Sunday, 19 February 2023

తిక్కమొగుడితో తీర్థమెళితే...

 


నందిపై ఈశ్వరుడు (కర్నాటక)


నమఃశంభవే చ మయోభవే చ 
నమఃశ్శంకరాయ చ మయస్కరాయ చ 
నమఃశ్శివాయ చ శివతరాయ చ


తిక్కమొగుడితో తీర్థమెళితే... 


తిక్కమొగుడితో తీర్థమెళితే తిప్పి/తిప్పి తిప్పి చంపేడంటారు.చాలా రకాల మొగుళ్ళ గురించి అనుకున్నాం. ఈ గొలుసులో  చివరగా  తిక్కమొగుడు...


తిక్కమొగుడెవరు? అదీ కొచ్చను..తనకి, తనపెళ్ళానికి బాగున్నది, మంచిది అనుకున్నదేదైనా, తన పెళ్ళానికి నచ్చినదేదైనా చేసేస్తాడు, ఎవరేమనుకున్నా, అన్నా లెక్కచేయడు, అదీ తిక్క. తిక్క దానికోలెక్కా అని ఆధునికులనుకునేదానికి మొదలిక్కడుంది.పెళ్ళామంటే లెక్కలేనంత ప్రేమ. ఒక  కత చెప్పుకుందాం.


అదో పల్లె, కొత్తగా పెళ్ళైన జంట.అప్పుడప్పుడే కొత్త వీడుతున్న కాలం, ఇద్దరూ మంచి ముమ్మరంమీదున్న కాలం. ఇద్దరూ చిలకా గోరింకల్లా కాలం గడుపుతున్న కాలం.ఒకరొనొకరు వదలి ఉండలేనికాలం. ఒక రోజు రాత్రి, మొగుడు గుండెలపై తలపెట్టుకుని పడుకున్న సమయంలో, జాయ నెమ్మదిగా అడిగిందిలా! ”శివరాత్రి వస్తోంది, ఉపవాసం ,  రుద్రాభిషేకం ,  పట్టిసీమ వీరభద్రస్వామి, భద్రకాళీ దేవిల మహోత్సవం, జాగరం, తీర్థం చూసొద్దామా?”  ”నువ్వేమో ఏడు మల్లెపూలెత్తు, మా అమ్మాయి కష్టపడలేదు సుమా! అని మీ నాన్న మరీ మరీ చెప్పేడు, నిన్ను అంపకాలెడుతూ!” "తీర్ధమంటే ఇసకతిప్పలో నడవాలి,ఉపవాసంతో, దగ్గరేం కాదు, కొండెక్కాలి, దిగాలి.ఏమో ఎన్నిసార్లో! నడవగలవా! నడక తప్ప మరో దారిలేదు" అన్నాడు. "ఆ( నడిచేస్తా" అంది ధీమాగా! సరే ఐతే ఏర్పాట్లు చేస్తాగాని, ”బండి కట్టనా? పడవమీదెళ్దామా?” అడిగాడు. ”నీటి మీద ప్రయాణం బాగుంటుంది కదూ” అనేసింది.

మర్నాడే గూటిపడవ పురమాయించేసేడు,  గూటిపడవలో కావలసినవన్నీ సద్దించేసేడు,అభిషేకానికి కావలసిన కొబ్బరికాయలు వగైరాసామాన్లు, అమ్మవారికిచ్చే బట్టలు,  విశ్రాంతికి పరుపుతో సహా!  వీరభద్రస్వామికి అభిషేకానికి పురోహితులకీ చెప్పేసేడు. పాలికాపుకి పురమాయించవలసినవి చెప్పేసి, తను పెళ్ళాంతో బయలుదేరేడు శివరాత్రి ఉదయమే!   

కను చీకటి   వేళ పురోహితులతో బయలుదేరి గోదారి రేవుచేరి పురోహితుల సంకల్ప మంత్రోచ్చారణతో సరిగంగ స్నానాలు చేసి, పురోహితులతో సహా,గూటి పడవెక్కేసేరు, మంది మార్బలంతో. చిరుచలిగాలిలో పడవ బయలుదేరిoది. పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి దూరంగా  ఇసకతిప్పదగ్గర దిగేరు ,సూర్యోదయమవుతుండగా! 


