Thursday 5 October 2023

చదువెందుకు చంకనాకను...

  చదువెందుకు చంకనాకను...


కాలు కదపద్దంటే, మంచం మీద పడుకునుండిపోతుంటే, బద్దకం పెరిగింది, అదొకటే ఏంలెస్తురూ! అన్నీ పెరిగేయి.... అలా పడుకునుంటే చిన్నప్పటి సంగతులు ముసిరేయి..... ఇలా ఒకటి...


''చదువెందుకు చంకనాకను నాలుగావులు,గేదెల్ని మేపుకుని బతకవచ్చును'', అనేవాడు మా నున్నం నర్సన్న బాబాయ్, డెభైఐదేళ్ళకితం, సాయంత్రం పూట వీధరుగుమీద కూచుని చదువుకుంటున్న మాతో, పశువుల్ని పొలం నుంచి తోలుకొస్తూ,పూటుగా గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం పుచ్చుకుని వస్తూ. ఈలొగా వచ్చేసేవారు మానాన్నగారో పెదనాన్నగారో, ''ఒరే తమ్ముడూ! ఏంటిరా? ఈ అల్లరి, ఇంటికెళ్ళు మరదలు ఎదురుచూస్తూ ఉంటుందీ" అని అనునయించి పంపించేసేవారు. నిజంగానే తను చెప్పినట్టు పశువులపాల వ్యాపారమే చేసేవాడారోజుల్లో. ఇంట్లోవాళ్ళు ఆ మాట గుర్తుకురానివ్వకుండా రోజూ "చదువుకోక మన్నుకొట్టుకొట్టుకుంటావా? చదువుకోక గాడిదల్ని కాస్తావా?" అని ఇవేవో చాలా తక్కువపనులని బ్రెయిన్ వాష్ చేసేవారు. అదే నిలిచిపోయింది. పాల వ్యాపారం చేసి కొన్ని దేశాలే బాగుపడ్డాయి. ఒకప్పుడు భారతదేశంలో గొల్లభామ మార్కు పాల డబ్బాలమ్మేవారు, ఎంతమంది కి తెలుసో చెప్పలేను. ఈ పాల డబ్బాలు స్విజర్లాండ్ నుంచి దిగుమతి అయ్యేవి.  పేరుగొల్లభామ మార్కు  , condensed. sweetend milk'.   'cow and Gate' brand, milk powder of England.  నేడు పెటా వారు అముల్ వారిని పశువులపాలు అమ్మరాదని గొడవ చేస్తున్నారు. పశువుల పాలు తీయడం సభ్యతకాదట. మరీ మాట నేటికీ Switzerland దేశాలలో చెబుతారో? తెలీదు. భారత్ లోనే ఈ పలుకు పలుకుతున్నట్లుంది. 


ఆ తరవాత కాలంలో మాత్రం. అదేమాట నిలిచిపోయింది. ఐదెకరాలు రోడ్డు పక్క చేను, మూడెకరాలు ఊడ్చుకుని, ఎకరంలో గడ్డి పెంచుకుని, ఎకరంలో షెడ్లు,కొంప కట్టుకునుంటే, ఈ వేళ...ఎందుకులెండి....పాల  వ్యాపారం

 చేస్తే ఎలా ఉండేదో....., జీవితం మూడు పువ్వులు ఆరుకాయల్లా నడిచేది.ఉప్చ్! రోజులలా నడిచిపోయాయలా.


సరే! పదేళ్ళకితం ''గాడిదల్ని కాయండి, కోటీశ్వరులుకండి'', అంటే నవ్వేసేరు. ఇప్పుడు గాడిదపాలు లీటరు ఎనిమిదివేలు, తొందరలో పదివేలు కాబోతోంది. ఇదీ చెయ్యలేకపోయా! తెలివైనవాళ్ళు ఈ మాట అంది పుచ్చుకున్నారు. యోగం లెద్దురూ! కారణం లేనిది కార్యం జరగదు. ఇదింతే.....ఎవరియోగమెంతో అంతే!!


రాబోయే కాలంలో మనిషిపాల వ్యాపారం జరగబోతోంది. "బ్రెస్ట్ మిల్క్! బెస్ట్ మిల్క్!!" ఈ వ్యాపారం ఐడియా, ఆ స్లోగనూ నావే! రిజిస్టర్ చేయించాలి పేటెంటు కోసం. చూద్దాం.... 


