28, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఎవరికంపు వారికింపు.

 ఎవరికంపు వారికింపు.

ఇదొక నానుడి.ఎవరు చేసినపని,చెప్పిన మాట వారికి సొంపుగానూ, ఇంపుగానూ కనపడతాయని దీని భావం.కాకి పిల్ల కాకికి ముద్దు ఇదీ ఒక నానుడే! కాకి తనపిల్లని ముద్దు చేయడంలో తభావతేముంది? కాని అదే కాకి పిల్లని మరొకరు ముద్దు చేస్తారా అన్నదే మాట. అలాగే ఎవరు చేసినపని,మాట ఎదుటివారికి కూడా నచ్చాలి.లోకంలో అందరికి అన్నీ నచ్చవు, కాని ఎక్కువమందికి నచ్చాలికదా! అలా నచ్చని దాన్నే ఇలా ఈ నానుడితో చెబుతారు. 


ఈ విషయంమీద ఇదివరలో వాసన అని ఒక టపారాసిన గుర్తు.   

శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన

 ఇంతేకాదు నిజంగానే ఎవరి కంపు వారికి ఇంపుగానే ఉంటుంది. కారణం తమదైన వాసన తమకి తెలియదు, ఎదుటివారికి తప్పించి. సైన్స్ కూడా చెబుతున్నమాటిదే. ప్రతివ్యక్తి శరీరం నుంచి తమదైన ఫెరోమోన్స్ విడుదలవుతాయి. ఇవి చెమటతో బయటికొస్తాయి. ఎవరి ఫెరొమోన్ వాసన వారిదే! ఇద్దరి ఫెరొమోన్ ఒకలా ఉండదు, ఇద్దరి డి.ఎన్.ఎ ఒకలా ఉండనట్టు. ఈ ఫెరొమోన్ వాసన పక్కవారికి మాత్రమే తెలుస్తుంది, ఎవరిది వారికి తెలియదు. ఈ ఫెరొమోన్స్ వాసన చూసే కుక్కలు నేరస్థులని పట్టుకుంటాయి ఈ ఫెరొమోన్స్ వాసన కుక్కలు గుర్తించినంతగా ఇతరులు గుర్తించలేరు. మనం ఒక ప్రదేశంలో కొంతసేపుండి అక్కడనుంచి వెళ్ళిన తరవాత కూడా మన ఫెరోమోన్స్ వాసన అక్కడ ఉంటుంది. నేరస్థులు దీనిని తొలగించాలని చూసినా సున్నితమైన ముక్కుతో కుక్కపసికడుతుంది. ఈ పెరొమోన్స్ లో ఆడ మగ తేడాలున్నాయష! వామ్మో!!


ఇంతేకాదు కొంతమంది కొంతమంది ఫెరొమోన్స్ ఇష్టపడతారట. ఏడుస్తున్న చిన్న పిల్లల దగ్గర తల్లి దుస్తులు పడేస్తే ఏడుపు ఆపుతారట. ఆ దుస్తులనుంచి విడుదలైన ఫెరొమోన్స్ వాసన తల్లి దగ్గరుందన్న భావం బిడ్డకు కలగజేస్తుంది. బట్టలు ఉతికిన తరవాత కూడా ఈ ఫెరొమోన్స్ వాసన మిగిలే ఉంటుందిట.  మరి భార్య భర్త ఒకరి ఫెరొమోన్స్ మరొకరు ఇష్టపడితే జీవితమే హాయిలేహలా! వారే విడదీయలేని జంట.ఇది బహు అరుదు.


ఇక కొంతమందిని అందరూ ఇష్టపడతారు, కొంతమందిని ఎవరూ ఇష్టపడరు. కొంతమందిని కొందరే ఇష్టపడతారు. కారణం! మాట. అదెలాగో చూదాం. తినే ఆహారాన్ని బట్టి మనసు, మనసు బట్టి మాట. అలాగే తినే ఆహారాన్నిబట్టి ఫెరొమోన్స్ విడుదలవుతాయి. అదేవాసన. స్త్రీ పురుష ఫెరొమోన్స్ ఆకర్షణకి తోడవుతాయిట. అంటే మొత్తం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. 


చిన్న ఉదాహరణ. పచ్చి వెల్లుల్లి తినండి, మీ నుండి విడుదలయ్యే చెమటలో వెల్లుల్లి వాసన ఉంటుంది. ప్రయత్నించకండీ! ప్రమాదం!


ఇక తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది? వాటి రకాలు. సాత్విక,రాజస,తమో గుణాహారాల మూలంగా మూడు గుణాలు ఏర్పడతాయి.అవే సత్వ,రజస్, తమో గుణాలు. ఈ గుణాల మూలంగానే మనసు, దాన్నిబట్టి మాట అలాగే విడుదలయే ఫెరోమోన్స్ ఉంటాయి. అయ్యో! నన్నెవ్వరూ పట్టించుకోటం లేదని బాధవద్దు. సాత్విక ఆహారం తీసుకోవడం ప్రారభిస్తే మార్పువస్తుంది, దీనికి కాలం తీసుకుంటుంది, మార్పు ఒక్క రోజులో రాదుకదా! అసలు ఇష్టం అనేదొకటుందికదా! ఆహారం తీసుకోవడం లో, దాని మాటేమీ? సాత్విక,రాజస,తామసాహారాలలో ఏవి ఎక్కువ ఇష్టమో అది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఏర్పడతాయి.  


ఇంత పెద్ద విషయాన్ని మనవారు ''ఎవరికంపు వారికింపు'' అని చిన్న మాటలలో చెప్పేసేరు.  


24, ఏప్రిల్ 2023, సోమవారం

ఫలాహారమే మేలు

ఫలాహారమే మేలు(2023)


కొత్తపల్లికొబ్బరి మామిడిపళ్ళు.




 వేసవి రావడం పళ్ళు రావడం, మార్కెట్ నిండా పళ్ళే! ఫలాహారమే చవగ్గా ఉన్నట్టుంది, ఇడ్లీ ,పెసరట్టు, ఉప్మాలకంటే.


పనసతొనలు మీడియం డజను ......30

ద్రాక్ష నలుపు/తెలుపు అరకేజి...... 50

ఆపిల్ కేజి ... .. 200

అరటిపళ్ళు అత్తం (24) పెద్దవి.... 100

దానిమ్మ మీడియం (12) కేజి .....200.ఒకటి 20

లంక దోసకాయ పెద్దది..... 60

కర్బూజా....30

పుచ్చకాయ మీడియం 1/6 వంతు ముక్క...... 10

సపోట కెజి మీడియం(24)........ 50

కమలా కేజి......... 200

బొబ్బాసికాయ మీడియం 1/6వంతు ముక్క......10

నేరేడు పళ్ళు 1/2 కేజి .....150

తాటిముంజలు12......60

జీడి మామిడి పళ్ళు 12.......50

వెలగపళ్ళు3........50

జామకాయలు కేజి.....50

కర్రపెండలం 1/2కేజి.......40

ఎండు ద్రాక్ష..కేజి (packed).......350

ఖర్జూరం 1/2 కేజి( Fresh fruit packed).....350

లేత కొబ్బరి నీళ్ళు,(పాకుడు). లీటరు....100

మామిడిపళ్ళు (కొత్తపల్లి కొబ్బరి)మీడియం..100...5000


రేగు సీజనయిపోయింది. తేగలు,బుర్ర గుంజు సీజనయిపోయింది.కమలా సీజన్ పూర్తికావస్తోంది.పంపర పనస,నారింజ మార్కెట్ కి రావటమే లేదు.అనాస సీజన్ మొదలుకాలేదు.


ఎన్ని రకాలపళ్ళు. మరేదేశం లోనూ ఇన్ని ఉంటాయా? ఉన్నాయా? 

................

ఇడ్లీ (మీడియం) 4 ...30

పెసరట్టు ....30

ఉప్మా...20


20, ఏప్రిల్ 2023, గురువారం

పునర్విత్తం

 పునర్విత్తం పునర్మిత్రం

పునర్భార్య పునర్మహి

ఏతత్సర్వం పునర్లభ్యం

న శరీరం పునః పునః

కోల్పోయిన విత్తం మరల సంపాదించచ్చు,  విడిపోయిన మిత్రుడిని మళ్ళీ కలవచ్చు.  భార్యపోతే మరొకరినీ సంపాదించుకోవచ్చు.భూమినికోల్పోతే మరలా సంపాదించచ్చు.  కాని శరీరం ఒక సారిపోతే  మళ్ళీ మళ్ళీ పొందలేం, తిరిగిరాదు.

Courtesy:Whats app
It is a graphic message. I love it,like it.

ఇంతెందుకు అని, ఒక్క మాటలో చెప్పేసేరు. అదే ''శరీరమాద్యం ఖలు ధర్మసాధనం''.ఏం చెయ్యాలన్నా శరీరం ముఖ్యం,దాన్ని కాపాడుకో అన్నారు. నేనేంటి ఉక్కు ఉక్కు అన్నవాళ్ళు తుక్కు తుక్కు ఐపోయారు, కోవిడ్ దెబ్బకి . కొందరు చచ్చి బతికేరు.  కోవిడ్ మళ్ళీ పుంజుకుంటోంది. ఒక సారొచ్చింది మళ్ళీ రాదనుకోవద్దు. వాక్సీన్ వేసుకున్నా జాగరత అవసరమే. దీనికి తోడు H3N2 Flu variant  బలంగా వ్యాపిస్తోంది.  ఇమ్యూనిటీ కొనుక్కుంటే దొరకదు, ఇమ్యూనిటీ పెంచుకునే చర్యలు తీసుకోండి.  యోగా చేయండి, వయసుతో నిమిత్తంలేదు,దీనికి. నడవండి. ఇప్పుడు ఎండలు జోరుగా ఉన్నాయప్పుడే, 40,41,42   ఇలా వేడి పెరుగుతోంది.(Heat wave sweeping) వేడి 45 దాకా చేరచ్చంటున్నారు. వడదెబ్బ తగలచ్చు, ఎండలో తిరగద్దు. జాగర్తా!

పుట్టింది మొదలు గిట్టే దాకా మనతోడు మన శరీరమే, తల్లితండ్రి,భార్య,పిల్లలు,బంధువులు,మిత్రులు ఊపిరినిలబడితే ఎవరూ తోడుండరు.శరీరాన్ని కాపాడుకోవాలి.వయసు ముదిరితే చెయ్యీ కాలూ ఆడకపోతే హాస్పిటల్ లో పారేస్తారు, చాకిరీ ఎవరూ చెయ్యలేరు. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే,ఇక్కడే,ఇక్కడే పొంచిఉంది.జాగర్త. ఎల్లకాలం ఎవరూ ఉండరని మిట్ట వేదాంతం చెప్పద్దు, ఉన్నంతకాలం చెయ్యీ,కాలూ ఆడాలి మరచిపోవద్దు, జాగర్త..

15, ఏప్రిల్ 2023, శనివారం

భ్రమర,కీటన్యాయం.

 భ్రమర,కీటన్యాయం.

భ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు. ఏంటీ (సామెత)న్యాయం?