తీర్థంలో జనం పల్చగా ఉన్నారు. చెంగున దూకింది ఇసకతిప్పలోకి, జాయ. పతి అనుసరించాడు. హుషారుగా రెండు మైళ్ళ ఇసకతిప్ప నడచి కొండెక్కేసేరు.జనం,      ఒకటే జనం, స్వామి దర్శనానికి. పురోహితులు  మహన్యాసపూర్వక

 రుద్రాభిషేకం దంపతులతో చేయించేటప్పటికి పదకొండయింది.  భద్రకాళిని దర్శించి లలితాసహస్రంతో పురోహితులు పూజచేయిస్తే, అమ్మకి నూతనవస్త్రాలు సమర్పించి, పరివార దేవతలను,   క్షేత్రపాలకుడు రాములవారిని దర్శించేటప్పటికి ఒంటిగంట దాటింది. ఉపవాసమే కనక ఇబ్బంది లేదు, కాని ఫలహారానికి పళ్ళు తెస్తానని బయలుదేరాడు, పతి. నేనూ వస్తానంది, జాయ. ఇద్దరూ బయలుదేరారు తీర్థంలోకి, పళ్ళకోసం.  బుట్టలతో కమలాలు, ఆపిలు, ద్రాక్ష,ఖర్జూరం, ఇలా కనపడ్డ పళ్ళు కొనేసేడు.కొన్ని తను, కొన్ని మార్బలం తెస్తుంటే, నేనూ అని ఒక బుట్ట పట్టుకుంది జాయ. నేనూ తెస్తా కొన్ని అంది, వద్దనివారించాడు, వినక ఒక చిన్నబుట్ట చేతబట్టింది, కొండెక్కేరు.  ఫలహారానికి, పళ్ళు పురోహితులకు, తనపరివారానికి,  అక్కడ ఉపవాసం ఉన్నవారికి,జాయ చేత ఇప్పించాడు. చివరగా తామిద్దరూ కొన్ని తీసుకున్నారు.సమయం గడచిపోయింది, తెలియకనే!


గోధూళి సేవాదర్శనం చేసుకుని, కొండదిగి తీర్థంలోకొచ్చారు.

 రాత్రి, కరంటు దీపాలతో తీర్థం కళకళలాడుతోంది.  తీర్థం అంటే చిన్నదా?  దగ్గరగా ఇరవై చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది, ఇసకతిప్పలో. ఒకసారి తిప్పేడు, జాయ తీర్థంలో కొనుక్కోవలసినవి కొనుక్కుంది, వాటిని సేవకులు పడవలోకి చేర్చేరు.  మళ్ళీ రెండవసారి తీర్థంలో కి  వింతలు విశేషాలు చూస్తూ బయలుదేరారు. కొంత దూరం తరవాత జాయ నడక మందగించింది, ఉదయం నుంచి ఉపవాసం, ఇసక తిప్పలో నడక, కొండ ఎక్కి దిగడంతో.  ఏం? అడిగాడు పతి. కాళ్ళు లాగుతున్నాయంది జాయ. 

  ఒకపక్కగా కూచోబెట్టేడు కాసేపు,కాని ఉపయోగం ఉన్నట్టనిపించలా జాయకి, నడచేలా లేదు. ఏం చేయాలో తోచలేదు కొంతసేపు. ఇప్పుడు పతి, హనుమంతునిలా ఒక కాలు మడచి కూచుని జాయను భుజం మీద ఎక్కమన్నాడు.  జాయ ''అదేంపనీ? వద్దు వద్ద''ని సిగ్గుపడింది. పతి బలవంతం చేసి జాయను భుజం మీద ఎక్కించుకుని తీర్థంలో తిప్పేడు. చూసిన జనం గుసగుసలు పోయినవాళ్ళు, అదేం పని అడిగినవాళ్ళు, ఎంత పెళ్ళామంటే ప్రేమన్నా! ఇంతా? అని బుగ్గలు నొక్కుకున్నవాళ్ళు, అదీ మొగుడంటే!,  పెళ్ళాం కాళ్ళులాగితే భుజమెక్కించుకుని తీర్థం తిప్పేడు, అంటూ. ఇదొక వింతయిపోయిందారోజు తీర్థంలో జనానికి.