11 comments:

  1. "ఇదింతే.....ఎవరియోగమెంతో అంతే!!"
    ఇది ముమ్మాటికీ నిజం.

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju5 October 2023 at 18:06
      బుద్ధి కర్మానుసారిణి అన్నారు పెద్దలు. పరమాత్మ అనే మహాసముద్రం దగ్గరికి చేసుకున్న కర్మ చెంబైతే దానిడు నీళ్ళే దక్కుతాయి,బిందైతే దానిడే, ఎక్కువ తక్కువలుండవు కదండీ! అదే ఎవరియోగమెంతో అంతే!!

      Delete
  2. 🙂🙂
    “చదువెందుకు చంక నాకను
    పదియావులున్న పాడి చేసుకు బ్రతుకగ వచ్చున్” …. ఇటువంటిదేదో సరదాగా చెబుతుండేవారు పెద్దవాళ్లు మా చిన్నతనంలో …. ఓ పక్క మమ్మల్ని చదువుకోమనే హెచ్చరిస్తుండేవాళ్ళు లెండి 🙂. పదా, నాలుగా 🤔? మొత్తానికి ఏదో ఒక నెంబరు - పాల వ్యాపారం లాభసాటి అని చెప్పడానికి.

    Milkmaid (గొల్లభామ) మార్కు condensed and sweetened milk చాలా బాగుండేదండీ - ఉత్తదే తినడానికి కూడా 😜. ఇది Switzerland లోని Nestle వారి తయారీ.

    Cow & Gate milk powder ఇంగ్లాండ్ వారిది. మా చిన్నతనంలో ఇదే తాగించేవారు మా ఇంట్లో. Glaxo, Farex తరువాత వచ్చాయి. ఆ రోజుల్లో వలస ప్రభుత్వం కదా. మరి బట్టలు, ఇతర ఉత్పత్తులు వారివే ఉండేవట కదా?

    తమ తమ దేశాల్లో పాల ఉత్పత్తి, పాల వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా సాగుతూనే ఉందండి వలసపాలన వదిలేసినా కూడా. PETA వారు ఆందోళన చేసినా మరొకటైనా వ్యాపార శక్తుల ముందు నిలబడగలవనుకోను.

    మనిషి పాలతో వ్యాపారమా? కొంచెం కష్టం అనిపిస్తోంది. అవు దగ్గర, గేదె దగ్గర అయితే వాటి దూడలు కొంచెం కుడవగానే ప్రక్కకు లాగేసి మిగిలిన పాలు మనిషి పితుక్కుని వాడుకుంటాడు, అమ్ముకుంటాడు. కానీ మానవుల్లో తల్లిపాలు బిడ్డకే పూర్తిగా స్వంతం కదా. కాబట్టి అమ్ముకోవడానికి వీలవదేమో?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు5 October 2023 at 19:06
      మా నరసన్న బాబాయ్ గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం పట్టు మీదుండేవాడు, అందుకు రోజుకోలా అనేవాడు. ఏదైనా నికరమొక్కటే చదువెందుకు చంకనాకనని. :) పాల సైకిల్ తొక్కినవాళ్ళు హీరోలయ్యారని అందరూ అవలేరు కదండీ! మా వాళ్ళు రోజూ బుర్ర గొలికేసేవారు, చదువుకోకపోతే గాడిదల్ని కాస్తావా? అని భయపెట్టేసేవారు. ఆ భయమే ఉండిపోయిందండీ. :)

      కౌ అండ్ గేట్ స్విజర్లాండు వారిది, Britan కూడా ఉందనుకుంటానండి. కండేన్సుడు మిల్క్ తో చాలా సొమ్ములే చేసుకున్నరులెండి. పాలపొడి కూడా బ్రిటన్ వారూ. నేను చూడడమే కాని ఎప్పుడూ తినలేదు, మేము కొనలేదు కూడా :) బట్టలొకటేనేమండి. గడ్డ గీసుకునే బ్లేడు 7 o clock నుంచి, కాల్చే సిగరెట్టు 555 Marlbaro, Spencer చుట్ట దాకా అన్నీ ఫారిన్ లేక గడవని పెద్దలున్నారు కదు సార్!

      నాకైతే అమూల్ తో పెద్ద పరిచయమే ఉంది. నా పెద్దకూతురి కూతురు కవలపిల్లలలో ఆడపిల్ల. మగపిల్లాడిని వాళ్ళు పెంచారు. ఆడపిల్లని మేము పెంచాం. అప్పుడు ఎక్కడికెళ్ళినా అమూల్ డబ్బా కోసం గాలించేసేవాణ్ణి, ఒక్క మూడేళ్ళు. ఒక్కొకప్పుడు బ్లాక్ లో కూడా కొనేవాణ్ణి.