కీటకం భ్రమరానికి చిక్కుతుందనీ, ఆ తరవాత భ్రమరం కీటకం చుట్టూ తిరుగుతుందనీ, ఆ కీటకం భ్రమరమవుతుందనీ చెబుతారు, పెద్దలు. కీటకం ఎప్పటికి భ్రమరం కాలేదంటారు, కొందరు.పెద్దలు ఇదెందుకు చెప్పినట్టూ, ఇందులో ఏదో గూఢం ఉందా? చూదాం!


కీటకమనే మనసు భ్రమరమనే ద్వేషానికి చిక్కుతుంది.చిక్కిన మనసు చుట్టూ ద్వేషం తిరుగుతూ ఉంటుంది.  ఎంతకాలం? కీటకం భ్రమరమేదాకా!అంటే మనసు ద్వేషంతో నిండిపోయేదాకా!


ఇది ఒక ద్వేషానికే చెప్పుకోనక్కర లేదు. పగ,ద్వేషం ఇలా అవలక్షణాలకే మనసు చిక్కుతుందనే పెద్దల మాట.భక్తికి చిక్కదా? బహు అరుదు. అలా భక్తి భ్రమరానికి మనసనే కీటకం చిక్కితే అదే అదృష్టం.

13, ఏప్రిల్ 2023, గురువారం

పట్టుకో!పట్టుకుంటా!!



ఇది జిజ్ఞాసువు ప్రశ్న. దేవునిగురించి ఎవరికివారు తెలుసుకొవలసిందేగాని మరొకరు ఎఱుక పరచలేరన్నది నానమ్మిక.దీనిపై అంతులేని ప్రశ్నలు, అనంతమైన సమాధానాలూ ఉన్నట్టున్నాయి, నేడో రేపో కమే కూడా దీనిమీద సిద్ధాంతం రాసెయ్యచ్చు.


ఈ నెల రెండో తారీకు మొదలు రొంప,దగ్గు,జ్వరం నన్ను సిరి పీడించినట్టు పీడిస్తున్నాయి, వదలక. దీనికి తోడు నాలుగురోజులుగా వేడి దంచుతోంది, నలభై లెక్కన. నా కష్టాలు పరమాత్మకే ఎఱుక.ఇంతలోనూ కొంచం ఓపిక జేసుకుని..ఇది గిలికా...


పల్లెటురివాణ్ణి,చదువు లేనివాణ్ణి, మట్టిలో బతికే మనిషిని, మేధావినికాను.ఇది నా అనుకోలు, పెద్దలు మన్నించెయ్యండి,తప్పుల్ని.


ప్రశ్నలోనే ఇద్దరున్నట్టుకదా? ఇద్దరుంటే కదా ఒకరినొకరు పట్టుకోడం? ఎవరిని ఎవరు పట్టుకోవాలన్నది ప్రశ్న.


విషయంలో కెళదాం.

మార్జాలకిశోరన్యాయం, మర్కటకిశోర న్యాయమన్నవి రెండు సామెతలు, సంస్కృతంలో.

మొదటిదానిలో పిల్లి తన పిల్లను నోటకరచుకుపోతూ ఉంటుంది.పిల్లకి బాధ్యతలేదు. అంతా తల్లి చూసుకుంటుంది. రెండవది దీనికి విరుద్ధం. అందులో తల్లికోతి వీపును పిల్ల పట్టుకు ఉంటుంది.తల్లికేం బాధ్యతలేదు. పిల్లబాగోగులు పిల్ల చూసుకోవాలంతే!

ఈ రెంటినీ సమన్వయ పరచుకుంటే!ఎలా?

భాగవతం దగ్గరకెళదాం.ప్రహ్లాదోపాఖ్యానం లో ప్రహ్లాదుడు హరి నామాన్ని పట్టుకున్నాడు. ఎలా? పానీయంబులుద్రావుచున్,కుడుచుచున్,, హాస నిద్రాదులు జేయుచున్, అన్నీ చేస్తూ కూడా నామం పట్టుకున్నాడు.మర్కటకిశోర న్యాయంలా. కష్టాలొచ్చాయి, ఎంతదాకా పీకలదాకా,హిరణ్యకశిపుడు ఇలా ఏడ్చేదాకా

ముంచితి వార్ధులన్ గదలమొత్తితి .......జావడిదేమి చిత్రమో అనుకుని ఏడ్చేదాకా!  ఎవరు పట్టుకున్నారు ప్రహ్లాదుని? హరి పట్టుకున్నాడు మార్జాలకిశోర న్యాయయంలో లా. 


దీన్ని బట్టి తెలిసేదేమి? నువ్వు పట్టుకో! నిన్ను పట్టుకుంటా!! 

9, ఏప్రిల్ 2023, ఆదివారం

కమే! కమే!! కమే!!!

 కమే! కమే!! కమే!!!


ఎక్కడజూసినా కమే మాటే!

కమే ఏంజెయ్యగలదయ్యా? అడిగేడో జ్ఞిజ్ఞాసువు 

ఏమైనా చెయ్యగలదన్నాడో మేధావి.

కొన్ని ఉజ్జోగాలే పోతాయన్నాడు మరొకడు.

అదేంజేయగలదు? ఏం ఉజ్జోగాలో పొతాయో చెప్పరాదే అడిగేడు మరో పెద్దమడిసి.

ఇనుకోండి. 

లెక్కల్లో బొక్కలు సిటికలో కనిపేట్టస్తది. అక్కౌంటెంట్లు, ఆడిటర్ల పని కాళీ!

గ్రంధాలు, ఉద్గ్రంధాలు రాసేయగలదు, కవులు కళాకారులు పని ఖాళీ!

ఇలా జెప్పినియ్యి కొన్నే!సమస్యలు చిటికిలో విడదీసెయ్యగలదు.ఏమైనా చేసెయ్యగలదు, చెప్పేసేడు. ఇలా చాలా చాలా పనులు చేసెయ్యగలదు, చాలా ఉజ్జోగాలు  హాంఫట్, బెదిరించేడు.

ఐతే చెయ్యలేనిదేం లేదంటావ్? అడిగేడు మరో అనుమానం  పక్షి.

దానే అడిగేదాం అనేసేడు ఒక విజ్ఞాని.

ఉదాహరణ చెబుతా వినండి.

ఒక జడ్జీగారు తను ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండాలో అని కమేని అడిగితే ఆయనేమని రాసేడో తీర్పు అలాగే చెప్పేసిందిట. అదిజూసి ఆయన నోరొదిలేసేడంట. ఆయనేజెపిండు, ఇటు సెయ్యద్దూ, ప్రమాదమూ అని.

మరో ముచ్చట. ఒకయనో ముచ్చటజెప్పిండంట, సేనాకాలం కితం. అది వివాదం అయ్యిందంట, నాడు. నేడు కమేని అడిగితే ఈన జెప్పిందే నిజమన్నదంట. ఆయనో డప్పేసుకుని జెప్పుకుంటాన్నాడు.

ఐతే కొన్ని కొచ్చన్లేదాం ఏటి జెప్పుద్దో!

2024 లో మోడీగారు ప్రధానిగా ఎన్నిక కాకపోతే ఏం జేసుకు బతగ్గలడు?

హిమాలయాల్లో టీ అమ్ముకుని ఐనా బతికెయ్యగలడని ఆన్సరు.

2024 లో రాహుల్ బాబా ప్రధానిగా ఎన్నిక కాలేకపోతే ఏ0 చేసిబతగ్గలడు?

ఏమీ చెయ్యలేడు. ఏమీ చెయ్యలేకపోయిన బతికెయ్యగలడు ఆన్సరు.

అమ్మాయి నీళ్ళడుతోంది ఏబిడ్డ?

Input డాటా ఇనకంప్లీట్, ఆన్సరు.

నువ్వు చెయ్యలేనిదేంటో చెప్పూ?

కొన్ని నిమిషాలే మౌనం. ఏమైందీ అని భయపడ్డారు, జనం. నోరిప్పింది కమే,

  పిడక పజ్యాలు రాయలేను, ఆన్సరు.


ఇది చదివి నవ్వుకోండి. ఏవరికైనా బాధ కలిగితే బాధ్యత నాది కాదు కమేదేస్మీ!

So many errors, correct them yourself :)

2, ఏప్రిల్ 2023, ఆదివారం

రాముని రాజ్యం-భరతుని పట్టం-2

 రాముని రాజ్యం-భరతుని పట్టం-2


జయత్యతిబలోరామో

లక్ష్మణస్య మహాబలః

రాజా జయతి సుగ్రీవో

రాఘవేణాభిపాలితః

(జయ మంత్రం)       హనుమ.  

https://kasthephali.blogspot.com/2023/03/1.html

continued.....

అవగాహన

దశరథుని పార్ధివదేహానికి అగ్ని సంస్కారం చేసిన తరవాత,రాముని తల్లి కౌసల్యను దర్శించాడు,భరతుడు.   తల్లీ! జరిగినదానిలోగాని, నా తల్లి కోరిన కోరికలలో గాని నా ప్రమేయం లేశమాత్రమున్నూ లేదు. ఏమాత్రం ప్రమేయమున్నా అనేక ఘోరమైన పాపాలు చేసినవాణ్ణి అవుతాను, అని ఒట్లు పెట్టుకున్నాడు. మనం అందరం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామనీ చెప్పాడు.  ఆ తరవాత లక్ష్మణుని తల్లి సుమిత్రకు కూడా ఇలాగే చెప్పాడు. అందరం వెళ్ళి రాముని వెనక్కి తీసుకొద్దామని చెప్పేడు.  ఆపై సభచేసి మంత్రి,పురోహిత, పౌర, జానపదులుండగా, ఈ రాజ్యం రామునిది, రాముడే పరిపాలనార్హుడు.  నా తల్లి కోరినవరాలలో నా ప్రమేయం లేదు, అని ప్రకటించి, మనం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామని చెప్పేడు.


ఆ తరవాత అనుకున్నట్టు అందరూ అనగా, రాణివాసం, సైన్యం,మంత్రులు,పౌరులు,జానపదులు కదలిరాగా రాముని కోసం అడవులకు బయలుదేరారు. పట్టపుటేనుగు సిద్ధంగా ఉన్నా భరతుడు గుఱ్ఱం ఎక్కేడు. పట్టపుటేనుగు హౌదా ఖాళీగా ఉండగా బయలుదేరింది. 