తొమ్మిది ప్రాంతంలో కొండపైకి చేరేరు, అక్కడ దించాడు జాయని, కిందకి.ఇప్పుడు వేద సభ ఉంటుంది చూద్దామని జాయని తీసుకుపోయి వేద సభలో, వేద పండితుల, వేద పఠనం విని, విశ్రాంతి సమయంలో జాయ చేత తాము తెచ్చినపళ్ళు దక్షిణ తాంబూలాలతో, తమతో వచ్చిన పురోహితులను,

 వేదపండితులను సత్కరింప చేసేడు. జాయ,పతి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. పన్నెండైంది, ఇప్పుడు లింగోద్భవకాల దర్శనం చేదామని జాయతో కలిసి దర్శనం  చేసారు.

 స్వామి ఊరేగింపు ఉత్సవం బయలుదేరింది తీర్థంలోకి. స్వామితో ఊరేగింపుతో బయలుదేరారు. నడక జాయకి కష్టం, దానికితోడు, జనంలో జాయకి ఏమీ కనపడకపోతుండటంతో మళ్ళీ భుజానికెత్తుకున్నాడు. ఉత్సవం తిప్పాడు, తీర్థంలో తిప్పాడు. ఉదయంనుంచి ఉపవాసం, నడక, శ్రమతో అలసిపోయిన జాయ ఇక భుజంమీద కూడా కూచోలేనంటే పడవలోకి చేర్చి, పరుపుపై పవళింపుసేవ చేసాడు.

పడవ బయలుదేరింది. మళ్ళీ సూర్యోదయానికి రేవులో దిగేరు. సరిగంగ స్నానాలు చేసి, ఇంటికి చేరేరు.ఇంతతో కత ఐపోతే నానుడే లేదు, అసలు కత ఇప్పుడే మొదలయిందా పల్లెలో.


రెండు రోజులు, బడలికతో ఇద్దరూ బయట కాలుపెట్టలేదు. తీర్థంలో జరిగినది, గుడిలో జరిగినది,వైనవైనాలుగా, అంచె టపాలమీద వార్తలు ఆ పల్లెకు జేరిపోయాయి. ఇప్పుడందరిదీ అదే విషయం మీద చర్చ.


మూడో రోజు రచ్చబండ దగ్గర ఒక పెద్దాయన పతిని చూసి పెళ్ళాన్ని తీసుకుని తీర్థమెళ్ళొచ్చావట కదూ? బాగా ఖర్చు పెట్టేవట! అని చర్చకి పునాది వేసేడు.

కలిగినవాడూ!, ఖర్చుపెట్టకపోతే ఎలా బాబాయ్! అన్నాడొక బక్కప్రాణి.

పెళ్ళాం ముద్దు చెల్లించేడు లెద్దూ! అనేసేడు మరో నీరసప్రాణి. 

అబ్బాయ్! పెళ్ళాం మీద ఎంత మోజున్నా,  ముద్దున్నా ఇలా తీర్థంలో ఊరేగింపు చెయ్యడం...... అని అర్ధోక్తిలో ఆగేడో నడివయసువాడు.

వాడి పెళ్ళాన్ని, వాడు భుజం ఎక్కించుకున్నాడు తప్పేంటీ? అడిగేడో అభ్యుదయవాది.

మరో పెద్దాయన అప్పటిదాకా వింటున్నవాడు, యువకుడివి, కలిగినవాడివేననుకో,   ఖర్చుపెట్టగలవు   పెళ్ళాం కోరిక, ముద్దు తీర్చడానికి.  పెళ్ళాన్ని మల్లెపూవులా చూసుకున్నావు, ఆనందమే, కాని లోకముంది చూడూ! లోకులు పలుగాకులు,జాగ్రత్తా! అని ఉపదేశం చేసేడు. పతి మాటాడింది లేదు. 


