రాముని రాజ్యం-భరతుని పట్టం-2
జయత్యతిబలోరామో
లక్ష్మణస్య మహాబలః
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభిపాలితః
(జయ మంత్రం) హనుమ.
https://kasthephali.blogspot.com/2023/03/1.html
దశరథుని పార్ధివదేహానికి అగ్ని సంస్కారం చేసిన తరవాత,రాముని తల్లి కౌసల్యను దర్శించాడు,భరతుడు. తల్లీ! జరిగినదానిలోగాని, నా తల్లి కోరిన కోరికలలో గాని నా ప్రమేయం లేశమాత్రమున్నూ లేదు. ఏమాత్రం ప్రమేయమున్నా అనేక ఘోరమైన పాపాలు చేసినవాణ్ణి అవుతాను, అని ఒట్లు పెట్టుకున్నాడు. మనం అందరం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామనీ చెప్పాడు. ఆ తరవాత లక్ష్మణుని తల్లి సుమిత్రకు కూడా ఇలాగే చెప్పాడు. అందరం వెళ్ళి రాముని వెనక్కి తీసుకొద్దామని చెప్పేడు. ఆపై సభచేసి మంత్రి,పురోహిత, పౌర, జానపదులుండగా, ఈ రాజ్యం రామునిది, రాముడే పరిపాలనార్హుడు. నా తల్లి కోరినవరాలలో నా ప్రమేయం లేదు, అని ప్రకటించి, మనం వెళ్ళి రాముని వెనక్కు తీసుకొద్దామని చెప్పేడు.
ఆ తరవాత అనుకున్నట్టు అందరూ అనగా, రాణివాసం, సైన్యం,మంత్రులు,పౌరులు,జానపదులు కదలిరాగా రాముని కోసం అడవులకు బయలుదేరారు. పట్టపుటేనుగు సిద్ధంగా ఉన్నా భరతుడు గుఱ్ఱం ఎక్కేడు. పట్టపుటేనుగు హౌదా ఖాళీగా ఉండగా బయలుదేరింది.
***
ఆలోచన
ఇంట గెలిచి రచ్చగెలవాలి, ఇదొక నానుడి, తెనుగునాట. ఇది రామాయణం లో భరతుడు చేసినదానిని బట్టే ,ఈ నానుడి పుట్టిందని నా నమ్మిక. తాను రాజ్యం రామునిదే అని నమ్మేడు, అదే చెప్పేడు, ఆచరణలో చూపాడు. అది అమలుకు, ముందు ఇంటిలో వారిని ఒప్పించగలగాలి, జరిగినదానిలో తనప్రమేయం లేదని.. అందుకు ముందుగా రాముని తల్లి కౌసల్యను కలిసాడు,ఎన్ని ఒట్లు పెట్టుకున్నాడో, నేనైతే ఒట్లు పెట్టుకున్నాడని తేల్చేసేను. ఆనాటికి ఘోరపాపాలేవైతే ఉన్నాయో అవన్నీ తాను చేసినవాడినౌతానని చెప్పేడు. చివరికి మనం వెళ్ళి రాముని తీసుకొద్దామని చెప్పి పెదతల్లికి నమ్మకం కలగజేసేడు. రామునికి బహిఃప్రాణం లక్ష్మణుడు, అలాగే తన బహిఃప్రాణం శత్రుఘ్నుడు, లక్ష్మణ, శత్రుఘ్నులు కవలపిల్లలు, సుమిత్ర కొడుకులు. అటువంటి సుమిత్ర దగ్గర ఏడ్చేడు, తనగోడు వినిపించేడు, కౌసల్య దగ్గర పెట్టుకున్నన్ని ఒట్లూ పెట్టుకున్నాడు, మనం రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నాం, అనీ చెప్పేడు. నిజానికి ఇంత చెప్పక్కరలేదు, ఈ పెదతల్లికి, కాని చెప్పేడు. తన బహిఃప్రాణమైన తమ్ముడు, శత్రుఘ్నునికి తనేమిటో తెలుసు, తన తమ్ముని ద్వారా సుమిత్రకీ తెలిసి ఉండే సావకాశాలే మెండు. కాని అలాగని ఉపేక్ష చేయలేదు.