***

ఆలోచన

ఇంట గెలిచి రచ్చగెలవాలి, ఇదొక నానుడి, తెనుగునాట. ఇది రామాయణం లో భరతుడు చేసినదానిని బట్టే ,ఈ నానుడి పుట్టిందని నా నమ్మిక. తాను రాజ్యం రామునిదే అని నమ్మేడు, అదే చెప్పేడు,  ఆచరణలో చూపాడు.  అది అమలుకు, ముందు ఇంటిలో వారిని ఒప్పించగలగాలి,  జరిగినదానిలో తనప్రమేయం లేదని.. అందుకు ముందుగా రాముని తల్లి కౌసల్యను కలిసాడు,ఎన్ని ఒట్లు పెట్టుకున్నాడో, నేనైతే ఒట్లు పెట్టుకున్నాడని తేల్చేసేను.  ఆనాటికి ఘోరపాపాలేవైతే ఉన్నాయో అవన్నీ తాను చేసినవాడినౌతానని చెప్పేడు.  చివరికి మనం వెళ్ళి రాముని తీసుకొద్దామని చెప్పి పెదతల్లికి  నమ్మకం కలగజేసేడు. రామునికి బహిఃప్రాణం లక్ష్మణుడు, అలాగే తన బహిఃప్రాణం శత్రుఘ్నుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు కవలపిల్లలు, సుమిత్ర కొడుకులు. అటువంటి సుమిత్ర దగ్గర ఏడ్చేడు, తనగోడు వినిపించేడు, కౌసల్య దగ్గర పెట్టుకున్నన్ని ఒట్లూ పెట్టుకున్నాడు, మనం రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నాం, అనీ చెప్పేడు. నిజానికి ఇంత చెప్పక్కరలేదు, ఈ పెదతల్లికి, కాని చెప్పేడు. తన బహిఃప్రాణమైన తమ్ముడు, శత్రుఘ్నునికి తనేమిటో తెలుసు, తన తమ్ముని ద్వారా సుమిత్రకీ తెలిసి ఉండే సావకాశాలే మెండు. కాని అలాగని ఉపేక్ష చేయలేదు.కౌసల్య దగ్గర చెప్పినదంతా ఇక్కడా చెప్పేడు,  పెదతల్లికి  నమ్మకం కలగజేసేడు. ఆపై పౌరులు,జానపదులకూ  తెలిసేందుకుగాను సభచేసి ప్రకటించాడు.   తాను చెప్పడమే కాదు, అది నిజమనిపించేందుకుగాను, పట్టపుటేనుగు బయలుదేరినా దానిని ఖాళీగానే ఉంచి, తాను   గుఱ్ఱం మీద మాత్రమే బయలుదేరాడు.  ఎందుకిలా చేసాడు? రాజుమాత్రమే పట్టపుటేనుగు ఎక్కేందుకు అర్హుడు, తాను రాజుకాదని ప్రజలకి తెలియజేసేందుకే అలా చేసేడు. మరి పట్టపుటేనుగెందుకు ఖాళీగా? తిరిగి వచ్చేటపుడు రాముని కోసం. సైన్యమెందుకు? రాణివాసానికి రక్షణ. అంతేకాదు రాజు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు, సైన్యం కూడా ఉండాలి. తిరిగొచ్చేటపుడు రాముడు రాజు గనక సైన్యం కూడా ఉండాలి. ఇక మంత్రులు ఎందుకు? మంత్రులందరూ బుద్ధి కుశలురై ఉంటారు, అనుకోని అవాంతరాలలో ఆలోచనకి అవసరపడతారు. ఇక పౌరులు,జానపదులు ఎందుకు? పౌరులు,జానపదులూ నీ తిరిగిరాక కోరుతున్నారని  రామునికి తెలియజేసేందుకు, ముఖ్యులు కూడా ఉండేందుకు. ఇన్ని ముందు జాగరతలూ తీసుకున్నాడు, భరతుడు, రాముని తిరిగి రమ్మని చెప్పడానికి. అంతేకాదు తన ప్రయత్నలోపం ఉండకూడదనీ, తన ఆంతర్యం అందరికీ తెలియాలనీ ఇన్ని పనులు చేసేడు. భరతుడు బుద్ధిశాలి.  


ఇలా ఇంట నమ్మకం కలగజేసి,వారి మనసులు గెలిచాడు, ఇదే ఇంట గెలవడం. ఇక రచ్చ ఎలాగెలిచాడో తదుపరి చూదాం.

తరువాయి...



30, మార్చి 2023, గురువారం

రాముని రాజ్యం-భరతుని పట్టం-1

రాముని  రాజ్యం-భరతుని పట్టం-1 


రామం దశరథం విద్ధి

మాం విద్ధి జనకాత్మజం

అయోధ్యా అటవీం విద్ధి

గఛ్ఛ తాత యధా సుఖం

                                                సుమిత్రా దేవి

రాజ్యం రామునిదే, నాకీ రాజ్యం వద్దు, అన్నవాడు భరతుడు, ఇది నిజం కూడా, కాని ఈ నిజాన్ని నమ్మించడానికి భరతుడు పడ్డపాట్లు తెలుసుకోవలసినవే!    ''రామునిరాజ్యం-భరతుని పట్టం'' అన్నదానిని ''రామరాజ్యం-భరతుని పట్నం'' అని కూడా అంటుంటారు. నిజానికి, రాముని రాజుగా పట్టాభిషేకం చేసినది భరతుడే!!!

***

ఋషులు,మునులు, పౌరులు,జానపదుల అనుమతితో రామునికి యువరాజ పట్టాభిషేకానికి తలపెట్టేడు, దశరథుడు. సంగతి తెలిసిన కైక చాలా ఆనందించింది.  కాని మంథర, దశరథుడు కైకకిచ్చిన వరాలను గుర్తుచేసి, వాటిని కోరి, ''నీకుమారునికి పట్టాభిషేకం చేయించుకో'' అని బోధచేసింది. ఆ మాట తలకెక్కిన కైక 

 వరాలు కోరింది.  రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి, భరతునికి పట్టాభిషేకం చేయాలి. సీతారామ,లక్ష్మణలు నార చీరలుగట్టి అరణ్యవాసానికి వెళ్ళారు, దశరథుడు కైకకిచ్చిన వరాలు అమలు చేయడానికి. రాముని విడచి ఉండలేని దశరథుడు అసువులుబాసాడు. రామలక్ష్మణులు అడవులకు పోయారు, భరత శత్రుఘ్నులు, భరతుని మేనమామ ఇంట ఉన్నారు. దశరథునికి నలుగురు కొడుకులున్నా, చనిపోయేనాటికి ఒక్కరూ దగ్గరలేకపోవడంతో, అంత్యక్రియలు జరుపడానికి, తైలద్రోణిలో వేసి ఉంచారు. 


వశిష్టులు ఇలా కబురు పెట్టారు, భరత,శత్రుఘ్నులకు,"రాజకుమారులు అత్యవసరంగా అయోధ్యలో నెరవేర్చవలసిన కార్యం ఉన్నందున, సత్వరం రావలసింది". కబురందుకున్న భరతుడు మేనమామ,తాతగార్ల అనుమతితో అయోధ్యకు  బయలుదేరాడు.

అయోధ్య చేరిన భరతునికి పట్టణం వెలవెల బోతూ కనపడింది. తిన్నగా తల్లి దగ్గరకు చేరాడు. తండ్రి మరణవార్త తెలిసింది, దానితో సీతారామలక్ష్మణులు అడవులకెళ్ళేరు, వనవాసానికనీ తెలిసింది. పెద్దవార్త తల్లి చెప్పింది, దశరథుని తాను వరాలు కోరినట్టూ, వాటి అమలుకుగాను రాముడు పదునాలుగేళ్ళు వనవాసం వెళ్ళినట్టు, భరతుని  పట్టాభిషేకం చేసుకోమని చెప్పింది.  విన్న భరతుడు హతాశుడయ్యాడు. తల్లిని  తూలనాడాడు, చివరగా తానెప్పుడైనా నవ్వులాటకైనా రాజ్యపాలన చేయాలని అన్నానా!  అని కూడా అడిగాడు.   పట్టాభిషేకం చేసుకోమన్న మంత్రి, పురోహిత,పౌరులకు తామందరం రామునివద్దకు వెళుతున్నామనీ, రాముని వెనక్కు తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపిద్దామనీ చెప్పాడు.

****

అవగాహన:

తన ప్రమేయం లేకనే తనపట్ల నష్టం జరిగిపోయింది. విచలుతుడై తల్లిని తూలనాడినా, నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.

తండ్రి మరణం, నష్టం పూడ్చుకోలేనిది, తండ్రి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేయడం తప్ప.

తన రాజ్య పట్టాభిషేకం, తన ప్రమేయం లేకనే తల్లి నిర్ణయించడం.  తన ప్రమేయం ఆ నిర్ణయంలో లేకపోయినా, అపార్ధం చేసుకునేవాళ్ళు. పెదతల్లులు, అన్న,వదిన,తమ్ముడు, మిగిలినవారు, బంధుకోటి,ప్రజలు. మొదట నష్ట నివారణ చర్యగా మంత్రులకు రాముని దగ్గరకు వెళుతున్నాం, వెనక్కి తీసుకురావడానికి, సిద్ధం చేయమని చెప్పడం.తండ్రికి అంత్య క్రియలు చేయడం.


ఇంకా కలిగిన నష్టాలను భరతుడు ఎలా అధిగమించాడో తరవాత  చూదాం.

**** 

ఆలోచన.

నాటి కాలానికే పార్థివ శరీరాలని పాడవకుండా ఉంచే ప్రక్రియలున్నాయని తెలుస్తోంది.

భరతునికి కబురుపంపినది వశిష్ఠులు, ఇదేమి? గురువులు కబురుపంపండం అనే ఆలోచనే రాలేదెవరికి. అయోధ్యలో జరిగినదేమో భరతునికిగాని అతని మేనమామ,తాతగార్లకూ తెలియదు. కబురు పంపినవిధం విచారణీయం.


భరతుడు తల్లిదగ్గరకు రాగానే తెలిసినవి పిడుగులాటి వార్తలు.తండ్రి మరణం, అన్నదమ్ములు,

వదిన అడవులపాలవడం, రాజ్యభారం వహించమని తల్లి చెప్పడం (తన ఇష్టానికి వ్యతిరేకంగా)ఒక్కసారిగా సంయమనం కోల్పోయేలా చేసాయి భరతుని. ఇంతటికి కారణం తల్లి అని గుర్తించి, తల్లిని తూలనాడేడు. 


జరిగినదానికి విచారించిన భరతుడు కర్తవ్యాన్ని గుర్తించి, తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మంత్రులకు తాము రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నామని, బాటలు ఏర్పాటు చూడమని,సైన్యాన్ని సిద్ధం చేయమని, పట్టపుటేనుగును సిద్ధం చేయమని,తాను రాజ్యభారం వహించటం లేదని, రాముడే రాజ్యాధికారని చెప్పడం జరిగింది, మంత్రులు,పురోహితులు, పౌరజానపదులూ, పట్టాభిషేకం చేసుకోమని చెబుతున్నా.కొద్ది రోజులకితమే ఈ పౌరులే రాముని వెంబడించి అడవులకీ వస్తామన్నావారు. (Public memory short lived, అంటే ఇదేనేమో.)  

******

(విషయం పెద్దది. ఒక టపాలో రాయడం నా వల్ల కాలేదు. అందుకు భాగాలు చేయక తప్పలేదు, మన్నించాలి.  మొదలుపెట్టి చాలాకాలంగా పూర్తి చేయక వదలివేసినది. నేటికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈ భాగాన్ని పూర్తి చేయగలిగాను. మిగిలినది పూర్తి చేయాలని కోరిక, ఆపై అమ్మదయ.)

(విషయ సంగ్రహణ: వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం నుంచి. ప్రచురణ:గీతా ప్రెస్)


24, మార్చి 2023, శుక్రవారం

22, మార్చి 2023, బుధవారం

ఉగాది శుభకామనలు.

