Wednesday 20 December 2023

కాపరంచేసే కళ కాలిగోళ్ళనాడే తెలుస్తుంది.

 కాపరంచేసే కళ కాలిగోళ్ళనాడే తెలుస్తుంది.


పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు కాలి,చేతులగోళ్ళు, పెళ్ళికూతురు వారింటి అబష్ఠుడు పెళ్ళికూతురు ఇంటి దగ్గర తీసి, ఒంటికంతా నూనెరాసి నలుగుపెట్టి తలంటుతాడు.  కొంతమంది ఈ ఆచారాన్నిపాటిస్తారు. 


పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు, తల్లి,ఆడబడుచుతో ఆడపెళ్ళివారింటికి వస్తాడు. వచ్చిన పెళ్ళికొడుకును హారతిచ్చి ఆహ్వానిస్తారు, లోనికి. ఆ తరవాత పానకమిచ్చి, కొత్తబట్టలిచ్చి గౌరవిస్తారు. తదుపరి, పెళ్ళికొడుకు తలంటుకు సిద్దమవుతాడు. ధాన్యం కుప్పగాపోసి దానిపై కొత్త పంచెలచాపు పరచి,దానిపై పీటవేసి,దానిపై పెళ్ళికొడుకును కూచుండబెట్టి, పెళ్ళికొడుకుకు కాలిగోళ్ళతీయడం, ఒంటికి నూనెరాసి నలుగు పెట్టడం, తతిమా కార్యక్రమమంతా అంబష్ఠుడు పూర్తి చేస్తాడు. తలంటిన తరవాత పెళ్ళికొడుకు అత్తవారిచ్చిన కొత్తబట్టలు కట్టుకుంటాడు, హారతిచ్చి తిలకం దిద్దుతారు, ఇదంతా ఆడపెళ్ళివారి తరఫువారు చేస్తారు.  అంబష్టుడు ధాన్యము,దాని మీద వేసిన చాపు పట్టుకునిపోతాడు. అతనికోతాంబూలమిచ్చి సత్కరిస్తారు.  ఇదేమి ఆచారం అని కదా సంశయం? ప్రతి ఆచారం వెనక కొన్ని కారణాలుంటాయి, అవి తెలుసుకోవలసినవే!


అమ్మాయి గురించి ఎంత తెలుసుకుంటారో, అబ్బాయి గురించి కూడా అంత తెలుసుకోడానికే ఈ ఆచారం. పెళ్ళికొడుకు ఆరోగ్యపరిస్థితి ఏమిటి? అవయాలు ఎంతపొందికగా ఉన్నాయి. చర్మరోగాలున్నాయా? అతని మాటతీరు, నడవడిక ఎలా ఉంటుందీ? వీటన్నిటి పరిశీలనకే ఈ ఆచారం. కాలిగోళ్ళనాడే పీటలపై సంబంధాలు తిరిగిపోయేవెన్నో!


ఇప్పుడెందుకిదీ?

ప్రతిపక్షాల సంఘటన వారొక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో తమవైపునుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోడానికి, సీట్ల సర్దుబాటు గురించి మాటాడుకోడానికిన్నీ. అందులో మమతమ్మ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే ని ప్రధాని అభ్యర్థిగా కోరింది. నితీశ్ కుమార్, లాలూ యాదవ్ దీనికి కినిసి సమావేశం నుంచి బయటకి వెళ్ళిపోయారు. జరుగుతున్నదానిని చూచిన ఖర్గే ఎన్నికలు కానివ్వవమ్మా! మనం నెగ్గిన తరవాత ప్రధాని ఎవరో చూడచ్చమ్మా! అని తప్పించారు. కాని కాంగ్రెస్ వర్గాలు రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా తప్పించే పన్నాగమే అని విరుచుకుపడుతున్నాయి. ఆ సమావేశంలో నితీశ్ ఉపన్యాసం తమిళంలో కావాలని స్టాలిన్ పట్టుబట్టారు, నితీశ్ కోపించారు. ప్రతిపక్షాల ఐక్యత ఇక్కడే తెలిసిపోతోంది, పై నానుడిలో చెప్పినట్టు. 

7 comments:

  1. ఇన్ డి యా ఇందులో అంబష్ఠుడెవరండీ :)


    ReplyDelete
    Replies
    1. Zilebi20 December 2023 at 20:27
      మేధావుల్ని మేధావులే గుర్తించాలండీ :) :) :) మాలాటివాళ్ళకి కుదురునా :)

      Delete
    2. -

      మేధావులను జిలేబీ
      మేధావులె గుర్తుపట్టి మెచ్చుకొనవలెన్
      సాదాసీదా తాతల్
      భేదమ్ము కనగొనగలరొ వెంకాయమ్మా :)


      జిలేబి

      Delete
  2. పెళ్ళిచూపులప్పుడే ఈ కార్యక్రమం జరిపిస్తే నయమేమో 🙂? పెళ్ళి కోసం తరలి వచ్చిన తర్వాత అంటే కాస్త late అయినట్లు కాదూ?

    ఈ తంతు బ్రాహ్మణేతర వర్గాల్లో ఎక్కువనుకుంటాను. బ్రాహ్మణుల పెళ్ళిళ్ళలో ఎప్పుడూ చూడలేదు.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు25 December 2023 at 12:01
      ఒకప్పుడు పెళ్ళిచూపులు ఆచారం లేదండి,అందరిలోనూ. కాలిగోళ్ళౌ తీయడమే ఉండేది. ఆ తరవాత కాలంలో బ్రాహ్మల్లో పెళ్ళి చూపులు మొదలయ్యాయి, అన్ని వర్గాలు ఆచరిస్తున్నాయి. ఐతే అన్ని వర్గాలూ ఈ ఆచారం ఇంకా పాటిస్తున్నాయి,బ్రాహ్మలు వదిలేసారండి.

      ఇది చాలా మంచి ఆచారం. పెళ్ళికొడుక్కి శల్యపరీక్ష. శరీరం అంబష్ఠుడు అన్ని చోట్ల తడుముతాడు, తప్పదు.నూనెరాయడానికి,నలుగుపెట్టడానికి.అమ్మాయి కూడా ఓరచూపులిప్పుడే చూచేది. సాధారణంగా పెళ్ళికొడుకుతో తల్లిగాని,ఆడబడుచుగాని వస్తారు. పెళ్ళికూతురు తరఫు స్త్రీలదే పైచెయ్యి. వారు చెప్పినట్టే నడుస్తుంది. ఇదెక్కడో బాత్ రూమ్ముల్లో జరిగేదేం కాదు. హాల్ లో పదిమంది ఆడమగ ఉండగా జరిగేది. ఇప్పుడు చెప్పండి,పెళ్ళికొడుకు శరీర పరీక్షేకాదు,మానసిక పరీక్ష కూడా కదా! నిజం చెప్పాలంటే! "This is nothing but strip search"

      Delete
    2. “strip search” 😁😁.
      దీన్ని చూసే airports లో కూడా మొదలెట్టారేమో? 😁😁

      Delete
    3. విన్నకోట నరసింహా రావు25 December 2023 at 18:42
      అంతేనేమోనండి :)

      Delete