ఆరోజు మహిళలంతా సభ తీర్చారు మధ్యాహ్నం. జాయకి తోటికోడలు వరసామె, మా మరిది తీర్థం తీసుకెళ్ళేట్ట నిన్ను,గూటిపడవ కట్టిచ్చేట్ట, అందులో పరుపులేయించేట్ట,మందీమార్బలం కూడా తీసుకెళ్ళేరట, గుళ్ళో ఉపవాసం ఉన్నవాళ్ళకి పళ్ళు పంచిపెట్టేరట,వేదసభలో సత్కారాలు చేసేరట... అని ఆగింది అర్ధోక్తిలో

ఇది విన్న మరొకామె కడుపు రవిలిపోయింది, తానందుకుని తీర్థంలో తిప్పేట్ట,కావలసినవి కొనిపెట్టేట్ట, కాళ్ళు లాగితే భుజాలెక్కించుకుని ఊరేగింపు చేసేట్ట, నిద్రకి ఆగలేకపోతే పడవలో పరుపుమీద పవళింపు సేవచేసేట్ట, కాళ్ళు పిసికేట్ట......, చెప్పలేదేమే అని కడిగేసింది.

ఎంత జరుగుబాటున్నా  విరగబాటు పనికిరదమ్మా! అని జనాంతికంగా అనేసి ఊరుకుందో నడికారు మహిళ.

ఏమోనే మేమూ మొగుళ్ళతో తీర్థానికెళ్ళేంగాని ఇంత విరగబాటు చూళ్ళేదమ్మా!పిదపకాలం, పిదప బుద్ధులూనూ, పెళ్ళామంటే ఎంత ప్రేమున్నా భుజాలమీదెక్కించుకుని తీర్థంలో ఊరేగింపు చేస్తారుటే, నీకు సిగ్గనిపించలేదే!! అనేసింది మరో నడికారు మహిళ.

అంతా విన్న ఒక వృద్ధు గొంతు సవరించింది, అంతా ఆగేరు.


  ఏమర్రా! దానిమొగుడితో అది తీర్థానికెళ్ళిందే! (మరెవరి మొగుడితో  వెళ్ళలేదని సూచిస్తూ) దాని మొగుడు దాని ముద్దు చెల్లించాడు.ఇక్కడున్న వాళ్ళలో ఎంతమందికి జరుగుబాటులేదే? ఉండడం కాదే కావలసింది, అనుభవించడం కూడా తెలియాలి. అదే చేసి చూపించాడు దానిమొగుడు.  దానిచేత పుణ్యకార్యం చేయించేడు, మీమొగుళ్ళు చేయించలేదని కుళ్ళు కాదుటే! దానికి తీర్థంలో కాళ్ళు లాగితే ఎత్తుకున్నాడు, దాని మొగుడు చంక అదెక్కింది!ఎప్పుడేనా మీ మొగుళ్ళు అలా చంకెక్కించుకున్నారుటే! తీర్థంలో తిరిగితే కాళ్ళు లాగుతాయని చెప్పేనా? విన్నవా? అనుభవించని తిట్టిపొయ్యలేదు, సాధించలేదు, నిబ్బరంగా పెళ్ళాన్ని భుజమెక్కించుకున్నాడు కదూ! వాడిపెళ్ళాన్ని వాడు భుజమెక్కించుకున్నాడుగాని, మరే రంకుపెళ్ళాన్నీ భుజమెక్కించుకోలేదే! వాడే మొగాడంటే, పెళ్ళాం బాధపడుతుంటే చోద్యం చూస్తూ కూచో లేదే, వాడేనే మగాడంటే. పెళ్ళామంటే నిజమైన ప్రేమున్నవాడే! దానికి నిద్దరొస్తే పడవలో పరుపులేయించి నిద్దరోమన్నాడు, ఎప్పుడో అది బంగారపు పువ్వులతో పూజచేసిందే, అందుకే దానికి అటువంటి మొగుడు దొరికేడే!