శ్రీ మాత్రేనమః



నమః శంభవే చ మయోభవే చ

నమః శంకరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ 

***

 తిట్టినవారికి,దీవించినవారికి;

 శత్రువులకు,మిత్రులకు;

అనామకులకు,అనామకంగా చరిస్తున్న నామకులకు

 పెద్దలకు,పెద్దమనసున్నవారికి;

అభిమానులకు,వీరాభిమానులకు  

ఎల్లరకు

 శోభకృతు 

నామ సంవత్సర 

ఉగాది శుభకామనలు.


అమ్మలకు వందనం,  ఉగాది శుభకామనలు.

పిన్నలకు దీవెనలు,  ఉగాది శుభకామనలు. 

శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి 

శతమేన మేన శతాత్మానంభవతి  శతమనంతం భవతి 

    శతమైశ్వర్యం భవతి  శతం దీర్ఘమాహుః మరుతయేనా వర్ధయంతి.

దీర్ఘాయుష్మాన్భవ  


అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతంగమయ.

ఓం శాంతి శాంతి శాంతిః

సర్వేజనాః సుఖినో భవన్తు.



శోభకృత్ శోభను కలగజేస్తుంది. ఈ రోజు మార్చి 22 ప్రత్యేకమైనరోజే!  రోజూ సూర్యుని ఉదయమే గమనిస్తే ఈ రోజు మార్చ్ 21/22 భూమద్యరేఖమీద ఉంటాడు. రాత్రి పగలు సమానంగా ఉండే రోజు. 


వేచి వీడియో పూర్తిగా చూడండి.   

*** 

15, మార్చి 2023, బుధవారం

కత వెనకకత

 కథ వెనకకత

తిక్కమొగుడుతో తీర్థమెళితే..... కథ రాయాలనుకున్నా! దీనికి పూర్వకథేం లేదు, అనుశ్రుతంగా చెప్పుకునీదిన్నీ. రాయడం మొదలెట్టా. ఎంతసేపు రాసినా తీర్థంలో తిప్పడం సరిపోయింది తప్ప, కత చదివించేలా అనిపించలా! మూడు నాలుగు రోజులు, నాలుగైదుసార్లు రాసి చెరిపేను, నచ్చక. చిరాకొచ్చి వదిలేసేను,మనసు మరల్చేను, బుఱ్ఱలో పురుగు తొలుస్తూనే ఉంది. ఒకరోజు ఉదయం నడుస్తుండగా ఒక మెరుపు ఆలోచనొచ్చింది. తీర్థంలో పిల్లలు తప్పిపోకుండేందుకు వారికి కనపడ్డానికి, పిల్లల్ని మెడలమీద ఎక్కించుకోవడం గుర్తొచ్చింది. ఆ! కొస దొరికిందని సంబరపడి కత మొదలెట్టి రాసా! పెద్దగా రాలేదు, అంత అందగించనూ లేదు. ఏం చెయ్యాలీ? ఆ రోజులనాటికి తిక్కపనులనిపించినవాటిని చొప్పించాలనుకున్నా! తాహతుకి మించి కర్చు, గూటి పడవ, మంది మార్బలం, ఇలా పెంచేను. ఇంతచేసేం కదా! మనకి తెలిసిన తీర్థం, పట్టిసీమను చొప్పిస్తే, శివరాత్రికి

 కత పూర్తిచేస్తే, అక్కడ జరిగే వేద సభను జొనిపిస్తే, అలా జరిగిపోయి, తీర్థంలో పెళ్ళాం అలసిపోతే భుజాలమీద ఎక్కింపజేసి,   గూటిపడవలో పడుకోబెట్టించి,

 కత పూర్తి చేసేను. కాని అసంపూర్తి అనిపించింది. ఈలోగా ఆ అసంపూర్తి కతని ఒక మందస్మితవదనారవిందసుందరి చదివి కత బాగుంది ఐపోయిందా? అడిగింది. నేననుకున్నట్టే అనుకుందే అనుకుని పూర్తి చెయ్యాలన్నా!


తీర్థంలో పెళ్ళాన్ని ఎత్తుకుంటే తీర్థంలో వాళ్ళు చూస్తారు, వీడెవడెవడురా! తిక్కమొగుడు అనుకుంటారు, అంతతో సరికదా! ఊళ్ళో వాళ్ళనుకుంటే కదా ఇదొకనానుడయ్యేది. అందుకు కతలో చిన్న మార్పు, కొండమీద జరిగిన, తీర్థంలో జరిగిన విషయాలు ఊళ్ళోకి, తీర్థానికొచ్చిన ఊరివాళ్ళు ఊరికి చేరేసినట్టు మార్చి, ఊళ్ళో మగా

ళ్ళూ ఆడాళ్ళూ చర్చ పెట్టి ఒక వృద్ధురాలి చేత జాయతో, పతి తీర్థం తిక్కపనిలా ఉన్నా జాయ మనసెరిగి, జాయ కోరిక తీర్చాడు అనిపించి, తిక్కమొగుడు కత పూర్తి చేసాను. ఇందుకు పదిహేనురోజులూ పట్టింది.


కతరాయడం తేలికైన విషయంకాదు. గర్భవతైన స్త్రీ కనడానికి పడినన్ని నొప్పులూ పడితేగాని కత బయటికిరాదు. ఒకటిన్నర నిమిషం చదివించే కతలో ఎన్ని చూసుకోవాలి? కత నడక చూడాలి, అక్షరాల వెంట కళ్ళు పరుగుపెట్టేలా చెప్పాలి,భాష చూడాలి, అప్పుడే ఐపోయిందా? అనిపించాలి.మనుషుల మనస్తత్వం చూడాలి, కత ముగింపు బాగోవాలి, చెప్పగల్గితే ఒక కొత్త విషయం చెప్పాలి. ఇంత బాధాపడాల్సిందే. ఎందుకింత బాధపడి కతరాయాలి? స్త్రీ చావు అంచులదాకా వెళ్ళి కూడా బిడ్డను కనాలని ఎందుకనుకుంటుంది? ఇదీ అంతే!అంతే సుమా!  

ఇక తల్లి తనకిపుట్టిన బిడ్డలందరిని ప్రేమిస్తుంది, అలాగే రాసిన ప్రతి కతా అందంగానే కనపడుతుంది, నాకుమాత్రం.  కత బతికి బట్టకడుతుందా? అది కాలమే చెప్పాలి, కాలానికి వదిలేయక తప్పదు.

తిక్కమొగుడితో తీర్థమెళితే... 

https://kasthephali.blogspot.com/2023/02/blog-post_17.html

13, మార్చి 2023, సోమవారం

నా దరిద్రమే పోయింది.

  నా  దరిద్రమే పోయింది.


ట్రేక్ మీద సాయంత్రం నడుస్తున్నా! ట్రేక్ మీద ఒకపక్క చివరగా ఇసక ఉంటుంది. చెప్పులు లేకుండా ఆ ఇసకలో నడిచే అలవాటు చాలామందికుంటుంది. నాకూ ఆ అలవాటు. ఒక పక్క పచ్చికుంటుంది. ఎండలు ముదురుతున్నాయిగా, పచ్చిక ఎండిపోయింది. పచ్చికపై చెప్పులు లేకుండా నడవడమూ మంచిదే! మంచి నిద్ర పడుతుంది. టెన్షన్ తగ్గుతుంది.   BP  తగ్గుతుంది

 చెప్పులు ట్రేక్ దగ్గర వదిలేస్తే కుక్కలు పాడుజేస్తున్నాయి, అందుకు అరుగు దగ్గర వదిలేసి నడకకి వెళ్ళడం అలవాటు. కొంచం దూరంలో ఉన్నా, నడక పూర్తి చేసుకుని. చూస్తుండగానే ఎవరో, తెలిసిన వ్యక్తే తనజోళ్ళు అక్కడ వదిలేసి నా జోళ్ళు తొడుక్కుపోతున్నాడు. పొరపాటు కాదని తెలుస్తూనే ఉంది. ఒక్క నిమిషం, కొత్త చెప్పులు, పదిరోజులకితం కొన్నవి, తొడుక్కుపోతున్నాడని బాధ కలిగింది, కేకేద్దామనుకుని ఆగిపోయా!.  చెప్పులు తొడుక్కుని పట్టుకుపోతున్నందుకు సంతోషించా! 


అదేంటి కొత్త చెప్పులుపోతే సంతోషమా అనకండి. నిజం! ఎందుకంటే శని పాదాలలో ఉంటాడు, అందునా వాడుతున్న చెప్పుల్నీ అనుసరించి ఉంటాడు. ఈ రోజుతో నా శనిపోయింది, దరిద్రమూ పోయింది, అందుకే సంతోషం.


    షోలాపూర్ చెప్పులు రెండు పోయాయీ, మెత్తగ హత్తుకుపోయేవీ!!!

 రేపు కొత్తవి కొనుక్కుంటా. ఇంటికొచ్చేటప్పుడు కొంచం ఇబ్బందిపడ్డా,చెప్పులు లేక రోడ్డు పై నడకకి.  కాళ్ళకి వేసుకునే చెప్పులు గుడి దగ్గర, ఇతరచోట్ల కావాలని తొడుక్కుపోయే జనాలు ఉంటారు. బాధ పడద్దు, శనిపోయినందుకు సంతోషించండి. ఈ వేళ శని నా కాళ్ళలో ఉన్నాడంటారు, తిరుగుడు ఎక్కువైన రోజు, ఇది నిజం, శరీరం కింది భాగంలో కాళ్ళలో అందునా పాదాలు శనిస్థానం. 


పెద్దవాళ్ళు కాలం చేసిన తరవాత తొమ్మిదో రోజు వారు వాడుకునే కఱ్ఱ,చెప్పులు, మంచం, పరుపు, బట్టలు ఇచ్చేస్తారు. ఇతరులు అవి తీసుకోడమూ తప్పుగా భావించరు.  పాత కాలంలో కుటుంబం అంటే కొడుకులు,కోడళ్ళు; కూతుల్లు,అల్లుళ్ళు; మనవలు,మనవరాళ్ళు; కొండొకచో మునిమనవలు,మనవరాళ్ళు కూడా ఉండేవారు. పెద్దవాళ్ళతో వీరిలో కొందరికి చెప్పలేని అనుబంధం ఉండేది. తాతగారి జోళ్ళు,కఱ్ఱ రోజూ కనపడుతూ, తాతగారు లేకుంటే నిత్యమూ మనసుకి కోత, దానినుంచి తప్పించుకోడానికే వీటిని ఇచ్చేసేవారు.


 స్త్రీలైతే, పోయినవారు కట్టుకున్న చీరలని, కుటుంబంలోని  తీసుకునేవారు. దీనికో కారణమూ ఉంది, చనిపోయినవారితో ఆ కుటుంబంలోని ఆడపడచులకు,కోడళ్ళకు ఉన్న అనుబంధాన్ని తెలిపేదే ఇది. అంతేకాదు, ఆ పెద్దవారిని దగ్గరగా ఉంచుకున్న అనుభూతి కూడా. మీరు నవ్వచ్చు, కాని ది నిజం. మనం కట్టి వదిలేసిన బట్టలకి మన ఫెరుమోన్స్ అంటి ఉంటాయి, అవి ఎన్ని సార్లు ఉతికినాపోవు. అందుకే ఆ అనుభూతి.ఇంకా మా అత్తగారిచ్చిన నగ, మా అమ్మ ఇచ్చిన గాజులు,  మా మామ్మ ఇచ్చిన గొలుసు, మా అమ్మమ్మ ముక్కుపుడక,  అనుభూతి పెంచేవే! ఇది చెప్పుకోడం స్త్రీ లకి ఇష్టమే, నేటికిన్నీ!