      పెటా భారతదేశంలో నే ఎక్కువ అరుస్తుంది. దీనికి అనుచరులూ మన దేశంలో ఉన్నంతమంది ఇతర దేశాల్లో ఉండరు. అముల్ అనేది ఒక కోఆపరేటివ్ సంస్థ, నందిని కూడా. మన దేశ సంస్థలు బాగుండడం మనలో కొందరికి నచ్చదు. అంతా ఫారిన్ సరుకే కావాలి లెండి.

      మనిషి పాల వ్యాపారం కొత్తేం కాదండి. పాతకాలంలో కలిగినవారు, తల్లి దగ్గర పాలు లేవనీ, అందాలు తగ్గుతాయనీ(ఆ రోజుల్లోనే)పాల దాది/పాలదాయి/పాలతల్లి ఇలా పేర్లతో ఒక స్త్రీని నియమిచుకునేవారు. ఆమెకు ఆ హవేలిలో ఒక గది, భొజన ఏర్పాట్లు ఉండేవి. ఆమె ఆ బిడ్డకి పాలిచ్చేది.కన్న తల్లికి చెలికత్తెగానూ ఉండేది. కొంతమందైతే అదే హవేలీలో వేరుగా ఔట్ హవుస్ లో ఉండేవారు. ఇలాటి పాలతల్లి/పాలదాయి/పాల దాదిలను ఎరుగుదును. ఇప్పుడు పాతదే కొత్తగా రాబోతోంది. సరోగసీ పాతదే కొత్తగా రూపు దిద్దుకోలేదా! :)

      పేటెంట్ కోసం రిజిస్టర్ చేయించాలండి.విదేశాల్లో ఇది ఉన్నట్టే ఉందండి. :)

      Delete
  3. విన్నకోట నరసింహా రావు5 October 2023 at 19:06
    కౌ అండ్ గేట్ రెండు దేశాల్లోనూ ఉందనుకుని పొరబడ్డానండి. ఇది ఇంగ్లండ్ ది, గొల్లభామ స్విజర్లాండుదిన్నీ, సరిజేశాను.
    పాలదాయి కి కొందరు నెలజీతాలిచ్చారు, మరికొందరు భూములు రాసిచ్చారు. ఇలా పాల అమ్మకం జరిగిందండి.ఒక్కొకతల్లి మూడేళ్ళు పాలిచ్చిన సంఘటనలూ ఉన్నాయి.
    ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. 🙏🙏
      ఎందుకైనా మంచిది పేటెంట్ తీసుకుని ఉంచండి 👍🙂. విదేశీ దేశాల అఘాయిత్యాలకేం తక్కువ లెండి - మన గోంగూర మీద కూడా వాళ్ళు పేటెంట్ తీసుకోగలరు 😏. కాబట్టి మన జాగ్రత్త మనది 🙂.

      Delete
  4. 'काला अक्षर भैैंस बराबर'

    ReplyDelete
    Replies
    1. bonagiri9 October 2023 at 20:42
      విద్యలేనివాడు వింతపశువు అని తెనుగునానుడి కదండీ! అదీ ఇది ఒకటేనాండీ!!

      Delete
    2. // “ काला अक्षर भैैंस बराबर' “ //
      అంటే అర్థము, సందర్భము ఏమిటి, బోనగిరి గారు?
      Black letter equals buffalo అని గూగుల్ అనువాదం. చాలా కాలం ఉత్తర భారతదేశంలో నివసించి వచ్చారు కాబట్టి ఆ నానుడి సందర్భం, అన్వయం మీరే బాగా వివరించగలరు.

      Delete
    3. అక్షరాలు రాని వాడు దున్నపోతు తో సమానం అని అర్ధం.
      శర్మ గారు చెప్పిన తెలుగు నానుడి లాంటిదే.

      Delete
    4. థాంక్స్ బోనగిరి గారు. పలు భాషల్లో సామెతలు సారూప్యం కలిగి ఉంటాయి - జీవితానుభవం నుంచి పుట్టినవి కదా.

      ఏమిటో దున్నపోతు అంటే ఒక famous రచయిత గారి famous పద్యం గుర్తొస్తుంది 🙂.

      Delete