Saturday 4 November 2023

దొంగని దొంగే పట్టాలి-1

 దొంగని దొంగే పట్టాలి...1


మొన్నీ మధ్యే ముల్లును ముల్లుతో తీయాలన్నదానికి ఒక కత చెప్పుకున్నాం. మరి దొంగని దొగే పట్టాలంటే! ఇదీ ఒక నానుడే. ఒక కత చెప్పుకుందాం.అలా ముందుకుపోదాం.


అనగనగా ఒక రాజ్యం, దానికోరాజు,ఒక మంత్రి.రాజ్యం ధనవంతమైనదే కాని పేదలే ఎక్కువ. ఆ రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి.రాజుకి తాకిడి ఎక్కువయ్యింది, దొంగతనాల గురించి. మంత్రిని నిలదీశాడు,రాజు. దానికి మంత్రి ''రాజా! కలిగినప్పుడు మాత్రమే దొంగతానాలెక్కువగా ఉంటాయి. లేనివాడింటికి కన్నమేసేటంత మూర్ఖుడు ఎవడూ ఉండడు. 'లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవు'. అంచేత మనదేశం ధనవంతమైనది, అందుకు సంతసించండి'', అన్నాడు మంత్రి.


రాజు,''దేశం ధనవంతమైనందుకు నిన్ను అభినందిస్తున్నాను. మన పరిపాలన  సవ్య దిశలో నడుస్తున్నట్టేగా! అది సరేగాని లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవన్నావు. అదేంటో చెప్పూ'', అన్నాడు.


వినండి, రాజా! మన దేశంలో ఒక పల్లెటూరు. అందులో ఒక జాయ,పతి. వయసులోనే ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ధనానికి లోటేమోగాని సంతానానికి లోటు లేదు, ఇంటి నిండా పిల్లలే! ఆ కుటుంబ యజమాని ధనం మాటెలా ఉన్నా పిల్లల్ని మాత్రం కనేసేడు, పదిమందిని. పూర్వులు సంపాదించి ఇచ్చిన కొంప పడిపోడానికి సిద్ధంగా ఉన్నదానిలో కాపరం. ఒక రోజు ఇంటి ఇల్లాలు పిల్లలికి కలిగినదేదో పెట్టి తను గంజితాగి పడుకుంది, ఉన్న ఒకే ఒక్కదీపాన్ని మలిపేసి.పిల్లలు తనూ కింద పడుకున్నారు. నడిరాత్రి ఒక దొంగ నెమ్మదిగా ఉతకలెత్తేసి తలుపులు తీశాడు. మెలుకువొచ్చిన ఇల్లాలు పడుకునే ఉంది. దొంగ ఇల్లంతా తిరిగేడు. చీకటి, ఎక్కడ చూసినా తలకి ఆనపకాయ బుర్రలేతగులుతున్నాయి. అవీ ఖాళీగా ఉన్నవే. ఇంక కాలికి పిల్లల పిర్రలే తగులుతున్నాయి, ఎటుతిరిగినా. ఏమీ విలువైనది దొరక్కపోతే దొంగ, ''ఎరక్కపోయి ఇంటికి కన్నం వేసాను, ఎటుచూసినా పైన బుర్రలు,కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకలేదని'' సణుక్కున్నాడు. విన్న ఇంటి ఇల్లాలు. 


''అన్నా!రాత్రి వేళ ఇంటికొచ్చావు. కనీసం గంజి కూడా లేదు, పోద్దామంటే! ముందు తలుపులెత్తేసేవు, దయ ఉంచి వెనక తలుపులు కూడా ఉతకలెత్తెయ్యి. వాటిని బాగుచేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా! వాటిని ఎత్తి బయటకు తీయలేక ఊరుకున్నా!'' అంది. విన్న దొంగ నిర్ఘాంతపోయాడు. ''చెల్లీ! దీపమేనా పెట్టుకోలేదే''మని అడిగాడు. 


''అన్నా! ఉన్నది ఒక్కదీపం అది రాత్రంతా వెలిగితే మర్నాడు వెలిగించుకోడానికుండదు'' ''బావగారు!......'' వాకబు చేశాడు దొంగ. ''పొరుగూళ్ళో ఉద్యోగానికెళ్ళేరు. ఉదయానికొస్తా''రంది. దొంగ చలించిపోయాడు, ఇంత దుర్భర దారిద్యం చూసి. దీపం వెలిగించమని, ఆపై ఆమె చెప్పిన పని చేసి పెట్టి, తన దగ్గరున్న సొమ్మును ఆమెకిచ్చి, దణ్ణం పెట్టి, ఇకపై దొంగతనం చేయనని కష్టపడి బతుకుతానని ఆమెకు మాటిచ్చి వెళ్ళేడు.


కతబాగుందిగాని అసలు సంగతి చెప్పండి, అడిగాడు రాజు. రాజా! విషయం రేపు చెబుతానని వాయిదా వేసాడు మంత్రి...

ఎదురు చూడక తప్పదుగా

2 comments:

  1. జన్మదిన శుభాకాంక్షలు, శర్మ గారు 💐.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు4 November 2023 at 19:48
      ధన్యవాదాలండి

      Delete