 

వాడుతున్న చెప్పులుపోతే సంతోషమే సంతోషం, ఎందుకంటే మన శనిని స్వంతం చేసుకుంటున్న అభాగ్యుడు.  


11, మార్చి 2023, శనివారం

వయసై పోయింది కదూ!

 వయసై పోయింది కదూ!


నిన్న సాయంత్రం నడకనుంచి తిరిగొస్తుంటే ”వారంగా కనపట్టం లేదూ!”  అడిగిందో ఎత్తుపళ్ళ సుందరి. ''నువు కనపట్టంలేదని ఎవరినడిగానబ్బా!'' అనుకుంది స్వగతంలో.

''ఎండ పెరిగినట్టుంటే నడక టైమ్ మార్చాను. అందుకు కనపడ్డం లేదనుకుంటా!'' అన్నా.'' వయసైపోయిందికదూ! ఎండవేళ జాగర్త'' అని వెళ్ళిపోయింది,లోనికి.


పదిరోజుల కితం నడకైపోయాకా కూచున్నా, సాయంత్రపు వేళ, స్కూల్ అరుగుమీద.ఇద్దరు ముఫైలోపు కుర్రాళ్ళొచ్చారు. అందులో ఒకడు, సమయం,సందర్భం లేక మీ వయసెంత? అడిగాడు. ఎనిమిదపదులు దాటిందని చెప్పేను. ఏదో అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతలో వెనకనుంచి చీపురు చేత్తో పుచ్చుకునొచ్చిందో లోలాక్షి.  నీ పనికి అడ్డా? అన్నట్టు చూసా! కాదని చెయ్యితిప్పుతూ!   ''బాబూ! ఇంత వయసున్నోనివి, పెద్దోనివి, వయసునిజం చెప్పకూడదు, తెలీదా?'' అనేసి, ''ఆ సన్నాసోళ్ళు ఏం కూసారో తెలుసా? ఇసుమంటి వయసైపోయిన  ముసలోల్లే దేసానికి బరువు అనుకుంటాపోయారు, నీకినిపించి ఉండదు.నీకేం కూడెట్టేరా?గుడ్డెట్టేరా ఎదవలు,నీ బరువేం మోసుకున్నారు, సన్నాసి ఎదవలు'' అని తిట్టిపోసింది.

అప్పుడుగుర్తొచ్చింది 

”ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్ర మౌషధ...”

వయసు,ఇంటిపోరు,మంత్రం,ఔషధం, ఇలా తొమ్మిదీ గుట్టుగా ఉండాలని చెప్పెరు కదా పెద్దలూ, అని

 పరమేశ్వరా! ఏమిది? అనిపించిందో క్షణం.ఈ తల్లికి నా పట్ల కలిగిన కరుణకు కారణం, ఆ కుర్రాళ్ళకి నా పట్ల కలిగిన  అకారణ ద్వేషానికి  కారణమేమి ప్రభూ! అని యోచించా!! తెలియలేదు, అదేకదా మాయ. 


.''తాతా! కుంటుతున్నావేం? ట్రేక్ మీద నడుస్తూ'' అడిగిందో చిలిపికళ్ళ సీతమాలచ్చి.''ఇంటి దగ్గర మెట్టు తగిలి వేలు చితికిందన్నా!'' ''చిన్నపిల్లాడివా? చూసుకునడవాలి, వయసైపోలేదూ!'' అనేసింది


నిన్న సాయంత్రం ట్రేక్ మీద నడుస్తున్నా! ముందు ఇద్దరమ్మాయిలు నడుస్తున్నారు. దుమ్ము రేగుతోందేమని పరిశిలించా. ఒకమ్మాయి స్కర్ట్ వేసుకుంది.రెండో అమ్మాయి పరికిణీ వేసుకుంది. ఆ పరికిణీ నేలమీద బెత్తెడు పైగా ఉంది. ముందుకెళిపోయి  వెనక్కితిరిగా! ''అమ్మలూ పరికిణీ నేలని తుడుస్తోంది చూసావా! కొంచం పొట్టిగా కట్టుకోవచ్చు, లేదా పొడుగు తగ్గించుకోవచ్చుగా!'' అనేసి,గబుక్కున నాలిక కరుచుకుని ''నీకెందుకు వయసైపోయిన ముసలోడా'' అని తిడుతుందేమోనని భయమేసి, ''చెప్పేసేనమ్మా! పొరబాటే సుమా!! ఏమనుకోకూ'' అనేస్తే నవ్వు నవ్వేసింది. ముందుకెళిపోయా. వయసైపోతే ఇలా అనవసరంగా కలగజేసుకుని వాగడం అలవాటైపోతుందేమో సుమా!!


ఏ రోగానికైనా వైద్యుడు వైద్యం చేయగలడుగాని, ఆయుస్సు పోయలేడు, అంతేకాదు ఇమ్యూనిటీ బజారులో దొరకదు. మందులికి రోగం తగ్గటం లేదంటే వయసైపోయిందిగా! ఇమ్యూనిటీ ఉండదంటారు.


తల్లీ! కనపడ్డవాళ్ళంతా వయసైపోయింది, వయసైపోయింది అంటున్నారు, అంటే నీ అవసరం ఇక ఇక్కడలేదు నిష్క్రమించచ్చు అని చెప్పినట్టే అనిపిస్తోంది. ”జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని”వైన నీకనిపించలేదా!  ఈ ఉపాధికి (శరీరానికి)  విశ్రాంతి ఇవ్వాలని తల్లీ!, ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, కాని అదే ఎప్పుడూ అని కదా! అంతేకాదు ఈ శరీరం ఇక బాధలు తట్టుకునేలా లేదు తల్లీ! త్వరగా దీనినుంచి విడుదలకావాలి.  

  


5, మార్చి 2023, ఆదివారం

నడిరేయి ఏ జాములో

 నడిరేయి ఏ జాములో


సామీ!   

నడిరాత్రేల ఎలబారకపోతే, అమ్మనే సందలడే కాడికి కొండమీనకి  బయలెల్లమనచ్చుగా!

తప్పైపోనాది సావీ! అమ్మకేటి ఎడం?  

 ”ఆబ్రహ్మకీట జనని”, నాలాటోల్లెంతమంది కతకనేదో సూడాలిగందా!


తవరేటి బావులూ సందలడ్డంతో బయలెల్లచ్చుగా! అమ్మకాడికి?

ఇదీ ఒల్లకోనిదేనా  సావీ! తమకేటి, ఎన్ని రాసకారేలో!! ఇదేటి కుటుమానం సావీ! అమ్మో కాడ!, అయ్యో కాడా! ఏటో పిచ్చోణ్ణి తవరిగారి కుటుమానంలో నా ఊసేటి సెప్పుమీ!!


అద్సరేగాని సావీ! రాత్రేల పారెలతంటే పురుగో, పుట్రో; పులో మెకవో, ఆటికేటి తెలుస్తది సావీ! తమరెవురో!

ఏటో సావీ! బుఱ్ఱతక్కువోడిని ఊసాడ్డం తెలీనోన్ని, అనేసినాను.

ఓలమ్మ! ఓలమ్మ!!,  ఏటాసిరునవ్వు, ఆ యమ్మ యశోదమ్మ కాడ నవ్వినావంటగందా, నోరు చూయించినావంట! అల్లది నాకు చూయించుమీ!!!


సరేగాని బావులూ సందెపొద్దులూ నిలువు జీతమే! కాల్లు నొవ్వవేటి? నాలాటోనికి కూసేపు కాల్లు నొక్కనీకి ఒల్లకోరాదా?

అది నీవల్లకాదంటావా! అది బ్రహ్మ కడిగినపాదమంటావా! చాలామంది మహామహులకే సాధ్యం కాలేదంతావా! నాకేటి ఎరిక సావీ, నాలాటోడివేననుకుంతా!


సావీ! ఏడేడనించో ఎలబారి పారొస్తాం! సూడాలి, సూడాలనుకుంతాం! సూదామనుకునీ తలికి కల్లేటి మూతలడిపోతాయో సావీ!ఎరికవదు.  కల్లిప్పి నిన్ను సూచీ తలికి,ఇక సూడు, నడు, నడు, అని తరుముతారు సావీ!

అదిచాలురా! అంతకుమించి చూడలేవు, నీవల్లకాదు. నిన్నిక్కడే కూచో ఒకరోజంతా అంటే, కూచోలేవు. నీమనసు, ఇల్లూ వాకిలీ;పెళ్ళామూ,పిల్లలూ; పొలమూ,పుట్రా; గొడ్డు,గోదా అని అక్కడ తిరుగుతుంది. నేనిక్కడే కాదు, అక్కడా ఉన్నాను, ఎక్కడా ఉన్నాను, అంతెందుకు నీ మనసులో ఉన్నా! తొంగిచూడు.  నువ్వెక్కడున్నా, నీ మనసు నా దగ్గరుంటే చాలంతావా సావీ. ఇద్దెలుసుకో లేకపోనా చామీ!


బావూ! నీ కుటుమానంలో ఇసయం, మన్లోమాట, లగ్గానికిజేసిన అప్పేపాటున్నదేటింకా! కుంచాల కుంచాలు, రాసులకొద్దీ సొమ్ములు కొలిసిచ్చి, సోలిపోయిగందా! కుంచం తలకాడెట్టుకు తొంగుండి పోనాడా సావి! ఎప్పటికి తీరుద్ది బావూ అప్పూ! ఏటి వడ్డీ తీరడం లేదంతావా! నెక్కా? డొక్కా తిన్నగున్నట్టు  లేదు సావీ, ఆ సావి అలుకొచ్చి తొంగుండిపోనాడు, మజ్జగాలోల్లు, ఎంత సొమ్ము నొక్కీసినారో ఎరుకేనేదు బావూ!

ఆల్లేతి క్షేత్రపాపు లంతావా!

ఎంత పాపిష్టోల్లన్నా! ఇంత సేటా సావీ, ఓపాలిటూ సూడుమీ 

బావులూ అమ్మతో ఓపాలి అప్పూసనరాదా?

బావూ! లగ్గానికి అమ్మ కట్నమేటి తెచ్చినాది? 

అమ్మే నచ్చిందేవి మరి కట్నమేటంతావా?


అమ్మ! తల్లితల్లి, ఊసాడ్డం తెలీనోన్ని ఏటేటో ఓగీసినాను దొరకాడ! అమ్మవుగందా !దొరసానీ! నాకేటొద్దు దొరకాలు నొక్కుతూ పొద్దుపోవాలని ఊసు తల్లీ! దొరకి చెప్పుమీ!!! 


"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందీ" నీవున్న అనుభూతి,అనుభవం  కొనసాగితే చాలు, నా జీవితానికి మరేం వద్దు తల్లీ!