కౌసల్య దగ్గర చెప్పినదంతా ఇక్కడా చెప్పేడు, పెదతల్లికి నమ్మకం కలగజేసేడు. ఆపై పౌరులు,జానపదులకూ తెలిసేందుకుగాను సభచేసి ప్రకటించాడు. తాను చెప్పడమే కాదు, అది నిజమనిపించేందుకుగాను, పట్టపుటేనుగు బయలుదేరినా దానిని ఖాళీగానే ఉంచి, తాను గుఱ్ఱం మీద మాత్రమే బయలుదేరాడు. ఎందుకిలా చేసాడు? రాజుమాత్రమే పట్టపుటేనుగు ఎక్కేందుకు అర్హుడు, తాను రాజుకాదని ప్రజలకి తెలియజేసేందుకే అలా చేసేడు. మరి పట్టపుటేనుగెందుకు ఖాళీగా? తిరిగి వచ్చేటపుడు రాముని కోసం. సైన్యమెందుకు? రాణివాసానికి రక్షణ. అంతేకాదు రాజు ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు, సైన్యం కూడా ఉండాలి. తిరిగొచ్చేటపుడు రాముడు రాజు గనక సైన్యం కూడా ఉండాలి. ఇక మంత్రులు ఎందుకు? మంత్రులందరూ బుద్ధి కుశలురై ఉంటారు, అనుకోని అవాంతరాలలో ఆలోచనకి అవసరపడతారు. ఇక పౌరులు,జానపదులు ఎందుకు? పౌరులు,జానపదులూ నీ తిరిగిరాక కోరుతున్నారని రామునికి తెలియజేసేందుకు, ముఖ్యులు కూడా ఉండేందుకు. ఇన్ని ముందు జాగరతలూ తీసుకున్నాడు, భరతుడు, రాముని తిరిగి రమ్మని చెప్పడానికి. అంతేకాదు తన ప్రయత్నలోపం ఉండకూడదనీ, తన ఆంతర్యం అందరికీ తెలియాలనీ ఇన్ని పనులు చేసేడు. భరతుడు బుద్ధిశాలి.
ఇలా ఇంట నమ్మకం కలగజేసి,వారి మనసులు గెలిచాడు, ఇదే ఇంట గెలవడం. ఇక రచ్చ ఎలాగెలిచాడో తదుపరి చూదాం.
తరువాయి...
మీరు భలే రాస్తారండి. కల్పనా శక్తి , ఒకటికి పది జోడించి అవును సుమా ఇదే కదా జరిగుండాలి అని ఆలోచింప చేసేట్టు చేస్తారు.
ReplyDelete
DeleteAnonymous2 April 2023 at 10:19
సంఘటనలన్నీ రామాయణంలో ఉన్నవే!
అదే అవగాహన. ఆ సంఘటన అలా ఎందుకు జరిగింది అన్నదే ఆలోచన. రామాయణం ముందు వెనుకలు సమన్వయం చేసుకుంటూ చదివితే మనకే మంచి ఆలోచనలు పుడతాయి. ప్రయత్నించండి.
శ్రీమద్రామాయణం అయోధ్యాకాండ 83వ సర్గలోని 6వ శ్లోకం ప్రకారం రాముణ్ణి వెనుకకు తేవటానికి బయలుదేరిన భరతుడి వెంట ముగ్గురు తల్లులూ సంతోషంగా వెళ్ళారండి.
ReplyDeleteశ్యామలీయం2 April 2023 at 21:10
ReplyDeleteఅవునండి. వివరంగా చెప్పలేదు. రాణివాసమని తేల్చేసాను.వీరి ముగ్గురు ప్రస్తావన గుహుని దగ్గర, ఆ తరవాతా కనపడుతుంది.