ఒసే! దానికి కాళ్ళు లాగితే పిసికేడనికదూ కుళ్ళు నీకూ! మీ మొగుళ్ళు పీక పిసకటమేగాని కాళ్ళు పిసకటం ఎరుగుదువే?వాడికి తిక్కేనే, ప్రేమఎక్కువైతే అనుభవించడమూ కష్టమేనేమో...తిక్కమొగుడితో తీర్థమెళితే తిప్పితిప్పి చంఫేడు కదూ! అని ముగించింది, మనకీ నానుడి మిగిలిపోయింది.

జాయ మాటాడింది లేదు. ఎవరిబతుకు వారు బతికినా లోకం ఊరుకోదు, ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.

24 comments:

  1. ఈ కథని దాచిపెట్టి చివరకు మహా శివరాత్రి నాడు మాచేత పఠింప జేసారా, శర్మ గారు? సందర్భోచితంగా ఉంటుందనా?

    తన భార్య కోరిన కోరిక తీర్చాడు - అది కూడా మహా ఘనంగా. అందుకని అతన్ని తిక్క మొగుడు అనేస్తారాండీ?

    // “ అదీ మొగుడంటే!, పెళ్ళాం కాళ్ళులాగితే భుజమెక్కించుకుని తీర్థం తిప్పేడు, ” //
    ఇది చూసి తీర్థంలో ఎంత మంది ఆడంగులు తమ తమ మొగుళ్ళని మోచేత్తో డొక్కలో పొడిచారో కదా.

    సామెత సంగతి ఎలా ఉన్నా సామెత వెనకాల కథ అత్యంత రమణీయంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు18 February 2023 at 15:55

      కథని దాచలేదండి. కథ వెనక కథ చెప్పాల్సిందే :)
      టపారాయక తప్పేలా లేదు సారు :)
      కథ బాగుందన్నందుకు
      ధన్యవాదాలు

      Delete
  2. తిక్కమొగుడుతో anakoodadandi తిక్కమొగుడితో anaalamDi.

    ReplyDelete
    Replies
    1. Anonymous18 February 2023 at 20:55
      తిక్కమొగుడు కదండీ :) అందుకలా అయ్యాడనమాట (సరదాకే సుమా!)
      సరిజేస్తున్నాను.
      ధన్యవాదాలు.

      Delete
    2. కత చదివి ఆనందించకుండా ఇలా ప్రింటర్స్ డెవిల్ పై పడి యేడ్చేవాల్లకోసం మీరెందుకండీ ఇంతగా హైరానా శర్మగారూ ?

      Delete
    3. Anonymous19 February 2023 at 12:32
      భాషాభిమానమే సార్!

      Delete
  3. పెళ్ళాముతో సరదాగా తిరగటాన్ని తిక్క అంటారా శర్మగారూ

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju19 February 2023 at 09:14
      కాదు సార్! కానేకాదు

      Delete
  4. ఒకానొక అజ్ఞాత గారు అపోహపడినట్లుగా ఇక్కడ ఉన్నది ముద్రారాక్షసం కాదండి. మరింత సున్నితమైన సమస్య. శర్మగారు గ్రహించినట్లుగా తెలుగు భాషను వినియోగించటంలో ఇటివలి కాలంలో బాగా ప్రచురంగా కనిపిస్తున్న సమస్య.

    ఉపవిభక్తులు అని ఉన్నాయి. అవి 'ఇ,టి,తి' అనే మూడు. 'రాముడు చెయ్యి' అనం - 'రాముడి చెయ్యి' అంటాం.' ఇల్లు మీద' అనం - 'ఇంటి మీద' అంటాం. 'నుయ్యి గట్టు' అనం 'నూతి గట్టు' అంటాం. ఐతే ఇంత సహజమైన ఉపవిభక్తుల ప్రయోగాన్ని ఈకాలంవాళ్ళు మరచిపోవటం ఎక్కువైనది. మొదటి అజ్ఞాత గారు సూచించినట్లుగా 'మొగుడుతో' బదులు 'మొగుడితో' అనటం ఉచితం. ఎవరన్నా 'ఇంటికి వెళ్తారు' కాని 'ఇల్లుకి వెళ్ళరు' కదా?