2, మార్చి 2023, గురువారం

గతం గతః

 గతం గతః

పరమాత్మా! 

ఇన్నేళ్ళ జీవితంలో కష్టాలూ పడ్డాను, సుఖాలూ అనుభవించాను. తట్టుకోలేనంత కష్టం వచ్చినపుడు కుంగిపోయాను, పడిపోయాను, జీవితం ఐపోయిందనుకున్నా! కాని నీ లీల తెలియనిదే సుమా! కాలం దాటరానిదిన్నీ! "బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్...." నీవే నా బలం సుమా!


కష్టాలొచ్చినప్పుడు ఏడ్చాను, ఇప్పుడూ వాటిని తలుచుకుని ఏడ్చి ఉపయోగం లేదు. ఏడిస్తే పోయినవాళ్ళు లేచొస్తారా? చంటిపాప నవ్వులో, మొక్కను పూసిన పువ్వులో, మంచిమనిషి హృదయంలో నువ్వున్నావని నమ్ముతున్నా. 


ఇరవై ఏళ్ళపుడున్న ఆరోగ్యం ఇప్పుడుంటుందా? ఉండదని తెలుసు. చివరిదాకా కాలూ,చెయ్యీ ఆడే, కదుపుకునే ఆరోగ్యం ప్రసాదించు, చాలు.  ఇప్పటిదాకా నాకు కావల్సినదానికంటే ఎక్కువే ఇచ్చావని నమ్ముతున్నా!


 నీ మీద భక్తి ఉన్నదని చెప్పుకోను, ఈ వయసులో పూజలు,వ్రతాలూ చెయ్యలేను,  నువ్వున్నావని

 నమ్ముతాను. 


నీ పాదకమల సేవయు, నీ పదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూతదయయును, తాపసమందార! నాకు దయ సేయగదే!


నిన్నెప్పుడూ మరువని స్థితి ప్రసాదించు చాలు. చింతాకంతయు భక్తి నిల్వదుగదా శ్రీకాళహస్తీశ్వరా!


27, ఫిబ్రవరి 2023, సోమవారం

దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ

 


వీడియో చూసారా! నాకనిపించినది.

కన్య వరుని మెడలో మాల వేసింది.హుందాగా స్వీకరించాడు. వరుడు మాల వేసేలోగా ఏదో ఇబ్బంది, అందుకు కన్య వరుణ్ణి సున్నితంగా హెచ్చరించింది, కర్తవ్యాన్ని, చేతిని సున్నితంగా తాకడం ద్వారా. చిక్కును విడతీయడానికి సాయపడింది. ఆనందంగా వంగి మాల స్వీకరించింది, వంగాలసిన అవసరం లేకున్నా! ఆపై కన్య వరుని కాళ్ళకి నమస్కారం చేసింది. వరుడూ కన్య కాళ్ళకి నమస్కారం చేసాడు, పైనుంచి మరోమాట వినిపిస్తున్నా! ఆ తరవాత కన్య మొహంలో గొప్ప అనుభూతి,భావోద్వేగం కనపడ్డాయి. పక్కవారెవరూ లేకుంటే ఒక్కసారిగా భర్తను వాటేసుకునేదేనేమో అనిపించింది. వీరి జీవితం మూడు పూవులు ఆరుకాయలే!


నాకనిపించింది, ఇద్దరి మధ్య ఒద్దిక ఉంటే రానేరావు పొరపాట్లు, చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు, సినీకవి మాట నిజం,నిజం, నిజం. అంతేకాదు వరుడు నిజంగా తిక్కమొగుడే! భార్య అంటే అంత ప్రేమ, అభిమానం, ఆమెకోసం ఏం చెయ్యమన్నా చేసేస్తాడు, అంతే.


దీవిద్దాం

దీర్ఘాయుష్మాన్భవ.

దీర్ఘ సుమంగళీభవ.


23, ఫిబ్రవరి 2023, గురువారం

రానివారిని పిలవ వేడుక

 రానివారిని పిలవ వేడుక బోడితల అంట వేడుక


రావాలి!రావాలి! అంటూ ఉంటారు ఉయ్యాలలో పిల్లల దగ్గరకెళ్ళి, నిజమే కాబోలనుకుని ఆ పిల్లలు చేతులందిస్తారు,స్వయంగా లేవలేరు గనక. కాని ఇలా అన్నవారు వారిని ఎత్తుకున్న పాపానపోరు. పాపం చీర నలిగిపోదుటండీ :) ఇలా పిలవడం ఒక వేడుక.


రావాలి!రావాలి!! రమ్మంటె రావాలి

రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి!!

రాణిగారు తేవాలి!!


ఆగాలి! ఆగాలి!! ఆగమంటె ఆగాలీ!

ఆలుమగలమయ్యేదాకా 

అయ్యగారు ఆగాలి! అయ్యగారు ఆగాలి!!


ఆవిడ బ్రేకులేసినా వినేలా లేరు జనం.ఇదెప్పటీదో యుగళ భావగీతం. అప్పటికి ఇప్పటికి మార్పులేనిది ఇదొకటేనేమో!! ఇది మాత్రం పిలవ వేడుక కాదేమో?


మీరు మావూరొస్తే మా ఇంటికి తప్పక రావాలి! అటులటులటులనే సమాధానం, తప్పక వస్తానండీ వాగ్దానం. ఈయన కదిలేదే లేదు,  కాదు కదలలేడు.. ఈ పిలుపొక వేడుక, అంతే అదంతే!!!!


ఎన్నాళ్ళని నాకన్నులు కాయగ ఎదురుచూతురా గోపాలా!

ఎంత పిలచినా ఎంతవేడినా ఈ నాటికి దయ రాదేలా?

గోపాలా నంద గోపాలా!

ఆర్తి పిలుపే, శాంత కుమారి గొంతులో తల్లి వేదన, ఏదీ వచ్చాడా? వేడుకే అయిపోయిందా పిలుపు.

రారా కృష్ణయ్యా!రారా కృష్ణయ్యా!! అబ్బో ఈ పిలుపు ఎంతకాలం నుంచి ఉన్నదో! ఆయన విన్నాడా? అసలున్నాడా? అన్నదే నేటి కొచ్చను. ఇలా అనుమానంతో అవసరమొచ్చినపుడు పిలిస్తే ఆయనొస్తాడా? నువ్వేం గజేంద్రుడివా? నీ పిలుపులో ఆర్తి లేదు, అదక్కడికి చేరలేదు, అంతే. చేరదు కూడా! మరెందుకు పిలవడం ? పిలిచామండీ ఆయనే రాలేదు అని, మళ్ళీ నెపం ఆయన మీదకే తోసెయ్యడానికే! ఒక వేళాయన పొరబాటుగా వచ్చినా, ఏంటీ? నువ్వు కృష్ణుడివా? నన్ను నమ్మమన్నావా? ఇదీ ప్రశ్న :) అందుచేత ఆయనెందుకొస్తాడు? రాడు! రాడుగాక రాడు!!! ఈ పిలుపొక వేడుక కదా!!!!!!!!!


వీరెవరూ పిలిచినా రారు,అందుకే పిలవ వేడుక.  నిజంగా వస్తే భరించలేరు, ఎందుకో తెలుసా? వీరంతా సేవలు చేయించుకునేవారే! ఎవరికంత తీరిక ?


ఇక బోడితల గురించి చెప్పేదేలేదు. నేటి రోజుల్లో నూటికి తొంభై మంది ఖర్వాటులే. ఎందుకనీ? అందరూ మేధావులేగా! అందుకనీ.అందరూ కూర్చున్న దగ్గరనుంచి లేచిన పాపాన పోరు. మేధావులందరీ బట్టతలుంటుంది(ష). వీరికి ఒంటికి నూని రాసుకుని నలుగు పెట్టుకుని తలంటుకునే భాగ్యం ఉన్నట్టా? ఇటువంటి ఖర్వాట మేధావిని కట్టుకున్న ఇల్లాలు ఇవేళ భోగి తలంటుకోవాలి లేవండి తలంటుతానని లేపిందిట, ఉదయమే!.   పాపం ఈ మేధావి పెళ్ళాం మాట జవ దాటలేనివాడు. బాత్ రూం లోకి అన్నట్టు దీన్ని వాష్ రూం అనాలష, బరబరా లాక్కుపోయి నెత్తిన నాలుగు చెంబుల నీళ్ళు పోసి తలంటేసేనందిట. కుంకుడుకాయ,షీకాయ, షాంపూల బెడదలేదు, తల ఆవి  చేతుల్లో తబలా వాయిద్యం కాదు. బోడితల అంట వేడుకకాదా? కొచ్చను.


19, ఫిబ్రవరి 2023, ఆదివారం

తిక్కమొగుడితో తీర్థమెళితే...

 


నందిపై ఈశ్వరుడు (కర్నాటక)


నమఃశంభవే చ మయోభవే చ 
నమఃశ్శంకరాయ చ మయస్కరాయ చ 
నమఃశ్శివాయ చ శివతరాయ చ


తిక్కమొగుడితో తీర్థమెళితే... 


తిక్కమొగుడితో తీర్థమెళితే తిప్పి/తిప్పి తిప్పి చంపేడంటారు.చాలా రకాల మొగుళ్ళ గురించి అనుకున్నాం. ఈ గొలుసులో  చివరగా  తిక్కమొగుడు...


తిక్కమొగుడెవరు? అదీ కొచ్చను..తనకి, తనపెళ్ళానికి బాగున్నది, మంచిది అనుకున్నదేదైనా, తన పెళ్ళానికి నచ్చినదేదైనా చేసేస్తాడు, ఎవరేమనుకున్నా, అన్నా లెక్కచేయడు, అదీ తిక్క. తిక్క దానికోలెక్కా అని ఆధునికులనుకునేదానికి మొదలిక్కడుంది.పెళ్ళామంటే లెక్కలేనంత ప్రేమ. ఒక  కత చెప్పుకుందాం.


అదో పల్లె, కొత్తగా పెళ్ళైన జంట.అప్పుడప్పుడే కొత్త వీడుతున్న కాలం, ఇద్దరూ మంచి ముమ్మరంమీదున్న కాలం. ఇద్దరూ చిలకా గోరింకల్లా కాలం గడుపుతున్న కాలం.ఒకరొనొకరు వదలి ఉండలేనికాలం. ఒక రోజు రాత్రి, మొగుడు గుండెలపై తలపెట్టుకుని పడుకున్న సమయంలో, జాయ నెమ్మదిగా అడిగిందిలా! ”శివరాత్రి వస్తోంది, ఉపవాసం ,  రుద్రాభిషేకం ,  పట్టిసీమ వీరభద్రస్వామి, భద్రకాళీ దేవిల మహోత్సవం, జాగరం, తీర్థం చూసొద్దామా?”  ”నువ్వేమో ఏడు మల్లెపూలెత్తు, మా అమ్మాయి కష్టపడలేదు సుమా! అని మీ నాన్న మరీ మరీ చెప్పేడు, నిన్ను అంపకాలెడుతూ!” "తీర్ధమంటే ఇసకతిప్పలో నడవాలి,ఉపవాసంతో, దగ్గరేం కాదు, కొండెక్కాలి, దిగాలి.ఏమో ఎన్నిసార్లో! నడవగలవా! నడక తప్ప మరో దారిలేదు" అన్నాడు. "ఆ( నడిచేస్తా" అంది ధీమాగా! సరే ఐతే ఏర్పాట్లు చేస్తాగాని, ”బండి కట్టనా? పడవమీదెళ్దామా?” అడిగాడు. ”నీటి మీద ప్రయాణం బాగుంటుంది కదూ” అనేసింది.

