్

సిరిదా పోయిన పోవును 

కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!


సిరి చేరే టప్పుడు గజ్జెల చప్పుడుండదు. చేరిన తరవాత గజ్జెల చప్పుడు ఆగదు. సిరి చేజారేటప్పుడు గజ్జెల చప్పుడు వినపడదు. అలాగే సిరి ఉన్నంతకాలం జనం వెంటుంటారు, నీరున్నంతకాలమే కప్పలున్నట్టు. 


అధికారం చేజిక్కించుకోడం తేలికైన పనికాదు.  శిఖరాగ్రానికి చేరాలంటే కష్టపడాలి. అక్కడికి చేరేకా కిందికి చూస్తే ఇళ్ళు బొమ్మరిళ్ళులా,మనుషులు చీమల్లా కనపడతారు. ఇలా కనపడ్డం నిజమే, కాని ఇలా కనపడుతున్నది భ్రాంతి సుమా, నిజం కాదని తెల్సుకుంటే కొంతసేపు శిఖరం పై ఉండగలరు. లేకపోతే పతనం పెద్ద సమస్య కాదు. అప్పుడు తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నవతు.

అధికారమూ ఇంతే!!!!

4 comments:

  1. ఎవరికీ ఉబోస ? అందల మెక్కిన అశ్వశిక్షకునికా ? :(

    ReplyDelete
    Replies
    1. Zilebi10 December 2023 at 03:23
      పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పినమాటిది. శిఖరాగ్రం చేరేవాళ్ళందరికి, అగ్రం చేరి జారి కింద పడ్డవాళ్ళందరి కి చెప్పేరు.

      Delete
  2. అందలం ఎక్కినవారికే కాదు, అందలం పై నుంచి జారి పడిన నెలతాల్పుకు కూడా.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు10 December 2023 at 07:57
      అందరికి అందలాలెక్కాలనే కోరికుంటుంది. ఎవరి ఓపిక/ అదృష్టాన్నినుబట్టి వారు తగిన అందలం చేరుకుంటారు. చిత్రం! అందలం చేరుకున్న తరవాత కిందవాళ్ళంతా పిపీలకాల్లా కనపడతారు, అది భ్రమనుకోరు నిజమనుకుంటారు. అందలం దింపి/దిగిన తరవాత మనుషులు మామూలుగా కనపడతారు. అదే విష్ణుమాయ!! :)

      Delete