    తెలుగుభాషను తెలుగువారే సరిగా వాడకపోవటం ఎక్కువయ్యే సరికి అపప్రయోగాలే కుప్పలుతెప్పలుగా మనకు కళ్ళయెదుట మీడియా నిండా కనిపిస్తున్నాయి. వాటి వరదలో పడి అప్పుడప్పుడు మనలో తెలిసిన వారు కూడా పొరబడే ప్రమాదం సంభవిస్తూ ఉంది. ఇలా కాలం గడిచేకొద్దీ అపప్రయోగాలే రూఢియైపోయి క్రమంగా తెలుగుభాష తెలుగుదనం కోల్పోయే ప్రమాదం మెండు. ఇప్పుడు దొరతనాలు కూడా బళ్ళల్లో తెలుగు నేర్పకుండ చర్యలు తీసుకుంటూన్నారు - ఎందుకంటే తెలుగులో చదివితే ఉద్యోగాలు రావట. వింతవాదనా వాళ్ళూనూ. ముందు మనం తెలుగువాళ్ళం కాకుండా పోతున్నాం అన్న స్పృహ ఉండటం‌లేదు.

    పానుగంటి వారి జంఘాలశాస్త్రి కావుకావు మనలేని కాకి ఉండునా అని ఝాడించాడు కాని తెలుగు ఒక్క ముక్క కూడా రాని తెలుగుబిడ్దలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగ ఇబ్బడిముబ్బడి అవుతున్నారు. ఇంక దేవుడే‌ రక్షించాలి మన తెలుగును!

    ReplyDelete
    Replies
    1. మీకు పనీపాటా ఏమీ లేదా ?

      Delete

    2. శ్యామలీయం20 February 2023 at 22:53
      ఈ కత రాయడానికి పదిహేనురోజులు పట్టిందండి. అంత గుంజుకున్నా! తప్పులు రాయననికాదు. అసందర్భం కాదుగాని ఒక చిన్న సంఘటన, బడిలో చదువుకునేటప్పుడు. జ్వరమొచ్చిందని లీవ్ లెటర్ రాసాను, రెండురోజులకి. క్లాస్ ఇన్ చార్జి సోషల్ మేస్టారు, లీవ్ మంజూరు చేస్తూ లెటర్ ఇంగ్లీష్ మాస్టారికి పంపినట్టున్నారు, మూడో రోజు బళ్ళో కెళితే ఇంగ్లీష్ మాస్టారు లీవ్ లెటర్ పట్టుకొచ్చి చదివి వినిపించి ఒక్కటుచ్చుకున్నారు. చేసిన తప్పు suffering with fever అని రాసానండి.పొరబాటు మన్నించండి.మరి తప్పు చెయ్యనుగా!

      Delete
    3. Anonymous21 February 2023 at 05:25
      బలే కనిపెట్టేసేరండీ! పనీ పాటూ లేదని తిడుతున్నారండి అందరూ నన్ను. ఏ దేశమైనా వచ్చేస్తానండి. సింగపూర్, మలేసియా, వగైరా, అమెరికా, కెనడా రానండి :)

      Delete
    4. Samghatana లో ఘ గూటం పోయిందేమిటో ?

      Delete
    5. Anonymous22 February 2023 at 05:02
      సంఘటన లో గూటం ఎటూ పోలేదండీ! అక్కడే ఉంది, మీకు కనబడలేదేమో! మరో సారి చూస్తారా?