మర్నాడే గూటిపడవ పురమాయించేసేడు,  గూటిపడవలో కావలసినవన్నీ సద్దించేసేడు,అభిషేకానికి కావలసిన కొబ్బరికాయలు వగైరాసామాన్లు, అమ్మవారికిచ్చే బట్టలు,  విశ్రాంతికి పరుపుతో సహా!  వీరభద్రస్వామికి అభిషేకానికి పురోహితులకీ చెప్పేసేడు. పాలికాపుకి పురమాయించవలసినవి చెప్పేసి, తను పెళ్ళాంతో బయలుదేరేడు శివరాత్రి ఉదయమే!   

కను చీకటి   వేళ పురోహితులతో బయలుదేరి గోదారి రేవుచేరి పురోహితుల సంకల్ప మంత్రోచ్చారణతో సరిగంగ స్నానాలు చేసి, పురోహితులతో సహా,గూటి పడవెక్కేసేరు, మంది మార్బలంతో. చిరుచలిగాలిలో పడవ బయలుదేరిoది. పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి దూరంగా  ఇసకతిప్పదగ్గర దిగేరు ,సూర్యోదయమవుతుండగా! 


తీర్థంలో జనం పల్చగా ఉన్నారు. చెంగున దూకింది ఇసకతిప్పలోకి, జాయ. పతి అనుసరించాడు. హుషారుగా రెండు మైళ్ళ ఇసకతిప్ప నడచి కొండెక్కేసేరు.జనం,      ఒకటే జనం, స్వామి దర్శనానికి. పురోహితులు  మహన్యాసపూర్వక

 రుద్రాభిషేకం దంపతులతో చేయించేటప్పటికి పదకొండయింది.  భద్రకాళిని దర్శించి లలితాసహస్రంతో పురోహితులు పూజచేయిస్తే, అమ్మకి నూతనవస్త్రాలు సమర్పించి, పరివార దేవతలను,   క్షేత్రపాలకుడు రాములవారిని దర్శించేటప్పటికి ఒంటిగంట దాటింది. ఉపవాసమే కనక ఇబ్బంది లేదు, కాని ఫలహారానికి పళ్ళు తెస్తానని బయలుదేరాడు, పతి. నేనూ వస్తానంది, జాయ. ఇద్దరూ బయలుదేరారు తీర్థంలోకి, పళ్ళకోసం.  బుట్టలతో కమలాలు, ఆపిలు, ద్రాక్ష,ఖర్జూరం, ఇలా కనపడ్డ పళ్ళు కొనేసేడు.కొన్ని తను, కొన్ని మార్బలం తెస్తుంటే, నేనూ అని ఒక బుట్ట పట్టుకుంది జాయ. నేనూ తెస్తా కొన్ని అంది, వద్దనివారించాడు, వినక ఒక చిన్నబుట్ట చేతబట్టింది, కొండెక్కేరు.  ఫలహారానికి, పళ్ళు పురోహితులకు, తనపరివారానికి,  అక్కడ ఉపవాసం ఉన్నవారికి,జాయ చేత ఇప్పించాడు. చివరగా తామిద్దరూ కొన్ని తీసుకున్నారు.సమయం గడచిపోయింది, తెలియకనే!


గోధూళి సేవాదర్శనం చేసుకుని, కొండదిగి తీర్థంలోకొచ్చారు.

 రాత్రి, కరంటు దీపాలతో తీర్థం కళకళలాడుతోంది.  తీర్థం అంటే చిన్నదా?  దగ్గరగా ఇరవై చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది, ఇసకతిప్పలో. ఒకసారి తిప్పేడు, జాయ తీర్థంలో కొనుక్కోవలసినవి కొనుక్కుంది, వాటిని సేవకులు పడవలోకి చేర్చేరు.  మళ్ళీ రెండవసారి తీర్థంలో కి  వింతలు విశేషాలు చూస్తూ బయలుదేరారు. కొంత దూరం తరవాత జాయ నడక మందగించింది, ఉదయం నుంచి ఉపవాసం, ఇసక తిప్పలో నడక, కొండ ఎక్కి దిగడంతో.  ఏం? అడిగాడు పతి. కాళ్ళు లాగుతున్నాయంది జాయ. 

  ఒకపక్కగా కూచోబెట్టేడు కాసేపు,కాని ఉపయోగం ఉన్నట్టనిపించలా జాయకి, నడచేలా లేదు. ఏం చేయాలో తోచలేదు కొంతసేపు. ఇప్పుడు పతి, హనుమంతునిలా ఒక కాలు మడచి కూచుని జాయను భుజం మీద ఎక్కమన్నాడు.  జాయ ''అదేంపనీ? వద్దు వద్ద''ని సిగ్గుపడింది. పతి బలవంతం చేసి జాయను భుజం మీద ఎక్కించుకుని తీర్థంలో తిప్పేడు. చూసిన జనం గుసగుసలు పోయినవాళ్ళు, అదేం పని అడిగినవాళ్ళు, ఎంత పెళ్ళామంటే ప్రేమన్నా! ఇంతా? అని బుగ్గలు నొక్కుకున్నవాళ్ళు, అదీ మొగుడంటే!,  పెళ్ళాం కాళ్ళులాగితే భుజమెక్కించుకుని తీర్థం తిప్పేడు, అంటూ. ఇదొక వింతయిపోయిందారోజు తీర్థంలో జనానికి.


తొమ్మిది ప్రాంతంలో కొండపైకి చేరేరు, అక్కడ దించాడు జాయని, కిందకి.ఇప్పుడు వేద సభ ఉంటుంది చూద్దామని జాయని తీసుకుపోయి వేద సభలో, వేద పండితుల, వేద పఠనం విని, విశ్రాంతి సమయంలో జాయ చేత తాము తెచ్చినపళ్ళు దక్షిణ తాంబూలాలతో, తమతో వచ్చిన పురోహితులను,

 వేదపండితులను సత్కరింప చేసేడు. జాయ,పతి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. పన్నెండైంది, ఇప్పుడు లింగోద్భవకాల దర్శనం చేదామని జాయతో కలిసి దర్శనం  చేసారు.

 స్వామి ఊరేగింపు ఉత్సవం బయలుదేరింది తీర్థంలోకి. స్వామితో ఊరేగింపుతో బయలుదేరారు. నడక జాయకి కష్టం, దానికితోడు, జనంలో జాయకి ఏమీ కనపడకపోతుండటంతో మళ్ళీ భుజానికెత్తుకున్నాడు. ఉత్సవం తిప్పాడు, తీర్థంలో తిప్పాడు. ఉదయంనుంచి ఉపవాసం, నడక, శ్రమతో అలసిపోయిన జాయ ఇక భుజంమీద కూడా కూచోలేనంటే పడవలోకి చేర్చి, పరుపుపై పవళింపుసేవ చేసాడు.

పడవ బయలుదేరింది. మళ్ళీ సూర్యోదయానికి రేవులో దిగేరు. సరిగంగ స్నానాలు చేసి, ఇంటికి చేరేరు.ఇంతతో కత ఐపోతే నానుడే లేదు, అసలు కత ఇప్పుడే మొదలయిందా పల్లెలో.


రెండు రోజులు, బడలికతో ఇద్దరూ బయట కాలుపెట్టలేదు. తీర్థంలో జరిగినది, గుడిలో జరిగినది,వైనవైనాలుగా, అంచె టపాలమీద వార్తలు ఆ పల్లెకు జేరిపోయాయి. ఇప్పుడందరిదీ అదే విషయం మీద చర్చ.


మూడో రోజు రచ్చబండ దగ్గర ఒక పెద్దాయన పతిని చూసి పెళ్ళాన్ని తీసుకుని తీర్థమెళ్ళొచ్చావట కదూ? బాగా ఖర్చు పెట్టేవట! అని చర్చకి పునాది వేసేడు.

కలిగినవాడూ!, ఖర్చుపెట్టకపోతే ఎలా బాబాయ్! అన్నాడొక బక్కప్రాణి.

పెళ్ళాం ముద్దు చెల్లించేడు లెద్దూ! అనేసేడు మరో నీరసప్రాణి. 

అబ్బాయ్! పెళ్ళాం మీద ఎంత మోజున్నా,  ముద్దున్నా ఇలా తీర్థంలో ఊరేగింపు చెయ్యడం...... అని అర్ధోక్తిలో ఆగేడో నడివయసువాడు.

వాడి పెళ్ళాన్ని, వాడు భుజం ఎక్కించుకున్నాడు తప్పేంటీ? అడిగేడో అభ్యుదయవాది.

మరో పెద్దాయన అప్పటిదాకా వింటున్నవాడు, యువకుడివి, కలిగినవాడివేననుకో,   ఖర్చుపెట్టగలవు   పెళ్ళాం కోరిక, ముద్దు తీర్చడానికి.  పెళ్ళాన్ని మల్లెపూవులా చూసుకున్నావు, ఆనందమే, కాని లోకముంది చూడూ! లోకులు పలుగాకులు,జాగ్రత్తా! అని ఉపదేశం చేసేడు. పతి మాటాడింది లేదు. 


ఆరోజు మహిళలంతా సభ తీర్చారు మధ్యాహ్నం. జాయకి తోటికోడలు వరసామె, మా మరిది తీర్థం తీసుకెళ్ళేట్ట నిన్ను,గూటిపడవ కట్టిచ్చేట్ట, అందులో పరుపులేయించేట్ట,మందీమార్బలం కూడా తీసుకెళ్ళేరట, గుళ్ళో ఉపవాసం ఉన్నవాళ్ళకి పళ్ళు పంచిపెట్టేరట,వేదసభలో సత్కారాలు చేసేరట... అని ఆగింది అర్ధోక్తిలో

ఇది విన్న మరొకామె కడుపు రవిలిపోయింది, తానందుకుని తీర్థంలో తిప్పేట్ట,కావలసినవి కొనిపెట్టేట్ట, కాళ్ళు లాగితే భుజాలెక్కించుకుని ఊరేగింపు చేసేట్ట, నిద్రకి ఆగలేకపోతే పడవలో పరుపుమీద పవళింపు సేవచేసేట్ట, కాళ్ళు పిసికేట్ట......, చెప్పలేదేమే అని కడిగేసింది.

ఎంత జరుగుబాటున్నా  విరగబాటు పనికిరదమ్మా! అని జనాంతికంగా అనేసి ఊరుకుందో నడికారు మహిళ.

ఏమోనే మేమూ మొగుళ్ళతో తీర్థానికెళ్ళేంగాని ఇంత విరగబాటు చూళ్ళేదమ్మా!పిదపకాలం, పిదప బుద్ధులూనూ, పెళ్ళామంటే ఎంత ప్రేమున్నా భుజాలమీదెక్కించుకుని తీర్థంలో ఊరేగింపు చేస్తారుటే, నీకు సిగ్గనిపించలేదే!! అనేసింది మరో నడికారు మహిళ.