      Delete
  5. మీరు ఏమి వ్రాసిన నాకు నచ్చుతుంది. పైకథ వ్రాయటానికి పదిహేను రోజులు పట్టిందని చదివి ఆశ్చర్యపోయాను. కానీ ఎంత రక్తి కట్టే కథ అల్లెరో? ప్రతిమగాడు పెళ్ళానికి అల్లాంటి దన్నుఁక్రిందే ఉందామని అనుకొంటాడు కానీ వాస్తవంలో అది సాధ్యమవ్వదు. మీకథ ఈమధ్యన ప్రచారంలోకి వచ్చిన గొప్ప #పాన్ ఇండియా# సినిమాల కథల కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనది, బలమైనది.

    ReplyDelete
    Replies
    1. కరెక్టుగా చెప్పారండి.

      వీరే గనక సినిమా ఫీల్డ్ కి సమయంలో వచ్చి వుంటే మనకు ఎన్నో మంచి సినిమాలు, కథా వచ్చి వుండేవి.

      ఎందుకో వీరు ఆ మార్గాన్ని ఎన్నుకోలేదు?

      Delete
    2. Anonymous25 February 2023 at 05:35
      నిజమాండి :)
      అప్పటికే ఇద్దరు మిత్రులు సినీ ఫీల్డ్ లో ఉన్నారు. నేను కూడా వచ్చేసుంటే (గోల+గోల)గగ్గోల నా గగ్గోలు అయిపోతుందేమోనని మానేసానండి. :)

      Delete
    3. రాముడు గారు,
      మీది అభిమానం, నేనూ సామాన్యుడినే సుమా! ఇదంతా కాలక్షేపమే! దీనికి అనూచాన కథ లేదు, సామెత తప్పించి. కత అల్లక తప్పలేదు, దానికోసం కొంత ఇబ్బంది పడ్డా.
      మీఅభిమానానికి మరో సారి
      ధన్యవాదాలు

      Delete
    4. నిజమేనండి.

      ఎంత ఎదిగినా ఒదిగే వుండాలి అన్నది మీ లాంటి మహనీయుల దగ్గిరే నేర్చుకోవాలండి. ఎంత వినయం!

      Delete
    5. అవునండి ఎంత వినయం! ఎంత వినయం!

      Delete

    6. Anonymous25 February 2023 at 22:16
      వందనం

      Delete
    7. Anonymous25 February 2023 at 12:48
      //ఎంత ఎదిగినా ఒదిగే వుండాలి అన్నది మీ లాంటి మహనీయుల దగ్గిరే నేర్చుకోవాలండి. ఎంత వినయం!//

      ఎంత ఎదిగినా ఒదిగే వుండాలి అన్నది తమలాంటి మహనీయుల దగ్గర నేర్చుకున్నదేనండి, వినయం కూడా!
      నమస్కారం

      Delete
  6. శర్మ గారు,
    // “ అప్పటికే ఇద్దరు మిత్రులు సినీ ఫీల్డ్ లో ఉన్నారు.” //

    మద్రాసు రైలెక్కే ఆలోచన చెయ్యలేదు అనండి …. నాలాగా 😔.

    అవునూ, ఇద్దరెవరు? ఒకరు “సిరివెన్నెల” గారు. రెండోవారు???

    ReplyDelete
    Replies

    1. ఏంటోగాని నాకు సినీఫీల్డ్ అంటే అంత నచ్చుబాటు కాదు. మద్రాసు బండి ఎక్కించడం ఆలోచనేగాని ఎక్కే ఆలోచన ఎప్పుడూ చేయలేదండి. చదువా సంధ్యా! మద్రస్ బండెక్కితే పాండీ బజార్ లో అడుక్కోడానికి కూడా పనికి రానని తెలుసు. :) మీకేం కడుపునిండా చదువుకుని బండెక్కేరు :)
      ఒకరు ఆకెళ్ళకథ,మాటల రచయిత, రెండు సిరివెన్నెల మీకు తెలిసినదే!వాళ్ళిద్దరు సినీ ఫీల్డ్ లో ప్రఖ్యాతి గడిస్తున్నందుకు నాడు, కుళ్ళుకుని ఏడ్చినవాళ్ళెందరో!

      Delete