అంతా విన్న ఒక వృద్ధు గొంతు సవరించింది, అంతా ఆగేరు.


  ఏమర్రా! దానిమొగుడితో అది తీర్థానికెళ్ళిందే! (మరెవరి మొగుడితో  వెళ్ళలేదని సూచిస్తూ) దాని మొగుడు దాని ముద్దు చెల్లించాడు.ఇక్కడున్న వాళ్ళలో ఎంతమందికి జరుగుబాటులేదే? ఉండడం కాదే కావలసింది, అనుభవించడం కూడా తెలియాలి. అదే చేసి చూపించాడు దానిమొగుడు.  దానిచేత పుణ్యకార్యం చేయించేడు, మీమొగుళ్ళు చేయించలేదని కుళ్ళు కాదుటే! దానికి తీర్థంలో కాళ్ళు లాగితే ఎత్తుకున్నాడు, దాని మొగుడు చంక అదెక్కింది!ఎప్పుడేనా మీ మొగుళ్ళు అలా చంకెక్కించుకున్నారుటే! తీర్థంలో తిరిగితే కాళ్ళు లాగుతాయని చెప్పేనా? విన్నవా? అనుభవించని తిట్టిపొయ్యలేదు, సాధించలేదు, నిబ్బరంగా పెళ్ళాన్ని భుజమెక్కించుకున్నాడు కదూ! వాడిపెళ్ళాన్ని వాడు భుజమెక్కించుకున్నాడుగాని, మరే రంకుపెళ్ళాన్నీ భుజమెక్కించుకోలేదే! వాడే మొగాడంటే, పెళ్ళాం బాధపడుతుంటే చోద్యం చూస్తూ కూచో లేదే, వాడేనే మగాడంటే. పెళ్ళామంటే నిజమైన ప్రేమున్నవాడే! దానికి నిద్దరొస్తే పడవలో పరుపులేయించి నిద్దరోమన్నాడు, ఎప్పుడో అది బంగారపు పువ్వులతో పూజచేసిందే, అందుకే దానికి అటువంటి మొగుడు దొరికేడే!

ఒసే! దానికి కాళ్ళు లాగితే పిసికేడనికదూ కుళ్ళు నీకూ! మీ మొగుళ్ళు పీక పిసకటమేగాని కాళ్ళు పిసకటం ఎరుగుదువే?వాడికి తిక్కేనే, ప్రేమఎక్కువైతే అనుభవించడమూ కష్టమేనేమో...తిక్కమొగుడితో తీర్థమెళితే తిప్పితిప్పి చంఫేడు కదూ! అని ముగించింది, మనకీ నానుడి మిగిలిపోయింది.

జాయ మాటాడింది లేదు. ఎవరిబతుకు వారు బతికినా లోకం ఊరుకోదు, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

Learn telugu through Hindi

Learn telugu through Hindi

This post is intended to those, who wish to learn, read and write telugu script and are well versed in fluent conversation in Telugu.

Any improvements suggested are welcome.

This post is particularly intended to my grand daughter (follower of my blog) (प्रत्यक्ष अभिमानि) who whish to learn telugu script and read for herself. Now she is hearing the posts through somebody who can read telugu script. The languages known (read and write) are Hindi and English hence trying to make her learn Telugu through Hindi.


Telugu alphabet

  (Vowels) అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః=16


(Consonants)

క ఖ గ ఘ జ్ఞ

చ ఛ జ ఝ ఞ 

ట ఠ డ ఢ ణ

త థ ద ధ న

ప ఫ  బ భ  మ

య ర ల వ శ ష స హ క్ష  ళ ఱ=36

(Adding vowels to consonants)

క కా కి కీ కు కూ కృ కౄ క్రు క్రూ కె కే కై కొ కో కౌ కం కః

(Doubling consonants)

క్క క్కా క్కి క్కీ క్కు క్కూ క్కృ క్కౄ క్కె క్కే క్కై క్కొ క్కో క్కౌ క్కం క్కః


Hindi alphabet

अ आ इ ई उ ऊ ऋ ॠ ए ऎ ऐ ओ ऒ औ अं अः=16

क ख ग घ ज्ञ

च छ ज झ ञ 

ट ठ ड ढ ण

त थ द ध न

प फ  ब भ  म

य र ल व श ष स ह क्ष  ऱ=36

(Adding vowvels to consonants)

क का कि की कु कू क्रु क्रू के कॆ कै को कॊ कोऊ कं कः 


(Doubling consonants)

क्क क्का क्कि क्की क्कु क्कू क्कृ क्कॄ क्के क्कॆ क्कै क्को क्कॊ क्कौ क्कं क्कः

Note:

1.Recognise letters in telugu script through the corresponding hindi script letter and pronounciation. Best way to remember is to write many times the same letter by pronouncing it. 

2. recognition of telugu letters is more important.

Wish you all the best in learning Telugu script

15.2.2023

''ळ ''अक्षर कॊ  भूल गया! इस्मॆ जॊडॊ 

Add letter ळ , forgotten  it is ళ in telugu .

IMPORTANT. Start laetters writing from left to right.

It takes one week for you to remember all letters of the Telugu alphabet. Your time starts now. Next lesson follows after your report of recognizing the letters. 

----------------------         

23.2.2023.

No report or reply from you. Really I am a fool, belived your words. 

13, ఫిబ్రవరి 2023, సోమవారం

పన్ను పైపన్ను!

 


Photo Courtesy: linlin Smith

పన్ను పై పన్ను!

ప్రకృతి వింతలెన్నో! చూసేకన్నూ, మనసూ ఉండాలి.

మానవులకి పళ్ళు పుట్టకతో ఉండవు. ఆరునెలమొదలు దశలవారీగా వస్తాయి. ఇవి పాలపళ్ళు.ఆరేళ్ళ మొదలు ఊడిపోయి వాటిస్థానంలో పళ్ళొస్తాయి. ఆ తరవాత పాతిక ముఫై వయసులో జ్ఞానదంతాలొస్తాయి. పళ్ళు దశలవారీగా ఊడిపోతాయి వయసుతో. ఎనభై దాటాకా మళ్ళీ పళ్ళొస్తాయంటారు, నిజమెంతో!


బోసినోటి పాప చిరునవ్వే అందం! అందులోనే ఉంది అమ్మ వైభవం!!


ఇలా పాలపళ్ళు ఊడిపోతున్న సమయంలో,ఊడిపోయినపంటి దగ్గర దురదతో గొలుక్కునేవాడిని నాలుకతో. ఇది చూసిన పెద్దలు, ఒరే అలా గొలుక్కోకు, కక్కిరాల అచ్చమ్మ పళ్ళలా ఎత్తుపళ్ళొస్తాయనేవారు. ఈ అచ్చమ్మ అనబడే ఆమె మా పక్కవీధిలో ఉండేది. అందరూ ఆమె ఎత్తుపళ్ళకి పరిహాసం చేసేవారు. మా వాళ్ళు ఇలా అటుండంతో, ఆమెను దీక్షగా గమనించా! ఆమెను చూసిన వెంఠనే అందవికారంగా ఉన్నటనిపించేది. నేను పరిశీలించి చూసి, ఆమె ఎత్తుపళ్ళు,ఆమె మొహంలో దరహాసాన్ని చూపిస్తున్నట్టు గమనించా! నాకేమీ తెలియని వయసుకూడా! కాని ఆమెకు చేతులు జోడించి నమస్కరించా! తల్లి ఆశ్చర్యపోయింది. అది మొదలు ఆమె కనపడితే నమస్కారం చేసేవాడిని. నేను ఆ తరవాత కాలంలో యాచన చేసి చదువుకున్నా! ఆ తల్లి నా నేటి స్థితికి కొంత కారణభూతురాలు కూడా!


ఆ తరవాత కాలంలో నా పెద్దకూతురికి పైపళ్ళలో పక్క పన్ను, పన్ను పై పన్నుండేది. అమ్మకి నా పెంచినతల్లిపేరే పెట్టుకున్నా! అన్నపూర్ణ. అన్నపూర్ణే సదాపూర్ణే!  నాకూతురు కూడా చిరునవ్వు నవ్వుతున్నట్టే ఉండేది.


చాలాకాలం తరవాత  మందస్మిత వదనారవిందయైన తల్లిని చూసా!!(పన్నుపైపన్ను ఉన్న అమ్మను చూసా)! ఇది, ప్రకృతి చిత్రం, అమ్మ వైభవం, అసంకల్పితంగానే చేతులు జోడించి నమస్కరించా!. పన్నుపైపన్నొస్తే అదృష్టం అంటారు,ఎందుకు?  వీరి మొహంలో ఎప్పుడూ చిరునవ్వు కనపడుతుంది.  పైపళ్ళలో పక్కపన్ను దొంతరపన్ను కావడంతో పైపెదవి కొంచెం పైకి లేస్తుంది. అది చిరుదరహాసానికి నాంది. ఆ పైపెదవి లేవడంతో కన్ను అరమూత పడుతుంది. అదీ పూర్తిగా దరహాసానికి పరాకాష్ట. ప్రతి స్త్రీలోనూ అమ్మవైభవం ఉంటుంది కాని వీరిలో అమ్మ వైభవం ప్రస్ఫుటంగా ఉంటుంది. అదికదా అదృష్టం! ఆపై ఈ తల్లి మాట మరింత అమ్మవైభవాన్ని తెలియజేస్తుంది. మాట మనుషుల్ని దగ్గర చేస్తుంది, మాటే మనుషుల్ని దూరం చేస్తుంది.  మరి అమ్మ వైభవం ప్రస్ఫుటంగా ఉన్న తల్లికి  చేతులెత్తి నమస్కారం!


''హత్తిన ప్రేమ జూపుటకు అమ్మయు, నాన్నయు నాకు కల్గగా

నెత్తఱి నెంచి చూచినను నెక్కువ నేనని గౌరి పల్క; ”నా

కత్తయు మామగారు కల”రంచును నవ్విన శూలి నేర్పుకున్ 

బిత్తరి చూపులన్ నిలిచి ”నేర్పరులే” యను గౌరి కొల్చెదన్


అల్పజీవి-అర్ధనారి. 

(శతకం నుండి, నా మిత్రులు)

రచన:- శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి


”నాకు అమ్మా నాన్నా ఉన్నరోచ్” ఎలా చూసినా నేనే గొప్ప, అన్నది అమ్మ గౌరి, దాని శంకరులు ”నాకు అత్తా, మామా ఉన్నారోచ్” అనగా అమ్మగౌరి ”నేర్పరులే” అని బిత్తరి చూపులతో నిలబడిన తల్లి గౌరి నన్ను రక్షించు గాక.


( స్వయంభువువు,పుట్టుక లేనివాడు, తల్లితండ్రులు లేనివాడు శంకరుడు, అందుకు నాకు అత్తా, మామా ఉన్నారని చమత్కరించాడు)


మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా! 

మందస్మిత ముఖారవిందయైన తల్లి లలితాదేవి నన్ను రక్షించుగాక!